
నాన్న ఆ ప్రశ్న ఊరికే అడగలేదనీ, ఆ రెండో పిల్లవాడి గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నాడనీ, ఆ తర్వాత అతని గురించి మరింత వాకబు చేసాడనీ నెమ్మదిగా తెలిసింది. రెండు మూడు వారాల తర్వాత అమ్మనీ, నన్నూ, రజనీని కూర్చోబెట్టి తన మనసులో మాట చెప్పాడు. డా.శ్రీనివాస్ తల్లిదండ్రుల్తో మాట్లాడేననీ, వాళ్ళు నన్ను తమ కోడలిగా చేసుకోడానికి ఇష్టపడుతున్నారనీ, అలాగే ఆ శివశంకర్ అనే పిల్లవాడితో రజనికి పెళ్ళి చేస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నాననీ చెప్పాడు. ఈ రెండు ప్రతిపాదనలూ డా.శ్రీనివాస్ తో ముందు ప్రస్తావించాననీ, అతను శివశంకర్ చాలామంచివాడనీ, తాను వాళ్ళ తల్లిదండ్రుల్తో మాట్లాడతాననీ చెప్పాడట. నిజానికి శివశంకర్ తో సంబంధం కలుపుకుంటే బాగుంటుందన్న సూచన తనదేనని డాక్టర్ ఆ తర్వాత రోజుల్లో చెప్పాడు. మాతో ఈ విషయాలు చెప్పిన రోజో ఆ ముందురోజో నాన్న శివశంకర్ తల్లిదండ్రుల్ని వెళ్ళి కలిసినట్టున్నాడు, వాళ్ళనుంచి కూడా అంగీకారం దొరికినట్టుంది. నా పెళ్ళి గురించి మరోలా ఆలోచించడానికీ, అభ్యంతరం చెప్పడానికీ నాకేమీ కారణం కనిపించలేదుగాని, రజనీకి అప్పుడే పెళ్ళంటే మాత్రం నాకేమంత సమంజసంగా అనిపించలేదు. అది ఇప్పుడే డిగ్రీ ఫైనల్ యియర్ లో ఉంది. నేనెలాగూ పిజి చెయ్యలేకపోయాను, కనీసం అదైనా ఎమ్మే చదువుకుంటే బాగుణ్ణు అనిపించింది. కానీ, నాన్నతో నా భావాలు ఎలా వ్యక్తం చేయాలో తెలీలేదు.
‘పెళ్ళాయ్యాక రజని చదువుకుంటానంటే చదివిస్తారా?’ అనడిగాను. నా మాటలకి వంతగా రజని తను కూడా ఏదో ఒక మాట మాట్లాడితే బాగుణ్ణనుకున్నాను. కాని అది ఏమీ మాట్లాడలేదు. అంత తొందరగా పెళ్ళంటే దానికేమీ అభ్యంతరం లేదా అని కూడా అనుమానమొచ్చింది. మా అమ్మ మాత్రం నాన్న ఆలోచనని సమర్థిస్తూ, మాట్లాడుకోవలసిన మాటలేవో వీలైనంత తొందరగా మాట్లాడుకుంటే బాగుటుంది కదా అంది.
ఎనభైల మొదట్లో పట్టణాలు ఇంకా పెద్ద గ్రామాల్లానే ఉండేవి, ఆలోచనల్లోనూ, జీవితభయాల్లోనూ, జాగ్రత్తల్లోనూ కూడా. ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి ఆ పిల్లలిద్దరికీ ఎంత తొందరగా పెళ్ళిచేస్తామా అన్న ఆలోచన తప్ప మరేదీ పట్టదని నాకు తొందర్లోనే అర్థమయింది. ఆ యువకులిద్దరూ మా ఇంటికి వచ్చి వెళ్ళిన నెల్లాళ్ళదాకా రోజూ రాత్రి మా అమ్మా, నాన్నా ఆ సంబంధాల గురించే చాలాసేపు మాట్లాడుకునేవారు. రాత్రి భోజనాలయ్యేక గంటసేపేనా వాళ్ళ మధ్య శిఖరాగ్ర చర్చలు నడుస్తూండేవి. పెద్దమ్మాయి వట్టి గ్రాడ్యుయేటు మాత్రమే, రెండో అమ్మాయి చదువింకా పూర్తి కాలేదు. కాని ఆ పిల్లల్లో ఒకరు మెడిసిన్ పిజి చదువుతున్నాడు, మరొకరు ఇంజనీరు, గవర్న్ మెంట్ జాబ్ లో ఉన్నాడు. నాన్న ఆర్థిక స్తోమతు పెద్ద కట్నకానుకలు ఇవ్వగలిగేది కాదు. ఏ విధంగా చూసినా మాకు ఆ సంబంధాలు కుదురుతాయి అనుకోవడం అత్యాశ అనే మా తల్లిదండ్రులు తీర్మానించుకున్నారు. ప్రతి రాత్రీ వాళ్ళు ఎంత సేపు మాట్లాడుకున్నా, చివరికి, ‘ఇవి మనకి అందుబాటులో ఉన్నవి కావు’ అనే మాటతో, ఆ వెనక ఒకటి రెండు నిట్టూర్పుల్తో, ఆ సంభాషణలు ముగిసిపోయి, ఆ గదుల్లో నిశ్శబ్దం వచ్చి చేరేది.
కాని ఎవరు చొరవచూపారో, ఏ దైవ సహాయం మాకు తోడుగా నిలబడ్డాడో గాని, సెప్టెంబరు నెలాఖరుకల్లా ఆ యువకులిద్దరి కుటుంబాలూ కూడా మా నాన్న ప్రతిపాదనలకి అంగీకారం చెప్పారు. బహుశా, అదంతా డా.శ్రీనివాస్ చొరవవల్లనే అయి ఉంటుందని నాకిప్పటికీ నమ్మకం. ఒక మెడిసిన్ విద్యార్థి సాధారణంగా మరొక మెడిసిన్ విద్యార్థినే పెళ్ళి చేసుకోవాలనుకోవడం, పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి ఒక క్లినిక్ నో లేదా నర్సింగ్ హోమునో పెట్టుకోవడం రివాజు. కాని ఒక మెడికల్ పిజి స్టూడెంట్ నాలాంటి గ్రాడ్యుయేట్ విద్యార్థిని పెళ్ళిచేసుకోడానికి ఎందుకు సుముఖత చూపించాడో నాకిప్పటికీ తెలియని విషయం. అప్పటికి అతను నన్నొక్కసారే చూసాడు. నాలో అతణ్ణి ఏమి ఆకర్షించిందో నా ఊహకి కూడా అందని విషయం. అతనితో నా పెళ్ళి నిశ్చయం కావడానికి నా అదృష్టం తప్ప మరొకటి కారణం కాదనే ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను.
నా అదృష్టం అక్కడితో ఆగలేదు. పెళ్ళి మాటలు మాట్లాడుకునేటప్పుడు తానేమీ కట్నకానుకలు ఆశించడం లేదని డాక్టర్ శ్రీనివాస్ చెప్పినప్పుడు మా అమ్మా నాన్నా తమ చెవుల్ని తామే నమ్మలేకపోయారు. నలభై ఏళ్ళకింద ఇది మా అమ్మానాన్నలకే కాదు, ఏ మధ్యతరగతి కుటుంబానికైనా కూడా ఊహించలేని విషయమే. మా చెల్లెలి విషయంలో మాత్రం ఏవో కట్నకానుకల మాటలు జరిగినట్టున్నాయి. అదే మోయలేనంత బాధ్యత మా నాన్నకి.
డా.శ్రీనివాస్ పాండిచ్చేరిలో ఉండగా అతనితో మా నాన్న ఎప్పుడు మాట్లాడేవాడో, ఎలా మాట్లాడేవాడో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఉత్తరాలు కూడా ఏమీ పెద్దగా రాసుకోలేదు. బహుశా శివశంకర్ ద్వారా ఈ మాటలన్నీ నడిచి ఉంటాయి. ఆ మధ్యలో మా నన్నా ఒకసారో, రెండుసార్లో పాండిచ్చేరి వెళ్ళి వచ్చినట్టు మాత్రం నాకు గుర్తుంది.
మాకు స్కూలుకి దసరా సెలవులు ఇచ్చిన తరువాత ఒకసారి మేమంతా పాండిచ్చేరి వెళ్ళాం. అది డా.శ్రీనివాస్ ఆహ్వానం మీదనే అని తర్వాత తెలిసింది. మేమక్కడ మూడురోజులున్నాం. ఆ మూడు రోజులూ శివశంకర్ కూడా మాతో పాటు ఉన్నాడు. మేము హోటల్లో ఉన్నాం. శ్రీనివాస్ హాస్టల్లో ఉండేవాడు. ఆ మూడురోజులూ మమ్మల్ని పాండిచ్చేరి అంతా తిప్పి చూపించాడు. అదే మొదటిసారి అతనూ, నేనూ ఒకరినొకరం దగ్గరగా చూసుకోవడం, మాట్లాడుకోవడం. మా చెల్లెలికీ, శివశంకర్ కీ కలిసి కబుర్లు చెప్పుకునే అవకాశం అదే మొదటిసారి.
పాండిచ్చేరిలో మేము గడిపిన ఆ మూడురోజుల్లోనూ నా గుండె కొట్టుకోవడమే నాకు ఎక్కువ వినిపిస్తూ ఉంది. మా నాన్న కోరుకున్నట్టు ఆ రెండు సంబంధాలూ నిశ్చయం కావాలనీ, మా పెళ్ళిళ్ళు ఏ అడ్డంకీ లేకుండా జరగాలనీ మా తల్లిదండ్రులకన్నా నాకు ఎక్కువ ఆత్రుత మొదలయ్యింది. అందులోనూ నాకన్నా కూడా మా చెల్లెలి పెళ్ళి గురించి నాలో ఆందోళన ఎక్కువ అవుతూ ఉండింది. నా పెళ్ళి కూడా అయితే రజని పెళ్ళి కి మరింకేమీ అడ్డు ఉండదన్న ఆలోచన వల్ల అనుకుంటాను, నా పెళ్ళి కూడా నిర్విఘ్నంగా జరగాలని కోరుకోవడం మొదలుపెట్టాను. ఇదంతా ఇప్పుడు చెప్తుంటే, అరవైల్లో వచ్చిన తెలుగు సినిమా కథలాగా వినిపిస్తూ ఉండవచ్చు. కాని ఇందులో త్యాగం అనే మాటనే లేదు. బహుశా ఏదన్నా ఒక్క మాట మాత్రమే చెప్పు అంటే అదృష్టం అనే మాట తప్ప మరే మాటా నాకు స్ఫురించడం లేదు. కాని ఆందోళన ఉండింది. ఉంటుంది కూడా. ఎందుకంటే, ఒకటి పొందడానికి తగిన అర్హతలో, యోగ్యతలో నీకు లేవని నువ్వు నమ్ముతున్నప్పుడు, అది నీ ఇంటితలుపు తడుతున్నప్పుడు, అది తప్పకుండా నీ స్వంతం కాబోతున్నదని రూఢి అవుతూ ఉన్నప్పుడు, అన్నిటికన్నా ముందు కలిగే అనుభూతి సంతోషం కాదు, ఆందోళననే. ‘ఇది నిజమేనా?’, ‘దేవుడా, ఇది అనుకున్నట్టే జరుగుతుందా?’, ‘ఏ ఆటంకాలూ రావు కదా?’, ‘ మధ్యలో ఏమీ గొడవలు జరగవు కదా’ లాంటి ఆలోచనలు నీ ప్రమేయం లేకుండానే కలగడం మొదలవుతాయి. చివరికి ఆ ఆలోచనలూ, భయాలూ ఎంత దూరం పోతాయంటే, మా కుటుంబాల్లో ఎవరికీ యాక్సిడెంట్లు కావు కదా, ఎవరూ హటాత్తుగా సిక్ అయిపోరు కదా అని కూడా అనుకుంటూ ఉండేదాన్ని.
ఉద్యోగం, పెళ్ళి- ఈ రెండింటి గురించీ మనకి పెద్దగా ఏమీ ఊహలూ, కలలూ ఉండకపోవచ్చుగాని, తీరా అవి మనకి అందుతున్నాయనే సూచనలు మొదలయ్యాక మాత్రం చెప్పలేనంత టెన్షన్ మొదలవుతుంది. పిల్లల విషయం కూడా అంతే. వాళ్లు పసితనంలో ఉన్నప్పుడూ, పెరిగి పెద్దవాళ్లవుతున్నప్పుడూ మనకేమీ భయాలుండవుగాని, ఒకసారి వాళ్ల కెరీర్, పెళ్ళి గురించిన ఆలోచనలు మొదలయ్యాక, మరే ఆలోచనలకీ మన మనసులో చోటుమిగలదు.
బహుశా మనిషికి కలిగే సంతోషాలన్నిటిలోనూ పెళ్ళివల్ల లభించేది గొప్ప సంతోషం అవునో కాదో నేను చెప్పలేనుగానీ, పెళ్ళికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా చెప్పలేనంత ఆందోళనకలిగిస్తుందని మాత్రం చెప్పగలను. కొన్నేళ్ళు పోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇదా, ఈ విషయం గురించా అంత టెన్షన్ పడ్డాం, ఇంత చిన్న సంగతి గురించా అంతలా మాట్లాడుకున్నాం అనిపిస్తుంది. అది మన వివాహమే కానక్కర్లేదు. మరొకరి పెళ్ళి అయినా కూడా, అందులో మన పాత్ర ఎంత స్వల్పాతిస్వల్పమైనా కూడా, పెళ్ళి కలిగించగల ఆందోళన అంతా ఇంతా కాదు.
ఒకసారి మాకు తెలిసినవాళ్ళ ఇంట్లో పెళ్ళికి నేనూ, డాక్టర్ వెళ్ళాం. పెళ్ళయ్యాక మేము బయటికి వచ్చాం. డాక్టర్ పార్కింగ్ లోంచి కారు బయటికి తీసి కల్యాణమంటపం ముందుకి వచ్చాడు. నేను కారు ఎక్కబోతూ ఉన్నాను. ఈలోపు పెళ్లి కూతురి తండ్రి డాక్టర్ ని కారు ఆపమని దగ్గరకొచ్చి, మా కారు డ్రైవరు ఫోన్ ఎత్తడం లేదు, ఈ దంపతులిద్దర్నీ పక్క వీథిలో ఉన్న విడిది దగ్గర డ్రాప్ చేసి రాగలరా అని అడిగాడు. డాక్టర్ సంతోషంగా వాళ్ళని ఎక్కించుకుని, పక్క వీథిలో డ్రాప్ చేసి తిరిగి వచ్చాడు. అలా డ్రాప్ చేసి రావడానికి మూడు నాలుగు నిమిషాలు పట్టి ఉంటుంది. అంతసేపూ నేను ఆ ఫంక్షను హాలు ఎదటనే ఉన్నానుగాని చెప్పలేనంత ఆందోళనకి గురయ్యాను. డాక్టర్ వాళ్ళని కారులో జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడా లేదా మధ్యలో ఏ టర్నింగ్ దగ్గరో ఏమీ యాక్సిడెంటు కాలేదు కదా, అసలు ఆ సమయంలో మేమెందుకు వాళ్ళకి కనబడాలి, వాళ్ళ డ్రైవరు ఫోను ఎందుకు ఎత్తకుండా పోవాలి, భగవంతుడా, ఏమీ జరగదు కదా- ఎన్ని ఆలోచనలు, ఎంత టెన్షన్ పడ్డానో ఆ దేవుడికే తెలియాలి.
బహుశా ఇంకెవరూ ఇలా ఆలోచించరేమో, ఇది నా బలహీనత మాత్రమేనేమో అని కూడా అనుకుంటూ ఉంటాను. కాని ఆ రోజుల్లో, ఇంకా మా పెళ్ళిళ్ళకి నిశ్చితార్థం జరక్కముందు, ఆ రెండుమూడు నెలల పాటు నేను అనుభవించిన ఆందోళన అంతా ఇంతా కాదు.
అందుకని పాండిచ్చేరిలో గడిపిన ఆ మూడురోజుల్లోనూ నిజంగా నా మనసు మనసులో లేదు. ఏదో బస్సులో ప్రయాణిస్తూ ఉంటే, ఆ కుదుపుల మధ్యలో అందమైన కల కంటూ ఉన్నట్టుంది. కల అందమైందే, గుర్తుండిపోతుంది, కాని ఆ కుదుపులు కూడా గుర్తుండిపోతాయి. ఆ తర్వాత మళ్ళా మళ్ళా ఆ రోజుల్ని గుర్తుచేసుకోబోతే నా కళ్ళముందు ఆ నీలసముద్రమూ, దానిపైన పడే శుభ్రసూర్యకాంతీ తప్ప మరేవీ గుర్తు రావు. అప్పుడే శ్రీనివాస్ మమ్మల్ని ఆరోవిల్ కూడా తీసుకువెళ్ళాడు. అక్కడేవో చూపించాడు. కాని అక్కడ ఏదో మెడిటేషన్ హాల్లో కూచున్నప్పుడు నిశ్శబ్దంగా మమ్మల్ని అల్లుకున్న అగరుధూపం తప్ప మరేమీ గుర్తులేదు.
విజయదశమినాడు రెండు పెళ్ళిళ్ళకీ నిశ్చితార్థాలు జరిగాయి. అవి పెద్ద ఎత్తున కాకుండా సింపుల్ గానే జరపమనే రెండు కుటుంబాల వాళ్ళూ మా నాన్నకి చెప్పడం ఆయనకి గొప్ప ఊరట. నిశ్చితార్థం రోజున డాక్టర్ నా వేలికి ఉంగరం తొడిగాడు. దానిమీద ఎస్ అనే అక్షరం చెక్కి ఉంది.
డాక్టర్ పిజి థర్డ్ యియర్ లో ఉన్నాడు కాబట్టి, ఆ మరుసటి ఏడాది చదువు పూర్తవగానే శ్రావణమాసంలో పెళ్ళికి ముహూర్తం నిర్ణయించారు. పెద్దమ్మాయి పెళ్ళయ్యే లోపు చిన్నమ్మాయికి పెళ్ళి చేయలేరు కాబట్టి, ఆ పెళ్ళి కూడా శ్రావణమాసంలోనే ఒకే వేదిక మీద చెయ్యడానికి మరో ముహూర్తం కూడా నిర్ణయించారు. శివశంకర్ తండ్రి ఇన్సూరెన్సులో డెవలప్ మెంటు ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. మాటకారి. కలుపుగోలు మనిషి. ఆయనకి శివశంకర్ కాక మరో అబ్బాయి, అమ్మాయి కూడా ఉన్నారు. వాళ్ళింకా చదువుల్లో ఉన్నారు. ఈ పెళ్ళిళ్ళు మా ఇంట్లోలానే ఆ రెండు కుటుంబాల్లో కూడా మొదటి సారిగా జరగబోయే వేడుకలు. మూడు కుటుంబాల్లోనూ కూడా ఆ నిశ్చితార్థం కొత్త బంధాల్ని అల్లడం మొదలుపెట్టింది. అందరిలోనూ కొత్త ఊహలు, కొత్త ఉద్వేగాలు.
కాని ఆ పెళ్ళిళ్ళు నిశ్చయం కావడం మా నాన్నకి ఎంత సంతోషాన్నిచ్చిందో, ఆ ముహూర్తం కోసం మరొక పదినెలల పాటు వేచి ఉండక తప్పదనే విషయం మరింత అంత ఆందోళనకీ గురిచేసింది. అన్నాళ్ళపాటు ఆయన తన ఆందోళనని ఎలా తట్టుకోగలిగేడో ఇప్పుడు తలుచుకుంటే ఊహకి అందడంలేదు.
కానీ ఆశ్చర్యంగా నా ఆందోళన మటుకు మాయమైపోయింది. మొదటిసారిగా డాక్టర్ రూపం నా కళ్ళముందు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టింది. మొదటిసారి అతను మా ఇంటికి వచ్చినప్పుడు నేను చూడగలిగిన సౌమ్యమైన ఆ చిరునవ్వుని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం మొదలుపెట్టింది. పాండిచ్చేరిలో అతను ఎన్నో సార్లు చిరునవ్వి ఉంటాడు, ఎన్నో సార్లు మృదువుగా ఏవో మాటలు మాటాడి ఉంటాడు, కాని ఆ రోజులనాటి ఆందోళన వల్ల అప్పుడు వాటికీ నాకూ మధ్య ఒక గాజుతెర ఉండింది. ఇప్పుడు మళ్ళా అటువంటి అవకాశం వస్తే ఎంత బాగుణ్ణు అని అనుకోకుండా ఉండలేకపోయాను.
ఇప్పట్లాగా మొబైళ్ళూ, వాట్సప్ లూ, వీడియో కాల్సూ లేని కాలం. దూరంలో ఉన్న మనిషితో మాట్లాడాలంటే ట్రంకాల్ ఒక్కటే శరణ్యం. కాని ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర నిలబడి గట్టిగా అరిస్తే తప్ప ఒకరిమాట ఒకరికి వినబడని రోజులు కూడా అవి. ఒకరినొకరు పలకరించుకోవాలంటే, మనసులో మాట చెప్పుకోవాలంటే ఉత్తరాలు రాసుకోవడమొక్కటే మార్గం. కాని ఉత్తరం రాయొచ్చన్న ఊహకే వొణికిపోయాన్నేను.
రెండునెలలట్లానే గడిచిపోయాయి. ఇప్పుడు స్కూలు నుంచి ఇంటికి రాగానే, ఎంత అలసటగా ఉన్నా వెంటనే నిద్రపట్టేది కాదు. కళ్ళుమూసుకోగానే ఇదీ అని స్పష్టంగా చెప్పలేని ఏదో అస్పష్టంగా ఉండే భావనలేవో తలపుల్ని ఆక్రమించేవి. కొంతసేపటికి మనసుకి తిమ్మిరిపట్టినట్టుండేది. పొద్దున్నే లేవగానే స్కూలుకి పరుగెత్తాలన్న తొందరతో పాటు నన్నెవరో తలుచుకుంటూ ఉన్నారన్న ఊహ కూడా మనసులో ఉదయించేది. ఆ వేళప్పుడు ఆ మనిషి ఇంకా నిద్రలేచి ఉంటాడా ఉండడా అనిపించేది.
మళ్ళా డాక్టర్ ని చూడాలంటే సంక్రాంతి సెలవులదాకా వేచి ఉండకతప్పదని అనుకున్నానుగాని, ఒకరోజు సాయంకాలం ఇంటికొచ్చేటప్పటికి డాక్టర్ వీథిగదిలో ప్రత్యక్షమయ్యాడు. అతణ్ణి చూడగానే నా మోకాళ్ళలో వణుకు మొదలయ్యింది. ఇంట్లో అడుగుపెడుతూండగానే ‘హలో మిస్ ఎలా ఉన్నారు?’ అని నవ్వుతూ పలకరించాడు.
ఆ నవ్వులో సౌమ్యత ఉండే ఉంటుంది, కాని కళ్ళెత్తి చూడటానికి ధైర్యం చాల్లేదు. సిగ్గా? కాదనుకుంటాను. నా ఎదట ఉన్నది పురుషుడనే భావన కూడా అప్పుడు నాలో కలగలేదనే అనుకుంటాను. మరేమిటి? జీవితం నీ ఎదట నిల్చొందనీ, రానున్న నీ కాలమంతా ఆ అనుబంధానికే అంకితం కాబోతోందనీ ఏదో స్పష్టాస్పష్టంగా ఉండే ఎరుక. హటాత్తుగా నీ భవిష్యత్తు మీ ఇంటికొచ్చి, మీ వీథి గదిలో కూచుని, ‘హలో మిస్’ అని పలకరిస్తే, నువ్వు సోఫా లో కాలుమీద కాలు వేసుకుని కూచుని నిదానంగా మాట్లాడగలవా?
పెళ్ళి అనగానే ఒక కన్యమనసులో మొదట కలిగే భావన భయమే అనుకుంటాను. మనుషుల పట్ల కాదు, తెలియని ఒక అనిశ్చితి పట్ల భయం. ఒక అన్ సర్టనిటి హటాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డప్పుడు కలిగే భయం. ఒకవేళ ఆ యువకులిద్దరూ మా అక్కాచెల్లెళ్ళకి కాబోయే వరులుగా కాక, స్నేహితులుగానే పరిచయమై ఉంటే, బహుశా, ఆ స్నేహాన్ని నేను మరింత గాఢంగా లోపలకీ తీసుకోగలిగి ఉండేదాన్నేమో. కాని ఆ రోజులంతటా, డాక్టర్ నా తలపుల్లోకి వచ్చినా, నా ఎదట పడ్డా నా గుండె వేగంగా కొట్టుకోవడమే నాకు ఎక్కువ గుర్తుంది. బహుశా డాక్టర్ శ్రీనివాస్, మా నాన్నా కలిసి మేము ఆ అన్ సర్టనిటీని ఎదుర్కోడానికి మమ్మల్ని మానసికంగా నెమ్మదిగా సంసిద్ధుల్ని చేస్తూ వచ్చేరేమో అని ఇప్పుడనిపిస్తోంది.
ఎందుకంటే అప్పుడు డాక్టర్ మా ఇంటికి వచ్చినప్పుడు క్రిస్మస్ సెలవులకోసం వచ్చానని చెప్పినా, అది నాతో, మా ఇంట్లో వాళ్ళతో ఒక సాన్నిహిత్యాన్ని పెంచుకోడం కోసమే అని నాకు రెండు మూడు రోజులకే అర్థమయింది. ఆ రోజులన్నిటా అతను దాదాపు మా ఇంట్లోనే గడిపేవాడు. ఎక్కువ మా నాన్నతో మాట్లాడేవాడు. మా చెల్లెల్తో, తమ్ముడితో ఏదో ఒక సంభాషణ కలుపుతూ ఉండేవాడు. అప్పటికి మా తమ్ముడు ఇంజనీరింగ్ లో చేరాడు. కాకినాడ జె ఎన్ టి యు లో సీటు దొరికింది. వాడు కూడా సెలవులంటూ ఇంటికి వచ్చాడు. డాక్టర్ వాడితోనూ, రజనితోనూ ఇంగ్లిష్ లో మాట్లాడేవాడు. ఒకరోజు రజనిని తన పుస్తకాలు, నోట్సులు చూపించమన్నాడు. వాటిల్లోంచి ఒక పుస్తకం తీసి ఆ టైటిల్ పైకి చదివాడు.
‘పారడైజ్ లాస్ట్, జాన్ మిల్టన్ . ఈజ్ దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్?’ అనడిగాడు.
‘యెస్. బట్ ఒన్లీ వన్ బుక్. బుక్ ఫోర్’ అందిరజని.
‘డు యు నో ద స్టోరీ? ఐ మీన్ ద థీమ్?’ అనడిగాడు.
ఇప్పుడు ఆ పుస్తకం సారాంశం ఇంగ్లిషులో ఎక్కడ అప్పచెప్పమంటాడో అని రజని భయపడిందిగాని, అతను ఆ ప్రశ్నని మరి రెట్టించలేదు. రజని వాళ్ళ కాలేజి గురించీ, లెక్చెరర్ల గురించీ, క్లాస్ మేట్ల గురించీ అడగడం మొదలుపెట్టాడు.
ఒక్కొక్కప్పుడు నేరుగా వంటింట్లోకి వెళ్ళిపోయేవాడు. అమ్మని పలకరించి ఏదో ఒక జోకు వేసేవాడు. బహుశా అతణ్ణి చూస్తే నాకన్నా కూడా అమ్మ ఎక్కువ నెర్వస్ గా ఫీలయ్యేదేమో. అందుకని ఆమెని పలకరించిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త జోకు చెప్పేవాడు. నా అనుమానం, ఆ రోజుల్లో అతను జోకుల పుస్తకాలు చదువుకుని మరీ మా ఇంటికి వచ్చేవాడేమోనని.
న్యూ ఇయర్ డే నాడు మమ్మల్ని సినిమా వెళ్దాం రమ్మన్నాడు. ఆదివారం. మాటినీకి తీసుకుపోయాడు. బహుశా ఫస్ట్ షో కి వెళ్దమన్నా కూడా మా ఇంట్లో అడ్డుపెట్టేవారు కాదేమో. అదీకాక నన్నొక్కర్తినే కాదు, రజనీని, ప్రశాంత్ ని కూడా రమ్మన్నాడు. ఆ రోజు మా ఇంట్లోనే లంచ్ చేసాడు. సినిమాకి వెళ్దాం అనగానే నేను నాన్నవంక చూసాను. నాన్న ఏమీ అనలేదు. అమ్మ మాత్రం లోపలకి రమ్మని సైగ చేసింది. వెళ్ళొద్దంటుందేమో అనుకున్నాను. కాని ఆమె నన్ను లోపలకి పిలిచి నా చేతిలో డబ్బులు పెట్టి ‘అతణ్ణి టిక్కెట్టు తియ్యనివ్వకు. మీ నలుగురికీ నువ్వే టిక్కెట్టు తియ్యి’ అంది.
ఇప్పుడు తలుచుకుంటే, నవ్వొస్తుందికాని, ఆ రోజుల్లో, నీ అన్నో, తమ్ముడో, బంధువో కాని వ్యక్తితో సినిమాకి వెళ్ళడం చాలా పెద్ద విషయం. సినిమాహాల్లోకి వెళ్లాక కూడా ఎవరు ఎక్కడ కూచోవాలన్నది కూడా పెద్ద విషయమే. అవేవీ మాట్లాడుకునే విషయాలు కాదు, కాని, అదంతా సరిగ్గా లేకపోతే, ఆ తర్వాత నిజంగానే మాట్లాడుకునే విషయంగా మారుతుందని భయం. సినిమా హాల్లో చివరి సీట్లో అతను కూచున్నాడు. అతని పక్కన ప్రశాంత్, వాడి పక్కన రజని, ఈ కొసన నేను.
ఏదో సినిమా, పేరు గుర్తుంది, ఎలా మర్చిపోతాను? డాక్టర్ తో చూసిన మొదటిసినిమా. కాని దాన్ని అలా గుర్తుపెట్టుకోవడమే నాకు ఇష్టం. ఇంటర్వెల్ లో బయటికి వెళ్ళి కూల్ డ్రింక్స్ పట్టుకొచ్చాడు. వాటికి మాత్రం నేను డబ్బులివ్వలేదు.’ప్రశాంత్ ఏం చేస్తున్నాడు? వాడు పోయి తేవచ్చు కదా’ అంది అమ్మ, ఆ తర్వాత, మా స్టోరీ అంతా విన్నాక.
సినిమా అయ్యాక డాక్టర్ మా ముగ్గురినీ ఒక రిక్షా ఎక్కించి తను వేరే పనుందని వెళ్ళిపోయాడు. అతను కూడా ఆ సాయంకాలం మా ఇంటికి వచ్చి ఉంటే బాగుణ్ణనీ, ఆ రాత్రి డిన్నర్ దాకా ఉండిపోతే బాగుణ్ణనీ మనసులో అనిపిస్తూనే ఉంది. కాని నోరు తెరిచి అడగలేకపోయాను. పిల్లలు ఏమనుకుంటారో అనే సంకోచం నా నోరు పెగలనివ్వలేదు.
ఇంటికి వచ్చాక, రాత్రి భోజనాలయ్యాక, అమ్మ ‘చూడు నీకీ లెటరొచ్చింది’ అంటో ఒక కవరు చేతికిచ్చింది.
యాభై పైసల ఎల్లో కలర్ ఎన్వలప్. ఆ కవరు బరువుగా ఉంది.
నా పేరు రాసిన ఆ కవరు మీద ‘ఫ్రమ్ రాజు’ అని ఉంది.
30-4-2023
విమల మనస్తత్త్వపరంగా పెళ్లి గురించిన మానసిక విశ్లేషణ చాలా బాగా జరిగింది. పసుపు పచ్చ లిఫాఫా తెల్లపావురంలా వాలి కథను ఉద్దీపన చేయడం బాగుంది.
ధన్యవాదాలు
ఆ చివరి వాక్యం.. అప్పటి వరకూ పయనిస్తున్న ఒక లోకం నుంచి.. మరొక లోకానికి తీసుకెళ్ళి పోయింది.. తరువాత భాగం కోసం చాలా ఉత్కంఠ తో ఎదురు చూడాలి.. ఆ ఉత్తరంలో నుంచి ఒలికే అడవి కాచిన వెన్నెల రాత్రుల అమృతం కోసం..
మీ ఎదురుచూపులే ఆ కథను ముందుకు నడపాలి.
పచ్చని కవర్ తెచ్చే కబురు మమ్మల్ని నిలువనిస్తుంటేనా…
అప్పటిదాకా సాగిన అమ్మాయి అంతరంగ ఆవిష్కరణ సహజమే కదా ..క్ఇఅస్వట్న్నీహా అతు ఇటుగా అనుభవించి వుంటామేమో
కాలాల కతీతంగా సహజ ప్రకృతి ఇలా3 వుంటుందా8 అనిపించింది.నలభై ఏళ్ల కింద విమల..ఇరవై ఏళ్ల కింద ఇంకొకరు ..ఇపుడు ఇంత ఆలోచనా విస్తృతి పెరిగిన వేళ కూడా గాంభీర్యం వదిలేస్తే ఇలానే వుంటాయేమో .ఆ తల్లి దండ్రులకు నమస్సులు..
కథలో ఏం జరుగుతుందో ,అస్పష్టంగా ఐనా సరే ,తెలిసికూడా పాఠకులలో దాని గురించి ఆలోచింపజేసే శక్తి మీ కథనానికి వుంది .
నమస్సులు.
అదృష్టం కలసి వచ్చాక మధ్యతరగతి మనస్సుల భయాలని అద్భుతంగా విశ్లేషించారు.
ధన్యవాదాలు
‘సినిమాహాల్లోకి వెళ్లాక కూడా ఎవరు ఎక్కడ కూచోవాలన్నది కూడా పెద్ద విషయమే!’.. భలే చెప్పారు. మాది మేనరికేమైనా ఈ తిప్పలు తప్పలేదు. మా ఇద్దరి మధ్యన ఇప్పుడు లేని మా చిన్నమ్మ కూర్చుంది. ఇప్పటికీ నవ్వుకుంటాం
Interesting!