ఆ వెన్నెల రాత్రులు-22

Reading Time: 8 minutes

Image design: Mallika Pulagurtha

అప్పటిదాకా ఏ పున్నమికోసం నేనట్లా ఎదురుచూడలేదు. ఆ పున్నమి రావడానికి మరొక నాలుగురోజులు గడవాలి. ఆ నాలుగురాత్రులూ నేను నిద్రపోలేదు. అసలు వైశాఖమాసం మొదలయ్యాక ఆ వెన్నెలరాత్రులంతా ఆ ఊరు నిద్రపోనేలేదు. గంగాలమ్మ పండక్కి కట్టిన ఉయ్యాల ఏ ఒక్కరాత్రి కూడా ఆగిందిలేదు. అప్పటిదాకా నా మనసుకి ఎక్కలేదు గాని, ఆ ఉయ్యాల చుట్టూ అన్ని నవ్వులు, అన్ని పరిహాసాలు, అన్ని పాటలు, అన్ని రాగాలూ పొంగిపొర్లుతున్నాయని ఆ నాలుగు రాత్రుల్లోనూ నాకు బాగా తెలిసింది.

పున్నమి రాత్రి ఎడ్లబండిలో ప్రయాణం అని రాజు చెప్పిన మర్నాటి రాత్రి, నేను ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉండగా, ఉన్నట్టుండి గాల్లోంచి ‘నోయి మావల్లారా ఉయ్యాలో- మావలన్నల్లారా ఉయ్యాలా’ అంటో ఒక పాట వినిపించింది. ఆ పాట పెరటివైపునుంచి వస్తున్నదనుకుని ముందు పెరటివైపుకు వెళ్ళాను. అప్పటికే వెన్నెల ధారాపాతంగా కురవడం మొదలయ్యింది. ఆ ఇంటివెనక ఉన్న నిమ్మతోటమీంచి తొలిపూత గాలి వస్తున్నది తప్ప పాట కాదని అర్థమయింది. ఆ పెరటిలోంచి చుట్టు తిరిగి వీథివైపుకు వచ్చాను. తొలివాన పడేటప్పుడు గదికిటికీ తెరవగానే గుప్పున తొలిజల్లు ముఖాన చిందినట్టు, పాట కంచె మీంచి నా మీద తొణికింది. గబగబా, కంచె తలుపు తీసుకుని వీథిలోకి వెళ్ళి నిలబడ్డాను. ఆ ఉయ్యాల మీద ఉయ్యెలూగుతూ ఇద్దరు స్త్రీపురుషులు పాటపాడుతుంటే వాళ్ళని ఊపుతున్నవాళ్ళూ, పక్కననిలబడ్డవాళ్ళూ ఆ పాటకి గొంతు కలుపుతున్నారు. ఆ క్షణాన ఆ ఉయ్యాల ఒక ఫౌంటెన్ లాగా ఆ పాట దాన్లోంచి చిమ్ముతున్న జలధారలాగా ఉంది.

నోయి మావల్లారా ఉయ్యాలో, మావలన్నల్లారా ఉయ్యాలో

సిరిదలచి నిను దలచి ఉయ్యాలో సింహాద్రి నే దలచి ఉయ్యాలో

చంద్రుడు ఇంకా ఆకాశమధ్యానికి రానేలేదు. చివరి బస్సు ఇంకా వెళ్ళిపోలేదు. ఇళ్ళల్లో దీపాల ఒత్తులు ఇంకా మందగించలేదు. కానీ, ఆ స్త్రీ పురుషుల ఉత్సాహం అప్పటికే ఎంతోకాలంగా ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఎగిసి పడుతూ ఉంది. ఆ సమయాన ఆ గ్రామం రెండు వరదల్లో చిక్కుకున్నట్టు ఉంది. ఒకటి, నింగి పైన వెన్నెల వరద. మరొకటి నేలపైన యవ్వనపు వరద.

ఆ స్త్రీపురుషులు ఎవరు? వాళ్లది ఆ గ్రామం కాదా? పొద్దున్నప్పుడు ఇంటింటికీ తిరిగి నేను ఇంటర్వ్యూ చేస్తూ వింటున్న ఆ కష్టాలు వీళ్లవికావా? భూములు అన్యాక్రాంతం అవుతున్నవాళ్ళూ, నూటికి యాభై వడ్డీ కడుతున్నవాళ్ళూ, ప్రసూతిమరణాల్లో తల్లుల్నీ, బిడ్డల్నీ పోగొట్టుకుంటున్నవాళ్ళూ వారు కారా? ఏమో, అది పగటి ప్రపంచం, ఇది వెన్నెల ప్రపంచం. ఆ వ్యథలకీ, ఈ సుధలకీ మధ్య యోజనాల దూరం ఉందనిపించింది.

ఏళ్ళ తరువాత, ఎప్పుడో ఒక అక్టోబరులో డాక్టరూ, నేనూ మాచర్ల మీదుగా సాగర్ కారులో వెళ్తూ ఉండగా, ఒక పల్లెటూళ్ళో చిరు చీకటిలో ఊరంతా అట్లతద్ది ఉయ్యాల ఊగుతున్న దృశ్యం చూసాను. ఆ ఉయ్యాల పక్కన ఒక బడి ఉంది. పిల్లలాడుకునే ఆటస్థలంలో కట్టారు ఆ ఉయ్యాల. దగ్గరలో నిద్రగన్నేరు చెట్లు. ఆ చెట్లకి ఆవల దూరంగా ఒక చెరువుమీద తదియ నాటి చుక్కల వెలుగు వెన్నచారికలాగా కనిపిస్తూ ఉంది. ఆ ఉయ్యాల చుట్టూ పిల్లలు కేరింతలు కొడుతున్నారు. కారులో వెళ్తూ ఉండగా అదాటున కిటికీలోంచి ఆ ఉయ్యెల కనబడగానే నా మనసు స్పృహతప్పిపోయింది. ఎన్నో ఏళ్ళ కిందట, ఒక వసంతఋతు రాత్రి ఆ కొండకింద పల్లెలో, ఆకాశమంత ఎత్తుకి ఊగిన ఉయ్యాల గుర్తొచ్చింది. చెప్పలేనంత బెంగ ఆవహించింది.

ఆ బెంగ ఆ ఊరికోసమా? లేక ఆ ఊరినుంచి నేను అందుకున్న తొలిప్రేమలేఖ కోసమా? లేక ఆ రాత్రులు మరెన్నటికీ రావనే కరకు మెలకువ వల్లనా? దాన్నేనా నోస్టాల్జియా అంటారు?

ఇది రాస్తున్నప్పుడు మొబైల్లో నెట్ తెరిచి నోస్టాల్జియా అనే మాటకి అర్థమేమిటా అని చూసాను. వట్టి అర్థం కాదు, ఎటిమలాజికల్ మీనింగ్ ఏమైఉంటుందా అని చూసాను. నోస్టాల్జియా గ్రీకు నుంచి పుట్టిన పదం అట. తిరిగి వెళ్ళడం, బాధ- అనే రెండు పదాల కలయిక అట. పునర్యాన వేదన. ఆ బాధ తిరిగివెళ్ళడంలోని బాధనా? వెళ్లలేమని తెలియడంలోని బాధనా? లేక ఎలాగేనా తిరిగివెళ్ళిపోవాలనిపించి మనని నిలవనివ్వని బాధనా? నెట్ లో పెద్ద వ్యాసం కూడా ఉంది. నోస్టాల్జియా ప్రధానంగా స్థలంతో ముడిపడ్డది అని.  కాని, అది స్థలం కన్నా కాలంతో ముడిపడ్డ వేదన అని నాకు తెలుస్తున్నది. ఆ స్థలం అక్కడే ఉన్నా, ఆ కాలం అక్కడ లేదని ఎలా మర్చిపోగలను?

గతించిపోయిన కాలం గురించి బెంగపెట్టుకుని ఏమి లాభం? మనుషులెప్పుడూ ముందుకే చూస్తుండాలి అనే మాటలు నేను చిన్నప్పణ్ణుంచీ వింటూనే ఉన్నాను. చిన్నప్పణ్ణుంచీ ఇంటిదగ్గరే పెరిగినందువల్ల, హోమ్ సిక్ నెస్ అనే మాట నాకు తెలియదు. కాని నాకేమీకాని ఒక ఊళ్ళో ఆరేడునెలలు మాత్రమే గడిపి వచ్చినతరువాత నాలో నాకు తెలీకుండానే కొత్త సిక్ నెస్ ఒకటి పుట్టడం గమనించాను. దాన్ని ఫార్-సిక్ నెస్ అందామా? ఆ ఊళ్ళో గడిపి వచ్చిన తరువాత నాకు కొత్తప్రపంచాలు చూడాలనే కోరిక అదృశ్యమైపోయింది. సేన్ గుప్తా బంగ్లాదేశ్ వెళ్ళలేనట్టే నేను కూడా ఆ కాలానికి తిరిగి పోలేను. ఏళ్ల మీదట ఎంతో నలుగులాట పడ్డాక చివరికి నేను సాధనచెయ్యగలిగిన విద్య ఒకటే: నేను ఎక్కడ ఉండవలసి వస్తే, ఆ స్థలాన్నే, ఆ కాలాన్నే ప్రేమించడం.

ఇది ఎన్నో ఏళ్ళ తరువాతి మాట. కాని ఆ రాత్రి నా పరిస్థితి నేను మాటల్లో పెట్టగలిగేది కాదు. నాలోనూ ఏదో ఉధృతి పరవళ్ళు తొక్కడం తెలుస్తూ ఉంది. నేను కూడా అలా ఎవరో ఒకరితో ఆ బల్లమీద నిల్చొని, నేలకీ, నింగికీ మధ్య ఉయ్యాల ఊగాలని అనిపించింది. ఆ రాత్రి నువ్వు ఉయ్యెలలూగాలని కోరుకున్నది ఒక మనిషితో కాదు, ఒక గంధర్వుడితో అని మర్చిపోకు అని ఆ తర్వాత నాకు నేను ఎన్ని సార్లు చెప్పుకున్నానో!

ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదని ముందే చెప్పాను. తెల్లవారేటప్పటికి చిరుజల్లు కురిసిపోయింది. మామూలుగా ఆ అడవిదేశంలో వసంతవాన చైత్రంలో పొద్దున్న పూట కురిసిపోతుంది. వైశాఖంలో వానలు మధ్యాహ్నాల ముచ్చట. కాని ఆ రోజు వైశాఖ పూర్వాహ్ణమే ముత్యాలవాన కురిసింది. బహుశా రాత్రంతా పాడినపాటలకి గడ్డకట్టిన వెన్నెల తెల్లవారగానే కురిసిపోయినట్టుంది.

లేవగానే చిరుజల్లు పడుతూ ఉంటే నా దేహం పూర్తిగా తేలికపడిపోయింది. తూలికాతుల్యం అయిందని చెప్పగలను. ఇంటివెనక్కి వెళ్ళినిలబడ్డాను. అప్పటికి జల్లు ఆగిపోయింది. చింతచెట్లమీద కొంగలు రెక్కలు విదుల్చుకుంటున్నాయి. కరణంగారి నారింజతోట మీంచి నునులేత పూలగాలి ఆ దారంతటినీ దేవతలు నడిచే దారిగా మారుస్తోంది. నాకు వెంటనే ఆ దారమ్మట అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. మే నెల ఇండియన్ లాబర్నమ్ నెల అంటారు. అడవిలోనూ, కొండమీదా పసుపుమంటలాగా ప్రజ్వరిల్లే రేలపూల వెల్లువ కళ్ళారా చూస్తే తప్ప నా మనసు శాంతించదనిపించింది. కాని ఆశ్చర్యం, రాత్రి ఉయ్యెలలూగడానికి ఒక తోడు కావాలనిపించిందిగాని, పొద్దున్నే అడవికి మాత్రం ఒక్కత్తెనే వెళ్లాలనిపించింది. రేలచెట్ల కింద నిలబడి ఆ పూలు పాడే పాటలు నేనొక్కొర్నే వినాలనిపించింది. కాబట్టి, అడవికి ఎలానూ పోలేను. ఊరంతా తిరుగుదామా అని అనుకున్నాను. ఆ పొద్దున్నే కాగితాలు చేత్తో పట్టుకుని ఊరంతా తిరుగుతుంటే ఎవరికీ విడ్డూరంగా అనిపించకపోవచ్చు. ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నాననే ప్రతి ఇంట్లోనూ అనుకోవచ్చు, ఇబ్బంది ఉండదు అనుకుని గబగబా ముఖం కూడా కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చి, కాగితాలు చంకనపెట్టుకుని పెరటి తలుపు తీసుకుని బయటికి అడుగుపెట్టాను. ఆ దారమ్మట కొండరెడ్ల ఇళ్ళమధ్యనుంచి సన్నని కాలిబాటమ్మటే నడుస్తో పోయేను.

అది నాకు తెలిసినదారి కాదు. ఆ ఇళ్లు కూడా సర్వేలో నా వంతువచ్చినవి కావు. అప్పుడప్పుడే ఇళ్ళముందు మనుషుల సంచారం పెరుగుతోంది. కోళ్ళు చప్పుడుచేసుకుంటో ఆ చిరుతడినేలలో పురుగులకోసం వెతుక్కుంటూ ఉన్నాయి. ఆ ఇళ్ళుదాటి కూడా ముందుకుపోయేను. మరికొన్ని నిముషాల్లో ఊరూ, అడవీ కలుసుకునే హద్దుకి చేరుకున్నాను. నా ఎదట చింతతోపు. ఆ తోపుదాటగానే కొండవార లొద్దు కనిపిస్తోంది. అంతకుముందు వారం రోజులకిందటనే ఒక మధ్యాహ్నం వేళ రాజుతో కలిసి ఆ కొండలోయలో వైశాఖమాసపు వానలో చిక్కుకుపోయిన విషయం గుర్తొచ్చింది. ఆ చింతతోపు దాటితే నూరువరహాల చెట్టు నిండుగా పూసి ఉంటుందని గుర్తొచ్చింది.  ఎదురుగా కొండలు వేసవి రంగు తిరిగి ఉన్నాయి. వానజల్లు ఆ కొండల ఊదారంగు మీద తెల్లటిపూత పూసింది. ఆ తడిపూత ఆరడానికి మరికొంతసేపు పడుతుంది. అక్కడ ఒక కోకిల ఆకాశానికి తలుపులు బార్లాతీస్తూ, మళ్ళా వేస్తూ ఉంది. ఇక అక్కణ్ణుంచి మరిముందుకు వెళ్ళలేకపోయాను. అప్పటికింకా తడిగాలీ, పొడి ఎండా కలుసుకుని మాట్లాడుకుంటూనే ఉన్నాయి. మరికొంతసేపటికి ఒకరు వెళ్ళిపోతారు, మరొకరు ఇటువైపు అడుగుపెడతారు. వెనక్కి తిరిగాను.

వచ్చిన దారిన కాక అక్కడ ఖాలీనేలకి అడ్డంగా నడిచి పెద్దరావిచెట్టు పక్కనుంచి మళ్లా ఊళ్ళో అడుగుపెట్టాను. అటువైపు ఎక్కువ ఇళ్ళుండవు. ఆ మలుపులో ఒక తురాయి చెట్టు ఉంది. వేసవిమొదలైనప్పటినుంచీ, ఆ చెట్టు ఎలుగెత్తి పాటలు పాడుతూనే ఉంది, పాడగా అరిగిపోయిన పాటలు తునిగిపోయి కింద రాలిపోయినట్టు పూలరేకలు కింద మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి. ఆ చెట్టు ఆ వేసవిరాత్రులంతా ఆ నేలకి వేనవేల ముద్దులు పెడుతున్నట్టు ఎర్రటి మరకలు. వాటిమీద పొద్దున్న కురిసిన చిరుజల్లుకి మళ్లా కొత్తగా రాలిపడ్డ ఎర్రని రేకలు, ఆకుపచ్చని మొగ్గలు, తెగిపడ్డ కేసరాలు, అక్కడక్ఖడా విరిగిపడ్డ కొమ్మలు. ఆ చోటుదగ్గరనుంచి కాళ్ళు ఒకపట్టాన ముందుకు సాగలేదు. అక్కణ్ణుంచి కొండ చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంది. ఆ కొండమీద ఒక అతిథి గృహం ఉన్నట్టూ,  ఈ చెట్టు ఆ అతిథిగృహం ప్రాంగణంలో ఉన్నట్టూ, రాత్రి ఎవరో అతిథి ఆ కొండమీద దిగినట్టూ, ఇక్కడ రాలిపడ్డ పూలని ఊడ్చడానికి ఇంకా ఎవరూ రానట్టూ ఉంది. కోకిల నా వెనకే అక్కడికీ వచ్చింది. బిగ్గరగా అరుస్తూ నాకేదో చెప్తున్నది. అదేమిటో నాకు తెలుస్తున్నట్టే ఉందిగాని, అక్షరాలు తడిసిపోయిన లేఖలా అర్థంకాకుండా ఉన్నది.

మూడు రోజుల తర్వాత సినిమాకి బయల్దేరేటప్పటికి నా మనోలోకంలో ఒక కొండ మీద అతిథీ, అతను కోకిల కూజితంలో చుట్టి పంపిన ప్రేమలేఖా మాత్రమే ఉన్నాయి. అవి నా మనసుని పూర్తిగా ఆక్రమించి తక్కినవాటన్నిటినీ బయటకు నెట్టేసాయి.

ఆ రోజు సాయంకాలం బయల్దేరి మొదటి ఆట చూసి అర్థరాత్రికి ఇంటికి తిరిగివచ్చేసేటట్టు ఏర్పాట్లు చేసాడు రాజు. కానీ మధ్యాహ్నానికి ఎప్పట్లానే వసంతమేఘం గర్జించింది. కృష్ణమేఘాలు కమ్ముకున్నాయి. పెద్ద వాన పడింది. ఇక ఆ రోజుకి మా ప్రయాణమే ఆగిపోతుందేమో అనుకున్నాం. మూడింటికల్లా సిద్ధం అయినవాళ్ళం వాన తగ్గేదాకా ఎదురుచూస్తూ కూచున్నాం. తీరా వానవెలిసేటప్పటికి సాయంకాలం అయిదు దాటింది. వానవెలిసాక పరుచుకునే పసిడి వెలుతురు ఊరంతా కమ్ముకుంది. కంచెమీద కురిసిపోగా మిగిలిన వాననీళ్ళు వెదురు తడికల మీంచి బొట్లుబొట్లుగా కిందకి జారుతూ ఉన్నాయి. ప్రతి నీటిబిందువుమీదా సంధ్యకాంతి చిట్లి రంగురంగుల వలయాలు సాలీడుదారాల్లాగా ఊగుతున్నాయి.

ఇంటిముందు రెండు బళ్ళు వచ్చి ఆగాయి. ఒక్కో బండిలోనూ ఎండుగడ్డి పరిచి వాటిమీద గోనెసంచులు పరిచారు. ఆ గోనెపట్టాలమీద జంబుఖానాలు పరిచారు. ఒక బండిలో నేనూ, మా ఇంట్లో చిన్నపిల్లలిద్దరూ కూచున్నాం. మరో బండిలో రాజూ, సుధీరూ కూచున్నారు. ఒకపక్కన ప్లాస్టిక్ తాబేటికాయల్లో మంచినీళ్ళు, తినడానికి వేయించిన అటుకులు పెట్టుకున్నాం. ఊళ్ళో వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు. బళ్ళు నెమ్మదిగా కదిలి విలేజి చావడి దాటి వకుళకుటి దగ్గర ఆగాయి. అక్కడ డా.మిశ్రా తో పాటు మరొక కుర్రవాడు రాజు కూచున్న బండిలో ఎక్కారు. రోజా కుందేలుపిల్లలాగా నడుచుకుంటూ వచ్చి మా బండి ఎక్కింది. ఆమె తో పాటు మృదువైన రోజ్ పెర్ఫ్యూమ్ కూడా బండిలో ప్రవేశించింది.

బళ్ళు ఊరుదాటేటప్పటికి సూర్యాస్తమయం కావొస్తూ ఉంది. కోకిల చివరిసారి కొండలన్నిట్నీ పలకరించి వెళ్ళిపోతూ ఉంది. కోతలు కోసిన తర్వాత నుంచీ నాలుగైదునెలలుగా బీడుపడ్డ పొలాల్లో ఎండిపోయిన దుబ్బుల మీద వానచినుకులు మెరుస్తున్నాయి. వాటిమధ్య గోరువంకలు పురుగుల్ని వెతుక్కుంటున్నాయి. అక్కడక్కడా ఇంకా మేతనుంచి వెనక్కి మళ్ళని ఆవులూ, గేదెలూ కనిపిస్తున్నాయి. అవి నడుస్తున్నప్పుడు చెదిరి పైకి లేచే పురుగులకోసం కొంగలు వాటి పక్కనే పొంచి పొంచి కదుల్తున్నాయి. మేతముగించి ఏ పొలాల్లోంచి పశువులు ఇంటిదారిపట్టాయో అక్కడనుంచి కొంగలు గుంపులు గుంపులుగా ఆకాశంలోకి ఎగురుతున్నాయి. వేసవివానకు తడిసిన సాయంకాలపు అడవులమీంచి తేమగాలి మమ్మల్ని తాకిపోతున్నది.

బండి నడుపుతున్న ఎడ్లకి మెళ్ళో చిన్నచిన్న గంటలున్నాయి. బండినడుపుతున్న మనిషి తన చేతిలో కుచ్చుకర్రతో ఎడ్లని అదిలిస్తూ ఉన్నాడు. తారురోడ్డుమీదనే నడుస్తున్నా, బళ్ళు అటూ ఇటూ ఊగుతో నడుస్తున్న కుదుపు తెలుస్తూ ఉంది. మా బండి దాదాపు మా ముందుబండిని ఆనుకునే నడుస్తున్నది. ఆ బండిలోంచి మిశ్రా మమ్మల్ని చేయూపుతో పలకరించాడు. నేను రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టాను. ఇంతలోనే వాళ్ళంతా ఏదో మాటల్లో పడిపోయారు. సుధీర్ అన్నయ్య ఆయనతో యాంత్రొపాలజీ పాఠాలు చెప్పించుకోడం మొదలుపెట్టాడేమో అనుకున్నాను.

కొంతసేపటికి బళ్ళు ఊరు దాటాయి. అటూ ఇటూ అడవి. అడవిని చూసి ఎన్నేళ్ళో అయినట్టుగా ఉంది. ఆ రోజు ఫాల్గుణమాసంలో బూరుగచెట్ల దారిన నడిచిన తర్వాత మళ్ళా ఇదే అడవిగాలి పీల్చడం. ఎక్కడ చూసినా రేలపూలూ, అక్కడక్కడ తురాయిపూలూ, వాటిమధ్య ఎర్రటిపూలలాగా కొమ్మలన్నీ చిగిర్చిన చెట్లు కనిపిస్తున్నాయి. అవేమి చెట్లని అడిగాను బండినడిపే మనిషిని. తానిచెట్లయి ఉండొచ్చన్నాడు. అడవిలో అన్నిటికన్నా ఆఖరున చిగిర్చే వృక్షజాతులన్నీ ఆకుపచ్చని చీరకు లత్తుక అద్దుతున్నట్టు ఉన్నాయి.

నెమ్మదిగా బండి ఆ దారిలో వచ్చే మొదటిపల్లె దాటింది. ఆ పల్లెలు పగలే నిద్రపోతున్నట్టు ఉంటాయి, ఇక సంజెవేళ చెప్పేదేముంది? ఎక్కడో లోపలకీ ఉన్న ఒక ఇంట్లో అప్పుడే దీపం వెలిగించినట్టుంది. ఆ పల్లె కూడా దాటాక, కొంత బయలు ప్రదేశం ఉంది. అది కూడా దాటాక రెండుమైళ్ళ అడవిదారి ఉంటుందని గుర్తు. ఆ బయలుప్రదేశంలో బళ్ళు అడుగుపెట్టేటప్పటికి ఎక్కణ్ణుంచో ఎవరో గాయిక ఆలాపన మొదలుపెట్టినట్టుగా దూరంగా ఆకాశం మీంచి తెలిపసుపు కాంతి కనిపించింది. ఆ కాంతివెనకనే చంద్రుడు సముద్రంలోంచి పైకి వస్తున్న పువ్వులాగా కనబడ్డాడు. మా దేహాలకు ఎప్పుడూ తెలిసిఉండని మనోహరమైన తెమ్మెర ఒకటి తూర్పునుంచి పడమటివేపుకు వీచింది.

నేను ఆ చంద్రుణ్ణే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. సరసులోకి హంస ప్రవేశించినట్టు చంద్రుడు ఆకాశంలో అడుగుపెట్టాడని కవులు రాసారు. యుగాలుగా చంద్రోదయాన్ని వర్ణించడానికి మరో ఉపమానం అంతకుమించింది దొరక్క అదే పోలిక ఒక కవిసమయంగా మారిపోయింది. కాని ఆ ప్రదోషవేళ చంద్రుడు ఒక పక్షిలాగా అడవిలో అడుగుపెట్టాడని చెప్తే అది సరైన వర్ణన కాదు. ఎందుకంటే పక్షిరెక్కలు ఎంతో కొంత సవ్వడి చెయ్యకుండా ఉండవు. గంధంసానమీద గంధం సానతియ్యడానికి పెట్టిన గంధం చెక్కలాగా ఉన్నాడని అన్నా అది కూడా సరికాదు, ఎందుకంటే, ఇప్పుడో, మరునిమిషమో ఆ చెక్క ఆ సానమీద రాపాడిన చప్పుడు మనకు వినిపించకమానదు.  బహుశా మనసులో ప్రశాంతి ఉదయించినప్పుడు మాత్రమే అంత వెలుగు అంత నిశ్శబ్దంగా అనుభవానికి వస్తుందనుకుంటాను.

అంతవరకూ మేము చూస్తూ వచ్చిన అడవి వేరు, చంద్రోదయవేళ అడవి వేరు. అంతకుముందు నేను అడవిని ఎన్నో వేళల్లో, ఎన్నో ఋతువుల్లో, ఋతుసంధ్యల్లో చూసాను గాని, చంద్రోదయవేళ చూడలేదు. ఒక మహాసముద్ర కెరటం నీ మీద పడిపోకుండా ఆకాశమంతా పరుచుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంది. అప్పటిదాకా చెట్లు విడివిడిగా ఉన్నాయి, వెన్నెల పడటం మొదలవగానే అవి ఒకదానికొకటి మరింత చేరువగా జరిగాయి. కొమ్మలకీ, తీగలకీ కొత్త బాహువులు పుట్టుకొచ్చినట్టుగా ఉంది. హేమంతకాలంలో వణికించే చలిలో ఇంట్లో పిల్లలం ఒకరికొకరం దగ్గరగా, మరింత దగ్గరగా జరిగినట్టుగా, చెట్లూ, చేమలూ, బండలూ కూడా ఆ వెన్నెల్లో మరింత దగ్గరగా హత్తుకోడం కనిపిస్తోంది.

పదినిమిషాల ముందు, చంద్రుడు ఇంకా కనబడక ముందు, రోజాని ఏదేనా పాట పాడమందామా అని అడగాలనుకున్నాను. కాని వెన్నెల వాన మొదలయ్యాక, పాటలే కాదు, ఎవరూ మాట్లాడకుండా ఉంటే కూడా బాగుణ్ణనుకున్నాను. ఆ తర్వాత మా ప్రయాణం మరొక గంటా రెండుగంటల పాటు సాగి ఉంటుంది. అంతసేపూ నేను ఆ బండిలో లేను, చంద్రుడితోపాటే నెమ్మదిగా ఆకాశయానం చేస్తూ ఉన్నాను.

మేము సినిమాహాలుకు చేరుకునేసరికి మొదటి ఆట ఇంకా నడుస్తూ ఉంది. కథ చివరిలోకి వచ్చిన క్లైమాక్సు చప్పుళ్ళు వినిపిస్తూ ఉన్నాయి. రెండో ఆటకోసం ఎదురుచూస్తున్న వాళ్ళతోనూ, మొదటి ఆటకు వచ్చిన రెండెడ్ల బళ్ళతోనూ ఆ గ్రౌండు నిండిపోయి ఉంది. ఎడ్లకి కాడి వదులు చేసారు. అవి నేలమీద వాలి తమ ముందు వేసిన ఎండుచొప్పమధ్య తిన్నది నెమరేసుకుంటూ ఉన్నాయి. నల్లగా మాసిపోయిన ఆ సినిమాహాలు రేకుల కప్పుకి వెన్నెల వెల్లవేస్తూ ఉంది.

అందరం బళ్ళు దిగాం. రాజు మమ్మల్ని ఒక పాక హోటలు దగ్గర కూచోబెట్టాడు. ఆ హోటల్లో ఇడ్లీలు వేడి వేడిగా వాయి మీద వాయి దింపుతున్నారు. రాజు మా అందరికీ ఇడ్లీలు ఆర్డరు చేసాడు. అడ్డాకుల ప్లేట్లలో ఆవిరికక్కుతున్న పల్చని ఇడ్లీలు, వాటితో పాటు కారప్పొడి, చట్నీ. అవి నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోయాయి. ఇడ్లీలు తినగానే టీ. పిల్లలిద్దరికీ, రోజాకి పాలు. మరో అయిదునిమిషాల్లో సినిమా పూర్తవుతుందన్నాడు రాజు.  డా.మిశ్రా సినిమా కోసం రాలేదనీ, నలుగురు మనుషుల్నీ చూడొచ్చనే అక్కడికి వచ్చి ఉంటాడనీ నేననుకున్నది నిజమే అయింది. ఆయన రాజు జబ్బ పట్టుకుని అక్కడ నిలబడి ఉన్న గిరిజనులవైపు వడివడిగా అడుగులు వేసాడు.

అప్పుడు చూసాను, ఆ సినిమా హాలు ఎదురుగా ఉన్న పోస్టరుమీద సినిమా పేరు. అప్పటిదాకా ఏ సినిమా కి వెళ్తున్నామని అడగాలని కూడా తోచలేదు నాకు.

రెండవ ఆట పూర్తయ్యేటప్పటికి అర్థరాత్రి దాటింది. ‘మళ్ళా టీ తాగుతావా?’ అనడిగాడు రాజు.

‘ఏమి చెప్తున్నాడు మిశ్రా మీకు?’ అనడిగాను సుధీర్ అన్నయ్య ని. ఆయన చెప్పే పాఠాలేవో మిస్సయ్యానేమో అని ఒకపక్క పీకుతూనే ఉంది.

‘ఏం పాఠాలు? ఆయన చిన్నప్పటి సంగతులు చెప్తున్నాడు. ఒరిస్సా పల్లెటూళ్ళూ, ఇదిగో ఇలాంటి టూరింగు టాకీసులకి సినిమాకి పోవడం, ఇలాంటిసంగతులే చెప్తూ ఉన్నాడు. ఎక్కువ మనవాడే ఏవో ఒకటి చెప్తూ ఉన్నాడు. ఈ సినిమా హాలు 73 లో కట్టారుట. అప్పణ్ణుంచే కొండరెడ్ల పల్లెల్లో పాటలు వినబడటం మానేసాయని చెప్పాడు’ అన్నాడు.

‘అప్పణ్ణుంచే కొండరెడ్ల దేవతలు కనిపించడం మానేసి ఉంటారని కూడా మిశ్రా చెప్పి ఉండాలే?’అన్నాను.

‘ఎగ్జాట్లీ. అలాంటి మాటలే ఏవో చెప్పాడు. ఎలా ఊహించేవు?’ అనడిగాడు అన్నయ్య.

నేను చిరునవ్వాను.

మళ్ళా బళ్ళు బయల్దేరాయి.

తిరుగు ప్రయాణం మూడు గంటలేనా పట్టి ఉంటుంది. బళ్ళు ఊరు దాటగానే మా బండిలో రోజా, పిల్లలూ నిద్రలోకి జారుకున్నారు. మా ముందుబండిలో కూడా రాజూ, అన్నయ్యా, తక్కిన కుర్రళ్ళిద్దరూ కూడా నిద్ర ఆపుకోలేకపోయినట్టే కనిపిస్తూ ఉంది. మిశ్రా మాత్రం బండివెనకవేపు కూచుని కాళ్ళు కిందకి వేలాడేసుకుని ప్రయాణం సాగినంతసేపూ మేలుకునే ఉన్నాడు. అరగంట గడిచేక బహుశా నేను కూడా నిద్రపోతున్నానని అనుకున్నాక సిగరెట్ వెలిగించాడు. ఆ ప్రయాణం పొడుగునా ఆయన స్మోక్ చేస్తోనే ఉన్నాడు.

కొంతసేపటికి నేను కూడా బాసింపట్టు వేసుకుని బండికి ఒక వైపు వీపు ఆనించుకుని కూచున్నాను. రోజా నాకు ఎదురుగా కూచుంది. పిల్లలిద్దరూ చెరొకరి వొళ్ళోనూ తలపెట్టుకుని నిద్రలోకి జారుకున్నారు. రోజా దారిపొడుగునా కునికిపాట్లు పడుతూనే ఉంది.

మేము వెళ్ళేటప్పటి వెన్నెలకీ, తిరిగి వచ్చేటప్పటి వెన్నెలకీ మధ్య చాలా తేడా ఉంది. వెళ్ళేటప్పుడు వెన్నెల వస్త్రం నేస్తున్నట్టుగా ఉంది. వచ్చేటప్పుడు నేసిన వస్త్రం మామీద నిండుగా కప్పినట్టుగా ఉంది. చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ప్రతి కొమ్మలోనూ, ప్రతి ఆకులోనూ ఏదో సున్నితమైన స్పందన కనిపిస్తూ ఉండింది. గాలికి సరసు మీద చిన్న చిన్న అలలు కదలాడినట్టు అడవిమీద వెన్నెల పడటం మొదలుకాగానే తరంగాలు, తరంగాలుగా ఏదో పులకింత మొత్తం ప్రకృతిని ముంచెత్తడం గమనించాను. కాని వచ్చేటప్పుడు అంతా నిస్తరంగ సముద్రంలాగా ఉంది. వెన్నెలంతా మేసి అడవి నిదరోతున్నట్టుగా ఉంది. బండినడిపే మనిషి కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఎడ్లు ఎన్నో ఏళ్ళుగా ఆ దారిన నడవడం అలవాటయినట్టే నడుచుకుంటూ పోతున్నాయి. ఒకప్పుడు ఇంట్లోకి వినిపించిన ఆ గంటల చప్పుడు ఇప్పుడు నా పాదాలకు చుట్టిన మువ్వల చప్పుడులాగా వినిపిస్తూ ఉంది. ఆ చప్పుడు ఆ వెన్నెల చిక్కదనాన్ని మరింత గడ్డకట్టిస్తూ ఉంది.

మొదటిగంట ప్రయాణం నడిచేటప్పటికి ఆకాశంలో పాలపుంత అడవిమీదకు ఒరిగిపోయిందా అనిపించింది. అడవికీ, అడవికీ మధ్య ఖాళీగా ఉన్న ప్రదేశాలు వచ్చినప్పుడల్లా, దూరంగా కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొండల్ని ఏదో ప్రాచీన నిశ్శబ్దం, ప్రీ కేంబ్రియన్ యుగాలనాటి నిశ్శబ్దం, భూమి నుంచి చంద్రుడు విడిబడ్డ సంరంభం సద్దుమణిగినప్పటి నిశ్శబ్దం ఆవరించింది. మరికొంతసేపటికి ఆకాశం ఈమూలనుంచి ఆమూలకి ఎవరో పాలకావడి మోసుకుపోతున్నట్టుగానూ, ఆ కావడి నడిచిన దారిపొడుగునా పాలపుంతకి చిల్లుపడి కారిపోతున్నట్టుగానూ ఉంది.

నేనున్నచోట నుంచే ‘ డియర్ డాక్టర్ మిశ్రా, గిరిజనదేవతలూ, వనదేవతలూ ఎక్కడికీ పోలేదు. చూడండి, ప్రాచీన దేవతాసమూహం ఒకటి ఈ రాత్రంతా ఊరేగింపుగా ఈ అడవిదారుల్లో నడుస్తూనే ఉన్నారు’ అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. ఏమో! ఎవరికి తెలుసు? డా.మిశ్రా కూడా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ వాళ్ళతోటే సంభాషిస్తో ఉన్నాడేమో!

రెండు గంటల ప్రయాణమయ్యేటప్పటికి బళ్ళు టేకు ప్లాంటేషన్ దారిలో అడుగుపెట్టాయి. ఆ చెట్లమధ్య, చెట్టుకి చెట్టుకి మధ్య సందుల్లో వెన్నెల నిట్టనిలువుగా పడుతోంది. దాన్ని చూస్తుంటే ఆ టేకు ప్లాంటేషన్ మధ్యలో ఆ రాత్రికి రాత్రే ఒక వెన్నెలతోట వికసించినట్టుగా ఉంది.

ఆ దారిలో ఒక్క చెట్టుగానీ, ఒక లతగానీ లేకుండా వట్టి కొండలు మాత్రమే ఉండి ఉంటే ఆ వెన్నెల ఎలా ఉండేదో చెప్పలేను. ఒకవేళ ఆ సమయంలో నేనొక సముద్రం మీద ప్రయాణిస్తో ఉండి ఉంటే, ఆ వెన్నెల ఎలా కనిపించి ఉండేదో కూడా ఊహించలేను. కాని ఆ అడవి, మధ్యమధ్యలో ఆరుబయలు, దారిపక్కన చెట్లు, నిద్రపోతున్న ఊళ్ళు, ఇళ్ళల్లో సగం కొడిగట్టిన దీపాలు, ఊళ్ళు దాటేక ప్లాంటేషన్లు, ఆ తోటలమధ్య ఖాళీలు, అల్లిబిల్లిగా అల్లుకున్న జీడిమామిడితోటల్లో మిగలముగ్గి, కుప్పగా రాశిపోసిన జీడిమామిడి పండ్లమీంచి వీచే గాలి- నాకు ఆ ప్రయాణమంతా, అడవిదారుల్లో ఒక నదిమీద చిన్న తెప్పవేసుకుని ప్రయాణిస్తో ఉన్నట్టుంది.

ఆ తర్వాతి జీవితంలో ఎన్నో ప్రదేశాలు చూసాను, ఎన్నో ప్రయాణాలు చేసాను, సరస్తీరాల్లో, సముద్రతీరాల్లో, చివరికి హిమాలయాల్లో కూడా సంచరించాను. కాని, ఆ వైశాఖపూర్ణిమ రాత్రి ఆ రెండెడ్లబండిమీద చేసిన ఆ ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం లాంటిది నేను మరొకటి చేసి ఉండలేదు. అన్నాళ్ళు ఆ అడవిలో తిరిగినందుకు, పేరుపేరునా ప్రతి చెట్టునీ పలకరించినందుకు, ఒక గిరివనప్రేమికుడికీ, మరొక గిరిజన ప్రేమికుడికీ వాళ్ళ పనిలో వాళ్లకి సాయపడ్డందుకు, బహుశా కొండదేవతలూ, వనదేవతలూ మాటాడుకుని నాకా ప్రయాణాన్ని ప్రసాదించారనిపించింది.

26-4-2023

12 Replies to “ఆ వెన్నెల రాత్రులు-22”

 1. వెన్నెలని అనుభవించాల్సింది ఎలానో నిర్వచించారు.మనల్ని మనం కోల్పోకపోతే ఏదైనా అనుభవం ఎలా అవుతుంది ?

  1. అటువంటి అనుభవాలు నదీ స్నానం లాంటివి. ఒకసారి మునిగిలేచాకనే స్నానం చేశామని తెలుస్తుంది.

 2. ఏ దేవత వరమో కాని.. వెన్నెల్లో అడవి ని చూసే అనుభూతి ని ప్రసాదించారు. కవి తలచుకుంటే కానిదేముంది. ఇలాగే వెన్నెల ను పోగేసి దోసిట్లో పోయగలరు.ధన్యవాదాలు.

 3. Sir, మీ మనోచిత్రంలో మీరు చూస్తున్న ప్రతి చిన్న detail ని పదచిత్రంగా మాకు చూపిస్తున్న
  తీరు అనన్యసామాన్యం!! 🙏🏽

   1. అడవిలో వెన్నెల స్నానం చేయించారు..
    వెన్నెలకు అడవిలో ప్రతి అణువు ఎలా పులకరిస్తుందో .. ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిన అనుభూతి కలుగుతున్నది. చంద్రుడు ఇప్పుడు కొత్తగా కనబడుతున్నాడు.. వినబడుతున్నాడు కురుస్తున్నాడు.. తడుపుతున్నాడు.. కప్పేస్తున్నాడు..
    ధన్యవాదాలు.

 4. అడవిగాచిన వెన్నెల అర్థాన్నే మార్చివేసారు. అంత పరవశం విమల పాత్ర ద్వారా మీ అనుభవమై
  వెన్నెలలు కురిపించింది. నాకు చిన్నతనంలో అర్థరాత్రి ఎడ్లబండి ప్రయాణం అనుభవం కనుక ఆ పారవశ్యాన్ని ఊహించగలను. మీదంతా అడవి పూచిన వెన్నెల.

 5. ఒక మహాసముద్ర కెరటం మీద పడిపోకుండా ఆకాశమంతా పరుచుకుంటే ఎలా ఉంటుందో, అలా ఉంది…

Leave a Reply

%d bloggers like this: