ఇవన్నీ చెప్పాలి పిల్లలకి

పదిరోజుల కిందట ఉన్నతవిద్యాశాఖ కళాశాల విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వడం కోసం ఒక ఎంపిక ఏర్పాటు చేసింది. తాము షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేసి ముగ్గుర్ని ఎంచడంకోసం ఒక పానెల్ ఏర్పాటు చేసి అందులో నన్ను కూడా ఒక సభ్యుడిగా ఉండమని పిలిచింది. నాతో పాటు ఒక విశ్వవిద్యాలయపు పూర్వపు వైస్ ఛాన్సలర్ తో పాటు, మరొక ప్రసిద్ధ ఐ టి నిపుణులు కూడా ఉన్నారు. పదిరోజుల కిందట మేము ఆ ఎంపికకి కూచున్నాం.

దాదాపు పన్నెండు మంది విద్యార్థులు. ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, ఫార్మసీ తో పాటు సైన్సు, ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు. చాలా చురుగ్గా ఉన్నారు. మెరికల్లాగా ఉన్నారు. నిజానికి వాళ్ళల్లోంచి మొదటి మూడు స్థానాలకి అర్హులంటూ ఎవరో ఒక ముగ్గురిని ఎంచడం మాకు కష్టమైన పనే అయ్యింది. కాని చివరికి పానెల్ సభ్యులం ముగ్గురం ఒక్కొక్క అభ్యర్థి గుణగణాల్ని వివరంగా చర్చించుకుంటూ, పదేపదే వడపోసుకుంటూ, మాకు మేము నచ్చచెప్పుకుంటూ, చివరికి మూడు పేర్లు ఎంపికచేసి, మరొక విద్యార్థినిని కూడా ఎంపికచెయ్యకపోతే, మా ఎంపికకి అర్థం ఉండదని అనుకుంటూ, నాలుగవ బహుమతి కూడా ఏర్పాటు చెయ్యమని ఉన్నతవిద్యాశాఖకి సలహా కూడా ఇచ్చాం.

నేను ఇంజనీరింగ్, బయో టెక్నలజీ వంటి రంగాల్లో దాదాపుగా నిరక్షరాస్యుణ్ణి కాబట్టి ఆ పిల్లల అకడమిక్ ఎక్సలెన్స్ ని అర్థం చేసుకోవడం నా శక్తికి మించిన పనే అయ్యింది. కాని వారి ఆలోచన, కొత్త విషయాల్ని కనుక్కోడం పట్ల తృష్ణ, పోటీ ప్రపంచంలో తాము నెగ్గుకురావాలన్న దీక్ష నన్నెంతో ఆకట్టుకున్నాయి, నన్నే కాదు, మొత్తం పానెల్ నే ఆకట్టుకున్నాయి.

అయితే, ఇప్పుడు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నది వారి అకడెమిక్ సామర్థ్యాల గురించి కాదు. దాదాపు రోజంతా జరిపిన ఆ ఇంటర్వ్యూల్లో ఆ పిల్లల ప్రతిభకి ఒకవైపు ముగ్ధులమవుతూనే మరొక వైపు మేము చింతాక్రాంతులమవుతూ వచ్చిన మూడు నాలుగు విషయాల గురించి చెప్పకుండా ఉండలేక, ఈ నాలుగు వాక్యాలూ రాస్తున్నాను.

మొదటిది, ఆ పిల్లల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా సాహిత్య పరిజ్ఞానం లేదు. సాహిత్యం అలా ఉంచండి, వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మహాత్మాగాంధీ సత్యశోధన పుస్తకం కళ్ళతో చూసింది లేదు. అబ్దుల్ కలాం పేరు విన్నారుగాని, ఆయన రాసిన పుస్తకాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళల్లో ఒక్కరు కూడా చదివింది లేదు. గమనించండి, మేము ఇంటర్వ్యూ చేసిన పిల్లలు ప్రస్తుతం ఉన్నత విద్య అభ్యసిస్తున్న పది పదిహేను లక్షలమంది పిల్లల్లో అత్యంత ప్రతిభావంతులు. అకడమిక్ గా వారి సామర్థ్యాలు దేశంలో వారి వయసు పిల్లలకి ఏ మాత్రం తీసిపోనివి. ఒకమ్మాయి రాసిన వ్యాసాలు సైన్స్ కి సంబంధించిన ప్రతిష్టాత్మక జర్నల్స్ లో ఇప్పటికే ఎనిమిదికి పైగా ప్రచురించబడ్డాయి. మామూలుగా అయితే ఆ వయసుకి రెండు వ్యాసాలు ప్రచురించబడ్డా కూడా అదెంతో గొప్ప విషయమట. కానీ ఆమెతో సహా, ఒక్కరంటే ఒక్కరికి కూడా కవిత్వం తెలీదు, కథలు తెలీదు, క్లాసికల్ లిటరేచర్ తెలీదు.

వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపూ, నేను ఆలోచిస్తున్నది ఆ పిల్లల గురించి కాదు. మన రచయితల గురించి, మన కవుల గురించి. మిత్రులారా! ఏమి వాదించుకుంటూ ఉంటాం మనలో మనం! ఎంతలా ఖండించుకుంటూ ఉంటాం ఒకరినొకరం! నేను మాట్లాడేదే సత్యం, నా వల్లనే సమాజం మారిపోబోతున్నదని ఏమి జబ్బలు చరుచుకుంటూ ఉన్నాం! కాని మీకు తెలుసునా? గురజాడ, శ్రీ శ్రీ, చలం, టాగోర్, ప్రేమ్ చంద్, సుబ్రహ్మణ్య భారతిల పేర్లే మన యువతకి తెలియవు. ఇక మనమెక్కడ? మన రచనలెక్కడ? అయ్యో! చాలా పెద్ద అగాధముంది మనకీ, మన యువతకీ మధ్య! మనం ఎప్పుడేనా వారికి సమీపంగా వెళ్ళడానికి ప్రయత్నించామా? ఎప్పుడేనా ఒక కళాశాలకి వెళ్ళి ఒక రచయితగురించో, కవి గురించో మాట్లాడేమా? మన పుస్తకాలు ఎప్పుడేనా వాళ్ళ మధ్య ఆవిష్కరించుకున్నామా? కనీసం మనం రాసిన పుస్తకాలు మన పిల్లల్తోనైనా చదివిస్తున్నామా? మన పుస్తకాలు పోతే మానే, కనీసం ఒక వివేకానందుడు, ఒక గాంధీ, ఒక అంబేద్కర్, ఒక కలాం నైనా మన ఇళ్ళల్లో మన పిల్లలు చదువుతున్నారా?

గమనించవలసిందేమంటే, ఆ పిల్లలకి సాహిత్యం గురించి తెలియదంటే, వాళ్ళ తల్లిదండ్రులకి కూడా తెలియదని అర్థం. వాళ్ళకి పాఠాలు బోధిస్తున్న గురువులకి కూడా తెలియదని అర్థం. ఒకవేళ తెలిసినా వాళ్ళు కావాలనే తమ పిల్లల్ని సాహిత్యం నుంచి ‘కాపాడుకోడానికి’ప్రయత్నిస్తున్నారని అర్థం.
బహుశా భారతదేశంలో మరే భాషా సాహిత్యం కూడా మాట్లాడనంత బిగ్గరగా తెలుగు రచయితలూ, కవులూ ప్రజలగురించీ, ప్రజాసాహిత్యం గురించీ మాట్లాడుతుంటారు. గత యాభై ఏళ్ళుగా ఈ మాటలు విని విని విసుగెత్తిపోయాను. ప్రజలు అంటే ఎవరు? ఈ రోజు కళాశాలల్లో అగ్రగాములుగా ఉన్న ఈ విద్యార్థులకే సాహిత్యం గురించి తెలియకపోతే, మరి మనం చెప్పుకుంటున్న సాహిత్య పాఠకులు ఎవరు?

ఇక రెండవది, సాహిత్యం సరే, సంగీతం, చిత్రకళ, నృత్యం లాంటి కళలకి కూడా ఆ పిల్లలు దూరంగా ఉన్నారు. కాని వాళ్ళు రోజుకి ఒక గంట కేటాయించినా కూడా వాళ్ళ నాలుగేళ్ళ కోర్సు పూర్తయ్యేలోపు ఏదో ఒక కళలో కనీస ప్రావీణ్యాన్ని సంపాదించిపెట్టగల వనరులు వారిపక్కనే ఉన్నాయి. కాని అటువంటి కళాసక్తిని వాళ్ళూ, వాళ్ళ తల్లిదండ్రులూ కూడా డైవర్షన్ గా భావించే స్థితిలో మన సమాజం ఉంది. వాళ్ళల్లో ఒకమ్మాయి తాను నృత్యం నేర్చుకున్నానని చెప్పింది. ఏ నృత్యం అనడిగాం. కూచిపూడి అంది. కూచిపూడి ఎక్కడుందని అడిగాను. ప్రకాశం జిల్లాలో ఉండవచ్చునేమో అంది.

యూరోప్ చరిత్ర చదివినవాళ్లకి శిల్పులూ, చిత్రకారులే రినైజాన్సుని తీసుకువచ్చారని తెలుస్తుంది. పందొమ్మిదో శతాబ్దంలో భారతదేశం మేల్కొంటున్నప్పుడు సంగీతం, నాట్యం, నాటకం, చిత్రకళ ఒక నవ్యభారతదేశాన్ని దర్శించాకనే, రాజకీయ ఉద్యమాలు ఆ భారతదేశాన్ని సాధించడానికి పోరాడేయని అర్థమవుతుంది. లలితకళల్ని పక్కనపెట్టిన అకడమిక్స్ అకడమిక్స్ కానే కావు. ఎందుకంటే, కళలు హృదయానికి తర్ఫీదునిస్తాయి. ఒక సౌకుమార్యాన్ని, సహానుభూతినీ అలవరుస్తాయి. అవిలేకపోతే చదివే చదువంతా కేవలం బుద్ధికి పదునుపెట్టే వ్యాయామంగానే మిగిలిపోతుంది.

ఇక మూడవ అంశం, ఆ పిల్లల్లో నాయకత్వ లక్షణాలున్నాయి. కాని వాళ్ళకి నాయకత్వ శిక్షణ ఎలా ఇవ్వాలో ఆ కళాశాలల యాజమాన్యాలకిగాని, ఆ ఉపాధ్యాయులకి గాని తెలియడంలేదని అర్థమవుతోంది. ఉదాహరణకి, ఒకమ్మాయిని మా పానెల్ మెంబరు, ‘నిన్ను నువ్వు ఏ విధంగా నిర్వచించుకుంటావు?’ అనడిగితే, ఆ యువతి, ‘నా తల్లిదండ్రులు నన్నొక కొడుకుగా గుర్తించాలని కోరుకుంటున్నాను’ అంది. అంటే అంత తెలివైన, చురుకైన బాలిక కూడా, తన తల్లిదండ్రులు తనని ఒక కొడుకుగా గుర్తిస్తే తప్ప, తన జీవితానికి ప్రయోజనం చేకూరినట్టు కాదు అని అనుకుంటున్నదన్న మాట! మరి జెండర్ గురించి మనం గత ఇరవయ్యేళ్ళుగా మాట్లాడుతున్న మాటలు, చర్చలు, మన పత్రికలు, కరపత్రాలు, ఊరేగింపులు- ఇవన్నీ ఏమైపోయినట్టు?

ఆ ఇంటర్వ్యూకి హాజరయిన ఒక పిల్లవాడు డిజైన్ ఇంజనీరు కావడం తన ధ్యేయమని చెప్పాడు. కాని అదే సమయంలో మరొక మూడు నాలుగు నైపుణ్యాలు సాధించాలన్న ఆత్రుతలో కూడా ఉన్నాడు. అతనికి చెప్పాను, మల్టీ టాస్కింగ్ అన్ని వేళలా ఒక మెరిట్ కాదు, ఒక్క అంశాన్ని ఎన్నుకో, దాని మీద నీ యావచ్ఛక్తి కేటాయించు, ఎక్సలెన్సుకోసం ప్రయత్నించు అని. కాని అతని తమ్ముడో, మిత్రుడో రూమ్మేటు ఉన్నాడట. వాడికి చదువుమీద ఆసక్తి లేదు, వాడికి ఎంతసేపూ సినిమాల మీదనే ఆసక్తి అని చెప్పాడు. అంటే పిల్లలు రెండు శిబిరాలుగా చీలిపోయారన్నమాట. ఒకరికి ఎంత చదివినా తృష్ణతీరట్లేదు, మరొకరికి మీదనే శ్రద్ధ లేదు.

నేనిన్నాళ్ళూ ప్రాథమిక విద్య, పాఠశాల విద్య మాత్రమే సంక్షోభంలో ఉన్నాయి అనుకున్నాను. కాని ఉన్నత విద్య మరింత తీవ్ర సంక్షోభంలో ఉందని అర్థమవుతూ ఉంది. ఆ ఇంటర్వ్యూలు పూర్తయ్యేటప్పటికి నాకు చెప్పలేనంత నిస్త్రాణ కలిగింది. ఏమి చేస్తే, ఈ యువతకి సరైన దిశానిర్దేశం చెయ్యగలుగుతాం? ఎవరు పూనుకోవాలి ఈ పనికి? ఎక్కడ మొదలుపెట్టాలి? ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి?

సాహిత్యం చదవడం వల్ల తన గురించీ, సమాజం గురించీ తెలుస్తుందనీ, సామాజిక బాధ్యత అర్థమవుతుందనీ, మానవసంబంధాల పట్ల స్పష్టత కలుగుతుందనీ మనకి తెలుసు, కాని వాళ్ళకి కూడా తెలియాలి కదా! సాహిత్యం వల్ల, కళాసాధన వల్ల విద్యార్థులు ముందు సృజనశీలురు కాగలుగుతారు. తమ హృదయాల్లో అస్పష్టంగా ఉన్న భావాలకు అభివ్యక్తిని ఇవ్వడం నేర్చుకుంటారు. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని వ్యాఖ్యానించగలుగుతారు. రానున్న రోజుల్లో ప్రపంచం మరింత విజువల్లీ ఓరియెంటెడ్ కాబోతోంది కాబట్టి పిల్లలు తాము జీవిస్తున్న ప్రపంచాన్ని సాంస్కృతికంగా దర్శించగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకోగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా తాము బృందాలుగా పనిచెయ్యగల నైపుణ్యాలు సంపాదించుకోగలుగుతారు. ఏమీ అక్కర్లేదు, కనీసం కళాశాల వార్షికోత్సవానికి ఒక నాటకం వెయ్యడానికి పూనుకున్నా కూడా కలిసి పనిచెయ్యడంలో ఉండే ఉత్సాహాన్ని , అది పిల్లలకి రుచిచూపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి సామర్థ్యాల్నీ, బలహీనతల్నీ కూడా మరొకరు సహానుభూతితో చూడగల సంస్కారాన్ని అలవరుస్తుంది.

ఇవన్నీ చెప్పాలి పిల్లలకి, ఉపాధ్యాయులకి, కళాశాలల యాజమాన్యాలకి, అందరికన్నా ముందు తల్లిదండ్రులకి.

12-5-2023

17 Replies to “ఇవన్నీ చెప్పాలి పిల్లలకి”

  1. సర్, నమస్తే.‌పొద్దున్నే మంచి ప్రశ్నలు లేవనెత్తినందుకు ముందు గా ధన్యవాదాలు.‌ఎంతో ప్రతిభావంతులైన ఈ తరం పిల్లల విద్యా విధానాన్ని చూస్తే బాధ వేస్తుంది.‌నిజానికి ప్రాధమిక విద్య, పాఠశాల విద్య సంక్షోభంలో ఉండడం వల్లనే ఉన్నత విద్య పరిస్థితి అలా ఉంది.‌సాహిత్యం మాట దేవుడెరుగు, కనీసం తెలుగు, ఇంగ్లీషు , హిందీ పాఠ్య పుస్తకాలు చదవడానికి కూడా వారికి సమయం ఉండదు.‌కేవలం గణితం, సైన్స్ .., పోటీ పరీక్షలు, ర్యాంకులు.‌ఇదే వారి ప్రపంచం.‌వార్షికోత్సవాలకి చక్కటి నాటకాలు వేసేంత సమయం ఉండదు.‌సినిమా పాటలే వారికి తెలిసిన కళలు. ఒక శతక పద్యం, నీతి చంద్రిక, ఒక టామ్ సాయర్, ఒక కబీర్ దోహా.. ఇవేవీ వారికి (కనీసం ఎక్కువ మందికి)తెలీదు.‌తప్పు వారిది కాదు.‌తల్లిదండ్రులు లక్షలు పోసి కొంటున్న విద్య లో ఇవన్నీ అనవసరం అని పాఠశాల యజమాన్యాల భావం కావచ్చు.‌ఎవరి అభద్రత వారిది.‌ఎందుకు పరిగెడుతున్నారో తెలీకుండా, గమ్యం ఏమిటో తెలీకుండా అందరూ పరుగెడుతున్నారు.‌పాపం.. ఒక్కో గేమ్స్ పిరియడ్ కోసం, ఒక్కో కథ వినడం కోసం ఆశగా చూసే చిన్నారులను ఎందరినో నేను చూసేను. కథలు వఇనఏటప్పఉడఉ వాళ్ళు కళ్ళల్లో ఆనందం వర్ణనాతీతం.‌ఉన్నత విద్య కి వచ్చే వేళకి వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా గాని, చదువునీ, పుస్తకాలనీ అసహ్యించుకునే జల్సా మనుషులుగా గాని తయారౌతున్నారు. అది సహజం.‌ఎవరూ ఎందుకు మాట్లాడారో, మాట్లాడినా ప్రయోజనం లేదో తెలీదు.‌మీలాంటి వారే ఏమైనా చెయ్యాలి. చేస్తారని ఆశ.‌

  2. పాఠశాలలో సాంస్కృతిక క్లబ్స్ ఉండాలి సర్, మనము సైన్స్ మరియు కంప్యూటర్ లాబ్స్ మీద ద్రుష్టి పెడుతున్నాము, covid తరువాత పిల్లలు చాలా నిరాసక్తి గా మారినారు, 80 శాతం వారిని కంట్రోల్ చేయడానికి, 20 శాతం పాఠం చెప్పడానికి ఉపయోగిస్తున్నాము. అందరు అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ద్రుష్టి పెడుతున్నారు, కానీ లివింగ్ స్టాండర్డ్స్ మీద కాదు

    1. అవును సార్ పిల్లల్ని సాహిత్యం నుంచి కాపాడి, కార్పోరేట్ చెరసాలలో బంధిస్తునారు.

  3. తల్లిదండ్రులు చెయ్యరు సర్ .వారికి పిల్లలు ఎంత ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో చేరతారన్నదే ముఖ్యం.
    మౌలికమైన మార్పులు ఒక్క విద్యా మండలి ద్వారానే సాధ్యం .గుడ్ రీడ్స్ లాగా పుస్తకాలు వారానికి ఒకటి ,తేలికైనవే ,పిల్లల చేత చదివించడం ఒక మార్గం .
    కాలేజీల్లో ,వారి మేజర్ ఆప్షన్ ఏదైనా ,సాహిత్యం ,కళలు కొన్ని కోర్సులు తప్పనిసరి చేయడం .దీనికి కావలసిన పెట్టుబడి పెట్టడానికి ఏ ప్రభుత్వం సిద్ధం సర్ ?

  4. ఒక విశ్రాంత తెలుగు అధ్యాపకుడితో మాట్లాడుతూ నందిని సిద్ధారెడ్డి అని చెబుతుంటే ఆమె ఎవరు అని అడిగితే నేను తలపట్టు కున్నాను. ఆదిలాబాదు డిఎస్ సి ఎంపిక కోసం ఇంటర్వూ జరిగే సమయంలో ఒకరిద్దరిని ఒక పద్యం చదవమని అడుగుతున్నట్టు తెలియగానే కొంత మంది నా వద్దకు పరుగెత్తుకుని వచ్చారు సార్ ఒక పద్యం చెప్పండి అంటూ .నేనూ ఆ ఇంటర్వ్యూలో ఉన్నాను. అలా విద్యార్థులకు సాహిత్య విషయావగాహన ఎక్కడినుండి మొదలు పెట్టాలనేది పెద్ద సమస్య. మీరు నేర్పిన గేయం అంటూ ఒకమ్మాయి పాడి ఆడియో పంపితే అమ్మాయిని పేరు వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
    ఇంకో విచిత్రమైన సంఘటన మరువలేనిది . కౌటాల మండల్ బోదంపల్లి హైస్కూల్ హెడ్మాస్టర్ గా రిటైరైన తర్వాత నా స్వంత పనిమీద S.R. గురించి ఆ స్కూలుకు వెళ్లడం జరిగింది. నేను లెక్కలు, తెలుగు చెప్పాను పనిచేసినప్పుడు. అయితే నన్ను రిలీవ్ చేసిన హెడ్ మాస్టర్ తెలుగుపండితుడు ప్రమోషన్ మీద వచ్చారు. నేను సికూల్లోకి రావడం చూసి పదవతరగతి పిల్లలు కట్టకట్టుకుని వచ్చి హెడ్ మాస్టర్‌ను ఏదో అడిగారు.
    ఆయన వాళ్లను పంపి నాతో మీరు వాళ్లకు ప్రవరాఖ్యుడు పాఠం చెప్పాలట అంటే అదేమిటండీ నేను చెప్పడమేమిటి అంటే ఆయన కూడా మీరు పాఠం చెబితే వినాలని నాకు కూడా కుతూహలంగా ఉందని నాతో పాఠం చెప్పించారు.
    అలా క్లాసు తీసుకున్నకారణంగా లేటవటం తిరిగి వచ్చేప్పుడు ఏ ఆశిరయమూ లేని రోడ్డు మీద కుండ పాత వర్షంలో తడిసిపోయిన అనుభవం పుష్కరం దాటినా మరువలేనిది. కానీ మీరన్నది వాస్తవం ఇప్పటి పిల్లకు సాహిత్యపు వాసన ఇసుమఒమత కూడా లేదనేది. దానికోసం మనమేదైనా చెయ్యాలి సర్.

  5. Sir, మీ ఈ మాటలు ఎంతో విలువైనవి. అవరమైనవి..ఈ స్పృహ లేని సమాజం అందమైన ప్లాస్టిక్ పూల వంటిది..

      1. పాఠశాల వార్షికోత్సవాలన్నీ DJ sounds తోనే నిండిపోతున్నాయి. ఒక్క నాటిక కాని ,ప్రయోజనం కలిగించే ఒక్క కార్యక్రమం కూడా కానరావడం లేదు.
        భాషలే సరిగా రానివారికి సాహిత్యం దాకానా!!???

  6. ఈ బాధ నన్ను ఎన్నాళ్ల నుండో వెంటాడుతుంది సర్.. మా ఇంట్లో మా అక్కల, అన్నల, పిల్లలు కనీసం 10 మంది ఉన్నారు ..అందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.. ఒక్కరి దగ్గర కూడా ఒక పుస్తకం గురించి ఒక మాట కూడా నేను ఎప్పుడు వినలేదు.. ఏదైనా ఫంక్షన్ లో కలుసుకున్నప్పుడు కూడా నేను కావాలని ఏదో పుస్తకం గురించి పిల్లలతో మాట్లాడుతాను.. దాని గురించి వాళ్ళకి తెలిసి ఉండదు..బాధ కలుగుతుంది ..

  7. ” కళలు హృదయానికి తర్ఫీదునిస్తాయి. ఒక సౌకుమార్యాన్ని, సహానుభూతినీ అలవరుస్తాయి. అవిలేకపోతే చదివే చదువంతా కేవలం బుద్ధికి పదునుపెట్టే వ్యాయామంగానే మిగిలిపోతుంది.” అద్భుతంగా చెప్పారు.

  8. I was late in reading your lamentation. C P Snow, in his Two Cultures worried about the same problem in the late 1950s. I am sure you must have known. I am reminded of his lecture. Wanted to share with you. Thanks.

Leave a Reply to Pvv RamanamurthyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading