ఆ వెన్నెల రాత్రులు-28

Reading Time: 8 minutes

ఆ మర్నాడు పొద్దున్నే లేవగానే మనసు ప్రశాంతంగానే ఉండింది. బయటికి వచ్చి బ్రష్ చేసుకుంటూ ఉంటే హటాత్తుగా ఆ ఉత్తరం గుర్తొచ్చింది. ఆ కవరు ఎక్కడ పెట్టానా అని కంగారు పుట్టింది. వెంటనే గదిలోకి పరుగెత్తాను. థాంక్ గాడ్. రజని ఇంకా నిద్రపోతూనే ఉంది. ఆ కవర్ తలగడ పక్కనే ఉంది. దాన్ని తీసుకుపోయి ముందు నా హాండ్ బాగ్ లో పెట్టేసాను.

స్కూలుకి వెళ్ళేదాకా నా మనసులో మళ్ళా యుద్ధం జరుగుతూనే ఉంది. దేని గురించి, వేటి మధ్య అంటే చెప్పలేను. ఏదో ఒక అన్ సెటిల్డ్ ఫీలింగ్. ఆ భావం ఏమిటో తరచిచూసుకోడానికి మనసు ఇష్టపడటం లేదు. ఎటూ తెగని, ఎటూ తేల్చని ఆలోచనల మధ్య అకస్మాత్తుగా, కిందటేడాది ఎక్కడున్నాను, ఎలా గడిచాయి ఆ రోజులు అనిపించింది. డిసెంబరు 31 రాత్రి కేంప్ ఫైర్, వనలత ఆలపించిన బావుల్ గీతం, రాత్రి పన్నెండు దాటిన తర్వాత సేన్ గుప్త మాకు హాపీ న్యూ యియర్ చెప్పడం అన్నీ గుర్తొచ్చాయి. ఆయన చెప్పినట్టే నిజంగానే ఆ న్యూ యియర్ నా జీవితంలో నేనూహించని హాపీనెస్ ను పట్టుకొచ్చింది. ఆ హాపీనెస్ అకళంకంగా ఉండింది, మళ్ళా కొత్తసంవత్సరం మొదటిరోజుదాకా.

త్వరత్వరగా తయారయ్యాను. డాక్టర్ ఇంకా ఊళ్ళోనే ఉండి ఉంటాడు. సాయంకాలం మళ్ళా తప్పకుండా ఇంటికొస్తాడు. అప్పటికేనా నా మనసు నిమ్మళంగా ఉండాలి. డాక్టర్ ఎలాగేనా ఇంటికి రావాలి. ఇవాళ సెకండ్ షోకి వెళ్దామన్నా కూడా వెళ్ళడానికి సిద్ధమే అని నాకు నేను చెప్పుకున్నాను.

ఆ రోజు స్కూల్లో రోజంతా కూడా నా మనసు ఆ హాండ్ బాగ్ చుట్టూతానే పరిభ్రమిస్తూ ఉంది. స్టాఫ్ రూమ్ లో నా లాకర్ లో ఆ బాగ్ ఎవరూ తీసి ఉండరు కదా. ఎవరూ ఆ ఉత్తరం చదివి ఉండరు కదా. బడి విడిచిపెట్టేదాకా నా మనసు మనసులో లేదు. అప్పుడు బయటికొచ్చి స్టాఫ్ రూమ్ పక్కన నిలబడి, నన్నెవరూ చూడటం లేదని చూసుకున్నాక, ఆ కవరు బయటికి తీసాను. అందులోంచి ఆ ఉత్తరం. దాన్ని మళ్లా తెరిచి చదివే ధైర్యం లేదు. వెంటనే ఆ ఉత్తరాన్ని అడ్డంగా చింపేసాను. ఆ తర్వాత మరిన్ని ముక్కలు చేసాను. ఆ ఉత్తరంలో చివరి పేజీలో ఆ సంతకం ఉన్న భాగాన్ని మరిన్ని ముక్కలుగా చింపేసాను. ఆ కవర్ని కూడా. చింపేసిన కాగితం ముక్కలు ఉండలాగా చుట్టి స్కూలు నుంచి బయటికి వచ్చాక రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజిలోకి విసిరేసాను. నువ్వేదన్నా తోటలోంచి నడిచి వచ్చినప్పుడు బయటికి వచ్చాక నీ చేతిమీద చిన్న పురుగు కనిపిస్తే దాన్ని తక్షణమే ఎలా విదిలించుకుంటావో, అలాగ, నాకు ఆ ఉత్తరం వచ్చిందన్న ఊహని కూడా నా మనసులోంచి విదిలించి పారేసాను.

కాని తీరా ఇంటికి చేరుకునేటప్పటికి, ఆ పదినిముషాల నడకలోనే మనసు మళ్ళా వికలమైపోయింది. నేను ఆ ఉత్తరం చింపకుండా ఉండవలసిందేమో అనిపించింది. దాచుకుని ఉండవలసింది. అందులో రాసింది నిన్ను ఇబ్బందిపెట్టిన మాట నిజమే. కాని అవి అతని భావాలు. వాటిని అంగీకరించకపోయినా కనీసం గౌరవించి ఉండవలసింది. కాని ఎక్కడ దాచుకుంటాను? హృదయంలో కుట్టిపెట్టుకుంటే తప్ప మరెక్కడా దాన్ని మరొకరి కంట పడకుండా కాపాడుకోలేనే. దానికేముంది? ఆ ఉత్తరం అతనికే తిప్పి పంపించి ఉండవచ్చు కదా. అలా తిరిగి పంపిస్తే అతనికి అర్థమయి ఉండేది కదా. అతను నీ గురించి భావించుకుంటున్నట్టుగా నువ్వు అతణ్ణి తీసుకోవడం లేదని చెప్పకుండానే చెప్పినట్టు ఉండేది కదా.

మళ్ళా నాకు తిలతిరగడం మొదలుపెట్టింది. చెప్పలేనంత నీరసం వచ్చేసింది. డాక్టర్ ఈ పూట ఇంటికి రాకపోతే బాగుణ్ణని మరీ మరీ అనిపించింది. ఈ ఒక్క పూట గడిస్తే, ఈ ఒక్క రాత్రి నన్ను నాకు వదిలిపెట్టేస్తే, రేపటికి నన్ను నేను స్వాధీనంలోకి తెచ్చుకోగలను అనుకున్నాను.

నా అదృష్టం కొద్దీ ఆ సాయంకాలం డాక్టర్ మా ఇంటికి రాలేదు. రానందుకు మనసులో ఎక్కడో లోటుగా అనిపించినా ఊరటగా కూడా అనిపించింది. నిజానికి అతనొస్తే అతని ముఖంలో ముఖం పెట్టి చూడలేనేమో అనిపించింది. అతని దాకా ఎందుకు? ఆ రోజు మా అమ్మనీ, నాన్ననీ కూడా చూడలేననిపించింది. అసలు నేనా ఊరు వెళ్ళకుండా ఉండి ఉంటే ఎంత బాగుణ్ణు అనుకున్నాను. ఆ రోజు అక్కడ అడవిలో నాకు తెలీకుండానే గాంధారిపాప ఉండే కొండమీద అడుగుపెట్టినట్టుగా నేను నాకు తెలీకుండానే ఎక్కడో ఏదో నిషిద్ధరేఖ దాటానా? ఆ సాయంకాలం రాజు ఎదురుగుండా నేనూ, వనలతా ఆ ఏటినీళ్ళల్లో తుళ్ళింతలాడేమే? అదేనా నేను చేసిన పొరపాటు?

కాని మళ్ళా నిదానంగా ఆ ఉత్తరం గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాను. అందులో  చూస్తే అభ్యంతరకరంగా అనిపించే మాట ఏదీ ఉన్నట్టు గుర్తురాలేదు. బహుశా ఆ రాత్రి, ఆ ఊరినుంచి వచ్చేసే ముందురోజు రాత్రి ఆ వకుళకుటి దగ్గర రోజా పాట పాడిన తర్వాత ‘రాజు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు’ అంది. అప్పటికే ఆలస్యమైందని ఇంటికి వచ్చేసాం. అప్పుడు మాట్లాడి ఉంటే ఈ మాటలే మాట్లాడి ఉండేవాడని ఇప్పుడు తెలుస్తోందిగాని, నేను, ఆ మాటలు విని ఇప్పుడు భయపడుతున్నట్టుగా అప్పుడు భయపడి ఉండేదాన్నా? నిజంగానే రాజు ఆ మాటలు చెప్పడంలో చాలా ఆలస్యం చేసాడా?

రాత్రి పడుకోబోయేముందు మళ్ళా నా తలలో వలయాలు వలయాలుగా ఆలోచనలు సుళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. ఆ ఆలోచనలముందూ, మధ్యా, చివరా కూడా ఆ ఊళ్ళో గంగాలమ్మ పండక్కి కట్టిన ఉయ్యాల గుర్తొస్తూ ఉంది. ముఖ్యంగా, వైశాఖపున్నమి వెళ్లగానే ఆ ఉయ్యాల రాటలు నరికేసారు. మూడడుగుల ఎత్తుదాకా మిగిల్చి పైన నరికేసారు. ఆ ఉయ్యాల మోకు తీసేసారు. ఆ రాటలు మళ్ళా ఏడాది గంగాలమ్మ పండగ దాకా అలానే ఉంచేస్తారట. మళ్ళీ ఏడాది పండక్కి ఆ రాటలు తీసేసి కొత్త రాటలు శాంతి, పసుపు రాసి, కొత్త మోకుకి మామిడాకులు కట్టి తగిలిస్తారట. మళ్ళా పండగ పదిరోజులో పదిహేను రోజులో ఆ ఉయ్యాల ఊరంతా ఊగుతారట.

ఆ పండగ రాత్రుల్లో ఆ ఉయ్యాలలో ఎదురెదురుగా ఊగిన ఆడామగా ప్రతిసారీ భార్యాభర్తలే కాదని, పెళ్ళి కాబోయే స్త్రీపురుషులు కూడా కావొచ్చని అప్పుడు విన్నాను. అసలు వాళ్ళు పెళ్ళికాబోయే స్త్రీపురుషులే కానక్కరలేదు, ఏ ఇద్దరు యువతీయువకులేనా కావచ్చేమో కూడా. బహుశా యువతీయువకుల మధ్య సాంగత్యం గురించి, ఆ సాంగత్యానికి ఎంత వెసులుబాటు ఇవ్వాలో ఆ ఆదిమగిరిజన సమాజానికి స్పష్టంగా తెలుసేమో అనిపించింది. ఆ ఊళ్ళో పండగ అంటే అన్ని అంతస్తుల్నీ, కట్టుబాట్లనీ పక్కన పెట్టి మనుషులు మనుషులుగా దగ్గరయ్యే వేళ. కాని వారం రోజులో, రెండు వారాలో మాత్రమే. ఊరి మధ్యలో కట్టిన ఆ ఉయ్యాల ఏడాది పొడుగునా ఊగడానికి కాదు, జీవితకాలం పాటు ఊగడానికి కాదు. ఆ ఉయ్యాలని అలాగే వదిలేస్తే, అన్నిటికన్నా ముందు ఊళ్ళో పనులు ముందుకు సాగవు. కాని ఆ ఉయ్యాలే లేకపోతే, ఆ పనిపాటలకి అర్థమూ లేదు.

ఆ ఉయ్యాలతో పాటు ఆ చైత్రపున్నమి రాత్రి అడవిలో నడిచిన గిరిజన నృత్యం గురించి విన్నమాటలు కూడా గుర్తొచ్చేయి. నేను చూడలేకపోయిన నాట్యం అది. అక్కడక్కడ ఒక స్త్రీ, ఆమె భుజం మీద ఒక చెయ్యి వేసి మరొక స్త్రీ నడుం చుట్టూ మరొక చెయ్యి వేసి ఒక పురుషుడు, ఆ పురుషుడి పక్కన మరొక స్త్రీ, ఆ స్త్రీ పక్కన మరొక పురుషుడు..అక్కడ మనుషులందరూ ఒకే ఒక్క దేహంగా తప్ప, విడివిడి వ్యక్తులుగా లేని ఒక ప్రాచీన జీవితోత్సవం- ఆ డాన్సు చూడటానికి ప్రతి బండమీదా దేవతలు వచ్చి కూచున్నారంటే ఆశ్చర్యం ఏముంది?

నిజమే, ఆ ఊళ్ళో మేమంతా ఒక పండగలాగే గడిపాం. మా మధ్య దేహాల స్పృహ లేదు. మేమంతా ఒకే దేహంగా గడిపాం. పాఠశాలకి కుటీరం కట్టాలంటే జమకూడిన చేతులన్నీ ఒకరివే. ఇంటింటికీ తిరిగి సర్వే చెయాలంటే వివరాలు కనుక్కున్న నోళ్ళన్నీ ఒకరివే. ఆ ఫారాలు నింపిన వేళ్ళన్నీ కూడా ఒకరివే. కాని, ఇప్పుడు, ఎందుకని, ఆ పిల్లవాడినుంచి ‘నిన్ను ప్రేమిస్తున్నానని’ ఉత్తరం రాయగానే, ఎందుకని, ఎందుకని, ఇంత కల్లోలంగా ఉంది మనస్సు?

ఎప్పుడో తెల్లవారేవేళకి నిద్రపట్టింది. స్కూలుకి సెలవు పెడదామంటే హాఫ్ యర్లీ పరీక్షలు. ఆ హాంగ్ ఓవర్ తో అలానే పరుగెత్తాను. కాని ఆ మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేసాను. పడుకుండిపోదామనుకున్నాను. కాని ఆశ్చర్యంగా డాక్టర్ సాయంకాలం నాలుగింటికే మా ఇంటికొచ్చాడు. మా అమ్మతో మాట్లాడవలసిందేదో ఉందని. మా అమ్మతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉండగా, ‘మనం ఎక్కడికేనా బయటికి వెళ్దామా?’ అనడిగాను అతణ్ణి.

అతడు ఆశ్చర్యంగా నా వైపు చూసాడు.

‘చలికాలం. ఈ వేళప్పుడు బయటికి ఎక్కడికి వెళ్తారు?’ అంది మా అమ్మ. ఆమె కూడా ఆశ్చర్యపోయే ఉండాలి.

కాని డాక్టర్ నన్నేమీ ప్రశ్నించలేదు.

తలూపి బయటకు నడిచాడు. బజాజ్ చేతక్  స్టార్ట్ చేసాడు. నేను వెనక ఎక్కాను. జీవితంలో మొదటిసారి, ఒక యువకుడి వెనక స్కూటర్ మీద.

మా వీథి మలుపు తిరిగాక ‘ఎక్కడికి వెళ్దాం?’ అనడిగాడు.

ఎక్కడికి? ఏమో ఆలోచించలేదు.

‘ఏదేనా పార్కుకి వెళ్ళి కూచుందాం’ అన్నాను.

కాని డాక్టర్ నన్ను నేరుగా పార్కుకి తీసుకువెళ్ళలేదు. ఉడిపి భవన్ కి తీసుకువెళ్ళాడు. ఎప్పుడో నేను టెంత్ పరీక్షలు రాసినతర్వాత మా నాన్న నన్నిక్కడికి తీసుకొచ్చి కాఫీ ఇప్పించాడు. మళ్ళా ఇన్నాళ్ళకి.

డాక్టర్ కూడా మాకు కాఫీ ఆర్డర్ చేసాడు. పాండిచ్చేరిలో కాఫీ ఎంత బాగుంటుందో చెప్తున్నాడు. నేనేదో అనీజీనెస్ ఫీలవుతున్నాననీ, దాన్నుంచి ఏదోలా బయటపడెయ్యడమే ఆ సాయంకాలం తన బాధ్యత అనీ అనుకున్నట్టున్నాడు.

అక్కణ్ణుంచి మునిసిపల్ పార్కుకి వెళ్ళాం. ఎప్పుడూ దూరం నుంచి చూడటమే. లోపల అడుగుపెట్టింది లేదు. అడుగుపెట్టేటంత తీరిక కూడా ఎప్పుడూ దొరకలేదు.

ఆ పార్కులో ఒక బెంచీ మీద కూచున్నాం. మరీ దగ్గరగా, మరీ దూరంగా కాకుండా కూచున్నాడు. బహుశా అతని సంస్కారంలోనే ఒక మెజర్ మెంట్ టేపు ఇమిడిపోయి ఉంటుందేమో అనుకున్నాను.

హటాత్తుగా ఒక తీపి సుగంధం నన్ను తాకింది. చుట్టూ చూసాను. మేము కూచున్న బెంచీ వెనగ్గా పార్కు ప్రహరీ గోడని అనుకుని కంచెలాగా పున్నాగపూల చెట్లు. ఆ హేమంతకాలపు చివరి పూలరేకలు గాలికి రాలుతూ ఉన్నాయి. కింద రాలిపడ్డ రేకల మీద ప్రతి రాత్రీ కురిసే మంచు ఒక సూక్ష్మ సుగంధలోకాన్ని సృష్టిస్తూ ఉంది. కాని ఆ ఒక్క సుగంధమే కాదు, మరొకటేదో, నా గడిచిపోయిన రోజులనుంచి, రాత్రులనుంచి నా కన్నా ముందే అక్కడికొచ్చి చేరింది. తలతిప్పి చుసాను. ఇటు కూడా పున్నాగ చెట్లే. కాదు, ఎక్కడనుంచో, ఎప్పటిదో, డైరీలోంచి పేజీలు నాతో మాటాడుతున్నట్టుగా చిరపరిచితమైన సువాసన.

అప్పుడు తెలిసింది. మా బెంచీ పక్కనే మామిడి చెట్టు ఉన్నదనీ. మేము దాని నీడనే కూచున్నామనీ. నన్నంతగా కలవరపరుస్తున్నది ఆ మామిడి తొలిపూతనే అని.

‘చూడు. ఎంత స్వీట్ ఫ్రాగ్రెన్స్ నో కదా’ అన్నాను. చూడండి అని అనకుండా చూడు అని ఎందుకన్నానో నాకే తెలియదు. కాని ఆ రోజు, ఆ సాయంకాలం, ఆ క్షణం అతను నా పక్కన లేకపోయుంటే నాకు మతిస్తిమితం తప్పి ఉండేదని మాత్రం చెప్పగలను.

‘ఫ్రాగ్రెన్సా? ఎక్కణ్ణుంచి?’ అనడిగాడు. తనేమీ పెర్ఫ్యూమ్ వేసుకు రాలేదు కదా అని కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు.

‘మేంగో. ఇదిగో ఈ బెంచీ పక్కన చెట్టు చూడు. మేంగో ఫ్లవరింగ్ సీజన్ మొదలయ్యింది ‘అని అన్నాను.

అతను ఆ బెంచీ పక్కనున్న చెట్టుకేసి చూసాడు. కాండం తప్ప మరేమీ కనిపించలేదు. పైకి చూసాడు. కిందకి పరుచుకున్న కొమ్మల గుబుర్లు కనిపించాయి.

‘ఇప్పుడిప్పుడే మొదలైన పూత కిందకి ఎలా కనిపిస్తుంది? ఫ్రాగ్రెన్స్ తో గుర్తుపట్టాలి. అంతే’ అని అన్నాను.

డాక్టర్ నవ్వేసాడు. ‘ఓ! మీరు బోటనిస్టు కదా! అందుకే తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి!’ అని అన్నాడు.

కనీసం ఆ ఒక్కక్షణం ఆ చిన్న విషయం అతనికి తెలియంది నాకు తెలిసిందనుకోవడం గర్వంగా అనిపించింది. కాని మామిడిచెట్టుని గుర్తుపట్టడంలో ఏముంది? నేను తూర్పుకనుమల్లో దాదాపు రెండువందల వృక్షజాతుల్ని గుర్తుపట్టినదాన్ని అని చెప్పాలనిపించింది. మద్ది, బూరుగ- ఎన్ని చెట్లని! ‘ఓ, ఔదుంబరమా!’ అని ప్రొఫెసర్ అన్నమాట నా చెవుల్లో మోగడం మొదలుపెట్టింది.

నన్ను వేధిస్తున్న సమస్య మొత్తం డాక్టర్ కి చెప్పేద్దామా అని ఆ క్షణం ఎంత బలంగా అనిపించిందంటే, అతని నా చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని ఆ మొత్తం సంగతులు చెప్పేంతసేపూ కూడా అలానే పట్టుకుని ఉండిపోదామనిపించింది. కానీ అతి కష్టమ్మీద నన్ను నేను అదుపుచేసుకున్నాను.

‘మీ స్కూలు ఎలా నడుస్తోంది?’ అనడిగాడు డాక్టర్. మంచి ప్రశ్న. దేవుడిలాగా అడిగాడు. ఇక ఆ తర్వాత ఆ మాటల్లో పడి కాలం మర్చిపోయాం.

పొంగల్ వెకేషన్ అయ్యేదాకా డాక్టర్ దాదాపుగా ప్రతి రోజూ మా ఇంటికి వస్తూనే ఉన్నాడు. వచ్చిన వెంటనే మా అమ్మని పలకరించేవాడు. ఆ తర్వాత రజనీని. పరీక్షలకు బాగా ప్రిపేపరవుతున్నావా అని అడిగేవాడు. ఆ తర్వాత ప్రశాంత్ తో చాలాసేపు మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడకో పోయేవారు. లేదా వాణ్ణి వాళ్ళింటికి లంచ్ కి తీసుకుపోయేవాడు. అతనొచ్చినప్పుడు మా నాన్న ఇంట్లో ఉంటే కొంతసేపు మాట్లాడేవాడు. అందరికన్నా అతి తక్కువ నాతోనే మాట్లాడేవాడు. అతను రాగానే, ఇంట్లో అడుగుపెట్టగానే నేనెక్కడ ఉన్నా నాకు తెలిసిపోయేది. కాని నాకు వెంటనే అతడి ఎదటపడాలని ఉండేది కాదు. అప్పుడు వంటింట్లో ఉంటే ఇంకొంతసేపు అమ్మకి సాయం చేస్తూ ఉండిపోయేదాన్ని. మా అమ్మ ‘అతనొచ్చాడు’ అనేది. ‘తెలుసు, విన్నాను’ అనే దాన్ని. ఏమి విన్నాను? అతని అడుగులచప్పుడా? ప్రతి ఒక్కర్నీ విష్ చేస్తున్నప్పుడు గలగల్లాడే ఆ చిరునవ్వా? లేకపోతే అతనొచ్చాడని మా అమ్మ చెప్పే మాటలా? ఒకవేళ అప్పుడు నా గదిలోనే ఉండి ఉంటే తీరిగ్గా జడ అల్లుకునేదాన్ని, లేకపోతే బీరువాలో మడిచిపెట్టిన బట్టలు మరోసారి బయటికి తీసి ఒక్కొక్కటే మళ్ళా సర్దేదాన్ని. అతణ్ణి కలుసుకునేవరకూ, అతని ప్రెజెన్స్ ని నా మనసుతో అనుభూతి చెందేదాన్ని. అదొక ధ్యానంలాగా ఉండేది. మరే ఆలోచనలూ నన్ను చేరేవికావు. ఒకే ఒక్క ఆలోచన. ఆలోచన కూడా కాదు, ధ్యాస.

అప్పుడు నింపాదిగా హాల్లోకి వచ్చి ‘హలో’ అనేదాన్ని. అతను కళ్ళెత్తి ఒక క్షణం నన్ను చూసేవాడు. నా కళ్ళకేసి చూసేవాడు.  నా కళ్లని బట్టి నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోడానికి చూసేవాడా? నాలో ఏదో చెప్పుకోలేని నలత తలెత్తిందని అతనొక్కడే గుర్తుపట్టేడా? కాని అతను క్షణంపాటే చూసినా కూడా ఆ చూపు గొప్ప స్వస్థత చేకూర్చినట్టుగా ఉండేది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీ ఇంటికొచ్చి నీతో అనునయంగా ఔషధం తాగించే వైద్యుడికోసం నువ్వెదురు చూడకుండా ఎలా ఉండగలవు?

హాల్లోకి వచ్చి అతణ్ణి పలకరించడంతో అప్పటిదాకా నేను అడ్డుగా వేసి పట్టుకున్న తెర ఎగిరిపొయ్యేది. ఇక మేమంతా కూచుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అతను మమ్మల్ని నవ్వించడంకోసమే కొత్త కొత్త జోకులు చదువుకుని వస్తున్నాడని కూడా తెలిసిపోయింది.

దాదాపుగా ప్రతి సాయంకాలం ఎక్కడికో ఒకచోటకి వెళ్ళేవాళ్ళం. పార్కు, రెస్టరెంట్, లైబ్రరీ- సంక్రాతిరోజుల్లో ఊరికే ఆ మెయిన్ రోడ్ అంతా చుట్టివచ్చేవాళ్ళం. పొంగల్ షాపింగ్ కోసం కిక్కిరిసిపోయ్యే ఆ దుకాణాల మధ్య, ఆ విద్యుద్దీపాల ధగధగలో, ఆ వీథిలో నడవడమే పండగలాగా ఉండేది.

కాని మా ప్రతి కలయికలోనూ, కలిసి నడిచిన ప్రతి అడుగులోనూ ఆ మెజర్ మెంటు టేపు కూడానే ఉండేది. ఒక్కరోజు కూడా అతను నా చిటికెనవేలు కూడా తాకింది లేదు. చివరికి అతను మా నిశ్చితార్థం నాడు ఉంగరం తొడిగిన వేలు కూడా.

పండగ అయిపోగానే డాక్టర్ పాండిచ్చేరి వెళ్ళిపోయాడు. ‘మళ్ళా ఎప్పుడు?’ అని అడుగుదామని అనుకున్నాను, కాని నోరుపెగల్లేదు. ‘ఉత్తరాలు రాస్తాను. జవాబు రాస్తారా?’ అని మాత్రం అడిగాను. చిరునవ్వుతో తలూపాడు.

మా స్కూలు తెరిచారు. నా రుటీన్ మొదలయ్యింది. ప్రశాంత్ కూడా కాలేజికి వెళ్ళిపోయాడు. రజని కాలేజి మరొక వారం రోజుల తర్వాత తెరుస్తారు. ఇల్లంతా ఒకలాంటి శూన్యం అలముకుంది. ఏదో నిశ్శబ్దం. కాని దాన్ని భగ్నం చెయ్యాలని ఎవరికీ లేదు.

అలాంటి రోజుల్లో ఒకసాయంకాలం నేను కాన్వెంటు నుంచి ఇంటికొచ్చేసరికి రజని నా చేతుల్లో ఒక కవరు పెట్టింది,

యాభై పైసల యెల్లో కవర్. ఈసారి దాని మీద నా పేరు మాత్రమే రాసి ఉంది. ఫ్రమ్ అడ్రసు లేదు. కాని ఎవరు రాసారో తెలుస్తూనే ఉంది. ఆ కవరు చూడగానే నాకు గుండెదడ మొదలయ్యింది. గొంతు తడారిపోయింది. మౌనంగా ఆ కవరు తీసుకుని నా గదిలోకి వెళ్ళాను. ఆ క్షణాన నాకు వనలత గుర్తొచ్చింది. ఆమె చేతుల్లోకి ఇలానే ఒక పోస్టలు కవరు వచ్చిన రోజున ఆమె వెక్కి వెక్కి ఏడవడం గుర్తొచ్చింది. ఆమె ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాను. ఒక ఉత్తరం నీ చేతుల్లోకి వస్తే ఇలా గుండెదడ వచ్చే పరిస్థితి ఏ ఆడపిల్లకీ సంభవించకూడదనుకున్నాను.

ఆ ఉత్తరం తెరవాలా వద్దా? పొద్దున్నే స్కూలుకి వెళ్ళేటప్పుడే దాన్ని చింపి డ్రైనేజిలో పారేస్తే మంచిది కదా అనుకున్నాను. కాని ఏదో కుతూహలం నన్ను ముందుకునెడుతూ ఉంది. ఏమి రాసి ఉంటాడో చదివి అప్పుడు చింపేద్దాం అనుకున్నాను. నెమ్మదిగా కవరు తెరిచి, ఆ కాగితాలు బయటికి తీసాను. ఈసారి చిన్న ఉత్తరమే. రెండు పేజీలే రాసాడు.

కాని ఉత్తరం మొదలవుతూనే ‘నా ప్రియమైన విమలా-‘

నాకు గుండే ఊడి చేతుల్లో పడ్డట్టయింది. కళ్ళు తిరిగాయి. కష్టమ్మీద తక్కిన వాక్యాలన్నీ చదివాను. గదిలో బీరువాని ఆనుకుని అలాగే కొన్ని క్షణాలు నిలబడిపోయాను. ఆ ఉత్తరం మడిచి కవర్లో పెట్టి, ఆ కవరు నా హాండ్ బాగ్ లో పెట్టుకున్నాను. అమ్మకి సాయం చెయ్యడానికి వంటింట్లోకి వెళ్ళాను.

నాకు ఒక సంగతి అర్థమయింది. నేను అక్కడున్నప్పుడు ప్రొఫెసర్ సేన్ గుప్త నాకొక ఆదర్శంగా ఉండేవాడు. కాని రాజు ఆయన్ని డ్రీమర్ అని ఎకసెక్కం చేసేవాడు. అతనికి డా.మిశ్రా ఒక ఆదర్శంగా మారుతున్నాడని తొందరలోనే గ్రహించాను. మిశ్రా ‘చాలా ప్రాక్టికల్’ అనే వాడు. కాని ఇదేమిటి? ఇప్పుడు రోల్ మోడల్స్  రివర్స్ అయ్యారని తెలుస్తోంది. రాజు డ్రీమర్ గా మారుతున్నాడు. నేను ప్రాక్టికల్ గా మారుతున్నాను. మారకతప్పదని కూడా తెలుసుకున్నాను.

ఎన్నో ఏళ్ళ తర్వాత నేనొక నవల చదివాను. అందులో రెండు మూడు కుటుంబాలు వనభోజనాలకి అడవికి వెళ్తారు. వాళ్ళ పిల్లలు, వరసకి బంధువులు, చిన్న పిల్లలు ఆడుకుంటూ వాళ్లకి తెలీకుండానే అడవిలోకి వెళ్ళిపోతారు. కొంతసేపటికి తాము దారితప్పామనీ, తమ వాళ్లనుంచి దూరంగా వచ్చేసామనీ గ్రహిస్తారు. భయపడతారు. అటూ ఇటూ పరుగెడతారు, చివరికి ఎలాగైతేనేం వెనక్కి వస్తారు, తమ వాళ్లని కలుసుకుంటారు. కాని ఆ కథానాయకుడు, తన జీవితంలో తర్వాత ఎప్పుడో ఆ సంఘటన తలుచుకుంటూ, ఆ  రోజు ఆ అడవిలో మాకేమైందో తెలీదుగాని, మేము అడవినుంచి బయటికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా పెద్దవాళ్లమైపోయాం అంటాడు.

అచ్చం అలాంటి సంఘటననే మా జీవితాల్లోనూ సంభవించింది. ఆ వైశాఖమాసపు అపరాహ్ణం మేము ఆ కొండవార లోయలోకి వెళ్ళినప్పుడు వర్షం పడ్డప్పుడు మేమిద్దరమే ఆ అడవిలో ఒంటరిగా గడిపాం. అప్పుడు మా మధ్య ఏమీ జరగలేదు. కానీ ఇన్ని నెలల తర్వాత, నాకు తెలుస్తున్నది, ఆ పిల్లవాడు మరింత చిన్నపిల్లవాడవుతున్నాడనీ, నేను మరింత పెద్దదాన్నైపోతున్నాననీ.

రాజు అనే ఆ పిల్లవాడు జియొలాజికల్ టైమ్ లో జీవించడం మొదలుపెట్టాడనీ, నేను సోషియొలాజికల్ టైమ్ లో అడుగుపెట్టాననీ నన్ను నేను సముదాయించుకున్నాను. కానీ, ఈ ఉత్తరాలేమిటి? ప్రేమ అనేది మాటల్లో ప్రకటించేదికాదని వనలత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజంగా ఆ పిల్లవాడికి నా మీద ఉన్నది ప్రేమే అయితే, ఈ ఉత్తరాలు రాసేవాడే కాదనిపించింది. ప్రేమ అంటే అన్నిటికన్నా ముందు ఎదటిమనిషిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకపోవడం కదా.

ఆ ఆలోచనలు సాగుతున్నప్పుడు అనుకోకుండానే అతణ్ణి డాక్టర్ తో పోల్చుకున్నాను. డాక్టర్ ఇప్పటిదాకా ‘ఐ లవ్ యూ’ అనే మాట ఒక్కసారి కూడా చెప్పలేదు. అసలు అటువంటి మాట చెప్పవలసిన అవసరం ఉన్నట్టే అతనికి తోచి ఉండదు. అతను నన్ను తనమనిషిగా కాక, ముందు ఒక మనిషిగా గుర్తిస్తున్నాడు, నా స్పేస్ నాకిస్తున్నాడు అనిపించింది. ఆ ఉంగరమే చూడు, దాని మీద ‘ఎస్’ అని ఎందుకు చెక్కించాలి? అది మా ఇంటిపేరు కదా. ‘వి’ అనే అక్షరమే పొదిగించి ఉండవచ్చు కదా!

కాని నా మనసులో అలాంటి పోలిక రాగానే ముందు నా మనసులోనే ఒక భాగం చాలా కుంచించుకుపోయింది. నువ్విలా కూడా  ఆలోచించగలవా అని నన్నెవరో ఎత్తిచూపిస్తున్నట్లుగా తోచింది. ‘కమాన్, టెల్ మీ. ఎప్పుడు, ఎప్పుడేనా ఆ పిల్లవాడు నీ స్వాతంత్య్రాన్ని, నీ గౌరవాన్ని భంగపరిచిన మాట, చేత- ఒక్కటంటే, ఒక్కటేనా ఉందా చెప్పు?’

నా ఆలోచనలు ఇంక ముందుకు సాగడం అసాధ్యమనిపించింది. ఎలాగేనా డాక్టర్ వచ్చేస్తే బాగుణ్ణని బలంగా అనిపించింది. ఏమీ మాట్లాడక్కర్లేదు. అతను వచ్చి హాల్లో కూచుంటే చాలు, నా ఆలోచనలు మొత్తం కట్టడైపోతాయనిపించింది.

2-5-2023

10 Replies to “ఆ వెన్నెల రాత్రులు-28”

 1. మొదటి నుండి విమల భావాల గమనంతో మమేకం అవుతూ వున్న పాఠకుడు రచయిత ఆమె పాత్రని చిత్రించే కోణంలో8 వాస్తవితను గమనిస్తే సమకాలీన ధోరణికి దగ్గరగా వుండడం తెలుస్తుంది. ఒక లేఖ ..తన ఆలోచనా సంద్రంలో సూదులు తిరగడం గత వర్తమానాలు వంతెన మీదుగా ఆమె అంతర్లోకనం చూస్తే ఎంత జాగ్రత్తగా మలిచారు అనేది ఆశ్చర్యం..అడవి ప్రయాణంలో వ్యక్తుల పరిచయం ఎంత ప్రభావం చూపింది అంతే త్వరగా వాస్తవ జీవనం రొటీన్ లోకి రావడం సహజం అనిపించే విశేషమే. కాబోయే సహచరి ..కుటుంబం. ఆలయానికి ఆధునిక ఆలోచనలు కలిగి వున్నా స్వానులోచనల్లో ఆమె అంతర్మధనం స్పష్టంగా తెలుస్తోంది. ఒక విధంగా ఇది అంతర బాహ్య ప్రకృతుల సమ్మేళనం ఈ వెన్నెల రాత్రులు అనిపిస్తోంది సర్..
  ధన్యవాదాలు..

 2. ఎక్కువ సాహిత్యం చదువుకోలేదు కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించగలరు.

  రచయితలు (male) women characters ని ఎంత effective రాసినా తమ point of view నుండే రాస్తారేమో అనుకుంటున్నా. చలంగారు comes to mind. He has written extensively for women but he wrote them in third person point of view from the little I know. (Confession-have not read a lot of Chalam’s works also. )
  వెన్నెల రాత్రుల్లో విమల పాత్ర first person లో narrator గా రాశారు. We see the story unfold through her. Very beautifully written especially her inner conflict as a young woman. ఈ కథ చదవడం మొదలు పెట్టినప్పటినుండీ అనుకుంటూనే వున్నాను, రచయితలు అలా ఎలా రాయగలరు అని. What is their source? Studying psychology? Reading women writers? రచయిత్రులెవరైనా male character point of view లోనుండీ రాశారా?
  🙏🏽

   1. ఓ సరే సర్! మైదానం చదివాను కానీ first person లో వున్నట్లు గుర్తు లేదు.
    పాత్రల మనోకాయప్రవేశవిద్య secret చెప్తారేమో అనుకున్నాను. 😊

 3. ఎంతో పరిచయం ఉన్నవారి నుంచి..
  స్నేహాన్ని ప్రేమగా పొరపడో..
  లేదా ఇష్టాన్ని ప్రేమగా భ్రమపడో..
  అనూహ్య ప్రేమ సందేశం అందితే..
  అందులోనూ..
  తన వివాహం వేరొకరితో నిశ్చయింపబడిన తరువాత.. తన తప్పు లేకపోయినా..
  ఎదుటివారి అపార్థం వల్ల.. ఏర్పడ్డ ఈ విచిత్ర పరిస్థితిలో .. కుటుంబం, సమాజం గురించి ఆలోచించే .. ఒక యువతి పడే మానసిక సంఘర్షణను చక్కగా అక్షరబద్ధం చేశారు.
  ధన్యవాదాలు సర్.

 4. రచయితలో స్త్రీతనం ఉంటేనే కానీ సాధ్యం కాదు

Leave a Reply

%d bloggers like this: