బొమ్మలతోట

ఒకసారి రాధాకృష్ణన్ ని చదువుతుండగా, భగవద్గీతలోని ఈ శ్లోకం (2:41) మీద ఆయన వ్యాఖ్యానం కనిపించింది.

‘వ్యవసాయాత్మకా బుద్ధిరేకేహ కురునందన/ బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినమ్’

ఒకే ఒక్క అంశం మీద దృష్టిపెట్టి దానిమీదనే కృషిచేసేవాళ్ళ బుద్ధి ఏపుగా పెరిగిన ఒకే ఒక్క కొమ్మలాగా ఉంటుంది. అలాకాక పది పనులు నెత్తికెత్తుకునేవాళ్లు ఏ పనీ సక్రమంగా చేయలేరు, వాళ్ళ బుద్ధి శాఖోపశాఖలుగా చీలిపోయినట్టు ఉంటుంది అని దాని అర్థం.

బొమ్మారెడ్డి అప్పిరెడ్డిగారిని తలుచుకున్నప్పుడల్లా గీతాకారుడు వ్యవసాయత్మక బుద్ధి అని చెప్పింది అటువంటి వాళ్ళ గురించే అనిపిస్తుంది. జీవితమంతా చిత్రకళకు అంకితం చెయ్యడమేకాదు, ఎందరో విద్యార్థుల్ని అవిశ్రాంతంగా చిత్రకళవైపు మళ్ళించి వారిని తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన.

రెడ్డిగారు హైదర్ గూడాలో సంస్కృతి పేరిట గ్రామీణవిద్యార్థులకోసం నడుపుతున్న చిత్రకళాపాఠశాల గురించి ఇరవయ్యేళ్ళ కింద విన్నాను. వెళ్ళి చూసాను కూడా. అక్కడ ప్రతి ఆదివారం పిల్లలు గ్రామాలనుంచి వచ్చి ఒక రోజంతా రకరకాల చిత్రకళామాధ్యమాల్లో సాధనచేసి వెళ్తుంటారు. వాళ్ళు గీసిన డ్రాయింగుల్నీ, చిత్రించిన వర్ణచిత్రాల్నీ ఆయన ప్రపంచవ్యాప్తంగా జరిగే చిత్రకళపోటీలకు పంపుతూ ఉంటారు. ఆ చిత్రలేఖనాలు బంగారుపతకాలు కైవసం చేసుకుంటూ ఉంటాయి. 1992 నుంచి మూడు దశాబ్దాలుగా నడుస్తున్న యజ్ఞం ఇది.

బొమ్మారెడ్డి అప్పిరెడ్డిగారు కృష్ణాజిల్లా పామర్రులో పుట్టారు. మొదట్లో కొన్నాళ్ళు జిల్లా పరిషత్ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచరుగా పనిచేసాక 1963 లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో చేరారు. మూడున్నరదశాబ్దాలకు పైగా కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు విస్తృత ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ పాఠశాలల్లో పిల్లల్తో బొమ్మలు వేయించడమే కాక, ఆ బొమ్మల్ని జపాన్, కొరియా, హంగరీ, ఫిలిప్పైన్స్, అర్జెంటినా, ఫిన్లాండ్, పోలాండ్ లాంటి దేశాల్లో జరిగే ప్రపంచ చిత్రకళాపోటీలకు పంపడం మొదలుపెట్టారు. ఆ బొమ్మలకి బహుమతులు రావడం మొదలయ్యింది. సోవియెట్ లాండ్ నెహ్రూ అవార్డులు పదహారుదాకా ఆ పిల్లలు సంపాదించుకోగలిగారు.

కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడే 1982 లో ఆయన యంగ్ ఎన్వాయ్స్ ఇంటర్నేషనల్ స్థాపించారు. ఆ సంస్థ ద్వారా చేపట్టిన కృషి ప్రపంచబాలచిత్రకళా పటం మీద భారతదేశానికి చెప్పుకోదగ్గ స్థానాన్ని సముపార్జించింది. ఆ తర్వాత 1992 లో సంస్కృతి పాఠశాల మొదలుపెట్టారు. అప్పట్లో హైదర్ గూడ చిన్న గ్రామం. అక్కడ ఒక ఇంటిమేడమీద ఆయన మొదలుపెట్టిన పాఠశాల చాలాఎళ్ళ పాటు రోజూ సాయంకాలాలపాటు నడిచేది. ఒకదశలో వందమందికి పైగా విద్యార్థులు అక్కడకి ప్రతిసాయంకాలం చేరుకునేవారు. వాళ్ళల్లో చాలమంది ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, డిజైన్ వంటి రంగాల్లో ఉన్నతవిద్యావంతులయ్యారు. బరోడా, శాంతినికేతన్ లదాకా వెళ్ళి చదువుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.

పిల్లల బొమ్మల్ని పోటీలకు పంపడమే కాకుండా  ప్రపంచ చిత్రకళా ప్రదర్శనలకు పిల్లల ప్రతినిధి బృందాల్ని తీసుకువెళ్ళడం కూడా సంస్కృతి పాఠశాల మొదలుపెట్టింది. రెడ్డిగారి అమ్మాయి పద్మారెడ్డి కూడా చిత్రలేఖకులు.ఆమె పిల్లల ప్రతినిధి బృందాల్ని ఇప్పటిదాకా మూడు సార్లు ప్రపంచబాల చిత్రకళా ప్రదర్శనలకు తీసుకువెళ్ళారు. లిడిస్ మెమోరియల్ కి చెందిన క్రిస్టల్ పాలెట్ అవార్డు పొందడం పిల్లలకి ఒక కల. దాన్ని కూడా సంస్కృతి పాఠశాల విద్యార్థులు సాధించారు. ఈ పాఠశాలకు చెందిన పధ్నాలుగు మంది విద్యార్థులకి సిసీఅర్ టి స్కాలర్ షిప్పులు దొరికాయి. ఆ పిల్లలకి ఇరవయ్యేళ్ళ వయసొచ్చేదాకా భారతప్రభుత్వం నుంచి ఆ స్కాలర్ షిప్పులు అందుతుంటాయి.

పిల్లలు గీస్తున్న బొమ్మల్ని, సంస్కృతి పాఠశాల ప్రయత్నాల్నీ నలుగురికీ తెలియచేసే ఉద్దేశ్యంతో రెడ్డిగారు ఆర్ట్ డ్రైవ్ అనే పత్రిక కూడా వెలువరిస్తూ ఉన్నారు. ఇప్పటికి ముప్ఫై ఏళ్ళుగా ఆ పత్రిక నిరాఘాటంగా వెలువడుతూనే ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే అది ఒక బొమ్మలతోట.

ఈ ప్రయత్నాలనీ ఉచితంగా, పిల్లలనుంచి ఒక పైసా కూడా ఫీజు వసూలు చెయ్యకుండా, కేవలం ఇష్టంతో, ప్రేమతో, చిత్రకళ పట్ల ఆరాధనతో చేస్తూ ఉన్నవి.  ఆ పాఠశాలను సందర్శించని చిత్రకారుడు లేడు. ఆ పిల్లని అభినందించని పురప్రముఖుడు లేడు. కానీ అది చాలదు. అటువంటి పాఠశాలలు మరికొన్ని రావాలనీ, కనీసం జిల్లాకొకటేనా గ్రామీణ విద్యార్థులకోసం అటువంటి దీపాలు వెల్గించేవారుండాలనీ నేను కోరుకోడం అత్యాశ కాదనుకుంటాను.

2005 లో అనుకుంటాను, ఆ పాఠశాలకు ఎమెస్కో విజయకుమార్ ను తీసుకువెళ్ళాను. అప్పట్లో నేను రాసిన ‘మీరు బడి నుంచి ఏమి నేర్చుకోవాలి?’, ‘మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?’, ‘మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి’ అనే మూడు పుస్తకాలకు ఆ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్తో బొమ్మలు గీయించాం. తిరిగి మళ్ళా దాదాపు ఇరవయ్యేళ్ళ తరువాత మొన్న ఆదివారం మళ్ళా ఆ పాఠశాలకు నేనూ, ఎమెస్కో విజయకుమార్ మరొకసారి వెళ్ళాం.

కాలం ఆ పాఠశాలలోగాని, ఆ విద్యార్థుల ఉత్సాహంలోగాని, డా.రెడ్డిగారి దీక్షలోగాని ఎటువంటి మార్పూ తేలేకపోయింది. ఆ ఆదివారం ప్రైమరీ స్కూలు పిల్లలనుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిల్లలదాకా అందరూ ఉత్సాహంగా చిత్రకళ సాధన చేస్తూ ఉన్నారు.  అక్కడ బొమ్మలు వేస్తున్న పిల్లల్ని చిన్నపాటి ఇంటర్వ్యూ చేసాను. ఈ ఏడాది పదవతరగతిలోకి రాబోతున్న ఇద్దరమ్మాయిలు వాళ్ళు నాలుగో తరగతిలో ఉన్నప్పణ్ణుంచీ ఆ పాఠశాలకు వస్తున్నామని చెప్పారు. అందులో ఒకమ్మాయిని ‘బొమ్మలు వేస్తుంటే నీకు ఎలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది?’ అనడిగాను. ‘పీస్’ అంది అమ్మాయి ఒక్కక్షణం కూడా తడుముకోకుండా. మరొక అమ్మాయిని మరింత లోతైన ప్రశ్న అడిగాను. ‘నీ క్లాసులో నీ క్లాస్మేట్స్ బొమ్మలు వెయ్యడం మీద ఆసక్తి లేని వాళ్ళు కూడా ఉంటారుకదా, వాళ్ళకీ నీకూ మధ్య ఏమైనా తేడా ఉందా? ఉందని నీకు తెలుస్తూ ఉంటుందా?’ అనడిగాను. ‘నా ఎమోషన్స్ మీద నాకు కంట్రోల్ ఉంది. వాళ్ళకి అది ఉందనుకోను’ అంది ఆ అమ్మాయి. చిత్రకళ మనుషులకు ఏం చెయ్యగలదో, ఇంతకన్నా సూత్రప్రాయంగా చెప్పగలిగినవాళ్ళు నాకిప్పటిదాకా కనిపించలేదు.

అప్పటికి అయిదురోజులుగా లినోకట్ మీద నడిపిన వర్క్ షాపుకి అవాళ ముగింపురోజు కావడంతో, అక్కడ అందరి దృష్టీ లినోకట్ ప్రింటింగ్ మీద ఉంది. ఈ ఏడాది పన్నెండో తరగతిలోకి వస్తున్న ఒకమ్మాయి లినోకట్ లో మూడు రంగులబొమ్మకోసం ఓపిగ్గా మూడుసార్లు కట్ చేసి ప్రింట్లు తీస్తూ ఉంది.

‘నేను కూడా వాళ్ళతో పాటు కలిసి లినోకట్ నేర్చుకుందామని అనుకుంటున్నాను, సంస్కృతి స్కూల్లో నాకు ప్రవేశం దొరుకుతుందా’ అనడిగాను రెడ్డిగారిని. ఆయన సంతోషంగా స్వాగతించారు. మా మాటలు వింటున్న విజయకుమార్  తన మనవరాలిని కూడా ఆ స్కూల్లో జాయిన్ చెయ్యొచ్చా అనడిగాడు.

రెడ్డిగారిలాంటి వారి కృషికి మనం ఏమివ్వగలం? ఆ కృషిని ఏ విధంగా సత్కరించుకోగలం? ఆయనలాంటి వాళ్ళు చిరకాలం జీవించాలనీ, కలకాలం బొమ్మలు గీస్తూ, గీయిస్తూ ఈ ప్రపంచాన్ని చిత్రవర్ణశోభితం చెయ్యాలనీ మనఃపూర్వకంగా ఆశించడమే నేను చెయ్యగలిగింది.

23-5-2023

16 Replies to “బొమ్మలతోట”

 1. ” నా యమోషన్స్ మీద నాకు కంట్రోల్ ఉంది.”
  ” పీస్” వస్తుంది; అని ఆ పిల్లలు మీరు అడిగిన కుశాగ్ర బుద్ది ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు చిత్ర కళ యొక్క తాత్వికతను తెలియజెప్పింది.
  అరుదైన వ్యక్తిని, సమూహాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు అండి.

  1. బొమ్మారెడ్డి అప్పిరెడ్డి గారికి,ఒక గొప్ప కళాకారుని పరిచయం చేసిన మీకు నమస్సులు..🙏🙏

 2. ఒక గొప్ప వ్యక్తిని , గొప్ప సంస్థని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పనిసరి గా ఈ పాఠశాలను సందర్శించాలి.. ఎప్పట్లాగే మీరు పరిచయం చేసిన తీరు మనస్సు పై ఒక చెరగని ముద్ర వేసింది..

  ఒకమ్మాయిని ‘బొమ్మలు వేస్తుంటే నీకు ఎలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది?’ అనడిగాను. ‘పీస్’ అంది అమ్మాయి ఒక్కక్షణం కూడా తడుముకోకుండా. మరొక అమ్మాయిని మరింత లోతైన ప్రశ్న అడిగాను. ‘నీ క్లాసులో నీ క్లాస్మేట్స్ బొమ్మలు వెయ్యడం మీద ఆసక్తి లేని వాళ్ళు కూడా ఉంటారుకదా, వాళ్ళకీ నీకూ మధ్య ఏమైనా తేడా ఉందా? ఉందని నీకు తెలుస్తూ ఉంటుందా?’ అనడిగాను. ‘నా ఎమోషన్స్ మీద నాకు కంట్రోల్ ఉంది. వాళ్ళకి అది ఉందనుకోను’ అంది ఆ అమ్మాయి. చిత్రకళ మనుషులకు ఏం చెయ్యగలదో, ఇంతకన్నా సూత్రప్రాయంగా చెప్పగలిగినవాళ్ళు నాకిప్పటిదాకా కనిపించలేదు.

  పై వాక్యాలు చదువుతున్నప్పుడు గుండె బరువెక్కి కళ్ళు చెమర్చి ఒక దీర్ఘమైన నిట్టూర్పు తీసేలా చేసింది మీరు నెరేట్ చేసిన తీరు. ముఖ్యంగా పీస్ అని అమ్మాయి ఇచ్చిన సమాధానం చదవగానే, సాగర సంగమం సినిమాలో జయప్రద నాట్య ప్రదర్శన ఇన్విటేషన్ ఇచ్చి నప్పుడు అందులో బాలు పేరు చూదగానే కమల్ హాసన్ లో కలిగే ఉద్వేగ భరిత మైన ఒక చెప్పలేని ఆనందాన్ని కలిగించింది… ధన్యవాదాలు వీరభద్రుడు గారు..

 3. ఇద్దరమ్మాయిలను మీరడిగిన ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలు మరియు మొదట డా. రెడ్డిగారి గురించి ఉట్టంకించిన భగవద్గీత శ్లోకం ఎప్పటికీ మరచిపోలేనంతగా మనసులో నాటుకున్నాయి. ఒక తప్పక సందర్శించవలసిన ప్రదేశాన్ని పరిచయం చేయడం బాగుంది.

 4. ఇది ఒక విద్యార్థి యొక్క భావోద్వేగ విస్ఫోటనం, ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి నిరాశకు గురయ్యాడు ఎందుకంటే వారికి భావోద్వేగ ప్రకోపము లేదు, మన భావోద్వేగాలపై నియంత్రణ పొందడానికి ఇది ఒక ఉత్తమ మార్గం అని నేను భావిస్తున్నాను.

 5. ఫలవంతమైన కృషి చాలా ఆనందాన్ని ఇస్తుంది . Jack of all trades …..సామెత గుర్తు వచ్చింది.

 6. పీస్…
  ఈ ఒక్క మాట చాలు ఈ విశ్వంలో!
  ఈ మాట …ఈ రోజుకి …ఇష్టమైన పాట!
  Thank you, Sir.

 7. Thank you so much sir for introducing ” Sanskriti ” our Village art center to many a learned persons. It could be an additional encouragement to the rural kids who attend “sanskriti ” Thank you dear sir, again.

Leave a Reply

%d bloggers like this: