60,000 వేల ఏళ్ల వెనక్కి

Prof.Anilkumar demonstrating volcanic ash of an eruption from 74000 years back

పాత రాతి యుగం జనావాసాల గురించీ, సంస్కృతుల గురించీ ఏ పుస్తకాలు చదివినా లేదా ఏవైనా ప్రదర్శనశాలల్లో పాతరాతి యుగం పనిముట్లు చూసినా ఆ ప్రదేశాలకు వెళ్లాలనీ, ఆ పనిముట్లని ఎలా గుర్తిస్తారో చూడాలనీ నాకు చాలా కాలంగా ఒక బలమైన కోరిక. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది.

ప్రకాశం జిల్లాలో మన్నేరు వాగు పరీవాహక ప్రాంతంలో దాదాపు రెండున్నర లక్షల ఏళ్ల కిందటి జంతు శిలాజాలు లభ్యమయ్యాయనీ, బహుశా మరిన్ని తవ్వకాలు చేస్తే మరింత పరిశోధన చేస్తే ప్లీస్టోసీన్ యుగానికి చెందిన హోమినిన్ల జాడలు దొరకవచ్చునేమోనని ప్రొఫెసర్ అనిల్ కుమార్ ప్రతిపాదిస్తూ ఉన్న విషయం ఇంతకుముందు నేను మీతో పంచుకున్నాను. ప్రముఖ చరిత్ర రచయిత, చారిత్రక కాల్పనిక సాహిత్యం తెలుగులో విరివిగా రావాలని కోరుకునే సాయి పాపినేని గారి ఇంట్లో ఒక సాయంకాలం అనిల్ తన పరిశోధనల గురించి వివరించిన సంగతి కూడా నేను మీతో వివరంగా పంచుకున్నాను.

2,47,000 ఏళ్ళ నాటి మాట

మహారాజా శాయాజీరావు గైక్వాడ్ విశ్వవిద్యాలయం లో పురావస్తు శాస్త్రం ప్రొఫెసర్ గా పని చేస్తున్న అనిల్ తన బృందంతో ఇప్పుడు మన్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర పరిశోధన మరింత లోతుగా మొదలుపెట్టారు. ఆయన బృంద సభ్యులు కాక ఆయన శిష్యులు కూడా పది పన్నెండు మంది ఈ పరిశోధనలో పాలుపంచుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పామూరు లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఈ బృందం రానున్న రెండు నెలల పాటు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించబోతున్నది. అందుకని ఈరోజు ఆ బృందం చేసే పరిశోధన క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుందో చూద్దామని నేనూ, సాయి పాపినేని గారూ ఈరోజు పామూరు చేరుకున్నాం. మేము వస్తున్నామని తెలిసి గుంటూరు నుంచి పాఠశాల విద్యాశాఖ పాఠ్యపుస్తకాల సంచాలకులు కొండా రవీంద్రనాథ రెడ్డి గారు, కనిగిరి లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న కొండారెడ్డి గారు కూడా పామూరు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు.

పామూరు కనిగిరి రహదారి మీద మోట్రావులపాడు అనే గ్రామం దగ్గర మన్నేరు వాగు ఒడ్డున ప్రాచీన మానవుడి ఆవాసాలను ప్రొఫెసర్ అనిల్ మాకు దగ్గరుండి చూపించారు.

రోడ్డు పక్కనే తుమ్మడొంకలతో కూడి ఉన్న ఒక బీడు భూమిలో అడుగుపెట్టి నాలుగు అడుగులు వేసామో లేదో ప్రొఫెసర్ అనిల్ ముందుకు వంగి నేల మీంచి ఒక చిన్న రాతి ముక్క తీసి మాకు చూపించారు. ‘ఇది పాత రాతియుగం పనిముట్టు చూడండి’ అని దాని వయసు ఉజ్జాయింపుగా కనీసం 60 వేల ఏళ్లకు మించి ఉండవచ్చునని చెప్పారు. మానవహస్తాల్లో ఒక పనిముట్టుగా మారిన చెక్కడమంతా ఆ రాతిలో కనిపిస్తున్నది. దాన్ని ఆది మానవులు జంతువులతోలు వలవడానికి, మాంసం తరగడానికి ఉపయోగించేవారని అనిల్ చెప్పారు. ఒక సాధారణమైన రాతి ముక్కకీ, పాత రాతియుగం పనిముట్టుకీ మధ్య ఉండే ప్రధానమైన తేడాల్ని వివరించి పాతరాతియుగం పనిముట్లని ఎలా గుర్తుపట్టవచ్చో ఉదాహరణగా చూపించారు.

ఇక ఆ తర్వాత మేము నడిచినంతమేరా పది పన్నెండు పనిముట్లను నా అంతట నేనే గుర్తుపట్టి ఏరి ఆయనకు చూపించాను. వాటిని ఆయన అంగీకరించారు. దాంతో ఆదిమానవుడి పాతరాతియుగం శిలా సంస్కృతిని గుర్తుపట్టడంలో నాకు ఈ రోజు మొదటి పాఠం పూర్తిగా లభించిందనుకున్నాను.

ఆ తర్వాత ఆయన అక్కడ మాకు 74 వేల కిందటి లావా అవశేషాలను చూపించారు. ఇప్పటికి 74 వేల ఏళ్ల కిందట ఇండోనేషియాలో ఒక మహా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాని లావా పసిఫిక్ మహాసముద్రం దాకా చిందింది అని పురా చరిత్రకారులు చెప్తారు. కర్నూలు జిల్లాలో జ్వాలాపురం లో ఆ లావాకు సంబంధించిన అవశేషాలు గరిష్టంగా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. మన ఇళ్లల్లో వంట పాత్రలు తోముకోవడానికి ఉపయోగించే సబీనా పౌడరు ఆ అగ్నిపర్వత భస్మం నుంచి తయారు చేసిందే. గిరిజన సంక్షేమ శాఖలో నేను కొన్నాళ్లు ట్రైబల్ మైనింగ్ కంపెనీ బాధ్యతలు నిర్వహించాను. అప్పుడు మొదటిసారిగా ఈ అగ్నిపర్వత విస్ఫోటనం గురించి విన్నాను. కానీ ఆ అగ్నిపర్వతం అవశేషాల్ని కళ్ళతో చూసింది ఈరోజే. ఆ బూడిదను చేతుల్లోకి తీసుకొని చూశాను.

ఆ తర్వాత ప్రొఫెసర్ అనిల్ మమ్మల్ని మరింత లోపలి ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ విస్తారమైనటువంటి జంతు అవశేషాలు- దంతాలు’ ఎముకలు మొదలైనవి శిలాజాలుగా మారిపోయినవి కనబడ్డాయి. ఒకే ప్రాంతంలో అంత విస్తారంగా జంతు శిలాజాలు కనిపించడం ఒక విధంగా చరిత్రనే. అన్ని జంతువులు అక్కడికి ఎందుకు వచ్చాయి, అప్పటి మనుషులు (హోమోసెపియన్స్ కారు, హోమినిన్స్ అందాం) ఆ జంతువుల్ని అక్కడికి నెట్టుకుంటూ వచ్చారా లేక వాటిని ఎక్కడో వేటాడి ఇక్కడికి తెచ్చుకుని ఆహారానికి వాడుకున్నారా, ఇంతకీ ఆ జంతువులు ఏమైవుండవచ్చు- ఇటువంటివి ఎన్నో విషయాలు ముందు ముందు పరిశోధనలో తేలవలసి ఉంది. అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో చేపట్టబోయే తవ్వకాల్లో ఒక మానవ శిలాజంగాని లభిస్తే అంతకన్నా గొప్ప అదృష్టం మరొకటి ఉండదు. ఒక తుంటి ఎముకగాని, ఒక పుర్రె గాని కనీసం ఒక దంతం దొరికినా కూడా అది ప్రపంచ మానవ చరిత్రలో భారతదేశానికి గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టగలదు. అటువంటి మానవ అవశేషం లభిస్తే ఆ మానవుడికి ఏ పేరు పెట్టవచ్చునా అని రకరకాల పేర్లు కూడా మేము ఊహాగానం చేసుకున్నాం.

ప్రొఫెసర్ అనిల్ బృందం రానున్న రోజుల్లో ఇక్కడ తవ్వకాలు చేపట్టబోతున్నారు. ఆ మొత్తం ప్రాంతంలో ఎక్కడెక్కడ తవ్వకాలు చేపట్టవలసి ఉందో తెలుసుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్ స్కానింగ్ చేసి చూడడం మొదలుపెట్టారు. అటువంటి స్కానింగ్ చేసే పరికరాన్ని జిలాజికల్ పెనిట్రేటింగ్ రాడార్ (జిపిఆర్) అంటారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఆధీనంలో హైదరాబాదులో ఉన్న నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ సక్రాం ఆధ్వర్యంలోని ఒక బృందం ఆ జిపిఆర్ తో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ఆ యంత్రం ఎలా పనిచేస్తుందో మాకు దగ్గరగా చూపించారు. గత ఇరవై ఏళ్లుగా అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో ఈ ప్రాంతంలో పురావస్తు పరిశోధన చేపట్టడం ఇదే మొదటిసారి అని ప్రొఫెసర్ అనిల్ చెప్పారు.

ఆయన శిష్యులు ఆర్కియాలజీ విద్యార్థులు బెంగాల్ నుంచి తమిళనాడు దాకా చెందిన వాళ్లు. యువతీ యువకులు. ‘ఇన్ని శాస్త్రాలు ఉండగా, ఎందుకు మీరు పురావస్తు శాస్త్రాన్ని ఎంచుకున్నారు?’ అని నేను ఒక పిల్లవాడిని అడిగాను. ‘నాకు మానవుడి గతానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే గొప్ప ఆసక్తి. అదే నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చింది’ అన్నాడు ఆ యువకుడు.

‘రత్న పరీక్షకుడు లేడు. రత్నం గవ్వకు మారిపోయింది’ అంటాడు కబీర్. పురావస్తు శాస్త్రజ్ఞుడు చూపకపోయి ఉంటే ఆ తుమ్మడొంకలో, ఆ బీడు భూమి లో మన సుదూర గతానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయని ఏమాత్రం తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయన చూపించకపోయి ఉంటే పాత రాతియుగం పనిముట్లు నాకు ఒట్టి గులకరాళ్లు గానే కనిపించి ఉండేవి. కానీ ఈరోజు ఆయన చెప్పిన పాఠం వల్ల 60 వేల కిందట ఆదిమానవులు ఉపయోగించిన పనిముట్లను నేను నా చేతులతో పట్టుకోగలిగాను. ఏరి తెచ్చుకోగలిగాను.

Paleolithic tools from Manneruvagu Basin

14-5-2023

3 Replies to “60,000 వేల ఏళ్ల వెనక్కి”

  1. మమ్మల్ని కూడా ఆకాలానికి తీసుకుపోయారు మీపోస్టు ద్వారాష్

Leave a Reply

%d bloggers like this: