నేను తిరిగిన దారులు

పుస్తకం వెలువరించి పుష్కర కాలం దాటినప్పటికీ, నేను తిరిగిన దారులు ఎవరో ఒక్క కొత్త పాఠకుణ్ణో, పాఠకురాలినో చేరుతూనే ఉంది. నాకు రాయదుర్గం విజయలక్ష్మి గారు రాసిన ఈ సమీక్షని ఇవాళ అత్తలూరి విజయలక్ష్మి గారు పంపిస్తూ ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని అడిగారు.

పుస్తకం సాఫ్ట్ కాపీ ఇక్కడే నా బ్లాగులో అందుబాటులో ఉంది. హార్డ్ కాపీ కావాలనుకున్నవాళ్ళు https://www.analpabooks.com/our-publications/analpa-telugu/nenu-tirigina-daarulu?sort=pd.name&order=ASC వారికి రాసి తెప్పించుకోవచ్చు.

అత్తలూరి విజయలక్ష్మిగారికి, రాయదుర్గం విజయలక్ష్మిగారికి-ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.


ఇదం విశ్వం ఏకనీడం ఖలు

రాయదుర్గం విజయలక్ష్మి

ప్రాగైతిహాసిక మానవుడి స్వర్గంగా భాసించే  భూపాల్ లోని ‘భీమ్ బేట్క’ గుహల ఆధారంగా తెలియవచ్చే లక్ష సంవత్సరాలక్రితం నివసించిన ఆదిమానవుడి నుంచి – ఏ ప్రాచీన కాలంలోనో  ఏ సముద్రాలనో దాటుకొని వచ్చి, నీలగిరుల మీద స్థిరపడి, తమ కోసం తమ వాళ్ళ కోసం కన్న తమ పశువుల కోసం, తమ పితృదేవతలకోసం మాత్రమే జీవిస్తున్న ప్రాచీన గిరిజన సంతతికి చెందిన ‘తోడాల’ను  గురించి వివరిస్తూ, అరకులో ‘పొరజా’ తెగను, శ్రీశైలంలో ‘చెంచుల’ను, పాపికొండలలో ‘కొండరెడ్ల’ను నాసిక్ లో ఆదివాసులైన ‘మహదేవ్ కోలీల’ను పరిచయం చేస్తున్న, వాడ్రేవు చినవీరభద్రుడి గారి నేను తిరిగిన దారులు- నదీనదాలు, అడవులు, కొండలు  అన్న పుస్తకం యాత్రా సాహిత్యంలో ఎన్నదగిన రచన.

ఆదిమానవుల అడుగు జాడలను, గిరిజనుల జీవితానుబంధాల నిత్యజ్యోత్సను, పరిచయం చేసే ఈ పుస్తకం, మనం చూస్తున్న మహాసౌందర్యం – మనం చూడలేక పోతున్న మహనీయ సౌందర్యాన్ని దేన్నో గుర్తు చేస్తూ, మనలోని అసంపూర్ణతలను జాగృతం చేస్తుందని చెప్పడమే కాదు,  ప్రాచీన శిథిల సౌందర్యాన్ని సంగీతంలా వినిపింప జేస్తుంది.

మనిషి తనను తాను అన్వేషించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి  యాత్రా సాహిత్యం దోహద పడుతుందని చెప్పే యీ  పుస్తకం, దేవుడిని గుడిలో కాకుండా ఆరుబయట  ఆకాశంక్రింద, ప్రకృతి ఒడిలో చూపిస్తుంది.  ఆధ్యాత్మిక శాంతినిచ్చే ఆలయాన్ని, ఆధునిక జీవితానందాన్నిచ్చే హైడల్ పార్కును ఒకేచోట పరిచయం చేస్తుంది. జీవించడము, జీవించి ఉన్నందుకు నిండుగా సంతోషించడము .. తప్ప మరే కర్తవ్యము లేని మధుర క్షణాలను అనుభూతికి తెస్తుంది.

తాజ్ మహల్ సౌందర్యాన్ని మించిన ఆనందోద్వేగాలను కలిగించే దానపారమితను  ఉదాత్తమైన రీతిలో  ‘బృందావనం’ ధర్మశాలలో పరిచయం చేస్తుంది. శేష జీవితాన్ని శాంతి యుతంగా బృందావనంలోగడపాలనుకొని, ఆకలితో ఆలమటించే అనాథ స్త్రీలకు పిడికెడు అన్నం పెట్టడానికి, చుట్టుప్రక్కల గ్రామాలలోని రైతులు, పోషించలేక బృందావనానికి తరిమి వేసిన వట్టిపోయిన పశువుల గడ్డి కోసం తోచినంత సాయం చేయండి…అని మనలో నిద్రాణంగా ఉన్న సహానుభూతిని తట్టి లేపే బృందావనయాత్ర మానవ సేవే గొప్పదన్న కోణాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో తాను పొందిన తృప్తిని ప్రకటించుకోవడం ప్రాచ్య కళాకారుడి లక్షణమైతే, జీవితంలో తాను పొందుతున్న అసంతృప్తిని ప్రకటించుకోవడం పాశ్చాత్య కళాకారుడి లక్షణమని సిద్ధాంతీకరిస్తుంది. మాంచెస్టర్ లోని రైలాండ్స్ లైబ్రరీ లో ఎంపిక చేసి ప్రదర్శించిన అరుదైన చారిత్రక పత్రాలు, పుస్తకాలు, తాళపత్రగ్రంథాల ప్రదర్శన వంటిది మనదేశంలో కూడా నిర్వహించవచ్చునని, ఎవరికైనా ఎందుకు స్ఫురించ లేదు? – అని నిలదీస్తుంది. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధ వాక్యంలా కనిపిస్తున్న సాంచీస్థూపసౌందర్యం క్రీ.పూ.మూడవ శతాబ్దం నుంచి క్రీ. శ. పదమూడవ శతాబ్దం దాకా ఆ ప్రాంతాలను ముంచెత్తిన బౌద్ధ వికాస తరంగాల చరిత్రను వివరిస్తుంది.

యాత్రా సాహిత్యమంటే… చూసిన స్థలాల వర్ణన మాత్రమే కాదు, ఆ స్థలాలను దర్శించినపుడు పొందిన స్పందనలను వివరించడమే కాదు, ఆ స్థలాలు యితరులనెలా కదిలించాయో, సాహిత్యాన్నెలా ప్రభావితం చేశాయో, కళలనెలా వివరించాయో, చరిత్ర పునర్నిర్మాణానికెలా దోహదపడుతున్నాయో చెప్పడం కూడా అవసరం అని ఈ పుస్తకం నిరూపిస్తూంది. మనకన్నా ముందు ఆ స్థలంలో నివసించిపోయిన పూర్వ మానవులతో సంభాషించడమే కాదు, ఆదిమానవుల అవశేషంగా మిగిలిన, అరుదైన జాతులను గూర్చి పరిశోధించడం కూడా నేటి మానవుని కర్తవ్యం అంటుంది.

గోదావరి ప్రభవిస్తున్న తొలి క్షణాలను చూస్తూ, బొట్లు బొట్లుగా పడుతున్న ఆ నీటి బిందువుల్లో ఏ సత్యం, ఏ శివం, ఏ సౌందర్యం కలిసి మహా ప్రవాహంగా మార్చే శక్తి నిచ్చాయని ఆశ్చర్యపడుతూనే, బిందువులో సింధువును దర్శింప గలిగిన విశాల దృక్పథాన్ని అలవర్చుకోమంటుంది. భారతీయ సాహిత్యం, కళల వివరణతో బాటు, ప్రపంచ సాహిత్యం, కళలను గూర్చి చేయబడిన విస్తారమైన వివరణ, రచయిత ప్రతిభాపాటవానికి అద్దం పడుతుంది. సాంచి శిథిల బుద్ధవిగ్రహంలోని శిథిల శిరస్సు సౌందర్యాన్ని చుట్టూ ఉన్న సాంచీ శిల్పసౌందర్యం భర్తీ చేస్తూందని చెప్పడం, పరిపూర్ణమైన బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయ శిల్పాలలో కన్నా, శిథిల సౌందర్యంగా మిగిలి ఉన్న, హళేబీడు హొయసలేశ్వర ఆలయంలోనే పరిపూర్ణమైన, లలితమైన కళ మిగిలివుందని భావించడం మనలో కొత్త ఆలోచనలను లేపుతుంది.

ఇటువంటి స్థలాలకు వెళ్ళినపుడు, మనలోని పరిమిత జ్ఞానం నుంచి, సంకుచిత దృక్పథం నుంచి బయట పడతామని, అపరిమితమైన, గంభీరమైన, శాశ్వతమైన ఆనందంలో మనని మనం అనుసంధించుకుంటామని, జీవితంలోని యాంత్రికమైన పరుగులను కొద్ది సేపైనా మాని, యాత్రలు చేయగలిగే తీరిక వేళల కోసం, సోమరి వేళలకోసం ప్రయత్నాలు చేయాలి’ అనే రవీంద్రుని మధురవాక్యాలను గుర్తు చేస్తుంది, యీ పుస్తకం!

ప్రతి దృగ్విషయం ఆధారంగా, మనం చూడలేని మహా సత్యాన్ని మనం ఎలా చూడాలో బోధిస్తూనే, ఒక రహస్య నాథ సంప్రదాయం ఒక బహిరంగ పరంపరగా మారి, ఒకవైపు మరాఠీ కవితా స్రోతస్వినిగా, మరొకవైపు పంజాబీ సిక్ఖు భక్తి ధారగా, వేరొక వైపు హిందీ భక్తి కవితా ధారగా భారతీయ సాహిత్యాన్నెలా పరిపుష్టం చేసిందో సాకల్యంగా వివరించిన యీ పుస్తకం ప్రపంచ సాహిత్యాన్ని, ప్రజా జీవితాన్ని కూడా అలవోకగా వివరిస్తుంది. లండన్ లో పురాతన గ్రామీణ ప్రాంతమైన హావర్త్ లో సంపూర్ణమైన జీవిత సాఫల్యానికి నోచుకోక, అభిశప్త కుటుంబంలో పుట్టినా, అపూర్వ సౌందర్యాన్ని అందించిన చార్లెట్ బ్రాంటి, ఏమిలీబ్రాంటి, అన్నా బ్రాంటీల స్మరణతో మన మనస్సులను కదిలిస్తుంది. ఒకవైపు, ప్రపంచంలో తన స్థానాన్ని అగ్రస్థానంలో నిలుపుకోవాలన్న తపన, మరోవైపు, ‘మన వర్తమాన జీవితాన్ని మనం దక్కించుకుంటే చాలు, మన పిల్లలకు మనం అన్నం పెట్టుకుంటే చాలు’ అన్న భావాలతో ఉన్న నేటి ఇంగ్లండ్, ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగలిగిన కాలం అంతరించి, జీవితం లోనూ, కళలలోనూ, సాహిత్యం లోనూ ఎదుర్కొంటున్న సంఘర్షణలకు అద్దం పడుతూఉంది.

యాత్రా సాహిత్యాన్ని లేఖారూపంగా కూడా అందివ్వవచ్చునన్న నూతన దృష్టిని ఆవిష్కరించే యీ పుస్తకం, భూత భవిష్యత్ వర్తమాన సత్య సౌందర్యాల సంగమంగా, అన్ని విభజన రేఖలకూ అతీతంగా భాసిస్తూ, మనలో నిద్రాణంగా ఉన్న అపూర్వ మాధుర్యాలను జాగృతం చేస్తుంది. ఈ పుస్తకం చదవడం పూర్తికాగానే, ఒక అపూర్వ చారిత్రక గ్రంథాన్ని చదువుతున్నట్లు, ఆయాకాలాల సామాజిక, సాంస్కృతిక చరిత్రను అవగాహన చేసుకుంటున్నట్లు, సాహిత్య సంగీత శిల్ప చిత్రలేఖనాది కళలను ఆస్వాదిస్తున్నట్లు, స్వచ్ఛమైన నదీజలాల్లో తేలియాడుతున్నట్లు, దిగంతపరివ్యాప్త సందేశ సాన్నిధ్యాన్ని కలిగించే పర్వతాలనధిరోహించినట్లు, ఎన్నో యుగాల రహస్యాలను అందించాలని తహతహలాడుతున్న ఆరణ్యక ప్రాకృతిక సౌందర్యాల వెన్నెలలో తడిసినట్లు అనుభూతిని చెందడం మాత్రం సత్యం. అందుకే ‘యీ సమస్త ప్రపంచం ఒక్కపక్షి గూడు వంటిదే కదా’ అన్న వసుధైకభావనకు అద్దంపట్టే రచనగా యీ పుస్తకం మిగులుతుంది అనడం అతిశయోక్తి కాదు.

2-6-2023

8 Replies to “నేను తిరిగిన దారులు”

  1. నాకు చాలా ఇష్టమైన పుస్తకం .ఈమధ్య నే స్నేహితులెవరికో యిచ్చాను.చదవమని.

  2. ఎంతో హృదయదఘ్నంగా చదివితే గాని ఇంత ఉరవడి తో స్పందన ఉబికి రాదు.రచన చదువరికి తాదాత్మ్యత ఈయగలిగే స్థాయిలో ఉన్నపుడే ఇది జరిగింది. వారికి మీకు నమస్సులు.

  3. నేను తిరిగిన దారులు – నాకెంతో ఇష్టమైన పుస్తకం. ఇందులో తోడాలనే ఆదిమ జాతి గురించి ఉన్న విపులమైన యాత్రానుభవ వ్యాసాన్ని చదివాకే, వారిని గురించి మొదటిసారిగా తెలుసుకున్నాను. ఇటీవల ఊటీ వెళ్ళినప్పుడు ఒక తోడా గ్రామాన్ని సందర్శించి వచ్చానంటే దానికి ప్రధానమైన కారణం, ప్రేరణ ఈ పుస్తకమే.

  4. మీదైన దృక్పథం మీ ప్రతి రచనలోనూ కనిపిస్తుంది. అందుకే ఈ సమీక్షకులను ఇంతగా కదిలించింది. సమీక్షలో ని ప్రతి వాక్యం ఒక కరదీపిక లాంటిది. సంధి కాలంలో మీరు అరుదైన వ్యక్తి గా భాసిల్లుతున్నారు. సాంకేతిక ఎంత పెరిగినా, వాటి ద్వారానే మమ్ములను చేయి పట్టుకొని మూలాల లోకి తీసుకుపోతున్నారు. మీకు మిక్కిలి ధన్యవాదాలు.

Leave a ReplyCancel reply

Exit mobile version
%%footer%%