
మిట్టమధ్యాహ్నం దారిపొడుగునా పెద్ద వరద.
కొన్ని వేల దీపాల్ని ఒక్కసారి వెలిగించినట్టు
ఎటు చూడు తురాయిచెట్లు. పట్టపగలే అంత
వెలుతురు ప్రవహిస్తుంటే చూడటం సులువు కాదు.
నా చిన్నప్పుడు మా ఊళ్ళో వానాకాలం ఏరు
పొంగినప్పుడిలానే కొమ్మలూ, పూలూ కొట్టుకొచ్చేవి.
అన్ని పనులూ వదిలిపెట్టి ఊళ్ళో వాళ్ళంతా
వరద తగ్గేదాకా అక్కడే నిలిచిపోయి చూస్తుండేవారు.
ఇప్పుడు ఈ ఎర్రటిపూలవెలుగులో కొట్టుకుపోతున్న
వాహనాలు, భవనాలు, పట్టణాలు, పాదచారులు.
సమస్తప్రపంచాన్నీ పూలప్రళయమిట్లాముంచెత్తాక
చూడటానికి ఎవరూ మిగల్లేదు, ఎక్కడా చోటులేదు.
17-5-2023
పూల ప్రళయం గొప్ప కళాత్మక పదబంధం చిత్రకారులకు మరింతగా .
ధన్యవాదాలు సార్
మీ కలానికి లోబడని రచనా ప్రక్రియ లేదు, కానీ, కవిత్వం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీ అక్షరాల్లో కొత్త మాంత్రిక శక్తి వచ్చి చేరుతుంది. అది ఎంత బలమైనదంటే, ప్రళయాన్ని కూడా పోయి కావలించుకోమనే చెప్తుంది. ❤️
నిజమే, పట్టపగలే ఇంత వెలుగు చూడటం సులువు కాదు, కానీ ఈ వెలుగు పొడ లేని చీకటిలో మనడం అసాధ్యం. ❤️
మీకు నచ్చిన కవిత ఉపాధ్యాయురాలు దగ్గర ప్రశంసలు పొందిన విద్యార్థి వంటిది.
ఇంత అద్భుతం సృష్టించి వెళ్లారు… పూల ప్రళయం…. ఒక్కసారి వాగు అంతా నిండిపోయిన పూలు కొమ్మలు …కంటి ముందు నిలిపారు..
ధన్యవాదాలు మేడం
ఎర్రెర్రని వెలుగువెల్లువైముంచెత్తే
తురాయిపూలకెరాటాలలో
ఈదులాడేందుకు తీరికేది
కొమ్మలన్నీ కోట్ల ప్రమిదలై
వెలుగుపంచే దారిలో
కాసేపు ఒడ్డున కూర్చుని
చూడాలనే కోరికేదీ…
పూలప్రళయానిలసంరంభానికి
తేలిపోయే తూలిపోయే హృదయంతో
శుభోదయం !
ధన్యవాదాలు మిత్రమా!
ఎఱ్ఱని తురాయి పూలు ఎప్పుడైనా ఎక్కడైనా సూదంటు రాయిలా అలా కట్టి పడేస్తాయి అంతే! నాకు ఎప్పుడూ కన్నుల విందే ఈ పూల రంగు…
ధన్యవాదాలు జపా ప్రసూనా!
రచయితలు, కవులు సాధారణంగా ..
పూలకు ప్రణయాన్నే అంటగడతారు..
మీరు పూల ప్రళయంతో ముంచెత్తారు..
నిజమే.. పూలు ప్రళయమై ముంచెత్తితే. ఇంకేమీ మిగలదు..
Thank you so much
“వేల దీపాల్ని ఒక్కసారి వెలిగించిన తురాయిచెట్లు.” ❤️
ధన్యవాదాలు