తెలుగు జర్నలిజం, మాండలికాలు

ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడెమీ వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకి, జర్నలిజం డిప్లొమా కోర్సు విద్యార్థులకి ఆన్ లైన్ అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో ప్రత్యేక ఉపన్యాసాల పరంపరలో నన్ను కూడా ప్రసంగించమని నా బాల్యమిత్రుడు సంగాని శ్రీనివాస జీవన్ అడిగాడు. దాంతో మొన్న శనివారం ఉదయం ‘తెలుగు జర్నలిజంలో మాండలికాల ప్రభావం’ అనే అంశం మీద ఒక గంట ప్రసంగం ఏర్పాటు చేసారు. నా ప్రసంగానికి ముందు మీడియా అకాడెమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుగారు, కోర్సు డైరక్టరు డా.ఎల్.వి.కె.రెడ్డిగారు నా ప్రసంగవిషయం గురించి స్థూలంగా వివరించారు.

మీడియా లింగ్విస్టిక్స్ మీద నేను ప్రసంగించడం ఇదే మొదటిసారి. నిజానికి ఈ అంశంలో మన దగ్గర సరైన పరిశోధనలేదు. సరైన క్షేత్రస్థాయి సమాచారం కూడా లేదు. పత్రికల్లో ఎటువంటి భాష వాడాలి, ఎటువంటి భాషకి పాఠకులు ఎలా స్పందిస్తారు అన్నదానిమీద మన దగ్గర ఉన్నదంతా ఊహాగానమే. ఉదాహరణకి, ఎవరేనా ఏదేనా ఒక వార్తాపత్రిక తాలూకు జిలా ఎడిషన్లలో వచ్చిన వార్తల్ని తీసుకుని సమాజంలోని వివిధ వృత్తుల్లో, వివిధరంగాల్లో ఉన్న పాఠకుల దగ్గరకి వెళ్ళి, ఆ వార్తల్లో వాళ్ళకి సులభంగా బోధపడుతున్న పదజాలం ఏది, కష్టంగా అనిపిస్తున్న పదజాలం ఏది, ఆ వాక్యనిర్మాణాన్ని వాళ్ళు సరళంగా భావిస్తున్నారా, కష్టంగా భావిస్తున్నారా అనే పరిశీలన ఇంతదాకా ఎవరూ చేసినట్టు లేదు.

మీడియా భాష మీద మాండలికాల ప్రభావం అనే అంశం మీద మాట్లాడవలసి ఉందన్నప్పుడు నేను ఆన్ లైన్లో ఒక పత్రిక తాలూకు నాలుగైదు జిల్లా ఎడిషన్ల వార్తలు చూసాను. ఆ జిల్లా ఎడిషన్లలో కూడా ప్రాంతాలవారీగా, అంటే దాదాపుగా పూర్వపు తాలూకాల వారీగా వార్తలు ఉన్నాయి. కాని ఆ వార్తలన్నిటిలోనూ ఆయా ప్రాంతాల మాండలిక పదజాలం దాదాపుగా రెండు శాతం కన్నా తక్కువగానే ఉందనిపించింది. అంతేకాదు, ఆ వాక్యనిర్మాణంలో కూడా మెయిన్ ఎడిషన్ కీ, జిలా ఎడిషన్లకీ మధ్య ఏమీ చెప్పుకోదగ్గ తేడా కనిపించలేదు. ఇది హర్షించదగ్గ విషయమా లేక చింతించదగ్గ విషయమా? నేను నా ప్రసంగంలో ఈ అంశం మీదనే దృష్టి పెట్టాను.

ముందుగా అసలు భాష అంటే ఏమిటి అని ప్రశ్నించాను. భాష (language) కన్నా మాండలికం (dialect) ఏ మేరకు భిన్నమైంది? ఒక భాషావేత్త a language is a dialect with an army behind it అన్నాడు. ఆర్మీ అంటే సైన్యమే కానక్కర్లేదు. ఏ మాండలిక ప్రాంతం నుంచి విద్యావంతులూ, వ్యాపారవేత్తలూ ఎక్కువసంఖ్యలో వస్తారో, వాళ్ళు ఆ భాషమాట్లాడే ప్రాంతాల్లో రాజకీయంగా ప్రబలశక్తులుగా రూపొందుతారు కాబట్టి, వాళ్ళ మాండలికమే ఆ భాషాస్వరూపంగా చలామణి అవుతుంటుంది.

తెలుగు భాషనే తీసుకుంటే, ఒకప్పుడు వేములవాడ  కేంద్రంగా వేములవాడ చాళుక్యులు దేశి తెలుగునీ, రేనాటి చోడులు, తెలుగుచోడులు సంస్కృత, ప్రాకృత ప్రభావాలకు లోనుకాని అచ్చతెలుగుని ప్రోత్సహించినప్పటికీ, వేంగీచాళుక్యులు ప్రోత్సహించిన తెలుగే ప్రధాన కావ్యభాషగా చలామణి అవుతూ వచ్చింది. ఆ తర్వాత వెయ్యేళ్ళ తెలుగు కావ్యచరిత్ర, ఆ వేంగితెలుగుతో తక్కిన రెండు ప్రాంతాల తెలుగులూ సంఘర్షిస్తూ వచ్చిన చరిత్రగానే మనంచెప్పవచ్చు.

పందొమ్మిదో శతాబ్ది మధ్యకాలంలో ఆధునిక విద్య బలపడటం మొదలయ్యాక, తెలుగు పాఠ్యపుస్తకాలు, తెలుగు భాషాబోధన, తెలుగులో పరీక్షలు రాయడం మొదలయ్యాక ఎటువంటి తెలుగుని బోధనాభాషగా స్వీకరించవలసి ఉంటుంది అన్నదాని మీద చాలా చర్చ జరిగింది. ఆ చర్చ తెలుగు భాషావేత్తల్ని గ్రాంథికభాషావాదులు, వ్యావహారిక భాషావాదులు అనే రెండు శిబిరాలుగా చీల్చివేసిందని కూడా మనకు తెలుసు. కాని మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ గ్రాంథిక భాషావాదులు సనాతన సంస్కృతపండితులో లేదా ఆధునిక విద్యతో సంబంధం లేనివాళ్ళో కాదు. పైగా వాళ్ళు ఇంగ్లిషు విద్యని అభ్యసించి, విశ్వవిద్యాలయాల్లో, న్యాయస్థానాల్లో అగ్రశ్రేణిలో ఉన్న మొదటితరం విద్యావేత్తలు. కాని వాళ్ళు గ్రాంథిక భాషకోసం ఎందుకు వాదించారు? దాని వెనక కారణం ఒకటే. భాషని బోధించవలసి వచ్చినప్పుడు ఏ మాండలికంతోనూ సంబంధంలేని ఒక ‘శుద్ధ’ భాషని వాళ్ళు ఊహించడానికి ప్రయత్నించారు. దాన్ని ప్రామాణీకరణగా వాళ్ళు భావించారు. అటువంటి ప్రామాణికరణకి వాళ్ళు ప్రధానంగా కావ్యభాషా వ్యాకరణం మీద ఆధారపడ్డారు. కాని వ్యావహారిక భాషావాదులు వాళ్ళతో చెప్పిందేమంటే ‘ఒక ప్రమాణ భాషని రూపొందించే క్రమంలో మీరు ఒక కృత్రిమభాషని రూపొందిస్తున్నారు. మీరు ఆ ప్రమాణభాషకు కావ్యభాషా వ్యాకరణాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పుకుంటున్నారుగాని, నిజానికి కవులు ఎప్పటికప్పుడు తమకాలంలో ప్రచలితంగా ఉన్న వ్యావహారిక భాషనీ, వ్యావహారిక వ్యాకరణాన్నే వాడుకున్నారన్న సంగతి మర్చిపోతున్నారు. అందువల్ల మీరు కావ్యభాషా వ్యాకరణంగా చెప్తున్నది కూడా నిజానికి ఒక కృత్రిమ వ్యాకరణమే’ అని. తన సుభద్ర కావ్యంలో గురజాడ ‘బ్రతుకు నందులేని స్థిరత భాషకెక్కడిది?’ అని అన్నాడు కూడా. మరి దీనికి పరిష్కారం ఏమిటి? పిల్లలకి మనం పాఠశాలల్లో తెలుగు బోధించవలసి వచ్చినప్పుడు ఒక ప్రామాణిక భాష అంటూ లేకపోతే ఎన్ని మాండలికాల్లో వాళ్ళకి చదువుచెప్పగలుగుతాం? అందుకని వ్యావహారిక భాషావాదులు శిష్టవ్యావహారికం అనే భావనని ముందుకు తీసుకొచ్చారు. శిష్టవ్యావహారికం అంటే అధునిక విద్యని అభ్యసించిన కొత్త తరం విద్యావంతులు ఏ తెలుగులో మాట్లాడున్నారో ఆ తెలుగు అని కూడా దాన్ని వివరించారు. 18501920 మధ్యకాలంలో ఆ కొత్త తరం విద్యావంతులు ప్రధానంగా కృష్ణా-గోదావరీ మండలాలనుంచి (పూర్వపు వేంగీ రాజ్యం) వచ్చారుకాబట్టి వాళ్ళ భాషనే శిష్టవ్యావహారిక భాషగా అంగీకరించవచ్చునని వాదించారు.

కాని ఇది 1920 ల మాట. 1950 లతర్వాత, ఇంకా చెప్పాలంటే, 1980 ల తర్వాత అక్షరాస్యతలో అనూహ్యమైన పెరుగుదల సంభవించాక, దళితులు, గిరిజనులు, స్త్రీలు, చేతివృత్తులవారు, మైనారిటీలు కూడా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున అక్షరాస్యులుగా, మెట్రిక్యులేట్లుగా, ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతూ వస్తున్నాక, ఇప్పుడు మనం ఏ భాషని శిష్టవ్యవాహారిక భాషగా పరిగణించవలసి ఉంటుంది?

అంటే మనం మళ్ళా  మొదటికొచ్చాం. 1910-15 మధ్యకాలంలో భాషావేత్తలు ఏ ప్రశ్నల్ని ఎదుర్కొన్నారో ఇప్పుడు మనం కూడా మళ్లా కొత్తగా ఆ ప్రశ్నలే ఎదుర్కొంటున్నాం. అప్పుడు ఆధునిక విద్యకోసం ఎటువంటి తెలుగుని ఉపయోగించవలసి ఉంటుంది అన్నదాని మీద చర్చ నడిస్తే, ఇప్పుడు మన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎటువంటి తెలుగుని వాడవలసి ఉంటుంది అన్నది ప్రశ్న. అప్పుడు శిష్టవ్యవహారికం అంటే విద్యావంతులు మాట్లాడే తెలుగు అని నిర్వచించారు. కాని ఇప్పుడు దాదాపుగా పత్రికల్లో వాడే భాష శిష్టవ్యవహారికంలా కనిపించే ఒక గ్రాంథిక భాష అని చెప్పక తప్పదు. ఇప్పుడు మీడియా మాండలికాలల్లో మాట్లాడటం మొదలుపెడితే, వివిధ ప్రాంతాల మధ్య ఒక ఉమ్మడి భావవినిమయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్న కూడా తలెత్తవచ్చు.

మాండలికస్పృహ

నా ప్రసంగంలో నేను ఈ ప్రశ్ననే కొంత వివరంగా చర్చించాను. నేను భావిస్తున్నదేమిటంటే, పత్రికలు, మీడియా మాండలికంలో రాయడం లేదా మాట్లాడటం ఒక అంశం. కాని అంతకన్నా కూడా మాండలిక స్పృహతో రాయడం మరీ ముఖ్యం. మాండలికస్పృహ అంటే ఏమిటి? అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తనకంటూ ఒక నిర్దిష్ట భాషాసంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తూంటుందనీ, మనం భాషని ప్రామాణీకరించే క్రమంలో మనకు తెలీకుండానే అత్యధిక సంఖ్యాకులైన ప్రజలకు దూరంగా జరిగిపోతూ ఉంటామనీ తెలుసుకోవడం. ఒకప్పుడు గ్రాంథిక భాషావాదులు చేసిన పొరపాటు ఇదే. ఇప్పుడు మనం కూడా మన మీడియాలో ఒక ప్రామాణికభాష (అది పూర్వంలాగా స్పష్టంగా నాలుగు జిల్లాల భాష కాకపోవచ్చు), కానీ అది ఏ ప్రాంతానికీ చెందని భాష కూడా. నిజానికి అది విద్యావంతులు మాట్లాడే భాష కాదు కూడా.

సాధారణంగా అనేక మాండలికాలు ప్రచలితంగా ఉన్న ఒక భాషాప్రాంతంలో రాజధానిలో ఏ మాండలికం మాట్లాడుతూ ఉంటే దాన్నే ఆ భాషగా భావిస్తూ ఉండటం కద్దు. కాని ఆంధ్రదేశ చరిత్రలో ఆదినుంచీ ఒక రాజధాని లేదు. ఇప్పుడు అక్షరాస్యత విస్తరించి, వివిధ ప్రజాసమూహాలు తమ సాహిత్యాన్ని తమ మాండలికంలో సృష్టించుకోగలిగే స్థాయికి చేరుకున్నాక రాజధానిలో మాట్లాడే మాండలికాన్ని కూడా ప్రమాణభాషగా అంగీకరించే పరిస్థితి ఉండదు. కాబట్టి భాషావ్యవహారానికి సంబంధించి మీడియా  ప్రధానంగా ఈ మూడు సూత్రాల్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుందని నేను నా ప్రసంగంలో వివరించాను.

అ) అన్యదేశ్యాల వినియోగం

ఒక మాండలికంలో మాట్లాడే వ్యక్తి శిష్ట వ్యవాహారికంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడు? ‘తెలుగు మాండలికాలు-ప్రమాణ భాష’ అనే గొప్ప వ్యాసంలో భద్రిరాజు కృష్ణమూర్తిగారు చెప్పిందేమంటే ‘అల్పవ్యవహార పరిథిగల జానపదులకు అధికవ్యవహారిక దక్షత గల విద్యావంతులు ఆదర్శమై వాళ్ళ భాష, కట్టు, నడవడి ఒరవడి అవుతాయి’ అని (తెలుగు భాషా చరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, 2017, పే.422). నిజానికి ఒక భాషావ్యవహర్త తన పరిమిత సమాజం నుంచి విస్తృత సమాజంలోకి ( అంటే గ్రామం నుంచి పట్టణానికో, పట్టణం నుంచి నగరానికో, లేదా విజయవాడ-గుంటూరు నుంచి అమెరికాకో) ప్రవేశించినప్పుడు తన మాండలికాన్ని శిష్టవ్యావహారికంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తాడు అనేది ఆయన చెప్తున్నమాట. అలా ఒక మాండలికం శిష్టవ్యవహారంగా రూపొందే సందర్భంలో ఉచ్చారణలో వచ్చే మార్పు ప్రధానమైంది. అటువంటి మార్పుల్ని ఆయన ఎనిమిది రకాలుగా గుర్తించి, అందులో సగానికి సగం మార్పులు అన్యదేశ్యాల విషయంలోనే సంభవిస్తాయని చెప్పాడు (పే.421-422) . అంటే ఒక మాండలికాన్న్ని ప్రమాణభాషగా మార్చే క్రమంలో అన్యదేశ్యాలు ముఖ్యపాత్ర వహిస్తాయన్నమాట.

సరిగ్గా ఈ అంశంలోనే ఇప్పటి పత్రికలు గ్రాంథిక భాషావాదుల్లాగా ప్రవర్తిస్తున్నాయని మనం గమనించాలి. ఒక అన్యదేశ్యం ఒక భాషలోకి పాలకుల వల్ల మాత్రమే కాదు, ఆ వస్తువులు కూడా ఆ సమాజంలో అంతకు ముందులేకపోతే, ఆ పాలకుల వల్లనే కొత్తగా ఆ సమాజంలోకి ప్రవేశిస్తే, ఆ అన్యదేశ్యాల్ని మనం యథాతథంగా స్వీకరించవలసి ఉంటుంది. ఉదాహరణకి, రైలు, బస్సు, సైకిలు, పోస్టు, గ్లాసు లాంటి భావనలు, వస్తువులు తెలుగుసమాజంలో ఆదినుంచీ వున్నవి కావు. కాబట్టి ఆ వస్తువులు, భావనలు తెలుగు సమాజంలోకి ప్రవేశించినప్పుడు మనంవాటిని యథాతథంగా అంగీకరించుకోవడమే వ్యావహారిక భాష అవుతుంది. అలాకాక వాటికి తెలుగు సమానార్థకాలు రూపొందిస్తే అది మళ్ళా గ్రాంథికీకరణనే అవుతుంది. అసలు అటువంటి సమానార్థక పదాల కల్పన అవివేకం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. ఉదాహరణకి file అనే ఇంగ్లిషు పదం ఈస్టిండియా కంపెనీతో ప్రవేశించిన పదం. ఒక ఆఫీసులో జరిగే పనుల్నీ, తీసుకునే నిర్ణయాల్నీ రాసిపెట్టుకునే కాగితాల బొత్తి అది. అలాగని అది వట్టి బొత్తి కూడా కాదు. అందులో మళ్ళా నోట్ ఫైలు అనీ, కరెస్పాండింగ్ ఫైలు అనీ రెండు భాగాలుంటాయి. దీనికి ‘దస్త్రం ‘అనే పదాన్ని సమానార్థకంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించినవారికి ఫైలు అంటేనూ తెలీదు, దస్త్రం అంటేనూ తెలీదనే చెప్పాలి. నిజానికి దస్త్రం కూడా తెలుగు పదం కాదు. పారశీక పదం. అది దస్తర్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం గుడ్డ అని. కాగితాలు చుట్టిపెట్టుకునే గుడ్డని దస్త్రం అనడం వాడుకలోకి వచ్చింది. ఏ విధంగా చూసినా ‘దస్త్రం’ ‘ఫైలు’ కాదు. దస్త్రం అనే మాటవినగానే ఏ ఆఫీసు క్లర్కుకి కూడా ఫైలు అని స్ఫురించనే స్ఫురించదు. ఇక 1980 తర్వాత కంప్యూటరైజేషన్లో భాగంగా, కంప్యూటర్లో మనం రూపొందించుకునే డాక్యుమెంటుని కూడా ఫైలు అని వ్యవహరిస్తున్నాం. మరి దాన్ని కూడా దస్త్రం అనే అనాలా? ఎయిర్ హోస్టెస్ ని గగనసఖి అని, కంట్రాక్టరును గుత్తేదారు అనీ రాయడం కూడా అటువంటి అవివేకమే.

ఆ) సామాజిక-ఆర్థిక రంగాల్లో దేశిపదజాల వినియోగం

అయితే అలాగని వ్యవహారంలో ఉన్న అన్ని అన్యదేశ్యాల్నీ మనం యథాతథంగా వాడుకోవాలా? దానికి భాషావేత్తలు చెప్పేదేమంటే, ఆ అన్యదేశ్యానికి తెలుగులో అప్పటికే సమానార్థకంగా ఉండే ఒక పదం వాడుకలో ఉంటే ఆ పదాన్నే వాడడం మంచింది అని. లేకపోతే ఆ అన్యదేశ్యం ఆ దేశపదాన్ని focal area నుంచి relic area కి నెట్టేస్తుంది. పెళ్ళి అనే పదం వాడుకలో ఉండగా ‘వెడ్డింగ్’ అనే పదాన్ని మనం వాడనవసరంలేదు. పాలు అనే పదం సజీవంగా ఉండగా ‘మిల్క్’ ని మనం వాడనక్కర్లేదు.

మరి మాండలిక స్పృహ అంటే ఏమిటి? మన సమాజంలో వ్యవసాయానికీ, అడవికీ, మత్య్సకారజీవితానికీ, చేనేతకీ, వివిధరకాల చేతివృత్తులకీ, దేశ, కాల, ఋతు వాచకాలకీ సంబంధించి ప్రచలితంగా ఉన్న ఆపారమైన దేశి పదజాలాన్ని వాడటం, ఆ పదజాలాన్ని  ఆ రూపంలోనే వాడటం మాండలిక స్ఫృహ అవుతుంది. ఉదాహరణకి ఒక పత్రికలో అల్లూరి సీతారామాజు జిల్లా ఎడిషన్ లో ఉన్న ఒక వార్తలో జీడిమామిడి పిక్కల గురించిన వార్తలో జీడిపిక్కలు అని రాసారు. అది సరైన పదప్రయోగం. ఎందుకంటే ఆ ప్రాంతంలో జీడిమామిడి పిక్కలు అని కాకుండా జీడిపిక్కలు అనే వ్యవహరిస్తారు.

ప్రజాజీవితానికి సంబంధించిన వ్యవసాయ, వాణిజ్య, వృత్తి పదకోశాన్ని మన పత్రికలు ఎంత విస్తారంగా వాడగలిగితే అంత మంచింది. అటువంటి ప్రయత్నం వల్ల మీడియా ప్రజలకి మరింత సన్నిహితంగా జరుగుతుంది.

ఇ) వాక్యనిర్మాణ మౌలిక రూపాల పట్ల స్పృహ

పదజాలం తర్వాత మాండలికాన్నీ, ప్రమాణ భాషనీ వేరుచేసే మరొక ముఖ్యమైన అంశం వాక్యనిర్మాణం. దీన్ని syntax అంటాం. ప్రతి మాండలిక ప్రాంతంలోనూ ప్రత్యేక వాక్యనిర్మాణ శోభ ఉంటుంది. మీడియా దృష్టిపెట్టవలసింది వాక్యనిర్మాణం మీద, పదజాలం మీద కాదు. మనం తరచూ పదజాలాన్ని భాషగా పొరపడుతుంటాం. ఉదాహరణకి ఇంగ్లిషు ప్రధానంగా ఆంగ్లో సాక్సన్ మాండలికం. కాని ఈ రోజు ఇంగ్లిషులో ఆంగ్లో సాక్సన్ పదజాలం 45 శాతం మాత్రమే. డిక్షనరీలో ఉండే ఆంగ్లో సాక్సన్ మూల పదజాలం 20 శాతం మాత్రమే. ఒక భాష అన్యదేశ్యాల్ని ఎంత ఎక్కువగా స్వీకరిస్తే అది ఆ భాష బలానికి గుర్తు తప్ప బలహీనతకు కాదు. కాబట్టి ఒక భాష మౌలిక స్వరూపాన్ని నిర్ణయించేది వాక్యనిర్మాణమే తప్ప పదజాలం కాదు. కాని ఈ రోజు పత్రికల్లో వాడే వాక్యనిర్మాణం ఇంగ్లిషు వాక్యనిర్మాణాన్ని అనుసరిస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇంగ్లిషు conjunctions ని కృత్రిమంగా తెలుగులోకి తెచ్చుకుంటూ నిర్మిస్తున్న వాక్యనిర్మాణమే పత్రికల్లో కనిపిస్తున్నది. మీడియాకి మాండలిక స్పృహ ఉంటే ఇటువంటి కృత్రిమనిర్మాణాలు సంభవించవు. ఇంకా చిత్రమేమిటంటే దాదాపుగా ప్రతి పత్రికలోనూ ఆయా పత్రికా సంపాదకులు ప్రతి రోజూ రాసే సంపాదకీయాల్లో కనిపించే తెలుగు పూర్తి గ్రాంథికఫక్కీలోనే ఉండటం. ఎంత మంది ఆటోడ్రైవర్లు, హోటలు సర్వర్లు, రైతుకూలీలు, చివరికి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ సంపాదకీయాలు చదువుతున్నారో తెలుసుకోడానికి ఇప్పటిదాకా ఏ పత్రికాసంపాదకుడూ ప్రయత్నించిన సంగతి నేను వినలేదు. అందుకే చెప్తున్నాను, మన పత్రికల భాష గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో లోతుగా, విస్తృతంగా పరిశోధించవలసిన అవసరం ఉందని.

Featured image courtesy: Wikicommons

12-6-2023

8 Replies to “తెలుగు జర్నలిజం, మాండలికాలు”

 1. ఈనాడు దిన పత్రిక అంత ప్రాచుర్యం లోకి రావడానికి ముఖ్యమైన కారణాలలో చక్కని వ్యక్తీకరణ ఒకటి గా చెప్పుకోవచ్చు.
  చెప్పే విషయం లో స్పష్టత ఉండాలి. ఎక్కువ మంది ప్రజల వాడుకలోని భాషని వాడటం ఎంతో ప్రయోజనకరం.
  మరీ “జోర్డార్”,”తీన్మార్” వార్తల్లా కాకుండా భాష శిష్ట వ్యావహారికంగా ఉంటేనే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం.

 2. సర్ మీరు రాసిన వాటన్నిటితో ఏకీభవిస్తున్నాను. కానీ మన ఆలోచించవలసింది జర్నలిజం వైపు ఎవరు వస్తున్నారనేది. భాషాపరంగా వారు ఎంతవరకు అర్హులు. చాకిరీ ఎక్కువ, రాబడి తక్కువ ఉన్న ఈ రంగానికి వచ్చేవారు ఎవరు అనేది ఒక సమస్య. ఇది ఒక మానసిక విశ్లేషణ కు సంబంధించిన విషయం. చదువు ఎక్కువ లేకపోయినా శారీరిక శ్రమకు సంబంధించిన పనులు చేయలేని , ఒకరకంగా కొంచెం డాబుసరి మనస్తత్వం కల వాళ్లు మౌలిక స్థాయిలో విలేకరులుగా వస్తున్నారు. గట్టిగా ఒక పుస్తకం చదువని వాళ్లు కూడా అదమదులే ఉన్నారు. ఇక వాళ్లకు ఇన్ని భేదాలు ఎలా తెలుస్తాయి? కాకపోతే వాళ్లు తెచ్చిన వార్తల్ని ఎడిట్ చేసే వారున్నారు కనుక కొంతలో కొంత నయమని చెప్పవచ్చు.

   1. వరదాచారి, బూదరాజు రాధాకృష్ణ గార్ల తర్వాత మీరు మాత్రమే ఈ అంశాన్ని స్పృశించారనిపిస్తోంది. ఎందుకంటే, మారుతున్న పరిస్థితుల్లో మీ సూచనలు అమూల్యమైనవి. బడాయికి పోకుండా, అన్య దేశ్యాల్ని వాడటం తప్పుకాదు, అవి జన బాహుళ్యము లో బాగా వాడుకలో ఉన్నాయి. కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ధన్యవాదాలు అండి.

   2. IAS aspirantsకు Mains exam writingకు ఎంతో ఉపయోగపడుతుంది. 🙏

Leave a Reply

%d bloggers like this: