ఆ వెన్నెల రాత్రులు-25

దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్ళా ఇంట్లో అడుగుపెట్టేటప్పటికి మా అమ్మ నన్ను చూస్తూనే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘ఇలా చిక్కిపోయేవేమిటే! ఇంతలా నల్లబడిపోయేవేమిటే!’ అంటూనే ఉంది. ‘అక్కడ రాళ్ళు కొట్టేవా? మూటలు మోసావా’ అనడిగింది రజని. మా తమ్ముడూ, చెల్లెలూ హటాత్తుగా పెద్దవాళ్ళు అయిపోయినట్టనిపించింది. 

మహాసముద్రాలమీద ఎన్నో ఏళ్ళు ప్రయాణాలు చేసి తిరిగివచ్చాక నావికులు తమ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మొదట ఏమి చేసి ఉంటారు? ఏమి చూసి ఉంటారు?

నేను చేసిన పని మాత్రం ఒకరోజంతా నిద్రపోవడం. అది వట్టి ప్రయాణం తాలూకు అలసట వల్లనే అని అనుకోలేను. ఇప్పుడు మనం జెట్ లాగ్ అంటామే, బహుశా అలాంటిదే ఏదో. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి, అక్కడ పగలైతే ఇక్కడ రాత్రీ లా ఉండే రెండు దేశాలమధ్య ప్రయాణించి వచ్చినదానిలా ముందు ఆ కాలమానానికి కుదురుకోడానికే అంత విశ్రాంతి కావలసి వచ్చింది.

పూర్తిగా ఒక పగలూ, ఒక రాత్రీ నిద్రపోయాక, ఆ మర్నాడు తెల్లవారుతూనే ఎందుకో చెప్పలేని బెంగ కలిగింది. అది దేనిపట్లనో చెప్పలేను. ఆ క్షణాన ఇవీ అని చెప్పదగ్గ దృశ్యాలుగానీ, ఫలానావాళ్ళు అని గుర్తుపట్టగల ముఖాలు గానీ ఏవీ నా మనసులో లేవు. అదొక ఫ్లూయిడ్ స్టేట్ లాంటి మనఃస్థితి.

ఆ మర్నాడు ఈ ప్రపంచంలోకి వచ్చాక నేను చేసిన మొదటిపని ఆ చెక్కు మా అమ్మ చేతుల్లో పెట్టడం. ‘నీకు ఏ కానుకా తేలేదు. ఇది నా మొదటి జీతం అనుకో. నీ ఇష్టం. నీకేం కావాలంటే అది కొనుక్కో’ అన్నాను.  సేన్ గుప్తా పంపించిన బెంగాల్ కాటన్ చీర కూడా ఆమె చేతుల్లో పెట్టాను. అప్పుడు ఇల్లంతా ఒకసారి కలయచూసాను. ఆ ఇంట్లో నా చిన్నప్పటినుంచీ నాన్న అలవాటు చేసిన రిథమ్ అలానే ఉంది. చిన్నపాటి తేడా కూడా లేదు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. నేను వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళకుండా వదిలిపెట్టిన దుస్తులూ, పుస్తకాలూ ఏ సూట్ కేసులో పెట్టుకున్నానో అదే నేను ఏ మంచం కింద పెట్టానో అక్కడే చెక్కుచెదరకుండా ఉంది.

రజని బి ఏ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి ఆ జూలైలో మూడో ఏడాదిలో అడుగుపెట్టబోతోంది. ప్రశాంత్ ఇంటర్ పరీక్షలు రాసాడు. రిజల్ట్స్ కోసం చూస్తున్నాడు. మంచిమార్కులొస్తే జె ఎన్ టి యు లో సీటు దొరుకుందని ఆశపడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండటంతో వారం రోజుల పాటు నా ఫీల్డ్ వర్క్ సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెప్పేసాను. కొన్ని సంగతులు బహుశా రెండుమూడు సార్లు కూడా చెప్పి ఉంటాను. వారం పది రోజులు గడిచేటప్పటికి నేనేదైనా ఒక విషయం ఎత్తుకోబోతే ‘అబ్బా, ఆ తర్వాత ఏమవుతుందో మాకు తెలుసు’ అనేవారు. ‘ఆ సాయంకాలం ఆ ఏటిదగ్గరికి వెళ్ళాక-‘ అని చెప్పబోతుంటే, ‘ఆ యూకలిప్టస్ తోటలో ఒక పక్షి అరిచింది కదా’ అనేవారు. అక్కడ నేను కలుసుకున్నవాళ్ళు, తారసపడ్డవాళ్ళు, మేము తిరిగిన చోటులు, చేసిన పనులు, మాట్లాడుకున్న మాటలు అన్నీ చెప్పాను. ప్రతి సారీ చెప్పినవన్నీ చెప్పాక ‘ఎప్పుడన్నా మనం ముగ్గురం  ఆ ఊరు వెళ్దా’ ‘అనేదాన్ని. ‘వెళ్దామక్కా, నాకు ఇప్పుడే చూడాలనిపిస్తోంది’ అనేవాడు ప్రశాంత్. ‘ఎందుకు పోవడం? అంతా నీ మాటల్లో చూసేసేం కదా’ అనేది రజని.

వచ్చినప్పుడు వెంటనే తెలియలేదుగాని, రెండు వారాలు గడిచేటప్పటికి నాకు ఆ ఊరిమీదా, ఆ మనుషుల మీదా బెంగ పుట్టడం మొదలయ్యింది. ప్రొఫెసర్ సేన్ గుప్త తో మరికొన్ని విషయాల మీద మాట్లాడించి ఉండవలసిందేమో, వనలతతో మరికొన్ని పాటలు పాడించుకుని ఉండవలసిందేమో, డా.మిశ్రాతో మరికొన్ని మంచిపనులు చేయించి ఉండవలసిందేమో అనిపించేది. రోజా గురించి ఏమీ తెలుసుకోలేదు, ఆమె చదువెలా ఉంది, ఇంజనీరింగ్ అయ్యాక ఏం చెయ్యాలనుకుంటోంది, ఆమె  నేను వచ్చేసిన వెంటనే తను కూడా ఆ ఊరునుంచి వచ్చేసిందా లేక మరికొన్నాళ్లుందా అని అడగాలనిపించేది. మరీ ముఖ్యంగా రాజు తన చదువు సంగతి ఏమి ఆలోచించాడు, పరీక్షలు, మొత్తం మూడేళ్ళ పరీక్షలు రాయాలి కదా, ఎలా ప్లాను చేసుకుంటున్నాడో అడగలేదే అనిపించేది. ‘పరీక్షలు రాయడం మానెయ్యకు. తప్పకుండా రాయి’ అని చెప్పాలనుకున్నానుగాని, ఆ చివరిరోజు హడావిడిలో ఆ మాటలు చెప్పడమే మర్చిపోయాను.

మరీ ముఖ్యంగా పడుకోబోయేముందు కళ్ళు మూసుకోగానే ఆ కొండా, ఆ అడవీ, ఆ ఏరూ, ఆ చింతచెట్లూ, ఆ కాగితంపూల పందిరీ, ఆ  కొంగలూ, ఆ గోరువంకలూ, ఆ రామకోవెలా గుర్తొచ్చేవి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తూ ఉంటారో కదా అనుకునేదాన్ని. సేన్ గుప్తా లానే ఆ ఊరు కూడా ఒక జియొలాజికల్ టైమ్ లో జీవిస్తూ ఉంటుంది కదా అనుకున్నాను. ఒక మహావృక్షం మీద ఒక పిట్ట వచ్చి వాలి కొంతసేపు ఆ పూలసుగంధాన్నో, ఆ పిందెల కసరుదనాన్నో రుచిచూసి  ఎగిరిపోయిందనుకో, ఆ చెట్టుకి అది తెలుస్తుందా? ఎస్.విమల, బి.ఎస్.సి అనే ఆమె కొన్నాళ్ళు తమ మధ్య సంచరించిందనీ, విభ్రాంతితో అనుదినం తమనే పరికిస్తూ గడిపిందనీ, ఆ పర్వతాలకీ, ఆ అరణ్యానికీ, ఆ గగనతలం మీద సభచేసుకునే నక్షత్రాలకీ గుర్తుంటుందా? అసలు అటువంటి ఒక మనిషి అక్కడికి వచ్చివెళ్ళిందని వాటికి తెలుసా?

రాత్రి పడుకోబోయేముందు కలిగే ఆలోచనలు ఒకలాంటివి. అందులో ఎక్కువ తలపులే ఉండేవి. కాని పొద్దున్నే నిద్రలోంచి మెలకువరాగానే ఒక్కొక్కప్పుడు హృదయాన్ని తడిగుడ్డగా చేసి పిండినట్టు చెప్పలేని ఏదో బెంగ పుట్టేది. ఆ వకుళ కుటి గుర్తొచ్చేది. డా.మిశ్రా వచ్చినప్పటికే, ఆ ముంగిలి చిమ్మటం మానేసారు. పూలూ, పిందెలూ, కాయలూ, చెట్టుమీదనే మిగలముగ్గి కిందకు రాలిపడ్డ పండ్లూ అన్నీ చెల్లాచెదురుగా పడి ఉండేవి. ఇక ఇప్పుడు ఆ కుటీరం పాడుపడిపోడం మొదలవుతుందా? జోసెఫ్ గారు దాన్ని తన ఆఫీసుగా మార్చుకుని ఉంటే బావుండేదేమో కదా అనిపించేది.

ఒకరోజు పొద్దున్నే ఇంకా నేను దుప్పటి ముసుగు తియ్యలేదు. ఎవరో ఏదో పాట పాడుతున్నారు. ఆ పాట ఎక్కణ్ణుంచో ఆకాశపు కొసల్లోంచి వినవస్తున్నట్టుగా ఉంది. ఆ పాట వినబడటం మొదలుకాగానే నేను నా ఊహల్లోనే రోదించడం మొదలుపెట్టాను. అది కల కాదు, మెలకువా కాదు. నా హృదయాన్ని ఎవరో కోసేస్తున్నట్లు చెప్పలేనంత    బాధ అనుభవానికి వస్తూ ఉంది. ఏ ప్రాచీన స్మృతుల్నో ఎవరో కెరలించి నట్టుగా, నా లోపల ఒక చేదవేసి, నాలోపలి లోతుల్లోంచి ఏదో తోడి పైకి తీస్తున్నట్టుగా ఉంది. అటువంటి రంపం కోత నేనెప్పుడు అనుభవించి ఎరగను. అంతకు ముందూ, ఆ తర్వాత కూడా. నాలోనేనే గింజుకుంటూ, ఆ కోత తప్పించుకోడానికి మెలికలు తిరుగుతూ ఒక్కసారిగా దుప్పటి ముసుగు పక్కకి జరిపేసాను. నా ముఖం మీద కిటికీలోంచి వెలుతురు పడుతూ ఉంది. ఆ పాట రేడియోలోంచి వినబడుతూ ఉంది. ఏదో పాట. ఆ మాటలు కూడా గుర్తు లేవు.

నేను అక్కణ్ణుంచి బయల్దేరినప్పుడే మాన్ సూన్ మొదలయ్యింది. ఇక్కడకు వచ్చేటప్పటికి ఋతుపవనమేఘాలు ఆకాశాన్ని కప్పేసాయి. రోజూ తెల్లవారగానే మా ఇంటి డాబా మీదకు వెళ్ళిపొయ్యేదాన్ని. పైన ఆకాశంలో నల్లమబ్బులు, తమలోపల వెయ్యి దీపాలు దాచుకుని ఆకాశంలో పయనిస్తూ కనిపించేవి. ఆ మబ్బుల్లోనూ, ఆ నల్లదనంలోనూ కాదు, ఆ కరిమబ్బుల మధ్యలో ఉండే వెలుగు ఉందే, ఆ విద్యుత్కాంతి, దాన్ని చూస్తేనే నాకు చెప్పలేనంత బెంగ పుట్టేది.

ఎందుకు? ఎందుకని అక్కణ్ణుంచి అంత తొందరగా వచ్చేసాను? ఆ అడవిమ్మిద ఈ ఋతుపవనం ప్రయాణిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో చూడకుండా ఎందుకొచ్చేసాను? ఆ వెలగచెట్టుకీ, ఆ నేరేడు తోపుకీ మధ్య ఇంద్ర ధనుస్సు అల్లుకుంటే ఎలా ఉంటుందో ఇంక నాకెప్పటికీ తెలియదు కదా!

ఆ ఊళ్ళో ఉన్నప్పుడు భూమి గోళాకారంగా ఉన్నట్టుగా ఉండేది. ఆకాశమూ, భూమీ దిగంతరేఖదగ్గర కలుసుకుని ఒక వలయం ఏర్పడుతున్నట్టుగా ఉండేది. సూర్యాస్తమయాలూ, చంద్రోదయాలూ ఒకదాన్నొకటి అల్లుకుని రెండు చేపలు ఒకదాన్నొకటి కరిచిపట్టుకున్నట్టుగా ఉండేది. కాని ఇక్కడొకొచ్చాక భూమి బల్లపరుపుగా ఉందని అర్థమయింది. బయటికి వచ్చి చూస్తే చతురస్రాకారంగానో, దీర్ఘచతురస్రాకారంగానో, ఇళ్ళూ, వీథులూ, రోడ్లూ కనిపించేవి. అక్కడ కళ్ళకి అడ్డంగా ఏదీ ఉండేది కాదు. అక్కడ ఇళ్ళున్నా, అవి నిట్రాతిగుడిసెలో లేక అటూ ఇటూ కప్పూలు ఏటవాలుగా వాలి ఉండే తాటాకు ఇళ్ళో, బంగాళా పెంకుటిళ్ళో కావడం వల్ల సూర్యుడూ, చంద్రుడూ చెయ్యి చాస్తే అందేటట్టుగా ఉండేవారు. నీకూ, దిగంతానికీ మధ్య అపారమైన ఖాళీ జాగా ఉండేది. చివరికి ఆ వీథుల్లో గోధూళి రేగినప్పుడు కూడా మొత్తం నేలంతా నీకు దగ్గరగా జరిగినట్టుండేది. ఇక్కడ అలా కాదు, ఒక గళ్ళనుడి కట్టులాగా, గ్రాఫునోటుపుస్తకంలో పేజీలాగా అన్నీ గళ్ళుగళ్ళుగా విడిపోయి కనిపిస్తాయి. ఆ గళ్ళల్లో, నీ ఇల్లొక గడి. అందులో నీ గది ఒక గడి. ఆ గదిలో నీ మది ఒక గడి.

ఆ ఊరునుంచి వచ్చిన రెండు మూడు వారాల దాకా నాకు ఊపిరాడలేదు. అడవిలోంచి ఒక పిట్టను తెచ్చి పంజరంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉండింది. పది పదిహేను రోజులు గడిచాక, ఇక్కడ నేను విహరించడానికి మిగిలిన ఒకే ఒక్క స్థలం ఆకాశం మాత్రమే అని అర్థమయింది. అది కూడా మా ఇంటి డాబా మీదకు వెళ్తేనే. కిందకు వస్తే, గళ్ళూ, గోడలూ తప్ప మరేమీ కనిపించవు. కానీ, ఆ ఆకాశం మాత్రం ఆ వూర్నీ, నన్నూ కలుపుతున్న గొడుగులాగా అనిపించేది. మా డాబా మీంచి చూస్తే నెమ్మదిగా పయనమవుతున్న మేఘాలు ఇవాళో రేపో ఆ అడవికి చేరుకుంటాయనిపించేది. ఎప్పుడో పూర్వకాలంలో ఒక యక్షుడు మాన్ సూన్ మేఘాన్ని చూసి సందేశం పంపించాడంటే మొదటిసారిగా నమ్మబుద్ధేసింది నాకు.

వి-లో అప్పట్లో ఇంకా చెట్లు కనిపించేవి. తర్వాత రోజుల్లో పట్టణంలో ప్రతి ఒక్క స్క్వేర్ ఇంచినీ డబ్బులెక్కల్లో చూడటం మొదలయ్యాక ఒక  చెట్టులేకపోతే, ఒక స్క్వేర్ యార్డ్ మిగులుతుంది కదా అని మనుషులు లెక్కలేసుకోడం మొదలయ్యాక, ఆ చెట్లు కూడా కనుమరుగైపోయాయి. నాకు తెలిసిన ఒకాయన ఇంటిముందొక పెద్ద వేపచెట్టు ఉండేది. ఒక తుపానులో ఆ చెట్టు విరిగిపోయింది. దాన్నలా వదిలిపెట్టి ఉంటే మళ్ళా చిగురించి ఉండేదేమో. కాని అదే అవకాశంగా ఆయనదాన్ని కొట్టించేసాడు. ఆ చెట్టు ఉండే స్థలాన్ని, తన ఇంటినీ కలుపుతూ చిన్న షట్టరు దింపి ఒక లాండ్రీకి అద్దెకిచ్చాడు.

కాని అప్పటికింకా ఆ వీథుల్లో చెట్లు కనిపించేవి. మా వీథి దాటి స్కూలుకెళ్ళే దారిలో పెద్ద నిద్రగన్నేరు చెట్లు ఉండేవి. ఆ ఊళ్ళో బస్ స్టాండ్ కి పక్కన కూడా పెద్ద నిద్రగన్నేరుచెట్లు ఉండేవి. వాటి పక్కన ఒక కట్టెల అడితీ ఉండేది. పచ్చనిచెట్లనీడన ఆ కొయ్యదుంగల దుకాణం నాకు ఒక విరోధాభాసగా కనిపించేది. కాని ఆ చెట్టునీడ అక్కడ పడుతున్నంతకాలం నా దృష్టి ఆ అడితీమీద పడేది కాదు. ఒకప్పుడు నాకిట్లా ఇన్ని చెట్లున్నాయిగాని, ఇక్కడిక్కడ ఈ చోటుల్లో ఉన్నాయని గాని తెలిసేది కాదు. అసలు నా దృష్టి స్కూలూ, కాలేజీ, లంచ్ బాక్సూ, ప్రాక్టికల్సూ, హోం వర్కూ దాటి మరిదేనిమీదా ఉండేది కాదు. అదే చిత్రం, మూడేళ్ళు బోటనీ చదువుకున్నా, క్లాసురూములో తప్ప మరెప్పుడూ నేను చెట్ల గురించీ, మొక్కల గురించీ ఆలోచించింది లేదు. కాని ఇప్పుడు ఆ ఊరినుంచి తిరిగొచ్చాక, ఎక్కడ పచ్చదనం కనబడ్డా నాకొక పిట్టగా మారి అక్కడ వాలదామనిపించేది. ఆకాశంలో ఋతుపవనమేఘాల్ని ఎంతసేపేనా అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది. రాత్రి పూట రేడియోలో పాటలు వినబడుతుంటే నేను ఆ ఊళ్ళో ఆరుబయట నులకమంచం మీద వెల్లకిలా పడుకుని నక్షత్రాల్ని లెక్కపెడుతున్నట్టు ఊహించుకునేదాన్ని.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. అప్పటికే స్కూళ్ళు తెరిచారు. తొలకరి చిరుజల్లు ఉండీ ఉండీ పట్టణం మీద సంతోషాన్ని చిలకరిస్తూ పోతుండేది. ఒకరోజు నాన్న నాతో ‘నువ్వేం చేద్దామనుకుంటున్నావు?’ అనడిగాడు.

అప్పటిదాకా నాకు నా భవిష్యత్తు గురించిన ఆలోచననే లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలంటే అప్పట్లో యూనివెర్సిటీకి వెళ్ళి చదువుకోవడమొక్కటే మార్గం. కాని నన్ను హాస్టల్లో పెట్టి చదివించే స్తోమతు నాన్నకి లేదని నేను గ్రాడ్యుయేషన్ అయిపోగానే గ్రహించాను. నన్ను సివిల్ సర్వీసు పరీక్షలకి ప్రిపేర్ అవమని డా.మిశ్రా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నాకు అంత పెద్ద ఆశలేదు. అది సాధ్యంకాగలదన్న నమ్మకం కూడా లేదు. అసలు ప్రొఫెసర్ సేన్ గుప్తా, డా.మిశ్రా నన్ను అంత బ్రైట్ స్టూడెంట్ గా ఎందుకు భావించారో కూడా నాకు తెలియదు. ఏ రకంగా చూసినా నేను యావరేజి స్టూడెంట్ ని. నా శక్తిసామర్థ్యాలు ఏ పాటివో నాకు తెలుసు.

ఆ ప్రశ్న అడిగినప్పుడు నాన్న మనసులో ఉన్న ఉద్దేశమేమిటో నాకు ఆ తర్వాత మరికొన్ని రోజులకి గాని తెలియలేదు. కాని అప్పుడు నాన్న నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగినప్పుడు, నేను ఏదో ఒకటి చెయ్యాలనీ, ఇంట్లో ఖాళీగా కాలం గడపడం సరికాదనీ అనిపించింది. కాని ఏదైనా ఉద్యోగం చెయ్యాలంటే వెంటనే ఎవరిస్తారు? అదీ ఒక గ్రాడ్యుయేట్ కి?  ఆలోచించగా బాంకు పరీక్షలు రాయడం ఒక అవకాశంగా కనిపించింది. బి ఎస్ ఆర్ బి ప్రకటనలు చూడటం మొదలుపెట్టాను. కానీ అవి కూడా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టే పరీక్షలు కావు కదా. వాటికి కూడా ఒక కాలెండరు ఉంటుంది.

ఆ ఆలోచనల మధ్య ఒకరోజు నేను ఆ ఊళ్ళో చదువుకున్న హైస్కూలుకి వెళ్ళాను. అది సెయింట్ థెరేసా మిషనరి స్కూలు. ఆ స్కూలుకి ఎందుకు వెళ్లానో గుర్తులేదు. బహుశా అక్కడ ఆ ఊళ్ళో రామకోవెలలో స్కూలు నడిచినప్పటి జ్ఞాపకాలు నన్ను మళ్ళా ఏదో స్కూలుకి పోయి చూడాలనిపించేట్టు చేసి ఉండవచ్చు. ఆ ప్రిన్సిపాల్ సిస్టర్ ధన్య మాకు హైస్కూల్లో ఇంగ్లిషు చెప్పేది. ఆమె నన్ను చూడగానే గుర్తుపట్టింది. ఇంకా అడ్మిషన్ల హడావిడి నడుస్తున్నా కూడా ఆమె నన్ను కూచోబెట్టి మాట్లాడింది. మాటల మధ్యలో తాము ఒక కొత్త బ్రాంచి తెరుస్తున్నామనీ దానికి టీచర్లకోసం వెతుకుతున్నామనీ చెప్పి ‘నువ్వు బి యి డి చేసావా?’ అనడిగింది.

చెయ్యలేదని చెప్పాను.

‘ఎందుకని? డిగ్రీ లాస్ట్ యియరే కదా అయ్యింది. మరి ఈ ఏడాదంతా ఏం చేసావు?’ అనడిగింది.

నేను నాకు దొరికిన అసైన్ మెంటు గురించి చెప్పాను. ఆమెకి అదంతా అర్థమయినట్టులేదుగాని, కలకత్తా యూనివెర్సిటీ ప్రొఫెసర్, జియాలజీ, ఉత్కళ్ యూనివెర్సిటీ,  ఆంత్రొపాలజీ లాంటి మాటలు ఆమెని కొంత ఆశ్చర్యానికి గురిచేసాయి.

‘అంత పెద్దవాళ్ళతో నువ్వు పనిచేసావా? రియల్లీ!’ అంది నోరంతా తెరిచి.

‘ప్లీజ్ కమ్ టుమారో. మీన్ వైల్ ఐ విల్ టాక్ టు ఫాదర్ దేవసహాయం’ అని అంది.

ఆ మర్నాడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టే ఆ స్కూలుకి వెళ్ళాను. అప్పటికి ఫాదర్ దేవసహాయం కూడా అక్కడే ఉన్నారు. నేను ఆయన్ని చూడటం అదే మొదటిసారీ, చివరి సారీ కూడా. కాని పేరుకి తగ్గట్టే ఆయన్నుంచి నాకు సకాలంలో సరైన సాయం అందింది. తాము కొత్తగా తెరవబోతున్న లిటిల్ ఏంజెల్స్ ఇంగ్లిష్ మీడియం కాన్వెంటులో అన్ ట్రైన్డ్ టీచరుగా నాకు ఆ రోజే అపాయింట్ మెంటు ఆర్డరు ఇచ్చేసారు.  నేను గనక తొందరలో బియిడి చేసేటట్టయితే ట్రైన్డ్ టీచర్ గా తీసుకుంటామనీ, రాబోయే రోజుల్లో పెర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుందనీ కూడా చెప్పారు.

ఊహించని మరొక సంతోషం ఆ స్కూలు కూడా మా ఏరియాలోనే. మా ఇంటినుంచి ఇరవై నిమిషాల నడక. ఆ మర్నాడే నన్ను స్కూల్లో రిపోర్టు చెయ్యమని చెప్పారు.

ఆ స్కూల్లో టీచర్ గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. జీతం ఎంతిస్తారన్న ప్రశ్న అడగాలని కూడా అనిపించలేదు. నాకు రెండవ తరగతి అప్పగించారు. పొద్దున్నే హాజరుపట్టీ చేతుల్లోకి తీసుకుని, పిల్లల పేర్లు ఒక్కొక్కరివీ చదవడం మొదలుపెట్టగానే నాకు వెంటనే ఆ రామకోవెల స్కూలు గుర్తొచ్చింది.

నా అరవై ఏళ్ళ జీవితంలో నేను కొన్ని అద్భుతాలు చూడకపోలేదు. కొన్ని అదృష్టాలు కూడా నా తలుపు తట్టకపోలేదు. కాని నేను చూసిన అద్భుతాల్లోకెల్లా గొప్ప అద్భుతం ఏమిటి అని అడిగితే రుటీన్ అని చెప్తాను. దానికి దేన్నైనా మరిపించగల శక్తి ఉంది. దేన్నైనా తనలోకి జీర్ణంచేసుకోగల సామర్థ్యం ఉంది. అందులోనూ నీకు ఏదో ఒక ఉద్యోగం- చిన్నదో, పెద్దదో ఉండి, దానికొక నిర్దిష్టమైన పని గంటలు అంటూ ఉంటే అది కొన్ని రోజుల్లోనే నిన్ను నువ్వు గుర్తుపట్టలేనట్టుగా మార్చెయ్యగలదు. గానుగెద్దు జీవితమనీ, ఎంతసేపూ, తిరిగిన దారినే తిరుగుతూ, జీవితంలో కొత్త అందాలూ, ఆనందాలూ చూడలేకపోతున్నారనీ- అటువంటి జీవితాల్ని ఎవరేనా ఎద్దేవా చెయ్యవచ్చుగాక, కాని, రోజువారీ జీవితంలో ఒక సానిటీ ఉంది, గొప్ప స్వస్థత ఉందని మాత్రం మర్చిపోకూడదు. ఆ పనిని మరింత ఉత్సాహపూరితం, మరింత ఉజ్వలం చేసుకోవడం ఎలా అన్నది ఆ తర్వాత సంగతి.

నేను ఆ స్కూల్లో టీచరుగా చేరి రెండుమూడు వారాలు గడిచేటప్పటికే, అంటే మిడ్ జూలై కల్లా తక్కినవన్నీ మర్చిపోయాను. పొద్దున్నే లేవడం, తొందరతొందరగా తయారవడం, బ్రేక్ ఫాస్ట్ చేసి,  లంచ్ బాక్స్ కట్టుకోవడం, ఎనిమిదింటికల్లా స్కూళ్ళో ఉండటం, రోజంతా పిల్లల్తో గడిపేక సాయంకాలం అయిదింటికి ఇంటికి రావడం, సాయంకాలం టీ, కొంతసేపటికి స్నానం, డిన్నర్, నిద్ర. అలాంటి రుటీన్ తో ఆ పట్టణంలో, ఆ ఇంట్లో వెయ్యేళ్ళు కూడా సునాయాసంగా గడిపెయ్యగలిగి ఉండేదాన్ని.

ఆ వానాకాలంలో నేను అన్నిటికన్నా ముందు మర్చిపోయింది ఆ వెన్నెలరాత్రుల్ని, ఆ వేసవిని, ఆ హేమంత, శిశిర ఋతువుల్ని, ఆ పక్షి కూజితాల్ని, ఆ సామూహిక సందర్భాల్ని. ఆ అనుభవాలు నెమ్మదిగా జ్ఞాపకాలుగా మారి, అవి కూడా మనస్సముద్రంలో ఎక్కడికో అడుక్కి చేరిపోయేయి. ఆగస్టు పదిహేను గడిచేటప్పటికి నేను పూర్తి ఉద్యోగిగా మారిపోయాను. రోజంతా నిల్చుండి పాఠాలు చెప్పిన అలసటకి రాత్రి నడుం వాల్చగానే కళ్ళు వెంటనే మూతలు పడిపోయేవి. తెల్లవారి మెలకువ వస్తూనే త్వరత్వరగా తయారవ్వాలనే తొందరలో మరేమీ గుర్తొచ్చేది కాదు.

తాను ఎంబిబిఎస్ చేసిన కొత్తలో డాక్టర్ కొన్నాళ్ళు గవర్న్ మెంటులో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసరు గా పనిచేసాడు. ఆ అనుభవం మీంచి అనేవాడు; ‘నువ్వు ఎన్ని అందమైన ప్రదేశాలకు వెళ్ళు, హిమాలయాలకు వెళ్ళు, వాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు వెళ్ళు. కాని ఎక్కడికెళ్ళినా, తిరిగి ఇంటికొచ్చి నీ బాస్ ని చూస్తే తప్ప నీకు మనశ్శాంతి ఉండదు’ అని. అమేయసౌందర్యాలూ, అలౌకికమైన ఆనందాలూ ఈ జీవితం తాలూకు సాధారణ గుణాలు కావనీ, నీ రోజువారీ జీవితమే- కొంచెం హడావిడి, కొంచెం కంగారు, కొంచెం తొందర, కొంచెం టెన్షన్ల్తో కూడుకుని ఉండే నీ డెయిలీ లైఫ్ మాత్రమే నీ అసలైన జీవితమనీ మనం ప్రతి ఒక్కరం లోపల్లోపల బలంగా నమ్ముతూ ఉంటామనుకుంటాను.

ఆ స్కూల్లో టీచర్ గా చేరినతర్వాత, అలాంటి స్కూల్లో స్టూడెంట్ గా గడిపిన జీవితానికీ, టీచర్ గా గడిపిన జీవితానికీ మధ్య నాకు ఆట్టే తేడా కనిపించేదికాదు. అప్పుడు బల్లకి ముందు ఉండేదాన్ని, ఇప్పుడు బల్లకి వెనకాల ఉంటున్నాను. అప్పుడు కూచొని ఉండేదాన్ని, ఇప్పుడు నిలబడి ఉంటున్నాను. కానీ అప్పుడూ అదే తొందర, హోమ్ వర్క్ బరువు, మిస్ ఏమంటుందో అని భయం, ఎగ్జామ్స్ లో మార్కులు ఎలా వస్తాయో అని టెన్షన్. ఇప్పుడూ అదే తొందర, కాకపోతే అప్పుడు నాదొకటే హోమ్ వర్క్, ఇప్పుడు నలభై మంది పిల్లల హోమ్‌వర్క్. ఇప్పుడూ సిస్టర్ ఏమంటుందో అని భయం. ఎగ్జామ్స్ లో పిల్లలకి మార్కులు ఎలా వస్తాయో అని టెన్షన్. అప్పుడు నాకొక్కదానికీ మంచిమార్కులొస్తే సరిపోయేది, ఇప్పుడు నలభై మందికీ మంచి మార్కులొస్తాయో రావో అని కంగారు.

మనం మరీ చిన్నప్పుడే బళ్ళో చేరకుండా ఉండి ఉంటే, అసలు మన జీవితాల్లో విద్యార్థి జీవితమనేదే లేకపోతే ఎలా ఉండి ఉండేవాళ్లమో మనకు తెలీదు. కాని స్టూడెంట్ లైఫ్ అన్నిటికన్నా ముందు మనల్ని ఒక రుటీన్ కి అలవాటు పడేలాగా చేస్తుందని మాత్రం చెప్పగలను. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటే వినడానికీ, ఏదో ఒక పని ఇస్తూ ఉంటే విధేయంగా చెయ్యడానికీ, చేసింది చేసామని రిపోర్టు చెయ్యడానికీ, అలా రిపోర్టు చేసాక వాళ్ళు మన పెర్ఫార్మెన్స్ కి ఎన్ని మార్కులు ఇస్తారో అని టెన్షన్ గా ఎదురుచూడ్డానికీ అలవాటుచేస్తుంది. కాబట్టి  నేను కాలేజి వదిలిపెట్టాక మళ్ళా కొత్తగా కాన్వెంటులో చేరానని ఎట్టకేలకు గ్రహించాను.

అలాంటి రోజుల్లో, ఆగస్టు నెలచివరలో, ఒక ఆదివారం, నేను ముందుగదిలో కూచుని పిల్లల నోటుబుక్కులు కరెక్షన్లు చేస్తూ ఉండగా కాలింగ్ బెల్ చప్పుడయింది. లేచి వెళ్లి తలుపు తీసాను. ఎదురుగా ఇద్దరు యువకులు నిలబడ్డారు. ఇద్దరూ పాతికేళ్ళకి అటూ ఇటూ వయసు ఉన్నవాళ్ళు. ఒక యువకుడు తెల్లగా, మరొకతను చామనచాయలోనూ ఉన్నారు. ఆ చామనచాయ యువకుడు నీట్ గా ఇన్ షర్ట్ చేసుకుని ఉన్నాడు.

‘ఉండండి, నాన్నగారికి పిలుస్తాను’ అని వెనక్కి తిరిగాను. వాళ్లు మా నాన్నగారికోసం వచ్చి ఉంటారన్న ఉద్దేశంతో. కాని అప్పటికే మా నాన్నకూడా వీథిగదిలో అడుగుపెట్టాడు.

‘రా, శ్రీనివాస్’ అని మా నాన్న ఆ ఇద్దరిలో ఒకతణ్ణి పలకరిస్తో, ఆ పక్కనున్నతని కేసి చూసాడు.

ఆ శ్రీనివాస్ అనే యువకుడు చాలా మామూలుగా డ్రెస్ చేసుకుని ఉన్నాడు. బెల్ బాటం పాంటు మీద ప్లెయిన్ కలర్ హాఫ్ హాండ్స్ షర్ట్. తన చెప్పులు విడిచి లోపలకి అడుగుపెడుతూ, ‘ఇతను శివ శంకర్ , మా కజిన్’ అని అన్నాడు. ఆ శివశంకర్ గుమ్మం బయట తన షూస్ విప్పి ఒద్దిగ్గా ఒక పక్కనపెట్టి లోపలకి ప్రవేశించి మా నాన్నకీ, నాకూ కూడా నమస్కారం చేసాడు.

నేను లోపలకి వెళ్ళబోతూండగా, నాన్న వాళ్ళని కూచోమని చెప్తూ, ‘విమలా, నువ్వు కూడా కూచో ‘ అన్నాడు.

అప్పుడు ఆ శ్రీనివాస్ ని పరిచయం చేసాడు. ఆ యువకుడు ఎంబిబిఎస్ పూర్తి చేసి, పాండిచ్చేరిలో జనరల్ మెడిసిన్ లో పిజి థర్డ్ యియర్ లో ఉన్నాడు. వాళ్ల నాన్నగారు ఒక హైస్కూలు హెడ్ మాష్టరు. నాన్నకి చాలాకాలంగా తెలిసిన వ్యక్తి. ఆ డాక్టర్ శ్రీనివాస్ చూడటానికి ప్రసన్నంగా కనిపిస్తున్నాడు. అతను చిరునవ్వితే మరింత సౌమ్యంగా కనిపిస్తున్నాడు. అతనితో వచ్చిన ఆ శివశంకర్ అనే యువకుడు చాలా చలాకీగానూ, ఉత్సాహంగానూ కనిపిస్తున్నాడు.

నన్ను కూడా వాళ్ళకి పరిచయం చేసాడు. లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో టీచరు అని చెప్తూ, నా ఫీల్డ్ వర్క్ గురించి కూడా ప్రస్తావించాడు. ఆ వచ్చినవాళ్ళిద్దర్నీ ఆ ఫిల్డ్ వర్క్ అన్న మాట ఎక్కువ ఆకర్షించింది. చాలాసేపు వాళ్ళు నన్ను జియాలజీ గురించీ, యాంత్రొపాలజీ గురించీ ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు.

‘మీరు పెద్ద స్కాలర్ అన్న మాట. ఈ విషయాలేవీ మాకు తెలీనే తెలీవు’ అన్నాడు ఆ శివశంకర్ అనే యువకుడు. అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీరుగా కిందటేడాదే ఉద్యోగంలో చేరాడు.

ఇంతలో మా అమ్మ వచ్చి ‘శ్రీనివాస్ బావున్నారా? కాఫీ ఇవ్వనా?’ అని అడిగింది. అంటే అతను అమ్మకి కూడా తెలుసన్నమాట అనుకున్నాను. బహుశా నేను ఊళ్ళో లేనప్పుడు అతను మా వాళ్లకి పరిచయమై ఉంటాడు.

వాళ్లతో మాట్లాడుతుండగా టైమ్ తెలియలేదు. మధ్యాహ్నం లంచ్ టైమ్ దాకా మా కబుర్లు నడుస్తుండటంతో, అమ్మ వాళ్ళని భోజనం చేసి వెళ్ళమంది. లంచ్ లో కూడా మేము కబుర్లే ఎక్కువ భోంచేసాం. భోజనాలవగానే వాళ్ళు సెలవుతీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళా పిల్లల నోటుబుక్కులు ముందేసుకుని కూచున్నాను.

నాన్న చెయ్యి తుడుచుకుంటూ వచ్చి నా ఎదురుగుండా సోఫాలో కూచుంటూ ‘ హుషారైన కుర్రాళ్లు. ఆ రెండో అబ్బాయి కూడా చూడబోతే మంచివాడిలానే కనిపిస్తున్నాడు. ఏమంటావు?’ అనడిగాడు.

29-4-2023

9 Replies to “ఆ వెన్నెల రాత్రులు-25”

 1. ఇవాళ మీమీద అలుగుదామనుకున్నాను.
  కానీ
  ఊహలు, కలలు, ఆశయాలు వీటన్నిటినీ మించింది జీవితం. తాజ్మహల్ సందర్శకులకు తాజ్మహల్ లో నిత్య పరిచారకులకు చాలా తేడా ఉంటుంది అనుభవంలో. ఇదీ అంతే.అనివార్య దైనందిన జీవనం, అదే జీవనాధారవిధానం.
  కానీ ఆ తీయని వేదన, అది విమల పాత్రకే కావచ్చు ఎవరికైనా కావచ్చు .అనుభవైకవేద్యం. కొన్ని ఆనందానుభవాల మధురానుభూతుల తాలూకు నీలి నీడలజాడలు మనోయవనిక పై జీవితాంతం తారట్లాడుతూనే ఉంటాయి.

 2. ఆ అడవి హాలిడే అయాక ఇలా జీవితం లోకి తీసుకొచ్చి,ఒక ఉద్యోగం అనే సద్యోగం కల్పించి ఆబ్స్ట్రాక్ట్ నెస్ తో కలిసిన constructive రొటీన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మాష్టారు.

 3. “—-ఆ అనుభవాలు నెమ్మదిగా జ్ఞాపకాలుగా మారి, అవి కూడా మనస్సముద్రంలో ఎక్కడికో అడుక్కి చేరిపోయేయి.–అన్నిటికన్నా ముందు మర్చిపోయింది ఆ వెన్నెలరాత్రుల్ని, ఆ వేసవిని, ఆ హేమంత, శిశిర ఋతువుల్ని, ఆ పక్షి కూజితాల్ని, ఆ సామూహిక సందర్భాల్ని—
  —దేన్నైనా మరిపించగల ,, తనలోకి జీర్ణంచేసుకోగల అద్భుతశక్తి ‘రుటీన్ ‘—-కాని, అందులో సానిటీ ఉంది, గొప్ప స్వస్థత ఉంది—“””

 4. విమల నాన్న ఇంకాస్త నచ్చారు, దాదాపు యాభై ఏళ్ళ ముందు కూతుర్ని ఫీల్డ్ వర్క్ కి ఒక మారుమూల పల్లెటూరికి పంపిన ధైర్యమే మహా ముచ్చటగా వుంది, ఇవాళ ఇంకాస్త మనసుకి దగ్గరగా వచ్చారు.

 5. పల్లె మీద బెంగ, జ్ఞాపకాలు, reminiscence, finding a new routine and taking comfort in it – అక్కడి దాకా నా గురించే చదువుకున్నట్లుంది. 😊

Leave a Reply

%d bloggers like this: