
(పెళ్ళిపత్రిక సెప్టెంబరు 2004 లో ప్రచురించిన నా రెండో వ్యాసాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. చలంగారు రాసిన ‘సుశీల’ కథ భావపరంగానే కాదు, శిల్పపరంగా కూడా ఒక ఆశ్చర్యం. ఇన్నేళ్ళ తరువాత ఈ వ్యాసం చదువుకుంటే నాకు బాగానే అనిపించింది. కానీ రెండు భావాలు మాత్రం బలంగా స్ఫురిస్తూ ఉన్నాయి. మొదటికి, కీర్క్ గార్డ్ Either/Or దృష్టిలో, existentialist దృక్పథంలోంచి ఈ కథని పరిశీలించాలనిపించింది. కీర్క్ గార్డ్ మాట్లాడిన aesthetic dimension, ethical dimension, ఆ రెండింటినీ దాటిన religious dimension లలో, చలంగారు ‘సుశీల’తో మొదలుపెట్టి ‘మార్తా’ దాకా ఎలా ప్రయాణించారో వివరంగా చూడాలనిపించింది. రెండవది, ఈ కథ ఒక బెర్గ్ మన్ కో, ఒక సత్యజిత్ రాయ్ కో తెలిసి ఉంటే, గొప్ప సినిమాగా మలిచి ఉండేవారు. తెలుగు దర్శకులమీదా, ప్రేక్షకుల మీదా నాకు అంత ఆశలేదుగాని, కనీసం ఒక స్క్రీన్ ప్లేగా లేదా నాటికగా ఈ కథని మలిస్తే ఎలా ఉంటుందో చూడాలని కూడా అనిపించింది.)
సుశీల చలంగారు రాసిన రెండవ కథ. 1922 లో వచ్చింది. అప్పటికింకా శరత్, ప్రేమ్ చంద్ లు రచయితలుగా పూర్తిగా పరిణతి చెందనే లేదు. తెలుగు కథ కూడా నెమ్మదిగా వికసిస్తోంది. చింతాదీక్షితులు గారు ప్రజాజీవితం వైపు, విస్మృత సమాజాల వైపు చూస్తున్నారు. ఇక రాజకీయంగా అది జాతీయోద్యమకాలపు అత్యుచ్చ దశ.
చలంగారి కథ కూడా ఆ రోజుల్నుంచే సరాసరి ప్రభవించింది. కథలో ఆ కాలాన్ని రచయిత నేరుగా నమోదుచేసాడు.
‘ఆ కాలంలో న్యూసుపేపర్లు చాలా హడావిడి చేస్తూ ఉండేవి. సత్యాగ్రహం, రౌలట్ ఆక్టు, ఇవన్నీ అయిపోయి పంజాబు కథల కాలం వస్తోంది. దేశమంతా అల్లకల్లోలమయ్యేటట్టు కనిపిస్తోంది.’
జాతీయోద్యమ నేపథ్యంలో అప్పటిదాకా వచ్చిన మహత్తరమైన రచన ‘ఘరే-బైరే’ (1919) నవల మాత్రమే. జాతీయోద్యమ ఆదర్శాల పట్ల టాగోర్ కి స్పష్టమైన అసంతృప్తి, అస్పష్టంగా అనేక అనుమానాలూ ఉన్నాయి. కవిగాని, రచయితనీ, నాయకుడు గాని పరిమిత దేశం గురించి, పరిమిత జాతీయ ప్రయోజనాల గురంచి మాట్లాడటంలో అనివార్యంగా సంకుచితత్వం వచ్చి చేరుతుందని ఆయన భావించాడు. ఆ మేరకు మహాత్ముడితో వాదనకు దిగాడు కూడా. కాని అందుకు ప్రత్యామ్నాయంగా టాగోర్ ప్రతిపాదించే అంతర్జాతీయ దృక్పథంలొ చాలావరకు ఆదర్శవాదమే కనిపిస్తుంది. ప్రపంచం ఒకటేనన్నది నిజమే గాని, ఆ ప్రపంచంలో వివిధ దేశాల మధ్య, జాతుల మధ్య అసమానతలు ఏర్పడినప్పుడు, వాటి మధ్య సౌభ్రాతృత్వం గురించి ఎలా ప్రతిపాదించడం? కానీ అటువంటి సౌభ్రాతృత్వాన్ని ప్రవచించడంలో టాగోర్ ఉద్దేశ్యం స్పష్టం. ఆయనిలా రాస్తున్నాడు:
‘ఏదో ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని సాధించుకోవడానికి తనని కుంచించుకోవడం ద్వారా బలాన్ని సముపార్జించాలని స్పార్టా ప్రయత్నించింది. కాని ఆ ప్రయత్నంలో నెగ్గలేకపోయింది. కాగా ఏథెన్సు తనని తాను పరిపూర్ణత్వపు దిశగా తెరుచుకోవడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో విజేత కాగలిగింది. మానవనాగరికతా విజయధ్వజం మీద ఆ పతాకమిప్పటికీ రెపరెపలాడుతున్నది. ..ఇప్పటి నుంచీ ఏ జాతి కానివ్వండి, దన దేశం గురించి సంకుచిత దృక్పథం ఏర్పరచుకున్నదా అది తన శాంతిని పోగొట్టుకుంటుంది. నవయుగ సంకేతాలకు అడ్డం తిరుగుతుంది. ఇప్పటినుంచీ ఏ జాతి కానివ్వండి, అది తన క్షేమం కోసమే మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని ఆలింగనం చేసుకోవలసి ఉంటుంది.’
కానీ, ఈ ఆదర్శవాదంలో పెద్ద లోపముంది. అది టాగోర్ అవగాహనకు అందలేదు. అదేమంటే జాతులు స్వయంగా వివేచనా శీలాలు కావు. దేశమంటే మట్టి కాదు, మనుషులు. ఆ జాతిలో మనుషులు వివేచనశీలురు కాకుండా, స్వేచ్ఛాపరులు కాకుండా, ఆ జాతులు విమోచనని పొందలేవు. 1921 లో తను ఈ మాటలు రాస్తున్నప్పుడు భారతదేశంలో టాగోర్ ఒక్కడు మాత్రమే ఉన్నాడని టాగోర్ గుర్తించలేదు. శతాబ్దాల బానిసత్వానికీ, అధికారానికీ, వ్యవస్థల పెత్తనానికీ తలవంచడానికి అలవాటు పడ్డ జాతితో తను మాట్లాడుతున్నానని టాగోర్ గుర్తించలేదు. కాని సరిగ్గా ఆ సమయంలోనే మహాత్ముడు మట్టినుంచి మనుషుల్ని నిర్మించే మహాప్రయత్నంలో ఉన్నాడు. ఆయన టాగోర్ కి ఇలా జవాబిచ్చాడు:
‘తన కవిత్వ స్వభావానికనుగుణంగానే కవి రేపటికోసం జీవిస్తూ, మనల్ని కూడా అలాగే జీవించమంటాడు. ప్రభాతగానం చేస్తూ పక్షులు గగనసీమలో ఎగురుతున్న అపురూప దృశ్యానికి మనల్ని కూడా మేల్కొల్పుతాడు. కాని ఆ పక్షులకి ముందు రాత్రి కడుపునిండి, రెక్కలకు విశ్రాంతి లభించి, రక్తనాళాల్లో బలం నింపుకున్నాకే మరుసటి ఉదయం పైకి ఎగరగలుగుతున్నాయి. కానీ భారతీయాకాశం కింద నేను చూస్తున్న పక్షులకి మనకి కనిపిస్తున్నపాటి బలం కూడా లేదు. అవి వివరించలేనంత దుర్బలం. అనుభవిస్తేనేగాని తెలిసేది కాదు. కుంగి కృశిస్తున్న రోగుల్ని కబీర్ దోహాతో ఓదార్చలేనని నేను తెలుసుకున్నాను. ఆకలిగొన్న లక్షలాదిమంది ప్రజలు కోరుకుంటున్న ప్రార్థన ఒక్కటే-బలవర్థకమైన ఆహారం. అది ఒకరిస్తే లభించేది కాదు, ఎవరికి వారు చెమటోడ్చి సాధించుకోవలసిందే.‘
ఇక్కడ ఎవరికి వారు చెమటోడ్చి సాధించుకోవలసిందిగా గాంధీకి అభివర్ణించింది కేవలం ఆహారానికి మాత్రమే కాదు, స్వీయ స్వాతంత్య్రానికి కూడా వర్తిస్తుంది. ‘ఎవరికి వారు’ అన్న పదం సూచిస్తున్నదిదే. మహాకవి టాగోర్ కూడా స్వాతంత్య్రాన్ని సూచిస్తున్నప్పటికీ, అది ఆయన నుంచి మనుషులకు లభిస్తున్న మేలుకొలుపు. కానీ గాంధీజీ ఆశించింది ఎవరికి వారై పొందగలిగిన మెలకువ.
సహాయనిరాకరణోద్యమం నాటి ఈ సంవాదానికి రక్తమాంసాలిచ్చిన కథ ‘సుశీల’. టాగోర్ ఒక జాతికీ, గాంధీజీ ఒక వ్యక్తికీ ఏది సాధ్యం కావాలని ఆశించారో, దాన్ని చలం దాంపత్యజీవితానికీ, కుటుంబానికీ అన్వయించి చూపాడు. ఆ విధంగా చూస్తే సుశీల కథని స్వాతంత్య్రం అనే భావనతో చలం చేపట్టిన ప్రయోగంగా అభివర్ణించవచ్చు.
కథ చాలా సరళం. నారాయణప్ప జాతీయవాది. సుశీల ఆయన భార్య. భావుకురాలు. ‘నారాయణప్పగారు భార్య ఆత్మని చంపి తన వశం చేసుకుని, తనకు నీడ చేసుకుని, తన ఊహలే ఆమె తల్లోపెట్టి ఆమె నోట రప్పించి, మేమిద్దరం ఒకటయిపోయినామనే రకం కాదు.’ కానీ సమస్య అదే. అక్కడ సుశీలకి స్వాతంత్య్రం తన స్వార్జితం కాదు. అది ఒక జాతీయవాది హృదయవైశాల్యం వల్ల ఆమెకి ప్రాప్తించింది. ‘పది సంవత్సరాలు నారాయణప్పగారితో కాపరం చేసిన తరవాత సుశీలకి ఇంకొక పురుషుడి మీద ప్రేమ కల్గింది.’ అతడు సులేమాన్. పోలీసు సూపరెండెంటు. ‘భర్త మీద ఇప్పటికీ ప్రేమ ఉంది. అయినా ఈ కొత్త ప్రేమ ఆమెను పూర్తిగా స్వాధీనం చేసుకుంది.’ ఇక్కడ చలం ఇలా అంటాడు:
‘కొందరు స్త్రీలు వారినెవరికి పెళ్ళిచేస్తే వారిని వెంటనే ప్రేమిస్తారు. ప్రేమించినట్టే ఉంటారు. ప్రేమించామనే వారూ అనుకుంటారు. దాంట్లో యేమీ మోసం లేదు. చాల నమ్మకస్తులు. కానీ ఎప్పుడో వొకప్పుడు యెవరో కొత్తవారిమీద నిలపరాని ప్రేమ కలుగుతుంది వారికి. వారి హృదయాలు యెవరికోసం చెయ్యబడ్డాయో, అటువంటి వారిని కలుసుకుంటారు. అప్పుడు ఆ మహాగ్నిలో ఈ పూర్వపు ప్రేమనీతి, విశ్వాసమూ అన్నీ దగ్ధమవుతాయి. యెవరూ ఆపలేరు. కొన్ని బైటకి వస్తాయి. కొన్ని ఒకరిద్దరికి తెలిసి ఆగుతాయి. కొన్ని బైటికి రానేరావు.’
మళ్ళా కథ ముందుకు నడుస్తుంది. ‘త్వరలోనే నారాయణప్పగారికి అనుమానం తట్టడం మొదలుపెట్టింది. వాళ్లమొహాలే చెప్పాయి అతనికి. కాని అతను చూడదలచుకోలా. ఆరితేరిన దొంగలూ, మొనగాళ్ళూ తప్పు చేసి దాచుకోగలరు. కానీ నిర్మల స్వభావులు దాచలేరు. అందులో సులేమాన్ దాచడానికి కూడా ప్రయత్నించడు. ఒకరిద్దరు నారాయణప్పగారితో కొంచెంగా సూచించారు. అయినా ఆయనకి నిశ్చయం లేదు. సాధారణమైన భర్త వలే దాక్కుని దొంగవేషాలు వేసి వాళ్ళిద్దరినీ కలిపి ఏం చేస్తారో చూసి సాధించే రకం కాదు.’
కాని అక్కడే కథ మలుపులు తిరిగింది. ఇంతలో దేశాన్నంతా ఊపేసే నాన్ కోపరేషన్ ఉద్యమం వచ్చింది. నారాయణప్పగారు దేశం కోసం ముందుకు దూకి ఖైదుకు గురయ్యాడు. సులేమాన్ పట్ల ప్రేమలో చిక్కుకుపోయినప్పటికీ ఆ ఉద్యమం సుశీలను కూడా ప్రభావితం చేసింది. ఆమె కూడా ఉద్యమ కార్యకర్తగా మారింది. సులేమాన్ కి అది నచ్చలేదు. ‘స్వరాజ్యం పని ఇంక మానెయ్యి’ అన్నాడు.
కథలోని గొప్ప వ్యంగ్యమంతా ఇక్కడే ఉంది. నారాయణప్పగారికీ, సుశీలకీ మధ్య వివాహానుబంధం మాత్రమే ఉండి ఉండవచ్చు. అది వారిరువురి హృదయాల్నీ దహించివేసేటంత ప్రేమగా పరిణమించి ఉండకపోవచ్చు. కానీ నారాయణప్పగారు సుశీలను సులేమాన్ ప్రేమనుంచి బయటపడమని ఎన్నడూ అనలేదు. ఒక జాతీయవాదిగా ఆయనకు వ్యక్తి స్వాతంత్య్రపు విలువ తెలుసు. దాన్ని మన్నించాడు. ఆరాధనీయమైన ప్రేమతో సుశీలకు జీవితకాలపు ఆనందానికి తలుపులు తెరిచినప్పటికీ సులేమాన్ ఆమెని శాసించే ప్రయత్నం చేసాడు. ఆమెని స్వాతంత్య్ర కార్యకర్తగా జీవించవద్దన్నాడు. అతడు ప్రేమికుడే అయినప్పటికీ, ఆ ప్రేమ ఎదుటి మనిషి స్వాతంత్య్రాన్ని నిలబెట్టే ప్రేమ కాదు. అది తననీ, ఎదుటిమనిషినీ కూడా నిరర్థకంగా దహించాలని చూసే ప్రేమ. ఈ ప్రేమ కొత్త ఇంద్రియాల్నిచ్చినప్పటికీ, ఆత్మ స్వాతంత్య్రాన్ని పూర్తిగా హరించే ప్రేమ. అది ఏ మేరకో సుశీలకు బోధపడింది. ఆమె అతనితో అన్నది:
‘సులేమాన్! దేశంలోంచి వుద్యమం పోతే పోవచ్చుగాని, నా వూహలు, నా వాంఛలు, నా బతుకు అనీ మారిపోయినాయి. ఇది వరకటి మనిషిని కాదు. ఈ ఉద్యమం, ఈ త్యాగం అంతా వృథా కావచ్చు. దేశంలో ఏమీ ఉపయోగం లేకపోవచ్చు. కాని ఒక జీవితానికన్నా గొప్ప ఉపకారం చేసింది. కొత్త ఆదర్శాన్నీ, ఆనందాన్నీ, ఆసక్తినీ ఇచ్చింది.’
ఆమె ఇంకా ఇలా అంది:
‘సులేమాన్! ఒక మాట చెపుతా. నీకు కోపం రాకూడదు. ఏమీ దాస్తున్నానుకోకు. నన్ను ప్రేమిస్తున్నానంటావా, నా హృదయాన్ని అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలి నీకా ప్రేమ. లేకపోతే వృథానే.’
కానీ తనకింకా సులేమాన్ మీద నిలవనివ్వని ప్రేమ నిలిచే ఉందని ఆమె గుర్తిస్తూంది. ఇంతలో నారాయణప్పగారు జైలునుంచి విడుదలై వచ్చారు. కారాగార వాసం ఆయన ఆరోగ్యాన్ని శిథిలం చేసేసింది. ఆయన్ని కనిపెట్టుకుని ఉండటం, సపర్య చేయడం తన ప్రధాన కర్తవ్యంగా తోచింది సుశీలకు. ఆమె సులేమాన్ ని వదిలిపెట్టి నారాయణప్పగారిని తీసుకుని మదనపల్లి వెళ్ళిపోయింది. సులేమాన్ ఆమెని వదల్లేదు. తను కూడా ఆమెని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ చలం గొప్ప సన్నివేశం కల్పించాడు. మంచానికి అతుక్కుపోయిన రోగిష్టి నారాయణప్ప, పక్కన సుశీల, ఆమెవెంట సులేమాన్.
‘ఆమెని చూసేటప్పటికి అతని కాళ్ళు వొణికాయి. కళ్ళవెంబడి నీళ్ళొచ్చాయి. ప్రేమంతా వొక్కసారి తిరగపెట్టింది. అట్లానే నించుండిపోయినాడు. నారాయణప్పగారు కొంచెంగా కదిలారు. సుశీల పుస్తకమక్కడ పెట్టి లేచి దగ్గరికి వెళ్ళి దిళ్ళు సరిగా పెట్టింది. రోగంతో బాధపడుతున్న చంటిపిల్లని అత్యంత ప్రేమగల తల్లి కూడా అంత శ్రద్ధతో చూసి ఉండదు. ఆమె కళ్ళల్లోంచి ప్రేమా, దయా వొలికిపోతున్నాయి. సులేమాన్ కి సిగ్గేసింది. వెనకాలకి తిరిగిపోవాలనిపించింది. అంతా వ్యర్థమనిపించింది.’
అయినా వెళ్ళలేక అడిగాడొక ప్రశ్నని:
‘యేం నా మీద ప్రేమ లేదూ?’
దానికి సుశీల ఇచ్చిన జవాబులో గొప్ప ఉద్వేగముంది. ఆమె అంది:
‘ఉంది. చాలా ఉంది. కాని ఆయన మీద అపరిమితమైన ప్రేమ వచ్చింది. యేదో జాలి కాదు. నిజంగా ప్రేమ. అట్లాచూస్తావేం? ఆశ్చర్యంగా వుందా? ఆ బొమికల కుప్ప మీద ప్రేమ ఏమిటనిపిస్తోందా నీకు. అవును. అట్లాంటి ప్రేమ కాదు. నీ మీది ప్రేమరకం కాదు. ఆ పాదాల దుమ్ము, నెత్తిన వేసుకోడానికి తగననే భక్తితో కూడిన ప్రేమ, నా దేశం కోసం, నా ప్రజల కోసం అట్లా అయినారు. తన ఆరోగ్యాన్నర్పించారు. వ్యర్థమయినదానికి, ఏ మాత్రమూ జయము ఆశలేనిదానికోసం అంత త్యాగం చేసారు. ఆ మహాగౌరవంతో నా ఆత్మే ఆయనదయింది. ఈ శరీరం, ఈ మనస్సు, శక్తి అన్నీ ఆయనవే. వాటిల్లో ఇంకొకళ్లకి భాగం ఇవ్వడానికి వీల్లేదు. నీకు కూడా. క్షమించు. మనమిద్దరం కూడా ఆ కాళ్ళని తలమీద ఆనించుకోడానికి పనికిరాము.’
అక్కడితో సులేమాన్ ఆమె జీవితం నుంచి నిష్క్రమిస్తాడు. సుశీల మంచం దగ్గర కుర్చీలో చప్పుడు కాకుండా ఏడుస్తోంది. వెనకాల వీపు మీద నారాయణప్పగారు చెయ్యేశారు. ఆయనప్పుడు అన్నాడు కదా!:
‘సుశీలా, చూస్తూనే ఉన్నా. యెట్లా ఉంటావు? వెళ్ళు. నీకానందం అక్కర్లేదూ?’
అప్పుడు వారినడుమ సంభాషణలో చివరి మాటలు ఇలా ఉన్నాయి:
‘నా కోసము నాకేమీ దిగులు లేదు. నేను పవిత్రురాలినై మీ సేవ చెయ్యడానికి తగి ఉంటే ఎంత బాగుండేది అన్న దిగులు తప్ప యింకేమీ లేదు..’
‘నిజం?’
‘నిజం. నేను జరిగిందానికి యేడ్చాను. అంతే.’
ఒక కోణంలో చూస్తే, అంటే, పైపైన చూసినట్టయితే, ఈ కథ సాధారణమైన ప్రేమకీ, కర్తవ్యానికీ మధ్య సంఘర్షణగా, మోహానికీ, త్యాగానికీ మధ్య సంఘర్షణగా తోచవచ్చు. కాని అదే ఈ కథ స్థాయి అయి ఉన్నట్లయితే, చర్చించడానికేమీ లేదన్నట్లే. ఇదొక సాధారణమైన సెంటిమెంటల్ రచనగా మిగిలిపోయి ఉందేది. కానీ నిశితంగా చదివినప్పుడు, ముఖ్యంగా ఇది చలంగారి రచన అన్న స్పృహతో చదివినప్పుడు మనకి కొన్ని గాఢమైన ఆలోచనలు కలిగితీరతాయి.
ఇక్కడ సుశీల చివరివరకు కూడ సులేమాన్ పట్ల ప్రేమ నశించిందని చెప్పలేదు. అలాగే నారాయణప్ప పట్ల అద్వితీయమైన మోహావేశం కలిగిందని కూడా అనలేదు. నారాయణప్ప పట్ల కూడా సుశీలకు ప్రేమ కలిగింది. పెళ్ళయిన పదేళ్ళ తరువాత, సులేమాన్ పట్ల కలిగినట్టే. సహాయనిరాకరణ ఉద్యమం తరువాత నారాయణప్ప మీద కూడా ఆమెకి ప్రేమ కలిగింది. ఇక్కడ ఆమె జీవితంలో మూడు దశలున్నాయి. పెళ్ళి జరిగినప్పుడు, పెళ్ళయిన పదేళ్ళ తరువాత, ఆ తరువాత. మూడు దశల్లోనూ ఆమె జీవితానికొక విస్తరణ లభించింది. ఆ విస్తరణకు కారకులైనవారి పట్ల ఆమెకి ప్రేమ కలిగింది. ఇందులో మూడు దశల్లోనూ సంభవించిన ప్రేమ స్వరూపం దేనికదే. ముఖ్యంగా సులేమాన్ పట్ల కలిగింది ప్రేమ అనీ, నారాయణప్ప పట్ల తోచింది కర్తవ్యమనీ అనలేం. రెండూ ప్రేమలే. రెండు స్థాయిల్లో కలిగిన ప్రేమానుభవాలు. సులేమాన్ తో కలిగిన ప్రేమానుభవం టాగోర్ మాటల్లో చెప్పాలంటే గ్రీకు నగరం స్పార్టా అభిలాషలాంటిది. అది సంకుచితం. వారిద్దరికే పరిమితం. నిజానికి అక్కడ ఇద్దరికి కూడా చోటు లేదు. అది ఇద్దరు ఒకరిగా మారి, చివరికి ఏ ఒక్కరూ మిగలని బాధానుభవం. నారాయణప్పతో ఆమెకి ఆ తరువాత సంభవించింది ఏథెన్సు నగరానికి సంభవించినటువంటిది. అది ప్రేమ తాలూకు అత్యున్నత స్థాయి. అక్కడ ఉన్న ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా తన తోటిమనిషి అస్తిత్వాన్ని ఆవరించేయాలన్న ఆతృత లేదు. ఎవరి ప్రత్యేక స్థలాన్ని వారు నిలబెట్టుకుంటూ ఎదటివారికి కొంత చోటు వదిలిపెడుతూ ఒకరికొకరు ఆసరాగా నిలిచే సహానుభవం.
దాంపత్య జీవితపు యథార్థ ఆదర్శాన్నే చలంగారు ఈ కథలో ఎంతో విశ్వసనీయంగా, మనల్ను ఒప్పించే విధంగా మలిచారు. ఇద్దరు స్త్రీ పురుషులు కేవలం దంపతులైనంతమాత్రాన వారి మధ్య ఎకాయెకి ప్రేమ సంభవించాలని లేదు. అటువంటి దాంపత్యం ఒక బాహ్య అమరిక మాత్రమే. కానీ నిజమైన స్వాతంత్య్రాన్ని పొందిన మనుషులు మాత్రమే నిజమైన దాంపత్యాన్ని నిర్మిచుకోగలుగుతారు. అప్పుడది ఏ ఆటుపోట్లకూ కూలని నిర్మాణంగా నిలబడగలుగుతుంది. ఇటువంటి మానసిక స్వాతంత్య్రాన్ని సాధించడమే ఏ రాజకీయ స్వాతంత్య్రోద్యమానికైనా లక్ష్యంగా ఉండాలని కూడా ఈ కథ కాలానికి దివిటీపట్టి మరీ చూపిస్తోంది.
Featured image : Detail from Two Figures by Tagore
17-6-2023
వ్యష్టి స్వాతంత్య్రం – సమష్టి స్వాతంత్య్రం రెండిటినీ సమాంతర రేఖలు గా , వాటి వికాస స్వభావాలను సమగ్రంగా చూపించారు చలం.
సంస్కారపు అత్యున్నత స్థాయి నారాయణప్ప గారిలో చూడవచ్చు. మీరన్నట్లు సత్యజిత్ రే చేతి లో ఈ కథ పడితే కళాఖండం అయ్యేది.
సుశీల తన భావోద్వేగాలను యే మాత్రం అనచుకోకుండ ప్రవర్తించిన తీరు చలం గారు చెప్పినట్లు అంగీకరించ వలసిన సత్యం.
సుశీల పట్ల సహనుభూతిని నారాయనప్పగారు, సులేమాన్ లు మహత్తరంగా చూపారు.
మంచి కథను చక్కగా విశ్లేషించారు, ధన్యవాదాలు సారు.
ధన్యవాదాలు సార్
సుశీల కథ. … తను చెప్పిన కథ… తనని ప్రేమించి.. తనలో చిక్కుకు పోవాలి అనిపిస్తుంది… ప్రేమ మరింత చేరువైనట్టు…
ఎన్ని భావాలు అందిస్తుంది మదినిండా…
ఇలా చదివినపుడు ఎందుకో జీవితం కొత్తగా కనిపిస్తుంది
Thank you…
ధన్యవాదాలు మేడం
మీ విశ్లేషణతో కథ అనూహ్యమైన స్థాయికి చేరింది. వంద సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప కథ రాసిన చలం అభినందనీయుడు. అందుకే ఆయన తెలుగు సాహిత్య బృందావనంలో వెలుగు స్థూపంగా ఉన్నారు.చాలా మంది మనసుల్లో ఎన్నో విపరీతమైన ఆలోచనలున్నా , కలిగినా సమాజానికో సంస్కారానికో భయపడి మాత్రమే అణచుకోవడమో చాటుగా తీర్చుకోవడమో చేస్తారన్న వాస్తవం గ్రహించగలిగితే ఆందోళనలు లేని స్థితి కలుగుతుంది. ఏది ఏమైనా రవీంద్రుని విశ్వాదర్శం, గాంధీజీ స్థానికాదర్శం కథకు సహసంబంధం చేసి ఒక నైరూప్య చిత్రాన్ని చూపించారు. అభినందనలు.
మీ సమగ్ర స్పందనకు ధన్యవాదాలు సార్
కథ చదువుతుంటే సహజంగా మనకి కలిగే స్పృహ సరయినదా?ఫలానా రచయిత అన్న ఎరుకతో కలిగే స్పృహ సరయినదా….
సుశీల సులేమాన్ మీది ఆకర్షణని సంఘంకోసమో,ఒక కట్టుబాటు కోసమో నియంత్రించుకోగలిగి వుంటే తర్వాత నారాయణప్పగారి విషయంలో కంటతడి పెట్టుకునే అగత్యం వచ్చివుండేది కాదేమో.
నారాయణప్పగారి పాత్ర అద్భుతంగా అనిపించింది.
టాగూర్,గాంధీ గార్ల దృక్పథంలో స్వేచ్ఛకి వున్న భేదాన్ని మీరు విశ్లేషించిన తీరు విఙ్ఞానదాయకంగా వుంది.
ఏ కథ అయినా రచయిత పేరుతో నిమిత్తం లేకుండా మనకు ఆహ్లాదం కలిగిస్తుంది. అయితే ఆహ్లాదాన్ని దాటిన సందేశం ఏదైనా ఉందా, చర్చ ఏదైనా ఉందా అని రెండోసారి పరిశీలించవలసి వచ్చినప్పుడు అది ఏ రచయితది అన్న స్పృహ తప్పకుండా ఆ కథకి కొత్త పార్శ్వాలని జోడిస్తుంది.
మీదైన పరిశీలన ఎప్పుడూ కొత్తగా, సర్వ జన ఆమోదయోగ్యం గా వుంటుంది sir
ఇదీ అంతే
సుశీల అనే వాహిక ద్వారా మీరు చర్చించిన విషయాలు ఏ కథనైనా కొత్తగా చదివేందుకు , లోలోతుల్ని అర్థం చేసుకునేందుకు మాకు ఉపకరిస్తాయి
ధన్యవాదములు మీకు
ధన్యవాదాలు మేడం
ఈ మధ్య కొందరు నారాయణప్ప తెలివైనమోసగాడని సుశీలని సులేమాన్ నుంచి తెలివిగా విడదీసాడని రాశారు. మరొకరు వంత పాడారు. పాపం వారికి ప్రపంచమంతా మోసపూరితంగానే కనిమపిస్తుందేమో అనిపించింది నేను హేతుబద్దంగా వివరించినా వారు నారాయణప్ప మీద కచ్చ తోనే ఉండిపోయారు.
సాహిత్యం-కథ గాని, కవిత్వం గాని ప్రధానంగా రచయిత మీద నమ్మకం పెట్టుకుని చదవాలి. అప్పుడు కథ ప్రసన్నమవుతుంది.
ఒకటికిరెండుమార్లు చదివాను ఉదయంనుండి మీ బ్లాగ్ అలా డెస్క్ టాప్ పై నన్ను చూస్తూనే ఉంది గొప్పగా విశ్లేషించారు నిజానికి కథ ఆత్మను ఆవిష్కరించారు అంటే సరిగ్గా సరిపోతుందేమో
ధన్యవాదాలు సార్
నమస్తె! మీ విశ్లేషణ national, International and universal Sir!
ధన్యవాదాలు మేడం
ఒకానొక దశలో,కొన్ని బలహీనమైన క్షణాలలో స్త్రీ పురుషులు ఒకరి ఆకర్షణకు ఒకరు లోనుకావడం
అసహజమేమీ కాదు.
ఆయా పరిస్థితులను బట్టి ఆయా ఆకర్షణలకు
సమాజం లో అంగీకారమో,అనంగీకారమో లభిస్తుంది.
గ్రామీణుల సాంఘిక జీవితాన్ని అతి దగ్గరగా చూసిన నాకు ఇది అంత వింతగానో, కొత్తగానో,రోత గానో అనిపించదు. మానసిక స్వాతంత్ర్యం అక్కడ ఎక్కువ.
ఎటు పోయి మధ్యతరగతి మానవ సాంఘిక జీవనం లోనే ఎన్నో కట్టుబాట్లు,సంప్రదాయాలు.
ఆకర్షణలకు లోను కావడం ఎంత సులభంగా జరుగుతుందో ఆయా సమాజాలలో వికర్షణలకు
అంతే సులభంగా తావు దొరుకుతుంది.
అందుకే గ్రామీణుల జీవితాల్లో విడాకులు ఎక్కువే,మనువాడటం (మళ్లీ పెళ్లి) కూడా ఎక్కువే.
స్వేచ్ఛా విషయం లో ఠాగూర్,గాంధీజీ లదృక్పథాలలో ఉన్న తేడాలను చాలా బాగా విశ్లేషించారు.
శీల రక్షణ కోసం భర్తను హతమార్చిన వారు ఉన్నారు.
భర్త ప్రాణ రక్షణ కోసం శీలాన్ని ఫణంగా పెట్టిన వారూ ఉన్నారు.
ఏదీ న్యాయం? ఏది ధర్మం?
ప్రస్తుత పరిస్థితుల్లో సుశీల లాంటి వారు కోకొల్లలు.
ఒక్కొక్కరు నాల్గు,నాల్గు పెళ్లిళ్ల తో
నవనలాడుతూ..
స్వంత బిడ్డలే తల్లికో ,తండ్రి కో మళ్ళీ పెళ్ళి జరిపే
కాలాన్ని చూస్తున్నాము.
ఏ కాలానికాధర్మం.
మీ స్పందనకు ధన్యవాదాలు మాస్టారూ!