ఆ వెన్నెల రాత్రులు-30

నలభయ్యేళ్ళయింది. ఇప్పుడు మళ్ళా మరొక వైశాఖ మాస ప్రభాతాన ఇలా కూచుని, నా జీవితంలో ఒకప్పుడు, రెండు వైశాఖమాసాల మధ్య నేలకీ నింగికీ మధ్య ఊయెలూగిన నా మనోడోలికను నేనే ఆశ్చర్యంగా పరికిస్తో వున్నాను.

నగరంలో కోకిల అందరికన్నా ముందు తాను లేచి ప్రపంచాన్ని మేల్కొల్పుతోంది. ఇక ఇప్పణ్ణుంచి రాత్రిదాకా అది చిన్నపిల్లలాగా ఆకాశం తలుపులు ఊరికే తెరిచి మూస్తూ మళ్లా తెరుస్తూ ఉంటుంది. నా ఎదట ఉన్న పచ్చతురాయి చెట్టు మీద ఎక్కడెక్కణ్ణుంచో ఎన్నో రకాల పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఏపాటి చిరుగాలి వీచినా ఆ పూలరేకలు జలజలమని రాలిపోతుంటాయి. ఈ కిటికీ దగ్గర కూచుని ఈ రాధాచూరవృక్షాన్ని చూస్తూ ఉంటాను. ‘నీ జీవితంలో నువ్వెవరినైనా ప్రేమించేవా?’ అని మధురిమ నన్ను అడిగిన తర్వాత ఈ నెలరోజులుగానూ ఈ చెట్టు నే చూస్తో, ఈ పూలరేకల జాడలు పట్టుకుని నా లోపలకి నేను ప్రయాణం చేస్తూ వచ్చాను.

ఇది నోస్టాల్జియానే. నేను దాటివచ్చిన కాలానికీ, స్థలానికీ ఎలానూ పోలేనని తెలుసు. కాని నేను అప్పటి నా మనఃస్థితికి ప్రయాణించగలనా అని చూశాను. నన్ను నేను మభ్య పెట్టుకోకుండా, అప్పటి నా ఆనందాలకీ, భయాలకీ మరొకమారు చేరుకోగలనా అని చూసాను. నా మీదా, మరొకరిమీదా ఎటువంటి తీర్పులూ తీర్చకుండా, అప్పటి నా మనఃస్థితిని తిరిగి అందుకోగలనా అని చూసాను. నేను ఎంత వరకూ సఫలురాలినయ్యానో నాకు తెలీదు.

‘ప్రేమించావా?’ అని కదూ అడిగింది. ప్రేమ అంటే ఏమిటి? ఇప్పటికీ నాకు ఈ ప్రశ్నకి అర్థం తెలియలేదు. ఇన్నేళ్ల జీవితంలో బాధ్యత అనే మాట అర్థం చేసుకోగలిగాను. మోహం అంటే ఏమిటో కూడా తెలుసుకోగలిగాను. ఇన్నేళ్ళ జీవితంలో రకరకాల మనుషుల పట్ల రాగద్వేషాలు కూడా ఏదో ఒక మేరకు అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. ఆ పరిభాషలోంచే చూస్తూ, ప్రేమని కూడా మనం స్త్రీపురుషుల మధ్య తలెత్తే ఒక ఆకర్షణగా, ఉద్వేగం, ఉన్మాదంగా గుర్తుపడుతున్నామా?  ఆ అవస్థలన్నిటినీ కలిపికట్టి ప్రేమ అని పిలుస్తున్నామా?

అలా అయితే నా కథ ప్రేమకథ కాదు.

ప్రొఫెసర్ సేన్ గుప్త ఒక రోజు ప్రేమ గురించి చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆయన దాన్నొక సింబాలిక్ ఫ్రేమ్ వర్క్ అనడం గుర్తుంది. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామన్న ఏ రెండు హృదయాలైనా ఆ ఫ్రేమ్ వర్క్ లో ఇమడకపోతే, ఒకరి ప్రేమ మరొకరికి అర్థం కాదని ఆయన చెప్పినమాటలు బాగా గుర్తున్నాయి. ఆ మాట చెప్పడానికి మొత్తం మానవజాతి పరిణామం మీదనే ఆయనొక పెద్ద లెక్చరిచ్చాడు అవాళ.

కాని నిజంగా నా జీవితానుభవానికి వచ్చినప్పుడు నాకు ఆయన మాటల వల్ల ఏమీ తెలియలేదు. ప్రేమ అనే రెండు అక్షరాలు నన్ను తీవ్రంగా భయపెట్టినప్పుడు ఆయన మాటలు నాకేమీ ఓదార్పునివ్వలేదు. అసలు ప్రేమని ఇంటలెక్చువల్ పరిభాషలో ఎప్పటికీ అర్థం చేసుకోలేం అనిపించింది. ఆయన మాటలేకాదు, నేను చదివిన ఏ ప్రేమకథా కూడా నాకు దారి చూపించలేదు.

నా పెళ్ళయిన తర్వాత ఎన్నో ఏళ్ల పాటు నాలో ఒక ప్రశ్న కదలాడుతూనే ఉండింది. ‘అంతా బాగానే ఉంది. అతను నిన్ను ప్రేమిస్తున్నానని రాసాడు. నీకతని మీద ప్రేమ కలగలేదు. సరే. కానీ ఆ మాటే అతనికి చిన్న చీటీ రాసి ఉండవచ్చు కదా! ఎందుకు? ఎందుకని అతనికి కనీసం చిన్న కార్డు కూడా రాయలేకపోయావు? ఎందుకని అతనికి నీ వెడ్డింగ్ కార్డు పంపలేదు? పంపితే అతని హృదయానికి గాయమవుతుందనే ఏదో అత్యంత బలహీనమైన భావన ఏదో, నీలోపల్లోపల కదలాడుతూ ఉందా? ఏం అతను బాధపడితే నీకేమిటి? నువ్వతణ్ణి ప్రేమించడం లేదు కదా!’- ఇదీ ప్రశ్న.

ఇన్నాళ్ళుగా నా తలపోతల్లో గడుపుతూ వచ్చాక ఇప్పుడు నాకు అర్థమయిందేమంటే, నేను కూడా ఆ రోజుల్ని ఎంతో గాఢంగా ప్రేమించానని. ఆ రోజుల్లో భాగంగా అతణ్ణి కూడా ప్రేమించానని. ప్రేమ- అంటే, ఇప్పటి పిల్లలు చెప్తుంటారే- ‘అతనంటే నాకు ఫీలింగ్స్ కలుగుతున్నాయి’ అనో లేదా ‘అతనికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాని, నాకు లేవనో’- అలాంటి అర్థం లో కాదు. ప్రేమంటే అలాంటి పొసెసివ్ ఫీలింగు కానే కాదు.

తలపోతల్లో తియ్యని బాధ ఉంటుంది, వాటిలో స్వీట్ మెలాంకలి తప్ప మరేమీ ఉండదంటారు మామూలుగా. కాని ఎక్కడో చదివాను, నోస్టాల్జియా అన్నిటికన్నా ముందు మనల్ని ప్యూరిఫై చేస్తుందని. నా తలపోతలు నన్ను నా ముందు సాహసంగా నిలబడేటట్టు చేసాయని ఇప్పుడు తెలుస్తోంది. ఇన్నాళ్ళూ నన్ను నేను ముఖాముఖి ఎదుర్కోలేకపోయాను. నా అంతరాంతరాల్లో ఏదో ఆరని దీపంగా వెలుగుతూ ఉంది గాని, ఆ మందిరం తెర తొలగించి చూడటానికి నాకిన్నాళ్ళూ సాహసం లేకపోయింది.

నా తలపోతల్లో నేను మర్చిపోయాననుకున్నవి ఎన్నెన్నో గుర్తొస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ళూ అవి జ్ఞాపకాల పెట్టెలో అడుగున ఉండిపోయేయి. అలాంటి వాటిల్లో ఇరవయ్యేళ్ళ కింద నేను విన్న మాటొకటి నాకు ఈ రెండు మూడు వారాలుగా పదే పదే గుర్తొస్తూ ఉంది. అది ఒక మహాకవి అన్నాడని ఎక్కడో చదివాను. ఒక ఋషిలాంటి కవి. భగవంతుడి గురించి చెప్తూ ‘ఆయన ఉనికి కన్య స్నేహం వంటిది’ అని అన్నాడట ఆ కవి.

‘కన్య స్నేహం.’

భగవంతుడి ఉనికి కన్నె కలల్లాంటిదో, యువతి వలపులాంటిదో అని అనకుండా కాకుండా ‘కన్య స్నేహం’ వంటిదని ఆయన ఎందుకన్నాడు?  ఒక బిడ్డ స్నేహం అనో, తల్లి స్నేహం అనో అనకుండా కన్య స్నేహం అని మాత్రమే ఎందుకన్నాడు?

ఇరవయ్యేళ్ళుగా నాలోపల్లోపల అదొక ప్రశ్నగానే ఉండిపోయింది. అటువంటి ప్రశ్నలు నీ జీవితగమనానికీ, నీ రోజువారీ జీవితానికీ ఏ విధంగానూ అడ్డుపడవు. ఆ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే నువ్వు ఏ ఇంటర్వ్యూలోనో సెలక్ట్ కావనే భయమేమీ ఉండదు. ఏదో పరీక్షలో నెగ్గవేమో అనే టెన్షన్ ఉండదు. కాని అటువంటి ప్రశ్నలుంటాయి, నీ అంతట నువ్వు, నీ జీవితపు ఏ మలుపులోనో, జవాబు వెతుక్కునేదాకా, అవి నిన్ను వెన్నంటే ఉంటాయి.  ఈ జీవితకాలంలో వాటికి నువ్వు జవాబు చెప్పుకోలేకపోతే, బహుశా మరుజన్మకి కూడా నీ వెంట వస్తాయి.

ఇప్పుడు నా తలపుల తలపోత నన్ను శుభ్రపరుస్తూ వచ్చాక ఆ ప్రశ్నకు నాకు జవాబు దొరికింది. ఆ రోజుల్లో, ఆ రాత్రుల్లో మేము కలిసి గడిపిన ఆ అనుభవాలు ఒక్కొక్కటే గుర్తొస్తూ ఉంటే, ఆ జవాబు నాకు నెమ్మదిగా తెలుస్తూ వచ్చింది.

కన్య కూడా ఒక బాలికనే. పసిపాపనే. పసిపాప ఎంత నిర్మలచిత్తనో ఒక కన్య కూడా అంత నిర్మల మనస్కనే.  అసలు ఒక కన్య అనేమిటి? పదహారేళ్ళనుంచి పాతికేళ్ళ వయస్సులో ఉండే యువతీయువకులంతా నిర్మల మనస్కులే. పసిపిల్లలే. పిల్లల్లాగా, దేవుడిలాగా చల్లనివారే, కల్లకపటమెరుగని కరుణామయులే.

‘ఆయన ఉనికి కన్యస్నేహం వంటిది’ అనే మాటని, నేను ‘ఆయన ఉనికి యువతీయువకుల స్నేహం వంటిది’ అని మార్చుకుంటే ఆ కవీశ్వరుడు కాదనడనే అనుకుంటున్నాను.

అవును. ఒక యువతి, ఒక యువకుడు- ఆ వయసులో వాళ్లకి నేను, నువ్వు అనే తేడాలుండవు. ఒకరిని స్వంతం చేసుకోవాలనే తలపుగాని, ఎవరో ఒకరికే తాను స్వంతం కావాలనే తలపు గాని ఉండవు. ఆ వయసులో వాళ్ల మనసుల్లో ఉండేదే- అదే ప్రేమ. దాన్ని ప్రాపంచికమైన మరే పదంతోనూ నువ్వు వివరించలేవు. పసిపిల్లలు అలా ఉంటారు. కాని తాము అలా ఉంటున్నామని వాళ్లకి తెలియదు. యువతీయువకులు అలా ఉంటున్నప్పుడు తాము అలా ఉంటున్నమనే ఎరుక ఏ కొంతనో వారికి ఉండకుండా పోదు. కొంత మెలకువతో కూడిన కలల ప్రపంచం వాళ్ళది. అందుకనే ఆయన ‘బిడ్డ స్నేహం’ అనలేదు. ‘కన్యస్నేహం’ అన్నాడు. ఇక ఆ తర్వాత, నువ్వు పెద్దయ్యే కొద్దీ, ఆ మనస్థితి నీలోంచి నెమ్మదిగా అదృశ్యమైపోతుంది.

అవును. మేమిద్దరం ఆ అడవిలో, ఆ కొండల మధ్య, ఆ పొలాల్లో, ఆ వెన్నెల్లో, ఆ ఏటి ఒడ్డున, ఆ రెల్లుపొదల  దగ్గర పిల్లలాంటి మనసుతో సంచరించిన యువతీయువకులం. కానీ, ఆ జీవితం నుంచి బయటపడ్డాక అతను నన్ను స్వంతం చేసుకోవాలని అనుకున్నాడు, నేను మరొకరెవరికో స్వంతం కావాలని అనుకున్నాను. ఇద్దరి కోరికల్లోనూ తప్పులేకపోవచ్చు. ఇద్దరి స్వప్న ప్రపంచాలూ సమంజసమైనవే కావచ్చు. కాని, ఏ క్షణం మేం మా మా కలలప్రపంచాల్లోకి అడుగుపెట్టామో, ఆ క్షణమే ఆ నిర్మల ప్రపంచం నుంచి ఇద్దరమూ దూరమైపోయాం. ఒకరి నుంచి మరొకరు కూడా దూరంగా జరిగిపోయాం.

ఆ రోజుల్లో మేమంతా సామూహికంగా ఒక సంతోషాన్ని అనుభవించాం. అది ఒక పండక్కి బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు మనమంతా కలిసి గడపడం లాంటిది. ఆ సంతోషానికి ఏ ఒక్కరో కారణం కాదు. ప్రతి ఒక్కరూ కారణం. అన్నిటికన్నా ముందు ఆ సందర్భం కారణం. కాని ఆ ఇళ్ళల్లో ఉండే ఏ పిల్లవాడో ఆ సంతోషానికి ఫలానా బంధువే కారణం అనుకుని ఆ బంధువుకేసే చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? రాజు నాకు ఉత్తరాలు రాయడం అలాంటిదే అని ఇప్పుడు అనిపిస్తోంది.

ఆ రోజుల్లో అక్కడ ఉండగా ఈ స్పష్టత నాకు ఒనగూడి ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో. లేదా కనీసం, ఎన్నో ఏళ్ల పాటు నేను అనుభవించిన సంఘర్షణని అనుభవించవలసిన పని లేకపోయి ఉండేదేమో.

అవును. ఆ వెన్నెల రాత్రుల్లో నాకు కూడా ప్రేమ అనుభవానికొచ్చింది. కాని అది ఏ ఒక్క వ్యక్తిపట్లనో ప్రేమ కాదు. ఏ ఒక్క వ్యక్తినో నా మనిషిగా మార్చుకోవాలన్న ప్రేమ కాదు. అది ప్రతి ఒక్కరి పట్లా ప్రేమ. నేను ప్రొఫెసర్ని ప్రేమించాను, డా.మిశ్రాని ప్రేమించాను, వనలతను ప్రేమించాను, రోజాని ప్రేమించాను, అలాగే రాజుని కూడా ప్రేమించాను. కాని వాళ్ళెవర్నీ విడివిడిగా ప్రేమించలేదు. అసలు అప్పుడు, అక్కడ ఎవరికీ విడివిడి వ్యక్తిత్వాల్లేవు. అందరిదీ ఒకటే దేహం. ఒకటే మనస్సు. ఆ కొండవారలోయలో ఆ చైత్రమాసపు వెన్నెల రాత్రి ఆ గిరిజన స్త్రీపురుషసమూహమంతా ఏకగోత్ర, ఏక గాత్ర సహపంక్తిగా వర్ధిల్లినప్పుడు దేవతలంతా ఆ నృత్యం చూడ్డానికి వచ్చారంటే, అందుకే, అది నాకు అబద్ధమనిపించలేదు.

ఎటువంటి మనఃస్థితి అది! అటువంటి ఏకమనస్కులైన ఒక మానవసమూహం ఒక్క పాఠశాల నిర్మించడమేమిటి, తలచుకుంటే, స్వర్గాన్నే భూమ్మీదకు దింపగలుగుతారు. కాని ఆ మనఃస్థితినుంచి పక్కకు జరిగాక, నువ్వూ, నీ మనసూ, నీ జీవితం అనే తలపు మొదలయ్యాక, ఒక వెడ్డింగ్ కార్డు ప్రింటు చేయించుకోడం కూడా ఎంతో పెద్దపనిగా మారిపోతుంది.

నా తలపుల దారుల్లో ఇన్నాళ్ళూ ప్రయాణం చేసాక నాకు అర్థమయిందేమంటే ప్రేమ ఒక సింబాలిక్ ఫ్రేమ్ వర్క్ అని అనుకున్నా కూడా అది ఒక్కరికో, ఇద్దరికో పరిమితమైన భావప్రసారం కాదు. అదొక సామూహిక సద్వర్తన. సామాజిక సద్వర్తన.

ఒక మనిషిని గాఢంగా కామించడమో, మోహించడమో ప్రేమ కానే కాదు. ప్రతి ఒక్క కాముకతాపర్యవసానంలోనూ తప్పకుండా ఒక క్రైమ్ పొంచి ఉంటుంది. తీవ్ర మోహపర్యవసానం ప్రతి సారీ హత్యకో, ఆత్మహత్యకో దారి తీస్తుంది. కాని ప్రేమ పర్యవసానం? నీడలేని బడికి ఒక గూడు దొరుకుతుంది. ప్రసవం కష్టమైన ఒక స్త్రీకి సకాలంలో వైద్యం అందుతుంది. రోజంతా అడవికిపోయి ఆకలి కడుపుతో బీడీ ఆకులు సేకరించే ఒక గిరిజన కుటుంబానికి, ప్రతి కట్టమీదా కనీసం రెండు పైసలు అదనం ఆదాయం దొరుకుతుంది. అలాగని ఇలా ఏదో ఒకటి జరుగుతుందని చెయ్యడం- ప్రేమ కాదు. అప్పుడది ఎజెండా అవుతుంది, మానిఫెస్టో అవుతుంది, మళ్ళా ఒక కొత్త హయరార్కీ అక్కడికొచ్చి చేరుతుంది.

అన్నిటికన్నా ముందు యువతీయువకుల తొలియవ్వనకాలంలో అటువంటి మనఃస్థితి ఉంటుందని గుర్తుపట్టడం ఒక విద్య. ప్రేమ విద్య. కాని మహాకవి చెప్పినట్లుగా ఆ విద్య ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు, బళ్ళో ఉపాధ్యాయులూ చెప్పరు, దానికి పాఠ్యపుస్తకాలూ, సిలబస్, కరికులం ఎలా ఉంటాయో తెలియదు. ప్రేమ అంటే యాసిడ్ దాడిగానే పరిణమించే కళాశాలలు మనవి. ఇంక ప్రేమ అంటే ఏమిటో చెప్పేవాళ్ళెవరు? కవులూ, రచయితలూనా?  ప్రేమ సౌభాగ్యం వల్ల కాక, ప్రేమరాహిత్యం వల్లనే మనుషులు కవులుగా మారుతున్న సమాజం మనది.

కానీ. విమలా, ఒక్క మాట చెప్పు. మనుషులు ఎప్పటికీ తమతొలియవ్వన ప్రాయంలోనే ఉండిపోతారా? తమ తమ జీవితాల్లోకి తాము ప్రయాణించకుండా అక్కడే ఆగిపోతారా?

లేదు. మనుషులు అక్కడ ఆగిపోరు. ఆగిపోకూడదు కూడా. కాని ఆ తొలియవ్వన కాలం ఒక ప్రేమపాఠశాల. అప్పటి ఆ నిర్మల మనఃస్థితి నీకు నేర్పే చదువు నీ జీవితకాలం పొడుగునా నీకు తోడుగా వస్తుంది. నీ తదనంతర జీవితంలో నువ్వు కలుసుకున్న యువతీయువకులకి నువ్వు ఆ మెలకువని పంచిపెడతావు. ప్రొఫెసర్ సేన్ గుప్త చేసింది అదే. అతనికి తెలుసు. తన తొలియవ్వన కాలపు బెంగాల్ కి తాను తిరిగిపోలేడని. అందుకనే ఒకప్పటి తన గ్రామాల్ని తర్వాత తాను నడిచిన ప్రతి గ్రామంలోనూ, ఆ కొండల్ని తాను చూసిన ప్రతికొండలోనూ వెతుక్కుంటూ తిరిగేడు. ఆయన నీడలో పెరిగింది కాబట్టే, వనలత, ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదని తెలుసుకోగలిగింది.

ప్రపంచం చాలా చిన్నది. సూర్యనారాయణమూర్తిగారి చిన్నమ్మాయి తర్వాత రోజుల్లో విశాఖపట్టణంలో కాలేజి లెక్చరర్ గా పనిచేస్తో ఎలాగో నా అడ్రసు పట్టుకుని కాంటాక్ట్ లోకి వచ్చింది. ఆమె చెప్పింది, ప్రొఫెసర్ సేన్ గుప్త, ఆ తర్వాత రోజుల్లో కర్నూలు-కడప బేసిన్ లో ఫీల్డ్ వర్క్ లో ఉండగా, నల్లమల కొండల్లో, ఈ లోకాన్ని విడిచిపెట్టేడని. ఇంకా చాలా సంగతులు చెప్పింది. మేము వచ్చేసిన రెండు మూడేళ్ళ  తర్వాత ఆ ఊళ్ళల్లో నక్సలైట్లు ప్రవేశించేరనీ, ఎన్నో గిరిజనేతర కుటుంబాలు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేరనీ, అందులో రాజు కుటుంబం కూడా ఒకటనీ చెప్పింది. మేమక్కడ ఉన్నప్పుడు ఆ ఊరు, డా.మిశ్రా చెప్పినట్టు, నిజంగానే ఒక వోల్కెనో మీదనే ఉందన్నమాట అనుకున్నాను.

మరి రాజు ఇప్పుడెక్కడున్నాడో తెలిసిందా?

తెలిసింది. కాని ఆ రాజు మీద నాకేమీ ఆసక్తి లేదు.

నాకు తెలిసిన రాజు- రవీంద్ర సంగీత్ లాగా, నజ్రుల్ గీతి లాగా, ఏటి ఒడ్డున విన్న ఎంకి పాటలాగా, నింగినీ, నేలనీ కలిపిన గంగాలమ్మ ఊయల్లాగా, దేవతలు తిలకించిన కొండరెడ్ల నాట్యం లాగా, ఆ వెన్నెల రాత్రుల్లో ఒక భాగంగా ఎప్పటికీ నాతోనే ఉంటాడు.

(అయిపోయింది)

3-5-2023

24 Replies to “ఆ వెన్నెల రాత్రులు-30”

 1. అతని ఉనికి ‘కన్య స్నేహం’ వంటిది. అతని ఉనికే ప్రేమ .ప్రేమ ఒక దైవీభావన. అది ఒక అసంకల్పిత నిర్మల ఆత్మోపాసన.అనుభవైకవేద్యమా విలాసపు విలాసం .
  గొప్ప ముగింపు. ప్రశ్నకు డెమో తరహాలో జవాబు. ఇది అవగాహన చేసుకునేంత సాహిత్య సంపన్నత యువతరానికి చేరినప్పుడు గుడులు బడులు మమేకమౌతాయి. అడవులు తుపాకీ తూటాల కార్చిచ్చులతో కాకుండా హోమహవిస్సులతో
  పవిత్ర హోమధూమావరణంతో ప్రక్షాళన జరుగు తుంది. అసలైన ధ్యాన సమారాధన, సంశోధన మునుపటి మునుల దారిలో కొనసాగుతుంది. మనకు ఒక బోయ ఆదికవి. మనది వనవిజ్ఞానం. అదే పావనఉద్యానం.
  మంచి కథాంశంతో మనోవిశ్లేషణ చేస్తూ అందించిన వచన కావ్యం వెన్నెల రాత్రులు.
  నమస్సులు. కృతజ్ఞతలు. అభినందనలు.

 2. ఇదే ముగింపే నేను ఆశించినది .కన్య స్నేహం ఎంత చక్కటి మాట .నాకు ఆ స్నేహం దొరికింది .దానిని నా తరువాతి జీవితంతో ముడిపెట్టాలని అనిపించలేదు.
  ఈ సూత్రం నాకు తెలిసిన కొంత మంది యువతీయువకులకు కూడా తెలుసునన్నదే ముందు తరాల పట్ల ఇంకా భరోసా కలిగిస్తోంది.

 3. అద్భుతమైన ముగింపు ఇచ్చారండీ వీరభద్రుడు గారు.. ఈ భాగం.. వరసగా రెండు మూడు సార్లు చదివాను.. అంత బాగుంది.. ప్రేమకు మీరిచ్చన నిర్వచనాలు.. ప్రతి వ్యక్తి తమ టీనేజ్ దాటి పాతిక సంవత్సరాల్లో కి పయనించినప్పుడు ఎదుర్కొన , అనుభవించిన అనుభూతులు.. మీరన్నట్టు ఎవరి సంతోషానికైనా కారణం ఒక వ్యక్తి కానీ కాదు.. ఒక సందర్భం.. ఈ చివరి భాగం లో నాకు చాలా నచ్చిన వాక్యాలు.. పడే పడే చదువుకోవాలనిపించే వాక్యాలు…

  ఆ రోజుల్లో మేమంతా సామూహికంగా ఒక సంతోషాన్ని అనుభవించాం. అది ఒక పండక్కి బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు మనమంతా కలిసి గడపడం లాంటిది. ఆ సంతోషానికి ఏ ఒక్కరో కారణం కాదు. ప్రతి ఒక్కరూ కారణం. అన్నిటికన్నా ముందు ఆ సందర్భం కారణం. కాని ఆ ఇళ్ళల్లో ఉండే ఏ పిల్లవాడో ఆ సంతోషానికి ఫలానా బంధువే కారణం అనుకుని ఆ బంధువుకేసే చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? రాజు నాకు ఉత్తరాలు రాయడం అలాంటిదే అని ఇప్పుడు అనిపిస్తోంది.

  అవును. ఆ వెన్నెల రాత్రుల్లో నాకు కూడా ప్రేమ అనుభవానికొచ్చింది. కాని అది ఏ ఒక్క వ్యక్తిపట్లనో ప్రేమ కాదు. ఏ ఒక్క వ్యక్తినో నా మనిషిగా మార్చుకోవాలన్న ప్రేమ కాదు. అది ప్రతి ఒక్కరి పట్లా ప్రేమ. నేను ప్రొఫెసర్ని ప్రేమించాను, డా.మిశ్రాని ప్రేమించాను, వనలతను ప్రేమించాను, రోజాని ప్రేమించాను, అలాగే రాజుని కూడా ప్రేమించాను. కాని వాళ్ళెవర్నీ విడివిడిగా ప్రేమించలేదు. అసలు అప్పుడు, అక్కడ ఎవరికీ విడివిడి వ్యక్తిత్వాల్లేవు. అందరిదీ ఒకటే దేహం. ఒకటే మనస్సు. ఆ కొండవారలోయలో ఆ చైత్రమాసపు వెన్నెల రాత్రి ఆ గిరిజన స్త్రీపురుషసమూహమంతా ఏకగోత్ర, ఏక గాత్ర సహపంక్తిగా వర్ధిల్లినప్పుడు దేవతలంతా ఆ నృత్యం చూడ్డానికి వచ్చారంటే, అందుకే, అది నాకు అబద్ధమనిపించలేదు.

  మళ్లీ మళ్లీ చదవాలనిపించే గొప్ప రచన మీ ఈ వెన్నెలరాత్రులు.. రేపటినుంచి ఇంక చదవడానికి ఉండదంటే చాలా బెంగగా వుంది.. బాగా మిస్సవుతా విమల మనస్సు లో జరిగే ఆలోచనల అలజడిని.. పుస్తకరూపంలో వచ్చినప్పుడు కవర్ పేజీ ఎలా డిజైన్ చేస్తారో అని ఎదురు చూస్తూ..

  — విజయ సారథి జీడిగుంట.

  1. మీరీ రచన చదువుతూ నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహంగా అనిపించింది. ఇప్పుడు మీరు రాసిన ఈ వాక్యాలు నా రచనకు లభించిన శుభాశీస్సులుగా భావిస్తున్నాను. ధన్యవాదాలు.

 4. ముగింపు చాలా బాగుంది . ప్రేమ గురించి విమల ఆలోచనలు తెరిపి నిచ్చాయి .చాలా పరిణతి కల విమలలే కావాలి ఇప్పుడు

 5. “ఆ వెన్నెల రాత్రుల్లో నాకు కూడా ప్రేమ అనుభవానికొచ్చింది. కాని అది ఏ ఒక్క వ్యక్తిపట్లనో ప్రేమ కాదు. ఏ ఒక్క వ్యక్తినో నా మనిషిగా మార్చుకోవాలన్న ప్రేమ కాదు. అది ప్రతి ఒక్కరి పట్లా ప్రేమ.—-అప్పుడు, అక్కడ ఎవరికీ విడివిడి వ్యక్తిత్వాల్లేవు. అందరిదీ ఒకటే దేహం. ఒకటే మనస్సు.—ఏకమనస్కులైన ఒక మానవసమూహం తలచుకుంటే, స్వర్గాన్నే భూమ్మీదకు దింపగలుగుతారు.–“”There is no love greater than love with no object; for then you, yourself have become love itself.” –Rumi

  వందనాలు..

 6. వందనాలు..
  “ఆ వెన్నెల రాత్రుల్లో నాకు కూడా ప్రేమ అనుభవానికొచ్చింది. కాని అది ఏ ఒక్క వ్యక్తిపట్లనో ప్రేమ కాదు. ఏ ఒక్క వ్యక్తినో నా మనిషిగా మార్చుకోవాలన్న ప్రేమ కాదు. అది ప్రతి ఒక్కరి పట్లా ప్రేమ.—-అప్పుడు, అక్కడ ఎవరికీ విడివిడి వ్యక్తిత్వాల్లేవు. అందరిదీ ఒకటే దేహం. ఒకటే మనస్సు.—ఏకమనస్కులైన ఒక మానవసమూహం తలచుకుంటే, స్వర్గాన్నే భూమ్మీదకు దింపగలుగుతారు.–“”There is no love greater than love with no object; for then you, yourself have become love itself.” –Rumi

 7. //ఆ తొలియవ్వన కాలం ఒక ప్రేమపాఠశాల. అప్పటి ఆ నిర్మల మనఃస్థితి నీకు నేర్పే చదువు నీ జీవితకాలం పొడుగునా నీకు తోడుగా వస్తుంది. నీ తదనంతర జీవితంలో నువ్వు కలుసుకున్న యువతీయువకులకి నువ్వు ఆ మెలకువని పంచిపెడతావు.//

  //అన్నిటికన్నా ముందు యువతీయువకుల తొలియవ్వనకాలంలో అటువంటి మనఃస్థితి ఉంటుందని గుర్తుపట్టడం ఒక విద్య. ప్రేమ విద్య. కాని మహాకవి చెప్పినట్లుగా ఆ విద్య ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు, బళ్ళో ఉపాధ్యాయులూ చెప్పరు, దానికి పాఠ్యపుస్తకాలూ, సిలబస్, కరికులం ఎలా ఉంటాయో తెలియదు. ప్రేమ అంటే యాసిడ్ దాడిగానే పరిణమించే కళాశాలలు మనవి. ఇంక ప్రేమ అంటే ఏమిటో చెప్పేవాళ్ళెవరు? కవులూ, రచయితలూనా? ప్రేమ సౌభాగ్యం వల్ల కాక, ప్రేమరాహిత్యం వల్లనే మనుషులు కవులుగా మారుతున్న సమాజం మనది.//

  ప్రారంభ ఎపిసోడ్స్ నుండి గమనిస్తున్నాను. ప్రధమ పురుష కథనంలో సాగే ఈ అంతర్లోచన రేఖామాత్రంగా ప్రస్తుత జీవితాన్ని స్పృశించిన తీరు..ప్రతిచోటా ఆ పాత్ర తనకేదురైన పరిచయాల పట్ల స్పష్టమైన అవగాహన ఎరుక పరచడం..ముఖ్యంగా కౌమార, యవ్వన ఉద్వేగాన్ని ఆప్పుడు ఆమె ఎదుర్కున్న పరిణితి..ఇన్నేళ్ల తర్వాత జ్ఞాపకాల సందూకలో కదలిక తర్వాత కూడా నిశ్చలత్వం చూస్తే పైన పేర్కొన్న రెండు పేరాల్లోని సారాంశం తో సహా ఇదో మనో నిర్భరత అభ్యాస పాఠం వంటిదే. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో కలిగే ఆకర్షణలు , తద్విపరినామాల పట్ల స్పష్టమైన అవగాహన కోసం ఈ వెన్నెల రాత్రులు చదవాలి.ప్రకృతి సౌందర్యం..సమాజ నిర్మాణం ..అంతర్లోచన అవగాహన నేపథ్యంలో ఈ రచనా మరో మంచి కథనం.
  ముగింపు అనివార్యం .అయితే ఇదే ఇలాంటి మరో అపురూపాలకు నాంది గా భావిస్తూ..
  మిక్కిలి ధన్యవాదాలు సర్.

 8. అద్భుతమైన రచన.
  మాటల్లో చెప్పలేనన్ని అభినందనలు.

 9. ఒక సాధారణ సంభాషణ లో ఒలికిన ఒక అతి సాధారణ ప్రశ్న ఈ తరం యువత(యువతి) అడిగితే అందరూ ఆశించే సింపుల్ సమాధానానికి అందకుండా, అత్యంత సునిశిత పరిశీలనతో  , భావుకతతో కూడిన నోస్టాల్జియా కబుర్ల ద్వారా మనసుకి హత్తుకునే చిరస్మరణీయ ముగింపు ,అందించిన తీరు అనితర సాధ్యం మరియు అద్వితీయం. అది కూడా మరో మహిళ తన జీవన యానం లో (పరిపక్వమైన మనసు తో ) కదిలిన ప్రతీ మాటా, జరిగిన ప్రతీ  సంఘటన స్పృశించి. సందర్శించి విశ్లేషించి, వివరించిన తీరు అమోఘం. ఏ ఒక్క చోటా ప్రేమ అన్న పదాన్ని వదలకుండా అనేకానేక కోణాల్లో దానిని  అక్కున చేర్చుకుని, ఆ మాటకు అసలైన అర్థాన్ని అందమైన ప్రకృతి అండగా, ఆహ్లాద గీతాల సాక్షిగా , ఈ తరం యువత కి అర్పించిన ఘనత , కీర్తి అంతా మీదే. మనఃపూర్వక శుభాభినందనలు. ఇలాంటి మహత్తరమైన మనసుకి హత్తుకునే మరిన్ని కౌముది కథలను ఆశిస్తూ ,,

 10. ప్రశాంతంగా ఉన్న మానస సరోవరంలో ‘మీరు ఎవరినైనా ప్రేమించారా’ అన్న ప్రశ్న గులకరాయి పడి ..
  ఆ సరోవరాన్ని కదిలించింది..
  కల్లోలం చేసింది..
  సముద్రం చేసింది.

  ఆ భావ సముద్రాన్ని ఆలోచనల కవ్వంతో మధించడానికి పురిగొల్పింది.
  ఆ మధనం విశాఖ జిల్లాలో ఒక అందమైన గిరిజన గ్రామ దృశ్యాన్ని ఆవిష్కరించింది అపురూపమైన అడవిని సృజించింది.
  అడవుల్లో పెరిగే చెట్లను, పూచే పూలను, ఎగిరే పక్షులను పరిచయం చేసింది. ఋతురాగాలను వినిపించింది.
  కొండలను, బండలను, సెలయేళ్లను ఆవిష్కరించింది.
  ఆ మథనంలో పుట్టిన చంద్రుడు వెన్నెల రాత్రుల ఆహ్లాదాన్ని పంచాడు. అక్కడ పుట్టిన సేన్ గుప్తా .. భూమి, చెట్లు, కొండలు, బండల పుట్టుక, పరిణామం ల వంటివి చర్చించడంతో పాటు ధన్వంతరి అయ్యి .. వనలత తోడురాగా..
  రవీంద్ర సంగీత్ లాగా.. నజ్రుల్ గీతి లాగా.. కల్లోల పడిన మనసుకు స్వస్థతనిచ్చాడు.. అక్కడ పుట్టిన మిశ్రా అడవి పుత్రుల జీవితాలలో గరళాన్ని మానవ శాస్త్రంతో పరిచయం చేశాడు.

  ఏటి ఒడ్డున ఎంకి పాటల వింటూ, నింగిని నేలని కలిపిన గంగానమ్మ ఊయలలు ఊగుతూ ఆనందిస్తున్న తరుణంలోనే.. సర్వేతో గిరిజనుల జీవితాలలో గరళాన్ని కూడా దర్శింపజేసిన ఈ దృశ్యం.. అద్భుతమైన పాత్రలతో.. మానవ జీవితపు అన్ని పార్శ్వాలను సృజించింది.

  ఎన్నో ఏళ్లుగా.. తన మనో ప్రపంచంలో.. జ్ఞాపకాల దొంతరలో అడుగున పడిపోయిన.. అపరాధ భావానికి.. విమల ఒక జవాబు వెతుకు కొన్ని సంతృప్తి పడగలిగింది.

  చివరిగా.. “కన్య స్నేహాన్ని”..
  అపార్థం చేసుకుంటే గరళమే మిగులుతుందని..
  ఆ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారికి ..ఇది “ప్రేమామృతం” అవుతుందనే సందేశంతో ఈ అంతర్మధనం ముగిసింది..

  ఈ రచన ఒక మరిచిపోలేని జ్ఞాపకం సార్..

  నమస్సుమాంజలులు.
  🙏🙏🙏🙏🙏

 11. నిజమే…మీరు చెప్పినట్టు యవ్వనపు తొలినాళ్ళలో ప్రేమభావన విశ్వకళ్యాణాన్ని
  కోరుకునే విధంగా వుంటుందనిపిస్తోంది మీరు
  వివరించి చెప్పాక.
  భగవంతుడి ఉనికి కన్య స్నేహం వంటిది అన్నమాటకి మీరు చెప్పిన భాష్యం చదువుతుంటే మనస్సులో ఏదో అలజడి…సరిగ్గా దానిని హృదయంలోకి ప్రవహింపజేసుకోగలుగుతున్నానో లేదోనని.
  మళ్ళీ మళ్ళీ చదవాలి.
  మీరు చెప్పిన ఆ అద్భుతభావం సొంతం చేసుకోవాలన్న భావం వచ్చిన మరుక్షణం అదృశ్యమయిపోతుంది మీరు చెప్పినట్టు.

  నమస్కారం మాష్టారూ🙏🙏🙏

 12. సర్, ఈ మీ వెన్నెల రాత్రులు చదువుతూ నాకనిపించిన భావాలు, ఆలోచనలు, నేను effective ga చెప్పలేకపోయినా ఇతర పాఠకులు
  ఎంతో చక్కగా చెప్పారు. Feeling blessed and grateful for this experience of వెన్నెలరాత్రులు. పాఠకుల్ని ఆ ఊరికి, ఆ అడివికే కాదు విమల మనసులోకి కూడా తీసుకువెళ్ళారు. తీరా ఆ ప్రదేశాలకి వెళ్ళాక గానీ తెలియలేదు ఆ experiences విమలవే కాదు, పాఠకురాలి(డి)వని.
  ఊటబావి వంటి మీ కలం (actually మీరే) నుండి జారిన ప్రతి పదంలో ఆ శక్తిని నింపారు. The power of your words made the experience reader’s own. Thank you sir! 🙏🏽

Leave a Reply

%d bloggers like this: