కోనసీమనుంచి కాలిఫోర్నియా దాకా

గొర్తి సాయి బ్రహ్మానందం రెండు కథాసంపుటాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఒకటి కోనసీమ కథలు, రెండోది, క్విల్ట్. రెండు సంపుటల్లోనూ కలిపి మొత్తం 38 కథలున్నాయి. చాలా కథలు ఎప్పుడు రాసారో తేదీలు లేవుగాని, ఉన్నవాటిని బట్టి, ఈ కథలు 2008 నుంచి 2021 మధ్యకాలంలో రాసినవని తెలుస్తోంది.

సాయి బ్రహ్మానందం నాకు ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా పరిచయం. ఆయనకీ నాకూ మధ్య చిన్నపాటి సాహిత్య చర్చలు మెసెంజర్లో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. కిందటేడాది ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికొచ్చారు కూడా. ఆయనతో ఉన్న కొద్దిపాటి పరిచయంలోనూ ఆయన గొప్ప పాఠకుడు, చిత్రకారుడు, సాహిత్యవిమర్శకుడు అని తెలుసు. కాని, ఈ కథలు చదివిన తరువాతనే ఆయన అగ్రశ్రేణి కథకుడు అని తెలుసుకోగలిగాను.

రచయితలు కథలు రాస్తారు అనేది పాతమాట. కథలు రచయితని రాస్తాయనేది కొంతకాలంగా సాహిత్యవిమర్శలో వింటూ వస్తున్న మాట. అంటే, మామూలుగా ఒక మనిషిని మనం అతనికీ మనకీ ఉన్న పరిచయాన్నిబట్టీ, మన మధ్య సంభవించిన సంఘటనలబట్టీ, మనం కలిసి పంచుకున్న ఉమ్మడి అనుభవాల్లో, అతని స్పందనలూ, ప్రతిస్పందనలబట్టీ గుర్తుపడతాం. కాని ఒక రచయితని దేన్ని బట్టి గుర్తుపడతాం? అతడి రచనల్ని బట్టి. ఆ రచనల్లో అతడు కనబరుస్తూ వస్తున్న గుణగణాల్ని బట్టి. అంటే ఒక రచయిత వ్యక్తిత్వం ఎటువంటిదో అతడి రచనలే మనకు విశదం చేస్తాయన్నమాట. అందుకనే సాహిత్యవిమర్శలో రచయిత దృక్పథాన్నీ, అతడి సాహిత్యపరిణామాన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యమైన విషయంగా ఉంటూవస్తోంది.

అలా చూసినప్పుడు, ఈ కథల ద్వారా పరిచయమైన సాయిబ్రహ్మానందం చాలా ప్రత్యేకమైన మనిషి అని చెప్పాలి. ఆయనకీ, నాకూ మధ్య ఇంతదాకా సంభాషణలద్వారా తెలిసినదానికన్నా మరింత ప్రగాఢంగా, మరింత స్ఫుటంగా ఆయన వ్యక్తిత్వం నాకు ఈ కథలద్వారా పరిచయం అయింది.

ఇంతకీ బలమైన ఒక వ్యక్తిత్వం మనకి పరిచయమైతే అందులో మనం సంతోషించవలసిందేమిటి? బలమైన వ్యక్తిత్వాలు, దృఢమైన మనస్సులూ మనల్ని చప్పున ఆకర్షిస్తాయి. కాని ఆకర్షణని మించిన విలువ వాటిల్లో ఏముంది?

దృడ్యమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు మనకి ఈ ప్రపంచంలో గొప్ప ఆసరా ఇస్తారు. వాళ్ళు గొప్ప నాయకులూ, ప్రవక్తలే కానక్కర్లేదు. మన రోజువారీ జీవితంలో, మన ఇళ్ళల్లో, ఆఫీసుల్లో, మన చిన్న చిన్న మిత్రబృందాల్లో మనకి కనిపించే దృఢమైన వ్యక్తిత్వాలు మనకి తెలీకుండానే జీవితం పట్ల మన ఆశనీ, నమ్మకాన్నీ ప్రతిరోజూ బలపరుస్తూ ఉంటారు. మన ఆలోచనల్లో, ప్రవర్తనలో ఏవైనా పొరపాట్లు దొర్లుతున్నా, దొర్లబోతున్నా వాళ్ళ ఉనికి వాటిని మనకు తెలీకుండానే సరిదిద్దుతూ ఉంటుంది. మనం కూడా మనకు తెలీకుండానే వాళ్ళవైపు చూస్తూ ఉంటాం. చిన్న చిన్న అడుగుల్లోనూ, పెద్ద పెద్ద ఆలోచనల్లోనూ కూడా వాళ్ళనుంచి ఎంతో కొంత స్ఫూర్తి గ్రహిస్తూనే ఉంటాం.

సాయి బ్రహ్మానందం అటువంటి దృఢమైన వ్యక్తిత్వాన్ని తన కథల్లో చూపించాడు. జీవితం పట్లా, మానవసంబంధాల పట్లా, ప్రపంచం పట్లా తనకి ఉన్న ఎన్నో స్పురణల్ని, ముఖ్యంగా ఒక  వివేకాన్ని మనతో పంచుకోడం కోసమే ఆయన ఈ కథలు రాస్తూ వచ్చారా అనే భావం కలుగుతుంది వీటిని చదవగానే.

ఈ 38 కథల్నీ మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. కోనసీమ కథలు 11 కూడా కోనసీమకు పరిమితమైన కథలు. అవి కూడా 1985 కి పూర్వం బ్రహ్మానందం బాల్యానికీ, ఆయన హైస్కూలు, ఇంటర్మీడియేటు రోజులకీ సంబంధించిన జ్ఞాపకాల చుట్టూ అల్లిన కథలు. కానీ పట్టుమని వందపేజీలు కూడా లేని ఆ కథల్లో కోనసీమ ఊళ్ళన్నీ దాదాపుగా కనిపిస్తాయి. కాని మామూలుగా కనిపించే కోనసీమ జీవితంలోపలి మరో జీవితం, ఇంకా చెప్పాలంటే కోనసీమ వ్యక్తిత్వం ఆ కథల్లో ఆవిష్కారమవుతుంది.  కోనసీమ జీవితాన్ని చిత్రించే రచనలు తెలుగులో పెద్దగా రాలేదు. ఈ మధ్య వచ్చిన ముక్కామల చక్రధర్ కూచిమంచి అగ్రహారం కథలు తప్ప సమకాలిక కోనసీమను చిత్రించే రచనలు తెలుగులో దాదాపుగా లేవనే చెప్పాలి. ఆ లోటుని ఈ పుస్తకం తీరుస్తుంది. కాని అంతకన్నా కూడా విశేషమైన లక్షణం ఒకటి ఈ కథలన్నిటిలో కనిపిస్తుంది. అదేమంటే, ఇందులో చాలా పాత్రలు పైకి కనిపిస్తున్నదానికన్నా భిన్నంగా ప్రవర్తించడం చూస్తాం మనం. పైకి లుబ్ధులుగా, కోపిష్టులుగా, లంపటులుగా,  ప్రేమానుబంధాలు పట్టనివాళ్ళుగా కనిపించేమనుషులు నిజానికి త్యాగులుగా, సాధుపురుషులుగా, ప్రేమానుబంధాలకోసం సమస్తం వదులుకోగలిగేవాళ్ళుగా కనిపించడం ఈ కథలన్నిటిలో ఒక సామాన్యలక్షణం. మనుషులు పైకి కనిపించేదానికన్నా భిన్నంగా ఉన్నారని తెలియడం కథకొక ఆకర్షణనీ, శిల్పపరంగా కొసమెరుపునీ, కథనానికొక నాటకీయతనీ సమకూర్చడమే కాక, మొత్తం కథలన్నీ చదివాక, రెండు విషయాలు మనకి అర్థమవుతాయి.

ఒకటి, కళ్ళముందు కనిపిస్తున్నదే నిజం కాదనే ఎరుక. కాని  కంటిముందు మంచిగా కనిపిస్తున్న మనుషులు కనిపిస్తున్నంతమంచివాళ్ళు కారనే ఎరుక కాదిది. నిజానికి కథలు ఇటువంటి ఋణాత్మక చైతన్యంలోంచే పుట్టుకొస్తాయి. కాని నువ్వు చూస్తున్న ప్రపంచం నీకు కనిపిస్తున్నంత దగుల్భాజీగా లేదనీ, దానిలోపల ఘనిష్ఠమైన మానవత్వం ఉందనీ చెప్పడం మామూలు విషయం కాదు. అలా చెప్పడానికి ఆ కథకుడికి లోకంపట్ల గొప్ప ప్రేమ ఉండాలి. లోకం తన మాటలు పట్టించుకున్న అ పట్టించుకోకపోయినా తనకు తెలిసింది చెప్పకుండా ఉండలేని సహృదయం ఉండాలి. దాన్నే మనం నైతికత అంటాం. కోనసీమ కథల్లో అంతస్సూత్రం అటువంటి నైతికత. మనుషుల్ని వాళ్ళ వాళ్ళ బాహ్యలక్షణాల్ని బట్టీ, బాహ్యప్రవర్తననీ బట్టీ అంచనావెయ్యకు అని చెప్పడంలో కథకుడి లోకజ్ఞత మాత్రమే కనిపిస్తుంది. కానీ మనకు కనిపిస్తున్న మనుషుల అమానుషత్వం వెనక, ఏమో, ఎవరికి తెలుసు? గొప్ప మానవత్వం రహస్యంగానూ, గుప్తదానంగానూ దాగి ఉందేమో అని చెప్పడానికి కేవలం లోకజ్ఞ్త చాలదు, నైతికత కూడా కావాలి, అటువంటి నైతికత పట్ల గొప్ప విశ్వాసం ఉండితీరాలి.

ఈ నైతికతను చూపించడం ద్వార సాయి బ్రహ్మానందంలోని కథకుడు నన్ను తక్షణమే ఆకట్టుకున్నాడు. కాని ఎంతచెప్పుకున్నా ఈ కోనసీమ కథల కథాకాలం ముప్ఫై నలభై ఏళ్ళ వెనకటది. ఎంతలేదనుకున్నా ఇందులో నోస్టాల్జియా ఉండకతప్పదు. ఇప్పుడు ఆ కథకుడు సముద్రాలకు ఆవల స్వదేశం నుంచీ, స్వజనం నుంచీ దూరంగా ఉన్నప్పుడు, కాలంలోనూ, దూరంలోనూ కూడా వచ్చిన మార్పు వల్ల, ఆ గత జీవితాన్ని కథకుడు ఎంతోకొంత ఆకర్షణీయంగా మారుస్తున్నాడేమో అనిపించకుండా ఉండదు.

కాని ఈ రెండు గుణాలూ- అంటే నీ కంటి ముందు కనిపిస్తున్నదే నిజం అని నమ్మలేకపోవడం, నీ కంటిముందు కనిపిస్తున్న మనుషుల ప్రవర్తనలోని విపరీత ధోరణుల వెనక వాళ్ళ జీవితాల్లో నలుగురితో పంచుకోలేని గాయాలో, వ్యథలో, సమస్యలో ఉన్నాయేమో, ఒకింత ఆగి చూడు అనే ఒక మానవత- ఇవి దేశంకాని దేశంలో కూడా మనిషిగా జీవించడానికి కథకుడికి తగిన జీవజలాల్ని సమకూరుస్తున్నాయనడానికి, ‘క్విల్ట్’ సంపుటంలోని కథలు సాక్ష్యమిస్తున్నాయి.

‘క్విల్ట్’ సంపుటిలోని 27 కథల్లో దాదాపు ఇరవైకథలదాకా అమెరికాలోని తెలుగు వాళ్ల జీవితం చుట్టూ అల్లిన కథలు. కోనసీమ కథలు ఒక నోస్టాల్జియాకి చెందినవి కాగా ఇవి ఒక డయాస్ఫోరాకి చెందినవి. నాకు ఆశ్చర్యం కలిగించిందేమిటంటే, తాను పుట్టి పెరిగిన కోనసీమను చిత్రించడంలో కథకుడు ఎంత సాధికారికతను చూపించగలిగాడో తాను ఇప్పుడు జీవిస్తున్న అమెరికన్ సమాజాన్ని చిత్రించడంలో కూడా అంతే సాధికారికతను చూపించగలగడం. ఇంకా చెప్పాలంటే, కోనసీమ కథల్లో కన్నా ఈ అమెరికన్ జీవితపు కథల్లో కథకుడు ఎక్కువ authentic గా, ఎక్కువ విశ్వసనీయంగా కనిపిస్తున్నాడు. కోనసీమ కథల్లో కథకుడి వ్యక్తిత్వం, అతడి నైతికత నన్ను ఆకట్టుకున్నాయి. కాని ఈ కథల్లో కథకుడి వ్యక్తిత్వం కొన్నిచోట్ల నాకు ఆరాధనీయంగా కనిపించిందంటే అతిశయోక్తి కాదు.

సాధారణంగా కథాసంపుటాల్ని సమీక్షించేటప్పుడు విమర్శకులు ప్రతి కథ గురించీ రాస్తారు. నాకు ఆ పద్ధతి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ కథలు చదవని పాఠకులకి ఆ సమీక్ష అడ్డంకిగా అనిపిస్తుంది. కథలు చదివినతరువాత పాఠకుడు ఆ సమీక్ష చదివాక ఆ సమీక్షకుడితో అంగీకరించకపోవచ్చు కూడా. అందుకని నేను ఇక్కడ ఈ కథల్ని పేరుపేరునా సమీక్షించే ప్రయత్నం చెయ్యను. కాని మొత్తం మీద చూసినప్పుడు, ‘క్విల్ట్’ కథాసంపుటిలోని 27 కథల్లో దాదాపు పది కథలు అగ్రశ్రేణి కథకుడు మాత్రమే రాయగల కథలుగానూ, అత్యంత నైతికశీలత్వం కలిగిన వ్యక్తి మాత్రమే మనతో పంచుకునే కథనాలుగానూ కనిపిస్తున్నాయి. అందుకు రెండు కారణాలు చెప్పవచ్చు.

మొదటిది, పైపైననే చూస్తున్నది జీవితం కాదనీ, దానివెనక ఉన్న సత్యాన్ని తరచిచూడాలన్న కథకుడి లక్షణం ఈ కథలన్నిటిలోనూ కనిపిస్తున్నది. నిజానికి ఆయన వ్యక్తిత్వంలోని ఈ లక్షణమే ఆయన్ని కథకుణ్ణి చేసింది. రెండవది, జీవితానికి ఆధారభూతంగా ఉన్న విలువల్ని పట్టుకోవడం, వాటిని పైకెత్తి చూపడం. మానవసంబంధాల్లో, ముఖ్యంగా, బయట జీవనసరళి మారినప్పుడల్లా ఆటుపోట్లకి ముందు గురయ్యేది తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య అనుబంధాలే అన్నది కథకుడు చెప్పే మొదటిమాట. కోనసీమనుంచి కాలిఫోర్నియాదాకా తన చుట్టూ ఉన్న మనుషుల్లో కథకుడు చూసిన దౌర్బల్యాలూ అవే, వాటి వెనక చెక్కుచెదరని బలాలూ అవే. రెండవది, మానవసంబంధాలు ఆటుపోట్లకు గురయినప్పుడల్లా మనుషులు తిరిగి నిలబడటానికి శక్తి తెచ్చుకునేది విలువలనుంచే అని పదేపదే చెప్పడం. విలువల పట్ల కథకుడికి ఉన్న ఈ నమ్మకాన్నే నేను నైతికత అంటున్నాను.

అది అన్నివేళలా సామాజిక నైతికతనే కానక్కరలేదు. ఒక కథలో కథానాయకుడు టెన్నిస్ క్రీడాకారుడు. ఆటలో తాను అనుభవించే ఆత్రుతను తట్టుకోలేక ఎప్పటికప్పుడు బాట్లు విరిచేస్తుంటాడు. అలా చెయ్యడం సరైంది కాదని తెలిసినా ఆ బలహీనతని అణచుకోలేకపోతుంటాడు. ఏమి చేసీ అతని చుట్టూ ఉండే మనుషులు ఆ బలహీనతని సరిదిద్దలేరు. అలాంటిది ఒకరోజు ఆ కథానాయకుడు టెన్నిస్ బాట్లు తయారు చేసే ఫాక్టరీకి వెళ్ళినప్పుడు బాట్లు యంత్రాలు కాదు, మనుషులు తయారు చేస్తారని తెలుసుకోగానే, అతడికి ఒక వికలాంగుడు తాను తయారుచేసిన బాటు గిఫ్టుగా ఇవ్వగానే ఆ కథానాయకుడిలో అపారమైన మార్పు వస్తుంది. అతడు ఆటలోనే కాదు, తన జీవితంలో కూడా తనని బాధిస్తున్న అవగుణాలనుంచి బయటపడగలుగుతాడు.

దీన్నే నేను నైతికత అంటున్నాను. ఈ నైతికత శీలానికీ, ఆర్జనకీ, స్వార్థత్యాగానికీ మాత్రమే సంబంధించిన నైతికత కాదు. ఒక మనిషికి తన రోజువారీ మానవజీవితాన్ని దాటి అసలు మానవత్వంలోని గంభీరమైన సారాంశం ప్రత్యక్షంకాగానే అతని వ్యక్తిత్వం ఒక్కసారిగా పువ్వులాగా వికసించడం. అటువంటి epiphany స్థూలంగానో, నాటకీయంగానో, నమ్మలేకుండానో ఉండేదిగా కాకుండా, చాలా సూక్ష్మంగా, సున్నితంగా, నమ్మదగ్గేదిగా ఉండటం- ఇదే కథకుడు తన కథనంలోనూ, శిల్పంలోనూ సాధించిన విజయం.

ఈ కథలు చదివేక, ముఖ్యంగా, ‘ఆ ఇంట్లో ఒక రోజు’, ‘డ్యూస్’, క్విల్ట్’, ‘సరిహద్దు’, ‘ఐ హేట్ మై లైఫ్’, ‘గలుబె’, ‘లవ్ ఆల్’ వంటి కథలు చదివేక, ఒక మనిషి తన పుట్టిపెరిగిన ఊరు వదిలి అమెరికాదాకా ప్రయాణించడం వల్ల అతని వ్యక్తిత్వం ఎంతగా వికసించగలదో అర్థమయింది. సాయి బ్రహ్మానందం కోనసీమలో ఉన్నాకూడా ఇప్పటికీ అదే నైతికతను చూపించగలిగి ఉండేవాడు, సందేహం లేదు,కాని అమెరికా వెళ్ళినతరువాత కూడా ఆ నైతికతను అంతే దృఢంగా కాపాడుకున్నాడే, అందుకు అతణ్ణి మనః పూర్వకంగా అభినందిస్తున్నాను. బహుశా అతడి తల్లిదండ్రులు, చిన్నప్పుడు చదువుచెప్పిన ఉపాధ్యాయులు అతడిమూలాల్ని పదిలంగానూ, పటిష్టంగానూ నిలబెట్టారనుకుంటున్నాను.

అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడి తెలుగులో రచనలు చేసే చాలామంది రచయితలు వాళ్ళ వ్యక్తిత్వాల్లోనూ, ఊహల్లోనూ, కథావస్తువులోనూ, సందేశంలోనూ కూడా ఇక్కడి గుణాల్నే, అవగుణాల్నే చూపిస్తూ ఉండటం కద్దు. అంత అభివృద్ధి చెందిన దేశంలో, అంతంత పెద్ద ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఉన్నందువల్ల వారిలో మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏమి వికాసం సంభవించిందో వాళ్ళ రచనల ద్వారా నాకు ఎంత మాత్రం బోధపడకుండా ఉంటుంది. కానీ సాయి బ్రహ్మానందం రాసిన కథలు చదివేక సాహిత్యం వల్ల తన సంస్కారం, సంస్కారం వల్ల తన సాహిత్యం రెండూ కూడా బలపడ్డ ఒక రచయితని కనుగొన్న భావన కలిగింది. ఆ రచయిత పట్ల అపారమైన గౌరవం కలిగింది. ముఖ్యంగా, ఇందాకే చెప్పానే, ఆ కథ- ‘లవ్ ఆల్’ రాసిన కథకుడు తెలుగు కథకుడు అయినందుకు గర్విస్తున్నాను కూడా.

కోనసీమలోనే కాదు, కాలిఫోర్నియాలో కూడా మనుషులు ఎంత నీచంగా, ఎంత దుర్బలంగా, ఎంత దుర్మార్గంగా ఉండగలరో సాయి బ్రహ్మానందం చూసాడు అనడానికి ఈ కథల్లో ఎన్నో పాత్రలు సాక్షులు. ముఖ్యంగా ఇలాంటి వాక్యాలు:

మనందరం మనుషుల్ని ప్రేమిస్తాం అన్న భ్రమలో ఉంటాం. కానీ- వస్తువుల్నీ, వూళ్ళనీ, ఇళ్ళనీ ప్రేమించినంతగా దేన్నీ ప్రేమించం’

మనుషుల్ని ద్వేషించినంత సులభంగా వస్తువుల్నీ, ఆస్తుల్నీ ద్వేషించలేం.’

మనుషుల పట్ల తన నమ్మకాల్నీ, వాళ్ళ పట్ల తనకు తెలీకుండానే చిన్నప్పణ్ణుంచీ తాను ఏర్పరచుకున్న ఆదర్శాల్నీ మనుషుల ప్రవర్తన గాయపరుస్తున్నప్పుడు బ్రహ్మానందం మొదటి స్పందన ‘మనుషులు ఇంత కాంప్లెక్స్ గా ఎందుకుంటున్నారు?’అన్నదే.

‘నీడ’ అనే కథలో కథకుడు ఒక మాట అనుకుంటాడు: ‘మనుషులు ఎందుకింత కాంప్లెక్స్ గా ఉంటారో బోధపడటంలేదు నీకు. పరవాలేదు, మెల్లగా, నీక్కావలసిన రీజనింగ్ నువ్వు వెతుక్కోగలవు’ అని. కాని కథకుడిగా ఆయన ఏ కథలోనూ అటువంటి రీజనింగ్ కోసం వెతుక్కోలేదు. అందుకు బదులుగా, మనుషులు తమ విపరీత మనస్తత్వాన్ని, విపరీత ప్రవర్తనని దాటి ఒక్కక్షణమేనా, కనీసం ఒక్కసారేనా, మనుషులుగా ఎప్పుడేనా ప్రవర్తించేరా అని ఆ క్షణాల కోసం వెతుక్కుంటాడు. అటువంటి క్షణాలున్నాయని తనకు తెలిస్తే వాటిని మనతో పంచుకుంటాడు. లేకపోతే, మనుషులు ఎందుకింత కాంప్లెక్స్ గా ఉంటారా అనే ఆశ్చర్యపోతూ ఉంటాడు. నిజానికి ఆ ‘నీడ’ అనే కథలో చివరి వాక్యం కూడా అదే:

మనుషులు ఎందుకింత కాంప్లెక్స్ గా ఉంటారండీ?

ప్రయత్నించి మనకొక నీతి బోధించడం కోసం కథకుడు ఏ కథనీ పరిష్కారం వైపు బలవంతంగా మరల్చడు. కథకుడి వ్యక్తిత్వంలోని నైతికత నన్ను సమ్మోహపరిచడానికి ఇది కూడా ఒక కారణం. అతడు నీతిబోధకుడు కాకపోవడం వల్ల అతడి నైతికత మరింత శోభిస్తోంది.

కోనసీమ కథలూ, అమెరికా కథలూ కాక, మరికొన్ని తావుల్లో నడిచిన కథలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటిలోనూ చెప్పదగ్గది ‘వానప్రస్థం’ అనే కథ. ఈ కథలో గొప్పదనం, అమెరికాలో కనిపించనిదేదో గంగలకుర్రు అగ్రహారంలో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడం. ఆ సత్యమేమిటో తెలియాలంటే, ఆ కథ మొత్తం చదవాలి. ఆ కథ ఒక్కటే కాదు, కోనసీమ కథలూ, కాలిఫోర్నియా కథలూ మొత్తం చదవాలి. అప్పుడు గంగలకుర్రు అగ్రహారంలో కథకుణ్ణి ఆకట్టుకున్నదేమిటో మనల్ని కూడా ఆకట్టుకుంటుంది.

తెలుగు కథని 21 వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళిన రచయితగా సాయిబ్రహ్మానందాన్ని నేను గుర్తుపడుతున్నాను. కాని జాతి కూడా గుర్తుపట్టాలంటే ఆయన మరింత విరివిగా రాయకతప్పదు.

3-6-2023

8 Replies to “కోనసీమనుంచి కాలిఫోర్నియా దాకా”

  1. కథా రచన చేసే వారికి చక్కని పాఠం లాంటిది ఈ సమీక్ష.తరచుగా వారి పేరు వింటూనే ఉన్నా ఎఫ్బీ మాధ్యమం ద్వారా. వారి రచనల విశిష్టతను చాలా చక్కగా విశ్లేషించారు.ఇరువురికా అభినందనలు.

  2. తుమ్మూరివారు చెప్పినట్టుగా కథలు వ్రాసేవారికి చక్కటి మార్గనిర్దేశకం చేస్తున్నట్టుగా వుంది మీ సమీక్ష.

  3. మీ సమీక్ష వినూత్న ఆలోచనలతో ఉత్తమ కథ ఎలా ఉండాలి అని మాత్రమే కాకుండా ఉత్తమ కథకుడిని వ్యక్తిగా ఆలోచనా శీలిగా కూడా నిర్వచించే లాగా ఉన్నది..మంచి కథలు రాయడం మాత్రమే కాదు రచయిత వ్యక్తిత్వ పరిణామ దశలు కూడా రచనల్లో కనిపించాలి అని సాహితీ వేత్తలు గుర్తెరగాలి.
    కోనసీమ కథలు ఆడియో గా వినిపించడం మాత్రమే కాదు, ముందు మాట రాసే అవకాశం కల్పించారు నాకు బ్రహ్మానందం గారు, ఆ కథలు నిజంగా స్నేహం మాకు స్నేహం కలిపిన కథలు.

  4. ” సమకాలీనులు మెచ్చరెన్నటికిన్ ” రోజులు నడిచిన/నడుస్తున్న రోజుల్లో ఒక విభిన్న కథకున్ని మీరు ఆలింగనం చేసుకున్న తీరు మీ హృదయ వైశాల్యాన్ని కనబరుస్తోంది. భేషజాలకు అతీతంగా, నిర్మల మనస్సుతో మీరు చేసిన సమీక్ష అందరినీ ఆలోచింప చేస్తుంది. నిష్కాపట్యం , స్వచ్ఛత మీ ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. జీవితాన్ని, మనుషులను, స్థలాలను, కాలాలను మీరు ఎంత ప్రేమిస్తారో దృగ్గోచర మౌతోంది. మీ రుణం తీర్చుకోలేనిది. మీ కాలంలో నివసిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు అండి.

Leave a Reply

%d bloggers like this: