స్వతంత్రమానవుడి కథ

నెల్సన్ మండేలా తన Long Walk to Freedom (1994) ముగిస్తూ ఇలా రాసుకున్నారు:

ఆ ఎడతెగని, ఒంటరి కాలంలోనే  నా స్వేచ్ఛ గురించిన తపన సమస్త మానవాళి స్వేచ్ఛ గురించిన తపన గా మారింది. తెల్లవాళ్ళూ, నల్లవాళ్ళూ అందరి స్వాతంత్య్రం గురించిన తపనగా మారింది. అణచివేతకు గురయ్యేవాడు మాత్రమే కాదు, అణచివేతకు పాల్పడేవాడికి కూడా విమోచన అవసరమనేది నాకు చాలా స్పష్టంగా తెలిసొచ్చింది. తోటిమనిషి స్వాతంత్య్రాన్ని హరించేవాడు ద్వేషానికీ, సంకుచితమనస్తత్వానికీ, అపోహలకీ, అపార్థాలకీ బందీగా మారిపోతాడు. నా స్వాతంత్య్రాన్ని ఎవరేనా నానుంచి లాక్కుంటే నేనెలా స్వతంత్రుణ్ణి కాకుండాపోతానో, అలానే నేను మరొకరి స్వాతంత్య్రాన్ని అపహరిస్తే కూడా స్వతంత్రుణ్ణి కాకుండాపోతాను. అణచివేతకు పాల్పడేవాడూ, అణచివేతకు లోనయ్యేవాడూ ఇద్దరూ కూడా తమలోని మానవత్వానికి దూరమయ్యేవాళ్ళే.’

‘జైలునుంచి బయటకి అడుగుపెట్టినప్పుడు నా ధ్యేయం ఒక్కటే: అణచివేతకు గురవుతున్నవాళ్ళనీ, అణచివేతకు పాల్పడుతున్నవాళ్ళనీ కూడా విముక్తుల్ని చెయ్యడం. కాని అదంత సులభం కాదని నాకు తెలుసు. మనం స్వతంత్రులుగా ఉండటానికి కావలసిన స్వేచ్ఛపొందాం. అణచివేతకు గురవకుండా ఉండే హక్కు సంపాదించుకున్నాం. కాని మన ప్రయాణంలో చివరి అడుగుకి ఇంకా చేరుకోలేదు. నిజానికి మనం వేస్తున్నది మరింత సుదీర్ఘమైన, కష్టసాధ్యమైన దారిమీద మొదటి అడుగు మాత్రమే. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండటమంటే, సంకెళ్ళను తెంచుకోవడం మాత్రమే కాదు, ఇతరుల స్వాతంత్య్రాన్ని గుర్తించి గౌరవించి పెంపొందించేవిధంగా బతకడం కూడా. స్వాతంత్య్రం పట్ల మన అంకితభావానికి నిజమైన పరీక్ష ఇప్పుడే మొదలవుతున్నది.’

‘నేనింతదాకా ఆ సుదీర్ఘ స్వాతంత్య్ర పథం మీద పయనిస్తో వచ్చాను. నడుస్తున్నప్పుడు తొట్రుపడకుండా ఉండటానికి ప్రయత్నించాను. అయినా కూడా దారిపొడుగునా తప్పటడుగులు వేస్తోనే ఉన్నాను. ఒక మహాశిఖరాన్ని అధిరోహించిన క్షణాన్న మరెన్నో శిఖరాలు ప్రత్యక్షమవుతాయన్న రహస్యం బోధపడింది. ఇప్పుడు నా చుట్టూ విస్తరించి ఉన్న దృశ్యవైభవాన్ని కళ్ళారా చూడటానికి నిమిషంపాటు ఆగానంతే. నేనింతదాకా పయనించి వచ్చిన దారిని చూడటానికి క్షణమాత్రం ఆగాను, కాని స్వేచ్ఛతోపాటే బాధ్యతలు కూడా సంక్రమిస్తాయి. ఇంకెంత మాత్రం జాగుచెయ్యలేను. నా సుదీర్ఘపయనం ఇంకా ముగియలేదు.’

ఈ మాటలు ఒక గాంధీ మాత్రమే రాయగలిగిన మాటలు. ఇరవయ్యవశతాబ్దంలో ఒక హిట్లర్, ఒక చర్చిల్, ఒక స్టాలిన్, ఒక మావో లాంటి నాయకులకి కొదవలేదు. కానీ ఒక గాంధీ, ఒక మండేలా – అటువంటి నాయకులు మరొక ఇద్దరుముగ్గురేనా ఉన్నారా అన్నది అనుమానమే. ఎందుకంటే గాంధీ, మండేలా వంటివారికి రాజకీయ స్వాతంత్య్రంతాలూకు పరిమితులు తెలుసు. మనిషి మానసిక స్వాంతంత్య్రం సాధించుకోవాలంటే మరింత సుదీర్ఘమైన మరింత దుస్సాధ్యమైన ప్రయాణం చెయ్యకతప్పదని తెలుసు.

ఇప్పుడు ప్రపంచమంతా నాయకత్వమంటే రెండే అర్థాలు: ఒకటి, రాజకీయంగా తన ప్రత్యర్థిమీద గెలుగు సాధించడం. అది అధికారంలో ఉన్న నేత అయితే, తన అధికారాన్ని నిలబెట్టుకోవడం, ప్రతిపక్షనేత అయితే, అధికారాన్ని కైవసం చేసుకోవడం. రెండో అర్థంలో, తన వ్యాపారాన్ని విస్తరింపచేసుకోవడం. తన బ్రాండ్ ని మరింత అమ్ముకోగలగడం. ఈ వ్యాపార పార్శ్వంలో అన్ని రకాల నాయకత్వాలూ ఇమిడిపోతాయి. ఆధ్యాత్మిక గురువులనుంచి సినిమా దర్శకులదాకా.

కాని ఒక మనిషి నిజంగా సాధించవలసిన విజయం తన ఆత్మలో సాధించవలసిన విజయం అనేది అంత సులువుగా అర్థమయ్యే విషయం కాదు. ఒకవేళ అర్థమయినా అత్యధిక సంఖ్యాకులు అంగీకరించగలిగే విషయం కాదు. నిజమైన నాయకుడు తన ఆత్మిక విముక్తికోసం మాత్రమే కాదు, తనని అనుసరించే వాళ్ళ ఆత్మిక విముక్తికోసం కూడా తపిస్తాడన్నమాట ఆ అనుచరులకి అర్థమయ్యే విషయం కానే కాదు. గాంధీ తన జీవితంలో అనుభవించిన సంఘర్షణ ప్రధానంగా ఇదే. 1930 తర్వాత గాంధీతో విభేదించినవాళ్ళు చాలామంది 1920-21 లో ఆయన పిలుపు విని సహాయనిరాకరణంలో పాల్గొన్నవాళ్ళే. ఆయన సహాయనిరాకరణోద్యమాన్ని వెనక్కి తీసేసుకున్నాక ఆయనపట్ల నిస్పృహచెందినవాళ్ళు. ఒకసారి యంగ్ ఇండియా పత్రికలో ఒకరు గాంధీని ‘మీరు ఏడాదిలో స్వరాజ్యం తెస్తామని చెప్పారు. మీ మాట విని సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాం. మీరు ఆ ఉద్యమాన్ని ఆపేసారు. ఇప్పుడు మేమేం చెయ్యాలి?’ అనడిగారు. అతనికి గాంధీ చాలా స్పష్టంగా జవాబు చెప్పాడు. ‘స్వరాజ్యమంటే బ్రిటిష్ వాడితో తలపడటమొక్కటే కాదు. గ్రామాలకు వెళ్ళండి. గ్రామపునర్నిర్మాణం చెయ్యండి. గ్రామపారిశుద్ధ్యంలో పాలుపంచుకోండి. అస్పృశ్యతా నిర్మూలనకోసం పనిచెయ్యండి’అని. కాని అత్యధికసంఖ్యాకులైన భారతీయులకి ఆ మాటలు అర్థం కాలేదు. కారణం, వారు గాంధీని ఒక రాజకీయనేతగా మాత్రమే చూసారు. రాజకీయనేత అంటే, గాంధీ ఉన్న పరిస్థితిలో ఒక ప్రతిపక్షనేత అన్నమాట. ఏంచేసేనా సరే, ఎలాగేనా సరే, ఆయన తమకి అధికారాన్ని హస్తగతం చేసిపెట్టాలి.

గాంధీ దృష్టిలో తన రాజకీయ పోరాటం తన ఆత్మప్రక్షాళనలో ఒక భాగం. ఆయన పెద్దకొడుకు హరిలాల్ ఉన్నతవిద్యకోసం ఇంగ్లాండ్ వెళ్తానని పట్టుబడితే గాంధీ నిజమైన విద్య కారాగారవాసమే అని చెప్పాడు. ఆ పిల్లవాడు సత్యాగ్రహం చేసి అరెస్టు అయితే, అతడి తరఫున కోర్టులో వాదిస్తో గాంధీ తన పిల్లవాణ్ణి కనికరించవద్దనీ, కఠిన కారాగార శిక్ష వెయ్యమనీ జడ్జిని కోరుకున్నాడు. ఎందుకంటే, ఒక యువకుడికి కారాగారం నేర్పగల చదువే నిజమైన చదువుని అని గాంధీ మనసారా నమ్మాడు.

మండేలా 1975 లో ఒక కారాగారం నుంచి విన్నీ మండేలాకు రాసిన ఉత్తరంలో ఏమి రాస్తున్నాడో చూడండి:

‘నిన్ను నువ్వు తెలుసుకోడానికి కారాగారాన్ని మించిన చోటు మరొకటిలేదు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా తరచి చూసుకోడానికి, నీ మనసునీ, నీ ఆలోచనల్నీ ఉన్నవి ఉన్నట్టుగా శోధించుకోడానికి తగినచోటు అది. వ్యక్తులుగా మనం ఎప్పటికప్పుడు సాధించుకునే పురోగతిని మనం సమాజంలో మనం సాధించుకున్న స్థానాన్నిబట్టి, మన ప్రభావాన్నిబట్టి, జనాదరణని బట్టి, మన సంపద, విద్యార్హతల్ని బట్టీ లెక్కేసుకుంటూ ఉంటాం. అయితే ఇవి భౌతిక జీవితంలో మనం సాధించే విజయాన్ని కొలవడానికి మాత్రమే పనికొస్తాయి. కాబట్టే మనుషులు చాలామంది వీటిని సంపాదించుకోడం కోసమే యాతనపడుతూ ఉండటం మనం అర్థంచేసుకోదగ్గదే.  కాని ఒకమనిషి తాను నిజంగా ఒక మనిషిగా ఎంత అభివృద్ధి సాధించాడని అంచనావేసుకోడానికి ఆంతరంగిక ప్రమాణాలు చాలా కీలకం. నిజాయితీ, సత్యసంధత, నిరాడంబరత, వినయం, పరిపూర్ణమైన ఔదార్యం, డంబం లేకపోవడం, తోటిమనిషికి సేవచేయడానికి సంసిద్ధుడిగా ఉండటం- ఈ గుణాలు ప్రతి ఒక్క మనిషికీ అందుబాటులో ఉండేవే. ఇవే ఒక మనిషి ఆధ్యాత్మిక జీవితానికి పునాది రాళ్ళు. ఇటువంటి అంశాల్లో పురోగతి సాధించాలంటే తీవ్రమైన అంతశ్శోధన తప్పని సరి. నిన్ను నువ్వు తెలుసుకోకుండా, నీ దౌర్బల్యాలు, నీ పొరపాట్లు తెలుసుకోకుండా ఆత్మలో పురోగతి సాధ్యం కాదు. మరింక దేనికోసం కాకపోయినా, కారాగారం ప్రతిరోజూ నీ ప్రవర్తనని నిశితంగా పరిశీలించుకునే అవకాశాన్నిస్తుంది. నీలోని చెడుని దాటి నీలో ఎటువంటి మంచి ఉన్నా దాన్ని పెంపొందించుకోడానికి అవకాశమిస్తుంది.  రోజూ జీవితం మొదలయ్యేముందు కనీసం పావుగంటసేపేనా క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యడం ఈ విషయంలో ఎంతో సహకారిగా ఉంటుంది. నీలోని అవగుణాల్ని గుర్తుపట్టడం మొదటిసారే నీకు సాధ్యం కాకపోవచ్చు. కాని పదో సారికి అది సాధ్యం కావచ్చు. ఇటువంటి తన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించే పాపినే ప్రపంచం ఒకనాటికి ఋషి అని పిలుస్తుందని మర్చిపోవద్దు.’

కాబట్టే ఒక గాంధీ, ఒక మండేలా నన్ను ఉత్తేజితుల్ని చేసినంతగా మరెవ్వరూ స్పందింపచెయ్యలేకపోతున్నారు. అందుకనే, మొన్న Mandela: Long Walk to Freedom (2013) చూస్తున్నంతసేపూ, గొప్ప జీవితాల గురించి వింటున్నప్పుడు కలిగే అత్యున్నత భావోద్వేగం నన్ను నిలువెల్లా ముంచెత్తుతూనే ఉంది.

ఒక మహోన్నత జీవితగాథని, ఒక సుదీర్ఘపయనాన్ని సినిమాగా తియ్యడం సాహసం.  మండేలా ఆత్మకథ ఆధారంగానే ఆ స్క్రీన్ ప్లే రూపొందించుకున్నప్పటికీ ఇంకా చెప్పకుండానూ, చూపించకుండానూ, ఉండిపోయింది చాలానే ఉందనే  అసంతృప్తి కలక్కుండా ఉండటం కష్టం. గాంధీ సినిమా పట్ల కూడా చాలామందికి ఇటువంటి అసంతృప్తినే ఉండింది.

కానీ, ఆ సినిమా చూస్తున్నంతసేపూ నాకు ఎటువంటి అసంతృప్తి కలగకపోగా, 146 నిమిషాల్లో ఒక నల్లజాతి బాలుడు ఒక అత్యున్నత మానవుడిగా పరిణమించిన తీరు ఆశ్చర్యానందాల్ని కలిగించింది. మరొక గాంధీని తెరమీద చూస్తున్నట్లే అనిపించింది. కానీ ఒక గాంధీకి భగవంతుడు, ప్రార్థన, ఉపవాసాలు సహాయంగా ఉన్నాయి. ఒక మండేలాకి అవేవీ లేవు. తన దేశప్రజలు అంతర్యుద్ధంలో కూరుకుపోతుంటే ఒక గాంధీకి ఏమి చెయ్యాలో తెలీక ప్రాయోపవేశానికి పూనుకునేవాడు. ఒక మండేలాకి కూడా ఏమి చెయ్యాలో తెలీదు, కాని ‘మీరు నా నాయకత్వాన్ని నమ్ముతున్నట్లయితే, మీరు నా నుంచి ఆయుధాలు కోరకండి, శాంతిని మాత్రమే కోరుకోండి’ అని మాత్రమే చెప్తున్నాడు. తన నాయకత్వం మీద ఒక నాయకుడికుండే అపారమైన ఆత్మవిశ్వాసం అది.

ఒక గాంధీ, ఒక మండేలా ఆర్థిక స్వాతంత్య్రానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదనీ, ఆర్థిక అసమానతల్ని నిర్మూలించడం మీద దృష్టిపెట్టలేదనీ వారి విమర్శకుల అభియోగం. కానీ గాంధీ, మండేలాలు ముందు తమనీ, తమ శత్రువుల్నీ కూడా మానసికంగా విముక్తపరచడం మీద దృష్టిపెట్టారు.

మనలో చాలామంది ఆర్థిక అసమానతల్ని యుద్ధం ద్వారా మాత్రమే చక్కదిద్దగలమనుకుంటారు. సమానత్వానికి, వారి దృష్టిలో, యుద్ధం ఒక అడ్డదారి. కాని నిజానికి ఆర్థికాభివృద్ధి ఒక శాంతిసమయ ప్రక్రియ. విద్యాభివృద్ధి ఉద్యమం. ఆర్థిక దౌర్జన్యాల్ని అదుపుచెయ్యడానికి తీవ్రవాదం, ఉగ్రవాదం కొంత తోడ్పడవచ్చేమోగాని, ఆర్థికసమానత్వానికి అవి ఎంతమాత్రం ఉపకరించవు. శాంతిస్థాపన ప్రజాస్వామ్యపు తొలిషరతు. అందుకనే ‘యుద్ధం గెలవలేమోగాని, ఎన్నికల్లో గెలవగలం’ అంటాడు మండేలా ఒకచోట.

ఆ మధ్య ఒక మిత్రుడు నా గురించి రాస్తో, నాకు రాజ్యస్వభావం తెలుసా అని అనుమానం వెలిబుచ్చాడు. రాజ్యం అంటే పాలకపక్షాలూ, పోలీసులూ, తుపాకులూ, కోర్టులూ, నిర్బంధాలూ మాత్రమే అని అనుకుంటే నేను చెప్పలేను. కాని రాజ్యమహావటవృక్షాన్ని నిలబెడుతున్న వేర్లల్లో నువ్వూ, నేనూ కూడా ఉన్నామని మర్చిపోతే నువ్వు రాజ్యాన్ని ఎప్పటికీ ప్రజాయత్తం చెయ్యలేవు. నువ్వు తప్ప, నీ ఆకాంక్షలు తప్ప, నీ ఇల్లు, నీ పిల్లలూ, వాళ్ళ భవిష్యప్రణాళికలూ తప్ప తక్కినవన్నీ పీడకమనస్తత్వం కలిగినవే అని నువ్వనుకున్నంతకాలం నీకు తెలీకుండానే రాజ్యవిషవృక్షానికి నీళ్ళుపోస్తూనే ఉంటావు.

ఒక గాంధీకి, ఒక మండేలా కి ఈ సంగతి స్పష్టంగా తెలుసు. అందుకనే ప్రజాజీవితంలో ఉన్నవాళ్ళు, విమోచన రాజకీయాలకు నాయకత్వం వహించేవాళ్ళు ఎప్పటికప్పుడు తమని మానసికంగా ప్రక్షాళనం చేసుకుంటూ ఉండాలనే చెప్తూ వచ్చారు. దానికి ఎటూవంటి అడ్డదారీ లేదు.

రాబిన్ ద్వీపంలో కఠిన కారాగారవాసం అనుభవిస్తున్నప్పుడు తన కొడుకు మరణించాడన్న వార్త తెలిసినప్పుడు, తన కన్నకొడుకు అంత్యక్రియలు చెయ్యడం తన బాధ్యత అనీ, అందుకు తనని అనుమతించమనీ అడిగినప్పుడు ప్రభుత్వం నిరాకరించిడం, తాను జైల్లో ఉండగానే తల్లి మరణించందని తెలియరావడం, తాను ఎంతో ప్రేమించిన భార్య, తాను జైలు నుంచి బయటికి వచ్చాక, తన అహింసా మార్గాన్ని అంగీకరించకపోవడం- ఏ విధంగా చూసినా కూడా ఒక మనిషి తనను తాను ఇంతకన్నా పోగొట్టుకునేది మరేమీ ఉండదు. కాని అదే క్రమంలో, ఆయన తనలోని మానవుణ్ణి ఎలా సముపార్జించుకోగలిగాడో, తన శత్రువును ఎలా క్షమించగలిగేడో చూస్తుంటే, ఒక మనిషి తనను తాను ఎలా పొందగలడో కూడా తెలుస్తూ ఉంది. ‘తేన త్యక్తేన భుంజీథాః’ (నిన్ను నువ్వు వదులుకోవడం ద్వారా అనుభవించు) అనే ఉపనిషద్వాక్యానికి ఇంతకన్నా సజీవచిత్రణ ఇప్పటిదాకా నేను మరొకటి చూడలేదు.

సినిమాలో మరవలేని సన్నివేశాలు, మళ్లీ మళ్లీ చూడాలనిపించే దృశ్యాలూ చాలానే ఉన్నాయి. కానీ అన్నిటిలోనూ, మండేలా కూతురు ఆయన్ని జైల్లో కలుసుకోడానికి వచ్చినప్పటి సన్నివేశం నన్ను తీవ్ర భావోద్విగ్నతకు లోను చేసింది. ఒక తండ్రి అలా జీవిస్తే, అతడి పిల్లలు కూడా అలా జీవించగలుగుతారు అనిపించింది.

స్వతంత్రుడైన మనిషి మాత్రమే స్వతంత్రుడైన నాయకుడు కాగలుగుతాడు. అతడు మాత్రమే తనవాళ్ళనీ, తన శత్రువుల్నీ కూడా విముక్తపరచగలుగుతాడు. ఒక స్వతంత్రమానవుడి కథ ఎలా ఉంటుందో ఈ సినిమా ఆద్యంతం తెలియచేస్తూనే ఉంది.

Mandela: Long Walk to Freedom యువతీయువకులు చూడవలసిన సినిమా. పిల్లలు చూడవలసిన సినిమా. తమని అణచివేస్తున్నవారిని ద్వేషించడం ద్వారా మాత్రమే తమని తాము నిర్వచించుకోగలమని భావిస్తున్న ప్రతి ఒక్క రచయితా, ప్రతి ఒక్క సామాజిక ఉద్యమకారుడూ చూడవలసిన సినిమా.

Featured image: PC: http://www.amnesty.org

24-5-2023

11 Replies to “స్వతంత్రమానవుడి కథ”

 1. మీరు నా నాయకత్వాన్ని నమ్ముతున్నట్లయితే, మీరు నా నుంచి ఆయుధాలు కోరకండి, శాంతిని మాత్రమే కోరుకోండి’

  ఈ ఒక్క మాట చాలు… అన్ని రకాల రాజకీయాల ప్రక్షాళనకు!

  మీ రచనలకు దాసోహం! శుభోదయం…సర్.

 2. స్వేచ్ఛ,స్వాతంత్ర్యాలు అపరిమితం కావు. మరొకరి స్వేచ్ఛను ,స్వాతంత్ర్యాన్ని మనం గౌరవించి నంత వరకేమాత్రమే మనం స్వేచ్ఛ గా ,స్వతంత్రంగా మనగలుగుతాం.
  ఈ మౌళిక భావన అర్థం చేసుకున్న వారికి “సర్వే జనా సుఖినోభవంతు” , వసుధైక కుటుంబం
  అన్న మాటల్లోని పరమార్థం అవగతమౌతుంది. .
  కాని ఈ స్వార్థపర ప్రపంచం నేడు అలా ఉందా!
  ఎటుచూసినా అటు స్వార్థం పడగలు విప్పి నాట్యం చేస్తూ, కోరలు సాచి కాటు వేయాలన్న అవకాశాల కోసం పొంచి చూస్తుంది.
  ఇలాంటి ఈ తరుణంలో గాంధీజీ,మండేలా లాంటి
  తాత్వికులు కలలు గనే ప్రపంచాన్ని చూడాలంటే
  ప్రపంచంలో ఎంత మార్పు రావాలి.
  మరో ప్రపంచానికి రాచబాట ను వేసే స్వాప్నికులకు,అబ్దుల్ కలాం లకు స్వాగతం పలుకుతూ ….
  ధన్యవాదాలు Sir.

   1. “స్వతంత్రమానవుడి కథ” Ee vyAsanu kannadamlo anuvadincha mEe anumathi ivvagalara?

    Sharanu
    Sa.Raghunatha. 99895 93921

 3. This piece is almost like summation of your meditations on and long engagement with Gandhi and those choosing a similar path, sir. There is something stirringly poignant and poetic about seeing a person remain morally upright in the face of crippling hostility. It chastises us without aiming to. The part about ‘opposition’ is a brilliant insight. Superb, sir. Among your finest.

 4. సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై మావిద్విషావహై తేజస్వినావధీతమస్తు ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః అని శాంతి మంత్ర పఠించి నట్లుగా ఉంది గొప్ప విశ్లేషణ

Leave a Reply

%d bloggers like this: