వాళ్ళు విడదీస్తారు, మనం కలుపుకోవాలి

సుడాన్ ఆఫ్రికాలో మూడవ అతిపెద్ద దేశం. 2011లో ఉత్తర దక్షిణ దేశాలుగా విడిపోక ముందు సుడాన్ ఆఫ్రికాలో అతిపెద్ద దేశం. ఇప్పుడు దాదాపు 5 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యంత వెనుకబడ్డ దేశాల్లో ఒక దేశంగా మనుగడ సాగిస్తోంది. మానవ అభివృద్ధి సూచికల ప్రకారం 172 వ స్థానంలో ఉంది. దాదాపు ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుడాన్ ఈరోజు అంతర్యుద్ధంలో చిక్కుకుపోయి ఉంది.

ఆధునిక యుగం మొదలవుతూనే బానిస వ్యాపారానికి కేంద్రంగానూ, ఆ తర్వాత ఇంగ్లాండ్ ఈజిప్టులు చెరిసగం పంచుకున్న దేశంగానూ కొనసాగి 1956 లో స్వాతంత్రం పొందింది. కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా మొత్తం 67 ఏళ్ల స్వతంత్ర జీవితంలో నలభై ఏళ్లకు పైగా అంతర్యుద్ధంలో నలిగిపోతూనే వచ్చింది. ఏడు దశాబ్దాలు నిండని స్వాతంత్ర జీవితంలో ఆరు సైనిక విద్రోహాల్నీ మరొక పదిసార్లు విఫల విద్రోహాల్నీ సూడాన్ చవి చూడవలసి వచ్చింది.

2019 లో ప్రజలు తిరుగుబాటు చేసి సైనిక నియంతను గద్దె దింపించిన తర్వాత 2021 దాకా అతి కష్టం మీద ప్రజాస్వామ్యం దిశగా ప్రయత్నాలు చేపట్టిన ప్రభుత్వం నడిచింది. పూర్తిస్థాయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకి సైనిక అధికారులు ఒకపక్క అంగీకరిస్తూనే, మరొకపక్క ప్రజాస్వామిక ప్రయత్నాలకు తూట్లు పొడిచి 2021 లో సైనిక పాలన మొదలుపెట్టారు. దాంతో మళ్లా ఈ ఏడాది ఏప్రిల్ 15న రెండు సైనిక శిబిరాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. 1983 నుంచి 2005 దాకా జరిగిన అంతర్యుద్ధం గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్న దేశంలో, ప్రజల అవసరాలతో కానీ, బాగోగులతో కానీ సంబంధం లేని మరో అంతర్యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. ఈ 40 రోజుల్లోనే ఇప్పటిదాకా కనీసం వెయ్యి మంది మరణించారు. ఐదువేల మందికి పైగా క్షతగాత్రులుయ్యారు. పది లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు.

Source: Visual Capitalist, May 7, 2023

సుడాన్ లో గాని లేదా ఇతర ఆఫ్రికా ఆసియా దేశాల్లో గాని పదేపదే తలెత్తే ఈ అంతర్యుద్ధాలకి, సైనిక తిరుగుబాటులకి ప్రధానమైన కారణం అక్కడ తెగల మధ్య ఉన్న తీవ్ర విభేదాలు, అంత కలహాలు అని చెప్తారు. నిజానికి కొన్ని తెగలు కలిసి ఒక జాతిగా మారడం అంత సులభమైన విషయం కాదు. దానికి అపారమైన క్రమశిక్షణ కావాలి. నిస్వార్థులైన జాతి నిర్మాతలు కావాలి. పురాతనమైన తెగలు కాలక్రమంలో చారిత్రక కారణాలవల్ల కొత్త మతాల్ని స్వీకరించినప్పుడు ఆ తెగలూ మతాలూ కలిసి కొత్త ఐడెంటిటీలు పొందినప్పుడు జాతి నిర్మాణం మరింత కష్టమవుతుంది. ఇక ఆ తెగలు తమ తమ మతాలతో ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు బలంగా ఉంటే ఆ ప్రాంతాలన్నీ కలిసి ఒక జాతిగా, ఒక ఉమ్మడి దేశంగా రూపొందడం మరింత కష్టమవుతుంది. సుడాన్ ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితి ఇదే. ఎందుకంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి అంటూ ఏదైనా ఉంటే అది రాజధాని చుట్టుపక్కల మాత్రమే జరిగి ఉండడం, దేశమంతా విస్తరించి ఉన్న వివిధ తెగలకు ఆర్థిక వ్యవస్థలో తగిన వాటా లభించకపోవడం, వీటికి తోడు సుడాన్ నానాటికి ఎడారిగా మారుతుండడం- ఆ దేశాన్ని ఒక జాతిగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాయి.

సుడాన్ లాంటి దేశాలతో భారతదేశాన్ని పోల్చి చూసినప్పుడు ఇక్కడ రక్తపాతంతో కూడుకున్న అంతర్యుద్ధం కనిపించదు కానీ అనేక రూపాల్లో రక్తం చిందుతూనే ఉంది. మతం పేరిట, భాష పేరిట, కులాల పేరిట 1947 నుంచి ఇప్పటిదాకా ఈ దేశంలో చిందిన నెత్తురు తక్కువేమీ కాదు. వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, మతాలు పక్క పక్కన మనుగడ సాగిస్తున్న భారతీయ సమాజం ఒక జాతిగా మారడానికి ప్రయత్నించినప్పుడు 1947 దాకా అతి పెద్ద అవరోధంగా నిలబడ్డది మతం. 1947 తర్వాత, భారతదేశం సెక్యులర్ ప్రాతిపదికన ఒక ఆధునిక జాతీయ రాజ్యంగా అవతరించిన తర్వాత కూడా మతం అవరోధంగా కొనసాగుతూనే వస్తోంది. పైగా ఆ అవరోధం నానాటికి మరింత బలపడుతూ ఉండడం ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నాం. దీనికి తోడు కులం, ప్రాంతం, భాష కూడా భారతదేశాన్ని ఒక జాతిగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న శక్తులే.

వివిధ సమూహాలు ప్రాదేశిక ప్రాతిపదికన ఒక జాతీయ రాజ్యంగా మారడం అంత సులువైన విషయం కాదు. స్వాతంత్రానికి పూర్వం హిందువులు ముస్లింలు వేరు వేరు కాబట్టి వారికి వేర్వేరు దేశాల అవసరమనే వాదన నడిచినప్పుడు గాంధీజీ ఒక విషయం పదేపదే చెప్తూ వచ్చాడు. నువ్వు నీ మతాన్ని అనుసరిస్తూనే భారతీయుడిగా ఎదగవచ్చు, జీవించవచ్చు అని చెప్పాడు. అంటే నువ్వు హిందువుగా ఉంటూనే భారతీయుడివి కావచ్చు, నువ్వు ముస్లిం గా ఉంటూనే భారతీయుడివి కావచ్చు అని. ఈ ఆలోచన వెనుక మధ్యయుగాల భక్తికవుల మధ్య నడిచిన సగుణ-నిర్గుణ సంవాదం అంతా ఉంది. ఉదాహరణకి భారతీయత అనేది ఒక నిర్గుణ రూపం. కానీ హిందువు, ముస్లిం, సిక్కు, క్రైస్తవుడు వారి వారి వేషభాషల వల్ల ఆచార వ్యవహారాల వల్ల సగుణ రూపాలు. భగవంతుడు ఏకకాలంలో సగుణ- నిర్గుణ రూపంగా ఉన్నట్లే భారతీయుడు కూడా ఏకకాలంలో హిందువుగా, క్రైస్తవుడిగా, మహమ్మదీయుడుగా ఉంటూనే భారతీయుడుగా ఉండవచ్చుననే ఆలోచన గాంధీది.

కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం తిరిగి మతపరమైన, భాషాపరమైన, ప్రాంతపరమైన గుర్తింపులకి పెద్దపీట వేసే కాలంలోకి వచ్చి పడ్డాం. ఇప్పుడు మనకి భారతీయుడుగా గుర్తింపు పొందడం కన్నా ఫలానా మతం వాడిగా, ఫలానా కులం వాడిగా, ఫలానా ప్రాంతం వాడిగా పొందే గుర్తింపు పట్లనే ఎక్కువ ప్రాధాన్యత. మతపరమైన, కులపరమైన, ప్రాంతీయమైన గుర్తింపుని దాటి ఒక భారతీయుడిగాను, ఆ జాతీయవాద గుర్తింపు కూడా దాటి ఒక ప్రపంచ పౌరుడిగాను జీవించటం అంటే ఏమిటో మనం నేర్చుకోనే లేదు. ఒకప్పుడు శ్రీ శ్రీ దీన్ని ‘ఏకకాలంలో అనేక కాలాల్లో జీవించిన అనుభవం’ అన్నాడు. అంటే నువ్వు ఏకకాలంలో ఒక ప్రాంతానికి ఒక దేశానికి సమస్త ప్రపంచానికి చెందిన మనిషిగా కూడా జీవించవచ్చు. అలా జీవించడమే మానవత పరమార్థం. అలా ఒక జాతిగా పరిణతి చెందడం చేతకాకపోతే వివిధ సమూహాలు ఒక రాజ్యాంగం రాసుకున్నప్పటికీ జాతిగా కొనసాగగలవని హామీ ఏమీ లేదు.

వివిధ రకాల సామాజిక నేపథ్యాలమధ్య, వివిధ రకాల ప్రాంతీయ అసమానతలతో ఒక జాతిగా ఎదగలేని దేశాల్లో, ఆ సంఘర్షణకు అందరికన్నా పెద్ద మూల్యం చెల్లించేది పిల్లలు. ఎందుకంటే ఆ జాతులకి తమ రాజకీయ విభేదాల్ని కొనసాగించుకోడం పట్ల ఉన్న ఆసక్తి తమ పిల్లలపైన తమ శ్రద్ధనీ, కాలాన్నీ పెట్టుబడి పెట్టడం మీద ఉండదు.

ఉదాహరణకి సుడాన్ తీసుకుందాం. ఆ దేశంలో దీర్ఘకాలం సంభవించిన అంతర్యుద్ధంలో కొన్ని వేల మంది పిల్లలు కనిపించకుండా పోయారు. చాలామంది మరణించారు. చాలామంది పొరుగు దేశాలకు కాందిశీకులుగా వెళ్లిపోయారు.

అటువంటి నిరాశ్రయులైన పిల్లల జీవితాలు ఆధారంగా ఈ పదేళ్లలో ఎంతో సాహిత్యం వచ్చింది. ఎన్నో సినిమాలు వచ్చాయి వాటిల్లో Good Lie (2014) అనే సినిమా ఈమధ్య చూశాను. ఆ సినిమా చూస్తున్నంత సేపు నా ఆలోచనలు సుడాన్ చుట్టూతానే కాదు, భారతదేశం చుట్టూ కూడా పరిభ్రమించాయి. ఎందుకంటే ఇక్కడ కూడా మన ప్రభుత్వాలకి రాజకీయ వాగ్దానాలు చేయటం పైనా, రాజకీయ పోరాటాలు కొనసాగించడం పైనా ఉన్న ఆసక్తి పిల్లల విద్య, వైద్యం, ఆరోగ్యం, వికాసం పట్ల లేనేలేదు. పిల్లల భవిష్యత్తు గురించిన ప్రణాళికలు రూపొందించి అమలు చేసే బదులు వారు పిల్లల మనసుల్లో విద్వేష విష బీజాలు నాటుతూనే ఉన్నారు. ఇటువంటి కాలంలో భవిష్యత్తు పట్ల ఆశ కలిగించగల చిన్నపాటి స్ఫూర్తి ఎక్కడైనా దొరుకుతుందేమోనని నేను వెయ్యి కళ్ళతో గాలిస్తూనే ఉంటాను.

Good Lie సినిమాలో నాకు నచ్చింది ఏమిటంటే, అది అన్నిటికన్నా ముందు, ఒక జాతి లేదా దేశం తాలూకు యుద్ధబీభత్సాన్ని ఆ పిల్లల జీవితాలు చిన్నాభిన్నం కావడంలో పట్టుకుంది. ఒక తుపాకీ మోత, ఒక బాంబు, ఒక మందు పాతర ఒక జాతి జీవితాన్ని ఒక శతాబ్దం వెనక్కి నెట్టేయగలుగుతాయి. విముక్తి పేరిట యుద్ధాలు చేయటం కలోనియల్ యుగపు భావజాలం. ఈరోజు నువ్వు మనుషుల విముక్తి గురించి తపిస్తున్నట్లయితే కావాల్సింది యుద్ధం కాదు, శాంతి. ప్రజల్ని సాయుధం చేయడం కాదు, సాధికారికం చేయాలి. Good Lie సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చిన అంశం యుద్ధం పిల్లల్ని విడదీస్తూ వాటిని తలో దిక్కుకీ తిరిగి పిల్లలు ఒకరిని ఒకరు వెతుక్కుంటూ తమను తాము కలుసుకోవటం, కలుపుకోవటం. అవకాశాల కోసం పోరాటం అంతర్యుద్ధాలకు దారితీస్తున్న కాలంలో ఒకరి కోసం మరొకరు అవకాశాలు త్యాగం చేయటం మామూలు విషయం కాదు. సినిమా ముగిసేటప్పటికీ ఇటువంటి త్యాగాలు చిన్నవో పెద్దవో, ఇటువంటి ప్రయత్నాలు చిన్నవో పెద్దవో మన చుట్టూతా సంభవిస్తూనే ఉన్నాయి, వాటిని పైకెత్తి చూపించవలసిన బాధ్యత మన మీద ఉందని నాకు మరొక మారు అర్థమైంది.

రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, మతాధికారులు ప్రజల్ని విడదీస్తారు. వాళ్లు విడదీసిన ప్రతి ఇద్దరినీ మీరూ, నేనూ, మనమూ ఎప్పటికప్పుడు ప్రేమతో కలుపుకుంటూనే పోవాలి.

కనిపించే అంతర్యుద్ధంలో చిక్కుకున్న సుడాన్, కనిపించని అంతర్యుద్ధంలో నలుగుతున్న ఇండియా-ఎవరికైనా ఒకటే మంత్రం: వాళ్లు విడదీస్తారు, మనం కలుపుకోవాలి.

Featured image: Sudanese refugees who crossed into neighboring Chad receive aid at a distribution center on April 30. Pc: Getty images.

28-5-2023

10 Replies to “వాళ్ళు విడదీస్తారు, మనం కలుపుకోవాలి”

 1. “కనిపించే అంతర్యుద్ధంలో చిక్కుకున్న సుడాన్, కనిపించని అంతర్యుద్ధంలో నలుగుతున్న ఇండియా-ఎవరికైనా ఒకటే మంత్రం”…
  విడదీస్తారు సుమీ! కలుపుకోవాలి మనం!!!
  చదువు – సంస్కారం! అంటే ఇది కదా.
  ఇంతకంటే గొప్పగా చెక్కిన శిల్పం మరొకటి లేదు.
  జేజేలు…. వీరభద్రులకు.

  1. ధన్యవాదాలు రామ్ భాస్కర్!

 2. ఆలోచించ వలసిన విషయం.నాకు తెలిసి 65 నుండి 80 దాకా అనేక సామాజిక మార్పులు ప్రగతి దారుల నుండి పక్కకు తప్పుకున్నది. గాంధీజీ భావజాలంతో అస్పృశ్యత , జాతి మత కుల విభేదాలను మరచిపోయే దిశలో దశలో ఉన్న సమయంలో, అర్ధమతులు, అర్థమతులు, నానా ఇదమిస్టులు బయలు దేరి లోకోపకారం చేస్తున్నామనుకుని కావలసినంత లోకాపకారం చేసారు. విషవృక్షాలు కల్పవృక్షాలవైపు దృష్టిని. మరలేటట్లు చేసాయి. ఎరుపు ఘాటు కాషాయపు కంపును రెచ్చగొట్టింది.మత పీఠాలు మారేడుకాయలకు మసిపూసాయి. రాజకీయాలు ఎప్పటిలాగే ఎత్తుగడల పన్నాగాల పన్నగపు నీడలయ్యాయి.ఆదర్శం అపహస్యమైంది. ఒక సారి
  ఉరకలు వేసే గిత్తల పగ్గాలు చేజారిపోయి , ముకుతాళ్లు తెగిపోయాయో అంతే వీరంగం కొన సాగుతుంది. స్వార్థపు పట్టాలపై చోదకుడు లేని జాతి రైలుబండి ప్రమాద దిశలో పరుగెడుతుంది.
  మీరన్నట్లు వాళ్లు వీడదీస్తే మనం కలుపుతూ పోవాలి. అదొక్కటే శరణ్యం.ఫణిఫణాగ్ర మణివ్యవస్థ.

  1. శక్తివంతమైన మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

 3. ఎవడెవడో..
  తమ తాత్కాలిక, స్వార్ధ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం..
  మతం, కులం, ప్రాంతం, భాష.. పేరుతో..
  విద్వేషాగ్నిని రగిలిస్తాడు… రావణకాష్టం చేస్తాడు..
  తెలిసో, తెలియకో..
  ప్రతివాడు..
  తన తెలివిని, మానవత్వాన్ని..
  కారణాలు ఏవైనా పక్కన బెట్టి..
  ఈ కాష్టానికి తన వంతుగా..
  ఓ సమిధను..ఆహుతి ఇస్తూనే ఉన్నాడు..

 4. Rupa rukmini . K – ✍️అక్షరం ఓ ఆయుధమైతే... పుస్తకం ఓ విజ్ఞాన వేదిక✍️ ❤అలల అంచున నడకకు పాద ముద్రలుండవు❤️ poetry📖అనీడ
  Rupa rukmini . K says:

  అంతర్యుద్ధం.. నేటి సామజిక పరిస్థితుల్ని బాగా చెప్పారు సర్.. వాళ్ళు విడదీస్తారు మనం కలుపుకుపోవాలి

 5. మితి మీరిన స్వార్థమే అన్నిటికీ మూలం.
  “నేనే”బాగుపడాలి,బాగుండాలి.నా రక్తం పంచుకు పుట్టిన వారు మాత్రమే బాగుపడాలి.
  మిగతా అందరూ వెనకబడి పోవాలి ,అప్పుడే ఈ నాటి మనిషికి శాంతి.
  ఈ మితిమీరిన స్వార్ధపర భావనలే మనిషి మరొక
  మనిషి నీ,జాతి మరొక జాతిని ,దేశం మరొక దేశాన్నీ విడదీస్తున్నాయి. కలుపుకోలేక పోతున్నాయి.
  రాజకీయ నాయకులైనా, వ్యాపారులైనా, సామాన్య మానవులైనా అంతే.
  సర్వేజనా సుఖినోభవంతు,వసుధైక కుటుంబ భావనకు చోటు కల్పించే పెద్దలు ఉన్నారా ఈ
  ప్రపంచం లో….
  మీరన్నట్టు కొందరైనా కలుపుకొని పోయే వారు ఉండాలి. లేదా యాదవ కులంలో ముసలం పుట్టినట్టు కలికాలం కూడా ఏదో ఒకరోజు ….ఏదో ఒక జాడ్యం పుట్టి ముంచక మానదు.
  అన్నింటికీ నిరక్షరాస్యత ,పేదరికం కారణమని అనుకుంటాం కానీ మనిషి స్వభావమే అన్నిటికీ ప్రధాన కారణం.

Leave a ReplyCancel reply

Exit mobile version
%%footer%%