
కిష్కింధాకాండలో 28 వ సర్గ మొత్తం 66 శ్లోకాలు. వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసిన తరువాత రాముడు లక్ష్మణుడితో కలిసి కిష్కింధలో కాకుండా అక్కడికి దగ్గరలోనే ఉన్న ప్రస్రవణ గిరి అనే కొండదగ్గర ఒక గుహలో వానాకాలమంతా గడుపుతాడు. వర్షాకాలం ముగిసి శరత్కాలం మొదలయ్యాక సీతాన్వేషణ మొదలుపెడతానని సుగ్రీవుడు చెప్పడంతో రాముడు ఆ గుహలోనే కాలం గడుపుతాడు. ఆ సమయంలో వానాకాలాన్ని వర్ణిస్తూ చెప్పిన సర్గ అది.
ముందు రెండు విషయాలు మనం గమనించాలి. మొదటికి, ఆ కాలం ఒకరికి సమాశ్లేష సంతోషకాలం. సుగ్రీవుడికి అప్పటిదాకా ఉన్న వాలి భయం తొలగిపోయింది. కాబట్టి అంతకు ముందు ఎన్ని వానాకాలాలు గడిచినా అతనికి వానాకాలం సంతోషంగా కనబడింది అదే మొదటిసారి. ఆ సంతోషాన్ని కవి మరీ వాచ్యంగాగాని, వివరంగాగాని వర్ణించడు. రాముడితో చెప్పించిన ఈ ఒక్కమాటలో సుగ్రీవుడి సంతోషం ఎలా ఉండిఉండవచ్చునో మనం ఊహకే వదిలిపెట్టేస్తాడు
లబ్ధ్వా భార్యాం కపివరః ప్రాప్య రాజ్యం సుహృద్వ్రతః
ధ్రువం నందతి సుగ్రీవః సంప్రాప్య మహతీమ్ శ్రియమ్ (27-28)
(కపివరుడైన సుగ్రీవుడికి భార్య, రాజ్యం రెండూ లభించాయి. గొప్ప శ్రేయస్సు కూడా సంప్రాప్తించింది. ఇప్పుడతడు సంతోషంగా ఉన్నాడన్నది నిశ్చయం.)
మరొకవైపు రాముడికి ఆ కాలమంతా సీతతో కలిగిన ఎడబాటు మరింత తీక్ష్ణంగా బాధపెట్టే కాలం. అప్పటిదాకా ఉన్న వియోగదుఃఖం వేరు. సీత కనిపిస్తుందన్న ఆశకూడా లేని కాలం. కాని సుగ్రీవుడు పరిచయమయ్యాక, సీతని వెతికిపెట్టగలడనే నమ్మకం కుదిరాక, అప్పుడు మరొక నాలుగు నెలలు వేచి ఉండటం ఎంత దుర్భరమో మనం ఊహించుకోవచ్చు.
భార్యకి ఎడమైన భర్త విరహంలోంచి మేఘదూత కావ్యం వచ్చింది. భార్యాభర్తల ఎడబాటులో భర్త భార్యని తలుచుకోవడమో లేక భార్య భర్తని తలుచుకోవడమో ప్రధానంగా తమిళ సంగం కవిత్వం నడుస్తుంది. కాని ఇలా ఏకకాలంలో ఇద్దరు మిత్రుల్లో ఒకరికి భార్య చేరువైనకాలం, మరొకరికి భార్య ఎక్కడుందో కూడా తెలియని కాలంగా ఆ వానాకాలాన్ని పట్టుకోవడంలో వాల్మీకి చూపించిన ప్రతిభ అద్వితీయం.
రెండో విషయం, మేఘదూత కావ్యం నగరం నుంచి బహిష్కృతుడై అడవుల్లో తిరుగాడుతున్న ఒక ప్రవాసి తాలూకు విరహగీతం. గాథాసప్తశతిలో కనవచ్చే వానలు సాధారణంగా గ్రామాలమీద పడే వానలు. సంగం కవిత్వంలో నాయకుడు యుద్ధరంగం నుంచి నగరానికి వస్తున్నప్పుడో లేక నగరంలో నాయిక యుద్ధరంగంలో ఉన్న తన భర్తని తలుచుకున్నప్పుడో సంగం కవిత్వంలోని ముల్లై కవితలు పుట్టుకొచ్చాయి. కాని కిష్కింధాకాండలోని ఈ వర్ణనలో, ఒకే కొండకి దగ్గర్లోనే ఒక వైపు నగరం, అక్కడ భార్యాభర్తలు కలిసి ఉన్న దృశ్యం, అదే కొండకి మరొకదిక్కున గుహ, అందులో భార్యకి ఎడంగా నాయకుడు తన తమ్ముడితో కలిసి ఉన్న దృశ్యం. ఏకకాలంలో ఈ వైరుధ్యాన్ని చిత్రించడంతో, ఈ వర్ణన నేపథ్యానికి గొప్ప నాటకీయత చేకూరింది. ‘సురమణీయమైన’ ఆ గుహదగ్గరికి చేరుకోగానే (27-25) రాముడి కళ్ళు అక్కడి సౌందర్యాన్ని చూస్తున్నాయిగాని, ఆయన చెవుల్లో కిష్కింధలోని ఉల్లాసం మార్మ్రోగుతూ ఉంది.
గీతవాదిత నిర్ఘోషః శ్రూయతే జయతాం వరః
నర్దతాం వానరాణాంచ మృదంగాడంబరైః సహ (27-26)
( వానరులంతా గొప్ప సంతోషంతో నృత్యం చేస్తున్నట్టుంది. గీతాలూ, వాద్యాలూ, మృదంగాల చప్పుళ్ళతో పెద్ద ఎత్తున కోలాహలంగా ఉంది)
ఆ సంతోషం విన్న తరువాత ఆ నాయకుడికి తన భార్య గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? అందుకని ఎంతో అందంగా ఉన్నప్పటికీ ఆ ప్రస్రవణగిరి రాముడికి సుఖం కలిగించడం లేదు (27-30) అంటాడు కవి. అంతేకాదు, రాముడు తన దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తున్నాడని కూడా చెప్తాడు:
తత్సముత్థేన శోకేన బాష్పోహతచేతసామ్
తం శోచమానం కాకుత్ స్థం నిత్యం శోకపరాయణమ్ (27-32)
(సీతావియోగం వల్ల కలిగిన దుఃఖానికి రాముడు కన్నీళ్ళు విడుస్తున్నాడు. అలా నిత్యం శోకపరాయణుడిగా ఉన్న రాముణ్ణి-)
లక్ష్మణుడు ఊరడిస్తాడు. వర్షాకాలం మొదలయ్యిందనీ, శరత్కాలం రాగానే సీతజాడ కనుక్కోగలమనీ చెప్తాడు. ఆ మాటలు వినగానే పైగా, రాముడు తన శోకాన్ని వెంటనే విడిచిపెట్టేస్తున్నానని చెప్తాడు.
ఏష శోకః పరిత్యక్తః సర్వకార్యావసాదకః
విక్రమేష్వప్రతిహతం తేజః ప్రోత్సయామ్యహమ్ (27-43)
(సర్వకార్యాలకీ భంగం కలిగించే ఈ శోకాన్ని ఇప్పుడే వదిలిపెడుతున్నాను. లక్ష్మణా, నీ ప్రోత్సాహం వల్ల నాలోని పరాక్రమం ఉత్తేజితమైంది)
వర్షఋతువు మొదలయ్యేవేళ నాయకుడు స్థిరచిత్తంతో ఈ మాటలు చెప్పినప్పటికీ, వానాకాలం గడిచేకొద్దీ ఆయన వ్యాకులతకి లోనవడం మనం గమనిస్తాం. ఈ మాటల నేపథ్యంలో తర్వాతి సర్గలోని వర్షర్తువర్ణన మరింత భావోద్విగ్నంగా మనకి కనిపిస్తుంది.
మూడవది, ఈ వర్ణనలో, అంటే 66 శ్లోకాల్లో- తొలివానలు, నడివానలు, వానలు వెలిసి ఆకాశమంతా నిర్మలమయ్యే శరత్కాలం దాకా మొత్తం వానాకాలమంతా కనిపిస్తుంది. వర్షర్తు నేపథ్యంగా వచ్చిన మరే రచనలోనూ, లేదా వర్ణనలోనూ, ఇలా మొత్తం వర్ష ఋతువు మనకి కనిపించదు. ఆ వర్ణన చదువుతుంటే, ఒక కెమేరాతో ఋతుపవన మేఘం మొదలుకుని మహావర్షాల దాకా, ఆ తర్వాత వానలు వెలిసేదాకా, అనేక దృశ్యాల్ని చిత్రీకరించి వాటన్నింటినీ కలిపి వేగంగా తిప్పిన ఒక చలనచిత్రాన్ని చూస్తున్నట్టు ఉంటుంది.
మేఘదూతం ఆషాడప్రథమదివసంతో మొదలవుతుంది. ముల్లైప్పాట్టు లాంటి సంగం కావ్యం వానలు మొదలయ్యేకాలంలో నడిచే దీర్ఘకవిత. కాని ఈ వర్ణనలో వానాకాలం ఆషాఢమాసంతో మొదలై ఆశ్వయుజ మాసం దాకా నడుస్తుంది.
కాగా వానాకాలం శ్రావణంతో మొదలవుతుందని రామాయణకవి అంటాడు.
పూర్వోయం వార్షికో మాసః శ్రావణః సలిలాగమః
ప్రవృత్తాః సౌమ్య చత్వారో మాసా వార్షిక సంజ్ఞికాః (27-13)
(వర్షాలు కురిసే నాలుగు మాసాల్ని వార్షికాలు అంటారు. బాగా వానలు పడే ఈ నాలుగు మాసాల్లో శ్రావణం మొదటిది.)
అంటే శ్రావణభాద్రపదాలతో పాటు ఆశ్వయుజ, కార్తికాలు కూడా వార్షికసంజ్ఞలోకే వస్తాయన్నమాట. కాని ఆశ్వయుజం గడుస్తూనే కార్తికంలో అన్వేషణకు సైన్యాన్ని సిద్ధం చెయ్యమని రాముడు సుగ్రీవుడితో చెప్తాడు. అప్పటికి శరత్కాలం మొదలవుతుందని కూడా పదే పదే చెప్తాడు. మరి అప్పుడు వర్షాకాలం నాలుగు నెలలు ఏవన్నట్టు? కాని వర్షర్తు వర్ణనని నిశితంగా చూసినప్పుడు ఆషాఢాన్ని కలుపుకుని నాలుగునెలలు లెక్క చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ శ్లోకం చూడండి.
నివృత్త కర్మాయతనో నూనం సంచిత సంచయః
ఆషాఢీమ్ అభ్యుపగతో భరతః కోసలాధిపః (28-55)
(కోసలాధిపతి అయిన భరతుడు నాలుగు మాసాలకు సరిపడ వస్తుసంచయం చేసుకుని ఆషాడపూర్ణిమ మొదలుకుని చాతుర్మాస్య దీక్ష మొదలుపెట్టే ఉంటాడు).
అంటే వాల్మీకి లెక్కలో వానాకాలం నాలుగు నెలలు ఆషాఢపూర్ణిమనుంచి కార్తికపూర్ణిమదాకా. వానలు ఆషాఢంలోనే మొదలయినట్టుగా కవి చూసాడనడానికి మరొక రెండు ఆనవాళ్లు చూడండి.
నిద్రా శనైః కేశవమభ్యుపైతి
ద్రుతం నదీ సాగరమభ్యుపైతి
హృష్టాబలాకాః ఘనమభ్యుపైతి
కాంతా సకామా ప్రియమభ్యుపైతి ( 28-25)
(నిద్ర నెమ్మదిగా విష్ణువుని చేరుతున్నది. నది వేగంగా సముద్రాన్ని చేరుతున్నది. కొంగలు సంతోషంతో మేఘాన్ని చేరుతున్నాయి. కాంత సకామంతో తన ప్రియుణ్ణి చేరుతున్నది)
ఆషాడ శుద్ధ ఏకాదశినాడు విష్ణువు నిద్రలోకి ప్రవేశిస్తాడనీ, దాన్ని వైష్ణవులు తొలిఏకాదశిగా పరిగణిస్తారనీ మనకు తెలుసు. నాలుగు నెలల తరువాత ఆయన కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడనీ దాన్ని ఉత్థాన ఏకాదశి అని అంటారని కూడా మనకి తెలుసు. ఒక వైష్ణవ అవతారానికి చెందిన కావ్యాన్ని రాస్తున్న కవి ఆషాఢ శుద్ధ ఏకాదశినుంచి కార్తిక శుద్ధ ఏకాదశిదాకా ఉండే నాలుగునెలల్నీ వానాకాలంగా భావించడం సముచితమే కదా. తాను వర్ణిస్తున్న ఇతివృత్తానికీ, తన కాలగణనకీ మధ్య ఇంత ఔచిత్యాన్ని చూపించడం వాల్మీకికే చెల్లిందని చెప్పవచ్చు.
కిష్కింధాకాండలో చేసిన వర్షర్తు వర్ణన సందర్భం, ఔచిత్యం గ్రహించాక, ఇప్పుడు ఆ వర్ణన లోని విషాదమాధుర్యం ఎలా ఉందో మనం వివరంగా చూద్దాం.
సర్గ మొదలవుతూనే ‘అయం స కాలః సంప్రాప్తః’ (అదుగో ఆ కాలం రానే వచ్చింది) అంటాడు రాముడు లక్ష్మణుడితో. చిత్రమేమిటంటే, అరణ్యకాండలో, హేమంతు వర్ణన చేసినప్పుడు, లక్ష్మణుడు ‘అయం స కాలః సంప్రాప్తః ప్రియో యస్తే ప్రియనందనః ‘ (అరణ్య, 16-4) రాముడితో చెప్తాడు. హేమంతం విష్ణువుకి అత్యంత ప్రియమైన కాలం. కాబట్టి ఆ కాలం మొదలయ్యిందని లక్ష్మణుడు రాముడికి చెప్పడంలో చాలా ఔచిత్యం ఉంది. కాని వానాకాలం రాముడిలోని మనిషి బయటపడే కాలం. కాబట్టి రాముడే ‘చూడు మనం చెప్పుకుంటున్న ఆ వానాకాలం సమీపించింది’ అని అనడంలో కూడా గొప్ప ఔచిత్యం ఉంది. ఎందుకంటే ఆ వర్షర్తువర్ణన మొత్తం ఒక భావుకుడైన మానవుడు, అసలే రసార్ద్రహృదయుడు, మరింత రసార్ద్రభరితుడై చేసిన వర్షస్తోత్రంలాగా మనకి వినిపిస్తుంది.
వర్ష వర్ణన మొదటి శ్లోకమే ఇలా ఉంది:
అయం స కాలః సంప్రాప్తః సమయోద్య జలాగమః
సంపశ్య త్వం నభో మేఘైః సంవృతం గిరిసన్నిభైః (28-2)
వర్షాకాలం ఇప్పుడు అడుగుపెట్టింది. చూడు, కొండల్లాగా కనిపిస్తున్న మేఘాలు ఆకాశమంతా వ్యాపించాయి.)
అది ఋతుపవనమేఘం అనడానికి గుర్తు ఆ తర్వాతి శ్లోకం. ఎందుకంటే ఋతుపవన వేళ ఎండ చల్లబడుతుందిగాని, ఇంకా సూర్యుడు కనిపించకుండా పోడు. కాని ఆ సూర్యుడు కూడా చల్లగా కనిపిస్తాడు. ఆ మాటే చెప్తున్నాడు ఈ శ్లోకంలో.
శక్యం అంబర మారుహ్య మేఘసోపానపంక్తిభిః
కుటజార్జునమాలాభిః అలంకర్తుం దివాకరమ్ ( 28-4)
(ఈ మేఘాలనే నిచ్చెన ఎక్కి ఆకాశానికి ఎక్కగలిగితే! అప్పుడు కొండగోగుపూల మాలకట్టి దివాకరుణ్ణి అలంకరించగలుగుతాను)
ఇదొక దివ్యశ్లోకం. పూర్తి స్థిరచిత్తుడు, శోకాన్ని అణచుకున్నవాడూ మాత్రమే చెప్పగలిగిన కవిత. కాని ఆ వెంటనే చెప్పిన ఈ శ్లోకం చూడండి:
సంధ్యారాగోత్థితైస్తామ్రైః అంతేష్వధిక పాండురైః
స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైః బద్ధవ్రణమివాంబరమ్ ( 28-5)
( సంధ్యారాగ కాంతులతో ఎరుపెక్కి, కొసల్లో తెల్లబడ్డ మేఘంవల్ల ఆకాశం తెల్లని గుడ్డ చుట్టినాకూడా నెత్తుటిమరకలు కనిపిస్తున్న వ్రణంలాగా ఉంది).
కవి ఇంత భీకరమైన మెటఫర్ ఇక్కడ ఎందుకు వాడేడో నాకు చాలాకాలం పాటు అర్థం కాలేదు. కాని వానాకాలం ఏకకాలంలో సంతోష విషాదాలు రెండింటినీ మేల్కొల్పుతుందని తెలిసాక, మరీ ముఖ్యంగా, రాముడు తన శోకాన్ని తాను అదుపులో పెట్టుకుంటానని చెప్పినప్పటికీ, దుఃఖం ఆయన అంతశ్చేతనలో పచ్చిగానే ఉందని తెలిసాక, ఈ శ్లోకం బీభత్సరసాన్ని కాక కరుణరసాన్నే మనలో మేల్కొల్పుతుందని గ్రహించాను.
ఆ తర్వాత శ్లోకంలో మళ్లా ఆకాశం కామాతురుడిలాగా ఉందని చెప్తూ, ఏడవ శ్లోకంలో ఇలా అంటున్నాడు:
ఏషా ఘర్మపరిక్లిష్టా నవవారిప్లుతా
సీతేవ శోకసంతప్తా మహీ బాష్పం విముంచతి (28-7)
(వేసవి తాపానికి వేడెక్కి, కొత్తగా కురుస్తున్న చినుకులకి తడిసిన భూమి, విరహతాపంతో కన్నీళ్ళు విడుస్తున్న సీతలాగా, వేడి ఆవిరి కక్కుతోంది)
తొలకరి పడగానే రేగే మట్టివాసన సీత వెచ్చని కన్నీరుని గుర్తుచేస్తోందని చెప్తాడా, ఆ వెంటనే మళ్ళా తనని తాను సర్దుకుని, ఇలా అంటున్నాడు:
మేఘోదర వినిర్ముక్తాః కల్హార సుఖశీతలాః
శక్యం అంజలిభిః పాతుం వాతాః కేతకిగంధినః (28-8)
(మేఘాల మధ్యనుంచి వీస్తూ, కలవపూల చల్లదనాన్ని మోసుకొస్తూ, మొగలిపూల సువాసనల్తో వీస్తున్న ఈ గాలుల్ని దోసిళ్ళకొద్దీ తాగాలని ఉంది)
అంటే ఈ మొదటి నాలుగైదు శ్లోకాల్లోనే ఇంత మానసిక సంఘర్షణ, ఇంత రససంచలిత హృదయావేదన కవి తన కథానాయకుడిలో చూపించడం అబ్బురమనిపిస్తుంది. ఏకకాలంలో ఎండా, వానా కలిసిపడుతున్నట్టుగా ఉంటుంది ఈ శ్లోకాల్ని వెంటవెంటనే చదువుకుంటూ పోతుంటే.
21-6-2023
మీ వివరణ , విశ్లేషణ, శ్లోకాన్ని వివరణ చదువుతుంటే చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని ఇవన్నీ ఎందుకు నేర్చుకోల్క పోయామనే దుగ్ధ కలుగుతుంది. అదే సమయంలో మళ్లీ అనిపిస్తూంది ఈ దశలో అర్థమైనంత బాగా అప్పుడు అర్థమయ్యేవి కావేమోనని. వాల్మీకి కవిగా మారక మునుపు ఒక ఆదివాసి అవడం వల్లనేమో
ప్రకృతి పరిశీలన పరమాద్భుతంగా గోచరిస్తూంది.
అన్నిటి కంటే ముఖ్యమైన విషయం నిన్న వానజల్లు కురిసి ఈరోజు ఉదయమే ఆకాశమంతా మబ్బులు కమ్మి చల్లగా అవడంతో చదివిన విషయం మరింత హృదయాలింగన సమంగా ఉంది. కాళిదాసును వాల్మీకిని చదువ లేదన్న బెంగ ఇలా తీరుతున్నందుకు ఆనందంగా ఉంది.
మీ సహృదయ స్పందనకు మనః పూర్వక ధన్యవాదాలు.
ఎన్ని విషయాలు ,చిన్న చిన్న డీటెయిల్స్ సమన్వయం చేసుకుంటే ఇంత లోతైన కావ్యం సృష్టించగలుగుతారు కదా ,అదీ ఏ రెఫరెన్స్ బుక్స్ లేనికాలంలో ! అద్భుతం మీ విశ్లేషణ కూడా .
అవును మేడమ్. ఈ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.
“తత్సముత్థేన శోకేన బాష్పోహతచేతసామ్
తం శోచమానం కాకుత్ స్థం నిత్యం శోకపరాయణమ్ (27-32)
(సీతావియోగం వల్ల కలిగిన దుఃఖానికి రాముడు కన్నీళ్ళు విడుస్తున్నాడు. అలా నిత్యం శోకపరాయణుడిగా ఉన్న రాముణ్ణి-)
లక్ష్మణుడు ఊరడిస్తాడు.”
పాపం, మరి లక్ష్మణుడి మాటో?
Thank you, sir.