అమృత స్పందనలు

కొన్ని రచనలు కాలాన్ని తట్టుకుని ఎలా బతగ్గలవో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 1990 లో నేను రాసిన కథ ‘అమృతం’ అటువంటిది. ఆ కథ అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో అచ్చయ్యింది. ముప్ఫై ఏళ్ళకి పైగా గడిచేయి. ఇప్పటిదాకా, ఆ కథ చదివి, తమ సంతోషాన్ని నాతో పంచుకున్నవారు ఇద్దరే. ఒకరు, ఉషశ్రీ అని ఒక మిత్రురాలు. ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్టణంలో పనిచేసేవారు. ఆ కథ నేపథ్యం విజయనగరం అయినప్పటికీ, అప్పటికి నేను పార్వతీపురం నుంచి ట్రాన్సఫర్ అయి కర్నూల్లో పనిచేస్తున్న రోజులు. నేను పార్వతీపురంలో పనిచేస్తున్నప్పుడు భూషణంగారి ద్వారానూ, మరొక ఆత్మీయుడూ, అప్పట్లో విశాఖపట్టణం రేడియోలో పనిచేస్తున్న మధుసూధన్ ద్వారానూ ఆమె నాకు పరిచయం. ఆ కథ చదివి ఆమె నాకొక ఉత్తరం రాసారు. ‘ఆ కథలో వి.ఎస్ ఆ కథకుణ్ణి అడుగుతాడే అలా నేను కూడా అడుగుతున్నాను, మీరు మళ్ళా ఎప్పుడేనా విజయనగరం వస్తే, అడవిలో వెన్నెల రాత్రి ఏ కొండమీదనో గిరిజన స్త్రీలు పాడే పాటవినాలని ఉంది, తీసుకువెళ్తారా?’ అని రాసారామె. ఆ కోరిక వట్టి ఊహ మాత్రమే అయి ఉండవచ్చు. కాని ఆమె ఈ లోకాన్ని అంత త్వరగా వదిలిపెట్టివెళ్ళిపోక పోయి ఉంటే, నేను నిజంగానే ఆమెను తీసుకువెళ్ళి పార్వతీపురం అడవుల్లో ఏ కొండమీద గ్రామంలోనో ఒక వెన్నెలరాత్రి పాటలు వినిపించి ఉండేవాణ్ణి.

ఆ కథని ఇష్టపడ్డ మరో మిత్రురాలు సావిత్రి గారు. ఆమె అప్పటికి విశాఖపట్టణంలో టిబివార్డులో రోగశయ్యమీద ఉంది. ఆమెకి ఆ పత్రిక ఎలా చేరిందో తెలీదు, ఆ కథ ఆమె ఎప్పుడు చదివిందో, ఎలా చదవగలగిందో కూడా తెలీదు. కానీ, రాయడానికి రక్తమాంసాల్లేనీ మిగలని ఆ వేళ్ళతో ఆమె అంత ఉత్తరం ఎలా రాసిందో కూడా నాకిప్పటికీ అర్థం కాదు. కాని, ఆమెని ఆ ఉత్తరం రాయడానికి ప్రేరేపించిన శక్తి మాత్రం ఈ కథనే.

ఎందుకంటే, మేము రాజమండ్రిలో ఉన్నరోజుల్లో, సాహితీవేదిక ‘కథాగౌతమి’ అనే కథాసంకలనం వెలువరించింది. 1982 లో వచ్చిన ఆ సంకలనంలో, నా కథ ‘శరణార్థి'(1981) కూడా అచ్చయ్యింది. మల్లంపల్లి శరభయ్యగారు నన్ను కూర్చోబెట్టుకుని ఆమూలాగ్రం ఆ కథని ఒక కావ్యంలాగా సమీక్షించిన రోజులవి. ఆర్.ఎస్.సుదర్శనంగారూ, వసుంధరాదేవిగారూ ఇద్దరూ ఆ కథ చదివి పరవశించిపోయిన రోజులు కూడా. కాని సావిత్రి గారు ఆ కథని చీల్చి చెండాడేసారు. ‘ఒక స్త్రీనుంచి ఒక పురుషుడు కోరుకునేది ఒక రాత్రి అనుభవం మాత్రమేనా? ఇంత చిన్న వయసులో మీకు అలాంటి ఆలోచనలు రావడం సమంజసమేనా?’ ఇలాంటివే చాలా ప్రశ్నలు. ఆ కథాసారాంశం అది కాదనీ, ఆమె ఆ కథని అపార్థం చేసుకున్నారనీ తెలుస్తోంది, ఆ మాటే చెప్పడానికి ప్రయత్నించాను, కాని ఆమె వినిపించుకోలేదు. ఆమె మీద ఉన్న గౌరవంతో నేను ఆ చర్చ మరి పొడిగించలేదు. అంత పెద్ద సాహిత్యవేత్తలు ఆ కథని మెచ్చుకున్న ఆనందంతోపాటు, ఆమె ఆ కథని అపార్థం చేసుకున్నారన్న చిన్న దిగులు కూడా అలానే ఉండిపోయింది.

తిరిగి 1991 లో, అంటే దాదాపు పదేళ్ళ తరువాత, ‘అమృతం’ కథ చదివి, ‘తన కన్నా తన మనసుకన్నా తన శరీరం ఆకర్షణీయం కావడం ఏ స్త్రీకి ఇష్టం కనుక!’అనే వాక్యం చదివి, ‘ఆనాడు ఒక స్త్రీతో ఒక రాత్రి అనుభవం చాలనుకునే కుర్రవాడు, తన కళ్ళముందే ఎదిగి, వికసించి, ఈ వాక్యం రాయగలిగేదాకా వికసించడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని’ రాసారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. తన మిత్రుడు రాసిన రెండు కథల్ని, పదేళ్ళ కాల వ్యవధిలో వచ్చిన రెండు కథల్ని, అలా వాక్యం వాక్యం చదివి, గుర్తుపెట్టుకుని, అప్పుడు తనకి ఒక కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పిన ఆమె, మళ్ళా మరొక కథ నచ్చినప్పుడు, ఆ సంగతి చెప్పడానికి, అనారోగ్యాన్ని పక్కకునెట్టి మరీ, ఉత్తరం రాసిన మనిషి ఆమె. పాఠకురాలంటే ఆమె. మిత్రురాలంటే ఆమె.

ఆ ఇద్దరు స్నేహితురాళ్ళనుంచీ అంత విలువైన స్పందనలూ లభించాక ఇక నాకు ఆ కథ మీద మరొకరి అభిప్రాయం కోసం ఎదురుచూడక్కర్లేదు అనిపించింది. అందుకనే వార్షిక సంకలనకర్తలుగానీ మరెవరేనా గానీ ఆ కథ గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినా నాకేమీ అనిపించలేదు. ఒక రచన ఒక పాఠకుణ్ణి చేరితే చాలు అనుకుంటాను, అలాంటిది ఈ కథ ఇద్దరు పాఠకుల్ని చేరింది అనుకున్నాను.

కాని మరొక ముప్ఫై ఏళ్ళ తరువాత, ఆశ్చర్యం, ఈ కథ మరొక ఇద్దరు మిత్రురాళ్ళను చేరింది. ఒకరు కల్యాణి నీలారంభంగారు. ఆమె ఆ మధ్య ఒక జూమ్ మీటింగ్ లో ఈ కథ గురించి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంతో వింటూ ఉండిపోయాను. ఎలా చేరింది ఈ కథ ఆమె హృదయాన్ని అని! ఆమె ఆ కథలో అమృతం ఏమిటి, ఎక్కడుంది అని చేసిన అన్వేషణ మామూలు పరిశీలన కాదు. ఇదిగో, నిన్న మళ్ళా వసుధారాణి గారు ఈ కథ మీద రాసిన ఈ పరిచయ వ్యాసం చదివి మరొకసారి అప్రతిభుణ్ణి అయ్యాను.

ఒక రచనకి ఒక పాఠకుడి హృదయపూర్వక స్పందన చాలనుకుంటాను. కానీ ఈ కథకి నలుగురినంచి నేనూహించని స్పందన నా ఆనందాన్ని నాలుగింతలు చేసింది.


వసుధారాణి

ఫేస్ బుక్ పోస్ట్, 24-5-2023

నేను విశ్వసించే ప్రేమ అన్న భావన నన్ను ఎప్పుడూ ఆనందాశ్చర్యాలకు గురించేస్తూనే ఉంటుంది. ఈ ‘అమృతం’ కూడా ప్రేమ కథే. మోహం ప్రేమగా మారి అమృతమైన కథ.

జీవితంలో తనకంటూ ఎవరూ లేని యువకుడు శ్యామల అనే అమ్మాయిని ప్రేమించటం. ఆ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్ళి తాలూకూ బాధాపూరితమైన గతం, ఓ కళ్ళు లేని చంటిపాప ఉండటం.శ్యామల కూడా ఇతనిని ప్రేమించటం. అయితే ఆమె గతం తాలూకూ నీలినీడల నుండి బయట పడలేక ఆమె బాధ పడుతూ ఉండటం. ఆమె మానసిక స్థితిని అర్ధం చేసుకునే ప్రయత్నం ఇదీ కథ.

అయితే కథ ఇంతేనా? కాదు.

ఈ కథ ఇంత సింప్లిసిటీలో నుండి ఇంకేదో గొప్ప జీవన రహస్యం చెపుతోంది.

కథ మొదలవ్వటమే ప్రేమికుడియొక్క లక్ష్యం ఏమిటో చెపుతూ మొదలవుతుంది. మూడు పేరాల్లో ప్రపంచం మొత్తాన్ని ఒకవైపు, ఈ కథలోని కథానాయకుడిని ఒకవైపు చేసి చూపుతారు రచయిత.

సాధారణంగా మనుషులు దుఃఖం, మోహం, ఆనందం, విషాదం,కష్టం, సుఖం, వినోదం ఇలా ఎవరి భావోద్వేగాల్లో వాళ్ళు వాళ్ళదైన లోకంలో సమూహల మధ్య కూడా ఒంటరిగా జీవిస్తూంటారు.
ఇక నిజమైన ప్రేమ కనుక ఎవరినైనా స్పర్శిస్తే?

వారి ప్రపంచం మొత్తం కేవలం ప్రేమించిన వారి చుట్టూనే.. అయితే కథని మొదలు పెడుతూనే ఆ ప్రేమలోని గాఢతని, మోహన్ని, ఇష్టాన్ని, ప్రత్యేకతని చెప్పగలగటం చిన వీరభద్రుడు గారి శైలికే చెందింది.

ఇప్పటి వరకూ ఈ పుస్తకంలో ఈ కథ కంటే ముందుగా నేను చదివిన 13 కథలూ ఒక రకం. నెమ్మదిగా విషయంలోకి తీసుకుని వెళతాయి.

భద్రుడు గారు ఈ కథని మొదలు పెట్టటమే ఓ వేగంతో మొదలుపెట్టారు. కథ మొత్తం చదివాక స్పందించే మన హృదయానికి అర్ధం అవుతుంది అది హృదయ స్పందన వేగం అని.

ఒక పేరాని యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను.

‘రైల్వే లైన్ కి అటువైపు విశాఖపట్నం పోయే రోడ్. నిరంతరం రద్దీతో, ఇటు వైపు రాయపూర్ వెళ్లే నెం.43 నేషనల్ హైవే. ఆ రోడ్డును చూడగానే ఘాట్ రోడ్ల ఒంపులు, దండకారణ్యం, మజ్జిగౌరి జాతర, ఆదివాసీలు, పార్వతీపురం కుట్ర కేసు- గాఢమైన అసోసియేషన్స్ అడవి పువ్వుల గాలిలాగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పక్కకు దిగి ఎఱ్ఱని మట్టి బాట పైన రైల్వే లైను వెంబడే అడుగులు వేస్తుంటే ఒళ్ళంతా నిలవనీయని మహా మధుర మోహప్రకంపనలు.’

‘ఆ ముందు లైన్లలో ఎన్ని అడుగులు నడిస్తే ఆ ఇంటి ముందు నిల్చుంటానో స్పష్టంగా తెలుసు. “

ఇది కథలోని రెండవ పేరా..

సరే మోహాలూ, వ్యామోహాల కథలు చాలానే చదివాం, భద్రుడు గారు ఏమి చెపుతున్నారు అని ముందుకు వెళితే-

‘శ్యామల’- మనం కూడా కథానాయకునితో పాటుగా ఇనుపగేటు దాటుకుని,ఎర్రని, పచ్చని కనకాంబరం పూల మొక్కల్ని తప్పుకుని మెట్లు ఎక్కి, ఆప్యాయంగా చేతులు చాచిన జాజితీగ వెంబడి చూపులు సాచితే-కనపడుతుంది.

ఇందులో కథానాయకునికి పేరు లేదు. ఉత్తమపురుషలో ఉంటాడు. శ్యామల నుండి తను కోరుకున్న ప్రేమని పొందటం అతని లక్ష్యం. శ్యామల అతనికేనా?

కథ చదివిన వారందరకీ నిజమైన ప్రేమ ఏమిటో తెలుపుతుంది. కధలోని ‘నేనంతా’ పాఠకులే.

ఎందుకంటే ఈ కథలోని నేను మాత్రమే ప్రేమలోకి ప్రయాణం చేస్తాడు, మోహిస్తాడు, ఉక్కిరిబిక్కిరి అవుతాడు. పర్యవసానాలను, తన ప్రవర్తనను, శ్యామల స్థితిని ప్రతి అంశాన్ని తరచి తరచి చూసుకుంటాడు, విశ్లేషించుకుంటాడు.

ప్రేమలో జరగాల్సింది అదే ఎదుటివారి భావనల పట్ల బహు సున్నితంగా స్పందించటం. అయితే దీనికి అతని వయసు, ఆమె పట్లగల విపరీతమైన మోహం కొంత విఘాతం కలిగిస్తుంటాయి.

అప్పుడొస్తాడు అతనికి గురు సమానుడైనటువంటి వి యస్ అనేటటువంటి వ్యక్తి. నిజానికి నా దృష్టిలో ఈ వి యస్ ఈ కథకి హీరో.

వి యస్ ఓ విలక్షణమైన వ్యక్తి గొప్ప సంగీతకారుడు కానీ తనకోసం మాత్రమే పాడుకునే బతకనేర్వని వాడు. గొప్ప లాక్షణికుడు కానీ బహు సున్నిత మనస్కుడు.

వి యస్ ప్రవర్తన, మాటల ద్వారా, అతని ప్రేమ కథని చెప్పటం ద్వారా భద్రుడు గారు కధలోని కథానాయకునికి, కథయొక్క అంతిమ ప్రయోజనం పాఠకుని కూడా కొన్ని అహం పొరలను, కొన్ని మోహపు పొరలను విప్పుతారు.

అసలు వి యస్ లాంటి మనిషిని చూడకుండా, దగ్గరగా మసలకుండా అటువంటి పాత్రను కేవలం సృష్టించలేం. ఈ పాత్ర ఔన్నత్య స్థాయిని చూపటంలో భద్రుడు గారి సృజన అంత గొప్పగా ఉంది.

వి యస్ రాక వల్ల అతనితో కాసింత సమయం గడపటం వలన తన గత జీవితంలో ఎన్నో బాధలను చిన్న వయసులోనే అనుభవించి, వాటి తాలూకూ నీలినీడలకు భయపడుతున్న శ్యామలను ఎలా చూసుకోవాలో, ఆమెని ఎలా చేరుకోవాలో అతను తెలుసుకుంటాడు.

ప్రేమ, ప్రేమకథ అంతం అవ్వవు మొదలవుతాయి ఈ కథ అంతే చిట్ట చివరికి మొదలవుతుంది.

వి యస్ లాంటి వ్యక్తులో, చిన వీరభద్రుడు గారి కథలో మనకి తారసపడితే అమృతం దొరికే తావు తెలుస్తుంది.

ఈ కథ నన్ను చాలా రోజులే ఆపేసింది. ఈ కథను గురించి నేను తెలుసుకున్న ఎంతో కొంత రాస్తే కాని మిగిలిన కథల్లోకి వెళ్ళ లేనని ఈ కథను గురించి రాసే సాహసం చేసాను అంతే 🤗💐

26-5-2023

4 Replies to “అమృత స్పందనలు”

 1. తమ రచనలకు సహృదయపాఠకుల స్పందన కంటే మించిన సత్కారం లేదు. ఇది కూడా వ్యామోహము ప్రేమగా పరిణమించిన స్థితి లాంటిదే.

 2. అమృతం కథ నేనింకా చదువుతున్నాను.
  ప్రతీ అక్షరంలోనూ ప్రేమామృతం పొంగిపొరలుతున్న అనుభూతి కలిగింది.
  నాయకుడి హృదయం లోని ప్రేమసౌరభాలకి
  అక్షరాలు కూడా గుబాళిస్తున్నాయనిపించింది.

  సర్…మీరు మాలాంటి సామాన్యపాఠకుల్ని కూడా మీ రచనలోని ఔన్నత్యశిఖరాలవైపు
  అలవోకగా,హాయిగా నడిపించగల మీ సహృదయతకి కృతజ్ఞతలు.
  అద్భుతమైన రచనంటే అందరికీ సులభంగా
  అర్థంకానిదనే ఒక భయంలోంచి బయటకి పాఠకుడ్ని బయటకు తీసుకువచ్చారు సర్ మీరు.
  మీకు పాఠకులమీద అవ్యాజమైన ప్రేమ వుందనిపించింది.
  కథ పూర్తిగా మరోసారి నా ఆనందాన్ని తెలియజెయ్యాలని నా కోరిక.
  ధన్యవాదములు.🙏

Leave a Reply

%d