వెళ్ళిపోతున్న వసంతం

Du Fu, 18th century painting, PC: Wikicommons

పొద్దున్నే ఇంకా తెల్లవారకుండానే కోకిల ఒకటే గీపెడుతూ ఉంది. ఆ పిలుపు భరించడం కష్టంగా అనిపించింది. ఆ పిలుపులో ఏదో దిగులు, ఆపుకోలేని ఆత్రుత ఉన్నాయి. కాని లేవబుద్ధి కాలేదు. నాకు తెలుస్తూనే ఉంది, కోకిల దేనికి అంతలా తన నెత్తీ నోరూ మొత్తుకుంటోందో.

ప్రపంచంలో గొప్ప జాలి, దిగులు కలిగించే దృశ్యాలు కొన్నుంటాయి. పండగ అయిపోయాక ఇంటిముంగిలి, నాటకం వేసి తెరలు విప్పేసిన రంగస్థలం, అప్పటిదాకా కూచుండి, ఎన్నో కబుర్లు చెప్పి, సెలవు తీసుకుని మిత్రులు వెళ్ళిపోయాక ఖాళీ అయిపోయిన గది- ఇట్లాంటి దృశ్యాలు ఎటువంటి వెలితిని, శూన్యాన్ని తోపింపచేస్తాయో, వసంతం వెళ్ళిపోయే వేళ కూడా అలాంటి బెంగనే రేకెత్తిస్తుంది.

ఒకప్పుడు తాంగ్ సామ్రాజ్యం రాజధాని చాంగాన్ ముట్టడిలో చిక్కుకుపోయినప్పుడు దు-ఫు కి కలిగిన దిగులు అలాంటిదే. ఆ రోజుల్లో అతను నది ఒడ్డున నిలబడ్డప్పుడు ముట్టడిలో చిక్కుకుపోయిన నగరం, ఆ నగరంలో చిక్కుకుపోయిన తన జీవితం- రెండూ కూడా వసంతం వెళ్ళిపోతున్నప్పటి విషాదాన్నే మదిలో రేకెత్తిస్తున్నట్టు గుర్తుపట్టాడు. కాని ఆ నది ఒడ్డున పూల గుబుర్లలో ఇంకా కదలాడుతున్న సీతాకోకచిలుకలు, నదీజలాల మీద వాలి, పైకి లేస్తున్న తూనీగలు-వాటిని చూడగానే గొప్ప సాంత్వనకు లోనయ్యాడు. వెంటనే రెండు కవితలు చెప్పాడు. వాటినే కోకిల ముక్కున కరుచుకొచ్చి తెల్లవారకుండానే నా కిటికీ దగ్గర బిగ్గరగా వినిపించింది అని మొత్తానికి గుర్తుపట్టాను. ఇదిగో, ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.

మొదటికవితలో వసంతం వెళ్ళిపోతున్న దిగులు ఉంది. రెండవ కవిత మొదలుకావడం గొప్ప దుఃఖంతో మొదలయ్యిందిగానీ, అపురూపమైన కాంతిసంతకంతో ముగిసింది.


దు-ఫు

ఒంపులు తిరుగుతున్న నది ఒడ్డున :  రెండు కవితలు

1

రాలుతున్న పూలు వసంతం వెళ్ళిపోతోందని గుర్తుచేస్తున్నాయి

గాల్లో తేలివస్తున్న పూలరేకలు తీవ్ర దుఃఖాన్ని మోసుకొస్తున్నాయి.

ఎగిరిపోతున్న పూలనిట్లా చూడగలిగినంతసేపు చూద్దాం

పదివేల దుఃఖాలున్నాసరే పానపాత్రలు దూరం చేసుకోవద్దు.

నది ఒడ్డున గుళ్ళో లకుముకి పిట్టలు గూళ్ళు కట్టుకున్నాయి

మరుభూమివైపు పూలదారిన పురాణశిల్పాలు పడివున్నాయి.

విషయాలెట్లా నడుస్తున్నవో చూసాం,  మన వెతుకులాట ఆపవద్దు

కీర్తిప్రతిష్టలకోసం పాకులాడింది చాలు, పట్టుకుని వేలాడొద్దు.

2

రోజూ కొలువునుంచి వస్తూనే నా దుస్తులు కుదువపెట్టుకుంటాను

నదినుంచి వచ్చేటప్పటికి చిత్తుగా తాగి ఉంటాను, డబ్బులుండవు.

తాగడానికి చేసిన అప్పుల్తో నన్ను పలకరించని పానశాలలేదు

అలాగని డెబ్భై ఏళ్ళు దాటి బతికి ఉంటానన్న నమ్మకం లేదు.

పూలగుబుర్లలో సీతాకోకలు దాగుడుమూతలాడుతున్నాయి.

నిశ్చలజలాలమీద వాలి తూనీగలు తిరిగి పైకెగురుతున్నాయి

ఈ రెక్కలజతకత్తెల్తో నాట్యమాడమని ఋతువును వేడుకుంటాను

ఈ క్షణాలు మిగిలినంతకాలం వసంతం వెళ్ళిపోలేదనుకుంటాను.

Featured image: Painting by Tang Yin, a Ming dynasty painting, c.15th century, PC: Wikicommons

27-5-2023

6 Replies to “వెళ్ళిపోతున్న వసంతం”

  1. ఒకప్పుడు అనుకునేదాన్ని ఇంటి తలుపులు తెరవగానే గుమ్మం ముందు తురాయి చెట్టు రాత్రంతా రాల్చి పరిచిన పసుపు తివాచీని చూసి పొంగి పోగలిగిన మనసు వున్నంతకాలం నేను బ్రతికివున్నట్టే అని .ఇప్పుడు ఇక్కడ కోయిలలు.!

  2. Rupa rukmini . K – ✍️అక్షరం ఓ ఆయుధమైతే... పుస్తకం ఓ విజ్ఞాన వేదిక✍️ ❤అలల అంచున నడకకు పాద ముద్రలుండవు❤️ poetry📖అనీడ
    Rupa rukmini . K says:

    వసంతానీకో… కోకిల రాగం బావుంది సర్…

Leave a ReplyCancel reply

Exit mobile version
%%footer%%