పెరిప్లస్ ఆఫ్ ద ఎరైత్రియన్ సీ

లీలా అజయ్ చరిత్ర ఉపన్యాసకురాలు. సాహిత్యాభిమాని. నా మిత్రురాలు. కిందటేడాది విజయవాడ నుంచి వచ్చేసే ముందు ఆమె గుడివాడలో ఒక పుస్తకం ఆవిష్కరణ సభకి నన్ను పిలిచారు. ఆశ్చర్యం, అది Periplus of the Erythraean Sea అనే ఒక ప్రాచీన సముద్రయాత్రా రచనకి తెలుగు అనువాదం! అటువంటి పుస్తకం ఉందనే తెలుగువారిలో చాలామందికి తెలియదు. అటువంటిది రెవెన్యూ శాఖలో తహశీల్దార్ గా పనిచేసి రిటైర్ అయిన మహమ్మద్ సిలార్ అనే పండితుడు తెలుగులోకి అనువదించడం, ఆ పుస్తకాన్ని లీలా అజయ్ గారు తాను స్వయంగా ప్రచురించి ఆవిష్కరణ సభ ఏర్పాటు చెయ్యడం నన్ను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాయి.

ఆ పుస్తకం గురించి వెంటనే రాసి ఉండవలసింది. కానీ విజయవాడనుంచి వచ్చేస్తున్నప్పుడు పుస్తకాలు సర్దుకునేటప్పుడు ఈ పుస్తకం ఎక్కడో లోపల ఉండిపోయి ఇన్నాళ్ళకు బయటపడింది.

పెరిప్లస్ అంటే సముద్ర ప్రయాణానికి ట్రావెల్ గైడ్ అన్నమాట. ఈ పెరిప్లస్ ఎరైత్రియన్ సీ మీద ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శిని. దీన్నీ సా.శ.మొదటి శతాబ్దంలో ఒక అజ్ఞాత రోమన్ నావికుడు గ్రీకు లో రాసాడు. దానికి ఎన్నో అనువాదాలు వెలువడ్డాయి, వెలువడుతూ ఉన్నాయి కూడా. వాటిల్లో 1912 లో విల్ ఫ్రెడ్ హెచ్ స్కాఫ్ అనే ఆయన చేసిన ఇంగ్లిషు అనువాదాన్ని సిలార్ తెలుగు చేసారు. అనువాదంతో పాటు కొన్ని ముఖ్యమైన స్థలనామాలకీ, పారిభాషిక పదాలకీ ఇంగ్లిషు అనువాదకుడు పొందుపరిచిన నోట్సు కూడా అనువాదకుడు తెలుగు చేసాడు.

పెరిప్లస్ గురించి నేను పదిహేనేళ్ళకిందట మొదటిసారి చదివాను. ప్రాచీన కాలంలో కథారూపాల గురించి అధ్యయనం చేస్తూ ఉండగా, ఇప్పటికి మూడువేల ఏళ్ళకిందట, Shipwrecked Sailor అనే ఒక ఈజిప్టు నావికుడి కథ గురించి తెలిసింది. ఆ సందర్భంగా ప్రాచీనకాలంలో సముద్రప్రయాణ గాథల గురించి తెలుసుకుంటూ ఉండగా పెరిప్లస్ నా కంటపడింది. ఈ రచనకి మూడు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది కథ కాదు, కల్పన కాదు, సాహిత్య రచన అసలే కాదు. ఆ కాలం నాటికి గ్రీకు, రోమన్, ఈజిప్షియన్ నావికులకి అందుబాటులో ఉన్న భూగోళ పరిజ్ఞానమంతటినీ పొందుపరిచి రాసిన సమగ్ర రచన. అందులో భూగోళశాస్త్రముంది, చరిత్ర ఉంది, సామాజిక శాస్త్రం కూడా ఉంది.

అనువాదకుడు ముందుమాటలో పెరిప్లస్ గురించి ఇలా రాస్తున్నాడు:

రోమన్ జాతీయుడు, ఈజిప్టు నివాసి, గ్రీకు సాహసికుడు, పేరు తెలుపని నావికుడు- ఒక సాధారణ వ్యాపారి కష్టనష్టముల కోర్చి అనంత సముద్రంలో తన నౌకలో ప్రయాణించి, ఆయాదేశపు మార్కెట్ల ఎగుమతి, దిగుమతి సరుకుల గురించిన సమాచారంతో పాటు, అక్కడ నివసించే దేశప్రజల స్థిగతులు, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, సంబంధ బాంధవ్యాల గురించిన సమాచారంతో తిరిగి వచ్చాడనే విషయం పెరిప్లస్ ఆఫ్ ద ఎరైత్రియన్ సీ అనే గ్రంథంలో విశేషంగా చెప్పబడింది. అప్పటివరకు చరిత్రకెక్కని, శతాబ్దాల తరబడి జరిగిన సముద్రవర్తకం విశేషాలు గ్రంథస్థం చేయబడిన ఒకే ఒక రికార్డు పెరిప్లస్. స్ట్రాబో, ప్లినీ, టాలమీ లాంటి చరిత్రకారులు వారెంత జ్ఞాన సముపార్జన చేసినా సరే, వారు తెలుపని అప్పటి ప్రపంచానికి తెలియని విశేషాలు, ఆనాడు తాను స్వయంగా చూసిన విశేషాలు, తాను కలిసిన ప్రజలు ఇచ్చిన సమాచారం, గొప్ప శ్రమజీవులు, విశేష పరిశ్రమ చేసే తూర్పు తీరవాసుల వర్తక ఆధిపత్యం తెలిపే గొప్ప విషయాలతో గ్రంథ రచన చేసాడు పెరిప్లస్ రచయిత.

రెండవది, అది భారతదేశానికి సముద్రం మీద ప్రయాణించే దారి గురించిన వర్ణన. మరొక పధ్నాలుగు శతాబ్దాల తర్వాత వాస్కోడ గామా భారతదేశానికి సముద్రం మీద ప్రయాణించడానికి దారి చూపిన రచనల్లో అది కూడా ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక మూడవది, సిలార్ గారు ఈ రచనలో ప్రతిపాదిస్తున్నది, ఎరైత్రియన్ సీ అంటే ఇండియన్ ఓషన్ అని చెప్పడం. మామూలుగా ఎరైత్రియన్ సీ అంటే ఎర్రసముద్రం అనీ, పర్షియన్ సింధుశాఖ, ఎర్రసముద్రం కలిసే చోటుని ఎరిత్రియన్ సీ అనీ పిలుస్తారనీ అనుకునేవారు. కాని ఈ అనువాదకుడు అగధార్ ఛిడెర్ అనే ఒక పండితుడి ప్రతిపాదనలు ఆధారం చేసుకుని ఎర్ర సముద్రం అంటే ఆధునిక ఇండియా చుట్టూ ఆవరించి ఉన్న ఇండియన్ ఓషన్ మాత్రమేనని చెప్పడం.

పెరిప్లస్ మొత్తం 66 పేరాల రచన. అంటే పది పదిహేను పేజీలకు మించని రచన. ఆ రచయిత సాహిత్య కారుడు కాడు. గొప్ప భాషా జ్ఞానం ఉన్నవాడు కూడా కాడు. కాని లోకజ్ఞుడు. రెండువేల ఏళ్ళకింద యూరోపు, ఆఫ్రికా, అరేబియా, ఇండియాల గురించిన చాలా పరిజ్ఞానాన్ని ఆ పదిపన్నెండు పేజీలు యథాతథంగా మనకి అందిస్తున్నాయి. అందులో చాలా స్థలనామాల మీద ఇప్పటికీ అధ్యయనం జరుగుతూనే ఉంది.

మొత్తం 66 పేరాల పెరిప్లస్ లో 41 నుంచి 66 దాకా భారతపశ్చిమ తూర్పు తీర వివరాలున్నాయి. అంటే మొత్తం రచనలో మూడవంతు భారతదేశం గురించే అన్నమాట. ప్రస్తుత గుజరాత్ తీరంలోని భరుకచ్చంతో మొదలైన సముద్రప్రయాణ వర్ణన చేర, చోళ, పాండ్య రాజ్యాల వివరాలతో పాటు ఆంధ్ర తీర వర్ణనతో చీనా సరిహద్దుదాకా సాగుతుంది.

పెరిప్లస్ రచనకాలం మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. సిలార్ గారి లెక్క ప్రకారం ఈ రచన సా.శ 58 వేసవికన్నా ముందు లేదా 62 వేసవి కన్నా తర్వాత జరిగి ఉండాలి. అది ఆంధ్రశాతవాహనుల పాలనా కాలం. ఈ రచనలో 52 వ పేరాలో పేర్కొన్న elder Saragunus, Sandares అరిష్ట శాతకర్ణి, సుందర శాతకర్ణి అయి ఉండవచ్చునని, కాబట్టి పెరిప్లస్ రచనాకాలం కూడా సా.శ 83-84 మధ్యకాలం అయి ఉండవచ్చునని మరొక వాదం. కాని పెరిప్లస్ లో ప్రస్తావించిన ఇతర ప్రాంతాలు, రోమ్, అరేబియా, పార్థియన్లు మొదలైనవారి గురించిన వివరాలిచ్చే సాక్ష్యం ప్రకారం ఈ రచన సా.శ.60 ప్రాంతానికి చెందింది అయి ఉండవచ్చునని అనువాదకుడి ప్రతిపాదన.

పెరిప్లస్ లో 62 వ పేరా మొత్తం మసాలియా గురించిన వివరణ. ఇది కృష్ణానదీ ముఖద్వారంగా చెప్పబడే మచిలీపట్నం ఓడరేవు గురించిన చిత్రణ. ‘మాసాలియా పెరిప్లస్ రచనా కాలం నాటికి ఆంధ్ర రాజ్యానికి అతి గొప్ప మార్కెట్ అనటంలో సందేహం లేదు’ అని రాసాడు అనువాదకుడు.
ఆ రోజు పుస్తకావిష్కరణ సభలో ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ నేను ఈ విషయమే చెప్పాను. ఒకప్పుడు రోమ్ నుంచి వర్తకులు, యాత్రీకులు, నావికులు మచిలీపట్నాన్ని వెతుక్కుంటూ వచ్చిన చరిత్ర ఈ రచన అని చెప్తూ ఆ రచనని మళ్ళా మరొక మచిలీపట్నం వాసి అనువదించడం, దాన్ని గుడివాడలో ఆవిష్కరించడం ఎంతో సమంజసంగా ఉన్నాయని చెప్పాను.

చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థీ, రచయిత తప్పక చదవవలసిన పుస్తకం పెరిప్లస్. ఇన్నాళ్ళూ ఇంగ్లిషులో ఉంది కాబట్టి, ఆ స్థలనామాలు మరీ కొరుకుడుపడేలా ఉండవుకాబట్టి చదవలేకపోయాం అని సరిపెట్టుకున్నా, ఇప్పుడు సమగ్రమైన వివరణలతో ఆ పుస్తకం తెలుగులోకి వచ్చిందికాబట్టి అవశ్యం చదవక తప్పదు. అట్లాసులూ, ఇంటర్నెట్లూ, జి.పి.ఎస్ లు లేని రోజుల్లో ఒక అజ్ఞాత నావికుడు రాసిపెట్టిపోయిన ఈ రచనలో మన దేశం గురించీ, మన ప్రాంతం గురించీ రాసి ఉన్నందుకేనా మనం చదివితీరాలి.

ఏ విధంగా చూసినా ఈ రెండువందల పేజీల అనువాదం తెలుగు వాజ్ఞ్మయానికి గొప్ప కానుక. ఏ విశ్వవిద్యాలయంలోని చరిత్రశాఖనో, లేదా తెలుగు విశ్వవిద్యాలయమో చెయ్యవలసిన ఈ పనిని ఒక రిటైర్డ్ తహశీల్దార్ చెయ్యడం, ఆ పుస్తకాన్ని ఒక చరిత్ర ఉపన్యాసకురాలు తన స్వంత ఖర్చుతో ముద్రించడం తెలుగువాళ్ళకి సంతోషం కలిగిస్తుందేమోగాని, నాకు బాధ కల్గిగిస్తుంది.

కాని సిలార్ గారిని రెవెన్యూ శాఖ ఉద్యోగిగా నేను పదే పదే పేర్కోడం కూడా సమంజసం కాదు. ఆయన ‘తరతరాల బందరు చరిత్ర’, ‘కృష్ణాజిల్లా చరిత్ర’, ‘మచిలీపట్నం చరిత్ర’, దివిసీమ సర్వస్వం’ వంటి విజ్ఞాన సర్వస్వాల్ని ఇప్పటికే వెలువరించారు. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ‘కృష్ణాజిల్లా జమీందారులు- రైతాంగ ప్రజాపోరాటం’ అనే రచన కూడా వెలువరించారు. ఏ విధంగా చూసినా ఈయన ఋణం తెలుగు జాతి తీర్చుకోలేనిది. కాని ముందు, ఆయనకి ఋణపడి ఉన్నామని కూడా మనకి తెలీదు, అదే నన్ను మరింత బాధిస్తున్న అంశం.


పుస్తకం కావలసిన వారు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచురణలు, 20/620. లక్ష్మణరావు పురం, చిలకలపూడి, మచిలీపట్నం వారికి రాసి తెప్పించుకోవచ్చు. లేదా రచయితను 9985564946 లో సంప్రదించవచ్చు. వెల రు.200/-

Featured image: Route map of the Periplus, courtesy: Wikipedia

8-6-2023

14 Replies to “పెరిప్లస్ ఆఫ్ ద ఎరైత్రియన్ సీ”

  1. వాళ్లు మిమ్మల్ని ఎంచుకోవడంలోనే చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రిందటి పుస్తకం అంటే ఎంత థ్రిల్లింగ్ విషయం.ఇలాంటి పుస్తకాన్ని సిలబసులో ఎక్కడైనా చేర్చాలి.రోజుకో కొత్త విషయంతో మీ కుటీరం విరాజించడం ఆనందదాయకం.

  2. అపురూపమైన పుస్తకానికి అపూర్వమైన పరిచయం. మా బందరు చరిత్రకారులు సిలార్ గారు అనువదించడం, మీరు సమీక్షించడం మహదానందం. ధన్యవాదాలు.👏👏👏

    1. సర్ నమస్తే.

      ఈ గ్రంథం గురించి appsc పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారందరూ చదివి వుంటారు ముఖ్యం గా గ్రూప్1,2 పరీక్షలో గల ఆంధ్ర చరిత్ర లో పేరు తెలియని అజ్ఞాత కవి గా ప్రస్థావన ఉంది.BSL హనుమంత రావ్ లాంటి చరిత్ర పరిశోధకులు ఈ గ్రంధం గురించి రాసారు.

      అనేక ధన్యవాదాలు సర్.

  3. చాలా చక్కని పరిచయం అందించారు థాంక్యూ

  4. సిలార్ మహమ్మద్ గారి గురించి సాయి పాపినేని గారు చెప్పగా,వారితో ఫోన్ తోమాట్లాడి బందరు తుఫాన్ గురించి చారిత్రక కల్పనా కథ ఒకటి రాశాను.నేను బందరు లో చదువుకున్నాను.సిలార్
    గారు బందరు చరిత్ర గురించి అథారిటీ.ఈ పుస్తకం నేను చదవలేదు కానీ, సిలార్ గారి, మంచి తనం, చారిత్రక పరిశోధనా, బందరు గురించి అంకితం స్వభావం నన్ను ఎంతో మెప్పించాయి.1864 తుఫాన్ గురించి న కథ వారు అడగగానే ఇచ్చిన పంపిన, పుస్తకాల లోని సమాచారం తో కల్పించి కథ రాశాను.ఆ తుఫాన్ గురించి ఏం వుంది అన్నీ శవాలు గుట్టలు తప్ప అన్నారు.కానీ ఒక రొమాంటిక్ కథ రాయాలని రాశాను.సాయిగారి కాలయంత్రంలో బందరు కి శాశ్వత స్థానం కల్పించాలని కోరికతో. ఇంకా పబ్లిష్ కాలేదు కానీ సిలార్ గారికి, బందరు కి చెందిన వారు, ప్రేమించే వారు అందరూ రుణపడి వున్నారు.ఈ పుస్తకం తో ఆయన ఇంకా పెరిప్లస్ గురించి రాశారు అని తెలియడం తో గౌరవం పెరిగింది.పరిచయంచేసినందుకు ధన్యవాదాలు.

  5. సర్ నమస్కారం ,, ఇప్పుడే సిలార్ గారితో మాట్లాడాను.. వారిది ప్రకాశం జిల్లా నే .. పుస్తకం తెప్పించుకుంటున్నాను

Leave a Reply

%d bloggers like this: