
ఆషాఢమేఘం అనగానే కాళిదాసు మేఘసందేశం గుర్తుకు రావడం సహజం. ఈ దేశంలో కవులకీ, భావుకులకీ శతాబ్దాలుగా ఒక కావ్యాభిరుచిని అలవరచడంలో, ఋతుపవనాన్ని ఒక శుభాకాంక్షగా మనం గుర్తుపట్టేలా చెయ్యడంలో మేఘసందేశ కావ్యం పోషించిన పాత్ర చిన్నది కాదు. కాని ఋతుపవనాన్ని ఒక కావ్యవస్తువుగా స్వీకరించడంలో, మనుషుల హృదయాల్ని మెత్తబరచడంలో, నింగినీ, నేలనీ ముడిపెట్టడంలో మేఘసందేశం తొలికావ్యం కాదు. నిజానికి అప్పటికి దాదాపు రెండు, మూడు వందల ఏళ్ళుగా తమిళ, ప్రాకృత కవులు నిర్మిస్తూ వచ్చిన ఒక రసజ్ఞతాసేతువుని కాళిదాసు మేఘసందేశంతో సుస్థిరం చేసాడు. ఆ తరువాత ఆయన దారిలో మరెందరో కవులు తమ కవిత్వాన్ని మూర్తీభవించిన వర్షఋతువుగా తీర్చిదిద్దుకున్నవారికి ఆయనే ఒరవడి. కాని ఆయనకు ముందే ఎన్నో శతాబ్దాలుగా మేఘాన్ని ఆరాధించిన కవులున్నారు. కావ్యాలున్నాయి. వాటి గురించి కొంతైనా పరిచయం చెయ్యాలనే ఈ ప్రయత్నం.
మన దేశంలో వర్షాలు నైరుతి, ఈశాన్య ఋతుపవనాల ద్వారా వస్తాయన్నది మనందరికీ తెలిసిందే. ఆ రెండింటిలో నైరుతి ఋతుపవనాలదే పెద్ద పాత్ర. ఆ ఋతుపవనాలు ప్రతి ఏటా జ్యేష్టమాసం మధ్యలో కేరళ తీరాన్ని తాకి, వాయవ్యతమిళనాడు, కర్ణాటక మీదుగా దక్కన్ పీఠభూమిమీంచి మధ్యభారతదేశానికి ప్రయాణమై అక్కణ్ణుంచి ఉత్తరభారతదేశానికి తరలిపోతాయి. ఇదంతా దాదాపుగా నెలరోజుల పైనే పట్టే ప్రక్రియ. కాళిదాసు మాళవప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆయనకి ఋతుపవనమేఘం ఆషాఢ ప్రథమదివసం నాడు సాక్షాత్కరించింది. అదే మనకైతే మృగశిర కార్తె మొదటిరోజునే ఋతుపవనమేఘం కనిపిస్తుంది. తమిళనాడులో అధికభాగం నైరుతి ఋతుపవనాల వల్ల కాక ఈశాన్య ఋతుపవనాలవల్ల వానలుపడతాయి కాబట్టి, వాళ్ళకి జ్యేష్ట, ఆషాడ మాసాలంటే ఎర్రటి ఎండ తప్ప మరేదీ గుర్తురాదు. వాళ్ళకి వానాకాలమంటే శ్రావణ, భాద్రపదాలూ, ఇంకా ఆ పైన కూడా. అదే గంగాయమునా మైదానానికొస్తే ఋతుపవనాలు అక్కడికి ప్రయాణించి వానలు కురిసేటప్పటికి వాళ్ళకి ఆషాఢం గడిచిపోతూ, శ్రావణం మొదలవుతుంది కాబట్టి, ఉత్తరాది భక్తికవుల కవిత్వంలో శ్రావణమేఘాలు కలిగించే భావస్ఫురణలు ఆషాఢమేఘం కలిగించదు.
ఎలా చూసినా భారతదేశంలో వానాకాలమంటే గ్రీష్మఋతువు మధ్యలో మొదలై, వర్షఋతువు మీదుగా, శరదృతువు తొలిరోజులదాకా దాదాపు నాలుగునెలలపాటు కొనసాగే కాలం. అందులో మొదటి రెండు నెలలూ తొలివానలు. ఇంగ్లిషు నెలల లెక్కలో చెప్పాలంటే జూన్, జూలై నెలలు మాన సూన్ మొదలయ్యే రోజులు. ఆగష్టు, సెప్టెంబరు నెలలు వర్షఋతువు. అందులోనూ ఆగస్టు నెల అంటే శ్రావణమాసం నడి వానాకాలం. ఏ విధంగా చూసినా భారతదేశం పొడుగునా జూలై మధ్య నుంచి మొదలై సెప్టెంబరు నెల మధ్య దాకా పూర్తిగా వానాకాలం. అంటే ఆషాఢ పూర్ణిమ నుంచి మొదలై భాద్రపద పూర్ణిమ దాకా రెండు నెలలు ప్రగాఢ వర్ష ఋతువు.
నాలుగు నెలల తొలి, మలి వానాకాలం తమలో రేకెత్తించే స్పందనలు వసంతం, హేమంతాలు రేకెత్తించే స్పందనలకన్నా ప్రత్యేకంగా ఉండటం భారతీయ కవులు గుర్తుపట్టారు. తొలినుంచీ భారతీయ కవిత్వంలో శృంగార, వీర రసాలే ప్రధాన రసాలుగా ఉంటూ వచ్చాయి. శృంగార రసాన్ని ఉద్దీపన చెయ్యడంలో స్త్రీపురుషుల కలయికలూ, విడిపోడాలే ప్రధాన ఇతివృత్తాలనుకుంటే, సమాగమ సంతోషం కన్నా, విరహం కలిగించే తీయని బాధని కవులూ, పాఠకులూ కూడా ఎక్కువ ఇష్టపడ్డారని అనిపిస్తుంది. సాధారణంగా వసంత ఋతువు నేపథ్యంగా వచ్చిన కవిత్వంలో ప్రేమలో పడటం, ఎదురుచూడటం, కలుసుకోవడం ముఖ్యంగా ఉంటాయి. శరత్కాల కవిత్వం కూడా అంతే. కాని వర్షాకాలపు కవిత్వంలో కలయికా, విరహమూ రెండింటికి సంబంధించిన కవిత్వమూ కనిపిస్తుంది. అలాగే తక్కిన ఋతువుల నేపథ్యలో వచ్చిన కవిత్వంలో ప్రేమికులు ఎవరేనా కావచ్చు. చాలాసార్లు ఆ ప్రేమికులు పెళ్ళికాని యువతీయువకులు కావచ్చు. లేదా వాళ్ళు దాంపత్యజీవితంతో సంబంధం లేని వారు కూడా అయి ఉండవచ్చు. కాని వర్షఋతు ప్రధానంగా వికసించిన ప్రణయకవిత్వంలో ఆ ప్రేమ సాధారణంగా భార్యాభర్తలకి సంబంధించిన ప్రేమ మాత్రమే కావడం గమనించాలి.
భార్యాభర్తల మధ్య ప్రేమలో విరహానికీ, ఎదురుచూపులకీ అవకాశం ఎక్కడుంటుంది? సాధారణంగా ఆ ప్రేమ సాన్నిహిత్యానికీ, సాఫల్యానికీ సంబంధించిందే అయి ఉంటుంది కదా అని సందేహం రావచ్చు.
ఒకప్పుడు ఈ దేశంలో యుద్ధాలు వసంతఋతువులో మొదలై వానాకాలం మొదలయ్యేదాకా నడిచేవి. లేదా శరత్కాలం మొదలయ్యేకైనా మొదలయ్యేవి. సాధారణంగా వసంత, గ్రీష్మ ఋతువులే యుద్ధానికి అనుకూలంగా ఉండే కాలాలు. అలానే వ్యాపారంకోసమో లేదా ఏదో ఒక పనికోసమో ఊరు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళకి కూడా వసంతకాలం నుంచి వేసవి కాలందాకానే అనుకూలమైన కాలం. వానాకాలం అంటే తొలివానలు మొదలయ్యేటప్పటికి వాళ్లు తిరిగి మళ్ళా తమ ఊరు, తమ ఇల్లు చేరుకునేవారు. అప్పటిదాకా నాలుగునెలలనుంచి ఆరునెలలదాకా తమ ఊరునుంచి, తమ ఇంటినుంచి దూరంగా గడిపిన తమ భర్తలకోసం వాళ్ళ ఇళ్ళల్లో భార్యలు ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు. ఋతుపవనకాలం రాగానే వాళ్ళు తిరిగివస్తారని నమ్ముతుండేవాళ్ళు. కాబట్టి ఋతుపవనమేఘం ఒక పునస్సమాగమ సంకేతంగా మారిపోయింది.
అందులోనూ సైన్యంలో భాగంగా, యుద్ధానికి వెళ్ళిన భర్త తిరిగి వస్తాడో రాడో ఎప్పటికీ అనుమానంగానే ఉండే కాలంలో, ఋతుపవన ఆగమనంలో ఎదురుచూపుతో పాటు, చెప్పలేని ఆందోళన కూడా కలిసే ఉంటుంది. యుద్ధం లాగా తీవ్రంగా అనిశ్చితం కాకపోయినా వ్యాపారంకోసం దూరప్రాంతానికి వెళ్ళినవాళ్ళ విషయంలో కూడా ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. వానాకాలం మొదలవుతూనే తన భర్త ఇంటికి రాగానే ఆ భార్యకి పునర్జన్మలాగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇది ప్రతి ఏడాదీ మళ్ళీ మళ్ళీ ఎదురయ్యే అనుభవమే. వసంత ఋతువు నేపథ్యంగానూ, హేమంత ఋతుసందర్భంలోనూ వికసించే కవిత్వంలో ఈ ఆందోళనకి అవకాశం లేదు. భార్యాభర్తల మధ్య ప్రణయం, ఆ ప్రణయానికి యుద్ధమో లేదా మరో అవాంతరమో అడ్డుపడటం, తిరిగి వారిద్దరూ ఒకరినొకరు కలుసుకునేదాకా తప్పని ఎదురుచూపులు- వీటిని ఆధారం చేసుకుని ఋతుపవనాలు గాఢమైన ప్రణయసంతోష నిర్వేదాలకు కారణమవుతూ వచ్చాయి.
తమ భర్తలు దూరప్రాంతానికి వెళ్ళిన భార్యల అవస్థ కాక, వానాకాలం మరో రకమైన ప్రణయావస్థకు కూడా దారితీసేది. పూర్వకాలం పంటలకోతలు అయిపోయాక అంటే దాదాపుగా సంక్రాంతి తర్వాతనుంచి వానాకాలం మొదలయ్యేదాకా ఆరునెలలపాటు గ్రామాల్లో మరే పనులూ ఉండేవి కావు. భార్యాభర్తలు ఇంటిపట్టునే ఉండేవారు. ఆ కాలమంతా గ్రామాల్లో తీరికదనపు సంతోషం ఉండేది. వానాకాలం మొదలవగానే మళ్ళా పనిపాటలు మొదలయ్యేవి. ఇంక ఇంటిపట్టున కూచోడం సాధ్యం కాదు. లేచి పనిలోకి పోవాలి. వానపడుతూండగానే తెల్లవారే పొలానికి పోవడంలో ఎంతలేదన్నా కొంత కష్టం తప్పనిసరి. అన్నిటికన్నా ముందు తీరిక అదృశ్యమైపోయేకాలం అది. తీరికతో పాటే ప్రణయసంతోషాన్ని పక్కనపెట్టవలసి ఉంటుంది. వానాకాలం పనికాలం. కాబట్టి వానాకాలం మొదలవుతూనే తీరికకీ, పనికీ మధ్య ఉండే సరిహద్దు స్పష్టం కావడం మొదలుపెడుతుంది. అలాగని భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండే కాలం కాదు. కలిసే ఉంటారు. పనిపాటలు కలిసే చేసుకుంటారు. కాని అప్పటిదాకా తీరికలో మాత్రమే గడిపిన జీవితంలో కనవచ్చే ప్రణయంలాంటిది ఇకమీదట కనిపించే అవకాశం ఉండదు. ఈ ప్రణయం కలిసి పనిచేసుకోవడంలోని ప్రణయం. ఇంకా చెప్పాలంటే ప్రణయం కన్నా పని ముఖ్యంగా ఉండే కాలం.
కొన్నిసార్లు వానాకాలం మొదలైనా కూడా రాజులు యుద్ధాలు ఆపేవారు కాదు. లేదా వానాకాలం పూర్తయి శరత్కాలం మొదలవుతూనే మళ్ళా యుద్ధాలు మొదలుపెట్టేవారు. అటువంటి పరిస్థితుల్లో వానాకాలమంతా భార్యాభర్తల జీవితంలో ఆందోళన తప్పదు. కొన్నిసార్లు భార్యాభర్తలిద్దరూ కూడా తమ ఊర్లో కాకుండా మరే గ్రామంలోనో, మరెవరిపొలాల్లోనో పని చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా తమ ఇంటినుంచి దూరంగా పొలానికి పోయి అక్కడే పొలంపనుల్లో గడపవలసి వస్తుంది. అందువల్ల కూడా ఆ కాలమంతా ఆందోళనతోనే గడుస్తుంది.
ఇక దూరప్రాంతాలకు వెళ్ళినవాళ్ళు ఋతుపవనాలు మొదలవుతూనే కాలినడకన తమ తమ ఊళ్ళకి ప్రయాణమవుతూ దారిలో ఎక్కడో ఒకచోట ఆగేవారు. ఆ గ్రామాల్లో అటువంటి బాటసారుల్ని చూసినప్పుడు, తమ భర్తల కోసం ఎదురుచూస్తున్న భార్యలకు ఆ దృశ్యాలు మరింత వేదనామయంగానూ, దుస్సహంగానూ ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఆ బాటసారులు ఆ సాయంకాలానికో, ఆ రాత్రికో తమ గ్రామంలో ఆగినట్టే, తమ భర్తలు కూడా ఇంటికి తిరిగివస్తూ దారిలో మరెక్కడో మరే గ్రామంలోనో ఆగివుండవచ్చుననే ఆలోచన వాళ్ళకి కలిగించే వియోగదుఃఖం మామూలుగా ఉండదు. అలాగే ఆ గ్రామాల్లో ఆ రాత్రి పూట ఆగిన బాటసారులకి ఆ గ్రామాల్లో వెచ్చగా జీవిస్తున్న కుటుంబాల్ని చూసినప్పుడు తమ భార్య బిడ్డలు గుర్తు రావడం సహజం. అలా గుర్తు రాగానే వాళ్ల ఆత్రుత అధికం కావడం కూడా సహజమే.
ఇలా వానలకు ముందు ఎదురుచూపులు, కొన్నిసార్లు వానలు పూర్తికాగానే మళ్ళా తమ కుటుంబాల్ని విడిచిపెట్టి వెళ్ళకతప్పదనే వ్యాకుల రాత్రులు- మొత్తం వానాకాలమంతా కూడా వానలు పడుతున్నా కూడా గృహాల్లో వియోగమనే అగ్ని రగులుతూనే ఉండే కాలం.
మరోవైపు భర్తలు ఇళ్ళకు చేరుకున్నప్పుడు, కనీసం ఆ నాలుగు నెలలు వాళ్ళు తమతో కలిసి ఉండటంవల్లా, ఏ విధంగా చూసినా ఆ నాలుగునెలలపాటూ వాళ్లని తమనుంచి ఏ శక్తీ కూడా దూరంగా తీసుకువెళ్ళదనే నిశ్చింత కూడా వెచ్చగా ఉండే కాలం. వసంత, శరత్, హేమంతకాలాల్లో ఈ నిశ్చింత ఇంత నిశ్చయంగా ఉండే అవకాశం లేదు.
కాబట్టి దంపతులైన స్త్రీపురుషుల మధ్య వానాకాలం సమాగమకాలం, వ్యాకులకాలం కూడా. ఆందోళనకాలం, నిశ్చింత కాలం కూడా. వర్షఋతు ప్రధానంగా వికసించిన భారతీయ కవిత్వంలో ఈ పార్శ్వాలన్నీ మనం చూడవచ్చు. మరీ ముఖ్యంగా ప్రాచీన సంస్కృత, తమిళ, ప్రాకృత కవిత్వాల్లో కనవచ్చే కొన్ని ఉమ్మడి లక్షణాల్ని గుర్తుపట్టవచ్చు కూడా. మొదటిది, ఆ కవిత్వం భార్యాభర్తల మధ్య ప్రణయానికి సంబంధించిన కవిత్వం. అందులో ఎదురుచూపులు ఎంత ఉంటాయో, సమాశ్లేష సుఖం కూడా అంతే ఉంటుంది. అందులో తీరిక, పని రెండింటి మధ్యా ఉండే ఉద్రిక్తతలతో పాటు, యుద్ధం, శాంతి రెండింటిమధ్య ఉండే బిగువు కూడా అంతే ఉంటుంది. కొన్నిసార్లు అది యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య విరామకాలం కూడా. చాలాసార్లు అది ఒకే ఊళ్ళో ఇద్దరు భార్యాభర్తల మధ్య సంతోషప్రకటన కాగా, వాళ్ళని చూస్తూ, ఇంకా ఇల్లు చేరని తన భర్తను తలుచుకునో లేదా ఎక్కడో సుదూరంలో తన కోసం ఎదురుచూస్తున్న భార్యని తలుచుకునో స్త్రీపురుషులు లోనయ్యే వియోగవేదన కూడా.
వాల్మీకి రామాయణం కిష్కింధా కాండలోని వర్ష ఋతు వర్ణనలో ఆదికవి ఈ పార్శ్వాలన్నింటినీ పొదివి పట్టుకున్నాడనిపిస్తుంది. అది భారతీయ కవిత్వంలో ఋతుపవన తొలి ప్రణయగీతిక అని చెప్పవచ్చు. ఆశ్చర్యమేమిటంటే వర్షఋతు ప్రధానంగా వికసించిన ఎన్నో కవిత్వాల్లో ప్రణయమో, నిర్వేదమో, సమాగమ సంతోషమో, ప్రతీక్షాక్లేశమో ప్రధానంగా ఉండగా, వాల్మీకి చేసిన వర్ష ఋతువర్ణనలో, సంయోగ, వియోగాలు రెండూ కనిపిస్తాయి. తదనంతర కాలంలో ప్రాకృత, తెలుగు, కన్నడ కవిత్వాల్లో కనవచ్చే తొలివానలతో పాటు తమిళ, హిందీ కవిత్వాల్లో కనవచ్చే మలివానలు కూడా ఆ వర్ణనలో కనిపిస్తాయి. బహుశా భారతీయ కవిత్వాలన్నిటిలోనూ అంత సమగ్రమైన వర్ష ఋతు వర్ణన మరొకటి లేదని చెప్పవచ్చు.
21-6-2023
వర్షాగమన సంరంభంలో దాంపత్య జీవన సౌరభ విశ్లేషణ అమోఘం.
ధన్యవాదాలు సార్
చక్కగా వివరించి చెబుతున్నారు.🙏
ధన్యవాదాలు
Audio వింటూ text చదువుకున్నాను. చాలా తెలుసుకున్నాను. ఆషాఢమేఘం painting చాలా బావుంది, సర్. 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!