ఆషాఢమేఘం-1

మా చిన్నప్పుడు వెంకట రత్నం మాష్టారు మాన్ సూన్ గురించి భారతదేశపు ఆర్థికమంత్రి వెయ్యికళ్ళతో ఎదురుచూస్తాడు అని చెప్పేవారు. పెద్దయ్యాక, రైతులూ, ఆర్థికమంత్రీ మాత్రమే కాదు, అందరికన్నా ఎక్కువగా కవులు ఎదురుచూస్తారని తెలిసింది. ఈ ఏడాది ఎల్ నినో వల్ల ప్రతి ఒక్కరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.

గగనసీమలో మబ్బులు ఎలానూ కనిపించడం లేదు, కాని ఆషాఢ ప్రథమ దివసం వచ్చేసింది. కనీసం కావ్యాల్లోనైనా ఆషాఢమేఘాన్ని చూసుకుందామనిపించింది.

మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారిని నేను చివరి సారి కలిసినప్పుడు ఆయన చాలా పెద్ద అస్వస్థత నుంచి అప్పుడే కోలుకుంటూ ఉన్నారు. మేడమీద ఆయన గదిలో నాతో చాలాసేపు కవిత్వం గురించీ, కవుల గురించీ మాట్లాడుతున్నారు. నేనాయన్ను కలిసిన ప్రతిసారీ అడిగినట్టే అప్పుడు కూడా కాళిదాసు గురించే ఏదో ఒకటి అడుగుతూ ఉన్నాను. సంస్కృత, తెలుగు సాహిత్యాల్లో ఆయనకు ప్రీతిపాత్రుడు కాని కవి అంటూ ఎవరూ లేరు. కాని ఇష్టులైన వారందరిలో మరీ ఇష్టమైన వారి పట్ల మనం చూపించాలనుకునే గోప్యత అన్నిటికన్నా ముందే అందరికీ తెలిసిపోయినట్టుగా, కాళిదాస కవిత పట్ల తన జీవితకాల ప్రేమను ఆయన ఎంతగా దాచాలనుకున్నా అంతగానూ బయటపడుతూనే ఉండేది.

ఆ రోజు నేను కాళిదాసు ప్రస్తావన చేసినప్పుడు కూడా ఆయన ఎప్పటిలానే తన మనసుదోచుకుని తననిపట్టించుకోకుండా వెళ్ళిపోయిన మనస్విని గురించి ప్రతి ప్రేమికుడూ స్పందించినట్టే, ‘ఎందుకు పదే పదే కాళిదాసు అంటావు? ఆ పేరెత్తకు. ఇప్పుడు నా మనసంతా బసవేశ్వరుడు ఆక్రమించేసాడు. అధ్యైవ శివస్య భజనం, అధ్యైవ శివస్య స్మరణం’ అన్నారాయన. ‘అంటే, ఇప్పుడే, ఈ క్షణమే, శివుణ్ణి స్మరించు అంటున్నాడు. నేను ఎంత జీవితం వృథా చేసుకున్నాను. కాలమంతా గడిచిపోయింది. కనీసం ఇప్పుడన్నా శివుణ్ణి స్మరించనివ్వు’ అన్నారాయన.

ఆ మాటలు ఆయన ఎంత పవిత్రహృదయంతో పలికినప్పటికీ, ఆ మాటలతో ఆయన తన హృదయానికీ, నాకూ అడ్డంగా ఒక తెరవెయ్యడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ మాటల సందుల్లో ఆయన ప్రేమహృదయం లేతగా, తీయగా మూలుగుతూనేఉంది. తన కౌమారంలో, తన తొలియవ్వన దినాల్లో ఏ కాళిదాస కవిత పట్ల ఆయన  తొలిప్రేమకు లోనయ్యాడో ఆ తొలిప్రేమ జీర ఆయన్ని జీవితమంతా వీడదనీ ఆయనకీ తెలుసు. ఆ రహస్యం నాకు అవగతమవుతోందని కూడా ఆయనకు తెలుసు.

‘చూడు, ఈ ఫొటో’ అన్నారాయన. అక్కడ బల్లమీద ఉన్న ఒక ఫొటోను చూపిస్తూ. అది బహుశా ఏ ఆరేడేళ్ళ వయసులోనో తీసిన మాష్టారి పసితనపు ఫొటో. ‘ఈ ఫొటోను చూస్తూ ఉంటే కాలమహిమ నాకు బోధపడుతూ ఉంటుంది. వాడేనా వీడు? ఎక్కడికి పోయాడు వాడు? ఏమైపోయాడు?’ అన్నారాయన. అప్పుడు తన పక్కనున్న విభూతి డబ్బా తీసి నా చేతిలో కొంత విభూతి పెట్టారు. జీవితమంతా శివాంకితం చేసిన మహాప్రమథుడి చేతులనుండి అందిన ప్రసాదమది. అప్పుడు నెమ్మదిగా- ‘అన్నట్టు, ఆ మధ్య ఎవరో మా గురువుగారి మీద (అంటే విశ్వనాథ సత్యనారాయణగారన్నమాట) ఏదన్నా రాయమంటే ఒక పద్యం రాసాను. వింటావా?’ అని పక్కనున్న పుస్తకాలు వెతికారు. కొద్ది సేపు వెతికిన తరువాత ఒక చిన్న కాగితం తీసారు. పద్యమంటే నేను కనీసం ఒక ఖండకావ్యం అయి ఉంటుందనుకున్నాను. ఇంతా చేస్తే అవి మూడు చిన్న పద్యాలు. ఆయన ఆ కాగితాన్ని ఎప్పటిదో ఒక ప్రేమలేఖను పట్టుకున్నంత ప్రేమగా ఎత్తి పట్టుకుని ఆ పద్యాలు ఒక్కొక్కటే చదివారు.

యష్టి ఆలంబమై, తను యష్టి ఇట్టు
లనుపదంబును, పతయాళువయ్యి కూడ
నాకు నొక్కింత నీ గాలిసోక ఒడలు
జలదరించునదేమొ, ఆషాఢ జలద.

మిన్నుమన్నేకమై క్రమ్ముకున్న మొయలా
కన్నువిప్పిన తొలినాడు, కన్నుమూయ
నున్న ఈ తుదినేడును ఒక్కరీతి
కిక్కిరిసి ఉంటివి బ్రతుకెల్ల నీవె

నీ వచోభావనారేఖ నిబిడలీన
శైశవాది వయోదశా -జాగ్రదాది
సకలవృత్తి నభశ్చతుష్షష్టి తిరిగి
చేతనామాత్రముగ మిగిల్చినది నన్ను.

(చేతికి కర్ర అవసరమై, శరీరమనే కట్టె కూడా అడుగడుక్కీ రాలడానికి సిద్ధంగా ఉన్న ఆకులాగా ఉన్న ఈ రోజుల్లో కూడా, ఓ ఆషాఢ మేఘమా! నాకు నీ గాలి ఏ మాత్రం సోకినా ఇదేమిటి ఒళ్ళు జలదరిస్తోంది!

నింగీనేలా కూడా ఒకటే మబ్బు కమ్మిన ఆ తొలిరోజులనుండి, ఇప్పుడు నేను కన్నుమూయడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజులదాకా, నా బతుకంతా నువ్వే కిక్కిరిసిపోయి ఉన్నావు.

నీ మాటలు, నీ భావాలు వీటిపట్లనే లగ్నమైన చిన్న వయసునుంచీ, మెలకువలోనూ, తక్కిన అవస్థల్లోనూ, ఏ పనిచేస్తున్నా కూడా, అరవై నాలుగు వర్షాకాలాల నీ సాన్నిహిత్యం నన్ను స్పందించగల మనిషిగా మిగిల్చింది)

ఆ పద్యాల మధ్యలో ఆషాడ జలద అన్న మాట వినగానే నా ఒళ్ళు ఝల్లుమంది. ఏకకాలంలో ఆ మానవుడు నాకొక బాలుడిగా, యువకుడిగా, వృద్ధుడిగా కనిపించాడు. బసవేశ్వర వచనాలను స్మరిస్తూ శివవిభూతిని పంచుతున్నప్పుడు పూర్తిగా పండిపోయిన మనిషిగా కనిపించాడు. అదే సమయంలో టేబులు మీద తన పసితనపు ఫొటో పెట్టుకుని తదేకంగా చూసుకుంటున్నప్పుడు ఇంకా తన తల్లిదండ్రుల చాటున పెరుగుతున్న బాలుడిగా కనిపించాడు. కానీ ఆ పద్యాన్ని చదువుతున్నప్పుడు మాత్రం ఆయన నవయవ్వన ప్రేమభారాన్ని తట్టుకోలేకపోతున్న యువకుడిగా కనిపించాడు. నా కళ్ళ ఎదట ఒక్కసారిగా దర్శనమిచ్చిన ఆ అవస్థలన్నిటిలో ఏది ఆయన నిజావస్థ? అన్నీ నిజమే అనవచ్చుగానీ, అన్నిటికన్నా యథార్థమైన అవస్థ ఆయన యవ్వనావస్థ అని ఎందుకో నాకా క్షణాన్న బలంగా అనిపించింది.

ఆయన ఆ పద్యాల్ని నెమ్మదిగా ఒక్కొక్క పాదమే వినిపించి ముగిస్తూనే ‘ఈ పద్యంలో సత్యనారాయణ గారికొక్క నమస్కారం పెట్టేసాను. జీవితకాలం ఆయన్ని మోసిమోసి అలసిపోయాను. ఈ పద్యంతో ఆ బరువునుంచి బయటపడిపోయాను. నీకు తెలుసా? ఈ పద్యం రాయగానే, నా లోపల ఏళ్ళతరబడి పెరిగిపోయిన ఒక పెద్దమర్రిచెట్టుని కూకటివేళ్లతో పెకలించి పారేసినట్టుగా ఉంది. ఎంత రిలీఫ్ గా ఉందో చెప్పలేను’ అన్నారు.

నిజమేనా? అప్పటినుంచీ నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ పద్యాల్లో ఆయన నిజంగా ఉద్దేశిస్తున్నది విశ్వనాథను కానేకాదనిపించింది. ఆయన ఆ పద్యాల ద్వారా తనలోంచి పెరికి పారేయాలనుకున్నది తన రసైకవృత్తిని మాత్రమే. ఆయనలో ప్రవృత్తికి కాళిదాసకవితా, నివృత్తికి బసవేశ్వర కవితా ఆలంబనలనుకుంటే, నివృత్తిమార్గంలో ప్రయాణించే క్రమంలో అడుగడుగునా ఆయన రస హృదయం ఆయనకు అడ్డుపడుతూనే ఉంది. తన జీవితకాలాన్నంతటినీ ఏ కావ్యదేవీ ఉపాసనలో ఆయన కర్పూరంగా కరిగించి వేసాడో, ఆ రసోన్మత్తతకు ఆషాఢమేఘం ఒక ప్రతీక, ఒక చిహ్నం, ఒక స్ఫురణ. ఆ ఆషాఢమేఘం ఆయన్ని జీవితమంతా కిక్కిరిసి ఉందన్న మాట మాత్రం నిజంగా నిజం.

‘కన్నుమూయనున్న’ ఆ ‘తుదినేడు’ ఆయన దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసానని అంటుంటే నా ఆత్మ మందహాసం చేసింది. చెట్టుని వేళ్ళతో సహా పెకలించి వేసానంటున్న ఆ పదప్రయోగం కూడా రసోన్మత్త ప్రయోగమే. స్నేహితుడు వెళ్ళిపోయినప్పుడు ఒక వటవృక్షం వేళ్ళతో సహా కూలిపోయినంత శూన్యం ఆవరిస్తుందని ‘గాథాసప్తశతి’ (1-94) లో ఒక ప్రాకృత కవిత చెప్తుంది.

మాష్టారి అవస్థ భారతీయ కవుల అవస్థ అని బోధపడింది నాకు. అది రసహృదయులందరి అవస్థ. ఆ అవస్థను సంకేతపరిచగలిగే శాశ్వత ప్రతీకగా ఆషాఢమేఘం సాహిత్యాకాశాన్ని ఆవరించి నిలిచి ఉంది. ఆషాఢ మేఘం ఒక సూచన, ఒక ధ్వని. ఏకకాలంలో భూమీ, ఆకాశమూ కలుసుకునే చోటు అది. భావుకుడైన ప్రతి మానవుణ్ణీ ఈ ప్రపంచమూ, మరో ప్రపంచమూ రెండూ ఒక్కసారే పిలుస్తున్నప్పుడు అతడు లోనయ్యే ఉద్విగ్నతకు అద్దం పట్టే దృశ్యమది.

2008

23 Replies to “ఆషాఢమేఘం-1”

 1. ప్రతి పదం రస ప్లావితం.గురు పరంపరకు నీరాజనాలు 🙏🙏🙏

  1. భూగర్భ జలాలను తోడుకొని,తోడుకొని ,
   దొంగలించి ,దొంగలించిన నగర జనం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు నేడు
   ఇప్పటికైనా ఆషాఢ మేఘం కరుణించేనా !!

   కవి హృదయం కాదిది,

   వేసవి తాపం తో అల్లాడిపోతున్న మావంటి పాఠకులకు మీ అక్షరాల జల్లులు ఆషాఢ మేఘా ల పలకరింతలు.

 2. ” ప్రవృత్తికి కాళిదాసకవితా, నివృత్తికి బసవేశ్వర కవితా” జీవిత చరమాంకంలో ఉన్న గురువు గారిని దర్శించుకొని మీరు – మిమ్ములను చూసిన ఆయన ఒక అద్వైత అనుభవాన్ని పొందారు. గురువు గారి ద్వైత, అద్వైత భావాలను మీరు చక్కగా విశ్లేషించారు. ఏకరూపతను సాధించారు.

 3. ప్రవృత్తికి కాళిదాస కవితా, నివృత్తికి బసవేశ్వర కవితా.. ఆ విభూతి చిటెకుడు మాకూ దక్కింది. ధన్యవాదాలు🙏

 4. మీ ఒక్క వ్యాసం చదివితే పదిమంది కవులను చదివినట్టు . విశ్వనాథ కొందరిని ఎంతగా కమ్ముకుంటాడంటే అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి.ఆయన పేరు వింటే చాలు ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ అన్న వాక్యం కవ్వించినంతగా కవ్విస్తూంది.అలాగని నేను విశ్వనాథ ను చదివింది ఎక్కువకాదు. కల్పవృక్షపు నీడలోని కొన్ని గరిక పోచలే.ఆషాఢ మాసం ఆకాశం నిండా మబ్బులున్నా మన నిలుచున్న చోట కనిపించే చిరుగగనమే మనల్ని మురిపిస్తుంది. పై ఒక్క వాక్యం కాళిదాసు కావ్య పరిమళానుభూతికి మచ్చుగా నిలుస్తుంది.రసైక వృత్తిలో మీరు తరిస్తూ మమ్మల్ని తరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు.

  1. మాస్టారి కవిత, మీ వ్యాఖ్య అద్భుతం సర్..
   మీకు దక్కిన గురుఆశీర్వచన విభూతి..మాకూ పంచి.. మాతో మనో ఆషాఢ జలదోస్వాదన చేయించారు. ధన్యవాదములు.

 5. రసహృదయుల అవస్థ, ఆషాఢ మేఘపు ప్రతీక….అద్భుతంగా చెప్పారు సర్.
  చదువుతుంటే మనస్సెందుకో ఉక్కిరిబిక్కిరి
  అయిపోయినట్టనిపించింది.

 6. ప్రతి వాక్యం మనసు నిండా కమ్ముకొన్న ashaadha మేఘమే!

 7. “స్నేహితుడు వెళ్ళిపోయినప్పుడు ఒక వటవృక్షం వేళ్ళతో సహా కూలిపోయినంత శూన్యం ఆవరిస్తుంది…”

  నమస్కారాలు సర్

 8. ఆషాడ జలద పద ప్రయోగం ఎంత బాగుంది, మీరన్నది నిజమే ఒళ్ళు ఝల్లుమంది

 9. “మానవుణ్ణీ ఈ ప్రపంచమూ, మరో ప్రపంచమూ రెండూ ఒక్కసారే పిలుస్తున్నప్పుడు అతడు లోనయ్యే ఉద్విగ్నతకు అద్దం పట్టే దృశ్యమది.“
  🙏🏽

Leave a Reply

%d bloggers like this: