
ప్రస్రవణగిరి కొండగుహదగ్గర రాముడు ఋతుపవనమేఘాల్నీ, తొలివానల్నీ చూస్తూ పరస్పర విరుద్ధాలైన సంవేదనలకు లోనవుతూ ఇంకా ఇలా అంటున్నాడు:
ఏష ఫుల్లార్జునః శైలః కేతకైరధివాసితః
సుగ్రీవ ఇవ శాంతారిః ధారాభిరభిషిచ్యతే ( 28-9)
(బాగా విరగబూసిన మద్దిపూలతోటీ, మొగలిపొదలతోటీ కూడుకుని ఉన్న ఈ కొండ శత్రువుసమసిపోయినప్పటి సుగ్రీవుడిలాగా జలధారలతో అభిషిక్తమవుతున్నది)
ఆ వెంటనే మళ్ళా మరొక సంవేదన
కశాభిరివ హైమీభిః విద్యుద్భిరివ తాడితః
అంతస్తనిత నిర్ఘోషం సవేదనమివాంబరం (28-11)
(ఆకాశాన్ని ఎవరో మెరుపులనే బంగారు కొరడాలతో కొడుతున్నట్టుగా ఉంది. తనలోపలి బాధని వెళ్ళగక్కుతున్నదా అన్నట్టు మేఘగర్జనలు వినిపిస్తున్నాయి)
నీలమేఘాశ్రితా విద్యుత్ స్ఫురంతీ ప్రతిభాతి మే
స్ఫురంతీ రావణస్యాంకే వైదేహీన తపస్వినీ (28-12)
(కారుమబ్బుల్ని ఆశ్రయించి ఉన్న మెరుపు రావణుడి చెరలో శోకిస్తున్న సీతాదేవిలాగా ఉంది)
ఇవన్నీ తొలివానలప్పటి సంవేదనలు. పదిహేనో శ్లోకంతో నడివానలు మొదలయిన దృశ్యం కనిపిస్తుంది.
రజః ప్రశాంతం సహిమోద్య వాయుః
నిదాఘదోషప్రసరాః ప్రశాంతాః
స్థితా హి యాత్రా వసుదాధిపానాం
ప్రవాసినో యాంతి నరాః స్వదేశాన్ (28-15)
(వర్షాలు బాగా కురుస్తోండటంతో దుమ్ము అణగిపోయింది. చల్లని గాలులు వీస్తున్నాయి. వేసవి తాపం తగ్గిపోయింది. రాజుల జైత్రయాత్రలు ఆగిపోయాయి. దూరప్రదేశాలకు వెళ్ళినవాళ్ళు తమ స్వదేశాలకు తిరిగి వస్తున్నారు)
15 నుంచి 54 దాకా దాదాపు నలభై శ్లోకాలు గాఢవర్షాకాల వర్ణన. కవి వానని, వానల్లో తడిసే అడవుల్ని, కొండల్ని, ఆకాశాన్ని, అనేక దిక్కుల్లో, అనేక విధాలుగా చూసాడు, అంతే సాంద్రంగా మనకు చూపిస్తాడు.
అటువంటి వర్ణన మామూలు కవిత్వాల్లో కనిపించేది కాదు. అక్కడ నువ్వు వానని మాత్రమే చూడవు. సమస్త ప్రపంచాన్నీ చూస్తావు. ఒక ఐతిహాసిక కవి మాత్రమే అటువంటి చిత్రణ చెయ్యగలుగుతాడు. ఆ వర్ణనకి వచ్చేటప్పటికి రాముడు తన శోకాన్ని పూర్తిగా మర్చిపోయినట్టు కనిపిస్తుంది. ఆ వర్షధారల్లో ఆయన శోకధారలు కరిగిపోయాయి. అపారమైన ప్రాకృతిక సౌందర్యాన్ని కళ్ళారా చూస్తో పరవశించిపోతున్న ‘గిరివన ప్రియుడైన’ మానవుడు మాత్రమే అటువంటి వర్ణన చెయ్యగలుగుతాడు. ఉదాహరణకి ఈ శ్లోకం చూడండి:
వర్షోదకాప్యాయిత శాద్వలాని
ప్రవృత్త నృత్తోత్సవ బర్హిణాని
వనాని నిర్వృష్ట వలాహకాని
పశ్యాపరాహ్ణేష్వధికం విభాంతి
(బాగా కురిసిన వర్షాలకి పచ్చిక బాగా పెరిగింది. నెమళ్ళగుంపులు నృత్యోత్సవాలు మొదలుపెట్టాయి. వానల్లో పూర్తిగా తడిసిపోయిన అడవులు అపరాహ్ణవేళల్లో మరింత బాగా ప్రకాశిస్తున్నాయి.)
ఈ శ్లోకం మొదటిసారి చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. జీవితకాలం అడవుల్లో బతికినవాడికి మాత్రమే తోచగల అనుభూతి ఇది. వాన పడే మధ్యాహ్నాల్లో అడవుల అందాన్ని చూసి మనతో పంచుకున్న కవి నాకిప్పటిదాకా ప్రపంచ కవిత్వంలో మరొకరు కనబడలేదు. ఒక జూలై మధ్యాహ్నం అడ్డతీగల్లో అడవుల్లో వానపడుతున్నప్పుడు, ఈ శ్లోకమే నాకు పదే పదే గుర్తొస్తూ ఉండింది.
కవి వర్షాన్నీ, అడవినీ వర్ణిస్తున్నప్పుడు శబ్దాలంకారాల్నీ, అర్థాలంకారాల్నీ ప్రయోగించినప్పటికీ, ఆ సౌందర్యం భాషకి అతీతమైన సౌందర్యం. ఒక లాండ్ స్కేప్ ని చిత్రిస్తున్నప్పుడు చిత్రకారుడు ఆ రంగుల్లో తన హృదయాన్ని ప్రతిఫలింపచేసినట్టుగా, స్వభావోక్తిలాగా అనిపించే మామూలు చిత్రణలో, మాటలకందని నిశ్శబ్దాన్ని కవి ఈ వర్ణన పొడుగుతా పొదిగాడు. ఈ శ్లోకాలు చూడండి:
క్వచిత్ ప్రకాశం, క్వచిదప్రకాశం
నభః ప్రకీర్ణాంబుధరం విభాతి
క్వచిత్ క్వచిత్ పర్వతసన్నిరుద్ధం
రూపం యథా శాంతమహార్ణవస్య (28-17)
(మేఘాలు వెదజల్లబడ్డ ఆకాశం ఒకచోట ప్రకాశవంతంగానూ, ఒకచోట మబ్బుపట్టినట్టుగానూ ఉండి, పర్వతాలు అడ్డగిస్తున్న శాంతమహాసముద్రంలాగా ఉంది)
వానపడేటప్పటి ఆకాశంలో ఒక్కొక్కచోట తట్టుకోలేనంత వెలుగు, ఒక్కొక్కచోట వెలుగులేని నీడ ఆవరించి, పర్వతాల్లాంటి మేఘాలనీడలు పడ్డ సముద్రంలాగా ఆకాశం ఉందనే ఈ వర్ణన చేయితిరిగిన నీటిరంగుల చిత్రకారుడు మాత్రమే చూడగలిగింది.
వట్టి స్వభావోక్తిని కవిత్వంగా మార్చడం ఆదికవికి వెన్నతో పెట్టిన విద్య. ఈ శ్లోకం చూడండి:
రసాకులం షట్పదసన్నికాశం
ప్రభుజ్యతే జంబుఫలం ప్రకామం
అనేకవర్ణం పవనావధూతం
భూమౌ పతత్యామ్రఫలం విపక్వం (28-19)
(ఈ వర్షాకాలంలో బాగా రసాలూరుతూ తుమ్మెదల్లాగా నల్లగా మెరుస్తున్న నేరేడుపండ్లనీ, అనేకరంగుల్తో, బాగా మిగలముగ్గి, గాలికి నేలరాలుతున్న మామిడిపండ్లని సంతోషంగా ఆరగిస్తున్నారు)
వానాకాలంలో మా ఊళ్ళో ఎక్కడచూసినా మిగలముగ్గి రాలిపొయ్యే కొండమామిడిపండ్లు, విరగపండిన నేరేడు చెట్లు నా కళ్లముందు కనిపిస్తున్నాయి. ఏముంది ఈ కవితలో? ఒక్క ఉపమాలంకారం మాత్రమే ఉంది. కాని ఈ మొత్తం శ్లోకం నా కళ్ళముందు చిత్రించే రసమయదృశ్యం నిజంగా ‘రసాకులం’. ఒక్క ప్రాచీన చీనా కవులు మాత్రమే లాండ్ స్కేప్ ని ఇంత రసభరితంగా చిత్రించగలరు.
ఆ తర్వాతి శ్లోకం అత్యంత సమ్మోహనశీల శ్లోకం. చూడండి:
సముద్వహంతః సలిలాతిభారం
బలాకినో వారిధరా నదంతః
మహత్సు శృంగేషు మహీధరేషు
విశ్రమ్య విశ్రమ్య పునఃప్రయాంతి (28-22)
(చాలా నీళ్ళు నింపుకున్న భారంతోనూ, తమని అలంకరించిన కొంగల్తోనూ మేఘాలు నినదిస్తూ పర్వత మహాశిఖరాల మీద ఆగి ఆగి మళ్ళా ప్రయాణిస్తున్నాయి)
ఎంత మామూలు వాక్యం! కాని ఎంత మహనీయమైన వాక్యం! ఆ ‘విశ్రమ్య విశ్రమ్య పునఃప్రయాంతి’ అన్న మాటలో ఉంది ఆ రసానందమంతా! నలభయ్యేళ్ళ కిందట రాజమండ్రిలో, గోదావరి ఒడ్డున సదనంలో మా మాష్టారి దగ్గరకి వెళ్ళాం నేనూ, నా మిత్రుడు గోపీచందూ, మేఘదూతం కావ్యం చెప్పించుకోడానికి. మాకు పాఠం మొదలుపెట్టిన మొదటిరోజే మాష్టారు, ఈ శ్లోకమే మేఘసందేశానికి స్ఫూర్తి అని చెప్తూ, చాలాసేపు ‘విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి’ అని ఆ నాలుగు పదాలూ పదే పదే జపిస్తో ఉండిపోయారు. అక్కడితో మా మేఘసందేశం పాఠం ఆగిపోయింది. కాని ఆయన్ని ఆ పునః ప్రయాణం అనే మాట వదల్లేదని ఆయన పద్యాలు చదివినప్పుడు నాకు అర్థమయింది. ఒక పద్యంలో ఆయనిలా అన్నారు:
ఆ సుధాసింధు శిశిరగర్భాంతరమున
కెన్నడో నా పునర్యానమెరుకపడదు
ఆ పునర్యానం అనే మాట నన్ను వదలకుండా వెంటాడింది, చివరికి ఆ పేరుమీద నేనొక దీర్ఘవచన కావ్యం రాసేదాకా. ఆ కావ్యావిష్కరణకి మాష్టారినే పిలిచేను. ఆయన ఆ పుస్తకాన్ని ఆప్యాయంగా తడుముతో, ‘కవిత్వపదప్రయోగాలకి ఈ విధంగా multiply అయ్యే లక్షణముంటుంది’ అని అన్నారు. లేకపోతే ఎక్కడి వాల్మీకి? ఎక్కడి కాళిదాసు? ఎప్పటి శరభయ్య! ఎక్కడి నా పునర్యానం!
సాధారణంగా ఒక కవి ప్రతిభని మనం రూపకాలంకారాల్ని బట్టే గుర్తుపడుతుంటాం. కాని ఆ రూపకాలంకారాల్లో నవ్యత ఉండాలి. దాన్ని రూపకప్రజ్ఞ అంటాన్నేను. ఆధునిక కవుల్లో రిల్క, మన కాలపు కవుల్లో తోమాస్ ట్రాన్స్ ట్రోమర్, యెహుదా అమిహాయి వంటివారిలో ఈ ప్రతిభ మనల్ని నివ్వెరపరుస్తుంది. వాల్మీకి వర్షర్తు వర్ణనలో, అటువంటి మెటఫర్లు, కాలంతాకిడికి చెక్కుచెదరనివి చాలానే ఉన్నాయి. ఈ శ్లోకం చూడండి:
బాలేంద్ర గోపాంతర చిత్రితేన
విభాతి భూమిర్నవశాద్వలేన
గాత్రానువృత్తేన శుకప్రభేణ
నారీవ లాక్షోక్షిత కంబళేన (28-24)
(పరచుకున్న పచ్చికబయళ్ళలో అక్కడక్కడ ఆరుద్రపురుగులు నడయాడుతున్న భూమి అక్కడక్కడ లక్కతో ఎర్ర రంగు అద్దిన ఆకుపచ్చని కంబళి ధరించిన స్త్రీలాగా కనిపిస్తున్నది)
ఇందులో రూపకాలంకార మహిమ మనకి చప్పున తెలుస్తూనే ఉంది. అదే సమయంలో ఆ ‘శుకప్రభ’ అనే మాట కూడా మామూలు మాట కాదు. శుకప్రభ అంటే చిలుకరంగు వెలుగు. హేమంతాన్ని వర్ణిస్తో వాల్మీకి కనకప్రభ అనే మాట వాడతాడు. అంటే హేమంతకాలమంతా బంగారువెలుగుతో మెరిసిపోతూ ఉందని. ఆదికవి palette ఎంత కాంతిమంతమో ఇలాంటి చిన్న చిన్న పదప్రయోగాలే మనకి పట్టిస్తాయి.
మరొక అర్థాలంకారం చూడండి:
అంగారచూర్ణోత్కర సన్నికాశైః
ఫలైః సుపర్యాప్తరసైః సమృద్ధైః
జంబూద్రుమాణాం ప్రవిభాంతి శాఖాః
నిలీయమానా ఇవ షట్పదౌఘైః (28-30)
(విరివిగా కాసి బాగా మిగలముగ్గిన నేరేడుపండ్లు ఆరిపోయిన నిప్పుల్లాగా నల్లగా కనిపిస్తున్నాయి. నేరేడుపండ్లతో నిండిన కొమ్మలు తుమ్మెదలగుంపులు ఆవరించినట్టున్నాయి)
రెండూ అద్భుతమైన పోలికలే. కాని వాటితో పాటు ఆ ‘అంగారచూర్ణం’ అనే మాటలో ఉంది కవిత్వం. నిప్పులు ఆరిపోయిన తర్వాత మిగిలే పొడి. అంటే బొగ్గుపొడి. ఏది ఆరిపోయింది ఇక్కడ? రాముడి శోకాగ్ని. విరహాగ్ని. వర్షాలు మొదలుకాకముందు నిత్యశోకపరాయణుడిగా ఉన్న రాముడిలోని దుఃఖాగ్ని ఇప్పటికి ఆరిపోయి బొగ్గుపొడి మాత్రమే మిగిలిందన్నమాట!
21-6-2023
మీ వరుస వ్యాసాల తీగలతో రామాయణ మహావృక్ష సమీపానికి తీసుకువెళ్ళి,మీ పరిశీలనా వాక్య కిరణాలతో మమ్మల్ని ఆ మృదుగంభీర సౌందర్యం చూసేలా చేసారు మాష్టారూ. రామాయణం ఒక మర్యాదా పురుషోత్తముని ఆంతరంగిక పయనం. అందు వాల్మీకి మహర్షి మెలమెల్లగా జీవిత కాలపు సుఖదుఃఖాల వెలుగు నీడలను విడమరిచి చెప్పారు. ఇది కదా ఈ దేశ సౌభాగ్యం! ఉదయాన్నే హృదయం ఉప్పొంగింది.మీ సాహిత్య వ్నాయాసాలు కు మనో స్వస్థత చేకూర్చే గుళికలు.నమస్సులండీ.
మీ రసస్పందనకు మనఃపూర్వక ధన్యవాదాలు
మధురం.. మధురాతి మధురం.. అది రాముని అంతరంగ ఆవిష్కరణ మాత్రమే కాదు. రస తపఃశంపన్నుడు వాల్మీకి మహర్షి అద్భుత పద చిత్ర ఆవిష్కరణ కూడా. అంగార చూర్ణం నన్ను తీవ్రంగా మెలి పెడుతోంది.
ధన్యవాదాలు సార్!
“వానాకాలంలో మా ఊళ్ళో ఎక్కడచూసినా మిగలముగ్గి రాలిపొయ్యే కొండమామిడిపండ్లు, విరగపండిన నేరేడు చెట్లు నా కళ్లముందు కనిపిస్తున్నాయి. ఏముంది ఈ కవితలో? ఒక్క ఉపమాలంకారం మాత్రమే ఉంది. కాని ఈ మొత్తం శ్లోకం నా కళ్ళముందు చిత్రించే రసమయదృశ్యం నిజంగా ‘రసాకులం’. ఒక్క ప్రాచీన చీనా కవులు మాత్రమే లాండ్ స్కేప్ ని ఇంత రసభరితంగా చిత్రించగలరు”
–
పాడేరులో కొండమావిడి పళ్ళు ఏరుకున్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్
నిజం చెప్పాలంటే వేదికల మీద జరిగే పటాటోపాలు కావు సాహిత్యోత్సవాలు. ఇదిగో ఇలా మనసు రంజింప జేసే సాహిత్యకలాపాలు అసలైన
సంబరాలు. కవిత్వానికో అవతారం ఉంటే అది వాల్మీకి అవతారం అనిపిస్తూంది.అలంకారాలు అన్నీ అందమైనవి. ఎఏగి ఎప్పుడు ఎలా వాడాలో తెలియటమే రససారస్వతం.
‘విశ్రమ్య విశ్రమ్య పునఃప్రయాంతి’ – అని చదువుతుండగానే “ఖిన్నః ఖిన్నః శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసం చోపభుజ్య…” అన్న మేఘదూతశ్లోకం గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే మీరు మేఘదూతం గురించి చెప్పేసారు – శరభయ్యగారి మాటల్లో. ఇంక ఆ పైన వ్యాసమంతా ఒక గాద్గదికానుభూతితోనే చదివాను. మేఘదూతకావ్యం మీదికి మీ
సమాలోకానాషాఢమేఘచ్ఛాయ పడటం తొందరలోనే అని తెల్సినా ఒక ఉత్కంఠతో చదువుకుపోతున్నాను.
ధన్యవాదాలు సార్
Thank you, sir.
విశ్రమ్య విశ్రమ్య పునఃప్రయాంతి
ఈ పదం నన్ను ఎంతగానో పట్టుకున్న పదం
దీని గురించి మీతో మీకు వీలున్నపుడు కలిసి మాట్లాడాలి
మీ విశ్లేషణ చాలా బాగుంది సర్