4,00,000 ఏళ్ల వెనక్కి

బరోడాకు చెందిన ఎమ్మెస్ యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ అనిల్ దేవర నేతృత్వంలో జిల్లాలో జరుగుతున్న పురావస్తు పరిశోధనల లో భాగంగా ఈరోజు కూడా ఆయన మాకు మరికొన్ని ప్రాంతాలు చూపించారు.

నిన్న మోట్రావులపాడు గ్రామంలో మన్నేరు వాగు పరిధిలో అరవై, డెబ్భైవేల ఏళ్ళ కిందటి పాత రాతియుగపు పనిముట్లను, జంతు శిలాజాలను ఆయన మాకు చూపించిన సంగతి మీతో పంచుకున్నాను. ఈరోజు ఆయన పాతరాతి యుగంలో ఇంకా చాలా వెనక్కి అంటే, దాదాపు నాలుగు లక్షల సంవత్సరాల వెనక్కి, మమ్మల్ని తీసుకువెళ్లారు

పాతరాతియుగంలో లోతుకు వెళ్లే కొద్దీ బయటపడే పనిముట్లనూ, శిలాజాలనూ లోయర్ పాలియోలితిక్ కాలానికి చెందినవి గా చెప్తారు. అటువంటి లోయర్ పాలియోలితిక్ కాలానికి చెందిన అవశేషాలను మాకు చూపించడానికి ఆయన మమ్మల్ని దాదాపుగా వెలిగొండ పర్వతశ్రేణి అంచు దాకా ఈరోజు తీసుకువెళ్లారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం శ్రీశైలం నుంచి సొరంగం తవ్వుతున్న కొండ అంచుల దాకా ఆయన మమ్మల్ని తీసుకువెళ్లారు. దాదాపు రెండు లక్షల సంవత్సరాలు నుండి నాలుగు లక్షల సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించిన పాత రాతియుగం పనిముట్లతో అక్కడ ఆ ప్రాంతమంతా నిండిపోయి ఉంది. వాటిలో చేతి గొడ్డళ్లు, క్లీవర్లు మొదలైన రకరకాల పనిముట్లు విస్తారంగా పడి ఉన్నాయి.

పూర్తిగా బీడు పడ్డ ఆ నేలమీద ఎడారి మొక్కలు, ముళ్ళ మొక్కలు మాత్రమే వ్యాపించి ఉన్న ప్రాంతంలో చిన్న చిన్న వాగులు, కాలువలు వదిలిపెట్టి వెళ్లిన సన్నని ఇసుకమేట్లు ఉన్నాయి. అక్కడ ఏళ్ల తరబడి ప్రతి వానాకాలంలోనూ నీళ్లు నిలబడిపోయి క్యాల్షియం డిపాజిట్లుగా మారిపోయిన దిబ్బల మధ్య ఆ పనిముట్లు చిక్కుకుని ఉన్నాయి. ఆ కాలవలు పెద్ద కాలువలు అయి ఉంటే, లేదా, వేగవంతమైన ప్రవాహాలు అయి ఉంటే బహుశా ఆ పనిముట్లు ఎప్పుడో కిందకు కొట్టుకుపోయి ఉండేవి. కానీ ఆ చిన్న చిన్న కాలువలకు వాటిని అంతకన్నా ముందుకు నెట్టుకుపోగలిగే శక్తి లేనందువల్లా, ఆ ప్రాంతాల్ని ఎవరు సాగు చేయటకపోవటం వల్లా, దరిదాపుల్లో జనావాసాలు ఏవి లేనందువల్లా, ఆ పనిముట్లు ఒక ఆరు బయట ప్రదర్శనశాలలో పరిచి పెట్టినట్లుగా సురక్షితంగా విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. కొద్దిపాటి పరిచయంతో నాబోటివాడు కూడా వాటిని గుర్తుపట్టగలిగేటట్లుగా ఆవి కంటికి కనిపిస్తూ ఉన్నాయి.


ఆ కాలవలమ్మట పడివుండి బయటకి కనిపిస్తున్న ఆ పనిముట్లు ప్రాకృతిక పరిణామాలకు లోనై ఉంటాయి. ఆ విధంగా బయటపడకుండా ఉన్న పనిముట్లు ఎలా ఉంటాయో చూడటానికి అక్కడ విశ్వవిద్యాలయ బృందం తవ్వకాలు చేస్తూ ఉన్నారు. ఆ బృందానికి గోపేష్ నా అనే ఒక పరిశోధక విద్యార్థి నాయకత్వం వహిస్తున్నాడు. అతను బరోడాలో ఆర్కియాలజీలో ఎమ్ఏ చదివిన తర్వాత, డాక్టరల్ పరిశోధన పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీలలో పూర్తిచేసి ప్రస్తుతం జర్మనీలో మాక్స్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్లో కొనసాగిస్తున్నాడు. అతనికి విస్తారమైన క్షేత్రస్థాయి అనుభవం ఉంది. అతని నేతృత్వంలో మరొక ముగ్గురు విద్యార్థులు ఆ తవ్వకాలు చేస్తూ ఉన్నారు.

ఆనందపురం అగ్రహారం అనే గ్రామ పరిధిలోకి వస్తున్న ఆ ప్రాచీన శిలాజ క్షేత్రం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని నేను ఆ పిల్లవాడిని అడిగాను. అతడు ఆ ప్రాంతాన్ని పురావస్తు శాస్త్ర దృష్ట్యా అరుదైన ప్రాంతంగా పరిగణించవలసి ఉంటుందనీ, ప్రాచీన శిలాయుగ అవశేషాలు అంత సురక్షితంగా, అంత విస్తారంగా లభ్యమయ్యే తావులు చాలా చాలా అరుదు అని చెప్పాడు. ఆ విధంగా చూసినట్లయితే పురావస్తు పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలున్నాయని కూడా అన్నాడు. నా చేతుల్లో ఉన్న చేతి గొడ్డళ్లను చూపించి ‘ఇవి ఏ కాలానికి చెంద ఉండవచ్చును’ అని అడిగాను.

Paleolithic hand-axe and cleaver, Prakasam district

అతడు వాటిని నాలుగు లక్షల ఏళ్ళ కాలానికి సంబంధించినవిగా చెప్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. అదేమంటే పురావస్తు శాస్త్రంలో పురావస్తు అవశేషాల కాల నిర్ధారణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని, ఆ కాలనిర్ధారణకు అవసరమయ్యే వ్యయాన్ని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు గాని సంస్థలు గాని ముందుకు రాగలినప్పుడే ఆ ప్రాంతం తాలూకు పురాచరిత్ర నలుగురికి మరింతగా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఉదాహరణకి భారతదేశంలోని పురాతన క్షేత్రాల్లో అత్యంత పురాతనమైంది గా తమిళనాడులోని అత్తిరామపక్కం క్షేత్రం గురించి అందరూ చెప్తుంటారు. దానికి కారణం గత 20 ఏళ్లుగా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాలకూ, అక్కడ లభించిన అవశేషాల పరిశోధనకూ, కాలనిర్ధారణకూ తమిళనాడు ప్రభుత్వం తగినంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది. అటువంటి ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవ్వగలిగినట్లయితే లేదా విశ్వవిద్యాలయాలు కానీ ఇతర సంస్థలు గాని తగినంతగా పెట్టుబడులు పెట్టగలిగితే ఇక్కడ లభిస్తున్న అవశేషాల్ని కూడా మరింత నిశితంగా పరిశీలించి కాల నిర్ధారణ చేయగలుగుతాము. అలా చేసినప్పుడు ఈ ప్రాంతాలు కూడా పురాచరిత్రలో అత్యంత ప్రాచీన క్షేత్రాలుగా గుర్తింపు పొందే అవకాశం ఉందని అతను చెప్పాడు.

నాకేమనిపించింది అంటే ప్రభుత్వాలు ఏదైనా ఒక అంశం మీద పెట్టుబడి పెట్టడానికి కానీ వ్యయం చేయడానికి కానీ ముందుకు రావాలంటే ప్రజల నుంచి అటువంటి డిమాండ్ ఒకటి బలంగా ఉండాలి. మన రాష్ట్రంలో కానీ, మన సమాజంలో కానీ పురావస్తు శాస్త్రం పట్ల లేదా మన జాతి ప్రాక్చరిత్ర పట్ల తగినంత అవగాహన చైతన్యం లేవు. మన పౌర సమాజానికి ఇటువంటి పరిశోధనల ఆవశ్యకత తెలిస్తే, దీనివల్ల మన ప్రాంతాల్లోని మానవ పరిణామం గురించి మరింత లోతుగా తెలిసే అవకాశం ఉందని గుర్తించగలిగితే అప్పుడు వారు ఈ విషయాల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాన్ని, ఇతరసంస్థలను ప్రేరేపించగలుగుతారు.

జర్మనీలో పరిశోధన చేస్తున్న ఆ భారతీయ విద్యార్థితో మాట్లాడుతుండగా పురావస్తు శాస్త్రం ఇప్పుడు ఎన్ని లోతులకు, ఎత్తులకూ చేరుకుంటున్నదో నాకు సూచనప్రాయంగా అర్థమైంది. ఉదాహరణకి అతను తాను పరిశోధన చేస్తున్న అంశాన్ని పాలియో క్లైమేటాలజీ అనవచ్చు అన్నాడు. అంటే అది ఎన్నో శాస్త్రాల సమాహారంగా వికసిస్తున్న ఒక సరికొత్త అధ్యయనం అన్నమాట. మన సమాజానికి ఆర్కియాలజీ అన్న పదమే ఇంకా పూర్తిగా పరిచయం కాలేదు, ఇక పాలియో క్లైమేటాలజీ దాకా ఎప్పటికి చేరుకోగలుగుతాం అనిపించింది.

మిట్ట మధ్యాహ్నం ఆ పిల్లలు ఆ వెలుగొండ పర్వత శ్రేణి పక్కన పురాతన మానవ సంస్కృతి అవశేషాలు గురించి తవ్వకాలు చేస్తున్న దృశ్యం నన్ను చాలా కదిలించింది. చదువు అంటే అది. పరిశోధన అంటే అది. జిజ్ఞాస అంటే అది.

నడి వేసవి మిట్ట మధ్యాహ్నం భగభగ మండుతున్న వేళ ఒక చలివేంద్రం లాగా వెలమూరు శ్రీరామ్ గారు మమ్మల్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. శ్రీరామ్ పోలీసు ఉన్నతాధికారి. గత పాతికేళ్లుగా నా మిత్రుడు. సాహిత్య పిపాసి. అత్యున్నత స్థాయి రసజ్ఞుడు. ఆయన నీళ్లు, తాటి ముంజలు, చల్లటి మజ్జిగతో మమ్మల్ని పలకరించారు. అక్కడి నుంచి మమ్మల్ని వేములపాడు తీసుకువచ్చి మా అందరికీ భోజనం ఏర్పాట్లు దగ్గరుండి చేయించారు.

మధ్యాహ్న భోజనం తర్వాత ప్రొఫెసర్ అనిల్ మమ్మల్ని దొంతవారిపల్లె అనే గ్రామం పరిధిలో ఉన్న మరొక పురా వస్తు క్షేత్రానికి తీసుకువెళ్లారు. అక్కడ మధ్య రాతి యుగానికి చెందిన చిన్న చిన్న పనిముట్లు విస్తారంగా కనిపించాయి. పాతరాతియుగంలో పనిముట్లు బండగానూ, పెద్దవిగానూ ఉండగా వాటి బరువులోనూ, ఆకారంలోనూ, నైశిత్యంలోనూ కూడా ఒక సూక్ష్మతను ఆదిమానవుడు సాధించగలిగాడు. అందుకని ఆ పనిముట్లను సూక్ష్మరాతియుగం పనిముట్లుగా కూడా లెక్క వేస్తారు. ఆ పనిముట్లను వ్యవసాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తే దాన్ని మైక్రోలితిక్ యుగంగాను, ఆ సూక్ష్మరాతి పరికరాలను వ్యవసాయేతర కార్యక్రమాలు ఉపయోగిస్తే వాటిని మధ్యరాతియుగం గాను లెక్కవేయటం ఒక సంప్రదాయం. ఆ విధంగా చూసినప్పుడు ఆ దొంతత వారి పల్లి దగ్గర మేము చూసిన ఆ చిన్న చిన్న సూక్ష్మరాతి శకలాలు మధ్య రాతియుగానికి చెందిన పనిముట్లుగానే లెక్కించవలసి ఉంటుంది.

అక్కడ సుమారు నలభైవేల ఏళ్ల కిందట నెల్లూరు తీరం నుంచి ఎగిరి వచ్చి పేరుకుపోయిన ఎర్ర ఇసుక తిన్నెలు వ్యాపించి ఉన్నాయి. ఆ ఇసుక తిన్నెల మధ్యలో అక్కడక్కడ కొన్నిచోట్ల పెద్ద పెద్ద రాళ్ళు పరిచి ఉన్న ప్రదేశాలను అనిల్ బృందం కనుగొన్నారు. అవి అక్కడ ఎందుకు ఉన్నాయో, ఏ మేరకు వ్యాపించిఉన్నాయో, వాటి ప్రయోజనం ఏమై ఉండవచ్చునో అనే అంశాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించడం కోసం ఆ ప్రాంతాన్ని జిపిఆర్ ద్వారా స్కాన్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ రాళ్లు మెగాలిత్స్ కావని మాత్రం వారు ఖచ్చితంగా తేల్చి చెప్పారు.

అక్కడినుండి తిరిగిమళ్లా మోట్రావులపాడు గ్రామ పొలిమేరలో మన్నేటి వాగు పరివాహక ప్రాంతాల్లో నిన్న చూసిన ప్రాంతం వైపు కాక మరొక ప్రాంతం వైపు అనిల్ మమల్ని తీసుకువెళ్లారు అక్కడ తాము కనుగొన్న శిలాజాలను దగ్గరుండి చూపించారు. ఆ శిలాజాల తవ్వకం చేపట్టడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అనుమతి రాగానే తవ్వకాలు చేపడతామని చెప్పారు. ఆ తవ్వకాలు మొదలుపెట్టినట్లయితే ప్రాచీన శిలాజాలు చెందిన ఎన్నో వాస్తవాలు వెలుగులోకి రాగలవని వారు భావిస్తున్నారు. ఆ శిలాజాలు మన ప్రాంతానికి సంబంధించిన ప్రాక్ చరిత్ర గురించిన ఏ కొత్త రహస్యాలను బయట పెట్టనున్నాయో మనం వేచి చూడాలి.

నాలుగు లక్షల సంవత్సరాల కాలం నుండి 20వేల సంవత్సరాల కాలం దాకా ఈరోజు అంతా ప్రయాణిస్తూనే ఉన్నాము. ఈ కాలవ్యవధిలో ఎన్ని కల్పాలు, మన్వంతరాలు ఇమిడి ఉన్నాయో, ఇంత సుదీర్ఘమైన పరిణామం లో మానవుడు ఏ సత్యం కోసం, సౌందర్యం కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వున్నాడో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి ఒక ఆశ్చర్యభరిత ప్రయాణంలో నేను కూడా పూర్వ మానవుల అడుగుజాడలు పోల్చుకుంటూ ఈ ప్రాంతంలో సంచరించగలగడం నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను.

15-5-2023

10 Replies to “4,00,000 ఏళ్ల వెనక్కి”

  1. కొత్తప్రాంతంలో కొత్త ప్రాక్చరిత్ర పరిశోధన అద్భుత మానవ వికాసాన్ని వెలికి తీస్తుందని ఆశావహంగా వుంది. తమిళనాడులోని అత్తిరాం పాక్కంలో 150 యేండ్లుగా ప్రాక్చరిత్రను పరిశోధిస్తూనే వున్నారు. దాదాపు లక్షల యేండ్ల చరిత్ర బయటపడినట్లు పరిశోధకుల పత్రాలలో రాసుకున్నారు…ఇపుడీ ప్రదేశం…కొత్త పరిశోధనాక్షేత్రం. పరిశోధకులందరికి అభినందనలు. వాడ్రేవు సార్ కు మంచి వ్యాసానికి ధన్యవాదాలు

  2. అసలైన విజ్ఞానం వైపు జనుల దృష్టి ఎప్పుడు మరలుతుందో. మీ ఉత్సాహం చాలా సంతోషదాయకం.

  3. బావా,ఇటువంటి పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తే చాలా బాగుంటుంది.

    1. అవును. అదే సమస్య. తమిళులకి చరిత్ర పట్ల గొప్ప గౌరవం అభిమానం. తెలుగు వాళ్ళకి చాలా తక్కువ. ప్రజలకి ఆసక్తి ఉంటే ప్రభుత్వాలు తప్పకుండా ఆసక్తి చూపిస్తాయి.

  4. ప్రణామాలు గురుదేవా..జిజ్ఞాస ప్రయాసనేరుగదు అని మీ యాత్రా చూస్తే తెలుస్తుంది.ఈ వ్యాస విశేషాల్ని నిన్న విద్యార్థులతో పంచుకున్నాను ఓ అమ్మాయి ప్రశ్న చాలా ఆలోచింప చేసింది. మరీ మన సోషల్ పాఠాల్లో ఇలా చారిత్రక పరిశోధనలు గురించి ఎందుకు వివరంగా లేదు మేడం అని..ఆ శాస్త్రాల పేర్లు కొద్దిమందికే తెలుసు.మార్కుల కోసం కాకున్నా ఈ విషయాల్ని తెలుసుకునేలా వుండొచ్చు కదా ..అని..పర్యావరణ శాస్త్రం లా మానవ వికాసానికి దారితీసిన ఈ అధ్యయన విశేషాలు అభిరుచి పిల్లల్లో కలిగేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిలాష..
    .

Leave a Reply to తుమ్మూరిCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading