అరుదైన కవి

తెలుగు కవిత్వంలోకి 21 వ శతాబ్దాన్ని తీసుకువచ్చిన కవుల్లో అయిల సైదాచారి ముందువరసలో ఉంటాడు. నేను 2000 సంవత్సరంలో హైదరాబాదు కి నివాసం మార్చినప్పుడు సివి కృష్ణారావుగారు నిర్వహిస్తూ ఉండిన ‘నెల నెలా వెన్నెల’ సమావేశాలకి హాజరవుతూ ఉండేవాణ్ణి. కొత్తగా కవిత్వం రాయడం మొదలుపెట్టిన యువకవులు అక్కడ కనిపిస్తుండేవారు. వాళ్లు రాసే కవిత్వం నాకు చాలా కొత్తగా, సాంద్రంగా కనిపిస్తుండటమే కాక నాకు తెలియని ఒక సామాజిక దేశాన్నీ, ఒక ఆంతరంగిక దేశాన్నీ కూడా పరిచయం చేసింది. అటువంటి కవిత్వాన్ని కొత్తగా పరికిస్తున్న నేను అయిల సైదాచారి ‘ఆమె నా బొమ్మ’ (2000) సంపుటి చూసేటప్పటికి దిగ్భ్రాంతికి గురయ్యాను కూడా.

అప్పటికి తెలుగులో అజంతా, మోహన ప్రసాద్‌, త్రిపుర వంటి కవుల కవిత్వం నాకు తెలుసు. తక్కిన తెలుగు కవిత్వం బహిరంగ పోరాటాల వైపు నడుస్తూ, ఒక బయటి శత్రువుని వెతుక్కుంటూ ఉండగా ఈ కవులు అంతస్సంగ్రామం చేస్తూ వచ్చారు. వారు అన్నిటికన్నా ముందు తమతోనే తాము గొడవపడుతూ ఉన్నారు. నువ్వు బయటచూస్తున్న అన్యాయాలకీ, అసంబద్ధతలకీ మూలాలు నీలోనే ఉన్నాయేమో నిజాయితీగా వెతుక్కొమ్మని చెప్తూ వచ్చారు. వారికి ముందు పఠాభి, శిష్‌ట్లా, బెల్లంకొండ రామదాసు వంటి కవులు కూడా ఈ పనే చేసారు.

మహాప్రస్థానగీతాలకీ, మరోప్రస్థాన గీతాలకీ మధ్య కాలంలో శ్రీ శ్రీ చేసిన అనేక ప్రయోగాలు, రాసిన అనేక కవితలూ, వ్యాసాలూ తనతో తను తలపడటంలోంచి వచ్చినవే. ఇక మనిషి ఒకసారి అంతస్సంగ్రామ మొదలుపెడితే ఎక్కడిదాకా ఆ యుద్ధం కొనసాగించవచ్చునో బైరాగి కవిత్వం మొత్తం ఒక ఉదాహరణ.

కాని తొంభైల తర్వాత తెలుగు కవిత్వం, అంతదాకా అప్రధానీకరణకు గురైన వివిధ మానవసమూహాల ఐడెంటిటీలను ప్రకటించుకోవడం, తమ తమ అస్తిత్వాలను నొక్కి చెప్పుకోవడం మీద దృష్టి పెట్టడం మొదలయ్యాక, అంతస్సంగ్రామం మీద దృష్టి పెట్టే కవులు దాదాపుగా కనుమరుగయ్యారని చెప్పవచ్చు. మో లాంటి వాళ్ళు ఒకరూ ఇద్దరూ తప్ప దాదాపుగా అందరూ బయటి ప్రపంచంతో తలపడటమ్మీదనే తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తూ వచ్చారు.

కాని గొప్ప కవిత్వం, చలం గారు అన్నట్లుగా, తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా చేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావం. ఏకకాలంలో సామాజిక చైతన్యాన్ని కనపరుస్తూనే ఆంతరంగిక చైతన్యాన్ని కూడా ప్రస్ఫుటంగా ప్రకటించగలిగిన కవులే కవిత్వాన్ని మలుపు తిప్పగలుగుతారు. తదనంతర కవుల్ని ప్రభావితం చెయ్యగలుగుతారు. ఏకకాలంలో బయటా, లోపలా కూడా పోరాటం చేసే కవులు తక్కిన కవులు చూడలేని లోతుల్ని చూడగలుగుతారు. తక్కిన కవులు ఆవిష్కరించలేని సూక్ష్మప్రపంచాల్ని పట్టుకోగలుగుతారు. తక్కిన కవులు సమాజంతో పోరాడు తున్నప్పటికీ, సామాజిక వ్యాకరణాన్ని నిశ్శబ్దంగా అంగీకరిస్తూనే ఉండగా ఈ కవులు నిషిద్ధరేఖల్ని దాటి మంత్రనగరిలో దీపం పెట్టడానికి సాహసంగా ముందుకు నడుస్తారు.

తెలుగు కవిత్వం 21 వ శతాబ్దంలోకి ప్రవేశించాక అటువంటి నిర్భీతినీ, సాహసాన్నీ కనపరిచిన కవుల్లో సిద్ధార్థ, ఎం.ఎస్‌. నాయుడు, చిత్రకొండ గంగాధర్‌, దెంచనాల శ్రీనివాస్‌ వంటి వాళ్ళు ముందు వరసలో నిలబడతారు. వాళ్ళందరిలోనూ కూడా సైదాచారిది మరింత ప్రత్యేకమైన గళం. అతను వెతుక్కున్నది మామూలు భాషకి అర్థమయ్యేది కాదు. మామూలు ప్రాపంచిక కొలమానాలతో కొలవగలిగేదీ కాదు.

సైదాచారి రెండు సంపుటాలు వెలువరించాడు. మొదటిది, ‘ఆమె నా బొమ్మ’ (2000), రెండవది ‘నీలం మాయ’ (2009). ఇవి కాక తన బ్లాగులో 2011 నుంచి 2015 మధ్యకాలంలో రాసుకున్న మరొక 7 కవితలున్నాయి. ఈ మొత్తం కవిత్వం ఏ ప్రమాణాల ప్రకారం చూసినా అత్యంత సాంద్రమైందే కాకుండా సాహసోపేతమైంది కూడా. సాహసం ఎందుకంటే అటువంటి అన్వేషణని సమాజం అంత తొందరగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోగలిగినవాళ్ళు కూడా అంత త్వరగా దాన్ని అంగీకరించలేరు. ఆ కవిత్వాన్ని నిశితంగా చదివితే తప్ప ఆ కవి వెతుక్కుంటున్నది తన విముక్తి కోసమే మాత్రమే కాదనీ, అతని విముక్తిలో మనందరి విముక్తి కూడా ఉందనీ బోధపడదు.

పైపైన చదివినవారికి సైదాచారి ఒక స్త్రీదేహోన్మత్తుడిగా కనిపిస్తాడు. ‘ఆమె నా బొమ్మ’ లో ‘వడిసెలదిప్పే చెయ్యెవరిది’ అనే కవితలో ఈ వాక్యాలు చూడండి:

ధగద్ధగాయమానమైన ఒక స్త్రీమూర్తి కావాలి
మందుబెట్టి మలుపుకుందా అన్నంత
మోహంలో చుట్టెయ్యాలి
బొడ్డుపేగు పట్టున
వడిసెల రాయిలా తిరుగుతున్న నన్ను
అమాంతం అందుకొని అదుముకోవాలి

కాని అతని వెతుకులాట గురించి మనం పొరపడగలమని తెలుసుకాబట్టి, తాను వెతుక్కుంటున్న స్త్రీ ఎవరో మరొకచోట మనకి స్పష్టంగా చెప్పేస్తాడు కూడా. ‘నీలం మాయ’ లో ‘నిలుపరాని కామమాయె’ అనే కవితలో ఈ వాక్యాలు చూడండి:

స్త్రీ ఎట్లా కావాలంటే
నగ్న సౌందర్యాన్ని చిత్రించే చిత్రకారుడి ముందు నిలబడే
న్యూడ్‌ మోడల్‌ లా
నా పద్యం ముందు నిలబడాలి
అప్పుడే పుట్టిన పసికందుకు పాలిస్తున్న బాలింత తల్లిలా
నా శైశవం ముందు నిలబడాలి
అజ్ఞానంతో, వ్యసనంతో, అర్థాయుష్షుతో నేను చచ్చిపోతే
నన్ను గంగలో కలుపుతూ దీవించే
ఆకాశంలా నా ముందు నిలబడాలి.
అంతా అహంకారమే
నిజమే!
దాన్ని కూడా చల్లబరచే మనిషి కూడా స్త్రీయే కావాలి.

ఆ సంపుటంలోనే ‘స్త్రీలు’ అనే కవితలో స్పష్టంగా ఇలా అంటాడు కూడా:

స్త్రీ ఒక ప్రతీక
ఎంతకూ చేరలేని నిర్మానుష్య ద్వీపం

తనని వేధిస్తున్న, వెంటాడుతున్న, దీవిస్తున్న, లాలిస్తున్న ఆ స్త్రీ ఎవరో తెలుసుకుందామనే అతడు తన జీవితకాలమంతా వెతుకులాడుతూనే ఉన్నాడు. ఆమెని మనం ఎవరో ఒక స్త్రీ మాత్రమే అని అనుకుంటే, చలంగారు యోగ్యతాపత్రంలో రాసినట్టుగా, ‘సంధ్యకేసి చూస్తున్నాను’ అని అంటే ‘ఎవరు ఆమె’ అని అడిగినట్టే ఉంటుంది. అందుకే పరాగదుఃఖం అనే కవితలో ‘స్త్రీ అర్థమయేందుకు స్త్రీని ఆవాహన చేశాను’ అని చెప్తాడు.

ఆ స్త్రీని ప్రాణశక్తి అనీ, జీవశక్తి అనీ, లేదా తాంత్రికులు మాతృదేవతను నిర్వచించినట్టుగా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనీ చెప్పవచ్చు. కాని అలా మనం ఆ కవిత్వ సారాంశాన్ని చెప్పేసినంతమాత్రాన ఆ కవిత్వం తన తాజాదనం పోగొట్టుకోకపోవడం సైదాచారి లోని అద్భుతం.

యూరోప్‌లో ఒకప్పుడు రూబెన్స్‌ అనే చిత్రకారుడు ఉండేవాడు. అతడు స్త్రీల ముఖచిత్రాల్ని చిత్రిస్తున్నప్పుడు ఆ లావణ్యం, ఆ యవ్వనం, ఆ తాజాదనం ఎంత సహజంగా ఉండేవంటే, దాన్ని వర్ణించడానికి మాటలు రాక, కళాప్రశంసకులు, అతడు తన రంగుల్లో ఇంత నెత్తురు కూడా కలుపుతున్నాడా అని ఆశ్చర్యం ప్రకటించారు. మానవదేహాల్లో పొంగులెత్తే ఇంత వేడినెత్తురు కూడా తన అక్షరాల్లో కలిపి సైదాచారి కవిత్వం రాసాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ వాక్యాలు చూడండి:

నన్ను పాలిస్తున్నావా పాలుగుడుపుతున్నావా
నరనరానా నువ్వే నా జీవద్రవాల ఆల్కహాలికా
నా క్షుద్రగమనాల వెంటాడే కాపాలికా
నీ వేలస్తనాల క్షీరస్రావాల్ని చూశాను
అదృశ్యయోనులు విప్పారడం చూసాను
నీ గర్భాలు ఫలించి నా పునః పునః జన్మల్ని చూశాను
(ఉపాసన)

నా కలను దాచిన చూరగొన్న దోచిన లోకం మీదికి
కలలున్నాయని, కలలుగన్నామని
నిర్భయంగా పలుకలేని దుర్బల లోకం లోనికి, నడచి
స్నేహమవ్వలేకా
సౌందర్యాన్నీ, అనంతానందాన్నీ నమ్మించలేకా
మహాజీవితానుభవాన్ని వొంపలేకా-
దుఃఖమూ సుఖమూ కరుణా నశించిన
విశ్వాంతరాళంలో ఒకానొక నిర్గుణ, నిరింద్రియ
సూక్ష్మ ప్రాణినై
(అంతిమ ద్వారం)

ఆత్మా, మనస్సూ లాంటి మర్మాంగాల్ని -యిట్లే కాపాడుకోవాలి (నిరింద్రియం)

సైదాచారి బహుశా పూర్వజన్మలో మాతృదేవతారాధన చేసిన తంత్రయోగి అయి ఉంటాడని అనుకుంటాను. ఎందుకంటే, అతనికి సామాజిక స్పర్శతో కలుషితం కాని మానవ అంతరంగం తెలుసును. లేకపోతే, ఇలాంటి మాట అనగలగడం సాధ్యమా?

దుఃఖ రహస్యం రహస్యంగానే ఉండనీ అన్నీ ఎంగిలి గానీ- ఒక్క దుఃఖం తప్ప ( ఎంగిలి)

అందుకనే అతని కవిత్వాన్ని మనం ఎక్కడ దర్శించాలో, ఎక్కడ కలుసుకోవాలో కూడా అతడిలా చెప్తున్నాడు:

తాను స్వరమూర్ఛనలో భీం సేన్‌ జోషి
కళ్ళుమూసుకొని దేన్ని చూస్తున్నాడో
అదే జారిపోతుంది నాలోంచి
తుది వాక్యాంతంలో నా కవిసమయాన

మనిషి పుట్టుకకోసం
ఏ శక్తి తపనయై, గర్భమై
దేనికై ప్రసవవేదనా, ప్రసూతి ఆనందమూ అయినదో
అదే జారిపోతుంది నా తుదివాక్యాన

అక్షరాల్ని కలగంటున్నప్పుడు కనబడుతుంది
వేయి పాలిండ్లతో పాలుగుడుపుతుంది
పుట్టుక మొదలు పోయేదాకా
దాని వొళ్ళోనే వుయ్యాలలూపుతుంది
(ఒక అఖండ సృజనలో కొన్ని క్షణాలు)

నిజానికి కవిత్వం ఒక మనఃస్థితి. ఒక సత్యస్థితి. దాన్ని అనుభవించాలే తప్ప మాటల్లోకి తేలేము. అది తనే చెప్పుకున్నట్టుగా ‘కవుల, వాగ్గేయకారుల, భక్తుల దుఃఖాల మీంచి, కన్నీటి మీంచి తడి అంటకుండా’ తనదాకా నడిచి ‘వెన్నాడుతున్నది దయలేకుండా’. కాబట్టే ‘నిరింద్రియం’ కవితలో ఇలా కూడా అన్నాడు:

కవిత్వోపాసనా, సౌందర్యశోధనా జీవితం
కవిత్వీకరించడం, స్ఖలించడం రెండూ మృత్యువు

సైదాచారి ఒక సంచారి, ఒక యోగి, ఒక సిద్ధుడు, ఒక సాధ్యుడు. తక్కిన ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం గురించి ఆలోచిస్తుంటే అతడు ‘ఆత్మమాంద్యం’ గురించి చింతిస్తూ గడిపాడు. తక్కిన కవులు మట్టినీ, మనుషుల్నీ విడుదల చేయడానికి పోరాటం చేస్తుంటే, అతడు అన్నిటికన్నా ముందు మనసును విడుదల చేయడమెలాగు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ‘మహాముద్ర’ కవితలో ఇలా అంటాడు:

మట్టి-మృత్యువు-కవి
ఒకటే రూపం, అనేక ప్రతిబింబాలు

తెలుగు కవి చాలా చిత్రమైనవాడు. అతడు ఒకవైపు సొంత ఆస్తి కూడబెట్టుకుంటూ, ప్రాపంచికంగా ఏ ఒక్క సుఖాన్నీ, సౌకర్యాన్నీ వదులుకోకుండా జీవిస్తూ, మరొకవైపు తన సమాజాన్ని విడుదల చెయ్యాలనీ, రాజ్యహింస అంతమవ్వాలనీ బిగ్గరగా ఎలుగెత్తి పాటలు పాడుతుంటాడు. కాని ఒక బైరాగికి, ఒక సైదాచారికి తెలుసు, ముందు నువ్వు నీ possessions (భౌతికమైనవీ, మానసికమైనవీ కూడా) ని వదులుకోకుండా, మరొకడి ఆస్తిహక్కుని ప్రశ్నించలేవని. సైదాచారిలోని ఈ మెలకువ, ఈ నిజాయితీ అతని వాక్యాల్ని అత్యంత శక్తిమంతంగా మారుస్తున్నది. ‘ఒక సంచార తల్లి కోరిక’ కవితలో వాక్యం చూడండి:

కూడబెట్టుకోను కనుక గెలుస్తున్నాను

మనకు తెలిసిన మన సమకాలిక తెలుగు కవులు ఒక్కరన్నా ఇటువంటి వాక్యం పలకగలరా?

అసలు ఈ దృష్టితో ‘మహాముద్ర’ కవిత మొత్తం మరొకసారి చదివిచూడండి. ఈ వాక్యాలు-

సొంత ఊరు లేదు, ఇల్లు లేదు, మనుషుల్లేరు
తలమీద ఆకలికడుపును మూటగట్టుకుని దేశాల్దిరిగాను
ఈదులూరూ, పెంబర్తీ, చండూరూ, కురంపల్లీ-
ఉండనింక మీ ఇత్తడి చెంబుల మీది శకణాల్లో
పంచలోహ విగ్రహాల్లో, లోహరహస్యాల తాంత్రిక విద్యల్లో-

అడ్రసున్నందుకే దుఃఖిస్తున్నాను తల్లీ
నాకు నీ సంచార జీవితమే కావాలి-
నీ సంసార జీవితమొద్దు-

మనమట్లా ఏ ఇరానీ హోటల్‌ కో
బాదెలేర్‌ నో , బుకోవ్‌ స్కీనో
డౌన్‌ లోడ్‌ చేసుకోడానికి నెట్‌ కో వెళ్తాము
కుటుంబాల, కుటుంబీకుల
ఊహల్ని దాటిన జీవితాన్ని
మొదలుపెట్టి ఎన్నాళ్ళో అయింది
– (మనం కలవాలి)

మనిషి జీవిస్తే ఇలా జీవించాలి అని తెలిసినవాడు కాబట్టే, ఈ మాటలు ఇంత స్పష్టంగా చెప్పగలిగాడు:

కుటుంబాలు లేని
స్వంత ఆస్తులు లేని
రాజ్యాలు లేని
అధికారాలు లేని
ప్రాకృతిక ఆత్మల్ని కను
(ఉపాసన)

అదేహ మానవుడినై
మాయమైన దేవుడినై
గుండ్రని కలలో, శూన్యపు ఇలలో
(మహావృత్తం)

‘ముప్పై ఏండ్ల పొడవైన అవిచ్ఛిన్న ప్రశ్నకింద నలిగిన ఆత్మ’ తీవ్రాతితీవ్రమైన ఆత్మసంఘర్షణ తర్వాత చివరికి తెలుసుకున్న సత్యమేమంటే

ప్రేమించటమొక ఆది కళ
ఏమరుపాటూ, ద్వేషమూ ప్రమత్తతా వాటి ముక్తీ-ఒక యోగం
(తల్లివేరు)

సైదాచారిలాంటి కవులు వీథికొకరో, నగరానికొకరో కనిపించే కవులు కారు. ప్రతి పదేళ్ళకూ కవిత్వంలో విప్లవాలు తెచ్చే తరహా కవులు కూడా కారు. సైదాచారి లాంటి కవులు ఎప్పుడో గాని కనబడరు. అతడి కవితలు విన్న సమాజం ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, అతనేదో తన గొణుగుడు తాను గొణుక్కుంటున్నాడులే అని మళ్ళా నిద్రలోకి జారుకుంటుంది. కాని ఎప్పుడో ఒక సారి లేచి అతడి కవిత్వాన్ని శ్రద్ధగా చదువుకుంటే, అతడెప్పుడో మేల్కొన్నాడనీ, మనమే ఇంకా నిద్రపోతున్నామనీ తట్టగానే మనమీద మనకే చెప్పలేనంత జాలి పుట్టుకొస్తుంది.

Featured photo: Erotic maithuna (‘sexual union’) sculpture. Sandstone, Maharashtra, India. 11th century, PC: British Museum

9-5-2023

8 Replies to “అరుదైన కవి”

  1. గొప్ప కవిత్వం, చలం గారు అన్నట్లుగా, తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా చేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావం.

    స్త్రీ ఒక ప్రతీక
    ఎంతకూ చేరలేని నిర్మానుష్య దీపం
    ద్వీపమూ కావచ్చు .

    కూడబెట్టుకోను కనుక గెలుస్తున్నాను -నచ్చిన వాక్యం

    అప్పట్లో అజంతా ‘స్వప్నలిపి’, మో ‘చితి చింత’,ఇటీవల సిద్ధార్థ ‘బొమ్మలబాయి’
    సంక్లిష్ట కవిత్వంగా అవి అర్థం కావాలంటే బాగా అధ్యయనం ,ఆత్మ విశ్లేషణ అవసరమని పెద్దల మాటగా విన్నాను.ఇప్పుడు మీ అయిల సైదాచారి కవిత్వాన్ని వింగడింపు చేయడం చూస్తే ,ఇలాంటి కవిత్వాన్ని వివరించినా చెప్పే మీలాంటి భాష్యకవులు కావాలి. చలం చెప్పిన గొప్ప కవిత్వ నిర్వచనం మీ వంటి వారి ఆలోచచనాదీపకాంతిలో
    చూచే అవకాశం తో సార్థకమౌతుంది. నవ్యత నాణ్యత తెలిసిన మీ కవితాసారమతికి నమస్సుమాంజలి.

    1. నీ వంటి సహృదయులు స్వాగతించే కవిత్వం అతనిది అని మీ స్పందన రుజువు చేస్తున్నది.

  2. గొప్ప కవి. మీరన్నట్లు అరుదైన కవి. అనంతపురం లో కొన్నాళ్ళు ఆ కవి మాటలతో గడిపిన కాలం గుర్తొస్తుంది. మంచి విశ్లేషణ సైదాచారి అంతర్లోక కవిత్వం మీద. ధన్యవాదాలు మీకు

  3. ఒక అతిశయ లావణ్యాన్ని అనేక కోణాల్లో మార్మికంగా చిత్రించిన
    క్యూబిక్ ఆర్ట్ లాగా ఉన్న సైదా చారి గారి కవిత్వాన్ని ఎగ్జిబిట్ చేసిన మీ వ్యాసం అద్భుతంగా ఉంది

Leave a Reply to తుమ్మూరిCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading