ఆషాఢ మేఘం-2

ఆషాడమేఘం పిలుపుకు కాళిదాసునుండి టాగోర్ దాకా, గాథాసప్తశతి నుండి కృష్ణశాస్త్రిదాకా ప్రతి ఒక్క భారతీయ కవి ప్రతిస్పందించకుండా ఉండలేకపోయాడు. కృష్ణశాస్త్రి ఆషాడమేఘాన్ని ‘మేఘస్వామీ’ అనీ, ‘ప్రావృడంభోదర స్వామీ’ అని నోరారా పిలిచాడు. అసలు కృష్ణపక్షమంతా మేఘాలు ముసురుకున్న చీకటిరాత్రులే. ‘అతి భయంకర సాంద్రనీలాభ్రపటలి’,’ ప్రళయకాల మహోగ్రభయదజీమూత ఉరు గళఘోర గంభీర ఫెళఫెలార్భటులు’, ‘కాళరాత్రి మధ్యవేళల జీమూతమందిరపు కొలువుకూటాల ఏకాంతగోష్టి’, ‘దశదిశలు ముంచెత్తిన నీరంధ్రభయదాంధకార జీమూతాళి’, ‘ఎటుగనినగాని ఆకాశ హృదయవాటి సంకుల విషాదజలధరచ్ఛాయలందు పొంచి ఘోషించే బాష్పాంబునిధులు’.. ఇలా ఎటు చూసినా ముంచెత్తిన వర్షఋతువు కృష్ణశాస్త్రి తొలికవిత్వమంతా. ఈ కవిత చూడండి:

ఎంత బరువయ్యెనోగాని యెడద వెలికి
తొలగిపారని దుఃఖాశ్రుజలము వలన
ప్రావృడంభోధర స్వామి, నీవు కూడ
నా వలెనె జాలివొడమ వాపోవుచుంటి.

ఒక్కటొక్కటె కన్నీటిచుక్కలొలుక
నేడ్వలేక యేడ్వలేక యేడ్చుచుంటి
నెచ్చెలీ, యే నెరుంగుదు, నీవు కూడ
నొక్కమారు గాటంపు నిట్టూర్పు విడుతు
తెలియరాని తెలుపలేని తీక్ష్ణ తాప
మెదియొ లోలోన నిన్ను వేగించునేమొ

ప్రావృడంబోధర స్వామి, జీవనంపు
భారము తొలంగిపోవనెవ్వారికేని
కోరి నీ సొదలను జెప్పికొందువేమొ
గొణుగుకొనుచుందువయ్య, యొక్కొక్కవేళ

ఇట్లె విలపించి కృశియింతు నేను, నీవొ
హోరుహోరున నీ మనసార నేడ్చి
జిలుగు వలిపెంపు వన్నె చీరల ధరించి
కులుకునవ్వుల పగడాల తళుకుతోడ
పొడుపుచెలి కడకో, సంజపడతి కడకొ
పోయి యాటపాటల ప్రొద్దువుత్తు.

ఎడతెగని యాత్రనిట్లు సాగింపలేక
యేడ్వగా లేక కృశియింతు నేనొకండ.

వర్షాకాల మేఘాల్ని చూడగానే నా మనసుని పట్టిపీడించే మరొక కవిత బైరాగి ‘వర్షాయామిని.’


మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి

వీడి క్రొమ్ముడి చెదరి క్రమ్ముకొన్నవి కురులు
నల్ల త్రాచులవోలె ఒల్లమాలిన ఇరులు
చూపులందని పొరల చీల్చి మూగిన మరులు

ప్రాత తలపులు గుబులుకొన్నవి పయ్యెదల
ఊర్పుతావులు కొసరి విసిరి చనునీరేయి
మేఘాల మోహాలు ముసురుకొను నీ రేయి

ఆకాశదీపాలు ఆరిపోతున్నాయి
తెగినముత్తెపుసరులు తేలిపోతున్నాయి
రేగనుల నీలాలు కారిపోతున్నాయి

దెసలచెక్కిలినంటి కారుకాటుక చాయ
నొసటి వ్రాతలు చెరిగి చెమరుకొను నీ రేయి
మేఘాల మోహాలు ముసురుకొను నీ రేయి

మెరుపు మెరిసిన చోట తెరిచి మూసిన తలుపు
చిమ్మచీకటి బాట చేరనీయదు మలుపు
ఈ రేయి మీటినది ఏనాటిదో పిలుపు

మతులతీగెల నూపి, స్మృతుల గాయము రేపి
వెతల క్రొంజివురులను పసరుకొను నీ రేయి
మేఘాల మోహాలు ముసురుకొను నీ రేయి.


భావుకహృదయంలో మేఘాలు రేకెత్తించగల వ్యక్త అవ్యక్త సంవేదనలన్నింటినీ మెరుపులతో, చీకట్లతో చిత్రించిన కవిత ఇది. పాతతలపులు గుబులుకోవడం, స్మృతుల గాయం రేగినప్పుడు హృదయంలో ఏనాటి పిలుపులో వినరావడం, చూపులందని పొరల్లో మరులు చీల్చి మూగినప్పుడు వెతలు రేపే రక్తిమ కొత్తచివురులు తొడగడం, భారతీయ కవిహృదయాలన్నిటి బరువునీ తన హృదయానికెత్తుకుని మరీ బైరాగి ఈ కవిత రాసాడనిపిస్తుంది.

భావుకుడైన ఏ చలనచిత్రదర్శకుడైనా ఈ పాటని చిత్రీకరిస్తే ఎంత బాగుణ్ణు. అలాంటి దర్శకుడికి నా సూచన ఏమంటే, అతడు దీన్ని కేవలం నలుపు, తెలుపు, ఊదారంగుల్లో మాత్రమే చిత్రించాలి. ఆ మధ్యలో అక్కడక్కడా ఎరుపు రంగు, కొద్దిగా ఆకుపచ్చ మరకలు ఉండాలి. అసలు పాట మొదలయ్యేటప్పటికే ఒక యువతి కొమ్ముడి చెదిరి ఆమె కురులు తెర అంతటా కమ్ముకోవాలి. ఆ కేశరాశి మధ్యనుండి, ఆమె నేత్రాల్లో నిలువలేకపోతున్న బాష్ప మేఘాలు తెర అంతా ఆవరిస్తుండాలి, చెదిరిపోతూ ఉండాలి. అంధకారం ఆవరించిన ఒక వానాకాలపు రాత్రి దూరంగా ఏదో ఒక కిటికీ తలుపు సగం తెరచుకుని పాలిపోయిన పసుపురంగు దీపకాంతి సన్నగా ప్రసరిస్తూ ఉండాలి. ఈ దృశ్యాన్ని దర్శించగల దర్శకుడికోసం నేనెంతకాలమన్నా వేచి ఉండగలను.

మేఘాన్ని చూడగానే భారతీయ కవికి ఏకకాలంలో ప్రేమా, దుఃఖమూ రెండూ కలుగుతాయి. వసంతాన్ని చూసినప్పుడు కలిగే భావనలు ప్రణయోద్దీపభావనలే తప్ప వాటిలో విషాదఛాయలుండవు. కానీ ఆషాఢమేఘం ఏకకాలంలో కవికి ఈ ప్రపంచం పట్ల అలవిమాలిన ప్రేమా, దీన్నుంచి తొలగిపోతున్నాననో, తొలగిపోవాలనో ఏదో ఒక గాఢనిర్వేదమూ, ఒక్కసారే ఆవహిస్తాయి. గీతాంజలిలో చివరి కవిత, చలంగారి తెలుగులో, చూడండి:


ఒక్క నమస్కారంతో ఈశ్వరా, నా ఇంద్రియాలన్నీ విస్తరించి ఈ ప్రపంచాన్ని నీ పాదసన్నిధిలో స్పృశించనీ.

కురియని నీటిభారంతో, వాలిన ఆషాఢమేఘం వలె ఒక్క నమస్కారంతో నీ ద్వారం వద్ద నా మనసు కిందికి వొంగిపోనీ.

వివిధరాగాల్ని ఏకం చేసుకుని నా పాటల్ని ఒక్క నమస్కారంలో నీరవార్ణవంలోకి ఏకవాహినిగా ప్రవహించనీ.

ఇంటిపై మరులుగొని తమ పర్వతనికేతనాలకి రాంత్రిబవళ్ళు ఎగిరిపోయే కొంగలగుంపుమల్లే ఒక్క నమస్కారంలో నా జీవితం తన అంతరహిత నివాసానికి ప్రయాణం కానీ.


ఆషాఢ మేఘాన్ని చూడగానే మోహనిర్వేదాలు రెండూ ఒక్కసారిగా ముంచెత్తడమనేది ప్రాచీన తమిళ, ప్రాకృత, సంస్కృత కవులు సమంగా అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆ ముచ్చట్లు రేపణ్ణుంచి.

19-6-2023

11 Replies to “ఆషాఢ మేఘం-2”

  1. మేఘం అనే పదంలోనే భారం,భారం తగ్గిపోవడం కలిసి ఉంటాయనిపిస్తుంది మాష్టారు.మీ ఒకో అంకం ఎందరో ప్రాక్పశ్చిమ కవుల సమాహారం.నమస్సులు.

  2. “మెరుపు మెరిసిన చోట తెరిచి మూసిన తలుపు” అద్భుతం. ఇంతటి భావుకతని వొడిసి పట్టే పాట చిత్రీకరణ Neelavelicham అనే చిత్రం లో వుందండీ. మీరు వర్ణించినదానికి దగ్గరగా వుందో లేదో కాని.. లింక్ ఇస్తాను యూట్యూబ్ లో చూడండి. నా ఫ్రండ్, నేనూ వారం పాటు చెప్పుకున్నాం.

    https://youtu.be/GEZdORLd3aA

  3. కవితలు చదువుతుంటే ఆ మేఘాల సందడి సవ్వడి పెనగొని వచ్చినట్లుంది. కవుల భావోద్వేగం ఆ మేఘావృత గగన సౌందర్యం దృశ్యమానమౌతుంది.

  4. మీరు వర్ణించిన ఆ చిత్ర దృశ్యం అద్భుతం

    మీ కల

    నెరవేరితే మాకూ ఆనందం

  5. మేఘాల వర్ణల తో వాటిలో విహరింప చేసేరు.ధన్యవాదములు.

  6. ఈ ఇరవై వ్యాసాలూ ఈ వారాంతంలో చదవాలని గట్టి పట్టుదలతో కూర్చున్నాను.

    రెండు ప్రశ్నలు – బైరాగి ‘వర్షాయామిని’ని ఎవరైనా పాడారా? ఈ పాటలో మొదటి సగంలో మోహం ఉన్నది. చివరి రెండు చరణాలలోనేమో ఒక తాత్త్వికమైన తలపోత ఉన్నది. ఇట్లా ఏకసూత్రత లేకపోవటం నాకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. మంచి కవిత చదివిన అనుభూతిని ఇవ్వదు. ఇది నా తప్పే అయితే దాన్ని ఎలా అధిగమించాలి?

    1. కవిత, పాఠకుడూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం ఎవరి తప్పూ కాదు. బహుశా ఆ పాఠకుడు ఆ కవితను ఇంతకుముందు అయినా కలుసుకొని ఉండాలి. లేదా భవిష్యత్తులో మరోసారి కలుసుకోగలడేమో చూడాలి

  7. మేఘాన్ని చూడగానే భారతీయ కవికి ఏకకాలంలో ప్రేమా, దుఃఖమూ రెండూ కలుగుతాయి. వసంతాన్ని చూసినప్పుడు కలిగే భావనలు ప్రణయోద్దీపభావనలే తప్ప వాటిలో విషాదఛాయలుండవు

Leave a Reply

%d bloggers like this: