ఆత్మీయుడు

అశనిపాతం లాంటి వార్త. వారం రోజుల కిందట, సరిగ్గా పోయిన మంగళవారం పొద్దున్న కేతువిశ్వనాథ రెడ్డిగారి ఇంటి గేటుదగ్గర నేనూ, సాయిపాపినేనిగారూ నిలబడ్డాం. పామూరు వెళ్ళి తిరిగివచ్చేటప్పుడు సాయిపాపినేనిగారు ఏ దారిన హైదరాబాదు తిరిగి రావాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు. చివరికి ఆ రోజు పొద్దున్నే, ఇంత దూరం వచ్చాం, కేతు విశ్వనాథ రెడ్డిగారిని కలిసి వెళ్దాం అన్నారు. దారిలో మేం వేంపల్లి గంగాధర్ కి ఫోన్ చేసాం. ఆయన తాను కూడా వస్తానన్నాడు.

ఇంకా ఎండ చురచురలాడని వేళ, ఆ ఇంటిముందు ఒక పక్కన విరబూసిన రేలచెట్టు. ఇంటిగుమ్మం మీద ‘అపేక్ష’ అని పేరు.అపేక్ష అనే మాటకి అసలైన అర్థం చుట్టూ చూడటం, పరిశీలనగా చూడటం, ఒక ఆశతో, ఆకాంక్షతో, చుట్టూ ఉన్నవాళ్ళ పట్ల ఇష్టంతో, వాళ్ళతో ఒక బంధుత్వాన్ని పెంపొందించుకునే మనఃస్థితితో చూడటం- లాంటి చాలా అర్థాలున్నాయి. ఆ రోజు ఆ ఇంట్లో మేము గడిపిన రెండు మూడు గంటల్లో అపేక్ష అనే మాటకి ఉన్న అన్ని అర్థాల్నీ కళ్ళారా చూసాం.

ఆ రోజు ఆ దంపతులిద్దరూ మేము వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచీ చేసిన హడావిడి మామూలు హడావిడి కాదు. మా నాన్నగారు అట్లా ఉండేవారు. ఇంటికెవరేనా చుట్టాలొస్తే ఆయన ఉత్సాహానికి పట్టపగ్గాలుండేవి కావు. తానున్నది వాళ్ళ సేవకోసమే అన్నట్టుండేవారు.

విశ్వనాథ రెడ్డి ఒక భాషావేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు, కథకుడు, రాయలసీమ సాహిత్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డవాడు. ఇవేమీ కాకపోయినా, ఆ రోజు వాళ్ళింట్లో మేము చూసిన ఆ విశ్వనాథరెడ్డిని నేను జీవితమంతా గుర్తుపెట్టుకుంటాను. కన్నీళ్ళతో గుర్తుపెట్టుకుంటాను. కృతజ్ఞతతో శిరసు వాల్చి మరీ గుర్తుపెట్టుకుంటాను.

నిజానికి ఆయనతో నాకు ఎక్కువ సాన్నిహిత్యం లేదు. ఏవో కొన్ని సాహిత్యసమావేశాల్లో కలుసుకున్నదీ, అక్కడే నలుగురితో పాటు మాట్లాడుకున్నదీ తప్ప, ప్రత్యేకంగా ఆయన ఆదరాభిమానాలకు నోచుకున్నవాణ్ణి కాను. కాని ఇరవయ్యేళ్ళ కిందట, ఒకసారి ఆయన ‘సేవ్ ద చిల్డ్రన్’, యుకె వారి ప్రతినిధులతో మా ఆఫీసుకి వచ్చారు. మాతృభాషలో, ముఖ్యంగా గిరిజన భాషల్లో విద్యాబోధన గురించి తాము ఒక పబ్లిక్ ఓపెన్ ఫోరం ఏర్పాటుచేసామనీ, అందులో నన్ను కూడా మాట్లాడమనీ అడగడానికి వచ్చారు. అప్పటికి గిరిజన భాషల్లో విద్యాబోధన గురించి ప్రభుత్వం ఏమీ ఆలోచించడం లేదు. నిజానికి గిరిజన విద్యావేత్తలు, యాంత్రొపాలజిస్టులు మాట్లాడవలసిన అంశం అది. విశ్వనాథరెడ్డిగారిని ఒక కథకుడిగానే ఎరిగిన నాకు, ఆయనలోని పిల్లలప్రేమికుడు, మరీ ముఖ్యంగా గిరిజన బాలబాలికల ప్రేమికుడు కనబడి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ సభకి ఆయన స్వయంగా వచ్చి నన్ను ఆహ్వానించడం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఆ ఒక్క సమావేశంతో మేమిద్దరం ఎంతో ఆత్మీయులుగా మారిపోయామని అంటే అది అసత్యం కాదు.

ఇలాంటివే మరికొన్ని కలయికలు ఉన్నాయి. కాని నాకూ, ఆయనకూ మధ్య మేము గుర్తుపట్టలేని ఒక ఋణానుబంధం ఉందని నాకు ఇవ్వేళే బోధపడింది. ఆ ‘అపేక్ష’ లో నాకు కూడా కొంత వాటా ఉందని ఇన్నాళ్ళకు ఈ రోజున తెలియవలసి రావడం గొప్ప దురదృష్టం.

ఆ రోజు ఆ భార్యాభర్తలిద్దరూ మేమెలాగేనా అన్నం తిని వెళ్ళాలని పట్టుబట్టారు. వారి ప్రేమాతిశయం ముందు వారి వార్థక్యం నిలబడలేకపోతూ ఉన్నది. అన్నం దారిలో తింటామని చెప్తే ఆమె ఒక పట్టాన ఒప్పుకోలేదు. అన్నం వండేస్తాను, కనీసం ఆవకాయతోనైనా తిని వెళ్ళండి అని అడుగుతూనే ఉన్నారు. ఆమె చేతివంట తినవలసిన ఋణం మాకుందని మేము తెలుసుకోలేకపోయాం. అన్నం తిననందుకు, వాళ్ళిద్దరూ మాకు ఎన్ని పండ్లు తినిపించారని! ఎంత పండ్ల రసం తాగించారని! అటువంటి ఆతిథ్యం పాల్కురికి సోమన కవిత్వంలో మాత్రమే కనబడేలాంటి ఆతిథ్యం అది. ఇంటికి వచ్చిన ప్రతిఒక్క అతిథీ శివభక్తుడేననీ, శివుణ్ణయినా నిర్లక్ష్యం చేయగలరేమోగాని, శివభక్తుడి ఆకలి తీర్చకుండా పంపరనీ (కలనైన శివునకు గెలుపీని బాస/ గెలుపు భక్తులకిచ్చి కీడ్పడు బాస) సోమన బసవపురాణంలో రాసిన మాటలు అతిశయోక్తులు కాదనిపించింది.

తమ చిన్నప్పుడు అరవై డెబ్భై మంది సభ్యులుండే సమష్టికుటుంబాల్లో పెరిగి, ఈ రోజు భార్యాభర్తలిద్దరే ఉండవలసి రావడంలోని ఒంటరితనం ఎటువంటిదో మనం ఊహించగలం. కాని ఆయనకు ఆమె, ఆమెకి ఆయన- ఆ ఇద్దరే రెండు ప్రపంచాలకు సరిపడా బలగంలాగా కనిపించారు. ఈ రోజు ఈ వార్త వినగానే, నాకు ముందు ఆ తల్లినే గుర్తొచ్చింది.

సాయిపాపినేని, వేంపల్లి గంగాధర్ చరిత్రపరిశోధకులు. మేమక్కడ ఉన్న కాసేపటిలోనూ వారిద్దరూ విశ్వనాథరెడ్డిగారితో కడప జిల్లా చరిత్ర మొత్తం చెప్పిస్తున్నారు. ఆయన పరిశోధన కడప జిల్లా గ్రామనామాల మీద. దాదాపు నాలుగువేల గ్రామాలున్న కడపజిల్లాలో ఆయన తన పరిశోధన కోసం వెయ్యికి పైగా గ్రామాలు చూసానని చెప్పారు. అందుకని ఆయన మాట్లాడుతుంటే అది ఒక కథకుడో, లింగిస్టో మాటాడుతున్నట్టుకాదు, ఒక సోషియాలజిస్టు, ఒక యాంత్రొపాలజిస్టు మాట్లాడుతున్నట్టుగా ఉంది.

మేము వస్తామని సెలవు తీసుకోబోతుండగా అందరం ఫొటో తీసుకుందాం అన్నారు. అందరం కలిసి తీసుకున్నాం. కాని ఆయనకి మమ్మల్ని వదిలిపెట్టాలని లేదు. మళ్ళా గుమ్మందాకా వచ్చారు. ‘ఎండగా ఉంది, మీరు లోపలకి వెళ్ళండి ‘అంటున్నాం. కాని ఆయన గంగాధర్ తో ‘నువ్వొక రూట్ మాపు తయారుచేయబ్బా. వీరభద్రుడు మళ్ళీ వస్తాడు. అప్పుడు అన్నీ దగ్గరుండి చూపించు. నందలూరు సొమ్యనాథస్వామి ఆలయం,పుష్పగిరి, ప్రతి ఒక్కటీ చూపించు’ అంటో ఉన్నారు. అలాగే అంటున్నాడు గంగాధర్. కాని మళ్ళీ మళ్ళీ ఆయన మరొక రెండుమార్లేనా ఆ మాట చెప్పి ఉంటారు.

కారు ఎక్కుతూ, ‘మీరూ, సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారూ కలిసి పనిచేసారట కదా’ అన్నాను. ‘అవును, ఆయన గొప్ప స్కాలర్’ అన్నారు.

గంగాధర్ రూటుమాపు లో విశ్వనాథరెడ్డిగారి దగ్గర కూచోడానికి కనీసం ఒక పూర్తి రోజేనా కేటాయించమని చెప్పాలనుకున్నాను. 1980 లోనో 81 లోనో కాకినాడలో సీతారామశాస్త్రి ఇంటిదగ్గర ప్రసాద్ అనే ఆయన్ని కలుసుకున్నాను. ఆయన ద్వారానే మొదటిసారి కేతువిశ్వనాథరెడ్డిగారి పేరు విన్నాను. అప్పటికి ఆయన కొకు సాహిత్యసంపుటాలు వెలువరిస్తూ ఉన్నారు. నలభయ్యేళ్ళయింది. ఆ ఒక్కరోజూ నాకు దొరకనేలేదు. ఇక మీదట దొరికేదీ కాదు.

22-5-2023

14 Replies to “ఆత్మీయుడు”

  1. నిన్న రాత్రి యాఖూబ్ sir post చూసాను. శ్రీ కేతు విశ్వనాథ్ రెడ్డి గారి గురించి వ్రాశారు. వారి మధ్యన గల ఆత్మీయ అనుబంధం గురించి.
    మీరూ “ఆత్మీయుడు” అన్న పోస్ట్ చూడగానే నాకు
    శ్రీ కేతు విశ్వనాథ్ రెడ్డి గారి గురించే అయి వుంటుంది అని అనిపించింది.
    ఇంటికి ఎవరు వచ్చినా వారికి ఏ లోటు కలుగ కూడదన్న తపన మన భారతీయ సంస్కృతిలో నే ఉందికావచ్చును.
    అందుకే అతిథి దేవోభవ అన్నారు పెద్దలు.
    ఎన్నో మంచి మాటలు చెప్పారు.
    హృదయ పూర్వక మైన నివాళి సమర్పించారు.
    వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడి ని కోరుకుంటూ…. నివాళులతో….

  2. కొన్ని సందర్భాలు అనుకోకుండా ఏర్పడుతాయి. అవి మరపురాని జ్ఞాపకాలై వెలుగుతాయి. ఒక వరిష్ఠ సాహితీవేత్త, ఆయన సతీమణి తమ ఇంటికి వచ్చిన సాహితీ పరులయెడ చూపించిన వాత్సల్యం ఆతిథేయం మీ వ్యాసం నిండా పరిమళించింది. ఆ మహనీయుని గురించి వినడం,ఆయన వ్యాసాలు, కథలు, చదవడం ,ఒక మంచి సాహితీ వేత్తగా మదిలో భద్రపరచుకోవడం మినహా ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయానేమో. ఏమైనా ఒక అపురూప భాషావేత్తకు నా మనః పూర్వక నివాళి.

  3. పెద్దమనిషి అంటే ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారే.
    కథకుడిగా పెద్దమనిషి అని కాదు, పెద్దమనిషి అంటే ఎలా ఉండాలో చూపించిన నిఖార్సైన మనిషి. పద్మాకర్ గారు మీరు ప్రస్తుతించినట్లు ఆయన సాహితీ శిఖరమే. ఎటువంటి వాద వివాదాలకు తావు లేకుండా, యెటువంటి మకిలి అంటకుండా ఆసాంతం జీవించిన ధన్యజీవి.
    వారు చాలా సంవత్సరాల క్రితం ఇండియాటుడే తెలుగు పక్ష పత్రికలో మత సామరస్యాన్ని పెంపొందించే అద్భుతమైన కథ రాశారు. ఒక ముస్లిం – పూల దండలు అల్లే, ముఖ్యంగా దేవతారాధన కు ఉపయోగించే పూల మర్మాన్ని తెలిసిన వ్యక్తి గురించి చాలా చక్కగా రాసారు. మంచి కథ. విశ్వనాథ రెడ్డి గారే వ్రాయవలసి న కథ. కేతు విశ్వనాథరెడ్డి గారు కథా లోకంలో విశ్వనాథ నాయకుడు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆత్మ స్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని కొరుతున్నాను.

  4. నిత్య సాహిత్య పిపాసి, అజరామరమైన అక్షర సేద్యం చేసిన విశ్వనాధ రెడ్డి గారికి వినమ్ర నివాళులు.

  5. ఒక వ్యక్తిని కలవగానే ఎన్నాళ్ళుగానే పరిచయం ఉన్నవాడిలా కనిపిస్తే అది ఆయన సౌజన్యం, వ్యక్తిత్వ శోభ అనిపించి జీవితాంతం గుర్తుండిపోతారు. ఆ దంపతులు మా ఇంటికొచ్చినపుడు మీరు చెప్పిన ప్రతి మాటనూ నేనూ అనుభవించానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఏం చదువుతున్నారని అడిగినపుడు ‘దాట్ల యానాం కథలు’ చదువుతున్నానని ఆయన చెప్పినపుడు ఆ కిక్కే వేరనిపించిందండి. సహృదయత అందరి ఆభరణం కాదు. కొందరికే పరిమితి. మంచి జ్ఞాపకాన్ని గుర్తు చేశారు వీరభద్రుడు గారూ

  6. కేతు విశ్వనాథ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలుగుగాక, తెలియక ముందే వారి పుస్తకాలు కొని ఉన్నాను, ఇప్పుడైనా వారి గుండె చప్పుడు ఆ కథలు విని తెల్సుకోవాలి.

  7. చదువుతూ ఉంటే నాకే గుండెలో ఏదో దుఃఖంగా అనిపించింది

Leave a Reply to కోడూరి విజయకుమార్Cancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading