
నెల్సన్ మండేలా Long Walk to Freedom (1994) దాదాపుగా ఒక సమష్టి రచన. రాబిన్ ఐలండ్ లో నిర్బంధంలో ఉన్నప్పుడు తన తోటి ఖైదీ, జాతీయోద్యమ సహచరుడు అహ్మద్ కత్రాడాతో కలిసి రూపొందించుకున్న ముసాయిదాని మండేలా 1990 ల్లో రిచర్డ్ స్టెంగాల్ తో కలిసి మరింత సవరించాక, ఆయన మిత్రబృందం ఒక సంపాదక బృందంగా ఆ రచనని పరిష్కరించారు. ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకం ఆత్మకథనే అయినప్పటికీ, ఆ కథనాన్ని ఒక బృందం ఎంతో నిర్విరామంగా, శ్రద్ధగా తుదిరూపానికి తీసుకువచ్చారని మరవలేం.
అయితే, ఆ పుస్తకానికి సీక్వెల్ గా నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ మెమొరీ అండ్ డైలాగ్ వారు వెలువరించిన Conversations with Myself (2011) మరింత సూటి రచన. ఇది మండేలా రాసిపెట్టుకున్న డైరీలు, ఉత్తరాలు, ప్రసంగాలనుంచి ఏరి కూర్చిన సంపుటి. వాటితో పాటు ఆయన రిచర్డ్ స్టెంగాల్ తో చేసిన సంభాషణలు, దాదాపు యాభై గంటల నిడివి గల ఇంటర్వ్యూ నుంచి కూడా కొన్ని సంభాషణలు ఇందులో చేర్చారు. వీటితో పాటు ఆయన తన ఆత్మకథకు సీక్వెల్ గా రాసిపెట్టుకున్న ఒక అముద్రిత ప్రతినుంచి కూడా చాలా భాగాలు చేర్చారు. వీటన్నిటివల్లా వీటిలో కనబడే మండేలా నేరుగా మనతో మాట్లాడే రచయితగా ఈ పుస్తకంలో ప్రత్యక్షమవుతాడు.
ఇటువంటి సంపుటి డా.కలాం గురించి కూడా వెలువడింది. Indomitable Spirit (2010) అనే పేరుతో వెలువడ్డ ఆ పుస్తకాన్ని నేను ‘ఎవరికీ తలవంచకు’ అని తెలుగు చేసాను. అలాగే కిందటేడాది పూనం కోహ్లి అనే ఆమె పుణ్య పబ్లిషింగ్ హౌస్ తరఫున వెలురించిన You are Unique అనే రచన కూడా కలాం రచనలనుంచి ఏరికూర్చిన సంకలనమే. దాన్ని కూడా నేను ‘యు ఆర్ యునీక్’ పేరిట అనువదించాను. ఈ ఏడాది జనవరిలో ఆ తెలుగు అనువాదం వెలువడింది కూడా.
ఈ సందర్భంగా కలాం పుస్తకాల గురించి ఎందుకు ప్రస్తావించానంటే, మన చుట్టూ ఉన్న సమాజం ఒక hate factory గా మారిపోతున్న కాలంలో, కలాం, మండేలా వంటి వ్యక్తులు మనకు సమకాలికులుగా ఉన్నారనీ, కాని వాళ్ళు అపారమైన వెలుగునీ, దయనీ, స్ఫూర్తినీ పంచిపెట్టి వెళ్ళారనీ గుర్తుచేసుకోడానికి మాత్రమే.
ఎందుకంటే, స్టోయిక్కులు చెప్పినట్లుగా ప్రపంచాన్ని మార్చడం మనచేతుల్లో లేని పని. కాని ప్రపంచం పట్ల మన స్పందనలూ, ప్రతి స్పందనలూ మాత్రం మన చేతుల్లో ఉన్నవే. వాటిని మనం అదుపుచేసుకోగలిగితే, మనం ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సమీపించాలో ఆ విధంగా సమీపించగలిగితే, తప్పకుండా మనమున్న మేరకు ప్రపంచం మారడం మొదలుపెడుతుంది. విమర్శ, ఖండన, ద్వేషం, దూషణ చెయ్యలేని పని మన జీవితమే ఒక ఉదాహరణగా మనం చెయ్యగలుగుతాం.
ఈ పుస్తకానికి సంపాదకులు రాసిన ముందుమాటలో తాము మార్కస్ అరీలియస్ Meditations నుంచి స్ఫూర్తి పొంది ఆ తరహాలో ఈ పుస్తకాన్ని సంకలనం చేసామని చెప్పడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అరీలియస్ తన పుస్తకానికి గ్రీకులో To Himself అని మాత్రమే పేరుపెట్టుకున్నాడు. అదే దారిలో ఈ పుస్తకానికి కూడా Conversations with Myself అని పేరుపెట్టామని సంపాదకులు రాసుకున్నారు.
ఆ సంపాదకులు భావించినట్టే నేను కూడా మండేలాను మన కాలపు మార్కస్ అరీలియస్ గా అభివర్ణించకుండా ఉండలేకపోతున్నాను. అరీలియస్ చక్రవర్తి. మండేలా స్వాతంత్య్ర యోధుడూ, దేశాధినేతా కూడా. కాని యుద్ధసమయంలోనూ, శాంతిసమయంలోనూ కూడా మండేలా అపారమైన కరుణ చూపగలిగాడు. అది మనిషి జయించవలసింది బయటి శత్రువుని కాదు, అంతశ్శత్రువుని అన్న ఎరుక వల్ల వచ్చిన కరుణ.
ఒక పుస్తకం పూర్తిగా చదవకుండా ఆ పుస్తకాన్ని పరిచయం చెయ్యడం నా స్వభావానికి విరుద్ధం. కాని ఈ పుస్తకం చేతుల్లోకి వచ్చినప్పటినుంచీ, మొదటి కొన్ని పేజీలు తిరగేసిన మరుక్షణమే, ఈ పుస్తకం గురించి ఎప్పుడెప్పుడు మీతో ముచ్చటిద్దామా అని ఒకటే ఉత్సాహపడుతూ ఉన్నాను. పుస్తకం మొత్తం చదివేక ఎలానూ వివరంగా రాస్తాను. ఇప్పటికి మాత్రం, ఇందులోంచి ఒక పేజీ మీ కోసం తెలుగుచేస్తున్నాను.
జైల్లో ఉండగా రాసుకున్న స్వీయచరిత్ర అముద్రిత ప్రతినుంచి.
భ్రాంతికి లోనుకావడం, భ్రమలనుంచి బయటపడటం జీవితంలో ఒక భాగం. అవి నిరంతరాయంగా జరిగే పనులే. కానీ నా వాస్తవానుభవాలకీ, నా ఆకాంక్షలకీ మధ్యనున్న అగాధం 1940 ల మొదట్లో నన్ను మరీ శరాఘాతానికి గురిచేసింది. కాలేజిలో చదువుకునేటప్పుడు నేను గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే నా తెగకి నాయకుణ్ణి అవుతాననీ, అన్ని విధాలా వాళ్ళకి నాయకత్వం వహిస్తాననీ అనుకుంటూ ఉండేవాణ్ణి. ఫోర్ట్ హేర్ లో చదువుకున్న చాలామంది విద్యార్థులకి అటువంటి భావనలు కలగడం సహజమే. కాని వాళ్ళల్లో చాలామంది తరగతిగదులనుంచి నేరుగా ఏదో చక్కటి ఉద్యోగంలో అడుగుపెట్టి, చక్కటి జీతం, చెప్పుకోదగ్గ సామాజిక హోదా సంపాదించుకునేవారు. గ్రాడ్యుయేట్లంటే సమాజంలో, ముఖ్యంగా విద్యారంగంలో ఎంతో కొంత గౌరవం ఉండేదన్నమాట కూడా సత్యదూరం కాదు.
కాని నా అనుభవం వేరేలా ఉండింది. జీవితానికి అవసరమిన నిర్ణయాలు తీసుకోవలస్సి వచ్చినచోట ఉన్నత విద్యార్హతల కన్నా కూడా ఇంగితజ్ఞానమూ, జీవితానుభవమూ ముఖ్యమైన మనుషుల మధ్యనే నేను మసలుతుండేవాణ్ణి. కాలేజిలో బోధించిందేదీ కూడా నేను సంచరిస్తున్న కొత్త వాతావరణానికి ఏ విధంగానూ ఉపకరించేది కాదు. జాతివివక్ష, సరైన అవకాశాలు లేకపోవడం, నల్లజాతిమనిషి తన నిత్యజీవితంలో ఎదుర్కోవలసి వచ్చే అసంఖ్యాకమైన అవమానాలూ లాంటి విషయాల గురించి మాట్లాడటానికి సగటు ఉపాధ్యాయుడికి ఎప్పటికీ ధైర్యం సరిపోయేది కాదు. జాతివివక్ష తాలూకు దుష్పరిణామాల్ని ఎలా తుదముట్టించాలో నాకెవరూ చెప్పింది లేదు. క్రమశిక్షణాయుతమైన ఒక స్వాతంత్ర్యపోరాటంలో భాగం కావాలంటే ఏ పుస్తకాలు చదవాలో, ఏ రాజకీయ సంఘాల్లో చేరాలో నాకెవరూ చెప్పలేదు. అటువంటి విషయాలన్నీ కూడా నాకై నేను పడుతూ లేస్తూ, తప్పులు చేస్తూ, సరిదిద్దుకుంటూ, కాలానుగుణంగా, ఇంకాచెప్పాలంటే యాదృచ్ఛికంగా తెలుసుకున్నవే.
Featured image: Nelson Mandela statue, Westminster, London. PC: Wikicommons
10-6-2023
మంచి కాన్సెప్ట్ దగ్గరకు వచ్చారు. ప్రస్తుతం అవస్యమైన సందర్భం.
ధన్యవాదాలు సార్
శుభోదయం సర్.
ఒక్క పేజీలోన ఎంతో ఆలోచింప జేసే వాక్యాలున్నాయంటే పుస్తకం మొత్తం ఇంకెలా ఉంటుందో.
మార్క్స్ అరీలియస్ రచనల రుచి మీరు ఇదివరకే చూపించారు గనుక ఆ పోలిక నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఈ పుస్తకం పూర్తి వివరాలకై ఎదురు చూస్తుంటాం.
నమస్సులు.
ధన్యవాదాలు సార్
విమర్శ, ఖండన, ద్వేషం, దూషణ చెయ్యలేని పని మన జీవితమే ఒక ఉదాహరణగా మనం చేయవచ్చు
అద్భుతమైన మాటలు sir
ధన్యవాదాలు
5వ పేరా అద్భుతం, ఆచరణీయం. నేనింకా నేర్చుకుంటూనే ఉన్నాను…
సంతోషం ప్రసూనా!
మండేలా గారిది incidental learning. సంఘటనాత్మక అభ్యసనం.
అవును మాష్టారూ
విల్సన్ ఉండేలా అద్భుత రచనను మీ ప్రత్యేక శైలి లో తెలుగు లోకి అనువదించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు.