ఒక ఫీల్డ్ వర్కర్ డైరీ

ప్రజలతో కలిసి పని చేయటం ఒక వరం. జీవితంలో లభించగల అవకాశాలన్నింటిలోనూ గొప్ప అవకాశం. సాధారణంగా మనుషులకు వృత్తి పరంగా లభించే అవకాశాల్ని మనిషికీ, ప్రకృతికీ మధ్య ఉండే దూరాన్ని బట్టి వర్గీకరిస్తూ ఉంటాం. మనిషి నేరుగా ప్రకృతి మధ్య, మట్టితోనూ,గాలితోనూ, అడవితోనూ, గనులతోనూ పని చేయగలిగే అవకాశాల్ని ప్రాథమిక రంగం అనడం మనకు తెలిసిందే. ఒక రైతుగా, రైతు కూలీగా మనిషి మట్టితోనూ, వానతోనూ, ఋతువులతోను సూర్య రశ్మితోనూ కలిసి పని చేస్తాడు. ప్రకృతితో నేరుగా కాకుండా ప్రకృతి నుంచి తవ్వి తెచ్చిన వాటితో మనిషికి పనిచేసే అవకాశం దొరికితే ఆ ఉత్పత్తి రంగాన్ని సెకండరీ సెక్టర్ అని అంటామని కూడా తెలిసిందే. గనుల్లో ఖనిజాన్ని తవ్వి తీయడం నేరుగా మట్టితో పని చేసే అవకాశం అయితే, తవ్వి తీసిన ముడి ఖనిజంతో కర్మాగారంలో పనిచేయటం ద్వితీయశ్రేణి అవకాశం. ప్రకృతికి దూరంగా కేవలం సమాచారంతోనూ, సాంకేతిక పరిజ్ఞానంతోనూ మనం పనిచేసే రంగం మూడవ రంగం. ఈ మూడు రంగాల్లోనూ, ప్రాయికంగా, అసలు పని చేయటం అనేదే దానికదే గొప్ప భాగ్యం. అది మనిషిని మనిషిగా మార్చే రాసాయనిక ప్రక్రియ. అది ఒక స్వస్థత. నలుగురితో కలిసి పని చేయడంలో, ఉమ్మడి ధ్యేయంతో పనిచేయడంలో మనిషి తన జీవితాన్ని పూర్తిగా జీవించిన సంతోషం పొందుతాడు.

అయితే ఈ మూడు రంగాల కన్నా ప్రత్యేకమైన రంగం మనుషుల కోసం, మనుషులతో కలిసి పని చేయటం. పొద్దున లేచి వారి పలకరించడం, వారి బాగోగులు తెలుసుకోవడం, తనకు తెలిసిన విషయాలు వాళ్లకు చెప్పడం, వాళ్ళ అనుభవాలనుంచి తాను నేర్చుకోవటం, తనూ, వాళ్లూ కలిసి ఈ ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికన్నా మరింత మెరుగ్గా మార్చుకోవడం -ఈ అవకాశం ఎవరికి దొరికినా వాళ్ళు మనుషులందరిలోనూ శక్తిమంతులు, భాగ్యవంతులు, చైతన్యవంతులు అని చెప్పొచ్చు.

మనుషులతో కలిసి పనిచేయడం వల్ల, మనుషుల కోసం పనిచేయటం వల్ల- అన్నిటికన్నా ముందు- మనలోని ఒక బాధ్యతాయుతమైన మనిషి బయటికి వస్తాడు. ఆ బాధ్యతాపరుడైన మనిషి మనలోంచి బయటికి వస్తున్నప్పుడు అతణ్ణి లేదా ఆమెని చూడటం మనకు చాలా సంతోషంగా, ఒకింత గర్వంగా కూడా ఉంటుంది. మనలోని బాధ్యతాయుతమైన మనిషి, మన శారీరక సామాజిక గుణగణాలతో నిమిత్తం లేకుండా, తనకై తాను ఎంతో శక్తిమంతమైన, చైతన్యవంతమైన ఒక జీవితం దీవించడం మొదలు పెడతాడు లేదా మొదలుపెడుతుంది. చాలాసార్లు మనం శారీరకంగానూ, సామాజికంగానూ, మానసికంగానూ దుర్బలంగా ఉన్నప్పుడు మనలోని బాధ్యతాయుతమైన ఆ మనిషి, మనకి గొప్ప శక్తిని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ మనం కూలిపోకుండా నిలబెడుతూ ఉండడం మనుషులతో పనిచేసిన ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చిన విషయమనే అనుకుంటాను.

నేను మొదట్లో కొన్నాళ్లు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఆ రోజుల్లో సాయంకాలాలు కవులతో, రచయితలతో తిరగటంలో గొప్ప ఆనందం అనుభవించే వాడిని. దాని ముందు నా ఉద్యోగ జీవితం వెలవెలబోయేది. నా ఉద్యోగం నుంచి నాకు ఎటువంటి సంతోషం కలిగేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ జీవితంలో నేను పూర్తి పరాయీకరణను అనుభవించాను. దాంతో చాలాసార్లు ఆఫీసు ఎగ్గొట్టేవాడిని. ఆఫీసుకి వెళ్ళినా కూడా చేయవలసిన పని చేసే వాడిని కాదు. ఎదురు తిరిగే వాడిని. గొడవలు పెట్టుకునే వాడిని. నా ప్రతిభాపాటవాలకు తగిన ఉద్యోగ అవకాశం దొరకలేదనే అసంతృప్తి వల్ల నేను నా ఉద్యోగాన్ని ఏనాడు గౌరవించుకోలేకపోయాను. అటువంటిది నేను గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా ఉద్యోగంలో చేరగానే నా మీద అపారమైన బాధ్యత ఉందని తెలిసి వచ్చేటప్పటికి నాలోంచి నెమ్మదిగా ఒక కొత్త మనిషి బయటకు రావడం గమనించాను. ఆ కొత్త మనిషి మంచి మనిషిగానూ, గొప్ప మనిషి గాను కూడా కనబడే వాడు. ఆ జిల్లాలో ఉన్న బాల బాలికలు, వాళ్ల కోసం నడుస్తున్న పాఠశాలలు, వాళ్లకు చదువు చెప్తున్న ఉపాధ్యాయులు, వాళ్ళందరి మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు- వాళ్ళందరి ఆశల్ని వమ్ము చేయకుండా చూడవలసిన బాధ్యత నా మీద ఉందనే మెలకువ కలగ్గానే నా ఉద్యోగ జీవితం నన్ను అత్యంత బాధ్యతాయుతుడైన మనిషిగా మార్చడం మొదలు పెట్టింది.

మనుషులతో కలిసి పని చేసే అవకాశం మన సమాజంలో చాలా అయాచితంగా దొరికే వాళ్ళల్లో అందరికన్నా మొట్టమొదట ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ప్రజలతో కలిసి పని చేసే సిబ్బందికి వాళ్లకు లభించిన ఉద్యోగ అవకాశం ఎంత అద్భుతమైన అవకాశమో చాలాసార్లు అర్థం కాదు. వాళ్లలో చాలామంది తమకు లభించింది కేవలం ఉద్యోగ అవకాశం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక ఉద్యోగ అవకాశంగా కూడా, వాళ్లు పొద్దున లేచి రకరకాల పనుల మీద, రకరకాల బాధ్యతలతో, ప్రజలతో కలిసి పనిచేయటం తమలోని భౌతిక మానసిక శక్తుల్ని ఏ విధంగా ప్రజ్వలింప చేస్తోందో వారు గుర్తుపట్టరు.

ప్రభుత్వ ఉద్యోగుల తర్వాత, ప్రజలతో కలిసి పని చేసే అవకాశం లభించే వాళ్ళల్లో, మరొక మూడు రకాల కార్యకర్తలు ఉంటారు. ఒకరు వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు. ఆయా రాజకీయ పక్షాల నిర్దిష్టమైన ఎజెండాను అమలు చేయడం కోసమే ఆ కార్యకర్తలు పనిచేసేటప్పటికీ ఆ కార్యకర్తలే లేకపోతే అసలు రాజకీయ కార్యక్రమమే ఉండదు. రాజకీయ పార్టీలకి అధికారాన్ని తెచ్చిపెట్టినా, అధికారాన్ని దూరం చేసినా అందుకు ఆ కార్యకర్తల అనుభవాలే కారణమవుతాయి. కానీ ఆ అనుభవాలు ఎలాంటివి, వాళ్ళ ఆలోచనలు ఎలాంటివి, వాళ్ళకి ప్రజలతో కలిసి పని చేయటంలో లభిస్తున్న పాఠాలు ఎటువంటివి అనే విషయం మీద ఏ రాజకీయ పార్టీ కూడా మేధామథన శిబిరాలు ఏర్పాటు చేయటం కానీ, అవగాహన తరగతులు నిర్వహించడం కానీ అంతగా కనిపించదు.

రాజకీయ పార్టీలకు తర్వాత ప్రజలతో అంతగా మమేకమై పనిచేసే వాళ్లు ఉద్యమ కార్యకర్తలు. రాజకీయ పార్టీల కన్నా తీవ్ర అంకితభావం, నిస్వార్థత ఉద్యమ కార్యకర్తల్లో కనిపిస్తుంది. చాలాసార్లు ఉద్యమ కార్యకర్తలు ప్రజలతో పని చేయటంలో ఎన్నో రకాల త్యాగాలకు అడుగడుగున సంసిద్ధులు కావలసి ఉంటుంది.

రాజకీయ పార్టీల కార్యకర్తలూ, ఉద్యమ కార్యకర్తలూ కాక, ప్రజలతో పనిచేసే మూడో తరహా కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు. నాకు తెలిసి ఆ స్వచ్ఛంద సంస్థలు ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నవైనా, ఎంత అద్భుతమైన పనితీరును కనబరిచేవైనా దానంతటికీ వెన్నెముక ఆ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల సేవా నిరతినే అని చెప్పవలసి ఉంటుంది.

అయితే ఈ నాలుగు రకాల కార్యకర్తలు-ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఉద్యమ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు- ఈ నలుగురి అనుభవాల్లోనూ ఒకరి అనుభవాలు గొప్పవని గాని మరొకరి అనుభవాలు తక్కువ అని గాని చెప్పలేం. ఒకరి అనుభవాలకీ, మరొకరి అనుభవాలకీ పోలిక ఉండనే ఉండదు. వారిలో ఏ ఒక్కరి అనుభవాలైనా సరే ఎంతో విలువైనవే. ఆ అనుభవాలనుంచి వారు నేర్చుకునే పాఠాలు తక్కిన సమాజమంతా తెలుసుకోవలసిందే. కానీ ఈ నాలుగు రకాల కార్యకర్తల్లోనూ దాదాపుగా ఉద్యమ కార్యకర్తలు తప్ప తక్కిన వారు తమ అనుభవాలను నమోదు చేయరు. అలా నమోదు చేయడం పట్ల వారికి ఆసక్తి ఉండదు. అందులోనూ, ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక సంఖ్యాకులకు తమ అనుభవాలు విలువైనవన్న నమ్మకం కూడా ఉండదు. కేవలం ఉద్యమ కార్యకర్తలు మాత్రమే తమ అనుభవాలను గ్రంథస్తం చేసుకునే పరిస్థితి మన సమాజంలో కొనసాగుతూ వస్తోంది. ఉద్యమ కార్యకర్తలు మనకు ఎటువంటి నెరేటివ్స్ అందిస్తున్నారో అటువంటి నెరేటివ్స్ ని బట్టే ప్రజలతో కలిసి పని చేయటమంటే ఎలా ఉంటుందో సమాజం అంచనా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది అభిలషణీయం కాదు.

ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు- గ్రామస్థాయి, మండల స్థాయి ఉద్యోగులు- ఉద్యమ కార్యకర్తల కన్నా మించిన passion తో త్యాగశీలత్వంతో పనిచేయడం నా ఉద్యోగ జీవితం పొడుగునా చూసాను. కానీ వారి అనుభవాలు నమోదు కాకపోవడం వల్ల, సాధారణంగా ప్రజల దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చులకన భావమే కొనసాగుతూ వస్తున్నది. అలాగే కొందరు ఉద్యమ కార్యకర్తల్ని, సంకుచిత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసేవాళ్లను కూడా నేను చూడకపోలేదు. కానీ అత్యధిక సంఖ్యాకులైన ఉద్యమ కార్యకర్తలు తమ అనుభవాలు కథలు, కవిత్వం, వ్యాసాలు, ప్రసంగాల రూపంలో నమోదు చేసుకుంటూ వస్తున్నందువల్ల వారి పట్ల ప్రజల్లో అపారమైన గౌరవభావం ప్రచరితంగా ఉండడం కూడా చూశాను. అదీకాక ప్రభుత్వ ఉద్యోగి జీతానికి పనిచేస్తాడు, అతనికి ఎన్నో రకాల ఉద్యోగ సదుపాయాలు ఉంటాయి కాబట్టి పనిచేయటం అతని తప్పనిసరి బాధ్యత అనీ, ఉద్యమ కార్యకర్త స్వచ్ఛందంగా, ఐచ్ఛికంగా పని చేస్తాడు కాబట్టి అతనిది ఉన్నత స్థాయి పని అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంటుంది. కానీ ప్రజలతో పని చేయవలసి వచ్చినప్పుడు అది జీతం కోసం చేశాడా లేక ఒక ఉద్యమ ధ్యేయం కోసం చేశాడా అన్నదానికి నా దృష్టిలో ద్వితీయ స్థానం మాత్రమే. కలిసి పని చేయటం దానికదే ఒక విలువ. ఆ విలువను నలుగురూ గుర్తించి, గౌరవించాలంటే ముందు మనం దాన్ని గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ప్రజలతో కలిసి పనిచేయడం వల్ల తమ వ్యక్తిత్వం ఏ విధంగా వికసించిందో గుర్తుపట్టడమూ, ఆ వ్యక్తిత్వ వికాసాన్ని ఒక కథనంగా మార్చడమూ చిన్నపాటి విద్యా కార్యక్రమం కాదు.

కాబట్టి ప్రజలతో కలిసి పని చేయడంలోనూ, తమ విధ్యుక్థధర్మాన్ని తాము నిర్వహించడంలోనూ మనుషులు ఎదుర్కొనే కష్టనష్టాలకు సంబంధించిన అనుభవ కథనాలు నన్ను ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి. అటువంటి అనుభవ కథనాలు నా దృష్టిలో అత్యుత్తమ సాహిత్యం. గొప్ప కథలు, నవలలు, నాటకాలు కూడా ఒక మనిషి నిజాయితీతో చెప్పుకున్న అనుభవ కథనాల కన్నా ఎక్కువ విలువైనవని నేను ఎన్నటికీ భావించలేను. ఆధునిక భారతదేశం సృష్టించిన సమస్త సృజనాత్మక సాహిత్యం అంతా ఒక ఎత్తూ, గాంధీజీ సత్యశోధన ఒక్కటీ ఒక ఎత్తూ అని నాకొక నమ్మకం.

మన కాలంలో నాకు అటువంటి రచనలుగా డా. కలాం రచనలు కనిపించాయి. మనుషుల కోసం, మనుషులతో కలిసి పనిచేయటం లోని విలువని ఆయన ముందుగా తనకై తాను గుర్తించాడు, గౌరవించుకున్నాడు. అప్పుడు నలుగురితోను పంచుకున్నాడు. తనకి ఆ అనుభవాలు లభించడానికి కారణమైన తన గురువులకు, మార్గదర్శకులకు, సహచర ఉద్యోగులకు తాను జీవించి ఉన్నంతకాలం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాడు. డా.కలాం ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ ను నేను ఒక విజేత ఆత్మకథగా అనువదించిన తర్వాతనే నా ఉద్యోగ జీవితపు అనుభవాలను కూడా నలుగురితో పంచుకోవచ్చని నాకు నమ్మకం కలిగింది. డా. కలాం ని నేను చదవకపోయి ఉంటే ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’ పుస్తకం రాసి ఉండేవాడినే కాను.

నా ఉద్యోగ జీవితం పొడుగునా నేను ఎందరో అంకిత భావం గల ఉన్నతాధికారుల్నీ, సహోద్యోగుల్నీ, క్షేత్రస్థాయి కార్యకర్తల్నీ చూస్తూ వచ్చాను. వారి అనుభవాలు నా అనుభవాల కన్నా ఎంతో విలువైనవి. ఎంతో సమగ్రమైనవి. మనుషులతో కలిసి పనిచేయడంలోంచి వారు నేర్చుకున్న పాఠాలు నమోదైతే మన సమాజానికి మరింత లబ్ధి చేకూరగలదని నేను గాఢంగా నమ్ముతున్నాను. కానీ వారిలో ఏ ఒకరిద్దరో తప్ప తక్కిన వారు తమ అనుభవాల్ని గ్రంథస్తం చేయకపోవడం జాతి దురదృష్టంగా భావిస్తున్నాను.

ఈ నేపథ్యంలో భారతి కోడె రాసిన ‘ఒక ఫీల్డ్ వర్కర్ డైరీ’, (సిక్కోలు బుక్ ట్రస్ట్, 2022) చదువుతుంటే నాకు కలిగిన సంతోషం మాటల్లో పెట్టలేనిది. ఆమె వివిధ రంగాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ రకాల ప్రజా సమూహాలతో కలిసి పనిచేసిన తన అనుభవాలను 70 వ్యాసాలుగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. బొగ్గు గనుల్లో, ఉప్పు పొలాల్లో, తేనె సేకరించే అడవుల్లో, పాల కేంద్రాల్లో, పొదుపు సంఘాల్లో- ఒకటి కాదు, ప్రస్తుత సమాజంలో ఎన్ని కార్య క్షేత్రాల్లో మనుషులతో కలిసి పని చేయవచ్చునో, అన్ని కార్య క్షేత్రాల్లో ఆమె వాళ్లతో కలిసి పనిచేయటమే కాక, ఆ అనుభవాలను గుర్తు పెట్టుకుని ఇలా గ్రంథస్తం చేయటం నన్ను ఎంత ఉత్తేజ భరితుణ్ణి చేసిందో చెప్పలేను. ఇటువంటి మనుషులతో కలిసి ఒక కార్యకర్తగా పనిచేయాలనే ఉత్సాహం నాకు ఈ పుస్తకం వల్ల కలుగుతోందని చెప్పటం అతిశయోక్తి కాదు.


ప్రజలతో కలిసి పని చేయటంలోని సంతోషం సరే, అలా పని చేయటంలో సంప్రాప్తించే అనుభవాలు ఆమెను ఎంత వివేకవంతురాలు చేశాయో ఈ పుస్తకంలో ప్రతి వ్యాసం సాక్ష్యం ఇస్తోంది. నేను కలగనే భారతదేశాన్ని నిర్మించగల చేతులు ఇటువంటి మనుషులవే అని నాకు మరోసారి నమ్మకం కలిగింది.

ఈ పుస్తకంలో నుంచి కొన్ని వాక్యాలు ఎత్తి రాద్దామనుకున్నాను. దాని కన్నా కూడా ఆ మొత్తం పుస్తకం చదవటమే సముచితంగా ఉంటుందని చెప్పగలను.

అయినా కూడా పుస్తకంలో నుంచి కనీసం నాలుగైదు వాక్యాలైనా పంచుకోవాలి అనిపించినప్పుడు ఈ పేరాగ్రాఫ్ కనిపిస్తున్నది. భారతి ఝార్ఖండ్ వెళ్ళినప్పటి తన అనుభవాలు రాస్తూ ఆ వ్యాసాన్ని ఈ కింది వాక్యాలతో ముగించింది:

హోటల్ కు చేరే దారిలో నిలువెత్తు బిర్సాముండా విగ్రహం కనిపించింది. కేవలం పాతిక సంవత్సరాలు జీవించిన మనిషి ఈ భూమి మీద, తన జాతి మీద ఎన్ని గుర్తులు, ఎంతటి ప్రభావాన్ని వదిలి వెళ్లాడు. అంత చిన్న వయసులోనే తన జాతి మొత్తాన్ని సమీకరించే శక్తి, తమను అణగదొక్కుతున్న వర్గాలపై పోరాడే తెగింపు ఎలా సాధ్యమైంది అని బిర్సా గురించి చాలా సేపు ఆలోచన చేశాను. ఇది రాస్తుంటే కొన్ని రోజుల నాడు తాను రాసిన ఒక వ్యాసంలో మా నిర్మల మేడం అడిగిన ప్రశ్న గుర్తుకు వస్తుంది. Should one live longer life or larger life?’

ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పని చేయటం, ఒక రాజకీయ కార్యకర్తగా పనిచేయడం, ఒక ఉద్యమ కార్యకర్తగా పోరాడడం, ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్తగా ప్రజల్ని చైతన్యవంతులు చేయటం- ఇవన్నీ సమానమైన బాధ్యతలే. వీటిలో ఒకటి ఎక్కువా ఒకటి తక్కువా అని అనలేం. కానీ ఈ నాలుగు రంగాల్లోనూ కూడా మెలకువతో, passion తో, నిజాయితీతో పని చేయటం అన్నిటికన్నా అత్యున్నత బాధ్యత. అది లేకుండా పని చేసినప్పుడు ప్రభుత్వంలో పనిచేసినా, పోరాటంలో పనిచేసినా రెండూ నిష్ప్రయోజనాలే. భారతి మన ముందు వేసిన ప్రశ్న స్పష్టంగానే ఉంది. Should one live longer life or larger life?

Featured image: PC: https://globalcommunities.org/

29-5-2023

12 Replies to “ఒక ఫీల్డ్ వర్కర్ డైరీ”

  1. భద్రుడు గారూ
    రెండు రోజుల క్రితం ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకున్నపుడు ఆమెకు తన బాధ్యతల పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టతతో పాటు సరళమైన వ్యక్తీకరణ ఏకబికిన చదివించాయి. ఆత్మపరిశీలనకు లోను చేసింది. మీ వ్యాఖ్య ఎంతో అర్థవంతంగా ఉంది.

    1. Thank you Kopparthy sir not only for reading the book, but also for taking out time to call and give me your valuable feedback. It means a lot 🙏

  2. ఆధునిక భారతదేశం సృష్టించిన సమస్త సృజనాత్మక సాహిత్యం అంతా ఒక ఎత్తూ, గాంధీజీ సత్యశోధన ఒక్కటీ ఒక ఎత్తూ అని నాకొక నమ్మకం.

    ఎంతో సమగ్రత. ఎంత క్లుప్తత!

  3. నాలుగు రంగాల విశ్లేషణ చాలా బాగుంది. తెలిసిందే అయినా అలా వింగడించిన తరువాత మన మన కార్యక్షేత్ర అనుభవాలు జలపాతాలవుతాయి కట్టెదురుగా. త్వరలో నా ఉద్యోగపర్వం పుస్తకంగా తేవాలన్న ఆత్రుత కలిగించారు.భారతి కోడె గారికి అభినందనలు.

  4. అంకితభావం తో పనిచేయడం,నిజాయితీతో పనిచేయడం వల్ల ఒకమనిషి వ్యక్తిత్వం పరిమళిస్తుంది.
    ఆ సంస్కారమే నేడు ప్రతి మనిషికీ అత్యవసరం.
    తన కోసమే కాకుండా పరుల కోసం బ్రతికే బ్రతుకు గా జీవించిన వారు
    శాశ్వతంగా ఉంటారు మరణించినా కూడా.

  5. Thank you very much sir for such a detailed response on the book. Your affirmation on the need for recording such experiences means a lot!

  6. ప్రజలతో.. కలిసి పనిచేయడం ఓ అదృష్టమే.. అలాంటి అవకాశం లభించిన వారందరు.. వస్తావ ప్రపంచంలో బ్రతకగలరు అని నా బలమైన నమ్మకం ఈ రోజు మీ వ్యాసం చదివాక తృప్తిగా అనిపించింది. భారతి గారి కవిత్వం, లో మనసుని తాకే ఎన్నో అంశాలు ఉంటాయి.,నేను ఇష్టంగా చదివే కవయిత్రు లలో భారతి గారు ఒకరు.. ఫీల్డ్ డైరీ ద్వారా తాను అందించిన ప్రజా సంబంధాలు ఓ అమూల్యమైన కానుకే అనిపిస్తుంది నా మటుకు నాకు. Thank you sir

Leave a Reply

%d bloggers like this: