ఆ వెన్నెల రాత్రులు-29

ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు మామూలుగానే గడిచింది. పగలంతా కాన్వెంటూ, రాత్రుళ్ళు డాక్టర్ గురించిన తలపులూ. నెమ్మదిగా ఆయనకి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. ప్రతి ఉత్తరంలోనూ మామూలు విషయాలే, రోజువారీ సంగతులే రాసేదాన్ని. నీ కంటూ ఒకమనిషి ఉండి, చిన్నవో, పెద్దవో, నీది ప్రతి ఒక్క విషయం పంచుకోడంలో ఉన్న సంతోషం నెమ్మదిగా అనుభవానికొస్తూ ఉండింది. ప్రతి ఉత్తరానికీ డాక్టరునుంచి విధిగా జవాబు వచ్చేది. కాని ఏ ఉత్తరమూ పది పదిహేను వాక్యాలకి మించి ఉండేది కాదు. ఆ చేతిరాత కూడా ప్రిస్క్రిప్షన్ రాసినట్టే ఉండేది. చాలా పొడి పొడి వాక్యాలు. అందులో సగం కుశలప్రశ్నలే ఉండేవి. మా అమ్మ ఆరోగ్యం, మా చెల్లెలి చదువు, మా తమ్ముడు ఉత్తరాలు రాస్తున్నాడా, నాన్న ఎలా ఉన్నాడు- ఇంక తక్కినవన్నీ తన చదువుగురించీ, పాండిచ్చేరిలో విశేషాలేవైనా ఉంటే అవీ, ఆ మధ్యలో ఏమైనా సినిమాలు చూసి ఉంటే, ఆ సంగతులూ. ప్రతి ఉత్తరం హలో మిస్ అని మొదలయ్యేది. చివరలో యువర్స్ అని రాసి దానికింద సంతకం ఉండేది. ఆ ‘యువర్స్’ అనే మాట చూడటం నాకెంతో ఆప్యాయంగా ఉండేది. ఆ పదిపన్నెండు వాక్యాల ‘ప్రిస్క్రిప్షన్’ నే పదే పదే చదువుకునేదాన్ని. మేమిద్దరం ఒక ఇంట్లో ఉండబోతాం, కలిసి ఒక గూడు కట్టుకోబోతాం లాంటి ఆలోచనలదాకా నా ఊహలు నడిచేవని చెప్పలేనుగాని, నాకు దగ్గరగా ఎవరో ఒక మనిషి ఉన్నాడు, అతను నా పక్కనొచ్చి నిలబడతాడు అనే ఊహ కలిగేది. ఆ ఆ ఉత్తరం చదవడం ముగించగానే కిటికీ బయట ఎవరో ధారాళంగా సూర్యకాంతిని కుమ్మరిస్తున్నట్టుండేది.

ఫిబ్రవరి నెల చివరలోనో, మార్చి నెల మొదటివారమో గుర్తులేదు. ఆ రోజు కాన్వెంటులో ఏదో ఇన్ స్పెక్షన్ జరిగింది. ప్రిన్సిపాల్, స్టాఫ్ అందరం చాలా అలిసిపొయ్యాం. ఇంటికి వచ్చేటప్పటికి ఆలస్యం అయింది. రజని ఇంకా ఇంటికి రాలేదు. నాన్న కూడా ఇంట్లో లేడు. నేను ఎప్పట్లానే నా గదిలోకి వెళ్ళాను. అక్కడ మంచం మీద ఒక కవరు కనిపించింది. చూడగానే అది రాజునుంచి వచ్చిందే అని గుర్తుపట్టేను. ఆ కవరు చేతుల్లోకి తీసుకుని చూద్దును కదా, దాన్ని ఎవరో అప్పటికే చింపినట్టు కనిపిస్తోంది.

నా గుండె కొట్టుకోడం ఆగిపోయినట్టయింది. మోకాళ్ళల్లో వొణుకు వచ్చేసింది. ఆ కవర్ని అట్లానే పట్టుకు నిలబడిపోయాను.

కొంతసేపటికి ధైర్యం కూడదీసుకుని ఆ ఉత్తరం తెరిచి చదివాను. థాంక్ గాడ్! అందులో కవిత్వం ఉంది. 

కాని నాకు ఆ కవిత్వం చదవగానే చాలా బెంగగా అనిపించింది. మొదటి ఉత్తరం వచ్చినప్పటి భయం రెండో ఉత్తరానికి సగానికి సగం తగ్గిపోయింది. కాని, ఈసారి భయం కాదు, ఎందుకో వేదన తోచింది. ఆ కవిత చదివి, ఆ కాగితాలు మళ్ళా కవర్లో పెట్టబోతుండగా, ఇంకా ఏదో ఆ కవరులో ఉండిపోయినట్టుగా చేతులకి తగిలింది. తీసి చూద్దును కదా-

బూరుగపువ్వు!

ఎర్రటి పువ్వు. అయిదు రేకలు. వాటి మధ్యలో నలిగిపోయినా కూడా, ఇంకా బిగించిన తంత్రుల్లాగా, ఏదో సంగీతాన్ని వినిపించడానికి నాకేసి చూస్తున్న కేసరాలు.

ఆ పువ్వుని చూడగానే నాకు మాఘ-ఫాల్గుణాల మధ్యకాలం నడుస్తోందని గుర్తొచ్చింది. బహుశా చెట్టుకింద రాలిన ఒక తాజాపువ్వుని ఏరి పంపించి ఉంటాడు. అది ఆ అడవినుంచి నా చేతుల్లోకి వచ్చేటప్పటికి నల్లబడింది, మరికొన్నాళ్లకు ఎండిపోతుంది. కాని దాన్ని అంటిపెట్టుకుని ఏకంగా ఒక అడవిమొత్తం నాదాకా ప్రయాణించి వచ్చింది. దానిమీద మాఘఫాల్గుణాల వెన్నెల కురిసి ఉంటుంది. నక్షత్రధూళి రాలి పడి ఉంటుంది. ఆ పువ్వు రంగులు పోసుకుంటున్నప్పుడు ఎంతో సూర్యరశ్మి దాని ఈనెల్లోకి ప్రవహించి ఉంటుంది. అప్పటికే సగం వాడిపోతూ ఉన్న ఆ పువ్వుని చేత్తో పట్టుకున్నాను. భగవంతుడా! అతని ఉత్తరాలు, మాటలు, చివరికి ఆ కవితలు కూడా చొరలేని ఏదో తావుని ఆ తేనెమరక స్పృశించింది. అది నా గుండె మీద సన్నని గాటుపెట్టింది.

ఆ కవిత నాకేమీ అర్థం కాలేదు. కాని అతనొక డ్రీమ్ టైమ్‌లోకి ప్రవేశించాడని అనుకున్నాను. కాని వెనువెంటనే ‘ఏం? నువ్వు మాత్రం  బయట ఉన్నావా? నువ్వు కూడా ఒక డ్రీమ్ టైమ్ లోనే కదా జీవిస్తున్నావు?’ అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. రెండు స్వప్న ప్రపంచాలు ఒకదానికొకటి ఎదురయినప్పుడు, అవి కలవలేకపోతే, కనీసం మృదువుగా పక్కకు జారిపోవాలి కదా! బూరుగదూది పింజల్లాగా తేలిపోవాలి కదా! కాని కీచుమంటో ఈ చప్పుడేమిటి?

చాలా ఏళ్ళ కిందటి మాట. బహుశా పాతికేళ్ళ కింద. మేము మొదటిసారి ఇటలీ వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక కారు రెంటల్ కి తీసుకుని నన్ను లాంగ్ డ్రైవ్ కి తీసుకువెళ్లాడు. ఆ హైవే మీద అను చూపు మేరలో ఎక్కడా మరొక వాహనం కూడా కనిపించడంలేదు. ఇంతలో ఏదో కీచుమంటూ చప్పుడు వినిపించడం మొదలుపెట్టింది. ఆ చప్పుడు వినగానే డాక్టర్ ఉలిక్కిపడి బండి వేగం పెంచగానే మళ్ళా కీచుమంటూ చప్పుడు. ఏదో వైబ్రేషన్ మాకు తెలుస్తూ ఉంది. ముందు మేం మా కారులో ఏదన్నా డిఫెక్టు ఉందేమో అనుకుని భయపడ్డాం. మరికొంతదూరం అలానే భయంతోనే నడుపుకుంటూపోయేక ఒక సెక్యూరిటీ ఔట్ పోస్ట్ దగ్గర అసలు సంగతి తెలిసింది. అవి రంబుల్ స్ట్రిప్స్ అని. రోడ్లమీద డ్రైవర్లు హైవే-హిప్నొసిస్ కి లోనవకుండా ఏర్పాటు చేసిన అలర్ట్ స్ట్రిప్ లు అని.

బహుశా అతని స్వప్నలోకం, నా స్వప్నలోకాన్ని తాకినప్పుడు నాలో వస్తున్న హెచ్చరికలు కావచ్చు అవి. అతనొక హైవే- హిప్నొసిస్ కి లోనవుతూ ఉండవచ్చు. కాని నేను అతనిలాగా వేగంగా, మరేదీ పట్టకుండా పోలేనని కూడా నాకు తెలుసు.

నిజానికి, అంత అలసట పెట్టిన రోజు తర్వాత, అంత ఒత్తిడినుంచి బయటపడి ఇంటికొచ్చాక, ఆ ఉత్తరమూ, ఆ ఉత్తరాన్ని  నా కన్నా ముందే ఎవరో చింపి చదివారన్న సంగతీ నన్నెంత భయపెట్టి ఉండాలి? నీరసపెట్టి ఉండాలి! కాని ఆ చిన్న పువ్వు నా అలసటనీ, భయాల్నీ, టెన్షన్ నీ మటుమాయం చేసేయడమే కాక, చాన్నాళ్ల తరువాత మొదటిసారిగా ఆ పిల్లవాడి గురించి స్తిమితంగా ఆలోచించేటట్టు చేసింది.

నిజమే. ఆ పిల్లవాడు ఉత్తరాలు రాయడంలో తప్పేముంది? ఆ ఉత్తరాల్లో నిజంగా అభ్యంతరపెట్టేదేముంది? ఎవరన్నా చదివితే మాత్రం ఏమవుతుంది? అయినా కూడా ఆ పిల్లవాడు నాకు ఉత్తరాలు రాయకుండా ఉంటేనే బాగుండనిపించింది. ఉత్తరాలు రాయకపోవడమే కాదు, అసలు నా గురించి ఆలోచించకుండా ఉంటే నేను మరింత సంతోషంగా ఉంటాననిపించింది. నిజమే, మేము చిన్నపిల్లల్లగా కొన్ని రోజులు ఒక యేటి ఒడ్డున ఇసుకలో ఆడుకుని పిచ్చికగూళ్ళు కట్టుకున్నాం. కాని ఆ ఆటముగిసాక ఆ గూళ్ళు కూలదోసేకుంటాం కదా. అక్కడే ఉండిపోలేం కదా. వాటిని ఇంటికి తెచ్చుకోలేం కదా.

నిదానంగా ఆలోచిస్తే, అతని ముందు రెండు దారులున్నాయనిపించింది. ఒకటి, బాగా చదువుకుని సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ఉన్నతోద్యోగం సంపాదించుకుని నలుగురికీ పనికొచ్చే పనులు చెయ్యడం. లేదా ఒక సామాజిక కార్యకర్తగా మారి ప్రజలతో కలిసి మెలసి జీవిస్తూ వాళ్ళకోసం పనిచెయ్యడం. ఏ విధంగా చూసినా ఇలా కవిత్వం రాసుకోవడం అతనికి తగదనిపించింది. జవాబులివ్వకపోయినా ఇలా ప్రేమలేఖలు రాస్తూ ఉండటం అతని స్వభావం కాదనిపించింది. అతను ఎక్కడో దారితప్పుతున్నాడనిపించింది.

ప్రేమ అని పదే పదే ఉత్తరాలు రాస్తున్న ఆ పిల్లవాడికి నిజంగా ప్రేమ గురించి తెలిస్తే అలా ఉత్తరాలు రాయడు కదా అనుకున్నాను. తనకి జవాబు రాయకపోయినా పదే పదే ఉత్తరాలు రాయడం బాధ్యత లేకపోవడం తప్ప మరేమీ కాదని కూడా చెప్పుకున్నాను. ప్రేమ అన్నిటికన్నా ముందు అపరిమితమైన బాధ్యత. బాధ్యతారాహిత్యాన్ని మించిన వైల్డ్ నెస్ మరొకటి ఉండదు. కాని వైల్డ్ నెస్ అనే మాట స్ఫురించగానే ప్రొఫెసర్ సేన్ గుప్త గుర్తొచ్చాడు. ఆ వయసు పిల్లలు ‘వ్హైల్డ్’ గా కాకపోతే మరోలా ఎలా ఉంటారని అడుగుతాడేమో. కాని మరి ఆయనెందుకు అతనికి ఉత్తరం రాయలేదు? కనీసం నాకు రాసిన ఉత్తరంలోనైనా అడిగానని మాటమాత్రమేనా ఎందుకు రాయలేదు? వైల్డ్ పీపుల్ కి మనం ఉత్తరాలు రాయక్కర్లేదా? వాళ్ళు ఉత్తరాలు రాస్తే జవాబులివ్వక్కర్లేదా?

మొదటి రెండు ఉత్తరాల్లానే ఈ ఉత్తరం కూడా వెంటనే చింపేసాను. దాన్ని చింపడంకోసం మర్నాడు పొద్దున్న స్కూలుకి వెళ్ళేదాకా ఆగాల్సిన పనిలేదనిపించింది. అదీకాక దాన్నెవరో అప్పటికే చింపి చదివారు కూడా. కానీ, ఆ పువ్వు! ఆ పువ్వునేం చెయ్యాలి? దాన్ని పారెయ్యలేకపోయాను. ఆ పువ్వుమీద కూడా ఒక ప్రేమలేఖ రాసి ఉందిగాని, అది సూర్యలిపి. మనుషులకి బోధపడేది కాదు.

అప్పటికి దాన్నెక్కడ దాచాలో తెలియక, అల్మైరాలో పైనే ఉన్న పారడైజ్ లాస్ట్ పుస్తకం పేజీల్లో భద్రంగా పెట్టాను. కాని ఆ రోజు అక్కడ పెట్టానన్న సంగతి ఇదిగో, ఇప్పుడు, గుర్తొస్తున్నది.  ఏమైపోయిందో ఆ పువ్వు!

ఆ రాత్రి మా భోజనాలయ్యాక, మేమిద్దరమే ఉండగా చూసి మా అమ్మ నెమ్మదిగా నాతో ‘ఆ కవరు నేనే చింపాను’ అన్నది. ఆమె ఆ మాట అనగానే నిజానికి నా గొంతులో తడారిపోయి ఉండాలి. కాని అందులో ఉన్నది ఒక కవితా, ఒక పువ్వూ మాత్రమే అని తెలిసిందికాబట్టి, నేను ఆమెకేసి చూడకుండానే ‘ఏమోనమ్మా పిచ్చి రాతలు రాస్తుంటాడు. ఎలా చెప్పాలో తెలియడం లేదు’ అని మటుకే అనగలిగాను. అప్పుడు ఆమెకేసి చూసాను.

మా అమ్మ ఏమీ అనలేదు.

ఆ తర్వాత మళ్ళా ఎప్పుడూ అతణ్ణుంచి నేను ఉత్తరాలు అందుకోలేదు. నాకు నిశ్చయంగా తెలుసు: అతను మరికొన్నాళ్ళ పాటు ఉత్తరాలు రాస్తూనే ఉండి ఉంటాడు, కాని మా అమ్మ వచ్చినవాటిని వచ్చినట్టే చింపేస్తూ ఉండి ఉంటుందని. మరికొన్ని రోజులు పోయేకనో, లేదా మరికొన్ని వారాలు పొయ్యేకనో, ‘అమ్మా! నాకేమన్నా ఉత్తరం వచ్చిందా ?’ అని అడగాలనిపించినా, మళ్ళా ఎప్పటికీ, అడగలేనట్టుగా ఒక కంచె కట్టేసింది మా అమ్మ అని కూడా నాకు అర్థమయింది.

ఆ తర్వాత నన్ను అతడి తలపులు కూడా బాధపెట్టడం మానేసాయి. మార్చి, ఏప్రిల్ కూడా త్వరత్వరగా గడిచిపోయేయి. స్కూళ్ళకీ, కాలేజీలకీ సెలవులిచ్చారు. రజని థర్డ్ యియర్ పరీక్షలు బాగానే రాసింది. ప్రశాంత్ కూడా ఇంజనీరింగ్ మొదటి ఏడాది పూర్తి చేసుకుని సమ్మర్ హాలిడేస్ కి ఇంటికొచ్చాడు.

ఆ వేసవి అంతా మేము వర్షాకాలంకోసం ఎదురుచూస్తూ గడిపాం. ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంకోసం ఎదురుచూస్తూ గడిపేం. మే నెల రెండోవారానికల్లా డాక్టర్ కూడా పాండిచ్చేరినుంచి వచ్చేసాడు. దాదాపుగా ఆ రెండుమూడు నెలలూ మేమంతా ఉల్లాసంగా తుళ్ళిపడుతో గడిపేం. శివశంకర్ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి రోజూ రాలేకపోయేవాడు. ఎప్పుడేనా మేము డిన్నర్ కో, సినిమాకో వెళ్తే తను కూడా వచ్చి మాతో కలిసేవాడు. కాని ఆదివారాలు తప్పనిసరిగా మాతోనే గడిపేవాడు.

జూన్ నెల మొదలయినప్పణ్ణుంచీ నాన్నకి ఒక రకమైన ఆందోళన తగ్గి మరొకరకమైన ఆందోళన మొదలయ్యింది. అప్పటిదాకా ఈ పెళ్ళిళ్ళు నిశ్చయమేనా, ఇవి నిజంగానే జరుగుతాయా అన్న ఆందోళన ఉండేది. రోజూ మా అమ్మా నాన్నా ఎప్పుడూ మాటాడుకునే మాటలే మాటాడుకుంటూ, చెప్పుకున్న భయాలే మళ్ళా మళ్ళా చెప్పుకుంటూ ఉంటే విని విని నాకు విసుగెత్తిపోయింది. తీరా మరొక నెలా, రెండునెలల్లో పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోందన్నప్పణ్ణుంచీ నాన్నకి పెళ్ళి ఏర్పాట్ల ఆత్రుత మొదలయ్యింది. మా బంధువుల్లో ఆయనకి తోడుగా నిలబడి పెళ్ళి పనులు నెత్తిన వేసుకునే మనుషులెవరూ లేరు. ఆయన కంపెనీలో పనిచేసే సహోద్యోగులకి చిన్నవో పెద్దవో పనులు అప్పగించవచ్చుగాని, నాన్నకి అది ఇష్టం లేదు. దాంతో చాలా పనులు డాక్టరే దగ్గరుండి చూసుకోవలసి వచ్చింది. డాక్టరుతో పాటు నేను కూడా. అది కూడా మాకు ఉల్లాసంగానే ఉండింది.

అన్ని పనుల్లోకీ నాకు సరదా వేసిన పని శుభలేఖలు అచ్చొత్తించడం. మా అందరి ఇళ్ళల్లోనూ అదే మొదటి వేడుక కాబట్టి మా ముందేమీ శుభలేఖల నమూనాల్లేవు. ముందు ఆ కార్డులు అమ్మే షాపుని పట్టుకున్నాం, అందులో పది రకాల మోడల్స్ ఎంచుకుని ఇంటికి తీసుకొచ్చి అందరికీ చూపించి ఏదో ఒకటి సెలక్ట్ చెయ్యమన్నాం. ప్రజాస్వామిక పద్ధతిలో మేము ఆ మోడల్ ని ఎంపిక చెయ్యలేమని రెండురోజుల తర్వాత అర్థమయింది. మా ఇంట్లోనూ అదే పరిస్థితి. డాక్టర్ ఇంట్లోనూ అదే పరిస్థితి. ఒకరికి నచ్చిన మోడల్ ఇంకొకరికి నచ్చదు. ఏం చెయ్యాలి?

చివరికి మేమిద్దరం కూచుని ఒక రాజీ ఫార్ములా ప్రతిపాదించాం. అందరికీ నచ్చిన అన్ని డిజైన్లలోనూ కొన్ని కొన్ని కార్డులు ఒక్కొక్కరి పేరుమీదా ప్రింట్ చెయ్యాలనుకున్నాం.  కార్డులు ప్రింటయ్యాక మా నాన్నతరఫున అమ్మ తరఫునా పంచడానికి పెద్దగా ఎవరూ లేరు. నేను కొన్ని కార్డులు మా కాన్వెంటులో కొలీగ్స్ కి ఇచ్చాను. ఒకటి సిస్టర్ ధన్యకి ఇచ్చాను. మరొకటి దేవసహాయం గారికి ఇద్దామనుకుంటే ఆయన ఊళ్ళో లేరు. అది కూడా సిస్టర్ కే ఇచ్చి ఆయనకి అందచెయ్యమని చెప్పాను.

సూర్యనారాయణమూర్తిదంపతులకి మా నాన్న వైపునుంచి కార్డు పంపించాను. జోసెఫ్ గారికి, రోజాకు కూడా జోసెఫ్ గారికే పంపించాను. ప్రొఫెసర్ సేన్ గుప్తకీ, డా.మిశ్రాకీ కూడా కార్డులు పంపించాను. వనలతకి కార్డుతో పాటు చిన్న ఉత్తరం కూడా రాసాను. ఆమె పంపిన చీర నా వెడ్డింగ్ కి తప్పకుండా కట్టుకుంటానని రాసాను.

అప్పుడు, అప్పుడు- మళ్లా ఒకసారి రాజు నా తలపుల్లో మెదిలాడు. అంతమందికి నా పెళ్ళివార్త తెలిసాక అతనికి ఎలానూ తెలుస్తుంది. కాని నా వెడ్డింగ్ కార్డు అతనికి పంపాలా వద్దా? తేల్చుకోలేకపోయాను. అతనికి నా పెళ్ళి నిశ్చయమైందని తెలిసే అవకాశమే లేదనీ, తెలిసి ఉంటే, ఆ ఉత్తరాలు రాసి ఉండేవాడు కాదనీ నాకు అప్పటికి రూఢి అయ్యింది. అయినాకూడా అతనికి నా వెడ్డింగ్ కార్డు పంపడం సమంజసమో, పంపించకపోడం సమంజసమో తేల్చుకోలేకపోయాను. ఎవరినీ సలహా అడిగే విషయం కూడా కాదాయె!

నాలో నేనే  ఏ పక్షం వైపూ మొగ్గలేక, ఎటూ తేల్చుకోలేక ఆ కార్డు నా సూట్ కేసు అడుగున పడేసాను. ఆ విషయమే మర్చిపోయాను.

ఎన్నో నెలల తర్వాత, నా సామానులన్నీ మా కొత్త కాపురానికి తరలిస్తూ ఉన్నప్పుడు, సూట్ కేసులు సర్దుకుంటూ ఉంటే, ఆ కార్డు కనబడింది. అప్పట్లో రాసిన పసుపుతోబాటే, స్ప్రే చేసిన పెర్ ఫ్యూమ్ కూడా ఆ కార్డుని అంటిపెట్టుకునే ఉంది.

2-5-2023

6 Replies to “ఆ వెన్నెల రాత్రులు-29”

  1. Can’t believe Vimala has become one cruel ‘SHE’. Raju deserves a clear No as reply to this analytical indifference.

    Seems like these characters have become more humane now, with all the follies 🙂

  2. “…రెండు స్వప్న ప్రపంచాలు కలవలేనప్పుడు మృదువుగా పక్కకు తప్పుకోవాలి..”చాలా గొప్ప మాట సర్, ఏ బంధంలో నైనా ఈ భావన ఉంటే అంతకన్నా గడిచిన ప్రయాణానికి ఇచ్చే గౌరవం మరొకటి ఉండదు..Great words..

    మనం చూడలేని సూర్యలిపి..పూల మీద రంగులై.. excellent sir

  3. స్ప్రే చేసిన పెర్ ఫ్యూమ్ కూడా ఆ కార్డుని అంటిపెట్టుకునే ఉంది… సూర్యలిపి!

Leave a Reply

%d