
వారం రోజుల కిందట సి ఏ ప్రసాద్ గారు ఫోన్ చేసి షాద్ నగర్ లో ఒక స్వచ్ఛంద సంస్థ ఎఫ్.ఎల్.ఎన్ మీద పనిచేస్తోందనీ, ఈ ఆదివారం వాళ్ళ వార్షికోత్సవం జరుపుకుంటున్నారనీ, దానికి నన్ను అతిథిగా రమ్మనీ అడిగినప్పుడు మరే వివరాలూ అడక్కుండా సరేనన్నాను. ఎందుకంటే ప్రసాద్ గారు పిలుస్తున్నారంటేనే ఆ సంస్థ విద్యారంగంలో అద్భుతమైన కృషి ఏదో చేస్తూ ఉంటుందని నా నమ్మకం. నిన్న సాయంకాలం సెస్ ఆడిటోరియంలో జరిగిన ఆ వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు నా నమ్మకం వమ్ముకాలేదు.
సర్వరాజు శ్రీనివాస ప్రసాద్, హరిత అనే ఇద్దరు దంపతులు షాద్ నగర్ కేంద్రంగా యువతకోసం ఏదేనా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో 2008 లో అమ్మ సోషల్ వెల్ఫేర్ అసొసియేషన్ ని ‘అశ్వ’ పేరుమీద ప్రారంభించారు. ఆ సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించి దాదాపు ఎనిమిది రంగాల్లో నడుస్తూ పదిహేనేళ్ళు పూర్తిచేసుకున్నాయి. నిన్న పదిహేనవ వార్షికోత్సవం. ఆ వేడుకలో మాధవపెద్ది సురేష్, సి.ఏ. ప్రసాద్,మంచి పుస్తకం సురేష్, శాంతారాం, వి.ఆర్.శర్మ, భావరాజు పద్మిని వంటిమిత్రులతో సహా మరెందరో పెద్దలు పాల్గొన్నారు. పిల్లలు, వాలంటీర్లు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేసిచూపించారు. కొందరు వాలంటీర్లు సంస్థతో తమ ప్రయాణ విశేషాలు వివరించారు. శ్రీనివాస్, హరిత కూడా తమ అనుభవాల్ని పంచుకున్నారు. దాదాపుగా అందరూ చెప్పింది ఒకటే: తమ సంస్థ కార్యక్రమాల వల్ల ఇతరులకు సహాయపడటం, సేవ చెయ్యడం అనే పేరుమీద వ్యక్తిగతంగా తాము మరింత మానసిక వికాసాన్ని సాధించుకోగలిగామనీ, మనుషులుగా ఎదగగలిగామనీ.
వారు చేపడుతున్న కార్యక్రమాల్లో నన్ను విశేషంగా ఆకర్షించినవి విద్యకి సంబంధించిన రెండు కార్యక్రమాలు. ఒకటి షాద్ నగర్ లో 2021 డిసెంబరులో ప్రారంభించిన చిల్డ్రన్ లిటరసీ సెంటర్. దాదాపు రెండువేల ఇంగ్లిషు తెలుగు లైబ్రరీ పుస్తకాలు పోగుచేసి ఆ సెంటర్ ద్వారా పిల్లల్లో అక్షరాస్యత, సామాజిక, వ్యక్తిగత విలువలు పెంపొందించడానికి వారు చేపడుతున్న కృషి. చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన 67 మంది పిల్లలు ఆ లెర్నింగ్ సెంటర్ ద్వారా తమని తాము తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. నిన్న రాత్రి నాకూ చాలా బాగా నచ్చిన అంశం పిల్లలు తాము చదివిన కథల పుస్తకాల్లోంచి రెండు కథల్ని నాటకాలుగా మార్చి ప్రదర్శించడం. పాఠశాలల్లో గ్రంథాలయాలు నడపడంలో తమ అవగాహనని సమూలంగా మార్చేసింది గోవాలోని Bookworm Trust and Library వారు అని శ్రీనివాస్ నాకు చెప్పాడు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు పర్సన్-ఇన్-ఛార్జిగా ఉన్నప్పుడు ఈ శ్రీనివాస్ పరిచయమై ఉంటే ఎంత బాగుండేది!
నాకు ఆ ప్రదర్శన చూస్తూ ఉండగా నాలుగైదేళ్ళకిందటి ఒక సంఘటన గుర్తొచ్చింది. ఒకరోజు నేను హైదరాబాదులో ఒక కార్పొరేట్ విద్యాసంస్థ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు అక్కడ పిల్లలూ, వాళ్ళ తల్లిదండ్రులూ కూడా తళతళలాడిపోతూ ఉన్నారు. స్కూలంతా విద్యుద్దీపాల అలంకరణతో ధగధగలాడిపోతూ ఉంది. ఆ రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టే ముందు పదినిముషాల పాటు ఆ పాఠశాల ఫౌండరు మీద ఒక డాక్యుమెంటరీ చూపించారు. ఆయన బతికేవున్నాడు. అతడు తాను నడుపుతున్న వివిధ విద్యాలయాలకి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంగణాల్లో అడుగుపెట్టగానే పిల్లలు అతడిమీద బంతిపూలూ, గులాబీపూలూ చల్లుతుండే దృశ్యాలే ఆ సినిమా మొత్తం. తల్లిదండ్రులు వేలాది రూపాయలు ఫీజులు కట్టి తమ పిల్లల్ని ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే, ఆ పిల్లలు ఆ వ్యాపారి మీద పూలు చల్లటమేమితో నాకూ అర్థం కాలేదు. తీరా కల్చరల్ ప్రోగ్రాములు మొదలుకాగానే దాదాపు గంటసేపు లేటెస్టు సినిమా పాటలకి పిల్లల రికార్డింగు డాన్సు నడిచింది. అధిక ఆదాయ వర్గాలకు చెందిన, విద్యాధికులైన ఆ తల్లిదండ్రులు తమ పిల్లలు రికార్డింగు డాన్సు చేస్తున్నంతసేపూ ఉత్సాహంతో ఈలలు వేస్తూ ఉన్నారు. చప్పట్లు చరుస్తూ ఉన్నారు. కేకలు పెడుతూ ఉన్నారు. చివరికి వాళ్ళ ఉత్సాహం శ్రుతిమించి వాళ్ళు డాన్సు డాన్సుకీ ఫొటోలు తీసుకోడానికి స్టేజి మీదకి ఎగబడుతుంటే, ఆ నిర్వాహకులు ఆ మాస్ హిస్టీరియా తట్టుకోలేక, పేరెంట్స్ అలా ఎగబడుతుంటే తాము ప్రోగ్రాం ఆపేయాల్సి ఉంటుందని హెచ్చరించవలసి వచ్చింది కూడా. నా జీవితంలో ఒక పాఠశాల వార్షికోత్సవానికి వెళ్ళి అంత రోత పడ్డ అనుభవం అంతకు ముందూ లేదు, ఆ తర్వాతా లేదు.
కాని నిన్న వార్షికోత్సవంలో పాల్గొన్న పిల్లలు షాద్ నగర్, రామ్ నగర్ కాలనీలకు చెందిన మురికివాడల నుంచి వచ్చిన నిరుపేద కుటుంబాల పిల్లలు. వాళ్ళు తాము చదివిన పుస్తకాల్లోని కథల్ని నాటికలుగా మార్చారు. దేశభక్తిగీతాలకీ, లలితగీతాలకీ, పద్యాలకీ నృత్యాలు చేసారు. ఆ కార్పొరేట్ స్కూల్లో ఆ రాత్రి నేను చూసిన ఆ రికార్డింగ్ డాన్సుకీ, నిన్న ఈ పేదపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలకీ మధ్య ఒక తాగుడు పార్టీకీ, ఒక కుటుంబవేడుకకీ మధ్య ఉన్నంత తేడా కనిపించింది. ఏమిటి దీనికి కారణం? నిన్నటి ఆరోగ్యప్రదమైన వేడుక వెనక, ఆ స్వచ్ఛంద సంస్థ కృషి ఎంత ఉందో, ఆ నిరుపేద తల్లిదండ్రుల ఆరోగ్యకరమైన మనస్సులు కూడా అంతే ఉన్నాయని చెప్పక తప్పదు.
దాదాపు అయిదు పాఠశాలలకి చెందిన 130 మంది పిల్లలకి ఆ సంస్థ అమలు చేస్తున్న ఎఫ్.ఎల్.ఎన్ నిన్న నన్ను ఆకర్షించిన రెండో కార్యక్రమం. కొన్ని లక్షల మంది విద్యార్థుల కోసం కొన్ని వేల ప్రభుత్వ బడుల్ని నడిపిన నాలాంటి వాడు అయిదు పాఠశాలల్లో, 130 మంది పిల్లల కోసం చేపడుతున్న కృషి గురించి మాట్లాడుతుండటం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలూ చెయ్యలేనిదీ, స్వచ్ఛంద సంస్థలు చెయ్యగలిగేదీ ఇటువంటి ప్రయోగాలే. మనసుపెట్టి, శ్రద్ధగా పిల్లలకి చదువు చెప్పడం, వేలాదిపాఠశాలల్లో లక్షలాదిమంది, ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గర మనం ఇంత స్పష్టంగా చూడలేం. ప్రభుత్వ రంగంలో విద్య గురించి చేసే ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా ఒక పెద్ద కొండని ఇటునుంచి అటు జరపడంతోటే సరిపోతుంది. కాని ప్రతి మొక్కకీ పాదుతీసి, ప్రతి కుదుటిలోనూ నీళ్ళు పారేలాగా మొక్కమొక్కకీ శ్రద్ధగా నీళ్ళు పెట్టగలిగే దృశ్యం ఒక ప్రభుత్వ విద్యాశాఖాధికారి చూడడానికి నోచుకోగలిగింది కాదు. ఒక పెద్ద యంత్రాన్ని పనిచేయించడంలోనే అతడి శక్తి సామర్థ్యాలన్నీ ఆహుతైపోతాయి. అందుకనే ఒక పి.డి.కె. రావుగారి ‘శోధన’, ఒక మంగాదేవి గారి ‘చేతన’, ఒక వేణుగోపాల రెడ్డిగారి ‘ఏకలవ్య’, ఒక కృష్ణ వంటి విద్యావేత్త నడిపే ‘అభ్యాస’ విద్యాలయ వంటివాటిలో చూడగలిగిన దృశ్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో మామూలుగా కనిపించేవి కావు. ఒకవేళ ఒక విజయభాను కోటె వంటి ప్రభుత్వ ఉపాధ్యాయిని ఎక్కడో అరుదుగా కనిపించినా చుట్టూ ఉన్న సమాజం ఆమెని ఎంత సఫొకేట్ చేస్తుందో అది కూడా నేను కళ్ళారా చూసాను.
ఎఫ్.ఏల్.ఎన్ అంటే Foundational Literacy and Numeracy. గత రెండేళ్ళుగా భారతప్రభుత్వం ఈ కార్యక్రమం మీద విస్తారంగా ఆలోచిస్తూ ఉంది. రెండేళ్ళ సుదీర్ఘ చర్చలతర్వాత, ఎన్నో సార్లు తాము రాసుకున్న విధాన పత్రాలు తామే మార్చుకుంటూ వచ్చిన తర్వాత, ఇప్పటికి రెండు స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టే మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది. మొదటిది 3-6 వయసు గల పిల్లలకి ఉన్ముఖి పేరుమీద pre-school కార్యక్రమాలు నిర్వహించడం గురించిన సూచనలు. ఆ మూడేళ్ళ ప్రి-స్కూల్ కి భారతప్రభుత్వం బాలవాటిక అని పేరుపెట్టింది. ఆ తర్వాత 6-8 ఏళ్ళ మధ్య వయసుగల పిల్లలకి అవసరమైన Learning Outcomes (LOs) సాధించడంకోసం చేపట్టవలసిన కార్యక్రమం. దీన్నే FLN అంటున్నది. 2026-27 నాటికి దేశంలో బాలబాలికందరూ 3వ తరగతి పూర్తిచేసేటప్పటికి ఈ కనీస సామర్థ్యాలు సాధించేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ లోపు ఒకటవ తరగతిలో చేరే పిల్లలకి ఆ తరగతిలో చేరడానికి అవసరమైన కనీస సామర్థ్యాలు ఉండేలా చూడటం కోసం మూడు నెలల ‘విద్యాప్రవేశ్‘ కార్యక్రమం అమలు చెయ్యడం. ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాలకి కొత్త కాదు. పాఠశాల సంసిద్ధత పేరుమీద గత పాతికేళ్ళుగా ప్రభుత్వం ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంది. అయితే మొదటిసారిగా, భారతప్రభుత్వ స్థాయిలో దీన్నొక విధాననిర్ణయంగా, ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా అమలు పరచవలసిన కార్యక్రమంగా ఇప్పుడు ప్రకటించారు.
నేను పోయినేడాది పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాదుకి వచ్చేసినప్పటినుంచీ, ఈ FLN మీద లోతుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ఏమి చేస్తే పిల్లలకి పునాది పటిష్టమవుతుంది ది నా ప్రశ్న కూడా. పిల్లల్లో భాషాభివృద్ధి, కనీస గణిత సామర్థ్యాలు పెంపొందించడంలో మనం ఇప్పుడు పాటిస్తున్న పద్ధతుల్ని ఏ మేరకు సరిదిద్దుకోవలసి ఉంటుందన్నది ఈ ఏడాదిగా నేను పదే పదే వేసుకుంటూ వస్తున్న ప్రశ్న. బాలవాటిక, FLN ల కి సంబంధించి ఎన్.సి.ఇ.ఆర్.టి కరికులం ఫ్రేమ్ వర్క్ ను ఇన్నాళ్ళకు సమగ్రంగా రూపొందించింది. కాని ఆ మార్గదర్శక సూత్రాల్ని రాష్ట్రాల ఎస్.సి.ఇ.ఆర్. టిలు అర్థం చేసుకోవాలి, అందుకు తగ్గట్టుగా పాఠ్యప్రణాళికలు రూపొందించాలి, ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఈ కొత్త విధానాల ఆవశ్యకతను అర్థం చేసుకోవాలి, వాటిని అనుసరిస్తూ తమ పాఠశాలల్ని క్రియాశీలకం చేసుకోవాలి. ఈ ప్రయాణం కడుదీర్ఘం.
కాని కీలకమైన ప్రశ్న ఒకటి మిగిలే ఉంది. ఎందుకని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు మూడవతరగతి పూర్తిచేసినా మూడవ తరగతి సామర్థ్యాల్ని పొందలేకపోతున్నారు? ఒక జవాబు ఏమిటంటే, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకి మూడేళ్ళ ప్రి-స్కూలు అనుభవం ఉండదుకాబట్టి అనేది. కాని నిన్న ‘సన’ అనే ఒకమ్మాయి తొమ్మిదవతరగతి చదువుతున్న బాలిక తాను సముపార్జించుకోగలిగిన సామర్థ్యాలన్నీ ఒక్క ఏడాదిలోనే తమ కాలనీలో పెట్టిన సి.ఎల్.సి ద్వారా సాధించుకోగలిగానని చెప్పింది. అంటే శ్రద్ధగా, చిలక్కి చెప్పినట్టు, కూడా ఉండి బోధించే ఉపాధ్యాయుడు దొరికితే పిల్లలు ఏ దశలోనైనా కనీస సామర్థాయులు పొందడానికి ఆరునెలలు చాలనేది నాకు పదే పదే తెలుస్తూన్న సత్యం.
కాని వ్యక్తిగత శ్రద్ధ మాత్రమే కాకుండా, మెథడాలజీలో కూడా ఏదైనా మార్పు అవసరమా? గత ఏడాదిగా నేను ఈ అంశం మీదనే మరింత తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ రంగంలో ఎవరెవరు ఎటువంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నారా అని అన్వేషిస్తోనే ఉన్నాను. నిన్న రాత్రి నాకు అటువంటి మరొక కొత్త ప్రయోగం గురించి తెలిసింది. ఆ సంస్థని నడుపుతున్న శ్రీనివాస్, హరిత దేశంలో ఇన్నొవేటివ్ గా పాఠశాలలు నడుపుతున్న ఎన్నో సంస్థల్ని సందర్శించి తమ అవగాహనని పదునుపెట్టుకుంటూ, ఆ క్రమంలో వారు మహారాష్ట్రలో మక్సీన్ బెర్న్ స్టీన్ అనే ఒక అమెరికన్ లింగ్విస్టు గత అరవయ్యేళ్ళుగా చేపడుతున్న Balanced Literacy Approach గురించి తెలుసుకున్నారు. ఆమెని వెళ్ళి కలుసుకున్నారు. ఆమె రూపొందించిన పద్ధతులమీద తమ వంతు ప్రయోగాలు తాము మొదలుపెట్టారు.
Balanced Literacy Approach భాషాబోధనలో ఒక కొత్తపుంత. పిల్లలు, మూడేళ్ళ వయసులోగాని, ఆరేళ్ళ వయసులోగాని, పాఠశాలకు వచ్చేటప్పటికే, తమ మాతృభాషలో కనీసం నాలుగువేల పదాల పరిజ్ఞానంతోనూ, కనీస వ్యాకరణసామర్థ్యంతోనూ, ఎన్నో భావోద్వేగభరితమైన అనుభవాలతోనూ అడుగుపెడతారనీ, కాని పాఠశాల పిల్లల్లో ఉన్న ఆ సామర్థ్యాలను పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నదే చెప్పడం మొదలుపెడుతుందనీ, అందువల్లనే పిల్లల భాషా సామర్థ్యాలు వికసించడం ఆగిపోతాయనీ, కాబట్టి సరైన భాషాబోధన, ఇంటిభాషనీ, బడిభాషనీ సమనిర్వహణ చెయ్యవలసి ఉంటుందనీ Balanced Literacy Approach భావిస్తుంది. గత ఏడాదిగా నాకు అర్థమవుతున్న విషయం కూడా ఇదే. అదేమంటే భాషాబోధన అనగానే మన ఉపాధ్యాయులు వర్ణమాలతో మొదలుపెడతారు. అక్షరపద్ధతిలో చెప్పాలా, పదపద్ధతిలో చెప్పాలా అని గత ఇరవయ్యేళ్ళుగా మన పాఠ్యపుస్తక రచయితలు వాదించుకుంటూనే ఉన్నారు. కాని ముందు పిల్లలతో వాళ్ళకి వచ్చిన, తెలిసిన భాషని మాట్లాడించడంతో భాషాబోధన మొదలుకావాలనేది ఈ కొత్తప్రయోగాలు మనకి చెప్తున్న సంగతి.
విజయవాడలో గుణదలలో నడుస్తున్న అభ్యాస విద్యాలయంలో కృష్ణగారు, ఆయన శ్రీమతీ ఈ రంగంలో రూపొందించిన బోధన-అభ్యసన సామగ్రిని చూసినప్పుడు నా కళ్ళు తిరిగాయి. అటువంటి low-cost, no-cost TLM, అంత innovative TLM ని నేనిప్పటిదాకా ఎక్కడా చూడలేదు.. పిల్లలకు పరిచయమైన వస్తుప్రపంచం మీంచి ఆయన తన బోధన-అభ్యసన సామగ్రిని రూపొందించాడు. ‘అశ్వ’ సంస్థ అమలు చేస్తున్న FLN లో పిల్లల కుటుంబసంబంధాలు, వాళ్ళకి తెలిసిన మానవప్రపంచం మీంచి భాషాబోధన చేపడుతున్నారు. కాని ఈ రెండు ప్రయోగాలూ కూడా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కన్నా యోజనాల ముందున్నాయనడంలో మాత్రం సందేహం లేదు.
ఇటువంటి ప్రయోగశీల విద్యావేత్తలని కలుసుకున్న రోజులే నా జీవితంలో నేను కూడబెట్టుకునే ఆస్తులు. ఈ ప్రయోగం తరగతిగదిలో ఎలా అమలు జరుగుతోంది అని మరింత లోతుగా చూడటానికి రానున్న రోజుల్లో షాద్ నగర్ వెళ్ళకతప్పదనుకున్నాను. నిన్న సాయంకాలం వెళ్ళిన వేడుక వల్ల అక్కడికి వచ్చినవారందరిలోనూ ఎక్కువ లబ్ధి పొందింది నేనే అని కూడా తెలుసుకున్నాను.
Balanced Literacy Approach గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వెబ్ పేజీలు కూడా చూడవచ్చు:
https://yukon.ca/sites/yukon.ca/files/edu-balanced-literacy-booklet.pdf
https://study.com/academy/lesson/balanced-literacy-activities-examples.html
https://www.nlpsab.ca/download/137723
12-6-2023
నాకు ఎంతో అవసరమైన వ్యాసం sir
గడచిన ఏడాది నా ఉద్యోగ జీవితంలో అత్యంత క్లిష్టతను అనుభవించి, కొద్దిగా విజయం సాధించిన ఏడాది
ఇకపై ప్రయాణానికి ఎలా సన్నద్ధం కావాలని ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఈ వ్యాసం మీ ద్వారా నన్ను చేరడం ఆనందం కలిగిస్తున్నది
ధన్యవాదములు మీకు
ధన్యవాదాలు. విజయోస్తు.
I have read your observations and comments on the program. They are true in letter and spirit.I know these wonderful couple and their activities. They are truly committed to society through their selfless service. Their Passion for uplifting the poor through education is highly commendable. Wishing them all success in their path. I appreciate Sri వాడ్రేవు చిన వీరభద్రుడు గారు. His literary contributions are noteworthy. Thanks for sharing his thoughts and gracing the occasion. Wishing the ASWA organisation any more laurels.
Dr.Srinivasulu Gadugu
Homoeopathy Physician
Thank you for your valuable response.
Whole heartedly appreciate Seenu& Haritha for their splendid hard work in development of sweet kids in to literary banks of knowledge. I don’t have sufficient knowledge to say but a humble request in good olden days Sri Gidugu Ramamoorthy Pantulu garu done lots of literacy camps and in creating dialects in some of the tribal languages such as kodagu and savara like wise please plan a program with various unknown and hidden speeches of various tribal people with whom don’t have a proper writing knowledge except speech hidden in and around Telangana, . Hope you got my point. I will explain you in person. Wishing you all the best and blessings of all Gods.
Thank you so much for your response.
ధన్యవాదాలు గురువు గారు చాల మంచిగా వివరించారు.
ధన్యవాదాలు సార్
మన విద్యా వ్యవస్థ గురించి చాలా చక్కగా చర్చించారు సర్..
పాఠశాల విద్యార్థుల కర్రిక్యులం తయారు చేసే వారి లోపమా..
విద్యాశాఖ అధికారుల లోపమా.. ఉపాధ్యాయుల లోపమా… లేదా పిల్లల లోపమా తెలియదు.
ప్రభుత్వ బడులలో పిల్లల చదువు నానాటికి తీసికట్టుగా ఉంటున్నది. పిల్లలు చదివే తరగతి స్థాయికి ఉండవలసిన కనీస నైపుణ్యాలు కూడా ఉండడం లేదు.
వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులకు కనీస బాధ్యత ఉండడం లేదు.
ఇక ప్రైవేటు రంగంలో విద్య అనేది ఒక వ్యాపారం. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మార్కుల వెంట పరుగులు తీయించే చదువు.
దీనితో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై తనువులు చాలిస్తున్న వారు ఎందరో. దీనికి తోడు లక్షల్లో ఫీజులు.
ఎన్సీఈఆర్టీ ఎస్సీఈఆర్టీ వంటి వాటిల్లో కూడా రాజకీయ జోక్యంతో పదవులు సాధించిన వారు తిష్ట వేసి.. ఆ వ్యవస్థల్ని కూడా భ్రష్టుపట్టించారు.
విద్యారంగాన్ని..ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగాన్ని సంస్కరించవలసిన అవసరం చాలా ఉన్నది.
మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను
భాషా నైపుణ్యాలను పెంచటానికి ప్రాథమిక స్థాయి లో LSRW ఈ నైపుణ్యాలు తోడ్పడినంతగా మరే పద్ధతులు ఆచరణ యోగ్యం కావు అన్నది స్వానుభవం.
శ్రవణ,భాషణ, పఠన,లేఖన నైపుణ్యాలను పెంపొందించడమే భాషా సామర్థ్యాల పెంపుదలకు ప్రధాన ఆలంబనలు.
ఇందుకు ప్రాథమిక స్థాయి లో మాతృ భాష లో విద్యా బోధన పిల్లల్లో శ్రద్ధాసక్తులు పెరగడానికి
తోడ్పడుతుంది.కాని అందుకు విరుద్ధంగా మాతృ భాష కాని ఇతర భాషల్లో బోధన పిల్లల్లో శ్రద్ధాసక్తులను హరించివేస్తాయి..
వార్షికోత్సవాల పేరిట కార్పొరేట్ స్కూల్స్ నిర్వహించే తంతు ను చూసినప్పుడు నిజంగా రోతనే కలిగిస్తుంది.పిల్లలందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశ్యం తో గ్రూప్ dances, చెవులు బద్దలయ్యే DJ sounds ద్వారా నిర్వాహకులు సాధించేదేమిటో ఎవరికీ అర్థం కాదు.
వీటిని మనం సాంస్కృతిక కార్యక్రమాలు అనవచ్చునా!!??
ఉత్సాహం కలిగించే నాటికలు ,పాటలు ,దేశభక్తి గీతాల ఆలాపన ,పెద్దవారి అర్థవంతమైన మాటలు వినిపించడం వంటివి కదా వారి సృజనాత్మకత పెంపుదలకు తోడ్పడే అంశాలు.
నేను భైంసా పట్టణంలో ఒక వార్షికోత్సవానికి వెళ్ళాను.ఆ నాటి నా అనుభవం నాకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. హోరెత్తించే ఆ విన్యాసాలు చూడలేక అక్కడే దూరంగా అదే పాఠశాలకు చెందిన బస్ లో విశ్రాంతి తీసుకున్నాను.
ధన్యవాదాలు sir మీ అనుభవాలు చాలా విలువైనవి.
మీ స్పందనకు ధన్యవాదాలు మాస్టారూ
మీ అనుభవం చాలా బాగా బాగుంది గురువు గారు…. కళ్ళకు కట్టినట్లు చెప్పారు…… షాద్ నగర్ లో అశ్వ వారు బడుతున్న CLC గురించి మరింత విశ్లేషణ ఇస్తారని ఆశిస్తున్నాను….
You may visit their site http://www.aswa4u.org