కవిత్వంలో మంత్రశక్తి

Rilke, a painting by Leonid Pasternak, PC: Wikipedia

కవిత్వంలో మంత్రశక్తి ఎలా వస్తుంది? మొదటిది శబ్దబలం వల్ల. ఇది మనందరికీ తెలుసు. 

వలయవిచలద్విహంగాలో

విలయసాగర తరంగాలో

యుద్ధగుంజన్మృదంగాలో

కవీ! నీ పాటల్!

లాంటి మాటల్లో ఉన్నదిదే.

రెండవది, భావతీవ్రత వల్ల. కవిత్వమంటే ఒక  charged utterance అని ఎవరైనా చెప్పగలరు. ఒక inspired utterance కూడా. దీన్నే ఇస్మాయిల్ గారు తీవ్రీకరణ అన్నాడు. బల్బులోని ఫిలమెంటు తీవ్రీకరణ చెందడం ద్వారా కాంతినివ్వగలిగినట్టే, అనుభవం లేదా అనుభూతి తీవ్రీకరణ చెంది కవితా వాక్యంగా మారుతుంది అన్నాడాయన.

గతమంతా తడిసె రక్తమున

కాకుంటే కన్నీళ్ళులతో

అనే వాక్యం అలా తీవ్రీకరణ చెందిన అనుభూతినే.

మూడవది, అపూర్వమైన భావాలంకారాల వల్ల. దీన్నే మనం metaphor అంటున్నాం. ఆధునిక, సమకాలిక యూరపియన్ కవిత్వం ప్రధానంగా మెటఫర్ మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే, మామూలుగా కవిత్వానికి భాషవల్ల, కాలంవల్ల, దేశం వల్ల ఏర్పడే పరిమితుల్ని మెటఫర్ సునాయాసంగా దాటగలుగుతుంది. అనువాదం అయిన తర్వాత కూడా కవితని కవితగా బతికించగలుగుతుంది.

అతని దీపం..

కత్తిగంటుమీద

నెత్తుటిబొట్టులాగున్నది.

అన్నప్పుడు ఆ మెటఫర్ ఏ భాషలోకి ప్రయాణించినా పాఠకుల్ని చకితుల్ని చేయగలదు.

కాని, వీటన్నిటినీ మించిన మరొక విద్య ఉంది. అది అనుభవాన్ని లేదా అనుభూతిని కేవలం శబ్దాలంకారాలతోనో లేదా అర్థాలంకారాలతోనో కాకుండా లేదా తన భావాల్ని తీవ్రీకరణ చెందించడం ద్వారా కాకుండా, ఒక అత్యున్నత సమాధిస్థితిద్వారా మనకి కమ్యూనికేట్ చెయ్యడానికి ప్రయత్నించడం. హైకూ కవులు చేసిందిదే. కాని ఆ సమాధి స్థితిలో సత్యం వారికి ఒక మెరుపులాగా తటిల్లున బోధపడి పక్కకు తప్పుకుపోతుందిగాని, అక్కడే మరికొంతసేపు నిలుచుని మనతో సంభాషించదు.

సత్యాన్ని దర్శించిన తర్వాత మనతో ఒక సంభాషణమొదలుపెట్టగల కవిత్వం ఎంతో సమర్థవంతమైందీ, శక్తిమంతమైందీ అయితే తప్ప నిలబడటం కష్టం. ఆధునిక ఇంగ్లిషు కవులు, ముఖ్యంగా ఇలియట్ లాంటివాళ్ళు, ఈ రహస్యాన్ని గుర్తించారుగాని, చాలాసార్లు వాళ్ళ కవిత్వం సంభాషణగానే మిగిలిపోతుంది. భాషాతీత స్థితికి చేరుకున్నాక కూడా వాళ్ళు భాషని వదల్లేకపోవడం దానికి కారణం. అదే ఒక శిల్పం చూడండి. అది మనతో మాట్లాడుతుంది, కాని భాషతో పనిలేదు దానికి. తన పాదార్థిక అస్తిత్వం వల్లనే అది శిల్పంగా నిలబడుతున్నది కానీ, ఆ పదార్థం ఒక వాహకం మాత్రమే. మనతో మాట్లాడేది ఆ పదార్థం కాదు. అలా ఒక శిల్పంలాగా మనతో మాట్లాడగల కవితని ఊహించండి. అటువంటి కవిత్వం తెలుగులో దాదాపుగా అరుదు.

కాని రేనర్ మేరియా రిల్క అటువంటి కవి. ఆయన కొన్నాళ్ళు ఫ్రెంచి మహాశిల్పి రోడే దగ్గర పనిచేసాడు. రోడే రిల్క కవిత్వాన్నే ఒక శిల్పంగా మార్చేసాడని నేను చిన్నప్పుడు చదివినప్పుడు నాకు ఆ వాక్యాలు అర్థం కాలేదు. కాని గత పదిపదిహేనేళ్ళుగా రిల్క కవిత్వం నాకొక మహాసముద్రంలాగా, నీలాకాశంలాగా కనిపిస్తూ ఉన్నది. నాలో సుళ్ళు తిరిగే భావసంచలనాన్ని కవితగా మార్చాలనుకున్నప్పుడల్లా నేను రిల్క కేసి చూడకుండా ఉండలేను. ఒక విధంగా చెప్పాలంటే నేను రిల్కకి శిష్యుణ్ణి, రోడే కి ప్రశిష్యుణ్ణి.

శిల్పంలాంటి కవిత ఎలా ఉంటుందో మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా. ఇదుగో, ఈ కవిత చూడండి. వేసవి కాలంలో వాన పడేముందటి వాతావరణాన్ని పట్టుకోడానికి ప్రయత్నించిన ఈ కవిత, ఎన్ని సార్లు చదివినా నాకు కొత్తగానే ఉంటుంది. ప్రక్రియ రీత్యా ఇది సానెట్. కాని పెట్రార్క్, షేక్స్పియర్, మిల్టన్, స్పెన్సర్ లకన్నా భిన్నంగా, సరళంగా, సూటిగా, వచనకవితలాగా కనిపించడం రిల్క కౌశల్యం.


వేసవిలో వాన పడే ముందు

ఉన్నట్టుండి పార్కులోని ఆకుపచ్చదనమంతట్లోంచీ

అదేదో-నువ్వు ఇతమిత్థంగా చెప్పలేనిది-అదృశ్యమైపోయింది.

ఇప్పుడు ఆ పార్కు నీ కిటికీ దగ్గరగా జరిగి

నిన్ను మౌనంగా పరికిస్తున్నట్లుంది. తోటలోంచి

నీటిపిచుక ఒకటి పాట పాడుతుంది

ఉద్రిక్తంగా, బలంగా వినిపించే దాని స్వరం

మహనీయ పరివ్రాజకుల్ని గుర్తుకు తెస్తుంది. కురవబోయే

కుంభవృష్టి ఆ స్వరంలో వినిపించే ఆ ఏకాంత దీక్షకి

చెవొగ్గుతుంది. మనం మాటాడుకుంటూ ఉంటే తాము

వినకూడదన్నట్టు ఆ పెద్ద హాలు గోడలు దూరంగా జరిగిపోతాయి,

వాటితో పాటే వాటికి వేలాడే చిత్రాలు కూడా.

అపరాహ్ణవేళల్లో పరుచుకునే అస్పష్టమైన వెలుగు ఒకటి

ఆ వెలిసిపోయిన పరదాలమీద ప్రతిఫలిస్తూంటుంది.

దాన్ని చూసే నీ చిన్నప్పుడు నువ్వు భయపడ్డది.

BEFORE SUMMER RAIN

Suddenly, from all the green around you,
something-you don’t know what-has disappeared;
you feel it creeping closer to the window,
in total silence. From the nearby wood

you hear the urgent whistling of a plover,
reminding you of someone’s Saint Jerome:
so much solitude and passion come
from that one voice, whose fierce request the downpour

will grant. The walls, with their ancient portraits, glide
away from us, cautiously, as though
they weren’t supposed to hear what we are saying.

And reflected on the faded tapestries now;
the chill, uncertain sunlight of those long
childhood hours when you were so afraid.

20-5-2023

10 Replies to “కవిత్వంలో మంత్రశక్తి”

  1. మీ వ్యాసం బాగుంది
    తెలుగు సాహిత్యంలో వందనం ప్రాచీన సాహిత్యంలో “శిల్పమునం బారగుడన్”అని చెప్పుకున్న తిక్కన శిల్ప సౌందర్యాన్ని చాలామంది తర్వాత కవులు అనుసరించారు. ప్రాచీనులలో తిక్కన మధ్యకాలంలో వేమన ఆధునికల్లో గురజాడ తన కవిత్రయంగా ప్రకటించుకున్న శ్రీశ్రీ కవిత్వశిల్పానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు.
    ఒక మనోహరమైన కవిత్వ శిల్ప సౌందర్యాన్ని సృష్టించిన రిల్క కవితను పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

  2. ఉత్తమ కవితా రీతులు ఉదాహరణలు చివర రిల్క
    కవిత్వానువాదం అన్నీ ఆలోచనామృతాలు.

  3. రమణీ ప్రియ దూతిక అని కవిత చదివిన తర్వాత ఆహా..ఇక కవిత్వం వైపుగా గురువుగారు మనల్ని తీసుకెళ్తారు అనిపించింది..కవిత్వ లక్షణం వివరిస్తూ అద్భుతమైన కవితని అందించినందుకు ప్రణామాలు సర్..

  4. వీరభద్రులవారి కలం నుండి జాలువారిన ప్రతి అక్షరానికీ మంత్ర శక్తి మహిమ!
    ఒట్టేసి చెబుతున్న మాట…

  5. ప్రకృతిలోని మార్పులకీ, మనిషి హృదయస్పందనలకీ వున్న ఉద్విగ్న బంధాన్ని
    గురించి మాటల్లో చెప్పిన ఈ కవితని సరళంగా అందరికీ అర్థమయ్యేరీతిలో పరిచయం చేశారు సర్.🙏
    దూరంగా జరిగిపోతున్న గోడలు….కిటికీ దగ్గరగా ….
    ఈ మాటలు వింటుంటే భారీ వర్షం కురుస్తున్నపుడు చిన్న చిన్న గుడిసెల్లో జీవించే
    వారు గుర్తుకి వస్తారు ఎప్పుడూ.ఇదీ అని చెప్పలేని భావన ఒకటి!
    మీ ఈ అనువాదం చదివాక ఇప్పుడు మాటలు
    దొరికాయనిపిస్తోంది…ఏమో…

    ‘చుట్టూ వున్న తడికల గోడలు
    ఆ వర్షంలో కరిగిపోయినట్టు
    వెల్లకిలా పడుకున్న నాకు
    ఆ ఇంటి కప్పూ అదృశ్యమైన భావన
    జడివానలో నేను
    కానీ…..నన్ను ఒక్క చినుకు కూడా
    స్పర్శించటం లేదు!
    ఎంతటి అదృష్టం!

Leave a Reply

%d bloggers like this: