రమణీ ప్రియదూతిక

సిమెంటుకాంక్రీటు నగరం మీద
సుత్తితో మోదుతున్నది కోకిల.
నగరాన్ని నిరుపహతి స్థలంగా మార్చడానికి
నాకు తెలిసి మరో దారి లేదు.

మొదటికూతతోనే ఈ నగరాన్ని
పక్కకు నెట్టేస్తుంది
ఎవరూ బద్దలుకొట్టలేని అద్దాలతో
పద్యాలనగరాన్ని పైకి లేపుతుంది.

తనకు తనే ప్రతిధ్వనిగా
తనకు తనే ప్రతిబింబంగా
ఈ రమణీప్రియదూతిక
తనకు తనే కప్పురవిడెమందిస్తుంది.


ఈ కవిత అల్లసాని పెద్దన పద్యం నుంచి కొన్ని భావాలను ప్రతిధ్వనిస్తోంది. ఆ పద్యం ఇది.

~

నిరుపహతి స్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే

~

కవిత్వం చెప్పాలంటే ప్రశాంతమైన స్థలం, రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలం, ఆత్మకింపైన భోజనం, ఊయల మంచం, పద్యంలో ఒప్పూ, తప్పూ తెలిసిన రసజ్ఞులూ, న ఊహ తెలుసుకుని తన పద్యం తాళపత్రం పైన రాయగలిగే లేఖకులు, చదివి ఆనందించే పాఠకులు తప్పనిసరిగా ఉండాలని పెద్దన అన్నాడు.

ఉపహతి అంటే మోదడం. నిరుపహతి అంటే మోదడం లేకపోవడం. అంటే పూర్తి ప్రశాంతత. ఇక్కడ కోకిల పదేపదే కూస్తూ ఉండడం సుత్తితో మోదుతున్నట్టుగా ఉంది. కానీ నగరంలో రోజూ వినిపించే రణగొణ ధ్వని సద్దుమణిగించడానికి ఆ కోకిల కూతలు తప్ప మరో మార్గం లేదని కవి అంటున్నాడు.

17-5-2023

30 Replies to “రమణీ ప్రియదూతిక”

 1. తరు శాఖలూ ఆమ్రమంజరులు లేని కోకిల
  ప్రకృతికే దూరమై రుచులనాస్వాదింపలేక భోగ దూరుడైన కవి ..
  అయితే నవీన కుమారుడు నవ వసంతాన్ని మనోజ్ఞంగా సృష్టించగల స్రష్ట.

  1. Wah! Wah!

   కోకిల వస్తూ వస్తూ కొన్ని పద్యాలను ముక్కున కరచుకొని వస్తోంది కాబోలు. అది కూసిన ప్రతిసారీ మీ వాకిట్లో ఒక పద్యం.

  2. కదలిపోవటం కవి నైజం.
   కస్సుమనటమా,కమనీయ గానమా చుట్టూ వున్నవి నిర్ణయిస్తాయనిపిస్తుంది.

 2. ఆహా.. నగరాన్ని సుత్తితో మోది నిరుపహతి స్థలం గా మార్చడానికి ప్రయత్నిస్తున్న కోకిల.. ❤️❤️❤️

 3. తన చరణం తానై పల్లవిస్తోంది…!
  నిదురించిన ఎద నదిలో…అల లెగిసిన అలజడిగా!!

  రమణీ ప్రియ దూతిక కలానికి వందనం…

 4. కంటికి కనిపించని మరో లోకాన్ని సృష్టించి వెళ్ళాయి…

 5. ఈ మండే వేసంగిలో ఉపశమనం కోయిల పిలుపులే .

 6. “ఉపహతి అంటే మోదడం. నిరుపహతి అంటే మోదడం లేకపోవడం. అంటే పూర్తి ప్రశాంతత. ఇక్కడ కోకిల పదేపదే కూస్తూ ఉండడం సుత్తితో మోదుతున్నట్టుగా ఉంది. కానీ నగరంలో రోజూ వినిపించే రణగొణ ధ్వని సద్దుమణిగించడానికి ఆ కోకిల కూతలు తప్ప మరో మార్గం లేదని కవి అంటున్నాడు.”
  ఇంత చక్కగా అర్థం కూడా చెప్పి గొప్ప సాయం చేశారు, sir. 😃 I was able to visualize the poem. 🙏🏽

 7. ఇంత అచ్చ తెలుగు… చిన్నప్పుడు చదువుకున్న రోజుల్ని గుర్తు తెచ్చారు. ఆ పసుపు పూల తురాయి చెట్ల మధ్య ఆ కోకిల పలకరింపులు నగరానికి మేల్కొలుపులే! 💛

   1. వేసవిలో పసుపు పూల తురాయి చెట్లు నిండుగా పూస్తాయి. ఇక్కడ ఈ కవితకు మీరు పెట్టిన పూలు కూడా కేరళ విషు పండుగకు పూసే రేల పూల చిత్రమే! మరి కోకిలలు ఆ లేత కమ్మని పూల సువాసన ఆవరించిన ఆ చెట్ల గుబురుల మధ్య నుంచి కూయడం ఎన్నోసార్లు విన్నాను, చూసాను. కాదంటారా?!

 8. ఆధునిక యుగంలో, యాంత్రిక వాతావరణం లో యదార్థగాథ.

Leave a Reply

%d bloggers like this: