కొండాపూర్ లో ఒక మధ్యాహ్నం

Reading Time: 5 minutes

కారు హైదరాబాదు దాటడానికే రెండుగంటలు పట్టింది. పటాంచేరుమీంచి హైదరాబాదు-ముంబై హై వే ఎప్పుడూ ఉండేంత రద్దిగానే ఉన్నా, ఎండాకాలపు వేడికి ఆ రద్దీ భరించలేనిదిగా ఉండింది. ఒంటిగంట తర్వాత ఎక్కడ ఏ డాబా కనిపిస్తే అక్కడ లంచ్ కి ఆగిపోదామనుకుంటూనే, సంగారెడ్డి జంక్షనుదాకా చేరుకున్నాం. సంగారెడ్డి ఇంతకుముందు వెళ్ళకపోలేదు, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులు. అప్పటి సంగారెడ్డికీ, ఇప్పటి సంగారెడ్డికీ పోలికనే లేదు. దారిపొడుగునా కొత్త రాష్ట్రం సుభిక్షమవుతోందని తెలుస్తోనే ఉన్నా, కొత్త రాష్ట్రంలో పట్టణాలు ఆశ్చర్యపరిచేటంత వేగంగా నగరాలుగా మారుతున్నాయని సంగారెడ్డి జంక్షను దగ్గర మరీ కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది.

కాని మేము చూడాలనుకున్నది రెండువేల ఏళ్ళ కిందటి ఒక పట్టణాన్ని. అప్పటి లెక్కల ప్రకారం నగరం అని కూడా అనుకోవచ్చేమో. కొండాపూర్ గురించి చాలా కాలంగా వింటూనే ఉన్నాను. కాని కిందటేడాది ప్రమోద్ కి తెలంగాణా చరిత్ర పాఠం చెప్పడం మొదలుపెట్టగానే కొండాపూర్ ప్రసక్తి మళ్ళా వచ్చింది. ప్రస్తుత తెలంగాణాలో సాతవాహన కాలంలో వికసించిన అతి పెద్ద పట్టణాల్లో అది కూడా ఒకటనీ, క్రీ.పూ. 2 వ శతాబ్ది నుంచి సా.శ 2 వ శతాబ్దిదాక దక్కనీయ జీవనశైలిని తెలుసుకోడానికి అక్కడేన్నో ఆధారాలు లభించేయనీ, ఆ పాఠ్యపుస్తకాల్లో రాసి ఉంది. శాతవాహన సామ్రాజ్యంలో నాసిక్ నుండి ధరణికోట దాకా చూసినవాణ్ణి. పదేళ్ళ కిందట కోటిలింగాల కూడా చూసాను. ఇంక చూడవలసిన వాటిలో నానేఘాట్ శాసనం, ప్రతిష్ఠానపురం, కొండాపూర్ మాత్రమే మిగిలాయి. అందుకని ఎప్పుడెప్పుడు ఆ ఊరు చూద్దామా అనుకుంటూ ఉన్న నాకు ఇద్దరు సహయాత్రీకులు దొరికారు. ఒకరు ప్రపంచ పథికుడు కన్నెగంటి రామారావు, మరొకరు కుప్పిలి పద్మ.

ముగ్గురం నిన్న సంగారెడ్డి చేరుకున్నాక ముందు భోజనం చేసాం. ఉడిపి నుంచి వచ్చిన కన్నడిగులు ఆ హోటల్న డుపుతున్నారు. కాని దాని మీద ఉడిపి భవన్ అని రాసి లేదు. ఆ పక్కనొక స్వీటు దుకాణంలో ఒక బిహారీ పిల్లవాడు పనిచేస్తూ ఉన్నాడు.

మళ్ళా ముంబై హై వే మీదకొచ్చి పెద్దాపూర్ దగ్గర మలుపు తిరిగి తొగర్ పల్లి గ్రామం మీంచి కొండాపూర్ చేరుకున్నాం. దారి పొడుగునా గుల్ మొహర్లు వేసవిని విరబూసాయి. కొండాపూర్ లో భారతీయ పురావస్తు సర్వే వారి మూజియం ఉంది. ఆ శాఖ తెలంగాణా రాష్ట్రంలో నిర్వహిస్తున్న మూజియం అదొకటే. ముందు రోజు ఎవరి ద్వారానో ఆ క్యురేటర్ నంబరు సంపాదించి అతనితో మేము వస్తున్నామని చెప్పినప్పుడు ఆ మూజియం పైకప్పు మరమ్మత్తులు నడుస్తున్నాయనీ, అయినా పర్వాలేదు రమ్మనీ అన్నాడు. ఆ మాటల్ని బట్టి ఆ మూజియం బాగా పాడు పడి ఉంటుందని అనుకున్నాను. తాలూకా కేంద్రాల్లో సాధారణంగా చిన్నపాటి రాజకీయనాయకులు తప్ప మరెవ్వరూ దిగని ఆర్ అండ్ బి డిపార్ట్ మెంటు వారి ట్రావెలర్స్ బంగళా లాగా ఆ మూజియం కూడా ముక్కవాసన కొడుతూ ఉంటుందేమో అనుకున్నాను. కాని ఆ మూజియం నా ఊహల్ని తల్లకిందులు చేసింది. నిర్వహణలోకాని, చూపరులకు గోచరించే తీరులోగాని, ఆ ప్రదర్శన శాల అత్యుత్తమ ప్రమాణాలతో కనిపించింది.

భారతీయ పురావస్తు శాఖ వారి మూజియంలు నేనింతకుముందు అమరవాతి, నాగార్జున కొండ, హంపి, సారనాథ్, వైశాలి, సాంచి లలో చూడకపోలేదుగాని, ఈ మూజియం వాటన్నిటికన్నా ప్రత్యేకంగా, ఒక తోటలో కట్టిన ప్రదర్శనశాల లాగా కనిపిస్తూ ఉంది. కాని నిన్నటికి మేము ముగ్గురమే యాత్రీకులం. ఆ సంఖ్య సరిపోదనుకుంటే, మా కారు డ్రైవరు ను కూడా కలుపుకోవచ్చు. కాని వేసవిలో ఒక ఆదివారం నాడు కనీసం వెయ్యి మందేనా అక్కడ కనిపించి ఉండాలి కదా! నేనింతదాకా చరిత్ర పట్ల ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఆసక్తి లేదనుకున్నాను. ఈ నిరాసక్తతలో తెలంగాణా కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసిపోదనితెలిసొచ్చింది.

లేకపోతే అటువంటి చారిత్రిక ప్రదేశానికి జనం ఎలా పోటెత్తి ఉండాలి! పోయిన నెలలో నా మిత్రుడు ఎమెస్కో విజయకుమార్ యూరోప్ పర్యటించాడు. ఆయన పర్యటనకు బయలుదేరేముందు ఆయన్ని అమస్టర్ డామ్ లో వాన్ గో మూజియం, వియన్నాలో కనీసం ఒక నాటకం, సాల్జ్ బర్గ్ లో ఏదో ఒక మొజార్ట్ సంగీత కచేరీ చూడమని చెప్పాను. ఆయన తిరిగి వచ్చి నాతో చెప్పిందేమంటే, వాన్ గో మూజియం కి రాబోయే ఆరునెలలదాకా టికెట్లో సోల్డ్ ఔట్ అనీ, ఇక సంగీత కచేరీలకు ఎక్కడా రాబోయే మూడు నెలలదాకా సీట్లు ఖాళీ లేవనీ, కాబట్టి తాను ఏమీ చూడలేకపోయాననీ.

అభివృద్ధి అంటే అది. దానికి రెండే ప్రమాణాలు. ఒకటి ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ఆకలి చావులూ, అసమానతలూ ఉండకూడదు. రెండవది ఆ జాతి ప్రజల కళాభిరుచి అత్యున్నత ప్రమాణాలకు చెందిందై ఉండాలి. కాని, ఇక్కడి పరిస్థితి చూడండి. ఇప్పటికి రెండువేల ఏళ్ళకిందట తెలంగాణాలో ఒక పట్టణం ప్రముఖ్య వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. రోమ్ తో సాతవాహనులు నడిపిన వ్యాపారంలో ఆ పట్టణం ఎంత ప్రముఖ పాత్ర పోషించిందంటే అక్కడ ఒక రోమన్ సెటిల్ మెంట్ ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు. కాని ఆ ప్రాంతాన్ని చూడటానికి ఇక్కడ ఇప్పుడెవ్వరికీ ఆసక్తి లేదు.

సా.శ. ఒకటవ శతాబ్దిలో గ్రీకు-రోమన్ ప్రాంతాలకు చెందిన ఒక నావికుడు ఒక సముద్రప్రయాణ మార్గదర్శిని రాసాడు. దాన్ని The Periplus of the Erythraean  Sea అని అంటారు. అందులో అతను భారతదేశపు పశ్చిమ, తూర్పుతీరాల్లోని రేవుపట్టణాలని వివరించాడు. వాటిలో గుజరాత్ లో ఇప్పుడు బ్రోచ్ గానూ, పూర్వకాలంలో భరుకచ్చంగానూ పిలవబడే రేవుపట్టణం కూడా ఒకటి. దాన్ని అతడు బారీ గాజా అని పిలిచాడు. ఆ బారీగాజా ద్వారా చీనామన్నుతో తయారైన పింగాణి వస్తువుల్ని భారతదేశం రోమ్‌కి పెద్ద ఎత్తున ఎగుమతి చేసేదని రాసాడు. కావోలిన్ అని పిలవబడే ఆ చీనామన్ను పాత్రలు, బొమ్మలు, అలంకరణసామగ్రి అత్యధికభాగం కొండాపూర్ ఫాక్టరీల్లో తయారైనవే అని చరిత్రకారులు చెప్తున్నారు. సాతవాహన కాలంలో రోమన్ సంపద చాలావరకూ భారతీయ ఎగుమతుల్ని కొనుక్కోడానికే ఖర్చయిపోతోందనీ, రోమ్‌ని భారతదేశం కొల్లగొట్టుకుంటోందనీ రోమన్ చరిత్రకారుడు ప్లినీ రాస్తున్నప్పుడు, ఆ సంగతి కొండాపూర్ లోని రోమన్ సెటిల్ మెంటులో ముచ్చటించు కుంటున్నప్పుడు ఒకప్పటి తెలంగాణా ప్రజలు కించిత్ గర్వంతో నవ్వుకుని ఉండాలి. కాని ఆ నవ్వుల్ని తలుచుకోడానికి ఇప్పుడెవరికీ ఇక్కడ తీరిక లేదు.

కొండాపూర్ మూజియం ఇన్ ఛార్జి సతీష్ ఎంటెక్, పి హెచ్ డి చేసాడు. అతనిది ఆదిలాబాద్ జిల్లా. పురావస్తు శాఖ ఉద్యోగి. అతనూ, అతని సిబ్బందీ మాకు దగ్గరుండి మూజియం మొత్తం చూపించారు. పురాతన నాణేలూ, కొండాపూర్ లో దొరికిన అరుదైన మాతృదేవత పింగాణి శిల్పంలాంటివి మాత్రం లోపల భద్రంగా ఉన్నవాటిని చూపించడానికి వాళ్ళకి అనుమతి లేదు. కాని వాటిని చూడలేదన్న దిగులు ఏమీ లేదు. బయట ప్రదర్శనలో ఉన్నవేమీ తక్కువ విలువైనవి కావు.

ఆ మూజియంకి కుడివైపున ఎడమ వైపున రెండు కారిడార్లలో చరిత్రపూర్వ సేకరణలు ఒకవైపున, కొన్ని అరుదైన శిల్పాలు మరొకవైపున ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగానికి సంబంధించి పాతరాతియుగం, మధ్యరాతి యుగానికి చెందిన అరుదైన పనిముట్లు ప్రదర్శనలో ఉన్నాయి. వాటితో పాటు గ్రానైటు మీద చెక్కబడ్డ ఒక బుద్ధచరణద్వయం కూడా ఉంది.

మూజియం సెంట్రల్ హాల్లో మృణ్మయ పాత్రలు, చుక్కల పళ్ళేలూ, చీనామన్ను బొమ్మలు, ఆభరణాలూ, నాణేలూ, మూడు నాలుగు శిల్పాలూ ఉన్నాయి. కొండాపూర్ తవ్వకాల్లో లభ్యమైన మొత్తం 8394 ఆర్టిఫాక్ట్స్ లో ప్రత్యేకం అని చెప్పదగ్గవి ఆభరణాలూ, చీనామన్ను పాత్రలూ, మృణ్మయపాత్రల అలంకారాలూనూ. ముందే చెప్పినట్టుగా నాణేలు ప్రత్యేక భద్రతలో ఉన్నందువల్ల వాటి బొమ్మలు మాత్రమే అక్కడ ఉన్నాయి. కొండాపూర్ లో దొరికిన నాణేల్లో శాతవాహనుల సీసం నాణేలతో పాటు, టైబీరియస్ చక్రవర్తి వేసిన బంగారు నాణెం కూడా ఒకటి ఉందని సతీష్ చెప్పాడు.

అక్కడి ఆభరణాల్లో ముఖ్యంగా గాజు, స్ఫటికం, గోమేధికం, నీలం, ఎముకలు మొదలైనవాటితో రూపొందించిన పూసలు, గాజులు, ఉంగరాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వాటిమీద ఎం.జి.దీక్షిత్ అనే ఆయన Some Beads from Kondapur (1952) అని ఒక ఏకంగా ఒక పుస్తకమే రాసాడట.

నేను బాదామి వెళ్ళినప్పుడు అక్కడ మూజియం కట్టేసేవేళకిగాని మూజియం ఉందన్న సంగతి తెలియలేదు. ఆ మూజియం గోడమీద తమ దగ్గర అరుదైన లజ్జాగౌరి ప్రతిమ ఉందని ఒక పోస్టరులాంటిది మూజియం అధికారులు ప్రకటించింది చూసాను. ఆ ప్రతిమ చూడనిమ్మని వాళ్ళని బతిమిలాడానుగాని, అప్పటికే ప్రదర్శన కట్టేసే సమయం అయిందని వాళ్ళు నా కోరికమన్నించలేదు. దక్కను పీఠభూమికి చెందిన అరుదైన ఒక తాంత్రిక ప్రతిమను చూడలేకపోయానన్న కొరత నన్ను అప్పటినుంచీ వెన్నాడుతూనే ఉంది. ఆశ్చర్యం! నిన్న ఒక మీనియేచరుగా లజ్జాగౌరి నాకు కొండపూర్ లో సాక్షాత్కరించింది. కాని భారతదేశంలోనే అరుదైన ప్రతిమ తమ దగ్గర ఉందని ఈ మూజియం అధికారులు చాటుకోవడం లేదు, అంతే తేడా.

ప్రాచీన భారతదేశ చరిత్ర చదివేవాళ్ళకి తరచు వినబడే, Black and Red Ware, Red Ware, Polished Red Ware తరహా మృణ్మయ పాత్రలకు కొండాపూర్ గాలరీ ఒక నిశ్శబ్ద పాఠంగా చెప్పవచ్చు. దాదాపుగా రెండువేల ఏళ్ళపాటు ఆ పాత్రలు చెక్కుచెదరకుండా ఆ భూమి తనలో నిక్షిప్తపరుచుకుందనే ఆశ్చర్యం నుంచి మనం తేరుకోవడం కష్టం.

ఇవి కాక, మధ్యధరా ప్రాంతానికి చెందిన rouletted pottery కూడా కొండాపూర్ లో కనబడటం మరో విశేషం. ఒకప్పుడు ఆ పట్టణంలో రోమన్లపేట ఒకటుండేది అనడానికి ఆ చుక్కలపళ్ళేలు ఒక సాక్ష్యం.

మా అదృష్టం కొద్దీ మేము మూజియం దగ్గరకు వెళ్ళేటప్పటికే ఎండ చల్లబడి మబ్బు అలముకుంది. ఆ ప్రాంగణంలో పసుపుపచ్చ, ఊదారంగు అల్లమండ పూలమొక్కలు నిండుగా విరిసిఉన్నాయి. ఆ పూలమొక్కల దగ్గర ఫొటోలు తీసుకున్నాం.

ఆ తర్వాత ఆ మూజియం ఇం ఛార్జి సతీష్ మాకు పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టిన సైటుకి మనిషిని తోడిచ్చి పంపించాడు. దాదాపు 86 ఎకరాల విస్తీర్ణంకలిగిన ఆ క్షేత్రంలో ఇప్పుడు తవ్వకాలు జరగడం లేదు. ఇప్పటిదాక ఎనిమిది ఎకరాల మేరకు మాత్రమే తవ్వకాలు చేపట్టారు. అవి కూడా మూసేసారు. కాని ఆ ప్రాంతమంతా కలయదిరిగాం. రెండువేల ఏళ్ళ కిందట వర్ధిల్లిన పట్టణం ఒకటి చెక్కుచెదరకుండా మా పాదాలకింద నేలలో నిద్రిస్తూ ఉందని అక్కడ పనివాళ్ళు మాకు చెప్తున్నారు.
వాన వచ్చే సూచనలు మొదలయ్యాయి. ఒకటి రెండు వానచినుకులు పడేటప్పటికే ఆ చిట్టడవి మొత్తం నెమళ్ళ క్రేంకారాలతో మార్మ్రోగడం మొదలుపెట్టింది. మేము ఆ సైటునుంచి ఊళ్ళోకి వచ్చి టీ తాగి తిరిగి వెనక్కి బయల్దేరాం.

కాని దారిపొడుగునా నా కళ్ళముందు ఒక దృశ్యం కదలాడుతూ ఉంది. కౌండిన్యపురంగా ప్రసిద్ధి చెందిన కొండాపూర్ కి గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చి ఉంటాడు. అతణ్ణి కలవడానికి అక్కడి రోమన్ల బృందం కూడా ఆ కోటకి వచ్చి ఉంటారు. వాళ్ళు లాటిన్ లో మాట్లాడుతుంటారు. ద్విభాషులు దాన్ని సంస్కృతంలోకి అనువదించి చక్రవర్తికి నివేదిస్తూ ఉంటారు. వాళ్ళేమి మాట్లాడుకున్నారో ఆ సభాసదులు బయటికొచ్చాక అక్కడి ప్రజల్తో ప్రాకృతంలో చెప్తుంటారు. బహుశా ఆ సాయంకాలం చక్రవర్తి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో హాలశాతవాహనుడు సంకలనం చేసిన గాథాసప్తశతినుంచి కొన్ని కవితల్ని తలుచుకుని ఉంటారు. ఆ గాథలు విన్న రోమన్లు కేటల్లస్ ప్రేమకవిత్వాన్ని గుర్తు చేసుకుని ఉంటారు. ఇది ఊహ అనుకుంటున్నారా? మీరు కొండాపూర్ వెళ్తే ఇంతకన్నా గొప్ప ముచ్చట్లే చెప్పటానికి అక్కడి మట్టిపాత్రలు మీకోసం ఎదురుచూస్తున్నాయి.

8-5-2023

16 Replies to “కొండాపూర్ లో ఒక మధ్యాహ్నం”

   1. Never realised the value of kondapur and its ancient history. Thanks for giving us a visit plan for the coming week

 1. Sir, అక్కడికి దగ్గర్లో నందికంది వెళ్ళారా ? కల్యాణి చాళుక్యుల అద్భుతమైన గుడి ఆ ఊర్లో ఉంది.

  1. ఆ మ్యూజియం క్యురేటర్ అ దేవాలయం గురించి చెప్పాడు. సమయం చాలక వెళ్ళలేకపోయాను. మరోసారి వెళతాను.

 2. కొండాపూర్ గురించి కొత్తగా వింటున్నాను అని చెప్పడానికి నామోషీ గా ఉంది. మీ పరిశోధనాసక్తి తోపాటు చారిత్రక విషయ వివరణ కుతూహలాన్ని కలిగించేదిగా ఉంది..

 3. మాకు దగ్గర లోనే ఉన్న ఓ అపూర్వమైన ప్రదేశం గురించి తెలిపారు. .ధన్యవాదాలు.

 4. చా‌రిత్రక ప్రదేశాలకు వెళ్ళిప్పుడు ఆ దృశ్యాలు కళ్ళముందుకు వస్తాయి కదా !నేను మొదటి సారి ధవళగిరి వెళ్ళినప్పుడు కళింగ యుద్ధచిత్రం ,రక్తపు వాసన ,ఆర్తనాదాలు అన్నీ కనపడ్డాయి ,వినపడ్డాయి .కొన్నేళ్ళ క్రితం వెళ్ళేసరికి ఆ యాత్రికులు ,పండాలు ,దుకాణాలు తప్ప మరేమీ లేదు.

 5. ఒక జాతి తమకు తామే స్వయం సమృద్ధ మయితేనే ప్రతిభ ద్యోతకమవుతుంది. ఇంకా స్వాతంత్ర్యం రాని జాతి పరాధీనురాలే.

 6. అభివృద్ధి అంటే అది. దానికి రెండే ప్రమాణాలు. ఒకటి ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ఆకలి చావులూ, అసమానతలూ ఉండకూడదు. రెండవది ఆ జాతి ప్రజల కళాభిరుచి అత్యున్నత ప్రమాణాలకు చెందిందై ఉండాలి.👌👌ధన్యవాదాలు సర్

Leave a Reply

%d bloggers like this: