ఉండీ ఉండీ కోకిల అరుస్తుంటుంది

ఉండీ ఉండీ కోకిల అరుస్తుంటుంది
ఆ అరుపు విన్న ప్రతిసారీ సముద్రం
ఉలికిపడుతుంది.

గోరువంకలు రోజంతా పూలముందు
పడిగాపులు పడతాయి, కాని
కరుణించాల్సింది ఆకాశం.

ఈ నగరవృక్షానికి సిమెంటుకాంక్రీటు
ఎరువుపెడుతూనే వున్నారు,
ఇప్పుడు నీళ్ళు కావాలి.

ప్రతి ఏటా ఇదొక చిత్రమైన కాలం,
ఎంతచెప్పు, ఒక్క మేఘం తప్ప మరేదీ
అక్కర్లేదనిపిస్తుంది.

ఎండిబీటలు పడ్డావని దిగులు
పడకు, తొలకరిచినుకు పడగానే
మట్టిపువ్వై పరిమళిస్తావు.

9-6-2023

17 Replies to “ఉండీ ఉండీ కోకిల అరుస్తుంటుంది”

  1. నగరవృక్షానికి సిమెంటుకాంక్రీటు
    ఎరువుపెడుతూనే వున్నారు,
    ఇప్పుడు నీళ్ళు కావాలి….
    ..
    నగర వృక్షానికి అని చెప్పడం చాలా నచ్చింది…

    బాగుందండి….

  2. అదే ఆశతో లేచీలేవగానే ఆకాశంలో మబ్బులు కోసం వెతుకుతా .ఉంటాయి .ఓ గంటలో మాయదారి సూర్యుడు ఆవిరి చేసి రాజ్యం ఏలతాడు .

  3. … ఆ కోకిల ఒక్క సముద్రాన్ని మాత్రమేనా ఉలికిపడేలా చేస్తోందీ…!! నిజంగా దానికేవో దివ్య శక్తులు ఉన్నాయండీ…beautiful beautiful! ❤️❤️

  4. చినుకు పడగానే
    మట్టి పువ్వు పరిమళిస్తావు
    మట్టి పువ్వు కావడం పరిమళించడం లో ఎంత గొప్ప ధ్వని 🙏

  5. మట్టిపువ్వు….పదప్రయోగం బావుందండీ.🙏

  6. ఎంత చెప్పూ…. చల్లని మేఘం మాత్రమే కావాలనిపిస్తుంది. నిజం. చాలా బావుంది కవిత తొలకరి జల్లులా.

  7. నిజంగానే ఇప్పుడు నగర వృక్షానికి నీళ్ళు కావాలి.
    ఇన్నాళ్లు పాతాళ గంగ కరుణించి కాపాడింది
    కనుక బతికిపోయింది.
    ఇకముందు ఆకాశ గంగ కరుణిస్తే నే మనుగడ
    చెట్టుకైనా ,పుట్టకైనా ,మనిషికైనా…..
    మనసుకైనా!!

  8. ఇప్పుడీ వర్షం మనసులకు కూడా అవసరం sir

    మట్టి పువ్వులమై మొలకెత్తాలి అందరం

Leave a Reply

%d bloggers like this: