ఆ వెన్నెల రాత్రులు-24

మెడికల్ కాంప్ పూర్తయిన మర్నాడే సేన్ గుప్త నుంచి టెలిగ్రాం వచ్చింది. తాను ఇంక రాబోవడంలేదనీ, మాకు కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నాననీ. వెంటనే డా.మిశ్రా నర్సీపట్నం వెళ్ళి ట్రంక్ కాల్ చేసి ఆయనతో మాట్లాడేడు. యూనివెర్సిటీ పనుల వల్ల కొంతా, ఎండలు ముదరడంతో తనకి ఒంట్లో నలతగా ఉండటం వల్ల మరికొంతా, ఈసారికి ఫీల్డ్ వర్క్ ని ముగించేద్దామని ప్రొఫెసరు ఆయనతో చెప్పాడట. డా.మిశ్రా తనకి అప్పగించిన పని సంతృప్తికరంగా పూర్తిచేసానని చెప్తే, ఆ రిపోర్టులూ, సంబంధించిన కాగితాలూ తనకి పంపించమని చెప్పాడట. అక్కడ చేయవలసిన పేమెంట్ లన్నీ పూర్తి చేసేసి ఆ లెక్కలూ, రసీదులూ తనకు పంపించమని చెప్పాడుట. మా అందరికీ, ముఖ్యంగా జోసెఫ్ గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పమని చెప్పాడట. డా.మిశ్రా ఆ సాయంకాలం మా ఇంటికి వచ్చి ఆ సంగతంతా చెప్పి, తాను మర్నాడే వెళ్లిపోతానని కూడా చెప్పాడు.

ఆయన్ని ఆ మర్నాడు తమ ఇంటికి భోజనానికి రమ్మని సూర్యనారాయణమూర్తిగారు ఆహ్వానించేరు. ఆ చిన్న గ్రామంలో ఆయన ఉన్న రెండు నెలల్లోనూ గొప్ప కదలిక తీసుకువచ్చేరనీ, ఆయనది ఎంతో స్ఫూర్తిదాయకమైన సాంగత్యం అనీ మిశ్రాను నోరారా ప్రశంసించారు. డా.మిశ్రా ఆయనకు పాదనమస్కారం చేసాడు. మర్నాడు పొద్దున్నే బయల్దేరిపోతే విశాఖపట్టణంలో ఒకటి రెండు పనులున్నాయనీ, అవి చూసుకుని రాత్రికి భువనేశ్వర్ బయల్దేరిపోతాననీ, ఈసారికి వారి ఆతిథ్యం తీసుకోలేకపోతున్నందుకు తనని మన్నించమనీ అడిగాడు.

నేనూ, రాజూ కూడా పూర్తి చేసిన సర్వే ఫార్మాట్లు నా దగ్గరే ఉన్నాయి. అవన్నీ ఒక బాగ్ లో పెట్టి ఆయనకిచ్చాను. సేన్ గుప్త వెళ్ళేటప్పటికి ఇంకా నేను పూర్తి చేయలేకపోయిన ఆల్బం లు, తర్వాత పూర్తిచేసినవి కూడా మరొక బాగ్ లో పెట్టి ఇచ్చాను. ఎప్పట్లానే రాజు సాయంకాలం వస్తాడేమో అని డా.మిశ్రాని మరికొంత సేపు కూచోబెట్టాను. కాని రాజు రాలేదు.

డా.మిశ్రా ఆలస్యమైపోతోందని చెప్పి సెలవు తీసుకోడానికి లేచాడు. నా దగ్గరకు వచ్చి ఒక షేక్ హాండిచ్చాడు.

‘యు ఆర్ ఎ బ్రైట్ స్టూడెంట్. సివిల్ సర్వీసు పరీక్షలు రాయి. బోటనీ, యాంత్రొపాలజీ ఆప్షనల్స్ తీసుకో. యాంత్రొపాలజీకి నేను గైడెన్స్ ఇస్తాను. నోట్సు పంపిస్తాను’ అని అన్నాడు. ‘మరి వస్తాను’ అని వడివడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. మొదటిసారి వచ్చినప్పుడు కూడా అలానే వడివడిగా అడుగులు వేసుకుంటూ మా ఇంట్లో అడుగుపెట్టిన దృశ్యం గుర్తొచ్చింది.

ఇంక అక్కడకి నేను వెళ్ళిన పని అయిపోయిందని అర్థమయింది. నన్ను తీసుకువెళ్లడానికి రమ్మని ఆ మర్నాడు నాన్నకి టెలిగ్రాం ఇవ్వబోతుండగా, సూర్యనారాయణమూర్తిగారు వారించారు.

‘అమ్మాయి, రోహిణికార్తె మొదలయ్యింది. ఎండలు భయంకరంగా ఉంటాయి. మీ నాన్నగారు ఈ ఎండనపడి నిన్ను ఇప్పుడు అర్జంటుగా తీసుకుపోకపోతే ఏమవుతుంది? పదిరోజులాగితే చల్లబడుతుంది. అప్పుడు బయల్దేరుదువుగాని’ అని అన్నారు.

‘మరొక పదిరోజులా?’ కాని ఆయనకి అడ్డుచెప్పలేకపోయాను. ఆ విషయమంతా వివరంగా నాన్నకి  ఉత్తరం రాసి ఆ రోజే పోస్టు చేసాను.

ఆ రోజో, ఆ మర్నాడో సేన్ గుప్త నుంచి ఒక ఉత్తరం, పెద్ద పార్సెలు వచ్చాయి. ఆ ఉత్తరం ఇంకా విప్పి చదవకుండానే నాకు చాలా బెంగగా అనిపించింది. ఆ ఉత్తరం ఆయన చేత్తో కాక హృదయంతో రాసాడు. తాము నన్ను పిలిచి, తీరా నేను వచ్చాక, ఆ గ్రామంలో నన్నొకర్తినీ వదిలిపెట్టి తాము అర్థాంతరంగా వెళ్ళిపోయినందుకు పదే పదే క్షమాపణలు చెప్పుకున్నాడు. నా ప్రెజెన్స్ తనకెంతో నమ్మకాన్నీ, ధైర్యాన్నీ కలిగించింది అని చెప్పాడు. రాబోయే కాలంలో తాను ఎక్కడ ప్రాజెక్టు తీసుకున్నా, నన్ను కూడా ఫీల్డ్ వర్క్ కి పిలుస్తాననీ, నేను తప్పకుండా రావాలనీ కోరాడు. ఇక ఆ ఉత్తరంతో పాటు నాకూ, మా తల్లిదండ్రులకీ నూతన వస్త్రాలు పంపిస్తున్నాననీ, వాటిని స్వీకరించాలనీ కోరాడు. ఆ ఉత్తరం తో పాటు ఆరువేలకి చెక్కు కూడా ఉంది. ఏ లెక్కన చూసినా అది చాలా పెద్ద మొత్తం. నేనక్కడున్న రోజులకి గాను నాన్న డబ్బులు ఇస్తానంటే మాస్టారు దంపతులు మనసు కష్టపెట్టుకున్నారు. నన్ను తమ కూతురనే అనుకున్నామనీ, వేయింగ్ గెస్ట్ అని అనుకోలేదనీ అన్నారు. అందుకని ఆ ఫీల్డ్ వర్క్ పేరు మీద నా ఖర్చు మొత్తం రెండువేలు మించి ఉండదు. అటు సేన్ గుప్తా ఔదార్యానికీ, ఇటు మాష్టారి దంపతుల ఆత్మీయతకీ ఎలా ప్రతిస్పందించాలో నాకు తోచలేదు.

ఆ పార్సెలు విప్పి చూసాను. అందులో ఎర్రటి బెంగాల్ కాటన్ చీర, పట్టువస్త్రాలు ఉన్నాయి. అవి మా అమ్మానాన్నకి అని అర్థమవుతోంది. వాటితో పాటు బిష్ణుపురి సిల్క్ సారీ ఉంది. గులాబిరంగు చీర, దానికి బెంగాల్ పట చిత్ర మోటిఫ్స్ తో పెద్ద బోర్డరు. ఆ చీరకి చిన్న స్లిప్ పిన్ చేసి ఉంది. దానిమీద, ‘ఫర్ యువర్ వెడ్డింగ్. డోంట్ ఫర్ గెట్ ఇన్వైటింగ్ అజ్- బనలత’ అని రాసి ఉంది. ఆ చిన్న చీటీ చూడగానే నాకు ఒక్కసారిగా కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. ఆపుకోలేనంతగా బెంగ పుట్టుకొచ్చింది. ఎన్నో దృశ్యాలు, ఎన్నో పాటలు, ఎన్నో నవ్వులు, ఎన్నో నిశ్శబ్దాలు- అన్నీ గుర్తొచ్చాయి. మేమిద్దరమూ ఏ జన్మలోనో, పద్మానది ఒడ్డున రెల్లు పొదల్లో దాగుడుమూతలాడుకున్నాం అనిపించింది.

మర్చిపోయిన గ్రామాలు గుర్తుచేసే అరుణిమా సన్యాల్ సేన్ గుప్తకే కాదు, ఆ క్షణాన నాకు కూడా దర్శనమిచ్చింది. ఎవరో నా పక్కన నిలబడి ‘షె కి తుమి, షె కి తుమి’ అని పలకరిస్తున్నట్టుగా తోచింది.

ఆ సాయంకాలం రాజు వచ్చాడు. ఆ రెండుమూడు రోజులూ ఏమైపోయావని అడిగాను. వాళ్ళనాన్నగారు ఏదో పనిచెప్పారనీ అందుకని నర్సీపట్నం, విశాఖపట్టణం వెళ్ళి రావాల్సి వచ్చిందని చెప్పాడు. డా.మిశ్రా వెళ్ళిపోయాడనీ, వెళ్ళేటప్పుడు తనకోసం చూసాడనీ చెప్పాను. మిశ్రా అడ్రసు తనదగ్గర ఉందనీ, ఉత్తరం రాస్తాననీ అన్నాడు. అప్పుడు సేన్ గుప్తనుంచి ఉత్తరమూ, పార్సెలూ వచ్చిన సంగతి చెప్పాను. ‘నా గురించి అడిగారా?’ అనడిగాడు.

ఆ ఉత్తరంలో రాజు ప్రస్తావన లేదని గుర్తొచ్చింది. మళ్ళా ఆ ఉత్త్రం ఆమూలాగ్రం గుర్తుచేసుకోడానికి ప్రయత్నించాను. లేదు, ఆయన ఆ ఉత్తరంలో కనీసం జోసెఫ్ గారి గురించి కూడా ప్రస్తావించలేదు.

‘బహుశా నీకు వేరే ఉత్తరం రాస్తారేమో’ అన్నాను, మరేమనాలో తెలియక.

‘వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మిస్సయ్యాను. మళ్ళీ వస్తారు కదా అనుకున్నాను. మిశ్రానంటే మళ్లా చూస్తానని నమ్మకం ఉందిగాని, ఆ లడ్డూ అమ్మాయినీ, ఆ బడ్డూ తాతనీ మళ్ళా చూస్తానని నమ్మకం లేదు’ అన్నాడు.

ఆ మాటలు వినగానే  ఆపుకోలేనంత నవ్వొచ్చింది నాకు.

‘లడ్డూ అమ్మాయా! వనలత నీకు లడ్డూ అమ్మాయిలా కనిపించిందా!’- తెరలు తెరలుగా నవ్వొస్తూనే ఉంది నాకు.

కాని వాళ్ళు తనని మర్చిపోయారని రాజుకి మనసులో కష్టం కలిగిందని నాకు అనిపిస్తూనే ఉంది. మనుషుల్ని కళ్ల ముందు కనిపిస్తున్నంతసేపే పట్టించుకుని ఆ తర్వాత మర్చిపోయే మనిషి కాడు సేన్ గుప్త. కాని ఆ క్షణాన అతని మనసులో  ఏర్పడ్డ ఆ చిన్నపాటి శూన్యాన్ని ఎలా పూరించాలో నాకు తెలియలేదు.

ఏ పని లేకుండా మరో పదిరోజులు ఆ ఊళ్ళో ఎలా గడపడమా అనుకున్నానుగాని, కళ్ళుమూసి తెరిచేటంతలోనే పది రాత్రులూ గడిచిపోయాయి. అంతకుముందు కూడా రెండు వారాలు ఏ పనిలేకుండా ఉన్నప్పటికీ, అప్పుడు డా.మిశ్రా కోసం ఎదురుచూడటం ఉంది, ఆయన వచ్చేక ఎలాంటి పని మొదలుపెట్టవలసి ఉంటుందో తెలియకపోవడమూ ఉంది. కాని ఈ పదిరోజులూ పూర్తి ఆటవిడుపు. సుధీర్ లాగా, రోజా లాగా నేను కూడా ఆ వేసవి సెలవులకి మా బంధువుల ఇంటికి వెళ్ళినట్టే అనిపించింది.

పూర్తి సోమరి రోజులు. ఆకాశంలో దినమల్లా కోకిల కూడా నాలానే సోమరిగా కూస్తూ ఉండేది. వైశాఖమాసం మొదలైనప్పుడు  గంగాలమ్మ వస్తూ వానలు వెంటబెట్టుకొచ్చింది. కాని రోహిణికార్తె మొదలయ్యాక వానలు అదృశ్యమైపోయాయి. అడవీ, కొండా, ఊరూ అన్నీ అలసిపోయినట్టుండేవి. ఎప్పుడు సాయంకాలమవుతుందా అని ఎదురుచూసేవాళ్ళం. మరికాసేపటికి సంధ్యవాలుతుందనగా ఊరంతటినీ మనోహరమైన చల్లదనం ఆవరించేది. ఆ చల్లదనంకోసం రోజంతా ఆ ఎండని తట్టుకోవచ్చనుకునేవాళ్ళం. ఇప్పటిలాగా పంకాలూ, ఏసీలు లేని రోజులు. మధ్యాహ్నం ఉక్కబోసేది. పేడతో అలికిన ఆ అరుగులమీద ఒక చాప పరుచుకుని దానిమీదనే దొర్లుతుండేవాళ్ళం. వానపడుతుందేమో అనుకునేవాళ్ళం. చినుకులుపడేవికావు గాని గుమాయింపు మరింత ఎక్కువయ్యేది. తాటాకు విసనకర్రల్తో విసురుకునేవాళ్ళం. నిద్రపట్టేది కాదు. అటూ ఇటూ దొర్లినంతసేపు దొర్లేక ఇక విసుగొచ్చి లేచేవాళ్ళం. అదీ సమయం మామిడిపండ్లు ఆరగించడానికి. అవి పళ్ళల్లాగా కనిపించేవికావు. పూతనుంచి పండుదాకా అక్కడ గడిచిన నాలుగునెలల సంతోషమంతా కుక్కిపెట్టుకున్న జ్ఞాపకాల మూటల్లాగా ఉండేవి.

రాజు ఒక్కొక్కప్పుడు మరీ సాయంకాలం కాకుండానే వచ్చేసేవాడు. అతను రావాలనీ, వస్తే ఎక్కడికో ఒకచోటికి పోవచ్చనీ నాలో ఒక ఎదురుచూపు ఉండేది. అతనూ, నేనూ, అన్నయ్యా కలిసి రోజా వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. అక్కణ్ణుంచి చాపరాయి దగ్గరికో లేదా ఇటువైపు ఏటిదాకానో, ఒక్కొక్కప్పుడు ఆ ఏరు దాటి టేకుచెట్ల అడవిదాకానో నడిచేవాళ్ళం. ఒకసారి యూకలిప్టస్ తోటలోకి కూడా వెళ్ళాం. మరీ ముఖ్యంగా రెండు అనుభవాలు, మరవలేనివి, రెండింటికీ రాజుకి ఋణపడి ఉంటాను.

ఒకరోజు కృష్ణదేవి పేట వెళ్ళేదారిలో ఉన్న ఏడొంపుల ఘాటికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత జీవితంలో నేనెన్నో ఘాట్ రోడ్లలో ప్రయాణం చేసాను. డాక్టర్ తో, మా పిల్లల్తో వేసవిసెలవుల్లో ఎన్నో హిల్ స్టేషన్లలో గడిపినప్పుడు ఎన్నో ఘాట్ రోడ్లలో పొద్దుటిపూటనో, సాయంకాలంపూటనో నడిచిన రోజులూ తక్కువేమీ కావు. వాటితో పోలిస్తే ఆ ఏడొంపుల ఘాటి మరీ పెద్దదేమీ కాదు. ఆ అడవి కూడా మహారణ్యమూ కాదు.  ఆ రోజు జీపు తీసుకుని వెళ్ళి ఉండవలసింది. సాయంకాలం బస్సుకి వచ్చేద్దామనుకుని ఇటునుంచి బస్సులో వెళ్లాం. కాని మా ఆటల్లో, మాటల్లో, పాటల్లో పడి బస్సుమిస్సయ్యాం. అవి కృష్ణపక్షపు రాత్రులు. చిమ్మటలూ, చీకట్లూ తప్ప మరింకేమీ ఆ అడవిలో కనిపించడం మానేసాయి. ఇంటికి ఎలా రావాలో తెలీదు. నడుచుకుంటూ పోదామా అన్నాడు సుధీర్ అన్నయ్య. ఆయన కూడా మాతో ఉన్నాడు కాబట్టి ఇంట్లో మరీ అంత కంగారు పడరని ఒక ధైర్యం. ఎంతసేపు ఆ ఘాట్ మీద వెయిట్ చేస్తామని నడవడం మొదలుపెట్టాం. ఆకలి వేస్తూ ఉంది. రెండు మలుపు తిరిగేటప్పటికి, కృష్ణపక్షపు చంద్రుడు ఆకాశంలో అడుగుపెట్టాడు. వెన్నెల రాత్రుల చంద్రుణ్ణి మాత్రమే చూసిన నాకు, ఆ దశమినాటి వెన్నెల్లో అడవిని చూడటం కొత్తగా ఉంది. ఆ రాత్రి అడవి మాతో కలిసి నడవడానికి చంద్రుణ్ణి తోడుగా పంపించినట్టుంది. మిడ్ సమ్మర్ నైట్. మేమొక మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ లో నడుస్తున్నట్టుగా అడుగులు వెయ్యడం మొదలుపెట్టాం. ఇంతలో గిరిజన కార్పొరేషన్ లారీ దొరికింది. ఆ లారీ రాకపోయుంటే, ఆ చంద్రుడు మా ఇంటిదాకా వచ్చి ఉండేవాడే.

ఇంకోరోజు, అది కూడా నేను మరి రెండురోజుల్లో అక్కణ్ణుంచి వచ్చేస్తాననగా, అందరం ఆ ఊరిని ఆనుకుని ఉన్న కొండ ఎక్కాం. ఎప్పుడూ చాపరాయిదాకానో లేదా మరొక నాలుగు అడుగులు పైకో ఎక్కి వచ్చేసేవాళ్ళం, ఆ రోజు కొండపైదాకా ఎక్కాం. అప్పుడు కూడా సాయంకాలమవుతూ ఉంది. ఆ కొండమీంచి చూస్తే దిగంతందాకా ఆకుపచ్చని సముద్రం, ఆ సముద్రం మీంచి పైకి లేస్తున్న ఊదారంగు కెరటాల్లాగా కొండలు. అంతదాకా తాను చిటికెనవేలు పట్టుకుని నడిపిస్తున్న తన బిడ్డని తండ్రి ఒక్కసారిగా తన నెత్తిమీద ఎక్కించుకుని చుట్టూ ఎలా ఉందో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఆ రోజు ఆ కొండమీంచి అప్పటిదాకా నేను తిరుగాడిన దేశం చూస్తే.

మృగశిర కార్తె రాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. రోడ్లు పగిలేటు కాసిన రోహిణి కార్తి ఎండ చల్లని నీడగా మారిపోయింది. అలాంటి చల్లని వేళ మా నాన్న వచ్చాడు. ఆ రోజు సాయంకాలం నాకు ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసారు. సేన్ గుప్త వచ్చినప్పుడు ఏర్పాటు చేసినట్టే, ఈ సమావేశం కూడా జోసెఫ్ గారే ఏర్పాటుచేసారు. గ్రామంలోని పెద్దల్తో పాటు, మా నాన్న, సూర్యనారాయణమూర్తిగారి కుటుంబం, సుధీర్, రోజా, రాజూ, దేవయ్య, రాంబాబు, చెల్లన్న దొర, ఇంకా మరికొందరు వచ్చారు. జోసెఫ్ గారు అందరికీ టీపార్టీ ఇచ్చారు. నా గురించి ఆదరపూర్వకంగా నాలుగు మాట్లాడేరు. ఆయన మాట్లాడటం చూసి గ్రామసర్పంచ్ కూడా నాలుగు మాట్లాడేడు. మరొక ఇద్దరు ముగ్గురు పెద్దలు కూడా మాట్లాడేరు. మా నాన్న అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. తన కూతురిని కడుపులో పెట్టుకు చూసుకున్నారని చెప్పాడు. నన్ను కూడా మాట్లాడమన్నారు. కానీ నాకు గొంతుపెగల్లేదు. నిజానికి అటువంటి వీడ్కోలు డా.మిశ్రాకి ఇచ్చి ఉండవలసిందని ఆ తర్వాత ఎన్నిసార్లో అనుకున్నాను. ఒక విద్యావంతుడు ఒక గ్రామంలో ఒక్కరోజు గడిపినా కూడా ఆ గ్రామంలో ఎంతో కొంత మార్పు కనబడాలని ఆయన చెప్పినప్పుడు ఆ మాటలకి తనే ఒక ఉదాహరణగా నిలబడతాడని నేను ఊహించలేదు.

టీపార్టీ అయిపోయి అంతా వెళ్ళిపోయాక, రోజా ఇంకొంచెం సేపు కూచోమని అడిగింది. నాన్న మాష్టారి కుటుంబంతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. నేనూ, రాజూ, సుధీర్ మాత్రమే మిగిలాం. మేము నలుగురం వకుళకుటికి వెళ్లాం. మామిడికాయలు కాపు దింపెయ్యడంతో మళ్లా చెట్లు బోసిగా కనిపిస్తున్నాయి. మేము ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం గాని, మాట్లాడుకోవలసిందేదో మాట్లాడుకోవడం లేదని తెలుస్తూనే ఉంది. ఆ కుటీరం అరుగుమీద కూచున్నాం.

‘రోజా, ఒక పాట పాడవా’ అనడిగాను. రాత్రయింది, పొద్దున్న పడ్డ నాలుగు చినుకులే తప్ప మరి వాన రాలేదు. అంతా గుమాయింపుగా, ఉక్కపోతగా ఉంది. ఆమె ఏదన్నా సినిమా పాట పాడితే వాతావరణం తేలిక పడుతుందేమో అనిపించింది.

ఒక హిందీ పాట పాడనా అనడిగింది రోజా.

‘మనం హిందీలో పూర్’ అన్నాడు రాజు.

‘పాడి ఊరుకుంటే చాలదు, అర్థం కూడా చెప్పాలి’ అని కూడా అన్నాడు, నవ్వుతో, కాని, సీరియస్ గానే.

‘అలాగే, తప్పకుండా’ అంది రోజా. చెట్టుగుబుర్లలో దాగి కనిపించని కోయిల పాట మాత్రమే వినిపించేటట్టు, ఆ చీకట్లో రోజా ఒక పాట ఎత్తుకుంది.

యే దౌలత్ భీ లేలో యే షొహరత్ భీ లే లో

భలే ఛీన్ లో ముఝ్ సే మేరీ జవానీ

మగర్ ముఝ్ కో లౌటాదో బచ్ పన్ కా సావన్

వో కాగజ్ కీ కష్టీ, ఓ బారిష్ కా పానీ..

ఆ పాట  జగజీత్ సింగ్, చిత్రా సింగ్ పాడిన ఎంతో సుప్రసిద్ధ గీతమని ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకు నాకు తెలిసింది. కాని ఆ పాట మొదటిసారి విన్నది మాత్రం ఆ కొండకింద పల్లెలో, ఆ మామిడిచెట్ల నీడలో, ఆ ఊళ్ళో నేను గడిపిన ఆ చివరి వేళల్లో.

ఆమె పాడుతున్నంతసేపూ కొండా, కోనా, నింగీ, నేలా అన్నీ మౌనంగా ఆ పాట విన్నాయి. ఆ తర్వాత ఆమె ఓపిగ్గా ప్రతి ఒక్క వాక్యానికీ అర్థం చెప్పింది.

‘ఈ సంపద తీసేసుకో, ఈ కీర్తిప్రతిష్టలు పట్టుకుపో, నా యవ్వనం కూడా పట్టుకుపో, కాని, నా చిన్నప్పటి రోజులు మాత్రం నాకిచ్చెయ్యి, ఆ వానాకాలపు రోజులు, ఆ కాగితం పడవలు-

ఆ గ్రామంలో మిగిలిన పూర్వకాలపు ఆనవాళ్ళు, అమ్మమ్మలు చెప్పే కథల్లో దేవదూతలు, యుగాల గాథలు చెప్పే ఆ ముఖం మీది ముడతలు, మర్చిపోడం సాధ్యంకాని ఆ ముచ్చట్లు, తొందరగా గడిచిపోయే ఆ రాత్రులు, ఎంతకీ ముగిసిపోని ఆ కబుర్లు-

మధ్యాహ్నాలవేళ ఎండలో బయటికి పోవడాలు, ఆ పిట్టల వెంట, ఆ బుల్బుళ్ళ వెంట, ఆ సీతాకోకచిలుకల వెంట పడటాలు, ఆ బొమ్మల పెళ్ళిళ్ళు, ఆ తగాదాలు, ఆ ఉయ్యెలలూగడాలూ, కిందకిపడిపోడాలూ, పడిపోకుండా తప్పించుకోడాలూ, అపురూపంగా దాచుకున్న ఆ చెల్లని కాసులు, ఆ పగిలిన గాజులు-

పెద్ద పెద్ద ఇసుకకుప్పలమీద ఎక్కడాలు, ఇసుకగూళ్ళు కట్టడాలు, కట్టినవాటిని కూలదొయ్యడాలు, కళ్లల్లో మెరిసిన ఆ కోరికలు, ఆ కలలు, ఆ బొమ్మలు, ఎలాంటి చీకూ చింతాలేని ఆ అనుబంధాలు, ఆ చక్కని రోజులు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ రోజులు, ఆరాధనీయమైన ఆ రోజులు-‘

ఆ పాటా, ఆ మాటలూ ముగిసాక రోజా చిన్న గొంతుతో నా చెవిలో ‘రాజు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు’ అంది. కాని అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. సుధీర్ ‘పొద్దున్నే ప్రయాణముంది, పద’ అని తొందరపెట్టాడు..

ఆ మర్నాడు పొద్దున్నే ఫస్ట్ బస్సుకే బయల్దేరిపోయాం. వెళ్ళేముందు మాష్టారి దంపతులకి నాన్న తెచ్చిన కొత్త బట్టలు పెట్టాను. వారి పాదాలకు నమస్కరించాను. ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళు. పగలూ, రాత్రీ ఎలా తిరిగినా, ఎక్కడికి తిరిగినా, ఎవరితో ఎంతసేపు కబుర్లు చెప్పినా వారు ఒక్కరోజు కూడా కనుబొమకూడా ముడిచింది లేదు. ఆయన సరే. ఆమె కూడా. 

సుధీర్ పెళ్ళికి తప్పకుండా వస్తామని నాన్న మరీ మరీ చెప్పాడు. బయలుదేరేముందు ఆ పిల్లలిద్దర్నీ దగ్గరగా పొదువుకున్నాను. బాగా చదువుకొమ్మని చెప్పాను. ఉత్తరాలూ రాస్తూఉండమని చెప్పాను. నన్ను  మర్చిపోవద్దని మరీ మరీ చెప్పాను.

బస్సెక్కేముందు ఆ ఇంటిని, ఆ వీథిని, ఆ రామకోవెలని మరోసారి చూసాను. ‘అమ్మా, నేటినుంచీ విజయ్ విశాల ప్రపంచంలో అడుగుపెడుతున్నాడు’ అని అక్కడ ఇంకా రిహార్సల్ నడుస్తున్నట్టే ఉంది.

బస్సు కదిలింది. నాన్న గిరిజన్ కార్పొరేషన్ లో కొన్న చింతపండుబుట్ట, చీపుళ్ళూ, తేనెసీసాలూ సర్దుకుంటున్నాడు. బస్సు ఏరు దాటింది, గ్రామదేవత గుడి కూడా దాటింది.  ఆ యూకలిప్టస్ తోటలూ, ఆ టేకు తోటలూ వెనక్కి వెళ్ళిపోయాయి. మరొక రెండుగంటలు గడిచేటప్పటికి  ఆ అడవీ, ఆ కొండలూ కూడా కనుమరుగైపోయాయి.

28-4-2023

16 Replies to “ఆ వెన్నెల రాత్రులు-24”

 1. విమల ఆ ఊరు వదిలేసి వెళ్లిపోతుంటే.. మాకు కూడా చాలా బెంగ గా వుంది.. అంతలా తిరిగాం.. ఆ ఊళ్ళో, ఆ అడవుల్లో,, ఆ కొండల్లో ఆ కల్మషం లేని మనుషుల ఊహల్లో.. ముఖ్యం ఆ వెన్నెల రాత్రుల్లో.. మిశ్రా, సేన్ గుప్తా, వనలత, రోజా , రాజు లి అందరూ కళ్ళ ముందు మెదులుతున్నారు.. ఈ 24 రోజులు ఎంత అద్భుతమైన విహారం చేయించారండి.. మా ఈ ఆనందానికి ముగింపు దగ్గర్లోనే ఉందని అర్థమవుతోంది.. అయినా గాని వచ్చే భాగాల్లో ఏం అవుతుందో అని చాలా ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నాం…

 2. కొన్ని బంధాలు అంతే. ఆ సమయానికి అత్యంత ప్రాణప్రదంగా అనిపిస్తాయి. ఒక ఆత్మస్పర్శి అనుభూతిని మిగులుస్తాయి. అది దాచిపెట్టిన తేనెలా ఏండ్లు గడచినా తీపి తగ్గదు సరికదా ఒక ఔషధంగా మిగులుతుంది.
  రుబాయీ
  సిరివెన్నెల రాత్రుల హాయి
  మరువలేని కథా సోయి
  కొండకింది పల్లె సొగసుల
  మనసునిండ నిండెనోయి

 3. విమల వెళ్ళి పోతుంటే..వెన్నెల రాత్రులు ముగింపు కి వచ్చినట్టే కదా.. !
  విమలతో పాటు అడవులు.. కొండలు గుట్టలు తిరిగినట్టే ఉంది.
  చిన్నతనం లో సీలేరు, డొంకరాయి లో మా పెదనాన్న గారి ఇంట ఉన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఓ పౌర్ణమి రోజున రాత్రిపూట డొంకరాయి నుంచి భద్రాచలం.. అడవి దారమ్మట జీపులో ప్రయాణం. అప్పుడు ఈ రచన లేవి చదవలేదుగా. కొద్దిగా కృష్ణశాస్త్రి గారి కవిత్వం మాత్రమే పరిచయం.

 4. అడవి సోయగాలు,మీ కథలూ మనసంతా నిండి తరిగిపోని గంధం లా ఆ సువాసనలు అంటిపెట్టుకునే ఉంటున్నాయి

 5. ఎనిమిది నెలలు, జీవితకాలమంతా సరిపోని అనుభవాలు. శరన్నవరాత్రులు దాటగానే మొదలై వసంత నవరాత్రుల దాకా. ఎంత వైభవం చూసింది ఆ అమ్మాయి…
  ముగింపు ముంగిట్లోకి రావడం ముందే తెలిసినా చాలా abrupt గా అనిపిస్తుంది ఇట్లా లేఖల్లో వీడ్కోలు. విమల కథ ఎట్లా కొనసాగుతుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తూ…

 6. ఆ పల్లెలో..
  ఆ అడవిలో..
  ఆ మొక్కలు, చెట్లు, పూలు ఆకుల..సౌరభాల మధ్య..
  ఆ రాళ్ళు, కొండలు, ఆ గుట్టల మధ్య..
  వెన్నెలలో తడిసి పులకరిస్తున్న ప్రకృతి మధ్య..
  వెన్నెల గంధాన్ని పరిపూర్ణంగా ఆఘ్రాణిస్తున్న గిరి పుత్రుల మధ్య..
  సేన్ గుప్తా వంటి ప్రకృతి శాస్త్రవేత్త..మిశ్రా వంటి మానవ శాస్త్రవేత్తల .. సాహచర్యంలో.. శరద్, హేమంత, వసంత, గ్రీష్మ ఋతువు లలో ప్రకృతి సంతరించుకునే ప్రత్యేక శోభను అణువణువు నిశితంగా పరిశీలిస్తున్న.. విమల అనుభవాలు చదువుతూ.. ఆ వెన్నెల రాత్రులలో మమేకమైన మాకు అప్పుడే 24 రోజులు గడిచాయా అనిపించింది..
  బస్సు అడవి దాటుతుంటే బాధగా ఉంది…

 7. ఆ అడివిలో, ఆ కొండకిందపల్లెలోని వెన్నెలరాత్రులు అప్పుడే అయిపోయాయా?

 8. ‘తన బిడ్డని తండ్రి ఒక్కసారిగా తన నెత్తిమీద ఎక్కించుకుని చుట్టూ ఎలా ఉందో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది’.. వీడ్కోలు వివశత లోనూ ఆ వర్ణన వెంటాడుతూనేవుంది

Leave a Reply

%d bloggers like this: