తెలుగు సరస్వతికి మేలిమి కంఠాభరణం

A detail from the temple panel of Srimukhalingam

ఆధునిక ఆంధ్ర సాహిత్యం:శిల్పకళావైభవం అనే ఈ పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్య పరిశోధనలో ఒక ఆంకారవాట్‌ దేవాలయం వంటిది. యుగాలుగా సముద్రంలో మునిగిపోయి ఉన్న ద్వారక ఒక్కసారిగా బయటపడ్డట్టుగా, శతాబ్దాలుగా మట్టిపొరల కింద కప్పడిపోయిన హరప్పా సంస్కృతి ఆశ్చర్యపరుస్తూ బయటపడినట్టుగా, ఈ పరిశోధన తెలుగు సాహిత్యంలోని శిల్పవైభవాన్ని మన ముందు ప్రత్యక్ష పరిచింది. నాకు తెలిసి ఇటువంటి పరిశోధన ఇప్పటిదాకా తెలుగు సాహిత్యంలో రానేలేదు. నిజానికి ఇది ఒక వ్యక్తి తన రెండు చేతుల్తో చెయ్యగలిగే పని కాదు. ఒక విశ్వవిద్యాలయమో, ఒక పరిశోధక బృందమో ఏళ్ల తరబడి శ్రమించి మనకి అందివ్వగల యజ్ఞ ఫలం. కాని డా. పోతేపల్లి బాల దుర్గ వర ప్రసాద్‌ అనే ఈ తెలుగు పండితుడు నాలుగేళ్ళ వ్యవధిలో సాధించిన అపూర్వకృషి ఫలితం ఇది.

ఆశ్చర్యం వేస్తుంది. నిజమే కదా! ఆ దేవాలయాలు, ఆ నగర నిర్మాణాలు, ఆ యంత్రాలు, ఆ ఆయుధాలు, ఆ ప్రతిమలు, ఆ ఆభరణాలు, ఆ భిత్తి చిత్రాలు, ఆ స్తూపాలు, ఆ చైత్యాలు- ఇవే కదా మన చరిత్ర. ఏళ్ళు గడిచి, వానలు, వరదలు, ప్రమాదాలు, దండయాత్రలు, మహాయుద్ధాలు- ఎన్ని గడిచినా కాలం ఎంత నిష్ఠురంగా కోతపెట్టినా శిథిలమవుతూనో లేదా ఇంకా చెక్కుచెదరకుండానో నిలబడి ఉన్న ఆ భవనాలు, ఆ ద్వారాలు, ఆ తోరణాలు, ఆ కోటలు, ఆ కందకాలు- ఇవే కదా మన గతం. కాని ఒక్కసారేనా ఆలోంచించామా? ఆ విశ్వకర్మలు, ఆ మయబ్రహ్మలు ఎవరని? పేర్లు లేవు వారికి, జీవితచరిత్రలు లేవు, కైఫీయతులు లేవు. కాని కాల భూర్జపత్రం మీద వారు రాసిపెట్టిన కావ్యాల్లాంటి ఆ శిల్పాలు మిగిలిపోయాయి. వాటి గురించి ఎవరన్నా ఎప్పుడన్నా ఏమన్నా రాసారా అని కూడా మనమెప్పుడూ ఆలోచించలేదు.

సరే, ఆ శిల్పసమ్రాట్టుల సంగతి అలా వుంచండి. వారి గురించి, వారు సృష్టించి వదిలివెళ్ళిన శిలాసౌందర్యం గురించి, శిల్ప సంగీతం గురించి కవిత్వం చెప్పిన కవుల్ని ఎప్పుడన్నా తలుచుకున్నామా? నలుగురం కూచుని సాహిత్యం గురించి మాట్లాడుకునేవేళల్లో వారి పద్యాల్ని, వారి కావ్యాల్ని ఎప్పుడన్నా స్మరించుకున్నామా? ఏ విశ్వవిద్యాలయమైనా, ఏ సాహిత్య సంస్థ అయినా, చివరికి సాహిత్య అకాడెమీ అయినా ఆ కావ్యాల గురించి ఎప్పుడేనా కనీసం ఒక సెమినారేనా నిర్వహించిందా?

ఎన్ని కావ్యాలు! ఈ పరిశోధనా గ్రంథంలో రెండవ, మూడవ అధ్యాయాలు ఒక్కొక్క పుటనే తిప్పుతూ పోతుంటే నాకు కలిగిన సంభ్రమాన్ని నేను మాటల్లో పెట్టలేను. కంచి శిల్పుల జీవితాలు ఇతివృత్తంగా ‘ధర్మపాల విజయము’ అనే ఒక కావ్యం ఉన్నదని నాకిప్పటిదాకా తెలియదు. బహుశా ఆరుద్రకి కూడా తెలిసి ఉండదు. ఇరవయ్యవ శతాబ్దంలో ఎన్ని కావ్యాలు! ‘హంపీక్షేత్రము’, ‘పెనుగొండ లక్ష్మి’, ‘దక్షారామము’, ‘ముంతాజమహల్‌’ వంటి కావ్యాలు రెండు మూడు మనకి తెలుసు. దాశరథి శిల్పి పైన ఒక ఖండకావ్యం రాసాడని తెలుసు. నారాయణరెడ్డి ఒక సినిమా పాట రాసాడని తెలుసు. ఇంతే. కానీ ‘కల్హారమాల’, ‘శిల్పసుందరి’, ‘తోరణము’, ‘కర్మభూమి’, ‘అమరావతి’, ‘గోల్కోండ’, ‘రాగమయి’, ‘కళాక్షేత్రము’, ‘సౌగంధికము’, ‘మరుత్సందేశము’, ‘మహాబోధి’, ‘చెదురు చినుకులు’ వంటి కావ్యాల గురించి ఎప్పుడేనా మాట్లాడుకున్నామా? ఈ రచనల గురించి మన సాహిత్య చరిత్ర గ్రంథాల్లో ఎందుకు చదవలేదు మనం? భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, అస్తిత్వవాద ఉద్యమాల చుట్టూ మాత్రమే అల్లుకున్న మన కవితావిప్లవాలకు ఈ మహాకావ్యాలు ఎందుకు కనబడలేదు? బహుశా ఆ మహాశిల్ప స్రష్టల్లానే ఈ కావ్యాలు కూడా విస్మృతి శాపగ్రస్తలా? కాని ఒక ప్రసాద్‌ ఉంటాడు, ఇటువంటి భాగీరథిని కాగితాల మీద ప్రవహింపచేసి మన పూర్వీకులకు ఉత్తమగతులు ప్రాప్తింపచేయడానికి.

ఇది ఒక మల్టి డిసిప్లినరి స్టడీ. యజ్ఞం, చిత్రలేఖనం, కుడ్యలేఖనం, లోహశిల్పం, రత్నాభరణాలు, రథాలు, యంత్రాలు, నౌకలు, విమానాలు, అస్త్రశస్త్రాలు- వీటిల్లో ఏ ఒక్క అంశం గురించి మాట్లాడటానికైనా ఎంతో అధ్యయనం చేసి ఉండాలి. ఇక ఆయా అంశాల గురించి తెలుగు సాహిత్యంలో ఎక్కడెక్కడ ఎటువంటి ప్రస్తావనలు వున్నాయో వెతికి పట్టుకుని ఒక్కచోట చేర్చి వాటిమీద సాధికారికంగా మాట్లాడాలంటే ఎంత సమగ్రమైన పరిశ్రమ చేసి ఉండాలి!

చూస్తున్నారు కదా! ఎన్ని ఆశ్చర్యార్థకాలు వచ్చిపడుతున్నాయో నా వాక్యాల్లో! ప్రతి ఒక్క పేజి నన్ను ఆశ్చర్యానికి లోను చేస్తూనే ఉంది. కేవలం తెలుగు కావ్యాలు మాత్రమే కాదు, మరాఠీ కవి ఎ.ఆర్‌.దేశ్‌ పాండే ‘అనిల్‌’ రాసిన కావ్యం ‘భగ్నమూర్తి’ కి సాహిత్య అకాదెమీ చేయించిన అనువాదాన్ని కూడా ఈ పరిశోధకుడు వదిలిపెట్టలేదంటే నా సంతోషాతిశయాన్ని ఏమని చెప్పను? కావ్యాలు మాత్రమే కాదు, గేయాలు, నవలలు, కథలు, నాటకాలు వంటి సాహిత్యప్రక్రియల్లో కూడా శిల్పకళ ప్రస్తుతి ఎక్కడెక్కడ ఉందో అదంతా శోధించి తేనెటీగ తేనె సంగ్రహించినట్టుగా పట్టుకొచ్చి ఈ తేనెపట్టు నిర్మించాడు ఈ భృంగరాజు.

పరిశోధన అంటే ఇది. ఈ పరిశోధనకు డా.కోలవెన్ను మలయవాసిని గారు పర్యవేక్షకులుగా ఉన్నారని విన్నాను. ఆమె గొప్ప విదుషి. తన విద్యార్థితో ఇటువంటి మధుభాండాన్ని సేకరింపచేసినందుకు ఆమె మన అభినందనలకు పాత్రురాలు. ఇటువంటి పరిశోధనకు అవకాశమిచ్చిన ఆంధ్రవిశ్వకళా పరిషత్తుని కూడా అభినందిస్తున్నాను.

నా వరకూ నేను ఈ పుస్తకాన్ని ఒక జీవితకాలపు రిఫరెన్సు గ్రంథంగా దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ కవి ప్రస్తావించిన కావ్యాలు ఒక్కొక్కటీ తెచ్చుకుని చదవాలని అనుకుంటున్నాను. వీలయితే, ఈ సారి ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ కావ్యాల్లోని ఆ పద్యాల్ని అక్కడ బిగ్గరగా నాకై నేను చదువుకోవాలనుకుంటున్నాను. నదీతీరాల్లో మనం మన పూర్వీకులకు తర్పణలు ఘటించినట్టుగా, ఆ మహాశిల్పసముదాయాల ఎదట ఈ పూర్వమహాకవులకు వినయాంజలి సమర్పించాలనుకుంటున్నాను.

ఇంత పరిశోధన చేసిన ఈ పండితుణ్ణి మరొక్క కోరిక కోరుతున్నాను. ఈ కావ్యాలనుంచి ఒక్కొక్క ఖండికనేనా ఏరి ఒక సంకలనం తీసుకువస్తే, ఈ పరిశోధనతో పాటు, ఆ పద్య, గేయ సంకలనం కూడా కాలానికి తోరణాలు కట్టిన శిల్పులకు కీర్తితోరణం కట్టినట్లుగా ఉంటుందని అనుకుంటున్నాను.
తెలుగు జాతి చరిత్రకి, సంస్కృతికి, నాగరికతకి మనం చూపుకోగల గుర్తులు మన శిల్పాలు, దేవాలయాలే. వాటి గురించి ఒక్కచోట ఇలా స్మరణీయంగా అక్షరార్చన చేసిన ఈ పరిశోధన తెలుగు సరస్వతికి మేలిమి కంఠాభరణం. ఆ విధంగా ఈ రచన కూడా మరొక శిల్పవిశేషం కావడం యాదృచ్ఛికం కాదనుకుంటాను.

Feature photo: Kapoteswara Swamy temple, Chejerla, Palnadu district, photo by Author

5-1-2023

16 Replies to “తెలుగు సరస్వతికి మేలిమి కంఠాభరణం”

 1. కాలం ప్రవాహం మీద జీవనది

 2. మీ అపారమైన సాహిత్యాభిరుచికి, నిరంతర సాహిత్య వ్యాసంగానికి నా కైమోడ్పులు.
  అనేక గ్రంథాలను చదువుతూ వేలకొలది పుటల అమూల్యమైన రత్న భాండాగారం లాంటి సాహిత్యాన్ని నిర్మిస్తూ తెలుగు సాహిత్య జ్యోతి కాంతులను పంచుతున్న మీకు శతాధిక వందనాలు.
  మీ దయామృతానుకంపకు కృతజ్ఞతాభివందనాలు.
  మీ సూచనను అనుసరించి శిల్పకళాంశాలు నుడివిన పద్య ఖండికలను పుస్తకంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను

 3. పుస్తక రత్న పరీక్ష చేయగల షరాబు మీరు
  ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేయడమే కాకుండా ఎంతో శ్రమకోర్చి పరిశోధించిన డా.పోతేపల్లి గారి కృషికి మీ వంటి వారి గుర్తింపు
  లభించడం వజ్రాన్ని సానబెట్టటం వంటిదే.ఇరువురికీ అభినందనలు.

 4. పాశ్చాత్య నాగరికత,సంస్కృతి మోజులో పడిన మన జనాలకు,ప్రభుత్వాలకు మన దేశ సంస్కృతి పైన కాని,నాగరికత పైన కాని ఇసుమంతైనా శ్రద్ధ లేదనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
  కనీసం మన మాతృ భాషల పైననే శ్రద్ధ లేనివారికి
  ఇంకా లలిత కళల పై శ్రద్ధ ఏముంటుంది.

  ఎక్కడో నూటికో కోటికో మీ వంటి వారు ఇలాంటి అమూల్యమైన విషయాలను ఎత్తి చూపినపుడు
  సహృదయుల మనస్సు తపిస్తుంది. అయ్యో!మనమెంత మెటీరియలిస్టిక్ చదువులకే అంకితమై పోతున్నాము.
  ప్రపంచమంతా భౌతిక సుఖాలపైనే పరుగులు పెడుతోంది.
  ఇలాంటి వాటిపై ఏ కోందరికో

  మీ విశ్లేషణ ఎన్నెన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది.
  కాని ఒకింత వయస్సు మీరిన ఈ దశలో మీ వంటి వారి కృషిని చదివి సంతృప్తిని పొందడమే తప్ప ఏం చేయగలం. అంత సృజనాత్మక శక్తి , ఓపిక,దీక్ష
  కొందరికిమాత్రమే స్వంతం.

  ధన్యవాదాలు sir.

 5. మంచి పరిశోధనా గ్రంధాన్ని పరిచయం చేశారు.

 6. నిజమే!
  ఒక పురాతన శిల్పం ముందు నిలబడి తదేకంగా వీక్షిస్తున్నపుడు మనం అప్రయత్నంగా ఆ కాలంలోకి వెళ్ళిపోతాం.
  ఆ శిల్పి చేతిలో ఆ శిల్పం రూపుదిద్దుకుంటున్న
  క్షణాలు మదిలో మెదిలి ఇదీ అని స్పష్టంగా చెప్పలేని మిశ్రమ భావ పరిమళం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

  మాయలో బ్రతుకుతున్న మనకి మనం లేనప్పటి ఆ కాలం గమ్మత్తుగా…తత్వం చెబుతున్నట్టుగా,భగవంతుడికి దగ్గరగా వెళ్ళినట్టుగా…అది ఒక అనిర్వచనీయమైన
  అనుభూతి అనిపిస్తుంది.
  అటువంటి శిల్ప సంపద మీద పరిశోధనా గ్రంథం అంటే మరిన్ని పరిమళాలతో హృదయం ఉక్కిరిబిక్కిరి అయిపోతుందేమో
  మాష్టారూ!🙏🙏🙏

 7. మల్లాది రామకృష్ణశాస్త్రి గారి “తేజోమూర్తులు” నవల చదువుతుంటే, అందులో ప్రస్తావించిన “శిల్ప వైద్యం” గురించి వెతుకుతుంటే మీ బ్లాగ్ పోస్ట్ కి చేరాను.

  ఈ గ్రంథం ఎక్కడ అందుబాటు అవతుంది అండి ?

  1. పిబిడివి ప్రసాద్ గారిని సంప్రదించగలరు. వారి ఫోను నెంబరు +91 70136 43274 . మీరు నా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: