
ఈ వేసవి చాలా తీవ్రంగా ఉంది. పొద్దున్న మొక్కలకి నీళ్ళుపొయ్యకపొయ్యేటప్పటికి సాయంకాలానికి పూర్తిగా తలలు వాల్చేసాయి. కుండీల్లో మట్టి నెర్రెలువిచ్చేటంతగా ఎండిపోయింది. ఒక్కరోజులో. ఊహించలేదు ఎండ ఇంత తీవ్రంగా ఉందనీ, ఉంటుందనీ. మొక్కలకి నీళ్ళు పొయ్యడం మొదలుపెట్టాను. దాహార్తుడు గటగటా నీళ్ళు తాగినట్టుగా ఆ మట్టినీళ్ళన్నిటినీ పీల్చేసుకుంటూ ఉంది. కాని ఆశ్చర్యం, ఆ సాంత్వన మరుక్షణంలో ఆకు ఆకుకీ, ఈనె ఈనెకీ ప్రసరించడం మొదలుపెట్టింది. అది మరింత ఆశ్చర్యంగా ఉంది. వేర్లకి అందిన ఊరట అంత తొందరగా ఆకుకొసలకీ, మొగ్గలకీ, పూలరేకలకీ సరసరా ఎట్లా ప్రసరించిందని!
ఆ దృశ్యం నన్ను ఆలోచనలోకి నెట్టింది. కవులూ, రచయితలూ,భావుకులూ ఈ సమాజవృక్షానికి మూలాల్లాంటివాళ్ళే అయితే, వాళ్ళకి ఏ కొసనుంచి, ఏ లోతుల్లోంచి, ఏ దిక్కునుంచి, ఇంత ఊరట దొరికినా, అది సమాజంలో ప్రతి మనిషికీ, ప్రతి గుండెకీ, ప్రతి మనసుకీ ఎంత సత్వరంగా ప్రవహించాలి! కాని ప్రవహిస్తున్నదా? మనకి ఈ ప్రపంచం నుంచి ధైర్యం లభించడం లేదనీ, మనకి కొంచెం కూడా నమ్మకం చిక్కడం లేదనీ అనకండి. ఆనందం, ధైర్యం, విశ్వాసం కొరియర్లో ఇంటికి వచ్చేవి కావు. తెల్లవారిలేచి చూస్తే అడుగడుగునా, అనుక్షణం అవి మనమీద ధారాళంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే మనమింకా నిశ్చింతగా మన హృదయావేదనని అక్షరాల్లో పెట్టగలుగుతున్నాం.
వాస్తవాలూ, కఠోరసత్యాలూ ఇప్పుడు రచయితలే చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఎంత హింస ఉందో అదంతా వెయ్యి పార్శ్వాల్లో తక్షణమే దృశ్యశ్రవణమాధ్యమాలు నీ అరచేతుల్లో ప్రత్యక్షం చేస్తున్నాయి. కాని ఇప్పుడు ప్రపంచంలో దొరకనిదంటూ ఉంటే అది ఇంత ఆశ, ఇంత ఓదార్పు, ఒకింత మంచిమాట, ఒక చల్లని మాట.
ప్రపంచంలో దుఃఖం ఉంది, నిజమే, కాని నువ్వు దాన్ని మళ్ళా పంచిపెట్టనక్కర్లేదు. మనం నిజంగా పంచిపెట్టవలసింది ఏదన్నా ఉందంటే అది ఇంత మంచితనం, మనుషుల పట్ల నమ్మకాన్ని బలపరిచే ఒక చిన్న మాట, ధైర్యాన్నిచ్చే చిన్న సంఘటన- అది ఎంత చిన్నమాటనే గానీ, ఒకసారి దాన్ని మీరు సమాజవృక్షపు పాదులో ధారపొయ్యగానే, ఆ సహానుభూతి ప్రతి మనిషికీ ఎంత సత్వరం వ్యాపిస్తుందో కళ్లారా చూస్తారు.
నా చేతలు శుభ్రం కావాలంటే ముందు నా మాటలు శుభ్రం కావాలి. నా మాటలు శుభ్రం కావాలంటే ముందు నా తలపులు శుభ్రం కావాలి. తలపుల్నెట్లా శుభ్రపరచడం? మాటమీద మనం ఎంతో కొంత అదుపు సాధించుకోవచ్చు. చేతల విషయంలో కూడా, ప్రయత్నిస్తే, క్రమశిక్షణ సాధ్యంకాకపోదు. కాని తలపులు మన ఆధీనంలో ఉండవే. అందులోనూ మన వ్యక్త చైతన్యం అడుగున అవ్యక్త చైతన్యం ఉంటుందనీ, అందులో మన సమస్తవాసనలూ ఘూర్ణిల్లుతూ ఉంటాయనీ విన్నామే! మనం తలపుల్ని బలవంతంగా పెరకడం మొదలుపెడితే అవి మరిన్ని పుట్టుకు రావటం మనకి అనుభవమే. కొందరు తలపుల్ని ఒక్క తలపుతో నిరోధించమన్నారు. కొందరు తలపులు పుట్టే చోటుని తలచమన్నారు. ఎన్నో దారులు. ఎన్నో పరిష్కారాలు.
చాలా కాలంగా, ఈ సమస్యతో తలపడుతూ వస్తున్ననాకు, ఇవాళ ఆ మొక్కలముందు నిలబడ్డప్పుడు స్ఫురించింది, తలపుల్ని తలపులతోటే శుభ్రం చెయ్యాలని. బలహీనమైనవీ, బాధించేవీ, సిగ్గుపడేట్టుచేసేవీ, మనుషులనుంచీ, ప్రకృతినుంచీ దూరంగా నెట్టేసేవీ- అలాంటి తలపులు నీలో పుడుతున్న ప్రతిసారీ, ఇన్నినీళ్ళతో నీ మనసు కడుక్కోవాలి. మొక్కల్లో నీళ్ళుపోసినట్టుగా, ప్రయత్నపూర్వకంగా, శుభ్రమైన తలపులతో నీ మనసును శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికే ఈ లోకంలో ఎంతో దుమ్మురేగుతూ ఉంది. మళ్ళా నీ తలపుల ధూళిని లోకం మీద చిమ్మే బదులు, నిర్మలమైన తలపుల్ని ఈ లోకానికి పంచిపెట్టగలిగితే, బహుశా, నువ్వున్న మేరకి ఈ లోకం ప్రక్షాళితమవుతుంది.
మంచి అన్నది పెంచుమన్నా అని మహాకవి ఎందుకన్నాడో ఇప్పుడు బాగా అర్థమైంది.
13-5-2023
వాడిన మొక్కకు నీరము
పోడిమితో పోయనదియు పొటమరినటులే
వీడును మది చీకాకులు
పాడితలంపులు మనసును పరిపరి జేర్చన్
‘ఇప్పుడు ప్రపంచంలో దొరకనిదంటూ ఉంటే అది ఇంత ఆశ,ఇంత ఓదార్పు,ఒకింత మంచిమాట,ఒక చల్లని మాట.’
నిజమే. చాలా బాగా హృదయానికి హత్తుకుంది ఈ వ్యాసం.
అభినదనలు,ఆశీస్సులు
చిత్తవృత్తి నిర్మూలన…
యోగం….👍
Thank you
మీ మాటల, చేతల అంతస్సారం ఒకటే.
ప్రకృతి తో మమేకం అవ్వండి. అద్భుతాలను ఒడుసిపట్టండీ. ప్రకృతికి బాగా దూరం జరిగాం మనం, అందుకే ప్రకృతి తో కూడినది మనకు ప్రస్తుతం అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి మీతో ఎన్నో మంచి మాటలను పలికిస్తూందీ. ఒక్క ప్రకృతి కి దగ్గరగా ఉండండి, సకలం మీకు లభిస్తాయి. ఇదే వాడ్రేవు వారి వాక్కుల పరమార్థం.
ధన్యవాదాలు సార్