రంగురంగుల కవిత్వం

ఏదన్నా కొత్త పుస్తకం వస్తోందంటే ఇష్టంగా ఒక ముందుమాట రాయడం లేదా పుస్తకం విడుదలయ్యాక సమీక్ష రాయడం- సాధారణంగా నేను చేసే పని. కాని ఈ సారి కొత్త పని చేస్తున్నాను, కొత్త పుస్తకం విడుదలవుతోందని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఇది అసాధారణమైన పుస్తకం కాబట్టి, తెలుగులో ఇప్పటిదాకా ఇటువంటి పుస్తకం రాలేదు కాబట్టి.

అనిల్ బత్తుల, గాలి నాసరరెడ్డి ఇప్పటికే దేశదేశాల కవిత్వం, ఇష్ట కవిత్వం అని రెండు సంకలనాలు తీసుకొచ్చారు. ఇది మూడవ సంకలనం. రంగురంగుల కవిత్వం. ఇది అనువాద కవిత్వ సంకలనం. అయితే ఇందులో ఉన్నవి వట్టి అనువాదాలు కావు. ఒక్కో కవితకి కనీసం రెండు, గరిష్ఠంగా అయిదు అనువాదాల చొప్పున మొత్తం 79 కవితలకు 206 అనువాదాలు. 64 మంది కవులు, 88 మంది అనువాదకులు. కవులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులు. అనువాదకులందరూ తెలుగువాళ్ళు, తెలుగులోకి చేసిన అనువాదాలు.

తెలుగు పాఠకులు కవిత్వమే చదవరే, అనువాదాలంటేనే అనుమానంగా చూస్తారే, అలాంటిది, ఒక్కో కవితకీ రెండు మూడు అనువాదాలా అన్న ప్రశ్న ఎలానూ వస్తుంది. ఆ ప్రశ్నతో పాటే చలంగారు యోగ్యతాపత్రంలో రాసిన ఈ మాటలు కూడా:

‘మద్రాసు బస్సుల గోలల మధ్య ఓ సారి శ్రీ శ్రీ ఇప్పుడు రాస్తున్న కొత్తదనాలకే ప్రజలు ఇంకా అలవాటు కాలేదే, ఇంకా ఈ సర్రియలిజం తెస్తే అసలు గాభరా పడి చదవడమే మానేస్తారేమో అన్నాడు చలం’

కానీ తెస్తే ఇలానే తేవాలి, పోటుమీద ఉన్న సముద్రం మాదిరి, కెరటాల వెనక కెరటాలు ఎగిసిపడుతుండాలి. నన్నడిగితే ఇద్దరు సంకలనకర్తలూ, మూడు సంకలనాలూ మాత్రమేనా? ఆ మాటకొస్తే, ప్రతి కవిత్వ ప్రేమికుడూ ఎప్పటికప్పుడు ప్రపంచకవిత్వం నుంచి తన సంకలనమొకటి కూర్చుకుంటూనే ఉండాలి. ఒకప్పుడు దాశరథి అనలేదా!

నా పాతమిత్రులెవరో తెలుసా?
గాలిబూ-కాళిదాసు,
నా కొత్త మిత్రులు?
నజ్రులిస్లాం-టాగోర్.

ఆ కవితలోనే ఈ మాటలు కూడా చెప్పాడు:

మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అది నా భాష
మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు-

ఇక అన్నిటికన్నా గొప్ప మాట, ప్రతి కవీ, తన ఇంటిముందు, బల్లమీద, హృదయమ్మీద రాసిపెట్టుకోవలసిన మాటలు- ఈ మాటలు:

ఈ రంగస్థలం మీద కంబరూ, కబీరూ
కలిసి కవిత్వం చదువుతారు
ప్రతి హృదయంలో అఖిలభారత
కవిసమ్మేళనం జరగాలి.

ఈ మాటలు ప్రపంచ కవిత్వాన్ని మనం పదే పదే నెమరేసుకోడానికి సంబంధించిన మాటలు కదా అనుకోవచ్చు. కాని, మనం తెలుగు కవిగాని ఏ కొత్త కవిని, ఏ భాషలో చదివినా, అది ఇంగ్లిషు, హింది, తమిళం, కన్నడం, ఉర్దూ, బెంగాలీ- ఏ భాషలో చదివినా, మనలో అంతర్గతంగా ఉన్న ఒక సాఫ్ట్ వేర్ దాన్ని తెలుగులోకి అనువదించి మనకి అందిస్తూనే ఉంటుంది. కాకపోతే దాన్ని మనం పైకి స్పష్టంగా ఉచ్చరిస్తో, ఒక కాగితం మీద రాసిపెట్టుకోం, అంతే. కాని అదే కవితని ఎవరేనా తెలుగు చేసినప్పుడు, మనకు తెలీకుండానే మనం ఆ అనువాదాన్ని, మన మనస్సులోని సాఫ్ట్ వేర్ అప్పటికే చేసిపెట్టిన అనువాదంతో పోల్చిచూసుకుంటాం. ఆ అనువాదం మన సాఫ్ట్ వేర్ కి దగ్గరగా వస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఆ కవితని మనమే అనువదించామా అన్నంత సంతోషం కలుగుతుంది. ఒకవేళ ఆ అనువాదం బాగాలేదనిపిస్తే, దాన్ని మన మనసుకి సన్నిహితంగా తేగల మరో అనువాదం కోసం ఎదురుచూస్తూనే ఉంటాం.

అందుకనే ఒకప్పుడు అనువాదాల్ని translation అనీ, ఆ తర్వాత రోజుల్లో transcreation అనీ అనేవారు కాస్తా, ఇప్పుడు వాటిని versions అనీ, interpretations అనీ అంటున్నారు. ప్రతి అనువాదం ఒక వ్యాఖ్యానం. ప్రతి అనువాదం అనేక కఠిన నిర్ణయాల సమాహారం. మన తరఫున అనువాదకుడు సాహసించి అప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే ఆ అనువాదం బయటికి వస్తుంది. తీరా ఆ అనువాదాన్ని మన చేతుల్లోకి తీసుకోగానే మన మనసులో ఒక సెమినార్ మొదలవుతుంది. మనం ఆ కవిత చదివినప్పుడు మన మనసులో అప్పటికే చేసిపెట్టుకున్న అనువాదానికీ, ఈ అనువాదానికీ మధ్య ఒక తులనాత్మక పరిశీలన మొదలవుతుంది. ఇదంతా తెలిసి జరుగుతుందా! కాని శరవేగంతో జరుగుతుంది. రోజువారీ జీవితంలో మనల్ని పట్టిపీడించే సమస్యలు ఎన్నో ఉండవచ్చుగాక, మనం చదివిన టాగోర్ నో, ఇలియట్ నో, రిల్కనో, మావోనో తెలుగులోకి సరిగ్గా తెచ్చారో లేదో అన్నది మన రోజువారి పనుల్లో, ఏమంత ముఖ్యమైన విషయంగా మనకి పైకి అనిపించకపోవచ్చుగాక. కాని నిజంగా మంచి అనువాదాన్ని చదివినప్పుడు మనం పొందే ఊరట, మామూలు ఊరట కాదు.

అందుకనే ఒక కవితకు ఎన్ని అనువాదాలు వస్తే అన్నీ చదవాలనుకోవడంలో ఉన్నది కేవలం అకడెమిక్ క్యూరియాసిటీ కాదు. అది అత్యున్నత రసజ్ఞ సంస్కృతి. లేకపోతే ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో’ అన్న కవితకి ఇప్పటికే వందలాది అనువాదాలు తెలుగులో వచ్చి ఉన్నా, ఏ ఒక్క అనువాదమూ మనకు తృప్తినివ్వడంలేదంటే ఏమిటి అర్థం?

గొప్ప అనువాదాలు వెలువడ్డప్పుడు ఒక భాష ఎంతో ఎత్తుకి ఎదుగుతుంది. గొప్ప కవిత్వాలు వెలువడ్డప్పుడు మరింత ఎత్తుకి ఎదుగుతుంది. కానీ, ఒకే కవిని మళ్ళీ మళ్ళీ అనువదించుకోడానికి ఉత్సాహపడ్డప్పుడు మాత్రమే ఒక భాష నిజంగా లోతుల్ని చవిచూస్తుంది.

అందుకే అనిల్ బత్తుల, గాలి నాసరరెడ్డి ఈ ‘రంగురంగుల కవిత్వం’ వెలువరిస్తున్నారని లోకమంతా వినేలాగా ఎలుగెత్తి చాటుతున్నాను. ప్రతి కవిత్వ ప్రేమికుడు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని తన బల్లమీద పెట్టుకోవాలని ఆశిస్తున్నాను. త్వరపడండి. 300 రూపాయల వెల. ఇప్పుడే బుక్ చేసుకుంటే 250 రూపాయలు. నేను నిన్ననే రెండు కాపీలకి అడ్వాన్సు కట్టాను. ఇంకా ఆలస్యమెందుకు? మీరు కూడా, ఈ కింద ఇచ్చిన లంకె నొక్కి, ఇప్పుడే మీ కాపీ రిజర్వ్ చేసుకోండి.

https://www.telugubooks.in/products/rangurangula-kavitvam?utm_medium=product-links&utm_content=android

1-6-2023

10 Replies to “రంగురంగుల కవిత్వం”

  1. ఇది నేను మాత్రమే చేస్తున్న పనేమో అనుకుని ఎప్పుడూ పైకి అనలేదు .ఓ మంచి వాక్యం ,ఆలోచన ,కనబడగానే అసంకల్పితంగా మనసు ఇంకో భాషలో ఎలా చెప్పవచ్చును అని ఆలోచిస్తుంది .

  2. there is a separate thrill in recreating what we have written in our own language into another language. Some times changes occur without our conscious effort. Time lapse or changed mindset bring these changes. Thank you, well-written.

  3. there is a separate thrill in recreating what we have written in our own language into another language. Some times changes occur without our conscious effort. Time lapse or changed mindset bring in these changes. Thank you, well-written.

Leave a Reply

%d bloggers like this: