హువా ములాన్

రెండేళ్ళ కిందట ప్రాచీన చీనా కవిత్వం చదువుతుండగా హువా ములాన్ గీతం కనిపించింది. సా.శ 4-6 శతాబ్దాల మధ్యకాలంలో ఉత్తర వెయి రాజవంశ పాలనాకాలంలో ఎవరో అజ్ఞాత కవి ఈ గీతాన్ని రచించాడు. ఆ రోజుల్లో యుద్ధాల్లో ప్రతి ఒక్కర్నీ నిర్బంధంగా తీసుకునేవారు. ఒకవేళ ఎవరేనా వృద్ధాప్యంవల్లనో, అనారోగ్యం వల్లనో యుద్ధానికిపోలేకపోతే అతని తరఫున అతని కొడుకుని పంపవలసి ఉండేది. అటువంటి ఒక రాజాజ్ఞలో వృద్ధుడైన ఒక తండ్రిపేరు కనబడగానే అతడి కుమార్తె ములాన్ ఖిన్నురాలైపోయింది. ఆ తండ్రికి ఎదిగిన కొడుకులేడు. కాబట్టి అతడిబదులు మరొకరిని నిర్బంధ సైనికసేవకు పంపగలిగే అవకాశం లేదు. అందుకని ములాన్ తనే మగవేషం వేసుకుని యుద్ధరంగంలో దూకింది. పన్నెండేళ్ళు యుద్ధం సాగి, సైన్యం విజయం సాధించాక, చక్రవర్తి ఆ సేనాధిపతుల్ని సత్కరిస్తో ములాన్ ని కూడా ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు. కాని ములాన్ రాజ్యాలూ, రత్నాలూ కోరుకోలేదు. పన్నెండేళ్ళుగా తన కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల్ని చూడటానికి త్వరితంగా తీసుకుపోగల ఒక గుర్రానిస్తే చాలంది. ఇంటికొచ్చాక అప్పుడు తన పోరుదుస్తులు విప్పి, పాతవస్త్రాలు కట్టుకుని బయటికి రాగానే సైన్యం ఆశ్చర్యపోయారు. ‘పన్నెండేళ్ళు కలిసి మెలిసి కదనరంగంలో తిరిగాం, కాని ఈమెని గుర్తుపట్టలేకపోయాం’ అనుకున్నారు. అయినా కుందేలు పిల్లలు ఏది మగో, ఏది ఆడనో, కూచున్నప్పుడు తెలుస్తుందిగాని, పరుగెత్తేటప్పుడు కాదు కదా అనుకున్నారు.

అత్యంత నిర్దయాత్మకమైన ప్రాచీన చీనా పితృస్వామికసమాజంలో ములాన్ కథ ఒక ఆశ్చర్యం. కాబట్టే శతాబ్దాలుగా ఆ కథని అనేక రూపాల్లో తిరిగితిరిగి చెప్పుకుంటూనే ఉన్నారు, పాటలు కట్టి పాడుకుంటూనే ఉన్నారు. చీనా కవిత్వం ద్విపద రూపంలో ఉంటుందికాబట్టి నేను ఈ గీతాన్ని ద్విపదగా అనువదించాను. కాని చతురశ్రగతి గీతంగా ఈ కథ మరింత శోభిస్తుందని నా నమ్మకం. గంటేడ గౌరునాయుడు, తుమ్మూరి రామ్మోహనరావు వంటి కవులు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.

మా అమ్మాయి అమృతను చూసినప్పుడల్లా హువా ములాన్ గుర్తొస్తుంది. తన తండ్రి కష్టపడకూడదని తానే స్వయంగా బరువుబాధ్యతలు నెత్తికెత్తుకున్న ప్రతి ఒక్క వనితలోనూ ములాన్ గోచరిస్తుంది.


హువా ములాన్

నిట్టూర్పువెనకను నిట్టూర్పుతోను
పట్టుమగ్గము చెంత పడతికూర్చుండ

కదురాడుచప్పుళ్ళు కరగిపోయినవి
మదిలోన రగిలేటి బాధాగ్ని సెగకు

‘ఎందుకే బాలికా వేగేవు చింత
అందగాడెవరైన మదినిదోచేన?’

‘పెనగుచున్నది నన్ను ప్రేమకాదమ్మ
వలపువాకిటనేను తూలిపోలేదు’

‘గడచిన రాత్రి నే కంటి కంటకము
రణవార్త తెలిపేటి రాజశాసనము’

‘సమకూర్చు నిర్బంధ సైన్యమ్ములోన,
నా గుండె చీల్చుచు, నా తండ్రి పేరు’

‘లేడు నా తండ్రికి నీడైన కొడుకు
పోరులో బదులుగా పోనైనవాడు’

‘తలచుచుంటినిజీను కళ్ళెముకొరకు
నాతండ్రిబదులుగా నేనుపోవుటకు’

తూర్పువైపునతెచ్చె తురగమొక్కటిని
పడమటివీథిన పదపడి డాలు

దక్షిణమందున తలపాగ జీను
కొన్నదొక కొరడా వన్నెమీరగను

తెల్లవారగ, మొక్కి తల్లిదండ్రులకు,
ఉరికించె హయమును యుద్ధమార్గమున

వినలేదుకన్నీటి వీడ్కోలు మాట
ప్రసరించె నదిపైన ప్రత్యూషకాంతి

పొద్దెక్కువేళకు పయనించెదవ్వు
పొద్దుగుంకకముందె యుద్ధభూమికిని

వినరాదు కన్నీటి వీడ్కోలు మాట
గిరికంధరములందు ఘోషించె దండు

పదివేల కోసులు పక్షిమాదిరిగ
కొండకోనలుదాటి కడచిపోయినది

ఉత్తరదిక్కుగా నుద్దండభేరి
తనువెల్ల మెరిసెనునునుశీతకాంతి

వందయుద్ధములందు విజయమార్జించి
తిరుగుపయనమైరి తమదైనదారి

రంగారుపొంగారుబంగారుసభను
సన్మానమొందిరిసేనాధిపతులు

శౌర్యసాహసములు చూపినందులకు
ప్రకటించె నరపతి బహుమతులెన్నొ

పడతిసాహసమునుపెద్దగామెచ్చి
కోరుకొమ్మనె రాజు కోరికేదైన

‘లేదుకోరిక నాకు పదవికోసరము
రత్నాల రాశులూ రాజ్యాలు వద్దు’

‘తల్లిదండ్రులజూచి ఏళ్ళుపూళ్ళాయె
గీముచేరుటకొక్క గుర్రమ్ముచాలు’

తరలివచ్చుతమకొమరితను చూడ
పొలిమేర చేరిరాతల్లిదండ్రులును

చక్కగా సింగారమొనరించియక్క
వేచియున్నది ఇంటి వీథిముంగటను

సంతోషముప్పొంగ విందువేడుకలు
చిన్నారి తమ్ముడు సిద్ధమ్ము చేసె

తెరిచారు తలుపులు తూర్పుమందిరము
పరిచారు పక్కను పడమటిగదిని

పారవైచినదింక పోరుదుస్తులను
తనివార ధరియించె తొల్లిపుట్టములు

తుమ్మెదరెక్కల తలనీలములను
సవరించి చక్కగా సరిదిద్దుకొనెను

కన్నులూ వదనమూ చెన్నుమీరగను
అద్దమ్మునరచేతపట్టిచూచినది

అటుపైన బయటకు నడుగుపెట్టగనె
ఆశ్చర్యమాశ్చర్యమన్నది సేన.

‘పయనించితిమిగాని పన్నెండు ఏండ్లు
పసిగట్టకున్నాము పడతిరూపమును’

‘పోతునో పెంటినో పొడగట్టగలము
కూర్చున్నచోనొక్క కుందేలుజంట’

‘చెవులపిల్లులురెండు చిందాడువేళ
చెప్పలేరెవ్వారు జాతిభేదమ్ము’

14-6-2023

14 Replies to “హువా ములాన్”

 1. ఎంత అందంగా చెప్పారు హువా ములాన్ గురించి. మీ ఆస్తిపాస్తులు ఈ సాహితీ సంపదే కాదు, మీ అమ్మాయి అమృత కూడా. తల్లిదండ్రుల పట్ల అంతులేని ప్రేమ ఉన్నవాళ్లు ఆ దేశానికీ విశ్వానికీ సంపద.

 2. హువా ములాన్ గుర్రం లెక్క మీ ద్విపద దౌడు తీసింది. లయబద్దంగా సాగింది. అమృత మిమ్ములను ఇంతగా కదిలించింది అంటే కారణం ఉంది. ” పిల్లలు – చెబితే వినరు, తల్లి తండ్రులను చూసి నేర్చుకుంటారు ” అనే సార్వ కాలీన నిజం మీ విషయంలో కూడా రుజువైంది. ” అచట పుట్టిన కొమ్మ కూడా చేవ అయినది ” కాదంటారా !? ధన్యవాదాలు సార్.

 3. ఆహా హువా ములాన్ గురించి చదువుతుంటేనే ఎంతో ఉత్తేజమనిపించింది. చరిత్రలో ఇలాంటివారే కదా చిరంజీవులు. మీ ద్విపద గీతం చక్కగా సాగింది..దానిని చతురస్ర గతిలోకి మార్చాలనే మీ కోరిక తప్పక నెరవేరుస్తాను. నాపేరు ప్రస్తావించిన మీకు నా వినమ్ర పూర్వక ధన్యవాదాలు. చివరలో అమ్మాయి అమృత ను హువా ములాన్ లా భావించడం సంతోషంగా ఉంది. మీకులాగానే నాకూ కూతురు స్పందన పెద్దది కావడంతో నా సకలభారాలూ తాను వహించింది , వహిస్తూ వుంది. ఇక చదవడానికి డిగ్రీలు లేనంతగా చదివి తన పట్టుదలను చాటుకుంది.నిన్ననే గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ ఉస్మానియా విఒశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ఆచార్య పదవి చేపట్టిన వార్త చదివినప్పుడు చాలా సంతోషమనిపించింది.వీళ్లంతా హువా ములాన్ వంటి వారే. పొద్దున లేస్తూనే మీ కుటీర సందర్శన భానూదయభాతి ఒక అద్వితీయానుభూతి.

 4. భారాలు మోస్తూ అలసిపోని
  కూతుళ్లకు కానుక ఈ గేయం

  Sir

  చాలా బాగుంది

 5. రెండు మూడు సార్లు మళ్లీ మళ్లీ చదివాను.మీ ద్విపద చాలా బాగా వచ్చింది.ప్రతి పదం ఆచి తూచి వేసినట్లుంది.ద్విపద గానానుకూల గనుక మరింత శోభితమనిపించింది.

 6. ద్విపద చాలా బాగుంది sir. మిమ్ము లను అంత కంటికిరెప్పలా చూసుకుంటున్న మీ అమ్మాయి అమృత కు ప్రత్యేక అభినందనలు దీవెనలు

Leave a Reply

%d bloggers like this: