
గురూజీ గురించి మీరు రాసిన వ్యాసాల లింకులు పంపించండి అని ఇవాళ కందుకూరి రమేష్ బాబు అడిగితే, తీరా చూస్తే, మూడు వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. నాలుగోది ఆయన మీద రాసిన నివాళి. గురూజీ గురించి చాలానే రాసానని అనుకుంటూ ఉన్నానుగాని, ఆయన మీద రాయవలసినంతగా రాయలేదని ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఆయన గురించి ఎప్పుడో ఇండియా టుడే లో కూడా ఒక వ్యాసం రాసానని గుర్తొచ్చింది. అప్పట్లో తెలుగు ఇండియా టుడే లో ‘సాలోచన’ పేరిట నేను నిర్వహించిన కాలంలో, అన్ని వ్యాసాల్లోనూ ఆ వ్యాసం తనకి ఎక్కువ నచ్చిందని అప్పటి సంపాదకులు రాజశుక గారు అన్నారు కూడా. 2002 లో రాసిన ఆ వ్యాసాన్ని సోమయ్యకు నచ్చిన వ్యాసాలు (2012) లో చేర్చాను గాని, ఆ పుస్తకం చదివి ఉండని కొత్త మిత్రుల కోసం, ఆ వ్యాసాన్ని మరోసారి ఇక్కడ పంచుకుంటున్నాను.
ఆశ్వయుజమాసపు రాత్రి. ఆదిలాబాద్‌లో రవీంద్రకుమారశర్మ కళాశ్రమంలో కూర్చున్నాం. బయట ఆవరణలో పారిజాతాలు విరబూసి ఉన్నాయి. ఆవరణంతా కనిపించే మేర, ఆకాశమూ, భూమీ వెన్నెలరసంలో తడిసిపోతున్నాయి.
శర్మ భారతదేశంలోని అత్యున్నతశిల్పులలో ఒకరు. ఆయన బరోడా యూనివర్సిటిలో శిల్పశాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత ఆదిలాబాద్ వచ్చి కొలాముల కోసం, కుమ్మరుల కోసం, కాకిపడగల వాళ్ళ కోసం, ఓజాల కోసం జీవితాన్ని అంకితం చేశారు. కొన్నేళ్ళ కిందట పెంగ్విన్ సంస్థ కోసం రజనీబక్షి అనే ఆమె భారతదేశంలో గాంధేయాదర్శాల్ని ఇంకా సజీవంగా ఆచరిస్తున్న వారి పైన ఒక అధ్యయనాన్ని వెలువరించారు. ‘బాపు కుటి’ అన్న ఆ రచనలో ఒక అధ్యాయం మొత్తం శర్మగారి కృషి పైనే కేటాయించారు. వెదురు పనివాళ్ళు, మట్టి పనివాళ్ళు, నేత పనివాళ్ళ కోసం ఆలోచించడంలోనూ, వాళ్ళ సమస్యల్ని ప్రజల ముందు, ప్రభుత్వం ముందూ ఉంచడం లోనూ, వాళ్ళ సాంకేతికపరిజ్ఞానాల్ని ఒకరి నుంచి ఒకరికి అందించడంలోనూ శర్మగారిది నిర్విరామకృషి. వీటన్నిటి మధ్యా ఆయన గత ఇరవయ్యేళ్ళుగా ఆదిలాబాద్‌లోని కొలాం ఆశ్రమపాఠశాలలో రోజూ కొన్నిగంటల పాటు గిరిజన విద్యార్థుల చిత్రలేఖనాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
రాత్రి శర్మగారి ఆశ్రమం అరుగుల మీద మా చర్చ లోకల్‌మార్కెట్ గురించీ, లోకల్‌డిజైన్ గురించీ సాగింది. మాతో పాటు మరొక ప్రజాకార్యకర్త గోపీకృష్ణ కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఔత్సాహిక కార్యకర్త కూడా. వారిద్దరూ కొలాం పనివారితో వెదురువస్తువుల తయారీలో కృషి చేస్తున్నారు.
ఆ వస్తువుల్ని నేను చూశాను. మహనీయ గాంధేయవాది వినూకాలే ఇచ్చిన నమూనాలవి. ఆ వస్తువుల్ని చూస్తూ అడిగాన్నేను, ‘ఈ ప్లాస్టిక్ ప్రపంచంలో ఈ వెదురు వస్తువులకింకా మార్కెట్ ఎక్కడుంది? ఎవరు కొంటారు వీటిని?’ దీనికి తన ఆదిలాబాద్ వాక్ శైలిలో కొంత హిందీ, కొంత స్థానిక తెలుగు కలగలిసిన పదజాలంతో ఆయనిచ్చిన సమాధానంలో ముఖ్యాంశాలిలా చెప్పుకోవచ్చు:
భారతీయసంస్కృతి వస్తుప్రధానం కాదు. అది జనప్రధానం. దేశీయ ఆర్థికవ్యవస్థ ప్రధానోద్దేశం మనుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండేలాంటి సాంఘికసభ్యతను రూపొందించడం తప్ప, ఒకరి మీద ఒకరు ఆధారపడనవసరం లేని వ్యక్తిగతసమృద్ధిని ప్రోత్సహించడం కాదు. ఊరు సమృద్ధి చెందినప్పుడు అందులో ఉండే ప్రతి వ్యక్తికీ ఎంతో కొంత ఆసరా లభిస్తుంది. అలా కాక ఊళ్ళోని వ్యక్తులు మాత్రమే వృద్ధి చెందడం మొదలైతే ఊరు భ్రష్టుపట్టిపోతుంది. దేశీయ ఆర్థికవ్యవస్థ నలుగురూ బతకడం ప్రధానంగా భావించింది కాబట్టి వారి ఉత్పత్తులకు లోకల్‌మార్కెట్‌ను ఖాయం చేస్తూ వచ్చింది.
ఈస్టిండియా కంపెనీ వచ్చిందాకా లోకల్‌మార్కెట్‌లు బలంగానే ఉన్నాయి. ఇప్పుడు గ్లోబలైజేషన్ తాలూకు కొత్తవ్యవస్థ లోకల్‌మార్కెట్‌ను ఛిన్నాభిన్నం చేస్తే గానీ బతకలేదు. దీనికి సమాధానం స్థానికత అనుకునే వాళ్ళు, ముందు స్థానికవిపణులు బలపడటం గురించి ఆలోచించాలి. స్థానికవిపణి ఒక ప్రదేశానికే పరిమితమైన బజారు కాదు. విపణి స్థానికం కావాలంటే ఆ అంగడిలో దొరికే వస్తువుల నమూనాలు స్థానికస్వభావాన్ని సంతరించుకునేవై ఉండాలి. లోకల్‌డిజైన్ లేని వస్తువులకు లోకల్‌మార్కెట్ లేదు.
స్థానికవిపణికి, స్థానికనమూనాకు మధ్యగల సంబంధాన్ని వివరించడం శర్మగారి నోటి వెంట మొదటిసారి నేను మూడేళ్ళకిందట విన్నాను. అప్పుడు చీరాలలో ‘లోక్‌విద్యా ఆందోళన్’ సదస్సులు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ చేతిపనివారల బృందాలు ఆ సదస్సుల్లో పాల్గొన్నాయి. వారినుద్దేశించి ఆ రోజు శర్మగారు చేసిన ప్రసంగంలో ఆశావహమైన భవిష్యత్తు బీజాలున్నాయనిపించింది నాకు. ఆ రోజు ఆయన అన్నదిదే. ‘మనం మన నమూనాల్ని మరింత స్థానికీకరించుకోకుండా మన వస్తువులను ఈ పోటీ మార్కెట్‌లో అమ్ముకోలేం’.
అయితే, నమూనాలు లోకలైజ్ కావడం ఎలా? ఆ ప్రశ్నకు సమాధానం ఆ రాత్రి దొరికింది. ఆయన అన్నదేమంటే డిజైన్ అనేది జీవనశైలికి చెందిన అంశం. ఏ డిజైనైతే ఒక వస్తువును ఆర్భాటంగాగానీ, లోటుతోగానీ కనిపించేలా చెయ్యదో దాన్నే మేలిరకం డిజైన్ అనవచ్చు. అంటే ఒక వస్తువు గానీ, లేదా దాని మీద నగిషీ గానీ, ఉంటే ఎక్కువ అనిపించకూడదు, లేకపోతే, తక్కువ అనిపించకూడదు.
శర్మగారు చెప్పేదేమంటే దేశీయఉత్పత్తుల, జీవనశైలుల ప్రధానతాత్త్వికత ఇదే. పాశ్చాత్య మార్కెట్ ఇందుకు విరుద్ధం. ఉదాహరణకు, నువ్వో సోఫాసెట్ కొన్నావనుకో, ఆ నమూనాలోనే మరిన్ని వస్తువుల్ని కొని చేర్చవలసిన ఆవశ్యకత ఉంది. ఆ సోఫాకు కవర్లు కొనాలి, దాని ఎదుట టీపాయ్ అమర్చాలి. ఆ టీపాయ్ మీదకు యాష్ ట్రే అవసరమవుతుంది. ఆ సోఫా, టీపాయ్‌ల కోసం కలసి ఒక కార్పెట్ అవసరమవుతుంది. ఈ జాబితాకు అంతం లేదు. కానీ, దేశీయ గ్రామీణజీవనశైలి ఇందుకు భిన్నం. శర్మగారి ఆశ్రమం అరుగుల్నే తీసుకుంటే అక్కడ పరచి ఉంది కేవలం చాపలు మాత్రమే. ఆ చాపలు కూడా లేవనుకోండి, అయినా ఆ అరుగుల సౌందర్యానికిగానీ, ప్రయోజనానికిగానీ ఎటువంటి భంగం వాటిల్లదు. చాపలు ఉన్నందువల్ల ఆ అరుగులకు ఎక్కువా కాదు, అవి లేకపోతే తక్కువా కాదు.
స్థానికడిజైన్ అనేది ఆ స్థానిక సౌందర్యదృష్టిపైనా, జీవనసరళి పైనా ఆధారపడి ఉంటుంది. వస్తువంటే కేవలం కమాడిటి కాదు. దాని వెనుక జీవనతాత్త్వికత ఉండాలి. ఇందుకు ఆయనిచ్చే అసంఖ్యాక ఉదాహరణలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. గ్లాసుకూ, లోటాకూ భేదం అటువంటి ఒక ఉదాహరణ. దేశీయ ఆర్థికవ్యవస్థ ఎన్నటికీ గ్లాసును ఊహించలేదనీ, అది లోటాల్ని మాత్రమే రూపొందించిందనీ ఆయన చెప్పారు.
లోటాను తయారు చెయ్యడం కన్నా, గ్లాసును తయారు చెయ్యడం సులువే అయినప్పటికీ దేశీయ వస్తుశిల్పులు లోటాను మాత్రమే ఎందుకు రూపొందించి ఉంటారు? ఇందుకు దేశీయ సౌందర్యదృష్టీ, జీవనసరళీ కారణమంటారాయన. గ్లాసునమూనాలోని నిలువురేఖల కన్నా లోటా నమూనాలోని వక్రరేఖలు సౌందర్యపూరితాలుగా ఉండటమే కాక, ప్రయోజనాల్లో కూడా లోటా అధికతరం ఉపకారి కావడమే అందుకు కారణమంటారాయన. అలాగే మట్టికుండకూ, ప్లాస్టిక్‌బిందెకూ మధ్య గల తేడా కూడా.
అంతర్జాతీయమార్కెట్ మీద నువ్వు తిరుగుబాటు ప్రకటించాలనుకుంటే అందుకు నీదైన జీవనశైలిని నువ్వు నిర్వచించుకోవాలి, నీ సౌందర్యదృక్పథాన్ని నువ్వేర్పరచుకోవాలి, నీ నమూనాల్ని నువ్వు రూపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మార్కెట్లను నువ్వు జయించగలుగుతావు.
దేశ ఆర్థికవ్యవస్థ మీద బహుళజాతి సంస్థల ఉత్పత్తులూ, ప్రచారమూ వరదలాగా తోసుకువస్తుంటే ఆదిలాబాద్‌లో కొలాంవారితో వెదురు వస్తువుల నమూనాలను రూపొందిస్తున్న శర్మగారు తనను జలప్రళయవేళ మనువుతో పోల్చుకోవడానికి ఇష్టపడతారు. ప్రపంచాన్ని ప్రళయం కమ్మేస్తున్నప్పుడు మనువు అన్ని రకాల పశు, పక్షిజాతుల బీజాల్ని సేకరించుకుని తన నౌకలో చేర్చుకున్నాడట. ప్రళయం ముగియగానే కొత్తసృష్టికి ఆ బీజాలే ఆధారమయ్యాయట. తాను కూడా ఈ అంతర్జాతీయ పోటీఆర్థికవ్యవస్థ నుంచి ప్రపంచాన్ని బయట పడవెయ్యగలిగే నౌకగా తన ఆశ్రమాన్ని నమ్ముకుంటారు కనుక అదిలాబాదులో గురూజీ కళాశ్రమానికి వెళ్ళినప్పుడల్లా నాకు ఆయన ముందుయుగం దూతలాగా కనిపిస్తుంటారు.
సోమయ్యకు నచ్చిన వ్యాసాలు పుస్తకం ఇక్కడ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు
15-6-2023
” దేశీయ ఆర్థికవ్యవస్థ ప్రధానోద్దేశం మనుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండేలాంటి సాంఘికసభ్యతను రూపొందించడం తప్ప, ఒకరి మీద ఒకరు ఆధారపడనవసరం లేని వ్యక్తిగతసమృద్ధిని ప్రోత్సహించడం కాదు. ఊరు సమృద్ధి చెందినప్పుడు అందులో ఉండే ప్రతి వ్యక్తికీ ఎంతో కొంత ఆసరా లభిస్తుంది. ”
ముందు యుగం దూత అని మీరు ఎందుకు అన్నారో…పై వ్యాఖ్య చదివితే అర్థం అవుతుంది.
ఈ విధమైన ఆలోచన/కీలక మర్మాన్ని మర్చిపోయిన నేటి రాజకీయుల చేతిలో ఎంత నష్టం జరిగిందో మనకు అర్థం అవుతోనే ఉంది.
అందుకే…
” రాజనీతిజ్ఞుడు ముందు తరం గురించి/ భవిష్యత్ గురించి ఆలోచిస్తాడు ” అనేది.
సార్…
మళ్లీ చెప్తున్నాను…
మీ దృక్పథం వేరు సార్…
ప్రధాన స్రవంతిలో కొట్టుకుపోరు, లౌల్యానికి లోనౌరు.
క్రాంతిదర్శి సార్ మీరు.
మిక్కిలి ధన్యవాదాలు మీకు.
దయాపూరితమైన మీ వాక్యాలకు నా హృదయపూర్వక నమస్కారాలు.
“గ్లాసునమూనాలోని నిలువురేఖల కన్నా లోటా నమూనాలోని వక్రరేఖలు సౌందర్యపూరితాలుగా ఉండటమే…”
Beauty & Utility మేళవించిన తీరు అద్భుతం.
బుద్ధుడు బోధించిన సమ్యక్ దృష్టి!
సర్… To be with you is education.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
ఒరవడి లో కొట్టుకు పోని జీవన సరళి మీది
మమ్మల్ని కూడా ఆ ఒడ్డుకు లాగి ఏది సరి అయినదో, ఎందుకు సరి అయినదో చెప్పగల సమ్యక్ దృష్టి మీది
నమస్సులు మీకు
ధన్యవాదాలు మేడం
సదాశివ గారిపుణ్యమా అని ఒకరోజంతా వారితో గడిపే అవకాశం కలిగింది. ఒకప్పటి గ్రామీణ వ్యవస్థలో ఒక ఇంటి వేడుకలో ఊరిలోని అన్ని వృత్తులవారు ఏవిధంగా భాగస్వాములయ్యేవారో వారు వివరించినది విన్న తరువాత నేను పుట్టిన మా ఊరు నా చిన్నతనాన్ని బేరీజు వేసుకుని అదే విషయాన్ని నా మానేరు ముచ్చట్లలో ప్రతిపాదించటం జరిగింది.
ఆ కళాశ్రమం ఇప్పటికీ కన్నుల్లో పదిలంగా ఉంది. ఆ పెంకులతో ఆర్చిలాగా రూపొందించిన పైకప్పు ఆ అరుగులు, ఆ సేకరించిన పాతకాలం నాటి ఇసిరెలు, ఆ వెదురు మరియు మట్టి కళాకృతులు మరచిపోలేని దృశ్యం. ఆచార్య రవీంద్ర శర్మ ప్రాతః స్మరణీయులు.
అవును సార్! ఆయన ప్రాతస్మరణీయుడు.