కళింగాన్వేషణ

ప్రతి ఒక్క చరిత్ర ఒక కథనం. ప్రధానంగా అది విజేతల కథనం. బలవంతుల కథనం. కొన్ని ప్రాంతాలు ఒక ఉమ్మడి ప్రాంతంగా రూపొందేటప్పుడు వాళ్ళల్లో ఎవరు ఎక్కువ బలవంతులైతే వారి కథనమే ఆ ఉమ్మడి ప్రాంతానికి చెందిన చరిత్రగా రూపొందుతూ వచ్చింది. అది కాలక్రమంలో కేంద్రీకరణకు దారి తీసింది. తిరిగి మళ్ళా ఆ ప్రాంతాలు ఆ కేంద్రీకృత కథనాల్ని ధిక్కరిస్తూ తమ కథనాల్ని ముందుకు తెచ్చినప్పుడు ఆ చరిత్ర మరొకకొత్త కథనంగా మారుతుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఇదే సరళి కాని, ఈ సూత్రం భారతదేశ చరిత్రకు మరింత బాగా వర్తిస్తుంది.

ఆదినుంచీ భారతదేశ చరిత్ర గురించిన కథనాలు చదివినవారికి అది కొన్ని సార్లు అంచులనుంచి కేంద్రానికీ, కొన్నిసార్లు కేంద్రం నుంచి అంచులకీ ప్రయాణిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఒక యుగంలో అది గంగా-సింధూ మైదాన చరిత్ర. మరొక యుగంలో బహుళ సంస్కృతుల, బహుళ ప్రాంతాల చరిత్ర. జాతీయోద్యమకాలంలో భారతజాతి అనే ఒక రాజకీయ భావనను బలపరిచే క్రమంలో, మనం ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని సంస్కృతులుగా వర్ధిల్లుతున్నప్పటికీ మనమంతా ఒకే జాతి అనే ఆలోచనకి పెద్దపీట వేసారు. భిన్నత్వంలో ఏకత్వం అనే ఆదర్శాన్ని ముందుకు తీసుకువచ్చారు.
జాతీయోద్యమం ఫలించి రాజకీయంగా మనం స్వాతంత్య్రం సంపాదించు కున్నాక భారతదేశం చరిత్రలో తొలిసారిగా ఒక రాజ్యాంగ పరిథిలోకి వచ్చింది. కాని అదేసమయంలో అంతదాకా మనం చెప్పుకున్న కథనాల్లో ఎన్నో ప్రాంతాలకీ, తెగలకీ, సమూహాలకీ తగిన గుర్తింపు లభించలేదనీ, అందువల్ల వారు రాజకీయంగానూ, ఆర్థికంగానూ కూడా వెనకబడవలసి వచ్చిందనే మెలకువ కూడా మొదలయ్యింది. ఈ కొత్త చైతన్యానికి ఒక కొండగుర్తుగా 1967 ను చెప్పుకోవచ్చు. అప్పణ్ణుంచే భారత రాజకీయాల్లో ప్రాంతీయవాదం పెరిగింది.

మరొకసంగతేమిటంటే బ్రిటిష్‌ పాలనాకాలంలో మొత్తం భారతదేశం వలసపాలనలో లేదు. దాదాపు 565 స్వదేశీ సంస్థానాల పాలనలో 40 శాతం భారతభూభాగమూ, 23 శాతం జనాభా ఉండేవారు. 1956 తర్వాత భారతదేశ రాష్ట్రాల్ని భాషాప్రయుక్త ప్రాతిపదిక మీద పునర్వ్యవస్థీకరించాక, అంతదాకా, చారిత్రికంగానూ, సాంస్కృతికంగానూ ఉమ్మడి అనుభవానికి లోనయిన ప్రాంతాలు, భాషా ప్రాతిపదికన కొత్త ఏకీకరణకు లోనయ్యాయి. కాని ఆ ప్రాంతాలు కొత్త రాజకీయరూపాల్లో సర్దుకుపోలేకపోయాయి. తిరిగి తమ ప్రత్యేక ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకుంటే తప్ప తమకి ఆర్థిక-రాజకీయ వికాసం సాధ్యం కాదని ఆ ప్రాంతాలు భావించడం మొదలుపెట్టాయి. ఉదాహరణకి తెలంగాణా.

ఇటువంటి ప్రాంతమే కళింగం కూడా. చారిత్రికంగానూ, భౌగోళికంగానూ కళింగం మూడు భాగాలు. ఒకటి ఉత్కళింగం. అంటే ఇప్పటి ఒరిస్సా. మరొకటి మధ్యకళింగం. మూడవది దక్షిణ కళింగం. మధ్య కళింగం, దక్షిణ కళింగాల్ని కలిపి కళింగాంధ్రగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. బ్రిటిష్‌ పాలనా కాలంలో కళింగం కొంత భాగం బెంగాల్‌ ప్రావిన్సులోనూ, మరికొంత భాగం మద్రాసు ప్రావిన్సులోనూ ఉండేది. బెంగాల్‌ నుంచి ఒరిస్సాను ప్రత్యేక ప్రావిన్సుగా ఏర్పరచినప్పుడు 1936 లో మద్రాసు ప్రావిన్సునుంచి గంజాం జిల్లాను, మరికొన్ని ప్రాంతాలనూ ఒరిస్సాలో కలిపారు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పూర్వపు విశాఖపట్నం జిల్లా ప్రాంతమంతా ఆంధ్ర రాష్ట్రంలోనూ, తదుపరి ఆంధ్రప్రదేశ్‌ లోనూ భాగమయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో రాజకీయంగా ఉత్తరాంధ్రకు తగిన గుర్తింపు లభించలేదనే స్పృహ ఇటీవల మొదలయ్యింది. ప్రధాన ఆంధ్ర సంస్కృతి ఒకప్పుడు తెలంగాణా సంస్కృతిని చిన్నచూపు చూసినట్టే కళింగాంధ్ర సంస్కృతిని కూడా చిన్నచూపు చూస్తూ ఉందనీ, ఇది ఆ ప్రాంతాన్ని ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నదనే వ్యథ కూడా మొదలయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో కొత్త ప్రాంతీయ స్పృహ బలపడుతున్నదని మనకు తెలుస్తున్నది. దీన్ని ప్రాంతీయవాదమనో, వేర్పాటువాదమనో అనడం సరికాదు. తమ అస్తిత్వాన్ని, తమ చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకునే వీలు ఈ ప్రాంతాలకు ఇప్పటికి చిక్కిందని అనుకోవాలి. అందులో భాగంగా కళింగాంధ్ర రచయితలు, కవులు తమ ప్రాంత సామాజిక-రాజకీయ చరిత్రను కొత్త కోణాల్లో మరింత నిశితంగా అధ్యనం చెయ్యడం మొదలుపెట్టారు. ప్రసిద్ధ కళింగాంధ్ర రచయిత అట్టాడ అప్పలనాయుడు రాసిన నవల ‘బహుళ’ ఈ బాధ్యతనే తలకెత్తుకుంది. గత నూటయాభై ఏళ్ళ కాలంలో ఉత్తరాంధ్రలో తలెత్తిన భూమిపోరాటాల చిత్రణ ఆ నవల ప్రధాన ఇతివృత్తం. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ‘వీరకళింగం’ నవల మరొక రూపంలో ఆ బాధ్యతనే నెరవేరుస్తున్నది. అప్పలనాయుడు సమకాలిక ఉత్తరాంధ్రను చిత్రించగా, డా. విజయభాస్కర్‌ ఈ నవలలో అత్యంత ప్రాచీన కాలపు కళింగ చరిత్రను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. అంతేకాదు, ఆదినుంచీ, భారతదేశ చరిత్రలో కేంద్రీకృత ధోరణులు తలెత్తినపుడల్లా కళింగం వాటిని ప్రశ్నిస్తూనే ఉన్నదని చెప్పడం ఈ నవల ప్రధానసందేశం అని నాకు అర్ధమవుతున్నది.

ఎందుకంటే అతి ప్రాచీన కాలంలో అశోకుడి కాలంలోనే కాదు, ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వలసపాలన మొదలుపెట్టాక బ్రిటిష్‌ తరహా కేంద్రీకృత పాలన మొదలుపెట్టినప్పుడు గంజాం జిల్లా గిరిజనులు అటువంటి పాలనావ్యవస్థను ధిక్కరించారు. 1834 లో పర్లాకిమిడి సంస్థానంలో తలెత్తిన తిరుగుబాటును అధ్యానం చేసుకున్నాక మద్రాసు ప్రావిన్సు పాలకులు తమ పాలనా విధానాన్ని నేరుగా గిరిజన ప్రాంతాలకు వర్తింపచెయ్యలేమని తెలుసుకున్నారు. అప్పుడే 1839 గంజాం, విశాఖపట్నం జిల్లాల చట్టం వెలువడిరది. అదే తర్వాత రోజుల్లో 1874 లో షెడ్యూల్డు జిల్లాల చట్టంగానూ, తర్వాత రోజుల్లో Excluded Areas, Partially Excluded Areas administration గానూ అమలయ్యింది. భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఆ పాలనావిధానమే తిరిగి అయిదవ, ఆరవషెడ్యూళ్ళలో దర్శనమిచ్చింది. కాబట్టి కేంద్రీకృత పాలనావిధానాన్ని ధిక్కరించడం కళింగాంధ్ర రక్తంలోనే ఉందని చెప్పుకోవాలి.

2

ప్రతి ఒక్క చరిత్ర ఒక కథనం అనుకున్నప్పుడు ప్రతి కథనం కూడా ఒక చరిత్రనే. అది కొత్త చరిత్రను నిర్మించే సాధనం. చారిత్రిక మూలాల్లోకి పయనిస్తూ డా. విజయభాస్కర్‌ ఈ నవల ద్వారా కళింగానికి ఉన్న ఒక అమేయమైన, అద్వితీయమైన వ్యక్తిత్వాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.
కళింగమంటే ఏమిటో, కళింగప్రజలు ఎటువంటివారో ఆయన ఈ పుస్తకం పొడుగునా చేసిన వర్ణనల నిజానికి ఒక నూతన దర్శనం. ఈ వాక్యాలు చూడండి:

మన ప్రాంత జీవనవిధానంలో ధార్మిక చింతనలో అస్పష్టలోకాలు, అమూర్త భావాలు లేవు. మన పూర్వీకులు చాలా గొప్పవారు. మంచివారిగా బతికారే తప్ప దానికి బహుమతిగా స్వర్గాన్ని ఆశించలేదు. వారికి దొరికింది తోటివారితో పంచుకున్నారే తప్ప అది పుణ్యంకోసం చేయలేదు. పనులు విభజించి ఎవరిపని వారు చేసుకుని సమష్టిగా ప్రయోజనం పొందారే తప్ప వృత్తులమధ్య తేడా పాటించలేదు. ఈ క్షణంలో ఈ భూమిమీద జరిగే కార్యానికి కారణం ఇక్కడే వెతికారు తప్ప పూర్వజన్మలకి ముడిపెట్టలేదు. పైలోకాలతో పెనవేయలేదు. ఈ ప్రకృతిని ఎప్పుడూ స్వంత ఆస్తిగా భావించలేదు. సత్రంలో బాటసారిలా జీవించారు. వెళ్ళిపోతూ సమాజానికి అప్పచెప్పారు. (పే.35)

కళింగులు ప్రకృతి రహస్యాలు తెలిసిన జ్ఞానులు. పంచభూతాల తత్త్వాన్ని గుప్పెట పట్టుకున్నవారు. వాటి లక్షణాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, భూమికి అయిదు నిఈటికి నాలుగు, అగ్నికి మూడు, గాలికి రెండు, ఆకాశానికి ఒకే ఒక లక్షణం ఉంటాయని కళింగులకు చిన్నప్పుడే బోధిస్తారు. ఈ అయిదింటి సంయోగం జీవమని, వియోగం నిర్జీవమని పిల్లలకు తెలియజేస్తారు. అందుకే ప్రతీ భూతంలో తన ఆత్మను వెతుక్కుంటూ బ్రతుకుతాడు కళింగుడు. అతడు కావాలనుకుంటే సంసారి-వద్దనుకుంటే సన్యాసి. ఉన్నాడు అనుకుంటే ఆస్తికుడు-లేదు లేదనుకుంటే నాస్తికుడు. వైదిక, జైన, బౌద్ధ సమ్మిళిత ధర్మసాధకుడు. మతాతీత సత్యశోధకుడు. ఉత్సవం మూఢత్వ సంకేతం కాదు. అది ఉద్వేగభరితమైన ప్రకృతిలో మమేకత్వం. తన పంచతత్వాలతో పంచభూతాల్ని పలకరిస్తాడు. పరామర్శిస్తాడు. (పే.202)

మా ఒడిలో పూచిన సూర్యకిరణాల్ని వెతుక్కుంటూ మీ రాజ్యాలు, సామ్రాజ్యాలు వెలిస్తే, మా కళింగం అదే కిరణాల్ని, తన దోసిట పట్టుకొని ప్రయాణిస్తోంది. కళింగులు ఆ సూర్యకిరణాలు సోకిన ప్రతి ప్రాంతానికి ఎగబ్రాకారు. మొగ్గ పువ్వును, పువ్వు కాయను, కాయ పండును వెంటాడతాయి. మీరు సాధించిన విజయాలు, స్థాపించిన సామ్రాజ్యాలు-మొగ్గ, పువ్వు, కాయ స్థితిలో ఉంటే నా కళింగం పరిణతి చెందిన పండు. పరిపక్వమైన ఫలం. పూర్ణవికసిత రూపానికి చిహ్నంగా తూర్పు తీరం వెంబడి వెల్లివిరిసిన కళింగుల తపోఫలం. (పే.206)

సూర్యకిరణం నుండి తేజస్సుని ఎలా వేరు చేయలేమో కళింగుల నుండి తమదైన పౌరుష ప్రతాపాలు, ధైర్యసాహసాలు, ఆలోచనా విశిష్టత, తాత్త్విక గరిమ వేరుచేయలేము. వీరిప్పటికీ ఎగిసిపడే సముద్రకెరటాల మాటున సుదూర తీరాలకు ఎలా వెళ్ళగలుగుతున్నారో భవిష్యత్తులో సూర్యరశ్మిలోని ఆ కిరణాల దాపున సుదూర గ్రహాలకు ప్రయాణించగలరు. అంతటి సాహసవంతులు. (పే.207)

కళింగలో రాచరిక వ్యవస్థలేదు. అనువంశిక పాలకులు లేరు. విశిష్టమైన సాంస్కృతిక సంపదతో తులతూగుతున్న జనజీవనం. ఎవరినోట పొల్లు మాట రాదు. ప్రతి ఒక్కరు తాత్విక వేదాంతి. ప్రతి ఒక్కరూ తార్కిక వాదనాపరుడు. కట్టుదిట్టమైన వృత్తి విభజనే తప్ప వర్ణ వ్యవస్థ లేదు. వృత్తుల మధ్య పెద్ద చిన్న తారతమ్యాలు లేవు. అన్ని వృత్తులకు సమానమైన గౌరవప్రపత్తులు. ఏ వృత్తినుండైనా మరో వృత్తి స్వీకరించవచ్చు. సుఖంగా జీవించడానికి ఎవరికీ లోటు లేదు. భూసంపద పంపిణీ ధర్మబద్ధమైంది. అతివిస్తీర్ణమైన భూమి ఎవరి గుప్పెట ఉండదు. భూమిని దున్నుకునే ఆసాములే తప్ప కబళించే భూస్వాములు లేరు. భూ ఉత్పత్తుల్ని తప్ప భూమిని వ్యాపారసరుకుగా భావించరు. పండే పంటను మండే పొయ్యి నిర్ణయిస్తుంది. (పే.209)

ఈ నవల ప్రధాన ప్రయోజనం అటువంటి ఒక ఉదాత్త కళింగ సీమను ఆవిష్కరించడమే. అందుకని ఈ నవలలో కథానాయకుడు కాళింగుడూ, కథానాయిక కళింగమూ కావడంలో ఆశ్చర్యం లేదు.

3

తెలుగులో చారిత్రిక నవలలు, కథలు విరివిగా రావాలని ఈ మధ్య ఒక ఆలోచన మొదలయ్యింది. ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు, రచయితలుం సాయి పాపినేని, డా. ఈమని శివనాగిరెడ్డి ‘కాలయంత్రం’ పేరిట నిర్వహించిన కార్యశిబిరాల్లో డా. విజయభాస్కర్‌ కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితో కళింగ చరిత్ర కథనాలకు ఈ నవలతో శ్రీకారం చుట్టారు.

డా. విజయభాస్కర్‌ కవి, నాటకకర్త కూడా. ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించని ఎన్నో కథల్ని ఆయన మనముందుకు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా అప్రధానీకరణకు గురయిన సమూహాలకు సాహిత్యంలో సముచిత స్థానాన్ని సంపాదించే క్రమంలో ‘రాజిగాడు రాజయ్యాడంట’ పేరిట ఆయన రాసిన నాటకం గొప్ప ప్రయోగం. ఇప్పుడు ఆయన నవలారచయితగా కూడా ఈ నవలతో మనముందుకు వస్తున్నారు.

చారిత్రిక నవల తీరుతెన్నులు తెలుగులో తొలినాటినుంచీ ఒకలాగా లేవు. తొలితరం చారిత్రిక నవలాకారులు చిలకమర్తి, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి, విశ్వనాథ మొదలయినవాళ్ళ రచనల్లో భావుకత్వం ఎక్కువ, చారిత్రిక విశేషాలు తక్కువ. Evidence based గా చారిత్రిక సన్నివేశాల్ని కల్పించడం మీద వారు అంతగా దృష్టి పెట్టినట్టు కనిపించదు. తెన్నేటిసూరి ‘చెంఘిజ్‌ ఖాన్‌’ తప్ప తొలికాలపు తెలుగు చారిత్రిక రచనల్లో చారిత్రక నిర్దిష్టతను సంతరించుకున్న రచనలు మరేవీ కనిపించవు. అలాగని చరిత్ర రచన చెయ్యడానికి తగిన ముడిసరుకు కూడా మనకి ఏమంత లభ్యంగా లేదు. పురావస్తు ఆధారాలు, పౌరాణిక, సాహిత్య ఆధారాలు, ప్రాచీన కాలపు వర్తకం, సముద్రప్రయాణాలు, నగర నిర్మాణాలు, సైనిక వ్యూహాలు, ఆహారవిహారాలు, అలంకరణలు, కళారూపాలు మొదలయిన ఎన్నో విషయాల మీద మనకు అరకొర సమాచారమే లభ్యమవుతూ ఉవవవవన్నది. ఆ దొరికే సమాచారం కూడా ఒకచోట దొరకదు. చెదురుమదురుగా ఉన్న ఆ సమాచారం గురించి మనకు చెప్పే సూచికలు, మార్గదర్శకులు కూడా లేరు.

ఈ ‘వీరకళింగం’ నవలను మనం ఈ నేపథ్యంలో చూసినప్పుడు డా. విజయభాస్కర్‌ చేసిన కృషి సామాన్యమైంది కాదని అర్థమవుతుంది. ఆయన ప్రధానంగా సాహిత్య, తాత్త్విక ఆధారాలమీదా, కొంతవరకూ స్థానిక పరిజ్ఞానం మీదా ఆధారపడి ఈ కథనాన్ని నిర్మించారని అర్థమవుతూ ఉంది. తన ప్రాంతం విస్మృతికి గురయిందనీ, తమకి కూడా ఒక చరిత్ర ఉందనీ చెప్పడంకోసమే ఈ నవల రాయవలసి వచ్చిందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.

4

అలాగని ఏ నవలనైనా మనం కేవలం చరిత్ర కోసం చదవం. అన్నిటికన్నా ముందు ఆ నవల చదివించేదిగా ఉండాలి. విషయసేకరణ, సమాచారం ఎక్కడికక్కడ సన్నివేశాలుగా మారాలి. ఆ సన్నివేశాలు, ఆ కథనం విసుగుపుట్టించకుండా, ఉత్కంఠ రేకెత్తించేదిగా ఉండాలి. ఆ అంశంలో డా. విజయభాస్కర్‌ కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు. ఉదాహరణకి బుద్ధుడి మహాపరినిర్వాణాన్ని వివరించే ‘మహాపరినిబ్బాణ సుత్త’ ఆధారంగా ఈ నవలలో 14, 17 అధ్యాయాలు నిర్మించిన తీరు నిజంగా ప్రశంసనీయం. బౌద్ధ, జైన, వైదిక ధర్మాల మధ్య తారతమ్యాల్ని, దృక్పథ భేదాల్ని వివరించిన తావులన్నిటిలోనూ (పే.21, మూడవ అధ్యాయం మొత్తం, పే.57-58, పే.70), బుద్ధుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడిన మాటలు (79-80), బుద్ధ భరద్వాజ సంవాదం (పే.165), గుహశీవుడు హేమమాలల సంభాషణ (పే.178) ల్లోనూ రచయిత ఎంతో సాధికారికంగా కనిపిస్తున్నాడు.
మరీ ముఖ్యంగా చాలాచోట్ల ఈ కథనం కావ్యత్వాన్ని అందుకుందని కూడా చెప్పవచ్చు. ఎన్నో వర్ణనలు, పోలికలు, వాక్యనిర్మాణ శైలి చాలాచోట్ల ఈ రచనను కావ్యంగా మార్చేసాయి. కొన్ని పోలికలు చూడండి:

రాత్రి ఆవహించిన నల్లని చీకటి రంగుమీద ఆకుపచ్చని రంగు చల్లినట్టుంది (పే.126)

బౌద్ధవైదిక తత్త్వాలు స్త్రీ రూపాలు ధరించి ఆ అడవిలో సంచరిస్తున్నట్టుంది (పే.127)

అక్కడ ఆ గోవులు ‘కొండలకు కాళ్ళు అమర్చినట్టు’ (పే.128) ఉన్నాయట.

కొన్ని వర్ణనలు చూడండి. ఉదాహరణకి గుహశీవుడు బుద్ధదంతధాతువుని దర్శించుకున్న అనంతరం
‘రాజు నడకలో ఠీవి, దర్పం ఏ మాత్రం కనిపించలేదు. దైవదర్శనానికి వెళ్టున్న భక్తునిలా పొలం దున్నడానికి వెళ్తున్న ఓ రైతులా, పడుగుపేకలు కలనేయడానికి వెళ్టున్న ఒక వస్త్రనిర్మాతలా వెళ్ళి సింహాసనంపై కూర్చున్నాడు’. (పే.169)

తనవంతు వచ్చేసరికి అశోకుడు సరిగ్గా బుద్ధ దంత పేటిక ముందు నిలబడ్డాడు. జన్మపరంపరకు ముందు దశలో అనంత సృష్టి ఆవరణలో ఎక్కడో ఒకచోట ఒక క్షణంలో సహస్రాంశ పాటు మెరిసిన కణంలా నిలిచాడు. అప్పుడే ఆ ఘడియలో అతని గుండె గడియలు తెరుచుకున్నాయి. మేధాకుహరంలో మిథ్యాదృష్టులు మలిగి జ్ఞానకాంతులు ప్రవేశించాయి. చతురార్యాలు, ఉపాదాన స్కంధాలు, అష్టాంగమార్గాలు ఒక్కొక్కటి ఒక్కో కెరటమై అతని మస్తిష్కంలో ముద్రించుకున్నాయి. శూన్యశిఖరభవాగ్రంపై నిశ్చలతత్త్వంతో, నిర్మల తత్త్వంతో అశోకుడు దంతపేటికముందు మోకరిల్లాడు. కోటి సూర్యప్రభలతో ధగధగలు విరజిమ్ముతున్న దంతపేటిక బుద్ధుని నిండు ఆశీస్సులు అందించింది. ( పే.234)

కళింగ యుద్ధహతుల్ని పూడ్చుకుంటూ వెళ్తే పాతాళం తగులుతుంది. పేర్చుకుంటూ వెళ్తే పాటలీపుత్రం వస్తుంది. ( పే.242)

ఏ ధర్మమైనా అది వెదురుబొంగువలె శూన్యగర్భమైంది. అది వేణువై మ్రోగాలంటే బౌద్ధ ధర్మ నిబద్ధతా గాయాలను శరీరం నిండా చవి చూడాలి ( పే.134).

లోకపరిశీలనలోంచి వచ్చిన కొన్ని వాక్యాలు:

వ్యవస్థ విషాదమే వ్యక్తి విషాదాన్ని మరిపించగలదు (పే.117)

కొరవడిరదే మనిషిని కొరవై కాల్చుతుంది (పే.152)

లోకానికి ఒక నైజముంది. రాజు భుజం తట్టినవాడిని లోకం భుజానికెత్తుకుంటాది. రాజు నిందించినవాడిని నిర్ద్వంద్వంగా నిరాకరిస్తుంది (పే.149)

కారువాకి దేవి తాను పూజచేసుకోవడం కోసం, బుద్ధప్రతిమను ఎక్కడ పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఏమంటున్నదో చూడండి:

ఈ బొమ్మను రావిచెట్టుకింద నిలిపి ప్రతీరోజు అతని ముందు కూర్చొని ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను. కానీ తూర్పుదిక్కు ఎండ బుద్ధుణ్ణి బాధిస్తుందేమోనని భయంగా ఉంది. (పే.215)

ఇటువంటి వాక్యాలే నాలాంటి రసోన్మాదుల్ని నిలనివ్వకుండా చేసే తావులు.

5

భారత జాతీయోద్యమ తొలికాలంలో ప్రాచీన భారతదేశాన్ని ఊహిస్తూ, ఒక భారతీయ ఆత్మను దర్శించే ప్రయత్నం చేస్తూ ఇటువంటి రచనలే వచ్చాయి. ఉదాహరణకి బంకింబాబు రాసిన ‘ఆనందమఠం’ (1882) నవల. కల్కి కృష్ణమూర్తి ‘పొన్నియన్‌ సెల్వన్‌ ’ (1950-54) నవల రాసిన తర్వాతనే తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు బలం పుంజుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు ఈ వీరకళింగం నవల ద్వారా డా.విజయభాస్కర్‌ ఒక కళింగాన్వేషణ మొదలుపెట్టాడు. ఈ అన్వేషణ రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో ఒక నవ్య రాజకీయ-సామాజిక భవిష్యత్తుకు దారితీయగలదని ఊహించడం అసమంజసం కాదనుకుంటాను.

30-1-2023

8 Replies to “కళింగాన్వేషణ”

  1. సత్రంలో బాటసారిలా జీవించారు. వెళ్ళిపోతూ సమాజానికి అప్పచెప్పారు. అసలు ఆలోచిస్తే మామూలు వాక్యం లా కనిపించే ఈ మహా వాక్యం చర్వితమైనకొద్దీ మరింత అమూల్యమనిపిస్తుంది.
    ప్రకృతిని ప్రేమిస్తూ , రమిస్తూ, శ్రమిస్తూ జీవించడంలోని ఒక గొప్ప తాత్వికత మీ సమీక్ష ద్వారా తెలియ వస్తున్నది.ఉదాహరించినా రచయిత వాక్యాలు ఎంతటి పఠనీయ శక్తి కలిగిఉన్నాయో కూడా తెలుస్తున్నది. ఒక పుస్తకం సమీక్ష ఎలా చేయాలో కూడా ఈ వ్యాసం ఒక మార్గదర్శనం అవుతుందనిపించింది. దీర్ఘాసి విజయకుమార్ గారు పరోక్షంగా తెలుసు. వారి శూన్యం కావ్యాన్ని నాగరాజు రామస్వామిగారు The Void గా అనువదించటం వల్ల. మీ వల్ల మరిన్ని విషయాలు తెలియడం ఆనందదాయకం.

  2. డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ గారి ” వీర కలింగం ” గురించి మీరు మాత్రమే పరామర్శ చేయగలిగిన విధానం ఏదైతే ఉందో….చాలా బాగుంది.
    వెన్నెల రాత్రుల్లో విహరించిన తర్వాత కళింగాన్ని కూడా కానవలసి ఉంది.
    మీ సమీక్ష బంగారానికి తావి అబ్బినట్లు అయ్యింది.
    ధన్యవాదాలు అండి.

  3. వీర కలింగం పుస్తక సమీక్ష ద్వారా ఎంతో కొంత చరిత్ర తెలిసింది. విజయ భాస్కర్ గారి కృషికి అభినందనలు. మీకు ధన్యవాదాలు.

  4. “లోకానికి ఒక నైజముంది. రాజు భుజం తట్టినవాడిని లోకం భుజానికెత్తుకుంటాది. రాజు నిందించినవాడిని నిర్ద్వంద్వంగా నిరాకరిస్తుంది”

    ఎంత మాట! అంటే….
    Art of Living… Heart of Living!

Leave a Reply to Katru Srinivasa RaoCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading