ప్రేమభాషా కవి

ఏదైనా ఒక సంక్లిష్టమైన అనుభవాన్ని కవితగా మార్చాలనుకున్నప్పుడు నాకు దారి చూపించే కవుల్లో రిల్క తర్వాత యెహుదా అమిహాయిని కూడా చెప్పుకోవాలి.

యెహుదా అమిహాయి (1924-2000) ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత శక్తిమంతులైన కవుల్లో ఒకడు. జర్మనీలో పుట్టాడు. 1936లో అతని తల్లిదండ్రులు పాలస్తీనాకు వచ్చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళు యుద్ధాల్లో, కొన్నాళ్ళు కళాశాలల్లో పనిచేసాడు. ఒక యూదుగా అతడు పాతనిబంధన ప్రవక్తలకీ, సామగీతాలకీ, పరమోన్నతగీతానికీ వారసుడు. కానీ మన తెలుగు కవుల్లాగా గంభీరమైన పదజాలంతో వక్తృత్వశైలిలో కవిత్వం చెప్పకుండా ఉండటానికే జీవితమంతా సాధనచేసాడు. సాధారణమైన రోజువారీ వాడుకభాషలో, మామూలు పదాలతో కవితలు నిర్మించే ప్రయత్నం చేసాడు. భాషలోని గంభీరమైన లయమీదా, సంగీతం మీదా కాకుండా, మానవానుభవాన్ని సూటిగా చెప్పడానికి ప్రయత్నించినందువల్ల అతడి కవిత్వం అనువాదకుల స్వర్గం. ఎంత మామూలు అనువాదకుడు అనువదించినా కూడా ఆ కవితలు సులభంగా, సరళంగా మరొక భాషలోకి ప్రవహించగలుగుతాయి. అందువల్లనే పాశ్చాత్యప్రపంచంలోనే కాదు, చీనాలోనూ, జపాన్ లోనూ కూడా యెహుదా అమిహాయ్ కవిత్వానికి అభిమానులు కొల్లలు.

అమిహాయి మామూలు రోజువారీ పదాల్తో కవిత చెప్పినంతమాత్రాన ఆ కవితలో భాషావిన్యాసం తక్కువేమీ కాదని హీబ్రూ పండితులు చెప్తున్నారు. ప్రతి ఒక్క పదాన్ని ఆయన ఎంతో ఆచితూచి ప్రయోగిస్తాడనీ, దానివెనక మూడువేల ఏళ్ళ యూదీయ సంఘర్షణ మొత్తం ఉంటుందని మర్చిపోకూడదని కూడా వాళ్ళు చెప్తున్నారు.

కాని బయటి పాఠకుణ్ణి చప్పున ఆకట్టుకునేవి అతడి రూపకాలంకారాలు. ఇంకా చెప్పాలంటే భావాలంకారాలు. ఒక్కో కవితలో ఒక మెటఫర్ కన్నా ఎక్కువ ప్రయోగించడు. ఆ కీలకమైన భావాలంకారం చుట్టూ కవితని చాలా బిగువుగా నిర్మిస్తాడు. అలవోకగా రాసాడనిపించే ఆ తక్కినవాక్యాల్లో అనితరసాధ్యంగా ఉండే ఆ బిగువు వల్ల, ఆ మెటఫర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కవిత సంతోషంతో మోగడమో, లేదా చెప్పలేనంత దుఃఖంతో సోలిపోవడమో జరుగుతుంది.

ఉదాహరణకి ఇక్కద అనువదించిన ‘వదిలిపెట్టేసిన ఇల్లు’ అనే కవిత చూడండి. ఆ కవితలో హోటలు రూము ఒక మెటఫర్. ‘అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల’ అనే మెటఫర్ లాంటిదే ఇదీ అని అనిపించవచ్చు. కాని ఒక పాంథశాలకీ, హోటలు రూముకీ మధ్య సముద్రమంత తేడా ఉంది. హోటలు రూము డబ్బిస్తే తప్ప నువ్వు నివసించలేవు. అందులో వ్యాపారం తప్ప మరేమీ లేదు. ఇవాళ నీది, రేపు మరొకడిది. ఎల్లకాలం నువ్వక్కడ ఉండలేవు. ఎనిమిది వాక్యాల ఈ కవితలో బిగింపు ఆ రూపకాలంకారం దగ్గరకి వచ్చేటప్పటికి పాఠకుడిలో చెప్పలేని స్ఫురణని రేకెత్తిస్తుంది. ఆ తర్వాత ఈ కవిత పుస్తకంలోంచి అదృశ్యమై పాఠకుడి మదిలో తిష్ఠవేసుకుంటుంది.

అతడి గొప్ప కవితలు ఏవీ కూడా ఒక పేజీకి మించి ఉండవు. ఏ భావంలోనూ, పదప్రయోగం లోనూ కూడా పునరుక్తి ఉండదు. ఒక భావాన్ని వ్యక్తం చేసాక తెలుగు కవులు  మళ్ళా నాలుగైదు సార్లు ఆ భావాన్నే మార్చి మార్చి తిప్పి తిప్పి చెప్తుంటారు. అది పూర్వకాలపు గ్రామీణ శ్రోతలకి అవసరమేమోకాని, సునిశితమైన గ్రహణసామర్థ్యాలుండే ఆధునిక శ్రోతకి వాగాడంబరం అనిపిస్తుంది. అది కవిత్వం కాదు, ప్రసంగం అనిపిస్తుంది. పూర్వకాలపు సీసపద్యాల్లో అటువంటి పద్ధతి వాడేవారు. అది శ్రోతకి reinforcement గా పనిచేసేది. కాని యెహుదా అమిహాయి లాంటి కవులు మెటఫర్ ద్వారా ఆ reinforcement సాధిస్తారు. అందువల్ల  ఎంత సుదీర్ఘంగా చెప్పావన్నదాన్నిబట్టికాక, ఎంత సూటిగా, ఎంత శక్తిమంతంగా చెప్పావన్నదానిమీద కవిత బతకడం మొదలుపెడుతుంది.

సాధారణంగా తెలుగు కవి, తనకొక స్ఫురణ కలగ్గానే దాన్ని వెంటనే కవితగా మార్చడానికి ఉత్సాహపడతాడు. ఇందులో spontaneity అనే సుగుణం ఉన్నప్పటికీ, ఆ స్ఫురణ కవి హృదయంలో ధ్యానంగా మారనందువల్ల ఆ కవితలో సాంద్రత కొరవడుతుంది. గొప్ప కళాకారుడికి ఇదెప్పటికీ ఒక సమస్య. Spontaneity ని వదులుకోకుండానే చిక్కదనాన్ని, నీ అభివ్యక్తిలో, తీసుకురావడమెలా అన్నది. ఉదాహరణకి రిల్క కవిత్వం చదివితే మనకి అందులో సద్యఃస్పందన కనిపించదు. అపారమైన ధ్యానం తాలూకు సాంద్రత కనిపిస్తుంది. కాని యెహుదా అమిహాయి కవితల్లో చిక్కదనం కనిపిస్తూనే అవి అప్పటికప్పుడు నేరుగా తను చూసినదాన్ని చూసినట్టు చెప్తున్నాడా అనిపించేలా ఉంటాయి. ఈ ఇంద్రజాలం వెనక ఒక జీవితకాలపు కఠోరమైన సాధన, తపస్సు ఉన్నాయని వేరే చెప్పనక్కరలేదు కదా.

యెహుదా అమిహాయి పేరు నేను మొదటిసారి ఇస్మాయిల్ గారి ద్వారా విన్నప్పటికీ, The Selected Poetry of Yehuda Amichai (2013) చదివినతర్వాతనే ఆ కవి వ్యక్తిత్వం, ప్రతిభ, శక్తి నాకు బోధపడ్డాయి. Chana Bloch, Stephen Mitchell చేసిన ఆ అనువాదం నాకు చాలారోజులపాటు నిత్యపారాయణ గ్రంథాల్లో ఒకటిగా ఉండింది. అయితే నాలుగైదేళ్ళ కిందట Robert Alter సంకలనం చేసిన The Poetry of Yehuda Amichai (2015) దొరికిన తర్వాత నాకొక పెద్ద పండ్ల గంప దొరికినట్టయింది. ఇందులో 1955 నుంచి 1998 దాకా మొత్తం అమిహాయి కవిత్వం పన్నెండు సంపుటాల నుంచి వివిధ అనువాదకులు అనువాదం చేసిన కవితలు ఉన్నాయి. Robert Alter సుప్రసిద్ధ హీబ్రూ పండితుడు, అనువాదకుడు. నేను ఇంతకుముందు Psalms అనువదించినప్పుడు ఆయన అనువాదాలగురించి మీకు పరిచయం చేసాను కూడా.

ఈ సంకలనంలో అమిహాయి కవితలు ఆయన  మొత్తం కవిత్వంలో మూడవవంతు అని సంకలనకర్త పేర్కొన్నాడు. కాబట్టి, యెహుదా అమిహాయి కవిత్వం ఇంగ్లిషులో లభ్యమవుతున్నదానిలో ఇదే అత్యంత విస్తృతమైందని చెప్పవచ్చు.

ఆయన మొత్తం నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాడు. కాని అందరికన్నా ముందు ఆ యుద్ధం చెయ్యవలసి వచ్చినవాళ్ళే యుద్ధాన్ని ఎక్కువ ద్వేషిస్తారనేది అమిహాయి మనకి అనేకవిధాలుగా పదే పదే చెప్పే విషయం. ఇటు యూదులవైపునుంచి కవిత్వం రాసిన అమిహాయి, అటు అరబ్బుల వైపు నుంచి కవిత్వం చెప్పిన మహ్మద్ దర్వేష్- ఇద్దరూ కూడా- కవులు నిజంగా కోరుకునేది యుద్ధాన్ని కాదు, శాంతిని అనే చెప్తున్నారు. ఇద్దరు కవులూ రాసింది హీబ్రూలోనే. హీబ్రూని దర్వేష్ ‘ప్రేమభాష’ అని అభివర్ణించాడంటే నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చినంత పనయింది.

యుద్ధమధ్యంలో, ‘మండే ఇసుకలో నెత్తురోడుతో డేక్కుంటో ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ కి వెళ్ళవలసిన జీవితం మధ్య’ వాళ్ళు ప్రేమకోసం, శాంతికోసం తపించారు. కాని సుఖంగా, సౌకర్యంగా జీవిస్తో మనం మన భాషని ‘ద్వేష భాష’ గా మార్చుకుంటున్నామని తెలియవలసి రావడంలో ఉన్న విషాదం చెప్పలేనిది.

ఇంత చెప్పాక అమిహాయి కవితలు ఒకటి రెండేనా మీతో పంచుకోకుండా ఎలా ఉంటాను!


దేవుడు కిండర్ గార్డెన్ పిల్లలమీద జాలి చూపిస్తాడు

దేవుడు కిండర్ గార్డెన్ పిల్లలమీద జాలి చూపిస్తాడు
స్కూలు పిల్లలమీద మరీ అంత చూపించడు
పెద్దపిల్లలమీద మాత్రం అస్సలు చూపించడు
వాళ్ళమానానికి వాళ్లని వదిలేస్తాడు

దగ్గరలో ఉండే ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ కి
మండిపోతున్న ఇసుకలో
నెత్తురోడుతో
వాళ్ళు నాలుగుకాళ్ళమీదా దేక్కుంటూపోవాలి.

నిజంగా ప్రేమించేవాళ్ళమీద
బహుశా ఆయన జాలిపడి ఇంత నీడపరుస్తాడేమో
దారిపక్క బెంచీ మీద పడుకున్నవాడికి
నీడనిచ్చే చెట్టులా.

అమ్మ కొంగునదాచుకున్న చిల్లరంతా మన చేతుల్లో పెట్టేసినట్టు
మనం కూడా మన ప్రేమని వాళ్ళకి ధారపోస్తామేమో
కాబట్టే ఇవాళా రేపూ
వాళ్ళ అనుగ్రహం మనల్ని కాపాడుతున్నది.

యెరుషలేం

ఓల్డ్ సిటీలో డాబామీద
అపరాహ్ణపు సూర్యకాంతిలో ఆరేసిన వస్త్రాలు
ఒక ఆడమనిషి చీర, ఆమె నా శత్రువు
ఒక మగమనిషి తువ్వాలు, అతడు కూడా నా శత్రువే
అతడికి చెమటపట్టినప్పుడు దాంతోనే తుడుచుకుంటాడు

పాతనగరపు ఆకాశం మీద
గాలిపటం.
ఆ దారం కొస చివరన
ఒక పిల్లవాడు.
మధ్యలో గోడ అడ్డుకాబట్టి
పిల్లగాడు నాకు కనిపించడం లేదు.

మనం చాలా జెండాలు ఎగరేసాం
వాళ్ళూ చాలా జెండాలు ఎగరేసారు
వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనం అనుకోడానికి
మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళనుకోడానికీ.

భగవంతుడి పరిస్థితి

ప్రస్తుతం భగవంతుడి పరిస్థితి
చెట్లూ, శిలలూ, సూర్యచంద్రుల పరిస్థితి లాంటిదే
మనుషులు వాటిని నమ్మడం మానేసి
ఆయన్ని నమ్మడం మొదలుపెట్టడం లాంటిదే.

అయినా ఆయన మనతోనే ఉండక తప్పదు
కనీసం చెట్లలాగా, రాళ్ళల్లాగా
సూర్యచంద్రతారకాసముదాయంలాగా.

వదిలిపెట్టేసిన ఇల్లు

ఆ కిటికీ నిండా రాళ్ళు
శవాల్ని మోసుకుపోయినట్టు ఆ తలుపుల్ని పట్టుకుపోయారు
ఇంట్లోంచి ఊడబెరికి మరీ.

గుమ్మానికి అడ్డంగా దూలాలూ, ఇనపతీగలూ
కుక్కలకీ, గోడలకీ అందకుండా వేలాడే తాళంకప్ప.

ఒకళ్ళ గతం ఇంక
మరొకరికి భవిష్యత్తు-
అచ్చం హోటలు రూములాగా.

సీయోను పర్వతం మీద ఒక అరబ్బు గొర్రెల కాపరి తన మేకకోసం వెతుక్కుంటున్నాడు

సీయోను పర్వతం మీద ఒక అరబ్బు గొర్రెల కాపరి
తన మేకకోసం వెతుక్కుంటున్నాడు
కొండకి ఇవతలి పక్క
నేను నా పిల్లవాణ్ణి వెతుక్కుంటున్నాను
అరబ్బు గొర్రెలకాపరి, యూదు తండ్రి
ఇద్దరూ ప్రస్తుతానికి నిస్సహాయులే.
మా ఇద్దరి అరుపులూ లోయలో
కొలనులో ప్రతిధ్వనిస్తున్నాయి
నేనూ, అతడూ కూడా
మా మేకా, పిల్లాడూ
కర్రా పోయి కత్తీ వచ్చే పాటలోలాగా
తప్పిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం.

మొత్తానికి వాళ్ళక్కడ పొదల్లో దొరికారు
సంతోషంతో, కన్నీళ్ళతో మేము అరిచిన అరుపులు
మాకేం ప్రతిధ్వనించాయి.

తప్పిపోయిన మేకకోసమో, బిడ్డకోసమో
వెతుక్కున్నప్పుడల్లా
ఈ కొండల్లో ఒక కొత్త మతం పుడుతుంటుంది.

Featured photo courtesy: Wikicommons

7-6-2023

12 Replies to “ప్రేమభాషా కవి”

  1. ఎంత బాగా చెప్పారండి… చదువుతూ ఉంటే చదవడానికి మరి కొంత చెప్పి ఉంటే బాగుండు అనిపించింది…. ఇందులో మీరు చెప్పిన కవితలు చాలా బాగున్నాయి అందులో చివరి రెండు కవితలు.. మనసుని వీడి వెళ్లడం కష్టం..
    Thank you

  2. కవిత్వానికి వ్యాకరణాలు రాయడం కంటే ఇలా పరిచయం చేయడమే బాగుంటుందనిపిస్తుంది.
    పదాలు తేలికైనవే ఐనా కవితలోని సారాంశం సాంద్రం అనిపిస్తూంది. అయితే ఇలాంటి కవితల్లో ఆ కవి నేపథ్యం సాంఘిక పరిస్థితులు మొదలైనవి ఎంత బాగా తెలిస్తే కవిత అంత బాగా రుచిస్తుంది.
    కాని కొన్ని ఉపమానాలు సార్వజనీన సార్వకాలికాలు కనుక అవి మనసులో నిలుస్తాయి. ఒకడి గతం మరొకడికి భవిష్యత్తును హోటల్లో గదితో పోల్చడం వంటివి మనసుకు హత్తుకు పోతాయి. యెహుదా అమిహాయి పరిచయం బాగుంది .

  3. ఎంత బాగుందండి ఈ పరిచయం !యుద్ధం చేయాల్సి వచ్చినవారికే కదా దానిలోని భీభత్సం తెలుస్తుంది.
    కవితలు ఎంత సరళంగా ఉన్నాయో అంతే డెప్త్ కలిగివున్నాయి .చదివినకొద్దీ ఇంకొంచెం లోపలికి వెళ్తాం.

  4. మధురం. మీ బ్లాగ్ గురించి ఇటీవలే తెలిసింది. ఇప్పటికైనా తెలిసింది.. backlog పూర్తీ చెయ్యాలి..

  5. రోజూ మీరు ఇలా రాసేవి చదవడం కూడా నాకొక ధ్యాన సాధనే

  6. ఒక కొత్తదనం తో నిండుకున్న కవితలు

    మరిన్ని చదవాలని మనసు ఆరాట పడుతోంది sir

    1. మీకు ఈ కవితలు నచ్చినందుకు సంతోషం. మరొకసారి మరి కొన్ని కవితలు అనువదిస్తాను.

Leave a Reply

%d bloggers like this: