తరగతి గదిలో జడలబర్రె

Reading Time: 4 minutes

Lunana: A Yak in the Classroom, PC: Movie Nation

ఈ సినిమా గురించి మా అక్క చాలా సార్లు చెప్పింది. అప్పటికి నేను పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్నాను. తీరా ఈ సినిమా ఇప్పుడు చూసాక, అప్పుడే చూసి ఉంటే బాగుండని అనుకోకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే అప్పుడు ఈ సినిమా చూడమని, పిల్లలకి చూపించమని ఒక సర్క్యులర్ ఇవ్వగలిగి ఉండేవాణ్ణి.

Lunana: The Yak in the Classroom (2019) భూటానీస్ సినిమా. నేను చూసిన సినిమా హిందీలో డబ్బింగు, ఇంగ్లిషు సబ్ టైటిల్స్ తో ఉంది. ప్రైమ్ వీడియో లో చూసాను. బహుశా తక్కిన ప్లాట్ ఫారంల మీద కూడా అందుబాటులో ఉండవచ్చునేమో. ఇక్కడ నా మిత్రులు చాలామంది అత్యున్నతమైన అభిరుచి కలిగినవారు కాబట్టి, నేను రాస్తున్న సినిమాలు వారెప్పుడో చూసి ఉంటారు. ఎవరేనా ఒకరిద్దరు చూడకపోయి ఉంటే, వారికోసమే ఈ నాలుగు వాక్యాలు రాస్తున్నానని భావించండి.
ఇలాంటి సమీక్షల్లో కథ చెప్పడం ఎలానూ సమజసం కాదు. ఇతివృత్తాన్ని రెండు వాక్యాల్లో చెప్పవచ్చు: భూటాన్ లో సముద్రమట్టానికి దాదాపు అయిదువేల అడుగుల ఎత్తులో ఉండే లునానా అనే ఒక ఊరు. పట్టుమని అరవై మంది కూడా జనాభాలేని ఊరు. ఏడాదికి ఆరునెలలు మాత్రమే ఆ హిమాలయ పర్వతాల మధ్య లోయలో ఉండే ఆ ఊరి జనం, శీతాకాలం రాగానే ఆ కొండలమీంచి మరికొంత దిగిపోక తప్పని వాతావరణం. అటువంటి ఊళ్ళో పిల్లలకోసం ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలకు ఉపాధ్యాయుడిగా పనిచేయడానికి వచ్చిన ఒక యువకుడి కథ ఈ చిత్రం.

నా చిన్నతనంలో తాడికొండ పాఠశాల గ్రంథాలయంలో వ్యంకటేశ మాడ్గ్యూళ్కర్ నవల ‘బనగర్ వాడి’ చదివాను. ఆ పుస్తకం గురించి ఇప్పటికే ఎన్నో సార్లు ప్రస్తావించేను, ఎన్నో ప్రసంగాల్లో పదే పదే గుర్తుచేసుకుంటోనే ఉన్నాను. నా రచనలు చదివే మిత్రులు నేను మళ్ళా పునరుక్తికి పాల్పడుతున్నానని అనుకోకపోతే మళ్ళా ఆ రచనని ఇప్పుడు తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను. అలాగే చింగిజ్ అయిత్ మాతొవ్ ‘తొలి ఉపాధ్యాయుడు’ నవల కూడా. నిజానికి ఈ పుస్తకాల గురించి పదే పదే మాట్లాడుకుంటున్నాం అని మనమంటుకున్నాం కాని, ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణాసంస్థలకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం ఎవరేనా చదివినవాళ్ళున్నారా అని అడిగినప్పుడు, ఏ ఒక్క డైట్ లో కూడా, ఒక్కరు కూడా చదివామని చెప్పినవాళ్ళు నాకు కనబడలేదు. నిజానికి ఒక టీచర్ ట్రైనీ తన డి.ఎడ్ కోర్సు పూర్తిచేసుకునేలోపు ఇలాంటివి కనీసం పాతిక పుస్తకాలేనా తప్పకుండా చదివేలాగా, అందుకు గాను ప్రతి ఉపాధ్యాయుడూ తప్పనిసరిగా చదవవలసిన వంద పుస్తకాల జాబితా ఒకటి తయారుచేయించాలని అనుకున్నాను. అలాగే డి.ఎడ్ సిలబస్ లో కూడా ఒక ఆప్షనల్ పేపర్ గా, విద్యాసంబంధింత సాహిత్యాన్ని ప్రిస్క్రైబ్ చెయ్యాలని కూడా చాలా గట్టిగా అనుకున్నాను. కానీ నెరవేరని నా ఎన్నో కలల్లో ఇవి కూడా వట్టి కలలుగానే మిగిలిపోయాయి.

ఈ రోజు మధ్యాహ్నం ఈ భూటానీస్ ఉపాధ్యాయుడి కథ చూస్తూ ఉంటే, నాకు ముప్ఫై నలభయ్యేళ్ళ కిందట అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో కొండకోనల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, స్వార్థత్యాగులు, విద్యాసైనికులు ఎందరో గుర్తొస్తూ ఉన్నారు. పూర్వపు అదిలాబాదు జిల్లా కెరమెరి మండలం దంతన్ పల్లిలో, పక్కనే పంగిడిమదర లో, అలాగే సలుగుపల్లి, గాదిగూడ, మోవాడ్, రొంపల్లి, కమ్మర్ గావ్ లాంటి గ్రామాల్లో పనిచేసిన తొలితరం ఉపాధ్యాయులు గుర్తొస్తూ ఉన్నారు. నా మొదటి పోస్టింగులో పార్వతీపురం ఐటిడిఎ లో పనిచేసినప్పుడు అప్పటికింకా చాలా పాఠశాలలు కొండల మీదనే పనిచేస్తుండేవి. వాటికి కరెంటు, రోడ్డు, టెలిఫోన్ లాంటి సౌకర్యం ఉండేది కాదు. గొయిపాక, బీరుపాడు, బబ్బిడి, కొండచిలకం, సొబ్బ, పొడి, యాటగానివలస, బడ్నాయికవలస లాంటి గ్రామాల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో చదువుచెప్పడమే కాక ఆ పిల్లలకి రోజుకి మూడు సార్లు వంట వండించి అన్నం పెట్టి ఆలనా పాలనా చూసే బాధ్యతలు కూడా నిర్వహించేవారు. నేను పాడేరు వెళ్ళేటప్పటికే ఐ టి డి ఏ కొండల మీద పాఠశాలల్ని కిందకు దింపేసింది. కాని కిముడుపల్లి, నుర్మతి, బొయితిలి, లోచలి, మఠం భీమవరం, రూడకోట, లుంగపర్తి లాంటి గ్రామాలకి వెళ్ళడం కూడా అసాధ్యంగా ఉండేది. అటువంటి పాఠశాలలు ఖమ్మం, వరంగల్, గోదావరి జిల్లాల్లో కూడా తక్కువేమీ ఉండేవి కావు. నేను శ్రీశైలంలో ప్రాజెక్టు అధికారిగా పనిచేసినప్పుడు చింతలముడిపి, అల్లిపాలెం, దద్దనాల, శివపురం, పాలెంచెరువు, అప్పాపూర్ లాంటి పాఠశాలల్ని ఏమి చెయ్యగలిగితే ఆదర్శపాఠశాలలుగా తీర్చిదిద్దగలమో ఎంత మాత్రం దిక్కుతోచేది కాదు.

భూటాన్లో ఒక కొండకొమ్ముమీది పాఠశాలలో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి జడలబర్రెను కూడా తీసుకువచ్చిన కథ వింటూ ఉంటే, నన్ను అన్నిటికన్నా తీవ్రంగా ఒకే ఒక్క ప్రశ్న వేధించింది.

ఎందుకని? ఎందుకని మనం, అంటే మన తెలుగు సమాజం, అటువంటి కథల్ని, అంటే ఒక బనగర్ వాడి, ఒక తొలి ఉపాధ్యాయుడు, ఒక లునానా లాంటి కథల్ని చెప్పుకోడానికి ఇష్టపడం లేదు? ఒక మారుమూల గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు, ఎంత అయిష్టంగానైనా ఆ గ్రామనికి వెళ్ళి ఉండనీ, అక్కడికి వెళ్ళిన తరువాత, అతడు ఆ గ్రామంలో తీసుకురాగలిన మార్పు, ఎంత చిన్నది గానీ, దాన్ని ఎంత పైకెత్తి, లోకమంతా వినేటట్టుగా చెప్పుకోవాలి మనం? కాని ఎందుకని చెప్పుకోవడం లేదు?

ఈ భూటానీస్ దర్శకుడు ఈ నిష్కల్మషమైన కథను చెప్పడమే కాక, దీన్ని ఆస్కార్ పోటీకి పంపేడనీ, ఆ పోటీకి మొదటిసారి కాకపోయినా, రెండోసారైనా ఈ సినిమా నామినేట్ అయ్యిందనీ విన్నాను. మరి మనం ఆస్కార్ కి పంపిస్తున్న సినిమాలు ఎటువంటివి?

నేను బహుశా మరీ ఆదర్శవాదిగా వినిపిస్తున్నానా? నాలో వస్తున్న మార్పు నాకే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మన చుట్టూ ఉన్న సామాజిక-రాజకీయ జీవితంలో నేను చూసిన కఠోర వాస్తవాలు తక్కువేమీ కాదు. నేను అనుభవించిన క్షోభ కూడా తక్కువేమీ కాదు. కాని, ఆ వాస్తవాలు నాలోని ఆదర్శవాదిని అదృశ్యం చెయ్యకపోగా నానాటికీ అతనికి మరింత ఊపిరిపోస్తున్నాయి. ఒక్క కథ, ఒక్క సంఘటన, ఒక్క అనుభవం- ఒక్కటి చాలు, మనుషుల పట్ల, మనుష్య ప్రయత్నాల పట్ల మన నమ్మకాన్ని బలపర్చడానికి. అటువంటి అనుభవాలు కొన్ని వేలు ఉండవచ్చు మనందరికీ. కానీ, వాటిల్లో ఎన్ని కథలుగా మారుతున్నాయి? ఎన్ని సినిమాలుగా నోచుకుంటున్నాయి?

నాకిప్పుడు నిశ్చయంగా తెలుస్తోంది- ఒక జాతి, ఒక సమాజం నిజంగా క్షీణదశలో అడుగుపెట్టేది ఎప్పుడంటే, అది తన ఆదర్శాల్ని నమ్ముకోడం మానేసినప్పుడు. తన కలలు పంచుకోడం మానేసినప్పుడు. ఒక సమాజంగా మనం మరీ తెలివిమీరిపోయేమా? ఒక బనగర్ వాడి లాంటి నవల ఆధునిక భారతదేశమింకా శైశవంలో ఉన్నప్పుడు మాత్రమే రాగలిగిన నవలనా? 1950 తర్వాత ఒక కిర్గిజ్ స్థాన్ లో మాత్రమే ఒక తొలి ఉపాధ్యాయుడు లాంటి నవల రాగలుగుతుందా? ఇప్పుడు 21 వ శతాబ్దంలో భూటాన్ లాంటి చిన్న దేశంలో మాత్రమే ఇటువంటి కలల గురించిన కథలు చెప్పే అవకాశం ఉంటుందా?

నేను సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారిగా ఉన్నప్పుడు దాదాపు మూడువందలకు పైగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నిర్వహణ బాధ్యత కూడా చూసేవాణ్ణి. అవి బాలికలకోసం నడుస్తున్న పాఠశాలలు. ఆ స్పెషల్ ఆఫీసర్ల మీటింగుల్లో ప్రతి సారీ ‘తొలి ఉపాధ్యాయుడు’ పుస్తకం గురించి చెప్పేవాణ్ణి. ఒకడు ముక్కుపచ్చలారని ఒక బాలికను తనకు రెండవభార్యగా బలవంతంగా చెరబట్టబోతుంటే ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డ ఒక ఉపాధ్యాయుడి కథ అది. ఒక్క బాలిక కథ. కాని కస్తూర్బా విద్యాలయాల్లో ప్రవేశం పొందే చాలామంది బాలికల వెనక ఎన్నో కన్నీటికథలు. ఆ విద్యాలయాలే లేకపోతే ఆ పిల్లలకి భవిష్యత్తు అంటూ ఒకటుండగలదని అనుకోలేమని చెప్తూ ఉండేవాణ్ణి. కాని, తెలుగులో ‘తొలి ఉపాధ్యాయుడు’ లాంటి నవల ఇప్పటికీ రానేలేదు. కారణం?

నాకనిపిస్తున్నది. తెలుగు సాహిత్యకారులు తమలోని శిశువుని కాపాడుకోలేకపోతున్నారని. మామూలుగా అందరూ శిశుకేంద్ర విద్య గురించి మాట్లాడుతుంటారు. నేను శిశుకేంద్ర సాహిత్యం గురించి మాట్లాడుతున్నాను. మనలోని శిశువును కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే జాతి శైశవాన్ని కాపాడగలుగుతాం. అప్పుడు మాత్రమే మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఎంతో కొంత నిస్వార్థం, నిర్మలత్వం ప్రతిఫలిస్తాయి.

తెలుగులో ఇప్పుడు కథలు, కవిత్వం రాస్తున్నవారిలో ఎందరో ఉపాధ్యాయులున్నారు. వారిలో చాలామంది మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నారు. గిరిజనులకీ, దళితులకీ, ముస్లింలకీ, వలసకార్మికులకీ చదువు చెప్తున్న ఉత్తమ ఉపాధ్యాయులు, స్వయంగా రచయితలైనవారు ఎందరో ఉన్నారు. వారినుంచి ఒక బనగర్ వాడి, ఒక తొలి ఉపాధ్యాయుడు, ఒక లునానా లాంటి కథనో, నవలనో వస్తే నాకన్నా సంతోషించేవారు మరొకరెవరూ ఉండరు.

21-5-2023

14 Replies to “తరగతి గదిలో జడలబర్రె”

 1. నాకు తెలిసి అరవై డెబ్బైల మద్యే ఆదర్శ వాదం చిగురించింది కానీ పూతకుకాతకు రాతకు రాకుండానే మాడిపోయింది.ఆనాటి ఆదర్శవంతమైన నాటకాలు పోయాయి. కొద్దో గొప్పో పాఠాలు పోయాయి. ఆ సాహిత్యమూ లేదు. స్వార్థ పూరిత రాజకీయనాయకులు మేధావులు వారి వారి ప్రయోజనాలకోసం, కక్షసాధింపులకోసం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాయకులు బాగుపడ్డారు. వాళ్లను నమ్మిన వాళ్లు నాశనమయ్యారు. దీనికి తోడు కార్పొరేషన్ స్కూళ్లు పేద ధనిక వర్గాలను స్పష్టంగా వేరు చేస్తే,
  కాన్వెంటు స్కూళ్లు ప్రాంతీయ సంస్కృతికి దూరం చేసాయి. విద్య ముఖ్యంగా పాఠశాల విద్య ప్రభుత్వ బాధ్యత. ప్రాంతాల వారీగా పాఠ్య పుస్తకాలు, మిగతా అవసరాలు, గుర్తించి ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలి. స్థానిక సగటు విద్యార్థులు స్థానిక ప్రాధాన్యాలను గుర్తించి అక్కడే తమజీవన విధానాన్ని అందంగా నిర్మించుకునే విద్య అందించగలగాలి. అప్రస్తుతమే అయినా ఒక పేలిక చెప్పక తప్పదు. మన పూర్వీకులు జన ప్రయోజనాలకోసం ఎంతో ఆలోచనతో ఏర్పరచిన మంచి ఆచారాలు అవగాహనా లేమితో గుదిబండఆచారాలై వాటిని ఏవగించుకునే పరిస్థితి తెచ్చిన కుహనా మేధావుల వలె మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి. ఎప్పుడైనా ఎద్దున్న వాడికి అన్న సామెత నే వర్తిస్తుంది..

 2. నేను శిశుకేంద్ర సాహిత్యం గురించి మాట్లాడుతున్నాను. మనలోని శిశువును కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే జాతి శైశవాన్ని కాపాడగలుగుతాం. అప్పుడు మాత్రమే మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఎంతో కొంత నిస్వార్థం, నిర్మలత్వం ప్రతిఫలిస్తాయి.

 3. నేను హైస్కూల్లో చదివే రోజుల్లో(1966-69), మా హెడ్మాస్టర్ గారు,హానెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనే ఒక ప్రయోగంను అమలుచేసారు స్చూల్లో….దీని ప్రకారం, పోస్ట్కార్డు, ఇన్లాండ్ లెటర్,కవర్…వగైరాలు ఒక పెట్టెలో ఉంచుతారు.పిల్లలు ఎవరకు కావలసినవి వారు తీసుకొని,వాటి ఖరీదును డబ్బుల రూపంలో ఆ పెట్టెలో వేయాలి. ప్రతి రోజు సాయంత్రం లెక్కపెట్టి అన్నీ సరిపోయీనాయా లేదా అని చెప్పే బాధ్యత SPL గా నాది….కొన్ని రోజులు అంతా బాగానే వుంది. వారం తర్వాత, లెక్క తగ్గడం ప్రారంభం అయింది…..దొంగ ఎవరా అని కనిపెట్టే పని కూడా HM నాకే ఇచ్చారు….లంచ్ సమయంలో నేను బిల్డింగ్ మీద దాగి, దొంగను పట్టినాను…. ఈవిదంగా స్కూల్ పిల్లలలో నిజాయితిని, బాధ్యతను అలవాటు చేసే ప్రయోగాలు ఈరోజుల్లో మచ్చుకు కూడా కనిపించవు.

   1. 1958 నుండి 1962 వరకు మా ఊరిలో మూడవ తరగతి వరకు నా చదువు మూడు దారుల కూడలి లోని ఒక చిన్న పీరీల మశీదు లో కొనసాగింది. ఆ చిన్న మశీదు రాత్రి పూట ఆ వూరికి వచ్చే సంచార జాతుల బిచ్చగాళ్ల కు ఆవాసంగా ఉండేది.
    అయినా మా ఉపాధ్యాయులు మా మారు మూల పల్లె లో ఒక కు గ్రామం లో ,అడవులు గుట్టలమధ్య ఇక్కడ వూరు ఉందో లేదో తెలియని
    ఆ కుగ్రామం లో నివాసం ఏర్పాటు చేసుకొని చదువు చెప్పేవారు.
    అసలు మా వూరికి metpally నుండి రావడమే ఒక సాహసోపేతమైన చర్య.ఒక adventure.
    (ఇప్పుడు కాదనుకోండి,ఇప్పుడు అన్ని వసతులు
    కలిగి యున్న గోదావరీ తీరాన్ని ఆనుకుని ఉన్న ఆధునిక గ్రామం)
    అలాంటి మా ఊరిలో పనిచేసి నాకు అక్షరాలు దిద్దించిన నర్సింగ్ రావు sir, మురళీ మోహనాచారి (లలిత కళా సమితి అధ్యక్షులు,Metpally ,gr.1 TP గా ఆ తరువాతి కాలం లో పని చేశారు. సుద్దాల అశోక్ తేజ గారి కి గురుతుల్యులు మా మాష్టారు) గారిని ఎలా మరచి పోగలం.ఆ జన్మాంతం వారికి ఋణపడి ఉంటాను.
    స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఎన్నో పాఠశాలలు ఇలాంటి స్థితిలోనే ఉండేవి .
    మీ పోస్ట్ చదివితే ఎన్నో నా బాల్యపు జ్ఞాపకాల దొంతర.
    ఇప్పుడు అంతా materialistic.
    ఆదర్శవంతమైన ఆలోచనలను అమాయకపుటా లోచనలు గా భావిస్తున్న రోజులివి. అంత తీరిక ఎక్కడ sir ఎవరికైనా…..
    ధన్యవాదాలు SIR.

 4. మనకు చదువు చెప్పే బడులలో.. మనకు సిలబస్ లో ఉన్న పాఠాలు, మనకు నేర్పే చదువులు.. అన్నింటిలో మానవీయ కోణం తక్కువే. సమాజంలో అనాచారాలు, దురాచారాలు, సామాజిక రుగ్మతలు, మూఢ నమ్మకాలు వంటి వాటిని నిర్మూలించడానికి ప్రభుత్వం తరుపున జరుగుతున్న కృషి గానీ, అలాగే ఈ దురాచారాలను ఎదుర్కోవడానికి పోరాడి అసువులు బాసిన మాననీయుల గురించిగాని, ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి విజయం సాధించిన ధీరుల స్ఫూర్తి వంతమైన గాధలు గాని మన సిలబస్ చోటు చేసుకోవు. ఎవరైనా ఒకరిద్దరు ఆఫీసర్లు సిన్సియర్ గా ప్రయత్నించి, విద్యారంగంలో ప్రక్షాళనకు పూనుకున్నా,, సవాలక్ష నిబంధనలు. ఇక చాలావరకు ఉపాధ్యాయులు కూడా యాంత్రికంగా సిలబస్ లో ఉన్న పాఠాలు చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప.. ఇలాంటి స్ఫూర్తి వంతమైన గాధలు పిల్లలకు చెప్పే ప్రయత్నం గానీ, నిజజీవితంలో తాము ఎదుర్కొన్న ఇలాంటి సంఘటన లను గ్రంధస్తం చేయడం గానీ.. చేస్తున్నట్లు కనబడదు.

  ఏమైనా మీ ఆవేదన సహేతుకమైనది. ఈ ఆశ నేరవేరాలనే నా కోరిక.

 5. అందం అంటే ఏమిటి?
  అమాయకత్వం…
  చక్కటి ముగింపు.
  సాహిత్యకారులు మాత్రమేకాక ఎవరైనా కాపాడుకోలేనిది ఏదైనా ఉంటే…అది ఇది కాక ఏమవుతుంది…

Leave a Reply

%d bloggers like this: