మూడు ఉత్తరాలు

Reading Time: 6 minutes

ఇటువంటి ఉత్తరాలు నేను చలంగారికో, బుచ్చిబాబుకో రాసి ఉండవాణ్ణేమో. కానీ నేనే ఇటువంటి లేఖలు అందుకోగలని ఎన్నడూ అనుకోలేదు. నా కథల పుస్తకం వెలువడిన తర్వాత మిత్రులనుంచి వస్తున్న స్పందనలు నన్ను చాలా ఉత్తేజితుణ్ణి చేస్తున్నాయి. వాటిలో ఈ ఉత్తరాలు మరీ ప్రత్యేకంగా భావిస్తున్నాను. వీటిలో మొదటి రెండు ఉత్తరాలు ఒక మిత్రుడు రాసినవి, మూడవది ఒక మిత్రురాలు రాసినది. ఇటువంటి స్పందనలు చదివినప్పుడు టాల్ స్టాయి మాటలే గుర్తొస్తాయి. తాను రాసిన అనా కరెనినా నవల మీద తర్వాత కాలంలో వచ్చిన స్పందనల్ని చూసి ‘ఈ రచనని ఇంత శ్రద్ధగా చదువుతారని తెలిస్తే, మరింత శ్రద్ధగా రాసి ఉండేవాణ్ణి ‘ అని. ఇటువంటి ఉత్తరాలు చూసినప్పుడు, ఈ కథలు తమ పాఠకుల్ని ఇలా వెతుక్కోగలవని తెలిసి ఉంటే, మరెన్నో కథలు రాసి ఉండేవాణ్ణి కదా అని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.


1

వయసు బాగా మీదపడ్డాక, ఏ కాస్త ఆనందం వచ్చినా… మాట తడబడి, గొంతు బొంగురుపోయి, కన్నీళ్లు చిప్పిల్లే స్థితి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు అలాంటిది అనుభవమైంది. ‘వెయ్యేనుగుల ఊరేగింపు’ కథ చదివి, చివర్న ఉన్న ‘నన్నంతా ప్రేమతో ఆండాళ్ అని పిలుస్తారు’ అన్న వాక్యాన్ని పైకే అన్నప్పుడు నేను అలాంటి స్థితికి లోనయ్యాను. గొంతు వణికి, కళ్ళల్లో నీరు కుక్కుకున్నాను. ఓ గొప్ప కళని దర్శించినప్పుడు ఏర్పడే మనఃస్థితి ఇది. 

కథ మొదలుపెట్టినప్పటి నుంచి ముగించే దాకా… ఆ కవిత్వం-లో ఓలలాడాను. ఎలాంటి కవిత్వం అది? నా ప్రమేయం ఏదీ లేకుండా చిన్నప్పటి నుంచి చెవిన పడిన తమిళ కవిత్వం. ఇంత కాలం ఈ పదాలన్ని కేవలం మాటలుగానే, నాకు అర్థంకాని అర్థమైనా ఆస్వాదించలేని వాక్యాలుగానే నాలో ఉండిపోయాయి. లేదా గంభీరమైన మంత్రాలుగా మిగిలిపోయాయి. కర్ణాటక శాస్త్రీయ సంగీతం రథమెక్కి నన్ను భయపెట్టాయి. లేదా కేవలం సినిమా పాటలుగా మాత్రమే నాకు వినిపిస్తూ వచ్చాయి. కానీ, ఇవాళ..

ఇవాళ… ఈ కథ చదివాకే ఆ వాక్యాలు కవితలయ్యాయి నాలో! అతిశయోక్తులకి పోవట్లేదు… నమ్మండి. ఒక్క కథలో ‘పావై నోము’తో పాటు… నమ్మాళ్వారు కవితా సారాంశాన్ని చక్కగా ఒదిగించారు. దానికీ, ఆండాళ్-లో వికసిస్తున్న యవ్వనానికి ముడిపెట్టడం చక్కటి కథా నేర్పు. అంతకన్నా… ఆ పెరియాళ్వార్ కవితలు.. ఆహా! పెరియాళ్వాయారు స్వామిని బిడ్డగానే లాలించాడని జయమోహన్ రాయగా చదివాను. ఆ పాశురాల్లో ‘ఒక్కలై ఏరి ఉలగలందోన్’ అన్న మాటని ప్రస్తావిస్తారు ఆయన. అంటే, తల్లి చంకనెక్కి విశ్వాన్ని కొలిచినవాడు అని అర్థం అట!(ఒక్కలై = నడుము, ఏరి= ఎక్కి, ఉలగు= విశ్వం. అలందోన్= కొలత వేసినవాడు). ఎంత గొప్ప పదమో అనిపించింది అది చదివినపుడు. ఆ పదం… కవిత సందర్భం ఏమిటో ఇవాళ ఈ కథలో చూశాను. బహుశా పెరియాళ్వార్ చిన్ని కృష్ణుణ్ణి తన చంకనేసుకుని గోరుముద్దలు తినిపిస్తూ… ఈ మాట అని ఉండొచ్చు! 

చివర్లో ‘వారణం ఆయిరం…’ పాశురాన్ని అనువదించిన విధానం బావుంది. ‘సెమ్మై ఉడయ తిరుక్కయ్యాల్ ‘ అన్న మాటకి తమిళ వ్యాఖ్యానాల్లో కూడా ‘ఎర్రటి చేయి’ అనే ఉంది! నల్లనయ్యకి ఎర్రటి చేయేమిటీ… గోరింటాకు పెట్టుకున్నాడు అనా?! కావొచ్చు. దానికన్నా మీ అనువాదం ‘ఎర్రతామరలవంటి తన చేతులతో…’ అనడం కవితాత్మకం. ఓ మంచి కథ అంటే… గొప్ప అనుభవం అని… ఓ పారవశ్యం అని ఈ కథ నాకు తెలియచేసింది. ధన్యవాదాలు.

11-4-2023

2

సార్, మీ కథలు చదవడం పూర్తయ్యింది. మీ షష్టిపూర్తిన పుస్తకం అందుకున్నప్పుడే రోజుకు రెండు కథలు చదవాలని అనుకున్నాను. ఆ నిర్ణయాన్ని నిష్టగా పాటించి ఉంటె ఏప్రిల్ 13కే పూర్తయి ఉండేది. అలా కాలేదు. పది రోజులు ఎక్కువపట్టింది. ఇది రాయడానికి… ఇంకో వారం తీసుకున్నాను. రాయడంలో వేగం ఎలా వస్తుందో అర్థం కావడం లేదు నాకు. చాలా పెద్దగానే రాశాను. మీ సమయాన్ని తింటున్నందుకు క్షమించండి. 

ఈ సంపుటిలోని చివరి కథా, మీ ధన్యవాద సమర్పణా చదివాక… నాకు బెంగేసింది. రేపట్నుంచి కథకుడు భద్రుణ్ణి వినలేము కదా అనిపించింది. నిజం… మీ ప్రతి కథా మీ మాటల్లాగే వినిపిస్తాయి నాకు. ప్రతి వాక్యంతోనూ కాకపోవచ్చు కానీ… ఎక్కడోచోటా మీ గొంతుక స్పష్టంగా వినిపిస్తుంది. ఆ గళం రేపటి నుంచి వినలేము కదా అన్న బెంగ కలిగింది. నా రాత్రుళ్ళని… ఏ విద్యుద్దీపాలకన్నా మెరుగ్గా వెలిగించింది కథకుడిగా మీ కంఠం. అందుకే మొన్ననే పుస్తకాన్ని పూర్తిచేసినా… ఆ పుస్తకాన్ని షెల్ఫ్ లో పెట్టలేకపోయాను. పుస్తకాన్ని ప్రేమగా దగ్గరకి తీసుకుని ‘రెండు ప్రపంచాలు’ కథని మళ్ళీ చదివాను. మొదటిసారి చదివినప్పుడు ఓ కవితలాగే నా మనసులో రిజిస్టర్ అయ్యిందీ కథ. రెండో సారి చదివాక… ఓ గొప్ప సంగీతం విన్నాక మనసులో మిగేలే విషాదంతో కూడిన ఆనందాన్ని మిగిల్చింది. అప్పటిదాకా ఈ సంపుటిలోని గొప్ప కథ ‘ప్రశ్నభూమి’ అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అడిగితే ‘రెండు ప్రపంచాలు’ అని చెబుతాను. ప్రశ్నభూమిలో క్రాఫ్ట్ ఉంది. ఓ గొప్పస్క్రీన్ ప్లే ఉంది. ఆ క్రాఫ్ట్ కింద ఉన్న ప్రశ్న, చారిత్రక దృష్టికి ఓ అబ్బురపాటుకి గురయ్యాను. ‘రెండు ప్రపంచాల్లో’ అది లేదు. దాన్ని మించిన ఇంకేదో ఉందనిపించింది… నా రెండోసారి పఠనం-లో. 

మీ జీవితంలోని ‘వర్షాలని’ చెప్పుకుంటూ పోయిన కథ. ప్రతి పారాలోనూ… భిన్న స్థలాల్లో కాలాల్లో కురిసిన వర్షాన్ని నాలోనూ కురిపించారు. మీరు ఇంటి గడపని దాటి… ఆ రెండో ప్రపంచంలోకి అడుగిడిన క్షణంతో మొదలై రెండింటి మధ్య మీరు పడుతున్న పెనుగులాటని గుర్తించిన క్షణాలు అపూర్వమైనవి. మీరు చెప్పాక కాలనీ… నాలోనూ అది ఉందని, గడపదాటిన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని గుర్తించాను. మరి అమ్మ ఇచ్చిన ఆ మంత్రమేమిటీ? ఏమై ఉంటుంది? 

మొదటి భాగంలోని ‘శరణార్థి’, ‘సశేషప్రశ్న’, ‘ఆకాశం’ యవ్వనంలోని వ్యాకూలతలని చెప్పేవే. మామూలు కథకులైతే వీటిని యవ్వనారంభంలోని మధురస్మృతులుగా మాత్రమే నెమరు వేసుకునేవాడు. మీరలాకాదు… వాటిని ఓ పెద్ద తాత్విక భూమిక మధ్య పెట్టి జవాబులేని ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘శరణార్థి’ కథలోని కథకుడు… ఓ మామూలు పుస్తకాల పురుగు. ప్రపంచాన్ని ఎదుర్కొనే కనీస పరిపక్వత లేనివాడు. తండ్రి మహానుభావుడు. భర్త పిచ్చివాడు. ఇలా కాకుండా ఓ మామూలు జీవిక ఇవ్వగల మనిషి దక్కినా… తన జీవితం సాఫీగా సాగేదని అంటుంది సముద్రం. ఈ పశ్చాత్తాపాలు చలం వంటివాళ్ళు డీల్ చేసిందే కానీ… ఆ చివర ముగింపు… మీది. ఆ బంధం అలా కొనసాగడం… నైతికంగా ఎన్నో ప్రశ్నలు వేయిస్తుంది. బహుశా ఆ ప్రశ్నలు మిగల్చడమే మీ లక్ష్యం అనిపిస్తోంది. అదే దీన్ని మీ కథగా నిలుపుతోంది. ‘సశేష ప్రశ్న’ కూడా అదే. కథానాయకుణ్ణి ముందడుగు వేయనీయకుండా ఆపేది ఏమిటీ? అది ఒట్టి నైతికతకు సంబందించిన ప్రశ్న కాదు. ఇంతకన్నా గొప్ప అర్హతలున్న, యవ్వనంలో ఉన్న ఓ పడతి దొరుకుతుందన్న అత్యాశ. ఆ కోరికని మనసులో తొక్కిపెట్టి ఈమెని పెళ్లాడితే… భవిష్యత్తులోనూ ఆ ప్రశ్న వస్తుందన్న భయం. ఆ స్వార్ధాన్ని వలువలు చింపిమరీ చూపిన కథ ఇది. 

‘ట్రాఫిక్’ కూడా అదే ప్రశ్నలే. వార్డెన్-కి పిల్లలు లేరన్న విషయం అందరికీ తెలిసిందే కానీ అది అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? వాళ్లకి తెలియకుండానే… వాళ్ళ మనసు భద్రం అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుకుందా? అదే కీలకమైన క్షణాన నిజాల్ని తొక్కిపెట్టిందా? పరస్పరం కరవైన అవగాహనా రాహిత్యమే ఇందుకు కారణమని ఎలా చెబుతాం. అంతకన్నా బయటకు చెప్పలేని, తెలియనిదేదో ఉంది. మరి రోడ్డు ప్రమాదాలూ అంతేనా? క్షణంలో ఏమరుపాటు మాత్రమే ఈ ప్రమాదాలకు కారణం కాదా? మృత్యును దగ్గరగా చూడాలనో, ఓ సాహసం చేయాలనో లోలోపల కాంక్ష ఏదో ఉంటుందా? 

‘మంచుతెరలు’… సాధారణంగా చూస్తే ఓ కుటుంబంలోని చిన్న అనుభవం. అప్పుడప్పుడే కథలు రాసేవాళ్ళు… ఆ అనుభవానికి ఎంతో ఆర్ద్రతనీ, కన్నీళ్ళనీ జోడించి వదిలేసి ఉంటారు. కానీ… మీరు ఆ అనుభవాన్ని ఇంకో పెద్ద కాన్వాస్-లో పెట్టారు. అసలు సమాజాల మధ్య సంఘర్షణలు ఎందుకు వస్తాయి? అన్న నేటి ఆధునిక మానవుడి ప్రశ్న ఆ కుర్రాడు వేసింది. దానికి మీరు ఇచ్చిన సమాధానం… భారతీయమైంది. ఈ సమాజం ఎన్నో తరాలుగా పుల్లా పుడక ముక్కున పట్టి కట్టుకున్నది. ఎన్నో తుపానుల మధ్య పదిలంగా అట్టిపెట్టుకున్నది. ఇందులోని పాత్రధారులకీ తెలియకపోవచ్చు వదినమ్మ చంటి అన్నయ్యని అనునయించడం వెనక… ఈ నేల నేర్పిన సహిష్ణుత ఉందని. అహం కన్నా ఆత్మీయత గొప్పదన్న జ్ఞానం దాగుందని. ఓ కుటుంబాన్ని యూనిట్-గా చేసుకుని ప్రపంచం ఎదుర్కొనే సమస్యలకు… (ఇది పరిష్కారం కాదు అంటూనే) ఇలాంటిదేదో పరిష్కారం కావొచ్చు అని చెబుతోంది. (అన్నట్టు, ఆ చంటన్నయ్య మీరేనా? అంత ఆవేశంతో ఉండేవారా? నమ్మలేకపోతున్నా!). ఈ సంపుటిలోని బయోగ్రాఫికల్ స్కెచ్-లాంటి కథల్లో ‘గోధూళి’ ఒకటి. పురుషోత్తమ చయనులు గారు ఎవరు? ఇందులోనూ… ఓ సనాతన కఠోర ఆచార హృదయం ఎదుర్కొనే సంఘర్షణ ఉంది. నియమ నిష్టలతో పండిన హృదయం ఒకటి… తొలిసారి ఎదుర్కొనే ఆకర్షణ(బహుశా ప్రపంచ స్పృహ) తాలూకు ఘర్షణ అద్భుతంగా చిత్రితమైంది. 

అత్యాచారం… ఒక్క స్త్రీకి మాత్రమే జరిగినట్టు అనిపించినా నిజానికి అది మన సమాజాం మీద జరిగిన దాడి కదా! మరి సమాజం దాన్ని అలా ఎందుకు చూడదు? అది ఆ బాధితురాలి సమస్యగానే చూసి ఆమెపైన జాలిపడటమో, ఆమె ‘సాధికారతకి’ కృషి చేయడమో, ఆమెని మామూలు మనిషిని చేయాలని చూడటం… ఎంత అసంగతం! ఇవన్నీ చేయకూడదని కాదు… దాన్ని మించిన ఓ స్పందనని ఆశించే కథ అది. నిజానికి సమాజం దీన్ని ఆరకంగా చూస్తే- తనపైన జరిగిన దాడిగా భావిస్తే, తానెంతో అపురూపంగా చూసుకునే సభ్యురాలిపైనా చోటుచేసుకున్న అమానుషంగా చూస్తే… పైవన్నీ చేయాల్సిన పనిలేదు. అలా చేయనందువల్లే ‘సుజాత’ చూసే ప్రతి ఒక్కరిలోనూ ఓ హిపోక్రసీ కనిపిస్తోంది. అలా చూడగలిగితే తల్లిదండ్రులు- రెండో కూతురి పెళ్ళిచూపులప్పుడు ఇంటికి రావొద్దని అన్యాపదేశంగా చెప్పరు. ఈమె ప్రేమించిన వ్యక్తి అంటీముట్టనట్టు ప్రవర్తించడు. ఈమె కోసం ఉద్యమించినవాళ్లు- ఆ కాక తగ్గిన తర్వాత, తమ రాజకీయంలో పడరు. 

‘అమృతం’… నిజంగానే తియ్యటి కథ. ఓ కవి రాసిన చక్కటి ప్రేమ కథ. ముఖ్యంగా – ఈ ప్రేమకి ఆ మాస్టారు ఇచ్చే ఆశీస్సు ఓ అపూర్వం. ఆ పాత్రకి స్ఫూర్తి ఎవరో… ఆయన వాత్సల్యం పొందిన వాళ్ళు ధన్యులు, ఇందులోని కథానాయకుడిలా! ప్రాపంచిక జీవితాన్ని కాదనుకుని కళల్ని, కలల్ని ప్రేమించేవాళ్ళు దేవుళ్ళు. సాష్టాంగ నమస్సులు అర్పించ దగ్గవాళ్ళు. 

‘1878’… నేను మీ దగ్గర నుంచి ఆశించే కథ. వీరేశలింగం పంతులుగారిని… ఆ సంఘర్షణని… ఓ యుగపురుషుడిగా ఆయన అవతరించడానికి ముందటి ఆ సంఘటనని అద్భుతంగా చిత్రించారు. జయమోహన్ గారికి కన్యాకుమారి-పాత తిరువాన్కూరు లోని ‘వేనాడు’ ఎలాగో మీకు రాజమండ్రి అలాగ అనిపిస్తోంది! దాని చరిత్రనీ, సంస్కృతినీ, భాషనీ ఇంకెవరికీ సాధ్యం కానీ రీతిలో మీరు మాత్రమే చెప్పగలరు అనిపిస్తోంది. 1878 కథలాంటి ఓ తీవ్రమైన సాంద్రమైన నవలని మీ నుంచి ఆశించడంలో తప్పేంటి? 

‘అపరాహ్ణ రాగం’… ఎందుకో తలచుకుంటే గుండెలో ఏదో సుగంధము ఆవరిస్తుంది. సంగీత గారిది ఎంత గొప్ప ఈస్తెటిక్స్. ఎంత చక్కటి వ్యక్తిత్వం. వేకువ ఎండలో ఓ పరిమళం ఉంది ఆమెలో… ఎండకి పరిమళం ఏమిటి? ఎందుకో నాకు ఉంటుందనిపిస్తోంది. ఈ కథలో కావాలనే చాలా చాలా సన్నగా- కనిపించే కనిపించకుండా శారీరక ఆకర్షణని స్పృశించారా? పాఠకులు అలా అనుకోవడం తప్పే కావొచ్చు. నీచం అని కూడా అనిపించొచ్చు. కానీ, సగటు పాఠకుడు అలా దారి తప్పేలా ఇందులో ఓ ట్రాప్ ఉందనే తోస్తోంది. పూర్తి లైంగిక ఆకర్షణ కాకపోయినా… ఆమె ‘వాత్సల్యం’లో చాలా తక్కువ శాతంలో ఇది కలగలిసి ఉందా? 

 ‘వెయ్యేనుగుల ఊరేగింపు’ ఓ మోడరన్ క్లాసికల్. ఓ కవి మాత్రమే రాయగల అద్భుతమైన కథ. 

‘చివరి మనిషి’ అన్నింటినీ వదులుకుంటున్న తరానికి ఓ మేల్కొలుపు. లేదా… ఓ అభ్యర్థన. మన కళలు, సంస్కృతి, తత్వ శాస్త్రం… ఏదైనా సరే ఆ తీవ్రత ఉన్నవాళ్లు అంతరించి పోతున్నారు అని చెబుతోంది కథ. వాళ్ళు ఒంటరులవుతున్నారు అని ఘోషిస్తోంది. 

‘బయ్యన్న’… (ప్రధాన స్రవంతి) మతం దేవుణ్ణి ఎంత సంక్లిష్టానంగా మార్చిందో చెబుతుంది. మతం మాత్రమేనా… మనం కూడా దూరమైయామేమో. మనం ఆ గిరిజన గూడెంలో జీవితాన్ని గడిపినా సరే… బయ్యన్న మన దరికి వస్తాడా ఏమిటీ? రాడనే అనిపిస్తోంది. 

‘అవినిమయం’లో తనని ఆదరించిన ప్రొఫెసర్ కూడా చేతులకి గ్లోవ్స్ వేసుకుంటాడని కథకుడు తెలుసుకునే క్షణం… చాలా విషాదకరం. నిరాశాజనకం. ఇందులోని కథకుణ్ణి తిట్టిన వాడికి, ఈ ప్రొఫెసర్-కి తేడా చాలా సన్నటి రేఖే అనిపిస్తోంది. 

‘మొదటి పనిగంట వేళ’, ‘ప్రశ్న భూమి’, ‘ట్రాపికల్ ఫీవర్’, ’43 ఎకరాల జొన్న పంట’, ‘మ్యాప్ మేకింగ్’, ‘విందు తర్వాత’, ‘కొత్త రాజధాని’, ‘నమ్మదగ్గమాటలు’… ఇవన్నీ ఒకే కోవకి చెందినవి. ప్రభుత్వ యంత్రాఙ్గమ్… మన ప్రజలకి ఎందుకు ఇంత పరాయిగా ఉందో రకరకాల నేపథ్యాలతో స్థాయీ భేదాలతో చెప్పే కథలు ఇవి. వ్యక్తి, కుటుంబం, కులం, కులపంచాయతి, విభిన్న కులాలున్న గ్రామ పంచాయతీ, వాటికున్న స్వయంపాలిత అధికారం… అవసరమైతే తప్ప ఆ అధికారాన్ని ప్రశ్నించని రాచరిక వ్యవస్థ! 

వ్యక్తి, అతని ఇష్టాయిష్టాలని పట్టించుకోకపోవడం తప్ప- అన్ని రకాల వికేంద్రీకరణతో కూడిన ఈ వ్యవస్థ స్థానంలో వచ్చిన బ్రిటిష్ పాలనా పద్దతి మన ప్రజలని దూరంగా పెట్టింది. స్వాతంత్య్రం తర్వాత కూడా – చాలా కొద్దీ మార్పులతో తప్ప ఆ వ్యవస్థ- అదే వలస దొరల మనస్తత్వాన్ని కొనసాగడమే పెద్ద విషాదం. రాజకీయంగా ఎన్ని మార్పులు వచ్చినా – దాన్ని అమలు చేయాల్సిన అధికార గణం బ్రిటిష్ మనస్తత్వాన్ని దాటి బయటకు రాలేదనే ఈ కథలు చెబుతున్నట్టు నేను అనుకుంటున్నాను. మెల్లగా- అది రాజకీయాలకే పాకిపోయింది. నాదో ఊహ. భారత దేశమన్నది ఓ పెద్ద రైల్వే స్టేషన్ అనుకుంటే- అందులో గిరిజనుల నుంచి పురజనులదాకా ఎంతో మంది వేచి చూస్తున్నారు. బ్రిటిషువాళ్ళు సృష్టించిన ప్రభుత్వ యంత్రాఙ్గమ్ అనే ఓ అత్యాధునిక రైలు – వాళ్ళని ఎక్కించుకుని సంక్షేమం అనే గమ్యానికి చేరాలి. కానీ- అది ఈ స్టేషన్-లో ఆగడం లేదు. మీకోసమే అన్నీ చేస్తున్నాము అంటూ – స్పీడ్-గా తన దారిన తాను పోతోంది. ఆ వేగానికి సమానంగా పరుగెత్తి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. సాధ్యం కానివాళ్ళు అక్కడే నిల్చిపోతున్నారు. చాలా మంది నడిచే వెళ్తున్నారు. కానీ… ఆగి అందరినీ ఎక్కించుకోవాల్సిన రైలు మాత్రం ఆగడం లేదు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత మనవాళ్ళు వచ్చినా ఇదే కథ. వరల్డ్ బ్యాన్కు వంటివి రైలుకు పైపూతలు వేసినా ఇదే కథ! ఈ అవ్యవస్థనే – దీన్నే తాత్వికంగా, సొంత అనుభవాల గుచ్చంగా, కోపంగా, సంతృప్తిగా… రకరకాలుగా చెబుతున్నారు మీరు. వీటిల్లో – ప్రశ్న భూమి మన దేశం నుంచి ఈ మట్టి పరిమళం అడ్డుకున్న ఓ ప్రపంచ స్థాయి కథ. ట్రాపికల్ ఫీవర్ అంతే గొప్ప కథకానీ… ఆ చివరి ముగింపులోని నాటకీయత(అది నిజం కూడా కావచ్చు) మామూలుగా అనిపించింది. మ్యాప్ మేకింగ్ కూడా అంతే. ఆ చివరి ఎమోషన్… నమ్మదగ్గదే అయినా ప్రశ్నభూమిలా అనిపించలేదు. కానీ… అది పాఠకుడిగా నా పరిపక్వత లేమి అనే అనుకుంటున్నాను. కొన్నాళ్ల తర్వాత- నేను ఎదగొచ్చు. 

నాకు ఒకటి అనిపించింది. మొదటి, రెండో భాగాల్లోని కథల్లోని బిగువు, శిల్పం ఇత్యాదులు చివరి వాటిల్లో లేదు అనిపించింది. లేదా పోను పోనూ మీరే వాటిని సడలిస్తూ వచ్చారు. ఈ చివరి కథల్లో గొప్ప భాష ఉంది, పాఠకుణ్ణి కట్టి పడేసే శైలి ఉంది, అతిగా మారని అనుభూతులు ఉన్నాయి. బట్, కథల్లా లేవేమిటీ అనిపిస్తోంది! కేవలం- ఓ డైరీలా, నోట్స్-లాగే చెప్పుకుంటూ పోయారు. ఎందుకలా? ఇది కూడా ఓ కథనపద్ధతే అనుకుంటున్నాను. 

బహుశా ఈ రకంగానూ తెలుగు కథకి ఓ కొత్త ఒరవడిని అందిస్తున్నారని అనిపిస్తోంది.

2-5-2023

3

నమస్తే అండి.
మీ కథలు చదువుతున్నాను. చాలా బాగున్నాయి. ఏకధాటిగా చదవడం కష్టం.. ఆగి ఆగి చదవడం బాగుంది..

ఈ విషయం చెప్పాలని మాత్రం మీకు మెసేజ్ చేయట్లేదండి. ..
మీ కథల పుస్తకంలో ఇప్పుడే ‘చివరిమనిషి’ కథ చదివాను.
కథ మొదలు పెట్టినప్పుడు బాగుంది చదవడం మొదలు పెట్టాక నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియలేదు. అయిపోయేసరికి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. .. కథను తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నాను.. ఇంతగా కలత చెందేందుకు ఏముందో నాకు అర్థం కాదు. .. మనసంతా బాధగా ఉంది..

ఏడవాలని ఉంది. .. వెక్కి వెక్కి ఏడవాలని ఉంది. తలచుకుని తలుచుకొని ఏడవాలని ఉంది. .. ఇంతకు నాకు ఏమైందో మాత్రం తెలియలేదు. ..

కథ నన్ను ఎందుకు ఏడిపించిందో మాత్రం. .. చెప్పే మాటలు మాత్రం నాకు అందలేదు..

మీరు అందించిన కథలు మాత్రం ఓ అద్భుతం నాకు. Thank you.

4-5-2023

4 Replies to “మూడు ఉత్తరాలు”

  1. ఎన్నో పుస్తకాలు చదివినా స్పృహతో చదవటం మీ పుస్తకాలు చదవటం మొదలు పెట్టినప్పటినుండే
    నా మట్టుకు నాకు. మీ రచనలో అనుభవం, ఆదర్శం, నైపుణ్యం ముప్పేటగా విశ్వ స్థాయిలో ఉంటాయి గనక. వెనకటికి శ్రీశ్రీ మాటగా విన్న జ్ఞాపకం. ఎవరో విశ్వనాథుని విమర్శిస్తే నేను మనలాంటి వారికి కవిని , ఆయన మాలాంటి వారికి కవి అని. అది నిజమో అబద్దమా అనేది వదిలేసి మీరు మాత్రం సాధారణ పాఠకులకన్నా
    రచయితలను మెప్పించే రచయిత అన్నది వాస్తవం. టాల్స్టాయ్ మాటలు రచనలు రాసేవారనా మరింత జాగ్రత్తగా రాయాలనే హెచ్చరికను కూడా అందిస్తున్నాయి. ఉత్తరాలు మనసులు పరచిన చిత్రాలు.

  2. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది సర్?

Leave a Reply

%d bloggers like this: