ఆడినడయాడు పాపా

అయిదారేళ్ళకిందట కోయంబత్తూరుదగ్గర ఒక స్కూల్లో పిల్లల్ని ఏదైనా తమిళ గీతం వినిపించమని అడిగితే, ఒక పిల్లవాడు ‘ఓడి విలయాడు పాపా’ అనే పాట పాడాడు. అది సుబ్రహ్మణ్య భారతి గీతమని అప్పుడే తెలిసింది, అదే మొదటిసారి వినడం కూడా. ఆ తర్వాత ఆ గీతాన్ని పూర్తిగా ఇంగ్లిషు అనువాదంలో చదివినప్పుడు నా మనసంతా ఆర్ద్రమైపోయింది. ఒక పసిపిల్లవాడు మరొక పసిపిల్లవాడితో మాట్లాడినట్టుగా భారతియారు ఈ పాట రాసాడనిపించింది. అప్పణ్ణుంచీ ఈ గీతాన్ని తెలుగుచేద్దామని అనుకుంటూనే ఉన్నాను. మొత్తం పదహారు చరణాల గీతంలో మూడేళ్ళ కిందట మొదటిచరణం మాత్రమే అనువదించగలిగాను. ఇన్నాళ్ళకు పూర్తిగీతాన్ని.


ఆడినడయాడు పాపా

ఆడినడయాడు పాపా
కూడి తిరుగాడు పాపా
చిన్నారిపిట్టలా ఎగురాడు, చెడ్డ
పలుకాడకెన్నడును పాపా

పిట్టవలె నీవు పాపా
పిచుకవలెనీవు పాపా
రంగురంగుల పక్షులందొకరివై
నింగిపైతారాడు పాపా

మేతకొరకై వెతుకాడు
కోడినెచ్చెలి మనకురా
దొంగిలించుబుద్ధి కాకిది, దానిపై
దయచూపురవ్వంత పాపా

పాలధారలు ప్రసరించు
గోవు మనబంధుమిత్రము
చూడు తోకాడుచును కేరింతలాడు
కుక్కపిల్లలుతోడు పాపా

రథములను లాగు గుర్రము
పొలములను దున్ను వృషభము
కలసి మెలసి బతుకు మనతోన మేకలు
మనసార లాలించు పాపా

పొద్దున్న చదువుసంధ్యలు
ఆపైన తుళ్లిపడుతూ
పాడి, పొద్దుగుంకేదాక ఆడుకుని
నీనడత దిద్దుకో పాపా

కల్లలాడకు మెన్నడూ
ఒరుల వెనకను వారిపై
కొండెములు చెప్పకుము దేవుడెల్లపుడు
తోడునిలుచును మనకు పాపా

చెడ్డవారెదురైనచో
ఖండించు, భీతి చెందకు
కనికరించకేమాత్రమును, ఊసిపో
కసిదీర వారిపై పాపా

కష్టములు తరుమాడినా
కలత చెందకు, నిబ్బరము
కోల్పోక నిలబడుము మనకు బాసటగ
దైవమున్నాడులే పాపా

బద్ధకము పరమశత్రువు
పాటించు తల్లిమాటలు
ఊరికే విలపించువారు దుర్బలులు,
ధీరవై పోరాడు పాపా

జన్మనిచ్చిన దేశమును
సేవించు సంతసముతో.
తండ్రితాతలిటు తరలివెళ్ళిన నేల
సుధకన్న మధురమే పాపా

సాటిలేనిది, ప్రేమించు
మాతృభాషను, ఏదేశ
మేగినా ఎవ్వరెదురైన పొగడరా
నీ భరతదేశమును పాపా

ఉత్తరాన హిమాలయము
దక్షిణము కన్యకుమారి
తూర్పుపడమర లావరించెమహోదధి
దిక్కులై నలుగడల పాపా

వేదములుపలికిన తావు
శౌర్యవంతులనివాసము
భువినివెలయు సురలోకమిదియనితలచి
శిరసొగ్గి ప్రణమిల్లు పాపా

నమ్మకు కులమనుమాటను
చూపకు తరతమభేదము.
ప్రేమపంచెడిశీలవంతులొక్కరే
సజ్జనులు ఘనులురా పాపా

జీవులన్నిటిపట్ల దయ,
దైవమొక్కడె సత్యమని
నమ్మి, ఉక్కుతీగనుపోలు గుండెతో
వర్ధిల్లు వందేళ్లు పాపా

Bharaityar photo and featured image courtesy: Wikicommons

13-6-2023

14 Replies to “ఆడినడయాడు పాపా”

 1. స్వేచ్ఛానువాదం బాగుంది.
  శీర్షిక, మకుటం మాత్రుకను పోలి, ఆత్మను వెలయించింది. ధన్యవాదాలు అండి.

 2. “నీ నడత దిద్దుకో బిడ్డా…”

  పొద్దు పొద్దుననే…తండ్రీ!
  కన్నీటి పర్యంతమయ్యాను నా తండ్రీ!

  మనసు శుభ్రము చేసేను…తండ్రీ!
  మాలిన్యాలు తొలగేను…నా తండ్రీ!

  కన్నీటి వైద్యమూ …తండ్రీ!
  అసలు సిసలైన అనువాదమై …నా తండ్రీ!

 3. మంచి అనువాదాన్ని అందించారు.కాశ్మీరి నిండి కన్యా కుమారి దాకా ఉన్న అనేక మంది ఇలాంటి గొప్ప కవుల కవిత్వం ఒక్కచోట దొరికే ప్రయత్నం ఎవరైనా చేస్తే బాగుండును. కనీసం పిల్లల గురించి రాసిన వైనా .

 4. ఇలాంటి పాటలు దేశమంతటా అన్ని భాషలలో వినిపిస్తూంటే ఐక్యత దానంతట అదే వికసించదా ?
  తాను చనిపోయే ఆఖరి క్షణంలో తెలుగు పాట వినిపించమని కోరిన సుబ్రహ్మణ్య భారతి విశాల దృక్పథం కరువైపోయింది.

 5. రాష్ట్రీయ ఏక్తా గీత్ 22 భారతీయ భాషల్లోని ఆ భాష ప్రసిద్ధ కవులు రచించిన పిల్లలకు దేశభక్తికి సంబంధించిన గీతాలను రికార్డ్ చేసి నవోదయ కేంద్రీయ విద్యాలయాలకు పంపుతారు. బుక్లెట్లలో హిందీ ఇంగ్లీష్ మీనింగ్ తో ఉండేవి.
  నవోదయ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని విద్యార్థులకు ఈ పాటలు నోటిమీద ఆడుతుంటాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య భారతి గారి ఈ గీతం అలాగే దాశరథి గారి పిల్లల్లారా.. పాపల్లార అనే తెలుగు గీతం.
  మీ అనువాదం బాగుంది.

 6. అర్థవంతమైన గీతం
  సమర్థవంతమైన సామ్యం
  సచ్చీలుర పెంపొందించు గీతం
  సత్కవీంద్రుల కావ్యాల గానం
  వీరభద్రుల వారు వింగడించు రీతి
  రసజ్ఞుల హృదిని దోచుకున్న ఖ్యాతి
  రమ్యమై రాగరంజితమై ఒప్పారినది గీతి.

Leave a Reply

%d bloggers like this: