ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును

(ఇరవై ఏళ్ల కిందటి మాట. మిత్రుడు ఎస్.వి.కృష్ణమోహన్ ‘పెళ్లి పత్రిక’ అనే మ్యాట్రిమోనియల్ పత్రిక కోసం ఒక కాలం రాయమని అడిగితే ఆధునిక తెలుగు సాహిత్యంలో వివాహం అనే అంశం మీద ఒక సిరీస్ రాయాలనుకుని రెండు వ్యాసాలు మాత్రమే రాయగలిగాను. అందులో మొదటి వ్యాసం గురజాడ అప్పారావు గారి ‘కాసులు’ కవిత పైన రాసాను. జూలై 2004 పత్రికలో ప్రచురించిన ఆ వ్యాసం నా సాహిత్య విమర్శ సంపుటాలు వేటి లోనూ రాలేదు. అందుకని ఇక్కడ మీకోసం అందిస్తున్నాను.)


ఒక్కొక్క సాహిత్యం ఒక్కొక్క సమస్యని ప్రధానంగా చర్చిస్తూ ఉంటుంది. అది ఆ జాతి లక్షణం మీదా  దాని సామాజిక అవసరం మీదా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి పందొమ్మిదో శతాబ్ది రష్యన్ సాహిత్యాన్ని చూసినట్లయితే మహారచయితలు టాల్ స్టాయి, చెకోవ్, తుర్జనీవ్, గొగోల్, డాస్టవస్కీ వంటి వారు తమ ప్రసిద్ధ రచనల్లో ప్రధానంగా ‘సొంత ఆస్తి’ అన్న అంశం మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు గమనిస్తాం. అప్పటి తమ సమాజంలో భరించలేనంత పేదరికం ఒక వైపు తాండవిస్తూండగా మరొక వైపు కొందరు వ్యక్తులు తమకంటూ వ్యక్తిగత ఆస్తిని సమకూర్చుకోవడం, దాన్ని రక్షించుకోవడానికే ప్రయత్నించడాన్ని వారు ఆమోదించలేకపోయారు. అసలు ఒక మనిషి తన అవసరాలకు మించి ఆస్తినంటూ కూడబెట్టు కోవడమనేదానిలో ఎటువంటి నైతికతని, ఆధ్యాత్మికతని, మానవత్వాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఆ కాలపు ఏ రష్యన్ నవలని చదివినా, ఏ రష్యన్ కథని చదివినా, సొంత ఆస్తి పట్ల రష్యన్ రచయితల ఆగ్రహం మనకి స్పష్టంగా కనిపిస్తూంటుంది. అటువంటి ప్రధాన ఇతివృత్తమేదన్నా ఇరవయ్యవ శతాబ్ది తెలుగు వచనసాహిత్యానికి ఉండవచ్చునా అని ఆలోచించినప్పుడు వివాహం, వైవాహిక సంబంధాలు ఆధునిక తెలుగు సాహిత్యకారుల దృష్టిని మొదటినుంచీ పట్టుకుని వున్నాయనిపించింది.

గురజాడనుంచి ఇప్పటి స్త్రీవాద రచయితల దాకా తెలుగు కథకులు, నవలాకారులు, సామాజిక ఉద్యమకారులు వివాహవ్యవస్థ గురించీ, వైవాహిక నీతి, సంబంధాలు, దాంపత్య వైఫల్యాలు, ఆదర్శ, అన్యోన్య సహజీవనాల గురించే ముఖ్యంగా మాట్లాడుతున్నారనిపించింది. అలాగని వారు వివిధ రకాల సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యల గురించి ఆలోచించలేదనికాదు. కాని ఆయా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వారి ప్రశ్నలు, పరిష్కారాలు స్త్రీ పురుష సఖ్యతా, సమన్వయాల దగ్గరకే వచ్చి ఆగడం మనం చూడకపోం. వాళ్ళ ఆలోచన బహుశా ఇలా ఉండి ఉండవచ్చు:

‘ఏ రాజకీయవిమోచనోద్యమమయినా, ఏ ఆర్థిక స్వాతంత్య్రమైనా చివరికి మనుషుల సహజీవనానికి దోహదపడేదే కావాలి కదా. అటువంటి సహజీవనానికి అతి ప్రాథమిక ప్రాతిపదికగా కుటుంబాన్ని గనక మనం భావిస్తే ఆయా ఉద్యమాలు విఫలమయినప్పుడో, సఫలమయినప్పుడో కుటుంబాలు ఎలా ఉండబోతున్నాయి? మనుషులు తాము మాట్లాడే సహజీవన ఆదర్శాల్ని తమ కుటుంబాల్లో ఏ విధంగా ఆచరించబోతున్నారు? ఒకవేళ వాళ్ళు తమ తమ కుటుంబజీవితాల్లో తమ ఆదర్శాల్ని ఆచరణ సాధ్యం చేసుకోలేకపోతే, ఆ అదర్శాల్ని బహిరంగ జీవితంలో వల్లించి మాత్రం ఏమిటి ప్రయోజనం? అటువంటి ఆదర్శాలకోసం విలువైన పోరాటాలూ, త్యాగాలూ చేసి మాత్రం ఏమిటి ప్రయోజనం? అసలు కుటుంబం ఒక మానవసాంఘిక వ్యవస్థగా అటువంటి సహజీవనాన్ని అనుమతిస్తుందా లేక నిరోధిస్తుందా? అసలు మానవపురోగతికి కుటుంబం అవసరముందా లేదా? లేదా కుటుంబం అంటే మన అవగాహనకే పరిమితులున్నాయా? ఇప్పుడు మనం చూస్తున్న రీతిలో, మనం గ్రహిస్తున్న రూపంలో, కుటుంబం నిజమైన కుటుంబం కాదా? అసలు ఆదర్శకుటుంబం అంటూ ఉంటుందా? కుటుంబమంటేనే ఏమిటో మనం నిర్ధారణకు రాకుండా వసుధైక కుటుంబం గురించి ఎలా మాట్లాడగలం?’

ఈ రీతిలో తెలుగు సాహిత్యకారులు తమ సాహిత్యాల్లో దాంపత్యం గురించీ, కుటుంబం గురించీ లోతైన చర్చను కొనసాగించారు. ఆ చర్చకి నమూనాలనదగ్గ కొన్ని సాహిత్య కృతుల్నీ, ఆయా రచనల్లో వాళ్ళు లేవనెత్తిన కీలకప్రశ్నల్నీ వరసగా ఇక్కడ పరిచయం చేసుకుందాం.

మొదట గురజాడ అప్పారావు.

గురజాడ (1862-1915) ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. ఆయన తరువాత తెలుగు సాహిత్యం విస్తృతంగా చర్చించిన ఎన్నో అంశాలకు నాందీ ప్రస్తావన గురజాడదే. అన్ని అంశాల్లోనూ ఆయన ప్రధానంగా వైవాహిక వ్యవస్థమీదనే ఎక్కువ దృష్టిపెట్టి వివాహం, దాంపత్యం, దాని అనుబంధ అంశాల మీదనే చాలా స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఆధునిక తెలుగు సాహిత్యం వైవాహిక సంబంధాలనే ప్రధానంగా చర్చించడానికి కీలక నిర్ణయం గురజాడ నుంచే వచ్చిందనాలి.

ఆయన సుప్రసిద్ధ రచన ‘కన్యాశుల్కం’ (1892-1909) లో  వివాహవ్యవస్థపైన  చేసిన విమర్శలకూ, అదే సందర్భంలో వివాహ వ్యవస్థ పట్లా, ఆదర్శదాంపత్యం పట్లా ఆయన దాచుకోలేని మక్కువకూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అయితే, వీరేశలింగం గారినుండి గురజాడ కాలం దాకా కూడా వివాహ వ్యవస్థలోని ప్రధానలోపాలకు కారణం అసమవయస్కులమధ్య వివాహాలూ, స్త్రీవిద్యలేకపోవడం ముఖ్యకారణాలుగా భావించేవారు. ‘భార్యాభర్తల యైకమత్యము’ గురించి 1877 లో కందుకూరి రాసిన వ్యాసంలో ఈ రెండింటినీ ప్రముఖంగా ఎత్తిచూపాడు. గురజాడ కూడా అసమవయస్కుల మధ్య వివాహాల్లోని విషాదాన్నే ‘పూర్ణమ్మ కథ’ ( 1910) కవితలోనూ, ‘మెటిల్డా’ (1910) కథలోనూ అత్యంత నైపుణ్యంతో చూపించాడు. కాని ఆ రచనల్లో ఉన్నది సంస్కరణవాదపు కళాత్మక కొనసాగింపు మాత్రమే. అలాకాక నిజంగానే ఇద్దరు స్త్రీ పురుషులు సమవయస్కులూ, సమవిద్యావంతులూ అనుకుందాం. అప్పుడు వారి దాంపత్యం ఎలా ఉండి ఉండవచ్చు? వాళ్ళు ఎదుర్కునే ప్రశ్నలు ఎటువంటివి కావచ్చు? వారికి ఎటువంటి సమస్యలు నిజంగా తోచవచ్చు? వాటిని వారే విధంగా పరిష్కరించుకోబోతారు?

అటువంటి రీతిలో గురజాడ చేసిన ఆలోచనలోంచి వచ్చిన కవిత ‘కాసులు’ (1910). కాసులు కవితతోనే ఆధునిక తెలుగు సాహిత్యంలో సహజీవన విలువల గురించిన నిజమైన చింతన ప్రారంభమైందనాలి. అంతవరకూ వచ్చిందంతా సంస్కరణవాద సాహిత్యం మాత్రమే. సంస్కరణవాద సాహిత్యంతో సమస్య ఏమిటంటే అది ఎన్ని ఉన్నతాదర్శాల గురించి మాట్లాడినా, అక్కడ రచయిత తను ఎవరిని ఉద్దేశిస్తున్నాడో, ఎవరిని చిత్రిస్తున్నాడో వారికన్నా ఒక మెట్టు ఎక్కువలో కూర్చున్నట్టుగా తనని తాను నమ్మించుకుంటాడు. అది ప్రబోధాత్మక సాహిత్యం. అక్కడ రచయితకీ, పాఠకుడికీ మధ్య ఉండేది అసమసంబంధం. వస్తుతః తాము అసమసంబంధంలో వుంటూ, అక్కడ రచయితా, పాఠకుడూ ఆదర్శ సమసంబంధాల గురించి మాట్లాడుకోవడమే ఒక పెద్ద విషాదం. కాని ‘కాసులు’ కవితలో విశేషమేమిటంటే ఇది తెలుగులో తొలి ప్రజాస్వామికవాద రచన.

ఇక్కడ రచయిత, తాను పాఠకుడికన్నా ఉన్నత స్థానంలో కూర్చోకుండా, వేదిక దిగి వచ్చి, పాఠకుడి పక్కనే కూచుని, అతని ముందొక అద్భుత రూపకానికి తెరతీస్తాడు. ఇద్దరు భార్యాభర్తల మధ్య సంభాషణగా కొనసాగిన ఈ రచనలో అన్నిటికన్నా గొప్ప విలువ అది ఇద్దరి మధ్య సంభాషణ కావడమే. అంతవరకూ వచ్చిన కవిత్వాల్లో ఇటువంటి సంభాషణ లేదు. అవి ఉపదేశాలూ, ఉపన్యాసాలూ మాత్రమే. అక్కడ రెండవ వ్యక్తికి గుర్తింపు ఒక మూగశ్రోతగా మాత్రమే. కాని ఈ కవితలో మొదటిసారిగా భార్యాభర్తలు పరస్పరం ‘మాట్లాడుకుంటారు.’

అలాగని ఈ కవితకు పరిమితులు లేవని కాదు. ఇందులో కూడా మనకి వినిపించేది భర్త కంఠం మాత్రమే. కాని అంతదాకా ఆధికారిక ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే అలవాటు పడ్డ పురుష కంఠం తన పెత్తనాన్ని వదులుకుని స్నేహస్నిగ్ధమవుతున్నదని మనం గమనించాలి. ఇక రెండవ పరిమితి ఏమిటంటే ఈ కవితకు దారితీసిన అంశం తనకి కాసులపేరు చేయించలేదని భార్య భర్త మీద అలగడమే. స్త్రీలకు, ముఖ్యంగా భార్యలకు నగల మీద అపేక్ష సహజమని జనాభిప్రాయంలో వున్నదాన్నే మహాకవి కూడా తన ఇతివృత్తంగా తీసుకోవడం గురించి నేను చాలాకాలం రాజీపడలేకపోయాను. కాని కవితలో ప్రతిపాదించిన విలువల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ పరిమితుల్ని మనం సులభంగా పక్కన పెట్టవచ్చు.

అన్నిటికన్నా ముందు మొదటి వాక్యం

మనలకీ పోరాటమిప్పుడు
దేని గూరిచి కలగె, చెపుమా

ఈ వాక్యం చాలా శక్తిమంతమైన ఎత్తుగడ. దీని గురించి మాట్లాడబోయేముందు నాకు ‘అన్నాకెరినినా’ మొదటి వాక్యాల గురించి ఎక్కడో చదివింది గుర్తొస్తోంది. టాల్ స్టాయి ప్రసిద్ధ రచన ‘అన్నా కెరినినా’ (1873-77) లో సుప్రసిద్ధమైన మొదటి వాక్యాల తర్వాత వాక్యం ఇలా ఉంటుంది. ‘అబ్లాంస్కీల కాపురంలో ప్రతి ఒక్కటీ సమస్య అయిపోయింది’ అని. ఒక విమర్శకుడేమన్నాడంటే అన్నా కెరినినా నవలకు ఇది మొదటి వాక్యం మాత్రమే కాదు, సూత్ర వాక్యం కూడాననీ, సారాంశ వాక్యం కూడాననీ.. అసలు అబ్లాంస్కీల కుటుంబంలో ప్రతి ఒక్కటీ సమస్య అయినందువల్లనే అన్నాకెరినినా కథ ముందుకు నడిచింది. అంతేకాదు ఆ విమర్శకుడేమన్నాడంటే ఆ సమస్య ఏదో ఒక అబ్లాంస్కీల కుటుంబానికి మాత్రమే కాదు, పందొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రతి రష్యన్ కుటుంబానికీ వచ్చిపడినందువల్లనే అన్నా కెరినినా కథ ప్రతి ఒక్కరూ వినవలసిన, అవగాహన చేసుకోవలసిన కథగా తోచింది.

ఆ విధంగా చెప్పాలంటే, ‘మనలకీ పోరాటమిప్పుడు దేని గూరిచి కలిగె చెపుమా’ అన్న వాక్యాన్ని ఆధునిక తెలుగు సాహిత్యానికి సూత్రవాక్యంగానూ, సారాంశవాక్యంగానూ చెప్పవలసి ఉంటుంది. ప్రతి తరం, ప్రతి సారీ ఈ ప్రశ్నను వేసుకోవడంతోనే సాహిత్య చర్చకు ఉపక్రమిస్తోంది. సంస్కరణవాద సాహిత్యంలో ఇటువంటి వాక్యాన్ని ఊహించడం కష్టం. ఎందుకంటే అక్కడ సమస్య వ్యక్తికీ, వ్యవస్థకీ మధ్య. ఒకే వ్యవస్థలో ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యని గుర్తించడానికి గానీ, లేవనెత్తడానికి గానీ, పరిష్కారం దిశగా ప్రయాణించడానికి గానీ ఆ సాహిత్యానికి శక్తిచాలదు. దానికి ప్రజాస్వామిక వాతావరణం కావలసి ఉంటుంది. ఒకే ఉపరితలం మీద నిల్చున్న ఇద్దరు వ్యక్తులు తమ మధ్య ఒక సమస్య తలెత్తిందని గుర్తించి ఆ సమస్య స్వరూపాన్ని గుర్తించడానికి చర్చకు పూనుకుని, పరిష్కారం దిశగా ఉమ్మడిగా ప్రయాణించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అటువంటి స్ఫూర్తిని మన సాహిత్యంలో మొదటిసారిగా కనబరిచిన మహోన్నత రచన ఇది.

మరొకటి కూడా ఉంది. అంతవరకూ, వైవాహిక సంబంధాల సంస్కరణ గురించి మాట్లాడినవాళ్ళు తమకీ, తాము పోరాడుతున్న వ్యవస్థకీ మధ్య సంఘర్షణని ఎత్తిచూపారే తప్ప తాము కలగంటున్న ఆదర్శ దాంపత్య వ్యవస్థలో, భార్యాభర్తల మధ్య సంఘర్షణ వస్తే ఏం చెయ్యాలో ఊహించలేకపోయారు. కాని ఏ ఆదర్శమయినా, అప్పటి పరిస్థితులకు ఆదర్శమవుతుందే తప్ప అది ఒకసారి నిజంకాగానే, వాస్తవంగా మారి, అంతదాకా అందులో గోచరించని, కొత్త సమస్యలతో కొత్త ఆదర్శం వైపు ప్రయాణించక తప్పదు. ‘కాసులు’ అటువంటి ప్రయాణావశ్యకతలోంచి వచ్చిన కవిత.

అసలు ఈ వాక్యంలోని ప్రతి ఒక్క పదాన్నీ మనం విశ్లేషించి చూసే కొద్దీ చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. మొదటి పదం చూడండి. అది ‘మనలకు’. ‘మనమధ్య’ అనే పదం కాకుండా ‘మనలకు’ అన్న పదాన్ని కవి ఎందుకు వాడాడు? అసలు మొత్తం కవితాసారాంశమంతా ఈ ఒక్క పదంలోనే ఉందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఇక్కడ, ‘మనలకు’ అన్న పదంలో వాళ్ళ మధ్య సంభవించిందేదో వాళ్ళ ఉమ్మడి అనుభవం అన్న సూచన ఉంది. ‘మనమధ్య’ అనవచ్చుగానీ అది విడదీసే పదం. ఇద్దరు మనుషుల మధ్య నిట్టనిలువు చీలికని సూచించే పదం అది. కానీ ‘మనలకు’ అనే పదంలో ఆ చీలిక లేదు. తమకేదో అనిష్టమైంది సంభవించినప్పటికీ తాము దాన్ని ఉమ్మడిగానే ఎదుర్కుంటామనీ, దానిలోంచి బయటపడతామనీ, చెప్పకుండానే చెప్పుకోవడమది. తమకి సంభవించిందేదో తమకి ఉమ్మడిగా సంభవించిందే తప్ప, తమని వేరుచేసేటంత ఉపద్రవం కాదన్న మెలకువని చూడాలందులో మనం.

ఇక రెండవ పదం: ‘పోరాటం’. ఇంత పెద్ద పదాన్ని ఎందుకు వాడాడు కవి? అభిప్రాయభేదం అనో మనస్పర్థ అనో పొరపొచ్చం అనో మరేదో ఒక మాట వాడవచ్చు కదా. కానీ ఆ మాటకొక ప్రయోజనముంది. ఎందుకంటే ఈ పదాల్లో లేని పాజిటివ్ సంకేతాలు ‘పోరాట’మనే పదంలో ఉన్నాయి. ‘మనస్పర్థ’లాంటి  పదాల్లో అనారోగ్యం, కిందకి దిగలాగే గుణం, నీరసింపచేసే లక్షణాలు, వృథా, ప్రయాస ఉన్నాయి. ‘పోరాటం’ అటువంటి పదం కాదు. అందులో మానవుడి శ్రేష్టత్వాన్ని పైకి తెచ్చేదేదో ఉంది. తన అత్యంత విలువైన సారాంశాన్ని దేన్నో రక్షించుకోవడానికి ముందుకు దూకడముంది. ఇంత సంకేతప్రాయమైన పదం కాబట్టే మహాకవి ఆ భార్యాభర్తల మధ్య సంభవించినదాన్ని ‘పోరాటమ’న్నాడు.

ఇక అన్నిటికన్నా వింతయిన పదాలు: ‘ఇపుడు దేని గూరిచి కలగె, చెపుమా’ అనేవి. ఈ వాక్యంలో మహాకవి మహాకథకుడిగా తటిల్లున మెరుస్తాడు. ఇక్కడ వ్యంగ్యమేమిటంటే, చాలా సందర్భాల్లో దాంపత్య జీవితంలో పోరాటాలకు కారణాలు స్పష్టంగా కనబడవు. ఆ కారణాలు స్పష్టంగా కనబడకపోవడం వల్ల భార్యాభర్తలు అప్పటికేవో తమకి తోచిన కారణాల్ని ఊహించుకుని లేదా ఆపాదించుకుని పోరాడుకుంటారు. కారణాలు బయటికి రావు కనుక తొందరలోనే అలసిపోతారు. కారణాలు బయటికి వస్తే పరిష్కారాలు దొరుకుతాయి. కారణాలు బయటికి రాలేదు కనుక పరిష్కారాలు దొరకలేదు కనుక, ఆ కారణాలట్లానే పచ్చిగా ఉండి, మళ్ళ మళ్ళా పోరాటాలు కొనసాగుతుంటాయి. ఇంత కథ ఉంది కనుకనే ‘మనలకీ పోరాటమిపుడు దేని గూరిచి కలగె చెపుమా’ అన్న ప్రశ్నని అమాయకంగా అడిగిస్తూ మహాకవి పక్కనుంచి మనకి కన్నుగీటుతున్నాడు.

కవిత మొదలయ్యేటప్పటికే చాలా కథ నడించిందన్నమాట. పెద్ద పోరాటమే జరిగి ఉండాలి. ఇక చివరికి వచ్చేటప్పటికి, తమ గొడవ ఎందుకు మొదలయ్యిందో మర్చిపోయి, ‘ఇంతకీ ఈ గొడవంతా ఎందుకు మొదలయ్యింది?’ అని అడుగుతున్న భర్తని చూసి ఆమె నవ్వాపుకోలేకపోయి ఉండాలి. అందుకని మళ్ళా ఇలా అంటున్నాడు:

మరచితిని..నవ్వెదవదేలను
యేమి కారణమైన పోనీ

అక్కడితో ఆ పోరాటమైపోయుండీ, తామెందుకు పోరాడుతున్నామో తమకి గుర్తులేకుండానే, అంత అమూల్యమైన కాలాన్నీ, శక్తినీ వృథాచెయ్యడంలోని పరిహాసాస్పదతను తామిరువుతూ గుర్తించడంతో ఇద్దరికీ నవ్వాగకపోయి ఉండాలి. అంత పెద్ద పోరాటమూ చిన్న దూదిపింజలా తేలిపోయుండాలి. కాని తామిరువురి మధ్యా సమాధానం కుదిరిన, సఖ్యత పునఃప్రభవించిన ఆ మానవీయ క్షణంలోనే కొన్ని ముఖ్యమైన విషయాల్ని మాట్లాడుకోవడం అవసరమనిపించి ఉండాలి. ఆ క్షణంలో ప్రభవించిందే తక్కిన కవిత మొత్తం.

మొత్తం కవితను చదవండి. ఒకటికి రెండు సార్లు చదవండి. ఇందులో ప్రతి ఒక్క వాక్యం మీదా ఎంతో ఆలోచించవచ్చు. ఎంతో చెప్పుకోవచ్చు. పైన విమర్శించుకున్నట్టే, ప్రతి ఒక్క పదాన్నీ, ఆ పదప్రయోగంలోని ఔచిత్యాన్నీ, దాని వెనక మహాకవి హృదయౌన్నత్యాన్నీ మనం పట్టి చూసుకోవచ్చు.

కాని ప్రత్యేకంగా ఒకటి రెండు వాక్యాల మీద మీ దృష్టిని మళ్ళించకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా ‘ప్రేమ పెంచక పెరుగునే’ అన్న వాక్యం. సాంప్రదాయిక వివేకం ప్రేమని ఒక శాశ్వత స్థిరాంకంగా భావించింది. వైవాహిక మంత్రంలాగా అది ఎన్ని యుగాలు గడిచినా చెక్కు చెదరకుండా ఉంటుందని భావించింది. సాంప్రదాయిక దృక్పథం ప్రకారం ఇద్దరు పెళ్ళి చేసుకోగానే, వాళ్ళ మధ్య ఒక శాశ్వత అనుబంధం ఏర్పడుతుందనీ, అది చెక్కుచెదరదనీ భావించాలి. అదే నిజమయితే, పెళ్లి జరిగాక, ఏ ఇద్దరు దంపతులూ ఎన్నటికీ విడిపోకుండా ఉండాలి, కాని అది అవాస్తవం.

గురజాడ అనేదేమంటే, ప్రేమ చలనశీలమైంది. ఒక జీవపదార్థంలాగా దానికి కూడా పెరుగుదల, తరుగుదల ఉంటాయి. కాబట్టి ప్రేమ పెంచుకోకుండా పెరగదు. ఈ కవితలోని మహత్తర వ్యంగ్యమంతా ఇక్కడే ఉంది. సాధారణంగా మనం ఆస్తిని కాసులరూపంలో కూడబెట్టుకోడానికి ప్రయత్నిస్తాం. నిజానికి కాసులు జీవరహితాలు. కాని వాటి వెనక ఉన్న మానవశ్రమ వల్ల వాటి విలువ కూడా పెరుగుతుంది, ఒక్కొక్కప్పుడు తరుగుతుంది కూడా. అయితే మానవజీవధనానికి అవి ఒక పార్శ్వం మాత్రమే.

వినుము.. ధనములు రెండు తెరగులు:
ఒకటి మట్టిన పుట్టినది; వే
రొకటి హృత్కమలంపు సౌరభము..

మనం మట్టిన పుట్టిన ధనాన్ని పెంచుకోడానికి చూపించే శ్రద్ధ హృత్కమల సౌరభమైన ప్రేమని పెంచుకోడానికి చూపడం లేదన్నదే మహాకవి ఆవేదన. ఈ వాక్యాలు వందేళ్ళకిందటివైనప్పటికీ, మానవసంబంధాలు వ్యాపారసంబంధాలుగా మారుతున్న నేటికాలానికి మరింత అవసరమైనవిగా వినిపిస్తున్నాయి. అయితే ప్రేమని పెంచడమెలాగు? దానికిలా అంటున్నాడు:

ప్రేమ
పెన్నిధిగాని, ఇంటను నేర్ప
రీ కళ, ఒజ్జలెవ్వరు లేరు-
శాస్త్రములిందు గూరిచి తాల్చె
మౌనము-

ఇదే సమస్య. మనకి పాఠశాలలద్వారా, సమాచార సాధనాల ద్వారా తక్కినవన్నీ తెలుస్తాయిగాని, ప్రేమించడమెట్లానో తెలియదు. ప్రేమని పెంచుకోవడమెట్లానో తెలియదు. ఈ విద్య , దీన్ని కవి ‘ప్రేమ విద్య’ అన్నాడు. ఇది చదువుల్లో మర్మం. దీన్ని నేర్వడమెట్లా? ఈ విద్య గురజాడ కవితలోని నాయకుడికెలా తెలిసింది? దానికిట్లా అంటున్నాడు:

..నేను నేర్చితి భాగ్య
వశమున, కవుల కృపగొని

 మరి మన సంగతేమిటి? దానికి సమాధానం, ఆయన భాషలో చెప్పాలంటే, ‘ప్రేమ విద్యకు ఓనమాలు’ : ఇలా చెప్తున్నాడు:

ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును
ఇంతియె

ఇంతే. ఈ ‘ఇంతియె’ అన్న మాటలోనే మొత్తం బరువంతా ఉంది. దాంపత్య సంబంధాల్లోగానీ, కుటుంబసంబంధాల్లో గానీ, సమస్య ఎక్కడొస్తుందంటే మనం ప్రేమనివ్వకుండా, ఎదుటివాళ్ళనుంచి ప్రేమని ఆశించడం వల్ల. అక్కడితో ఆగకుండా డిమాండ్ చెయ్యడం వల్ల. అలాగే మనం ప్రేమనిలపకుండా, ఎదుటివాళ్ళు నిలపాలని కోరడం వల్ల. కాబట్టి ప్రతి భార్యాభర్తా తగవు పడ్డప్పుడల్లా ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకోవాలి: ‘మనలకీ పోరాటమిపుడు దేని గూరిచి కలిగె చెపుమా’ అని. వెంటనే అర్థమవుతుంది వారికి, తాము ప్రేమనివ్వకుండా ప్రేమని కోరుకుంటున్నారనీ, తామై తాము ప్రేమని నిలపకుండా దానంతటదే నిలవాలని కోరుకుంటున్నారనీ.

ప్రశ్నలు:

మీరెప్పుడైనా మీ కుటుంబంలో తగాదాపడ్డప్పుడు శాంతంగా కారణాలు అన్వేషించి పరిష్కారం వెతకడానికి ప్రయత్నించారా?

మీరు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రేమని నిలుపుకోలేకపోతున్న క్షణాలేవన్నా ఉన్నాయా? ఉంటే ఎందుకుంటున్నాయో ఆలోచించారా?

Featured image: Untitled painting by Tagore

15-6-2023

6 Replies to “ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును”

  1. హృద్యంగా పరామర్శ చేశారు.
    పదాల వెనుక ఉన్న పరమార్థాన్ని విశద పరిచారు. ధన్యవాదాలు.
    తమ అనుమతితో ఇంకొంత :
    గురజాడ అమృత వాక్కులు…
    ” కల్లా కపటం లేని ప్రేమ మగువకు – మగ వారికి మాత్రమే ‘
    ” లోకమందు రెండే రెండు కులములు; మంచి – చెడు. మంచి అన్నది మాల అయితే మాల నేనగుదును ” నాడే ఇంత గొప్పగా చెప్పి ఆగామి ప్రపంచపు తీరు తెన్నులను దిశా నిర్దేశనం చేశారు గురజాడ.
    కారణ జన్ముడు గురజాడ.

  2. అన్ని కాలాలకూ వర్తించే కవిత ,విశ్లేషణ .ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును అనే కాన్సెప్ట్ జీవితంలో అన్ని సంబంధాలకీ వర్తిస్తుంది .ఎప్పుడైతే ప్రేమ నాకు మాత్రమే ఇవ్వాలి అన్న స్వార్థం మొదలవుతుందో అప్పుడు చీలిక మొదలవుతుంది .

  3. కవితలోని ప్రతి పదానికీ మీరు చేసిన అద్భుతమైన,సరళమైన విశ్లేషణ ఆ మహాకవి
    అంతరంగాన్ని మా గ్రహణశక్తిముందు వుంచింది.
    ప్రతి పదానికీ ఇంత వైశాల్యం వుందా అన్న
    ఆశ్చర్యానందాలు!
    ధన్యవాదాలు సర్.

Leave a Reply

%d bloggers like this: