సినిమాలు తీస్తే అలా తియ్యాలి

మలావి ఆఫ్రికాలో ఒక దేశం. బాగా వెనకబడ్డ దేశం. ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ. 1966 లో స్వతంత్రం పొందింది. ఆ దేశస్థులు ఆఫ్రికన్ బంటూ జాతికి చెందినవాళ్ళు. ఎన్నో శతాబ్దాల కిందట కాంగో నుంచి వలస వచ్చారు. ఎన్నో భాషలు మాట్లాడతారు కాని ప్రధానమైన భాషలు ఇంగ్లిషు, చిచెవా అనే ఆదివాసి భాషాను. తక్కిన ఆఫ్రికాదేశాల్లానే, అక్కడి తెగల్లానే మలావీ ప్రజలు కూడా తమ పూర్వీకుల సంస్కృతినీ, భాషల్నీ, ఆచారవ్యవహారాల్నీ వదులుకుంటూ కలోనియల్ ప్రాజెక్టులో భాగంగా ఆధునీకరణకు లోనవుతూ వచ్చారు. తక్కిన ఆఫ్రికన్ జాతుల కథల్లోలానే మలావీలో కూడా ఆ ప్రజలు తమ దేవతల్ని, తమ సాంప్రదాయిక వ్యవస్థల్నీ వదులుకుని ఆధునిక, ప్రజాస్వామిక సంస్థల్నీ, పద్ధతుల్నీ స్వాగతించారు.

ఒక గోత్రానికి చెందినవాళ్ళంతా ఒక తెగగా, ఆ తెగకి చెందిన వాళ్లందరూ ఒక జనావాసంగా, తమ పితృప్రభువు మాటనే శాసనంగా భావిస్తో, తమ క్రతుకర్త ఏ దేవుణ్ణి నమ్మమంటే ఆ దేవుణ్ణే నమ్ముతో, తమ సాంప్రదాయిక శాసకులూ, క్రతువులే తమని ఆకలినుంచీ, అనారోగ్యం నుంచీ, తోటి తెగలతో సంభవించే కలహాలనుంచీ కాపాడతాయని నమ్ముతో శతాబ్దాల పాటు జీవించారు. అప్పుడు కొన్నాళ్ళు వానలు కురిసేవి. మొక్కజొన్ననో, కర్రపెండలమో పండించుకునేవారు. తాము పండించుకున్నది దేవుడికింతపెట్టి తాము తినేవారు. కొన్నేళ్ళు వానలు పడేవి కావు. తమ పూజారులు చెప్పినట్టుగా దేవుళ్ళకు ప్రార్థనలు చేసేవారు. వానలు పడితే పడేవి. లేకపోతే కాటకం చుట్టుముట్టేది. భరించలేని ఆకలి ముంచెత్తేది. ఆకలికి తాళలేక, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా, మిగిలినవాళ్ళు ఎలాగో బతికేవాళ్ళు. మళ్ళా వానలకోసం చూసేవారు.

అటువంటి సమాజాల్లోకి వలసవాదులు వచ్చారు. యుద్ధాన్ని, క్షామాన్ని, రోగాల్ని తీసుకొచ్చారు. వాళ్ళని లొంగదీసుకున్నారు. వాళ్ళలో శారీరికంగా బలంగా ఉన్నవాళ్ళని బానిసలుగా అమెరికాలో అమ్మేసారు. మిగిలినవాళ్ళని మతం మార్చేసేరు. తమతో పాటు స్కూళ్ళు పట్టుకొచ్చేరు, ఎన్నికలు పట్టుకొచ్చేరు. బాలట్ బాక్సుల్తో, ప్రచారాల్తో అప్పటికే సాంప్రదాయికంగా, భాషాపరంగా అనేక తెగలుగా విడిపోయిన ఆఫ్రికాని రాజకీయపార్టీల పేరుతో మరిన్ని ముక్కలు చేసేసారు.

అంతకు ముందు వానలు పడకపోతే దానికి కారణం అదృశ్యశక్తులు. కాని ఇప్పుడు కూడా వానలు పడటం మానేసాయి. కారణం వ్యాపారశక్తులు. వీళ్ళు ఆఫ్రికన్ అడవుల్ని నరికెయ్యడం మొదలుపెట్టారు. సాంప్రదాయిక ఆహారపంటల స్థానంలో పొగాకు పండించడం మొదలుపెట్టారు. పొగాకు బేరన్లకి కట్టెలకోసం మిగిలిన అడవులు కూడా నరకడం మొదలుపెట్టారు. అడవులు నరకడం మొదలయ్యాక కాటకానికి హద్దులేకపోయింది. ఒకప్పుడు ఒక కుటుంబం వర్షాన్ని నమ్ముకుని ఇంత మొక్కజొన్న పండించుకుంటే ఏదో ఒక విధంగా ఏడాది గడిచేది. ఇప్పుడు భూములు పోగొట్టుకున్నాక ప్రభుత్వం ఇచ్చే రేషను తప్ప మరో దిక్కులేదు. ఆ తిండి గింజలు చాలవు. ఆకలి గొన్న ప్రజలు రేషను షాపులు కొల్లగొట్టుకోడం మొదలుపెడతారు. ఏ ఇంట్లోనైనా ఒక గాదెలో మొక్కజొన్న ఉందని తెలిస్తే అన్నార్తులు పట్టపగలే ఆ ఇంటిని దోచుకుంటారు. ఆకలిగొన్న ప్రజల గోడుతో నిమిత్తం లేకుండా ఎన్నికలు జరుగుతాయి. నాయకులు ప్రచారానికి వస్తారు. తమకి తిండిగింజలు కావాలని మొరపెట్టుకుంటే మొరపెట్టుకున్నవాళ్ళని అరెస్టు చేసి జైలుకి పంపుతారు.

ఆదిమ మంత్రగీతాలు, క్రతువులు, సామూహిక నాట్యాలు ఇప్పుడు పాతసంస్థలు. పాతదేవుళ్ళు తమని కాపాడటం లేదని ప్రజలు కొత్తదేవుళ్ళని నమ్మడం మొదలుపెట్టారు.ఆధునిక విద్య, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, చట్టాలు, పోలీసులు, ప్రజాపంపిణీవ్యవస్థ- ఆ కొత్తదేవుళ్ళు. కానీ ఈ కొత్తదేవతల కన్నా ఆ ప్రాచీన దేవతలే నయం అనిపించే పరిస్థితి ఆఫ్రికాలో, ప్రతిదేశంలోనూ, ప్రతి గ్రామంలోనూ నెలకొనడంలో ఆశ్చర్యం లేదు.

చిన్నపాటి తేడాల్తో దాదాపుగా ఇవే పరిస్థితులు మన గిరిజనప్రాంతాల్లో నెలకొనడం కూడా నేను చూసాను, చూస్తూ ఉన్నాను. ఆ అనుభవాల ఆధారంగా ‘ట్రాపికల్ ఫీవర్’, ‘బయ్యన్న’, ‘నమ్మదగ్గమాటలు’ లాంటి కథలు కూడా రాసాను.

మన పూర్వీకులు ప్రాణాలు త్యాగం చేసి రాజకీయ స్వాతంత్య్రం సంపాదించాక, మన దేశాన్ని ఒక సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ గా రూపొందిస్తామని ప్రజలపేరిట మన రాజ్యాంగవేత్తలు మనకు వాగ్దానం చేసాక, ఎన్నోసార్లు, ఈ దేశంలో మనుషులు, తమ ఆకలినీ, అనారోగ్యాల్నీ, తాము ఎదుర్కొంటున్న సామాజిక-రాజకీయ అన్యాయాన్నీ ఎదిరించడానికి కూడా సత్తువలేక, తిరిగి మళ్ళా తమ పాతదేవతలవైపే చూస్తూ ఉన్న కాలం మనమధ్య మొదలయ్యింది. ఏమిటి దీనికి పరిష్కారం? తిరిగి ఆ ప్రాచీన మతాలవైపు చూడటమేనా? మన పార్లమెంటు, మన విశ్వవిద్యాలయాలు, మన న్యాయస్థానాలు, మన పత్రికలు- ఒక సగటు పౌరుడికి అతడు కోరుకుంటున్న ఆహారభద్రతనీ, మానసిక భద్రతనీ ఇవ్వలేకపోతుంటే మనం ఏం చేయాలి?

మన సాహిత్యంలో, మన సినిమాల్లో ఈ సంఘర్షణ ఏమైనా చిత్రితమవుతూ ఉందా? మన రచయితలూ, మన దర్శకులూ మనల్ని ఉత్తేజపరచగలుగుతున్నారా? – దాదాపుగా ప్రతి రోజూ ఈ ప్రశ్నల మధ్యనే నాకు రోజు తెల్లవారుతుంది. ఏ ఒక్క పుస్తకమేనా, ప్రసంగమేనా, సినిమా, నాటకం, చివరికి ఒక్క సంపాదకీయమేనా నాకు లేశమేనా ధైర్యాన్నివ్వగలదా అని రోజంతా గాలిస్తుంటాను. ఆధునికజీవితం అభయప్రదమని నన్ను నమ్మించగలిగినవాళ్ళు ఒక్కరంటే ఒక్కరేనా ఉన్నారా అని ఆశగా వెతుక్కుంటూ ఉంటాను.

అటువంటి కవులు, కళాకారులు, మనుషులు, ప్రయత్నాలు, కలలు, మెలకువలు ఏవి కనిపించినా వాటిని రెండుచేతులా పైకెత్తి నలుగురికీ ఎలుగెత్తి చాటడం కోసమే నేను జీవిస్తూ ఉన్నాను.

అటువంటి చలనచిత్రం ఒకటి నిన్న అనుకోకుండా చూసాను. The Boy Who Harnessed The Wind (2019) ఒక యథార్థ గాథ ఆధారంగా వచ్చిన పుస్తకాన్ని తెరకెక్కించిన సినిమా. నేనింతకుముందు చెప్పానే ఆ మలావీ దేశానికి చెందిన మరీ ఇటీవలి కథ ఇది. ఆ కథలో ఒక మలావీ గ్రామానికి చెందిన ఒక తల్లి, తన పిల్లవాణ్ణి పాఠశాలనుంచి బహిష్కరించిన, హెడ్ మాష్టర్ దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతుంది:

‘మన గ్రామాల్లో వానలు పడకపోతే, కరువు చుట్టుముడితే పూర్వకాలం మనుషుల్లాగా దేవతలకి పూజలు చెయ్యకూడదనే నేనూ, నా భర్తా అనుకున్నాం. మీరు చెప్పినట్టే ఆధునిక విద్య కావాలని నా కూతురినీ, కొడుకునీ మీ స్కూలుకి పంపించాము. నా కూతురు మీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడితో లేచిపోయింది. మా బిడ్డ, చాలా తెలివైనవాడు, కాని ఫీజు కట్టలేదని వాణ్ణి మీరు స్కూల్లోంచి తీసేసారు. మా గ్రామాలకి తిండిగింజలు అందేలా చూడమని అడిగినందుకు మా తెగ పెద్దమనిషిని మీ ప్రభుత్వం చితకబాదింది. ఇప్పుడాయన చావు బతుకల మధ్య ఉన్నాడు. తిండిగింజలు లేక ఊళ్ళోవాళ్ళు మా ఇంట్లో పడి పట్టపగలే ఉన్నదంతా దోచుకుపోయారు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది-ఆ పాతదేవతల్ని మేము కొలిచినప్పుడు కనీసం మేమంతా కలిసి ఉండగలిగాం. ఒకరికొకరం తోడుగా ఉండగలిగాం, ఒకరినొకరం దోచుకోలేదు. కాని ఇప్పుడు మీ ఆధునిక వ్యవస్థల్లో మాకు మిగిలిందేమిటి? కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, గ్రామాలు విచ్ఛిన్నం కావడం, తెగలు విచ్ఛిన్నం కావడం. చెప్పండి, దీనికి పరిష్కారమేమిటి?’

చెప్పండి, దీనికి పరిష్కారమేమిటి?

ఆ హెడ్ మాష్టరు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, ‘చెప్పండి, నన్నేం చెయ్యమంటారు? నేనేవిధంగా మీకు సాయపడగలను?’అని అడుగుతాడు.

ఆశ్చర్యంగా, ఆ కుటుంబంలో పిల్లవాడు, ఆ చురుకైన పిల్లవాడు ‘నన్ను మీ స్కూలు లైబ్రరీ వాడుకోనివ్వండి’ అని అంటాడు.

అతను ఎందుకలా అడిగాడు? ఆ స్కూలు లైబ్రరీలో అడుగుపెట్టి, అతనేం చేసాడు? – ఇదంతా చెప్పాలంటే, ఆ కథమొత్తం చెప్పేసినట్టు అవుతుంది. అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. చూడండి. మీరు చూడండి, మీ పిల్లలకు చూపించండి. మీరు ఉపాధ్యాయులైతే మీ పాఠశాలలోనో, కళాశాలలోనో విద్యార్థులకి చూపించండి. మీరు రాజకీయాల్లో ఉన్నట్లయితే మీ పార్టీ కార్యకర్తలకు చూపించండి.

సమాజాలు సంక్షోభానికి లోనయినప్పుడు కొత్తదేవతలు ధైర్యాన్నివ్వలేనప్పుడు పాతదేవతలవైపు కాదు మనం చూడవలసింది- ఒక కొత్త వంగడం, ఒక కొత్త పరికరం, ఒక నూతన విద్యాప్రణాళిక, ఒక కొత్త కోర్సు, ఒక టీకా, ఒక వాటర్ షెడ్- మనం చూడవలసింది వాటి వైపు. వాటిల్లో ఏదో ఒకటి మనం ముందుకు నడవడానికి దారి చూపిస్తుంది. మనం పుస్తకాలు రాస్తే అటువంటి ప్రయత్నాల మీద రాయాలి. సినిమాలు తీస్తే అటువంటి జయగాథలమీద తియ్యాలి. అంతే తప్ప, కోట్లు ఖర్చుపెట్టి చరిత్ర తారుమారుచేసే సినిమాలు కాదు.

ఈ సినిమా చూస్తుంటే నాకు ఇలాంటి అనుభవాలు ఎన్నో గుర్తొచ్చాయి. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో, 1988 లో అనుకుంటాను, ఒక సాయంకాలం పార్వతీపురం ఐటిడి ఏ ఆఫీసులో ప్రాజెక్టు అధికారి ఛాంబరులో కూచుని ప్రాజెక్టు అధికారితో మాట్లాడుతున్నాను. అప్పటికి రాత్రి ఎనిమిదయ్యింది. గుమ్మలక్ష్మిపురంలో ఐ టి డి ఏ సివిల్ వర్క్స్ చూసే అసిస్టెంట్ ఇంజనీరు లోపలకి వచ్చాడు. ‘సార్, జరడలో నీళ్ళు పడ్డాయి సార్’ అన్నాడు. ఆ క్షణాన మా ప్రాజెక్టు అధికారి ముఖంలో వెల్లివిరిసిన సంతోషం ఇప్పటికీ నా కళ్ళముందు కదలాడుతోంది. ‘అయితే మనం మిఠాయిలు పంచి పెట్టుకోవాలి’ అన్నాడు ఆయన.

జరడ కురుపాం మండలంలోని ఒక కొండమీద గ్రామం. అక్కడ బోరువెయ్యడానికి రిగ్గుపోదు. ఎన్నో వందల ఏళ్ళుగా ఆ గిరిజనులు ఏటినీళ్లే తాగుతున్నారు. అక్కడ ఒక మంచినీటి బావి తవ్వించాలని ప్రాజెక్టు అధికారి అనుకున్నాడు. అది కూడా కాంట్రాక్టర్లని పెట్టి కాదు, గిరిజనుల్తోనే తవ్వించాలి అనుకున్నాడు. స్థానిక అధికారులు అది అసాధ్యం అన్నారు. ఆ కొండమీద మంచినీటి బావి తవ్వడం ఎండమావిలో నీటిని వెతుక్కోవడమే అన్నారు. కాని, గిరిజనులు బావి తవ్వారు, నీళ్ళు పడ్డాయి. ఆ రాత్రి ఆ ఇంజనీరు పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పింది, ఆ వార్తనే. భగీరథుడు గంగని పైనుంచి కిందకు దింపిన కథ మన పూర్వీకులు నమోదుచేసారు. కాని పాతాళంలోంచి గంగను పైకి రప్పించిన కథ రచయితల్లేక కాలగర్భంలో కలిసిపోయింది.

The Boy Who Harnessed the Wind లాంటి కథలు మన దేశంలో, మన సమాజంలో గ్రామగ్రామానా ఉన్నాయి. నగరాల్లో ఉన్నాయి, అడవుల్లో ఉన్నాయి, సముద్రతీరాల్లో ఉన్నాయి. నిశ్శబ్దంగా తమనీ, తమ కుటుంబాల్నీ, తమ గ్రామాల్నీ స్వావలంబన వైపు నడిపిస్తున్న ఉద్యమకారులు అడుగడుగునా ఉన్నారు. కావలసిందల్లా వాళ్ళని చూడగలిగే నేత్రాలూ, చిత్రించగలిగే చేతులూ మాత్రమే.

11-5-2023

22 Replies to “సినిమాలు తీస్తే అలా తియ్యాలి”

    1. అద్భుతం సార్… సినిమా చూస్తాను. ఇంత గొప్పగా పరిచయం చేసినందుకు 🙏🙏🙏

  1. చాలా మంచి చిత్రాన్ని అంతకు మించిన మీ మంచి మాటలతో మీ అనుభవం కూడా జోడించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.. ఆ ప్రాజెక్ట్ అధికారి మీ వెన్నెల రాత్రుల్లో మిశ్రా కారెక్టర్ ని గుర్తు చేశాడు. మీరు కరెక్ట్ గా చెప్పారు.. ఇటువంటి కథలు ఎక్కువమందికి తెలిసి ఇన్స్పైర్ అవ్వాలంటే అవి సినిమాలు గా తియ్యాలి.. అప్పుడే ఎక్కువమంది కి చేరుతుంది…

  2. కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
    సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.
    వాటిని చూసే కోణం భిన్నంగా ఉండాలి.
    సంక్షోభం నుంచే సంక్షేమం పుట్టుకు రావాలి.
    ఇందుకు కావలసింది సంకల్పం.

    సంప్రదాయపు కవిత్వ రీతులు, కథన పద్ధతులు ఇత్యాదులనుంచి కొంచెం పక్కకు జరిగి, మీరు పరామర్శ చేస్తున్న విషయాలు మేలుకొలిపేవి, జాగృత పరిచేవి.
    దీనిలో భాగం గానే కొండాపూర్ మ్యూజియం, అయిల సైదాచారి, ఇప్పుడు ఈ బాలుడి కథ.
    మేధకు పదును బెట్టి, హృదయపు మాధుర్యాన్ని జోడించి, మీరు అందచేస్తున్న సంగతులు రసమయంగా ఉంటున్నాయి.
    మిక్కిలి ధన్యవాదాలు అండి.

  3. మెలుకువ కలిగిన మనుషుల్ని వేదికి పట్టుకోవాలి సర్ .. చరిత్ర కి అర్థం మారిపోతున్న ఈ రోజుల్లో భౌతిక, సామజిక వ్యవస్థల్లో రావలసిన మార్పు కోసం కృషి చేసే కృషివరుల్ని తయారు చేసుకోవాలి నేటి సాహిత్య ప్రపంచం.
    సినిమా చూస్తాను సర్
    మంచి అందించారు thank you 🙏sir

  4. చాలా ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉన్నది ఈ వ్యాసం. Fb లో షేర్ చేసాను. ధన్యవాదాలు సర్!

      1. నూతన ఆవిష్కరణలకు చోటిచ్చేదే అసలైన స్వేచ్ఛ.ఆ స్వేచ్ఛను స్వాహా చేసే వ్యాపారాన్ని ఆపాల్సిందే.మీ శీర్షిక లోక కల్యాణం కోసం ఉపయోగపడే నిత్య ‘గీత’ం.
        నమస్కారములు మాష్టారు.

  5. గొప్ప సినిమా ఇది. మిగిలిన దేశాల సినిమాల్లో తమదైన జీవితాలనీ, జీవనపోరాటాల్ని చూపించే ప్రయత్నాలు విరివిగానే జరుగుతున్నాయి. మన దగ్గరే వాటిని ఆర్ట్ సినిమా అని పక్కన పెట్టేసిన దౌర్భాగ్యం.

    మీరు ‘ద చెల్లో షో’ చూసే వుంటారు, నాకు కాస్త ఆశ కలిగించిన సినిమా అది, సినిమా దర్శకుడు చెప్పుకున్న ఇన్స్పిరేషన్లు ఉన్నా.

  6. అద్భుతమైన విశ్లేషణ.. మీరన్నట్లు ఇలాంటి ఇతివృత్తాలతో సినిమా తీయడం మొదలుపెడితే ఎదోఒకరోజు ప్రజల ఆలోచన మారుతుంది..జీవన విధానం మలుపు తిరుగుతుంది. ధన్యవాదాలు సర్

  7. ఇలాంటి భావాలు ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రచారం చేసే ఒక సామాజిక సంస్థ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది.

  8. సినిమాను అద్భుతంగా పరిచయం చేసారు సర్.. పాతాళ భైరవి సినిమా గురించి మీ పరిచయం చదివాక, మీరు సినిమా చూసే విధానం గొప్పగా అనిపించింది.. ధన్యవాదాలు..
    నాదొక విన్నపం.. గతంలో కథలు రాయడం గురించి మీరు ఫేస్ బుక్ లో కొన్ని ఆర్టికల్స్ రాసి, వాటి పీడీఎఫ్ ఫైల్ కూడా పెట్టారు.. వీలైతే ఆ పోస్టులు మళ్లీ వెబ్ సైట్లో పోస్ట్ చేయగలరు..

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading