ఆ వెన్నెల రాత్రులు-27

Reading Time: 9 minutes

రాజు నుంచి ఉత్తరం అనగానే చాలా సంతోషంగా అనిపించింది. నా గదిలోకి వెళ్ళి మంచం మీద కూచుని, గోడకి అనుకుంటూ, ఆ కవర్ చింపాను. ఆ ఊరు వదిలి వచ్చి ఆరునెలలు పైనే దాటింది. వచ్చిన మూడు నాలుగు వారాలదాకా చాలా బెంగగా ఉండింది, కానీ స్కూల్లో చేరాక, రోజువారీ జీవితం ఆ బెంగని కప్పేసింది. ఇక ఈ రెండు మూడు నెలలుగా, మా జీవితాల్లో సంభవిస్తున్న కొత్త మార్పుల వల్ల ఆ ఊరి జ్ఞాపకాలు కూడా అడుగున పడిపోయేయి. నాకు గుర్తుండి ఆ రెండుమూడువారాలుగా ఆ ఊరికి సంబంధించిన మనుషులు కూడా ఎవరూ నా తలపుల్లో లేరు. అలాంటిది హటాత్తుగా అక్కణ్ణుంచి ఉత్తరం, అది కూడా రాజునుంచి అనగానే ఎంతో ఆసక్తిగా అనిపించింది.

పెద్ద ఉత్తరం. ఆరుపేజీలు. సగానికి మడిచి రాసిన మూడు తెల్లకాగితం ఠావులు. గుండ్రంగా ఉన్న దస్తూరీ. రాజు చేతిరాత ఎలా ఉంటుందో సర్వే ఫారాలు నింపుతున్నప్పుడు చూసానుగానీ అవన్నీ పొడిపొడి అక్షరాలూ, మాటలూ. ఇలా ఒక కాగితం పొడుగునా అతని చేతిరాత ఎలా ఉంటుందో చూడటం ఇదే మొదటిసారి. ఆ కాగితాల్లో కూడా ప్రతి పేజీకీ మార్జిను ఉంది, లైన్లు ఎక్కడా వంకరపోకుండా కుదురుగా, కాగితం కింద రూళ్ళకాగితం పెట్టుకు రాసాడా అన్నంత పొందిగ్గా ఉన్నాయి.

ఉత్తరం పైన ఊరుపేరూ, డిసెంబరు 26 అని తేదీ ఉన్నాయి.

దానికింద

‘ప్రియమైన విమలా’

అని ఉంది. ఆ ‘ప్రియమైన’ అనే పదం దగ్గర ఒక క్షణం ఆగేను. ఆ పదం నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. ఇంగ్లిషులో ‘డియర్’ అనే మాటని తెలుగులో అలా రాసి ఉంటాడులే అనుకున్నాను.

ఆ తర్వాత మొదటి రెండు పేజీలూ తన గురించిన వివరాలూ, ఆ ఊళ్ళో జీవితం గురించిన వివరాలూ ఉన్నాయి. నిజంగా సంతోషించదగ్గ విషయాలు. అన్నిటికన్నా ముందు, సుధీర్ పెళ్ళి రాజమండ్రిలో జరిగిందనీ, ఆ పెళ్ళికి తను కూడా వెళ్ళాననీ, అక్కడ సుధీర్ నా గురించి అడిగాడనీ, పెళ్ళికి ఎందుకు రాలేదని అడిగాడనీ కూడా రాసాడు. ‘సుధీర్ ఎవరు?’ అని మనసులో అతిచిన్న ప్రశ్న, క్షణంలో పావువంతు కాలంలో తలెత్తి, వెంటనే ‘సుధీర్ అన్నయ్య’ గుర్తొచ్చాడు. అతని పెళ్ళి డిసెంబరులో అని అప్పట్లో మాట్లాడుకోడం కూడా గుర్తొచ్చింది. ఎలా మర్చిపోయేను ఆ మనిషినీ, ఆ పెళ్ళి సంగతినీ? నేను రాలేదని అడిగాడంటే నాకు వెడ్డింగ్ కార్డు పంపాడనే కదా. కాని నాకే కార్డూ అందలేదే? ఏ అడ్రస్సుకి పంపాడు? లేకపోతే మాష్టారు పంపించి ఉంటారనుకున్నాడా? నాకు గుర్తుండి నేనే వస్తాననుకున్నాడా? అతని పెళ్ళి విషయం నాకు గుర్తు లేదని తఓచగఆనఏ మనసు చేదుగా అయిపోయింది.

ఉత్తరంలో ఆ తర్వాత రాసిన విషయాల్లో, తాను బిఏ మూడు సంవత్సరాల పరీక్షలూ ఆ సెప్టెంబరులో సింగిల్ సిట్టింగ్ లో రాసేసాడనీ, ఆ పరీక్షలు రాసేదాకా నాకు ఉత్తరం రాయకూడదని అనుకున్నాడనీ కూడా రాసేడు. తాను మొత్తం పరీక్షలు రాసేసాడని చదవగానే సంతోషంగా అనిపించింది. కానీ, ఎందుకనో, ఎగిరిగంతేసేటంత సంతోషమైతే కలగలేదు.

ప్రొఫెసర్ సేన్ గుప్తనుంచి గానీ, డా.మిశ్రానుంచి గానీ ఎటువంటి సమాచారమూ లేదనీ, రోజా కూడా నేను వచ్చేసిన వారం రోజులకే, కాలేజీలు తెరిచే టైమయ్యిందని, వెళ్ళిపోయిందని కూడా రాసాడు. అంటే సేన్ గుప్త అతనికి ఇప్పటికి కూడా ఉత్తరం రాయలేదన్నమాట అనుకున్నాను.

‘నువ్వు నిజంగా పొంగిపోయే వార్త ఒకటి ఉంది చెప్పనా? అసలు ముందు ఆ వార్తతోటే ఈ ఉత్తరం మొదలుపెట్టాల్సింది-‘

ఏమిటన్నట్టు ఆ కింద వాక్యాల్లోకి వెంటనే కళ్ళు పరుగెత్తాయి.

‘మనూళ్ళో స్కూలుకి గవర్న్ మెంటు  కొత్త బిల్డింగు శాంక్షను చేసింది. ఆ మధ్య ఎక్కడో కలిసినప్పుడు బిడివో గారు చెప్పారు-‘

ఆ వాక్యం నిజంగానే ఎగిరిగంతెయ్యవలసిన వాక్యం. కానీ, ఎందుకనో, అది ఏదో వార్తాపత్రికలో ఫలానా ఊళ్ళో స్కూలు బిల్డింగ్ శాంక్షను చేసారు అనే వార్త చదివితే, ఎంత స్పందన కలుగుతుందో, ఆ వార్తకీ నా హృదయం అంతే స్పందించింది. ఆ వాక్యం దగ్గర నా స్పందన చూసుకుని నాకే ఆశ్చర్యం వేసింది.

ఆ తర్వాత నాలుగు పేజీలు. అదే అసలు ఉత్తరం అంతా. అసలు అతను అటువంటి తెలుగు రాయగలడని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాని ఆశ్చర్యం ఏముంది? వనలత అనే పేరు వినగానే టాగోర్ పుస్తకాల్లో పాత్రనా అని అడిగినప్పుడే అతను బెంగాలీ అనువాదాలు చదువుతుంటాడని తెలిసింది. శరత్ బాబు నవలలు తెలుగు అనువాదాలు చదివినవాడు అటువంటి తెలుగు రాయడంలో ఆశ్చర్యం లేదు.

కాని ఆ నాలుగు పేజీలూ నేను అతికష్టం మీద చదివాను. భాష అందంగా ఉంది, దస్తూరీ అందంగా ఉంది, పంక్తులు పొందిగ్గా ఉన్నాయి. కాని, ఆ కాగితాలు ఒక్కొక్కటీ తిప్పి చదవాలనిపించకా, కాని ఒక్కొక్కటీ తిప్పకుండా ఉండలేకా, చదవకుండా ఉండలేకా, అతికష్టమ్మీద చదివేను. ఇంకా పండుదలకి రాని మామిడి కాయని ఎండుగడ్డిలో మగ్గబెడితే, దాని జీడివాసన ఎలా పోదో, ఆ పండుని నోటిదగ్గర చేర్చుకున్నప్పుడు, తీపిదనంకన్నా కసరుదనమే ఎలా ముందు అనుభవానికొస్తుందో, ఆ ఉత్తరమంతా అలా ఉంది.

ఇక ఆ ఉత్తరం చివర, ‘నిన్నెప్పటికీ ప్రేమించే- నీ రాజు’ అని సంతకం చేసి ఉంది.

రెండు సార్లు లవ్, లవ్- ఉత్తరం మొదట్లో ఒక లవ్ , చివర్లో మరో లవ్.

ఒక్కమాటలో చెప్పాలంటే, అది ప్రేమలేఖ.

నా జీవితంలో ఎవరినుంచేనా మొదటిసారి అందుకున్న ప్రేమలేఖ.

కాని నా మనసంతా వగరుగా అయిపోయింది. గుండె వడివడిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. టెన్షన్ మొదలయ్యింది. ఎవరో నా వెనక నిలబడి ఆ ఉత్తరంలో ఏముందా అని చూస్తున్నట్టు అనిపించింది.

ఈలోపు రజని ఆ గదిలోకి వచ్చింది.

‘ఎవరు రాసేరక్కా ఆ ఉత్తరం’ అనడిగింది.

నేను వెంటనే సర్దుకున్నాను. నా ముఖంలో భావాలు దానికి ఏదో ఒకటి చెప్పేముందు నేనే మాట్లాడటం మంచిదనుకున్నాను.

‘నేను వెళ్ళొచ్చానే ఆ ఊరు. అక్కడ రాజు అనే పిల్లవాడి గురించి చెప్పాను కదా. అతను రాసాడు. ఆ ఊరు సంగతులన్నీ రాసాడు.’

‘ఓహో’ అంది రజని.

‘అప్పుడు మేమంతా ఆ ఊళ్ళో బడికి బిల్దింగు లేకపోతే, అంతా కలిసి ఒక పాక వేసామని చెప్పాను కదా-‘

‘అవును ఒక యాంత్రొపాలజిస్టు-‘

‘డా.మిశ్రా, బాగా గుర్తుందే నీకు! ఆయనే మా అందర్నీ మోటివేట్ చేసి ఊళ్ళో వాళ్ళతో శ్రమదానం చేయించాడు. ఇప్పుడు ఆ బడికి గవర్నమెంటు కొత్త బిల్డింగు శాంక్షను చేసారని రాసాడు.’

‘గ్రేట్’ అంది రజని కళ్ళు పెద్దవిచేస్తూ. అప్పుడు బీరువాలోంచి నైటీ తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోడానికి పక్క గదిలోకి వెళ్ళింది.

కాని నన్ను చూసి మళ్ళా నేను ఆశ్చర్యపోయాను. ఆ ఊరినుంచి వచ్చిన ఉత్తరం అనగానే మరే సంగతులూ చెప్పకుండా బడి బిల్డింగు గురించే ఎందుకు చెప్పాను?

ఆ ఉత్తరం మరోసారి చదవాలనిపించింది. చదవడం కాదు, స్కాన్ చెయ్యాలనిపించింది. ఆ ఉత్తరంలో వాక్యాల్ని కాదు, అది చదువుతున్నంతసేపూ నన్ను నేను స్కాన్ చేసుకోవాలనిపించింది.

ఎందుకు? ఎందుకలా రాసాడు?

నేనెప్పుడన్నా అతనితో అటువంటి ఊహలకి అవకాశమిచ్చేటట్టు ప్రవర్తించానా? అతనిపట్ల ప్రగాఢమైన ఇష్టమెప్పుడన్నా చూపించేనా? అతనంటే నాకు చాలా ఇష్టమని అతను అనుకోడానికి కనీసం అటువంటి సిగ్నల్స్ ఎప్పుడేనా నా నుంచి వెలువడ్డాయా?

ఒక్కసారిగా సినిమాలో రీలు తిప్పినట్టు ఆ ఎనిమిదినెలలపాటు గడిచిన రోజులూ, రాత్రులూ అన్నీ త్వరత్వరగా నా మనసులో కదలాడిపోయేయి. మేమంతా కలిసి తిరిగిన ప్రతి చోటూ మరొకసారి గాలించేను. మనం నడిచివస్తూండగా, ఏదన్నా పోగొట్టుకుంటే, తిరిగి మళ్లా ఆ దారమ్మట వెతుక్కుంటూ వెళ్తామే, అలా నేను తిరిగిన దారులన్నీ గాలించేను. ఎక్కడేనా ఏదన్నా ఒక సంజ్ఞ, ఒక సూచన, ఒక సంకేతం. ..

ఎన్ని రాత్రుళ్ళో ఆ ఇంటి మీద వెన్నెల కురుస్తూ ఉండగా నేను ఆ అరుగు మీద నా మోకాళ్ళు నా చేతుల్తో చుట్టుకుని కూచుని అతను చెప్పిన మాటలు విన్నాను, నిజమే, కాని నేనెప్పుడూ ఏదీ మాట్లాడలేదే! ఎన్నో సాయంకాలాలు అతను వస్తాడా లేదా అని ఎదురుచూసాను. కాని ఏం ఒక స్నేహితుడికోసం ఎదురుచూడరా? నీ క్లాస్ మేట్, నీ బంధువు, నీ కొలీగ్- మనుషులు కలిసి మాట్లాడుకోరా? తుళ్ళిపడరా? నవ్వుకోరా? పోట్లాడుకోరా?

ఆ పదిపదిహేను నిమిషాల్లో మళ్ళా రజని ఆ గదిలోకి వచ్చేలోపు నన్ను నేను తీవ్రాతితీవ్రంగా శోధించుకున్నాను. నన్ను మరీ మరీ తరచి చూసుకునే కొద్దీ, ఆ ఊళ్ళో దృశ్యాలు, ఆ రోజులు, ఆ వెన్నెల రాత్రులు మరింతగా గుర్తు రావడం మొదలుపెట్టాయి.

హటాత్తుగా ఆ సాయంకాలం మేము అడవినుంచి తిరిగివస్తూ ఉండగా మమ్మల్ని ఆపేసిన వెలగపళ్ళ వాసన గుర్తొచ్చింది. ఆ వాసన ఎంత తాజాగా నా ముక్కుపుటాలకు తోచిందంటే, ఎవరో ఒక పండువెలగ పళ్ళ బుట్ట ఆ మంచం కింద పెట్టారేమో అన్నంతగా. వెంటనే, ఇక్కడేదో పాము తిరుగుతూ ఉంటుంది అని దేవయ్య అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ ఫలసౌరభం పక్కనే ఒక సర్పభ్రాంతి ఆ రోజు నాలో కలిగించిన మిశ్రమభావాలాంటిదే ఆ రాత్రి ఆ ఉత్తరం చేతుల్లో ఉండగా కలిగింది.

నా చేతుల్లో ఒక ప్రేమలేఖ. నా మనసులో ఒక సర్పభ్రాంతి.

నాకు నేను నిదానంగా చెప్పుకోడం మొదలుపెట్టాను. ‘లుక్, విమలా, ఆ పిల్లవాడు. గుర్తు తెచ్చుకో. బడిపిల్లలకి స్కూలు కట్టాలంటే, తను రాయాల్సిన పరీక్షల్ని పక్కన పెట్టేసిన పిల్లవాడు, మీరంతా సినిమాకి పోయి రాత్రంతా వెన్నెల్లో గడిపి, ఇంటికొచ్చాక, ఒళ్ళెరక్కుండా నిద్రపోతుంటే, ఆ పిల్లవాడు మళ్ళా బయల్దేరి ఆ మర్నాడంతా మంత్రసానికోసం, డాక్టరు కోసం తిరుగుతూ ఉన్నాడు. ఎవరో యాంత్రొపాలజిస్టు తన ప్రాజెక్టు కోసం హౌస్ హోల్డ్ సర్వే చెయ్యాలంటే, తన పనులన్నీ పక్కన పెట్టి, తన చదువుపెట్టి, ఇంటింటికీ తిరిగి ఆ ఫారాలు పూర్తిచేసాడు. గుర్తుందా! సేన్ గుప్త నీకు రెమ్యునరేషన్ చెల్లించాడు. కాని అతనికి కనీసం ఉత్తరం కూడా రాయలేదు. ఏమో? నీకు చెల్లించిన రెమ్యూనరేషన్ లో అతనికి కూడా కొంత వాటా ఉందేమో-‘

‘కానీ ఆ పని డా.మిశ్రా అప్పగించాడు. సేన్ గుప్తా కాదు.’

‘ఏమో, డా.మిశ్రా ఆ సంగతి సేన్ గుప్తాకి చెప్పకుండా ఉంటాడా?’

‘అలా అయితే మిశ్రానే నాకు చెప్పి ఉండేవాడే.’

‘బట్, లుక్, ఆ మిశ్రా ఆ రోజు నువ్వు చెప్పావు కాబట్టి రాజు కోసం ఒక గంటసేపు వెయిట్ చేసాడు. అది కూడా ముళ్లమీద కూచున్నట్టు. నువ్వు రాజు గురించి గుర్తుచేయకపోయి ఉంటే, వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ రాజు అనే పిల్లవాడికి చెప్పి సెలవు తీసుకోవాలని అతనికి ఎప్పటికీ తట్టకపోయుండేది.’

నా మనసు నన్ను పక్కదోవ పట్టిస్తోందని అర్థమవుతోంది. ఆ క్షణాన నేను ఆలోచించవలసింది సేన్ గుప్తాల గురించీ, మిశ్రాల గురించీ కాదు, ఆ రెమ్యునరేషన్ లెక్కలు అసలే కాదు. అదంతా సర్ఫేస్ లెవెల్ నాన్సెన్స్. అంతకన్నా లోతైంది, మరింకేదో, నీ అంతరంగం నీ నుంచి దాచిపెడుతున్నదేమో, దాన్ని బయటకి తియ్యి. నిన్ను నువ్వు ముఖాముఖి ధైర్యంగా ఎదుర్కో. ఒకే ఒక్క ప్రశ్న-నిన్ను నువ్వు సూటిగా అడగవలసిన ప్రశ్న ఒకే ఒక్కటి- అడగవలసింది ఆ ఒక్క ప్రశ్న. ఆ ఒకే ఒక్క ప్రశ్న.

నాకు తలతిరగడం మొదలయ్యింది. ఆ వారం రోజులుగా ఎంతో హుషారుగా గడిచిన రోజులు మాయమైపోయాయి. ఆ రోజు ఆ సినిమాకి వెళ్ళడం, ఆ హాల్లో కూచునేటప్పటి గుంజాటన ఒక్కసారి గుర్తొచ్చి, ఆ దృశ్యంపక్కకు తప్పుకుని ఆ రాత్రి మేమంతా రెండెడ్లబండిమీద సినిమాకి వెళ్ళిన జ్ఞాపకం ముందుకొచ్చింది.

‘అవేళ నువ్వు అతనితో సినిమాకి వెళ్లావే. మరి నీ అన్ననో, తమ్ముడో కాకుండా మరెవ్వరితోనూ ఎప్పుడూ సినిమాకి వెళ్లింది లేదనుకున్నావే ఇవేళ-‘

‘ఆ రోజు అందరం ఉన్నాం, రోజా, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి-‘

‘ఇవేళ కూడా నీ తమ్ముడూ, నీ చెల్లెలూ ఉన్నారు-‘

అవును. నిజమే. ఆ రోజు అతనితో ఆ అర్థరాత్రి ఆ అడవిలో ఎడ్లబండిమీద ఆ పల్లెటూరి టూరింగ్ టాకీసులో సినిమాకి వెళ్ళినప్పుడు నా గుండె ఎందుకు కొట్టుకోలేదు? ఇవాళ డాక్టరుతో, నాకు నిశ్చితార్థం జరిగిన ఒక యువకుడితో, సినిమాకు వెళ్ళినప్పుడు ఎందుకంత నెర్వస్ నెస్ ఫీలయ్యాను?

హటాత్తుగా మనసులో ఒక మెరుపు మెరిసినట్టయ్యింది.

అర్థమయింది.

నేను రాజుని ఒక స్నేహితుడిగా మాత్రమే చూసాను కాబట్టి, అతని ప్రెసెన్స్ లో నాకు మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా పొందే ఆనందం ఏదీ లేదు కాబట్టి నేను టెన్షన్ పడలేదు. అసలు ఆ రోజు నా తలపుల్లో రాజు లేడు, వెన్నెల మాత్రమే ఉంది. నిజానికి ఆ రాత్రి తిరిగి వస్తున్నప్పుడు రాజు కూడా నిద్రపోయాడు. ఆ ఏకాంత కౌముదిలో నాకు తోడుగా మెలకువగా ఉన్నది డా.మిశ్రా మాత్రమే. కాని ఆ రాత్రి ఆయన తన ప్రపంచంలో తానున్నాడు, నా ప్రపంచంలో నేనున్నాను.

ఆ తలపులు సాగుతూండగానే నాకు చెప్పలేనంత ఊరట కలిగింది. అవును, రాజు ఒక మంచి స్నేహితుడు. అక్కడ ఎంతో స్నేహంగా కలిసి మెలిసి తిరిగాం. ఎన్నో సంతోషాల్ని కలిసి పంచుకున్నాం. కాని ప్రేమ? అది వేరే పదం.

ఉత్తరం కవర్లో పెట్టేసాను. ఈ లోపు రజని గదిలోకి వచ్చింది. నాతో పాటు మంచమ్మీద ఎక్కింది. తన జడకి పెట్టుకున్న రబ్బరు బాండు తీసి పక్కన పెట్టి జుట్టు వదులు  చేసుకుని వెనక్కి తోసి తలగడ మీద తలపెట్టుకుని పడుకుంది.

నేను కూడా ఫ్లోరెసెంట్ లైట్ స్విచ్ఛి ఆపుచేసి పడుకున్నాను.

కాని అప్పటిదాకా కలవరపడ్డ కొలను నీళ్ళు నెమ్మదిగా సర్దుకుని ఆకాశమూ, మేఘాలూ కనిపించడం మొదలైనప్పటిలా, నా ముందొక దృశ్యం కనిపించడం మొదలుపెట్టింది.

వకుళకుటి.

ఆ రోజు డా.మిశ్రాని కలిసి మాట్లాడి ట్రైబల్స్ వెళ్ళిపోయాక అక్కడ నేనూ, రాజూ అరుగుమీద కూచుని ఉన్నాం. మాతో డా.మిశ్రా అంటున్నాడు: ‘ఇక్కడ దారుణమైన పరిస్థితులు నడుస్తున్నాయి. నాన్ ట్రైబల్స్ రాజ్యం నడుస్తోంది. ఇదుగో, ఈయన సంగతే చూడండి-‘ అని రాజు కేసి చూపించాడు. చెప్తున్నాడు: వీళ్ళ నాన్నగారు వెస్ట్ గొడావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన క్షత్రియుడు. అంటే నాన్ ట్రైబల్. మరి ఇక్కడ ఆయనకి అంత భూమి, అరటితోట, చెరకుతోట ఎలా వచ్చేయో చెప్పగలరా? దీన్నే లాండ్ ఎలియనేషన్ అంటారు. అసలు ఈ భూమి అంతా ట్రైబల్స్ ది. ట్రైబల్స్ కే చెందాలి. కాని వీళ్లంతా ఏదో ఒక రూపంలో దాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళని తమ పొలాల్లో పనివాళ్ళుగా మార్చేసారు. అర్థమవుతోందా?’ అని అంటున్నాడు.

అప్పుడు నేను కంగారు పడిపోడం గుర్తొస్తోంది. నా ఎదురుగుండా రాజుని పట్టుకుని అతడి తండ్రినీ, కుటుంబాన్నీ నేరస్థులుగా చూపిస్తో అలా మాట్లాడుతుంటే నాకు కాళ్ళల్లో వొణుకు పుట్టడం గుర్తొస్తోంది. అప్పుడు రాజు ముఖం కేసి చూసాను. అప్పుడు- మళ్ళా ఇప్పుడు- ఆ గదిలో, ఆ చీకట్లో, మంచం మీద పడుకుని కళ్ళు మూసుకోగానే, అతని ముఖం తేటపడ్డ కొలనులో ప్రతిబింబంలాగా స్పష్టంగా కనిపిస్తోంది.

అప్పుడు ఆ ముఖం? అది ఎవరిది? ఒక పసివాడిదా? తన తండ్రిని తన ఎదటే మరొక మనిషి నేరస్థుడిగా ఎత్తి చూపుతుంటే, ఆ భాష ఏమీ అర్థంకాని ఒక పసివాడిదా? కాని రాజుకి ఆ భాష అర్థమవుతోందే- కానీ ఒక ట్రూత్ వింటున్నంత నిర్మలమైన ముఖంతో, ఆ ట్రూత్ ముందు తన తండ్రిని కూడా పక్కన పెట్టగలిగినంత ప్రశాంత చిత్తంతో ఆ మాటలు వింటున్న ఆ ముఖం దేవుడిదా? దైవసమానుడైన మనిషిదా? నాకు తెలీకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు ఉబికి చెంపలమీంచి ధారలు కట్టడం మొదలయ్యింది.

మరుక్షణంలో నా కళ్ళ ముందు ఆ ముఖం చెరిగిపోయింది. ఎటు చూసినా పొలాలు. పండిన వరిచేలు. వాటిమీద ఇంతలో ఎండ పడుతోంది, ఇంతలో మబ్బునీడ పడుతోంది. ఇద్దరు పిల్లలు ఆ పొలాల మధ్య గళ్ళకు గంతలు కట్టుకుని ఒకరినొకరు పట్టుకోడానికి పరుగెడుతున్నారు.  వాళ్ళిద్దరూ గంతలు కట్టుకున్నారు, లుక్, విమలా, ఇద్దరూ, అంటే నువ్వు కూడా, కళ్ళకి గంతలు కట్టుకున్నావు-

నాకు తలబరువెక్కిపోయింది. తలనొప్పి మొదలయ్యింది. ఏదో ఒక మాట దొరకాలి, ఒక మాత్ర లాగా దొరకాలి. నా ఎదట ఒక మాట ఉంది. ప్రేమ. కాని ఆ మాటకి ఆ తలనొప్పిని తగ్గించే శక్తిలేదు సరికదా, ఆ మాటని చూస్తే మరింత శిరోభారం పెరుగుతోంది. నేను ఆ మాటను ఎక్కడ చూడవలసి వస్తుందోనని నాకే భయంగా ఉంది. ఆ మాటని ఎవరేనా నా ముందు పక్కకి లాగేస్తే బాగుణ్ణని ఉంది. ఆ ఒక్క మాటా ఆ ఉత్తరం లోంచి తీసేస్తే ఆ ఉత్తరాన్ని ఎంతో అపురూపంగా హృదయానికి హత్తుకోవాలని ఉంది.

అప్పుడు నిజంగా కావలసింది ఒక మాట. ఒక మాత్రలాంటి మాట. ఆ మాత్ర ఎక్కడో మనసులోపల ఉంది. నువ్వొక టెలిఫోన్ కాల్ చెయ్యడానికి రూపాయి నాణెం కావలసి వచ్చినప్పుడు, ఆ కాయిన్ కోసం నీ హాండ్ బాగ్ వెతుక్కుంటూ ఉంటే నీ చేతికి అన్నీ తగులుతున్నాయి- హాండ్ కర్చీఫ్, గాజులు, బొట్టుబిళ్లల పాకెట్టు, ఉత్తరాలు, బాల్ పాయింట్ పెన్ను- ఆ కాయిన్ అక్కడ ఉన్నట్టుగా స్పర్శకి తెలుస్తోందిగాని, చేతికందదు చూడు, అచ్చం, అలానే ఉంది. ఆ మాత్ర, ఆ మాట, అదొక్కటీ దొరికితే నా తలనొప్పి తక్షణం తగ్గిపోతుంది.

నా చెంపల మీద తడి ఆరిపోయింది. ఈ సారి రజని వైపు తిరిగి పడుకున్నాను.  ‘పారడైజ్ లాస్ట్. జాన్ మిల్టన్. ఈజ్ దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్?- ‘ రాజు అడుగుతున్నాడు రజనిని (డాక్టర్ కదా అడిగాడు!).

దిగ్గున లేచి కూచున్నాను.

‘ఏంటక్కా?’ అంది రజని నిద్రాద్వారం దగ్గర.

‘నీ పారడైజ్ లాస్ట్ పుస్తకం ఎక్కడుంది?’

‘ఇప్పుడెందుకు?’ మగతగా అడుగుతున్నది.

‘చదవాలని ఉంది.’

లేచి లైటు వేసాను. దాని అలమారులో పుస్తకాలు వెతికాను. పైనే ఉంది. తీసి చూసాను. ‘పారడైజ్ లాస్ట్ అండ్ రీగెయిన్డ్: జాన్ మిల్టన్’. మొదటి పేజీ తెరిచాను. ఎడిటెడ్ బై క్రిష్టఫర్ రిక్స్ అని కనిపించింది. ఏం చదవాలని తెరిచాను?

‘బుక్:ఫోర్’ అనే మాట గుర్తొచ్చింది.

తెరిచాను. అది వెర్స్ అని అప్పటిదాకా తట్టలేదు. ఎప్పుడూ చదివింది కూడా కాదు. ఆ ఇంగ్లిషు అర్థం కాలేదు. మామూలుగా పొద్దున్నే కూచుని శ్రద్ధగా తెరిచి కూడబలుక్కుని చదివినా కూడా అంత తొందరగా అర్థమయ్యే ఇంగ్లిషు కాదు. ఇక అప్పటి నా మనఃస్థితిలో ఏమి అర్థమవుతుంది? కాని నా మనసుని ఏదో కఠినాతికఠినమైన మరో అంశం మీదకు బలవంతంగా మళ్ళిస్తే తప్ప నా మీద ఒరిగిపడ్డ ఆ బరువునుంచి నేను తప్పించుకోలేననిపించింది.

బుక్ ఫోర్. యాంత్రికంగా నా కళ్ళముందున్న కనిపిస్తున్న పద్యపంక్తులు చదవడం మొదలుపెట్టాను.

అకస్మాత్తుగా కొన్ని వాక్యాలు నాకు అర్థమవుతున్నట్టుగా అనిపించడం మొదలుపెట్టాయి. అవేవీ ఇప్పుడు గుర్తు లేవుగాని, Why satt’st thou like an enemy in wait here watching at the head of these that sleep? అన్న వాక్యం గుర్తుండిపోయింది. ఎవరో ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వకుండా నా పక్కన ఒక శత్రువులాగా పొంచి ఉన్నారనిపించింది.

ఎవరు ఆ శత్రువు?

నా లోపల ఉన్నాడా? బయట ఉన్నాడా?

పుస్తకం మూసేసాను.

Paradise Lost and Regained .

ఆ అక్షరాల్ని చేత్తో తడిమాను. నేను పారడైజ్ పోగొట్టుకున్నానా? పోగొట్టుకుంటున్నానా లేక పోగొట్టుకోబోతున్నానా? పోగొట్టుకున్న పారడైజ్ ను పొందబోతున్నానా లేక మళ్ళా పోగొట్టుకోబోతున్నానా? ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు పోగొట్టుకుంటానో తెలీదు. పొందుతానో తెలీదు.

జీవితంలో ప్రతి మలుపులోనూ నీకు రెండు కంఠాలు వినబడుతూ ఉంటాయి. కవి అన్నట్లుగా ‘ఎటుబోతే పూలతోట? ఎటుబోతే వల్లకాడు?’. మనిషి ఎదుర్కోవలసిన అత్యంత కఠినమైన పరీక్ష మరొకడు పెట్టేది కాదు. అది ఎప్పటికప్పుడు తనకి తాను పెట్టుకునే పరీక్ష. తనలో వినబడే రెండు కంఠాల్లో ఏది తన కంఠస్వరం? ఏది తనది కానిది? దేన్ని వినడం తనకి సుఖంగా ఉంటుంది? దేన్ని వింటే తనకు హితం కలుగుతుంది?

ఇటువంటి మాటలు పెద్దవాళ్ళు చెప్తుండగా ఏదో ఒకరూపంలో నేను వినకపోలేదు. కాని ఆ రాత్రి నాకు కొత్తగా అర్థమయిందేమంటే, నీకు వినబడుతున్న రెండు కంఠాలూ నీ మంచిని కోరుకుంటున్నవిగానే వినబడతాయి. ఆ రెండు స్వరాలూ కూడా నీకు సంతోషాన్నిచ్చేవిగానే వినిపిస్తాయి. ఆ రెండూ కూడా నిన్ను ఒక్కలానే ప్రలోభపరుస్తాయి. ప్రలోభ పూర్వకంగా వినిపించే ఆ రెండు కంఠాల్లోను ఏది నమ్మదగ్గ ప్రలోభం? ఏది నమ్మకూడని ప్రలోభం?

ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వకుండా నా పక్కన ఒక శత్రువులాగా పొంచి ఉండి నన్ను tempt చేస్తున్నది నాలోని ఒక భాగమే అని గుర్తుపట్టానుగాని, నాలోని ఆ నేను చిన్న నేనా? పెద్ద నేనా? మంచి ‘నేనా’? చెడ్డ ‘నేనా’? ఆ ప్రలోభానికి లొంగకూడదంటే నేనేం చెయ్యాలి?ఏం చెయ్యకూడదు? అసలు అన్నిటికన్నా ముందు ఏ ఆలోచనని నిలుపుకోవాలి? దేన్నీ బయటకు నెట్టేయాలి?

వెనక్కి తలవాల్చి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాను.

నా కళ్ళముందు మళ్ళా ఊదారంగు కొండలు, గాలికి అవిశ్రాంతంగా రాలిపడుతున్న కృష్ణచూర పుష్పదళాలు, కృష్ణపక్షపు రాత్రుల్లో వజ్రాలు వెదజల్లినట్టుగా ఆకాశమంతా చిమ్మిన నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అడవిని నిద్రపోనివ్వని వడ్రంగిపిట్ట చప్పుడు వినిపిస్తూ ఉంది. కొంత సేపటికి ఆ చప్పుడు పెద్దదై నా తల బద్దలైపోతుందేమో అనిపించింది.

పుస్తకం పక్కన పెట్టేసాను. అలమారుదగ్గరనుంచి వెనక్కి వచ్చి నేలమీద కూచున్నాను. బాసింపట్టు వేసుకుని నాకు నేను చెప్పుకోడం మొదలుపెట్టాను.

‘లుక్. విమలా. పిల్లవాడు. లోకం తెలియని పిల్లవాడు. కళ్లకి గంతలు కట్టుకుని నీతో దాగుడుమూతలాడుతున్నాడు. అందులో అంత కంగారు పడవలసిందేముంది? పొద్దున్నే ఉత్తరం రాయి. నీ విశేషాలన్నీ రాయి. నీకు పెళ్ళి ఫిక్స్ అయిందనీ, పెళ్ళికి తప్పకుండా రమ్మనీ రాయి. వెడ్డింగ్ కార్డు పంపించు. అతనితో పాటు ఆ ఊళ్ళో ఆ రోజు బడికి బిల్డింగ్ కట్టడంలో సాయం చేసారే వాళ్ళందరినీ కూడా రమ్మని రాయి. హి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అటువంటి ఫ్రెండ్స్ వస్తే పెళ్ళి నిజంగా పండగ్గా మారుతుంది. అతణ్ణి ఎమ్మే చదవమని చెప్పు.  సివిల్ సర్వీసు పరిక్షలకి కట్టమను. మిశ్రా కి ఉత్తరం రాయమను. యాంత్రొపాలజీలో గైడెన్సు ఇస్తాడని చెప్పు. ఊహించు, అలాంటి వాడు ఐ ఎస్ ఎస్ ఆఫీసరైతే ఎన్ని గ్రామాల్లో ఎన్ని పాఠశాలలకి భవనాలు లభిస్తాయో!’

ఆ ఊహల్తో మనసు తేలికపడింది. ఒకింత ఉల్లాసంగా కూడా అనిపించింది. మొదటిసారిగా డాక్టర్ కి ఒక ఉత్తరం రాయాలనిపించింది. లేచి రజని అల్మైరాలోంచి దాని లాంగ్ నోట్ బుక్ ఒకటి తీసుకుని దాని పెన్ను, ఎగ్జామ్స్ రాసుకునే పాడ్ కూడా తీసుకుని మంచం మీదకు వచ్చి కూచున్నాను. ఆ పాడ్ వొళ్ళో పెట్టుకుని, నోటుబుక్కు లో ఒక వైట్ పేజీ తెరిచి, పెన్ను చేతుల్లోకి తీసుకున్నాను.

ఊరు పేరు రాసాను, జనవరి 1, రాత్రి 11.30.

ఏమని సంబోధించాలి?

‘ప్రియమైన శ్రీనివాస్-?’ ఉహుఁ.

‘డియర్ డాక్టర్?’ ఉహుఁ.

‘మై డియర్ డాక్టర్-?’ ఉహుఁ.

డాక్టర్ కి ఆ రాత్రివేళ ఉత్తరం రాయాలని కూచోగానే అన్నిటికన్నా ముందు నా  గుండె చప్పుడు నాకే వినిపిస్తూ ఉంది. ఆ హృదయస్పందనం లేశమాత్రం కూడా ఆ సంబోధనల్లోకి రావడం లేదు.

మా అమ్మ మా నాన్నని ఏమనిపిలుస్తుంది?

‘ఏమండీ-‘

‘ఏమండీ-‘ అని మొదలుపెట్టనా? నవ్వొచ్చింది. అప్పటికి మూడు గంటలుగా నా నుంచి దూరంగా జరిగిపోయిన నవ్వు మళ్లా అప్పుడే నాకు దగ్గరగా వచ్చింది.

నవ్వొచ్చిందని గుర్తురాగానే మళ్ళా నవ్వొచ్చింది.

‘ఏంటక్కా? ఏం చేస్తున్నావు? ఇంకా పడుకోలేదా?, అనడిగింది.

ఇంతలో హటాత్తుగా రజని లేచింది. దాని కళ్ళల్లో ఇంకా నిద్ర కుదురుకోని జీర.

‘ఉత్తరం రాస్తున్నాను.’

‘ఉత్తరమా? ఎవరికి?’

పొరపాటు చేసేనని తట్టింది. ఆ అర్థరాత్రి డాక్టర్ కి ఉత్తరం రాస్తున్నాని ఆ చిన్నపిల్లతో ఎలా చెప్పను? ఆ సాయంకాలమే కదా, మేము సినిమాచూసింది. ఇంతలోనే ఉత్తరం రాయాలనిపించిందా అని అనుకుంటే బావుంటుందా?

‘రాజుకి, రాజు అని చెప్పానే-‘

‘అబ్బా? ఎన్ని సార్లు చెప్తావక్కా? ఇంక ఇప్పుడు ఆ కథలన్నీ మళ్లా మొదలుపెట్టకు. పొద్దున్న రాసుకోవచ్చుకదా, నిద్ర రావడంలేదా?’ అంది. మళ్ళీ పడుకుంది.

‘లైట్ తీసెయ్యక్కా, నాకు నిద్రపట్టడం లేదు’ అంది కళ్ళుమూసుకుంటూ.

మంచం దిగి ఆ నోట్ బుక్కూ, ఆ అట్టా, ఆ పెన్నూ అల్మైరాలో పెట్టేసాను. లైటు తీసేసాను. హాల్లోకి వచ్చాను. ప్రశాంత్ సోఫాలో పడుకుని నిద్రపోతున్నాడు. కిచెన్ లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగాను. మళ్ళా గదిలోకి వచ్చి దానిపక్కన పడుకున్నాను.

ఇప్పుడు నా మనసులో ఏ ఆలోచనలూ లేవు. హటాత్తుగా వాన వెలిసిపోయినట్టు ఉంది. వైశాఖమాసంలో ఆ ఊళ్ళో అపరాహ్ణాల్లో వాన కురిసి వెలిసాక పరుచుకునే వెండీ, బంగారం కలిసిన వెలుతురులాంటిది నా మనసులో పరుచుకుంది.

ఆ వెలుతురోంచి ఏదో ఒక పక్షి నా చేతుల్లో జారవిడిచిన పదంలాగా ఒక మాట స్ఫురించింది. ఇందాకటినుంచీ నేను వెతుక్కుంటున్న మాత్ర. నా తలనొప్పిని మటుమాయం చెయ్యగల మాత్ర-

ఒక్కమాట:

‘ఇష్టం.’

అవును, రాజు అంటే నాకు ఇష్టం.

అంతే.

ప్రేమ? అది వేరే పదం.

1-5-2023

13 Replies to “ఆ వెన్నెల రాత్రులు-27”

  1. ఆహా ఎంత అందంగా ఆవిష్కరించారు. విమల మనసులో అలజడిని.. ఆ అలకల్లోలాన్ని చదివే ప్రతి పాఠకుడు కూడా అనుభవించి తీరతాడు. చివర్లో ఇష్టం అనే పదం తో తనని తాను విమల స్వాంతన పరుచుకున్నట్టే చదువరి మనసుకి కూడా కొంచెం ఊరట కలిగింది. నిజంగానే ఒక పెద్ద జడివాన మమ్మల్ని జోరుగా కుదిపేస్తూ హోరుతో తడిపేస్తూ కుంభవృష్టి గా కురిసి వెలిసిపోయినట్టనిపించింది ఈ 27వ భాగం చదువుతుంటే.. BTW, ఈ రోజు తో మీ వెన్నెల రాత్రుల్లో 27 నక్షత్రాలు కనబడినట్టే. రోజూ లాగ్రే
    రేపటి భాగం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటాం..

  2. పాత్ర ఆవేదనే పఠిత ఆవేదన. విమల పాత్ర తనకు తాను నచ్చజెప్పుకోవడానికి పడిన యాతన బాగా చెప్పారు.ఇలాంటి సమయంలోనే నండూరి పాట-
    గుండె గొంతుకలోన కొట్టాడుతుణడాది గుర్తుకు వచ్చేది.

  3. కళ్ళతో చూడగలిగిన ప్రపంచాన్నీ, కళ్ళు చూడని అంతర్లోకాన్ని అక్కడి conflict ని కూడా చాలా దగ్గరగా చూపించారు. 🙏🏽

  4. లవటులియా అరణ్యాల్లో దేవదారు వృక్షం మీద నుండి స్వేఛ్ఛగా కూస్తున్న కోయిలని తీసుకొచ్చి దేవదాసు భవంతిలో పడేశారు. మళ్ళీ ఒక ‘వనవాసి’ వొస్తున్నాడని ఆనందించేంతలో జారిపోయాడు. నేను కోల్పోయిన మహదానందానికి శిక్ష వేయాలా? లేక దొరికిన కాసంత మకరందాల్ని ఆస్వాదించామని పొగడాలా? . చక్కగా మొదలెట్టినందుకు మక్కువతో మెచ్చుకోలు

  5. స్నేహం, ప్రేమ, ఇష్టం.. విడదీసి చూపలేని భావోద్వేగాలు.. ముఖ్యంగా యవ్వన దశలో. అందులో ఇది యువతీ- యువకుల మధ్యన అయితే.. చెప్పనవసరం లేదు. ఈ మూడింటి మధ్య ఉండే సున్నితమైన పొర.. వాటికి అనుభవిస్తున్న వారి భావోద్వేగాల తీవ్రత పై ఆధారపడి ఉంటుంది. మళ్లీ ఈ భావోద్వేగాల అదుపు.. మన కుటుంబం మన చుట్టూ ఉన్న సమాజం పై ఆధారపడి ఉంది. ఈ సున్నిత అంశాన్ని విమల ఎదుర్కొన్న తీరును చక్కగా విశ్లేషించారు.. తత్వం చదివిన మనస్తత్వ శాస్త్రవేత్తలు కదా!!..అభినందనలు.

  6. పెళ్లి కుదిరిన కన్నె మనసులో చెలరేగిన చిన్న కుదుపుకి,  తెలిసీ తెలియని కారణం మసక మసక గా కనిపిస్తున్నా,  అందుకోలేని అసహాయతని అన్ని కోణాల్లోనూ స్పృశించి అందించారు .  నిరుడు కురిసిన నిండు వెన్నెల రాత్రుల  అనుభవాలు విమల ని నిమిరినట్టు, పఠితల నీ పలకరించి ఒకింత ఉద్వేగానికి గురి చేశాయి.  చివరి మాట చిరుజల్లులు కురిపించినా,  తర్వాత ఏమిటన్నది ఇంకా ఆసక్తి ని కలిగిస్తోంది. అది ఏమిటన్నది ఆ  ఇరవై ఏడు తారక ల తో ఆడుకున్న శశాంకుడి వెన్నెల రాత్రులే చెప్పాలి మరి.  

Leave a Reply

%d bloggers like this: