ఆ వెన్నెల రాత్రులు-21

Image design: Mallika Pulagurtha

ఒక ఆదివారం పొద్దున్నే రాజు మా అందరికీ తాటిముంజలు తినిపిస్తానని తన పొలానికి తీసుకువెళ్ళాడు. పొలం గట్లమీద తాటిచెట్లమీంచి లేత గెలలు తింపడం, దింపినవి దింపినట్టు మాకోసం ముంజలు కొట్టిపెట్టడం. ప్రతి తాటిముంజ ఒక చలివేంద్రంలాగా ఉంది. రోజా, సుధీర్ ఇలా తాటిముంజలు  చెట్టుకింద కూచుని ఇంతకుముందెప్పుడో తిన్నామని చెప్పారుగాని, నాతో సహా అందరికీ అది మొదటిసారి సరదాలానే ఉంది. వేసవి ఆ ముంజల్లో నింపిపెట్టిన ఆ తియ్యని చల్లని నీళ్ళు ఒళ్ళంతా, గుడ్డలంతా చిందుతుండగా, ఆ ముంజలు తింటూ ఉంటే పెదాలకీ, ముఖానికీ, చేతులకీ ఆ తునకలు అంటుకుపోతూండగా, మధ్యలో జోకులూ, నవ్వులూ మా అవస్థని మరింత దురవస్థగా మారుస్తూ ఉండగా, రోడ్డుమీంచి ఆ పొలాలకి అడ్డం పడి ఒక పిల్లవాణ్ణి తీసుకుని మిశ్రా మా దగ్గరకి వస్తూ కనబడ్డాడు. ఏదో అత్యవసరమైన పని ఉంటే తప్ప, ఆయన అంతగా మమ్మల్ని వెతుక్కుంటూ రాడుకదా అని ఒక క్షణం కంగారుపడ్డాం.

కాని ఆయన అల్లంత దూరం నుంచే ‘సేన్ గుప్తా నుంచి టెలిగ్రాం. డిలే రిగ్రెటెడ్, జాయినింగ్ బై ఎండ్ ఆఫ్ మే అని ఆ మెసేజి అక్కణ్ణుంచే గట్టిగా చదివి వినిపిస్తూ వచ్చాడు. ఆ మెసేజికి ఎలా ప్రతిస్పదించాలో అర్థం కాలేదు. మొత్తం మీద రెండు నెలలు డిలే అవుతున్నారు కాబట్టి ప్రాజెక్టు మరో రెండు నెలలు పొడిగిస్తాడా అని కొద్దిగా కంగారుగా అనిపించింది. ఆ మాటే అన్నాను మిశ్రాతో.

‘లేదు. ఆయన పొడిగించడానికి అవకాశం ఉండదు. ఎలాగైనా మే నెలాఖరుకి ప్రాజెక్టు పూర్తిచెయ్యకతప్పదు. ఆయన వచ్చేక రాప్ అప్ చేసేస్తాడు. కాకపోతే నేను ఫిఫ్టీంత్ కల్లా వెళ్ళిపోతాను, ఆయన ఎండ్ ఆఫ్ మే జాయిన్ అవుతాడు’ అని అన్నాడు.

మళ్ళా ‘అదీ ఒకందుకు మంచిదేలే, అప్పటికి మన సర్వే కూడా పూర్తయిపోతుంది’ అని కూడా  అన్నాడు డా.మిశ్రా.

ఆయన్ని కూడా తాటిముంజలు తినమని రాజు అడిగాడు, కాని, ఆ ఆదివారం నన్ను దగ్గరలో ఉన్న ఒక సంతకు తీసుకువెళ్దాం అనుకుంటున్నానని చెప్పాడు. రాగలిగితే తక్కినవాళ్ళని కూడా రమ్మన్నాడు.

దాంతో అందరం త్వరత్వరగా ఊళ్ళోకొచ్చి తొందరగా భోజనాలు చేసి సంతకు వెళ్ళడానికి సిద్ధమైపోయాం. మాకోసం ఆ రోజు జీపు పిలిపించాడు.

గిరిజన ప్రాంతంలో నేనొక సంత చూడటం అదే మొదటిసారి. చూడగానే నాకు అదొక రంగుల వేడుకలాగా అనిపించింది. వారం వారం జరిగే తిరనాళ్ళ లాగా కనిపించింది. కానీ ఆ రంగుల వెనక, ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో మిశ్రా దగ్గరుండి, ఒక్కొక్క అంగడినీ చూపిస్తూ మరీ వివరించాడు. తూనికలు, కొలతల దగ్గరనుంచీ, కల్తీ సరుకులు అమ్మడం దగ్గరనుంచి, చివరికి గిరిజనులకు అమ్మే టీనీళ్ళదాకా ప్రతి ఒక్కచోటా దోపిడీ ఎంత ఇన్ స్టిట్యూషనలైజ్ అయిపోయిందో వివరించాడు. రాజు అప్పటికి ఆ సంతలు ఎన్నోసార్లు చూసి ఉంటాడు. కాని రోజాకి, సుధీర్ కీ, నాకూ ఆ అనుభవం అంత తొందరగా డైజెస్ట్ కాలేదు. నాకు ఆ సాయంకాలానికి కడుపులో దేవేసినట్టయిపోయింది.

‘మొదటిసారి సంతకి వచ్చినవాళ్ళకి ఆ ఎండుచేపల వాసన కీ, పొగాకుకాడలమీంచీ, సారాదుకాణం మీంచి కొట్టే కంపుకీ కళ్ళు తిరక్కుండా ఉండదు’ అన్నాడు రాజు.

‘కాదు రాజూ, ఆ సంతలో డా.మిశ్రా చెప్పిన విషయాలకి నాకు తలతిరుగుతోంది. ఆ ట్రైబల్స్ ముఖ్యంగా ఆ సామంతాలు ఎంత ఇన్నొసెంటో కదా. వాళ్ళని ఎట్లా దోచుకుంటున్నారో చూసాక నాకు నాగరికత మీద నమ్మకం పోయింది’ అన్నాను.

తిరుగు ప్రయాణానికి జీపు ఎక్కబోతూ,  ఆ సంతపాకలనుంచి దూరంగా కనిపిస్తున్న ఆకుపచ్చని అడవినీ, నీలికెరటాల్లాంటి కొండల్నీ, నీలాకాశాన్నీ  చూసాను. ఆ సంతకీ, ఆ చుట్టూ ఉన్న లాండ్ స్కేప్ కీ  ఎంత ప్రయత్నించినా నాకు పొంతన కుదరలేదు.

జీపులో వస్తూ ఉండగా డా.మిశ్రాతో ‘సార్, మీరు ఐ ఏ ఎస్ పరీక్ష రాయకూడదా! మీలాంటివాళ్ళు అధికారులుగా వస్తేనన్నా వీళ్ళకి న్యాయం జరుగుతుందేమో’ అన్నాడు సుధీర్.

‘ఆయన ఇప్పటికే రెండుసార్లు రాసారు. ఇంక రాయకూడదనుకున్నారు’ అన్నాడు రాజు, సుధీర్ కి ఆ వివరాలు తెలియవని.

కాని డా.మిశ్రా సుధీర్ కి ఓపిగ్గా జవాబిచ్చాడు. ‘యెస్. ఒక ఉన్నతాధికారి ట్రైబల్ ఏరియాలో చాలా చెయ్యగలడు. ఇక్కడ ఉన్న ఇన్ జస్టిస్ ని ఎంతో కొంత అరికట్టగలడు. కాని ఒక ఐ ఏ ఎస్ అధికారి జీవితమంతా ట్రైబల్ ఏరియాలోనే పనిచెయ్యడం కుదరదు కదా. ఇక్కడ పనిచేసాక నెక్స్ట్ పోస్టింగ్ మునిసిపల్ అడ్మిన్సిట్రేషన్ లోనో లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ లోనో వేస్తారు. ఒక ఐ ఏ ఎస్ అధికారి మొత్తం సర్వీసులో మహా అయితే రెండుమూడేళ్ళ కన్నా ఎక్కువకాలం ట్రైబల్ ఏరియాలో పనిచేసే అవకాశం దొరకదు. అండ్, ద ప్రైస్ ఒన్ హేజ్ టు పే ఫర్ దట్? గవర్న్ మెంట్ జాబ్ కట్టిపడేస్తుంది. స్వేచ్ఛగా సంచరించడం ఎలానూ కుదరదు, కనీసం స్వేచ్ఛగా కూడా ఆలోంచించలేం. అదీకాక, గిరిజనుల సమస్యలకి ప్రభుత్వం ఇవ్వగల పరిష్కారాలకి కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి’ అని అన్నాడు.

‘మరి అందుకేనా ట్రైబల్ ఏరియాలో నక్సలైట్లు వస్తున్నారు? మరి వాళ్ళుండి కూడా ఇలాంటి దోపిడీ ఇక్కడ ఎలా కంటిన్యూ అవుతోంది?’ అని అడిగాడు సుధీర్. అతనికి ఒక యాంత్రొపాలజీ ప్రొఫెసరు ఇలా దొరకడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారీ అన్నట్టుగా ప్రశ్నలమీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు.

కాని డా.మిశ్రా అతనికి మళ్ళా ఓపిగ్గా జవాబిచ్చాడు. ‘నక్సలైట్ల ఎజెండా కేవలం ఎక్స్ ప్లాయిటేషన్ ని అరికట్టడమే కాదు, వాళ్ళ దృష్టిలో వాళ్లదొక దీర్ఘకాలికపోరాటం. అంతిమంగా రాజ్యాధికారం మీదనే వాళ్ళ దృష్టి. ఈలోపు ఈ పీడనని తాము ఏదో ఒక రూపంలో చెక్ చేస్తూంటారుగాని, దీన్ని రూట్స్ చాలా పెద్దవి, చాలా డీప్ కూడా. ఇది వాళ్ళొక్కళ్ళూ పరిష్కరించగలిగే సమస్యకాదు, అలాగని కేవలం ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటీ కూడా సాల్వ్ చెయ్యగలిగే ఇష్యూస్ కూడా కాదు. అందుకే నేనేమంటానంటే, గిరిజన సమస్యల్ని తామొక్కళ్ళే, తాము మాత్రమే పరిష్కరించగలమని ఎవరన్నా వాళ్ళంతా కూడా  ఎక్స్ట్రీ మిస్టులే’ అని అన్నాడు గంభీరంగా.

ఇంకా చెప్పడం కొనసాగించాడు.

‘ట్రైబల్ ఇష్యూస్ కి మూడు డైమన్షన్స్ ఉన్నాయి. మొదటిది, ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ గవర్నెన్స్. ఇది పేరుకి గవర్నరు పేరుమీద జరుగుతుంది కాని, నిజానికి లోయెస్ట్ ఫంక్షనరీ ఇన్ ద సిస్టమ్ ఈజ్ ద డీ ఫాక్టో గవర్నర్ లాగా ఉంటాడిక్కడ. అందుకే ట్రైబల ఏరియాస్ లో ప్రాబ్లెమ్స్స్ నిజంగా సాల్వ్ చెయ్యగలిగేది గ్రామాధికారులూ, ఫారెస్టు గార్డు, ఎలక్ట్రిసిటీ లైన్ మేను, పోలీస్ కానిస్టేబులూ- ఇలాంటివాళ్ళే. ఎందుకంటే సమస్యలు సృష్టించేదే వీళ్ళు కాబట్టి. దీనికి పరిష్కారమంటూ ఉంటే, గిరిజన ప్రాంతాల్లో పాలన గిరిజనుల చేతికి అప్పగించడమే. యు మస్ట్ హేవ్హె హర్డ్ అబౌట్ ద యాన్షియెంట్ విలేజ్ రిపబ్లిక్స్. నిజానికి బ్రిటిష్ వాడు రాకముందు ట్రైబల్ ఏరియా గవర్నెన్స్ ట్రైబల్స్ చేతుల్లోనే ఉండేది. అప్పుడు వాళ్లది ఒకరకమైన డైరక్ట్ డెమోక్రసీ. బ్రిటిష్ వాడు వచ్చాక ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ, వాళ్ళ డైరక్ట్ డెమోక్రసీ స్థానంలో ఇన్ డైరక్ట్ డెమోక్రసీ తీసుకొచ్చాడు. గిరిజన ప్రాంతాల్లో గవర్నెన్స్ ప్రాబ్లమ్స్స్ దాదాపుగా అన్నీ దానివల్ల వచ్చినవే’ అని అన్నాడు.

అప్పుడు క్షణం విరామం తీసుకుని ‘అందుకే, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, ఇండియాలో మహాత్మాగాంధీ చంపారన్ తో కాకుండా ఏదేనా గిరిజన ప్రాంతం నుంచి తన పోరాటం మొదలుపెట్టి ఉంటే ఎలా ఉండేదా అని. బహుశా మన జాతీయోద్యమ స్వరూప స్వభావాలే మారిపోయి ఉండేవి. ఎందుకంటే ట్రైబల్ మోడ్ ఆఫ్ గవర్నన్స్ కీ, గాంధియన్ స్వరాజ్ కీ మధ్య ఆట్టే తేడా లేదు’ అని కూడా అన్నాడు.

ఆ తర్వాత కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. అందరం నిశ్శబ్దంగా ఉన్నాం. కాని సుధీర్ ఒకటిరెండు సార్లు తటపటాయించి, ‘మొత్తం మూడు డైమన్షన్స్ అన్నారు. ఇంకా రెండున్నాయి, మీరు చెప్తే వినాలని ఉంది. నేను అయిదేళ్ళుగా బాంకులో పనిచేస్తున్నాను. ఇంతకు ముందు చాలా సార్లు ఈ ఊరొచ్చానుగాని ఈ విషయాల గురించి మీలా ఇంత చక్కగా చెప్పేవాళ్ళెవరూ కనిపించలేదు’ అన్నాడు.

జీపులో ముందు సీటులో కూచున్న మిశ్రా తలవెనక్కి తిప్పి సుధీర్ ని చూసాడు. ఆ గిరిజన ప్రేమికి తనకు తారసపడిన మనిషి కూడా గిరిజనప్రేమి అయి ఉంటాడేమో అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోడానికి చూసినట్టు ఉంది ఆ చూపు.

‘వాటి  గురించి చాలా వివరంగా చెప్పాలి. నాట్ ఇన్ దిస్ బ్రీఫ్ ట్రిప్. బట్, బ్రాడ్ గా చెప్పాలంటే, మొదటిది డెవలప్ మెంట్. అందులో మళ్ళా రెండు  కాంపొనెంట్స్. ఒకటి ఏరియా డెవలప్ మెంట్. అంటే ఇన్ఫ్రా. రోడ్లు, కరెంటు, హౌసింగ్ లాంటివి. రెండోది ఇకనమిక్ డెవలప్మెంట్. గిరిజనుల జీవనోపాధుల్ని మెరుగుపర్చడం. వాళ్ళకి ఇప్పుడున్న రిసోర్సెస్ లో ప్రొడక్టివిటీ పెంచడం. ఇక రెండో డైమన్షన్ వాళ్ళ సోషల్ డెవల్ మెంట్, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్. అన్నిటికన్నా ముందు న్యూట్రిషన్, హెల్త్, ఎడ్యుకేషన్. ఎడుకేషన్ అంటే ఏదో హాస్టళ్ళు నడపడం కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ ట్రైబల్స్ దేశంలో ఎవరితోనైనా కంపీట్ చెయ్యగలిగేటట్టుగా ఉండాలి. అఫ్ కోర్స్, నేను చెప్తున్నా ఈ అంశాలన్నిటి గురించీ ఎన్నో డిబేట్స్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ ఎలా ఉండాలన్నదాని గురించి ఎవరి అభిప్రాయాలు వాళ్లకున్నాయి. బట్ నేనేమంటానంటే, ఏదైనా సరే, ట్రైబల్స్ ఛాయిస్ ప్రకారం ఉండాలి. దే షుడ్ బి ఎంపవర్డ్ ఎనఫ్ టు డిసైడ్ థింగ్స్ ఫర్ దెమ్‌సెల్వ్స్’ అని అన్నాడు.

ఆ జవాబు విన్నాక ఇంక సుధీర్ కూడా ఏమీ మాట్లాడలేదు. బ్రీఫ్  ట్రిప్ అని అంటున్నప్పుడు డా.మిశ్రా బహుశా మేం సంతకు వెళ్ళి తిరిగిరావడం గురించే అనిఉండవచ్చుగాని, నాకైతే, అసలు మేముగాని, ఆయన గాని ఆ ఊళ్ళో ఉండటానికి వచ్చిన ఆ నాలుగైదు వారాల ట్రిప్ సరిపోదు, ఆ అంశాల గురించి లోతుగా చర్చించుకోడానికి అనిపించింది.

మేము ఇంటికి వచ్చేసాక, ఆ సాయంకాలం మళ్ళా మా ఇంటిదగ్గర మరోసారి మిశ్రా గురించి పెద్ద చర్చే జరిగింది.

‘ఆయన్ని చూస్తుంటే బాగా తెలిసినవాడిలానే ఉన్నాడు’ అన్నాడు సుధీర్.

‘ఆయన చెప్పినదాన్నిబట్టి దండకారణ్యమంతా చూసాడు. ఒడిస్సానే కాదు, మధ్యప్రదేశ్, సౌత్ బీహార్ కూడా తిరిగానని చెప్పాడు’ అన్నాడు రాజు.

‘నాకు ఆయనతో మాట్లాడినప్పుడల్లా మన దేశంలోనే మనకు తెలియని భారతదేశం పరిచయమవుతూ ఉంటుంది’ అని అన్నాను. ఎంతసేపూ ఈ గిరిజనులకీ, ఈ గిరిజన ప్రాంతాలకీ, ఈ కుటుంబాలకీ ఏమి చెయ్యగలమా అనే ఆలోచిస్తుంటాడు. నేనొకసారి ఆయనతో భారతదేశం స్వతంత్రమయ్యాక గిరిజనుల జీవితాలు మెరుగవుతున్నాయి కదా అని అంటే, ఇప్పుడు ఈ ప్రాంతాలూ, ఈ సమాజాలూ సంధియుగంలో ప్రవేశించాయనీ, బ్రిటిష్ కాలంకన్నా కూడా ఇప్పుడే గిరిజనులు మరింత విషమపరిస్థితులు ఎదుర్కుంటున్నారనీ అన్నాడు’ అని అన్నాను.

‘యా. ఆయన చాలా ప్రాక్టికల్’ అన్నాడు రాజు.

‘నువ్వింతకుముందు కూడా ఈ మాటే అన్నావు రాజూ. డా.మిశ్రా ప్రాక్టికల్ అయితే సేన్ గుప్త ఏమిటి? ఆయన డ్రీమరా?’ అనడిగాను.

‘అంతే కదా, డా.సేన్ గుప్తాకి మనుషులే పట్టరు. ఎప్పుడూ తనలోకంలో తానుంటాడు. చెట్టూ, చేమా కనిపిస్తే చాలు, తక్కినవన్నీ మర్చిపోతాడు’ అన్నాడు రాజు. ‘ఆ అమ్మాయి పక్కనుండకపోతే అడవికి వెళ్ళినవాడు ఇంటికొస్తాడని కూడా నమంకం లేదు’ అని అన్నాడు నవ్వుతూ.

‘ఇది చాలా అన్యాయం రాజూ ‘అన్నాను ప్రొటెస్ట్ చేస్తూ. మా మాటలు వింటూ సూర్యనారాయణమూర్తిగారు కూడా అక్కడే కూచున్నారు, అరుగుమీద గోడకి ఆనుకుని. నేను లోపలకి వెళ్ళి, ఒక పిల్లో తెచ్చి ఆయనకిచ్చాను. బాక్ సపోర్ట్ ఉంటుందని.

అప్పుడు రాజుతో చెప్పడం మొదలుపెట్టాను:

‘నాకు తెలిసి ప్రొఫెసర్ సేన్ గుప్తాకీ, డా.మిశ్రా కీ మధ్య బేసిగ్గా ఏమీ తేడా లేదు. ఒకవేళ తేడా ఉందని మనం అనుకుంటే అదంతా వాళ్ళ కాలమానంలో తేడా మటుకే. ప్రొఫెసర్ సేన్ గుప్తా జియొలాజికల్ టైమ్ లో జీవిస్తాడు. ఆయన దృష్టిలో ఒక చెట్టుకి, ఒక రాయికి, ఒక సాలీడుకి మధ్య తేడా లేదు. తన కళ్ళముందు ఒక పచ్చని చెట్టు కూలిపోయినా కూడా ఆయన శోకించడు. ఎందుకని అడిగావనుకో,  రెండుకోట్ల సంవత్సరాల తర్వాత ఆ చెట్టు శిలగా మారుతుందేమో ఎవరికి తెలుసు అనడుగుతాడు.   దృశ్యప్రపంచంలో ప్రతీదీ అనుక్షణం పుడుతూ, అదృశ్యమవుతూ ఉంటుందనీ, అదృశ్యమైన ప్రతీదీ, తిరిగి రూపు మార్చుకుని మరో చరాచరంగా సృష్టిలో తన వంతు పాత్ర తను పోషిస్తూ ఉంటుందనీ నమ్ముతాడు. చరాచరాలన్నిటిమధ్యా ఒక కమ్యూనికేషన్ వెబ్ లాంటిది ఉందంటాడు.  ఎవరో కవి అన్నాడట, ఏదో ఒక నక్షత్రాన్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు ఏ ఒక్క పువ్వుని కూడా తెంపలేవని. ఆ మాట తనకి గైడింగ్ ప్రిన్సిపుల్ అని ప్రొఫెసరు చెప్పాడు. నేననుకుంటాను, ఆయన్ని పోల్చాలంటే, మనం బహుశా ఇదిగో ఈ ఊళ్ళో ఉండే కొండరెడ్డితో పోల్చగలం. లేకపోతే, ఎవరేనా ఒక బుద్ధిస్ట్ మాంక్ తో పోల్చగలం.అంతే’ అని అన్నాను.

‘మరి డా.మిశ్రా సంగతేమిటి?’ – రాజు కాదు, ఈ ప్రశ్న, సూర్యనారాయణమూర్తిగారి నుంచి వచ్చింది. నేను ఒక క్షణం ఆశ్చర్యపోయాను. ఆయన అంత కీన్ గా నా మాటలు వింటున్నారనుకోలేదు. నాకు కొంత సంతోషంగానూ, ఒకింత గర్వంగానూ కూడా అనిపించింది. నేను ఇక్కడకు వచ్చిన అయిదారునెలల్లో మొదటిసారి ఆయన నామాటలు వింటున్నారు.

‘మిశ్రా గారు సోషియలాజికల్ టైమ్‌లో జీవిస్తాడు మాష్టారూ. సేన్ గుప్త చూస్తున్న స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టన్స్ నాచురల్ వరల్డ్ కి చెందింది. మిశ్రా కూడా అదే స్ట్రగుల్ చూస్తున్నాడు కాని హూమన్ సొసైటీలో చూస్తున్నాడు. అయితే, సేన్ గుప్త ఎవరి పక్షం తీసుకోడు, కాని డా.మిశ్రా  గిరిజనుల పక్షాన నిలబడటం మన బాధ్యత అంటాడు. అది మనం అర్జెంటు గా చెయ్యవలసిన పని కూడా అంటాడు. అదొక్కటే తేడా. కాని ఒకటి మాత్రం చెప్పగలను. ఇద్దరూ కూడా మన కంటికి కనిపించేదే ట్రూత్ అనరు. ఇద్దరూ కూడా డ్రీమ్ టైమ్ లో జీవిస్తుంటారు. కాని ప్రొఫెసరు సేన్ గుప్త డ్రీమ్ లో సృష్టి, స్థితి, లయాలమధ్య తేడా లేదు. కాని అదే మిశ్రా అయితే మీరు దేన్ని అసత్యమన్నా ఒప్పుకుంటాడుగాని, ఇన్ జస్టిస్ ని అసత్యం అంటే  మాత్రం ఒప్పుకోడు. దాంతో ఏదో ఒక రకంగా తలపడాలంటాడు. బట్, అలా తలపడటానికి కావలసిన ఎనర్జీ మాత్రం తనడ్రీమ్స్ నుంచే డ్రా చేసుకుంటాడు’ అని అన్నాను.

‘అదే, ఆ గుణం వల్లనే నేను ఆయన్ని ప్రాక్టికల్ అంటున్నాను ‘అన్నాడు రాజు. ‘నీకో సంగతి చెప్పనా? మొన్నొక రాత్రి మేమిద్దరం చాపరాయి మీద గడిపేం. అక్కడ బీడీ ఆకులు సేకరించే వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాం. బీడీ ఆకుల కట్టకి అప్పుడిస్తున్న రేటుకన్నా కనీసం రెండు పైసలు అదనంగా పెంచితే ఆ గిరిజన కుటుంబాలకి ఆర్థికంగా ఎంత లబ్ధి చేకూరగలదో మిశ్రా అక్కడికక్కడే లెక్కలు వేసాడు. ఆ బీడీ ఆకుల కంట్రాక్టర్లతో  రేటు పెంచడం గురిచిం మాట్లాడేడు. ఆ సంగతి మర్నాడు జోసెఫ్ గారికి తెలిసింది. ఆయన కంగారు పడ్డాడు. ఫారెస్టు డిపార్ట్ మెంట్ లో పై అధికారుల దృష్టికి వెళ్తే తనకి మాట వస్తుందని భయపడ్డాడు. అటువంటి మనిషికి తాను ఆశ్రయం ఇవ్వవలసి వచ్చిందే అని చిరాకు కూడా పడ్డాడట. ఆ సంగతి నేను మిశ్రా కి చెప్పాను. చెప్పగానే ఏం చేసాడో తెలుసా, డైరక్టుగా నన్ను తీసుకుని జోసెఫ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ముందు ఆయనకి ఏదన్నా ఇబ్బంది కలిగితే క్షమించమని అడిగాడు. అప్పుడు తాను వేసిన లెక్కలన్నీ చెప్పాడు. బీడీ ఆకుల రేట్లమీద ట్రైబల్స్ లో అన్ రెస్ట్ పెరుగుతోందనీ, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్ మెంటు పట్టించుకోకపోతే ముందుముందు అది పెద్ద సమస్యగా మారుతుందనీ, అందుకనే తాను ఆ కాంట్రాక్టర్లని హెచ్చరించాననీ చెప్పాడు. మీ డిపార్ట్ మెంట్ హయ్యర్ అఫిషియల్స్ కి చెప్పమంటే పోయి చెప్తాను అని కూడా అన్నాడు.  ఇంకేముంది? జోసెఫ్ గారు ఆయన్ని కూచోమని టీ ఇచ్చి నవ్వుతూ మాట్లాడి థాంక్స్ చెప్పి మరీ పంపించాడు’.

‘అటువంటి మనిషి మీద ఎలా కోపం తెచ్చుకోగలం?’ అని కూడా అన్నాట్ట, ఇదుగో మన రోజా చెప్పింది ఆ తర్వాత’ అని చెప్పాడు రాజు.

మా మాటలకి అక్కడ ఎక్కువగా చలించింది సూర్యనారాయణమూర్తిగారే. ఆయన రాజు మాటలు విన్నాక,

‘నేనీ ప్రాంతాల్లో ఇరవైఏళ్ళ బట్టీ పనిచేస్తున్నాను. కాని ఈ సమస్యల గురించి ఎవరూ ఇలా మాట్లాడుకోడం ఇంతదాకా వినలేదు. మామూలుగానే చదువుకున్నవాళ్ళంటే నాకెంతో గౌరవం. కానీ చదువుకున్నవాళ్ళు ఇలాంటి చక్కటి విషయాలు, నలుగురి మంచికోరే విషయాలు మాట్లాడుకుంటున్నారంటే, మీ అందరిమీదా నాకు మరింత గౌరవం కలుగుతోంది’ అని తన తమ్ముడి కేసి చూస్తూ ‘ ఒరే, ఆడపిల్లలు చదువుకుని ఊళ్ళేలతారా అనడుగుతారు మనవాళ్ళు. చూడు, ఆ అమ్మాయి, ఇక్కడికొచ్చి నాలుగునెలలు కాలేదు, అంత పెద్ద పెద్ద ప్రొఫెసర్ల గురించి ఎంత బాగా చెప్పింది. ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా చెప్పగలుగుతుంది’ అని అన్నాడు.

సుధీర తన కళ్లల్లోంచి ప్రశంస కురిపిస్తూ ‘మా చెల్లాయిలాంటి స్కాలర్ ని నేనిప్పటిదాకా చూడలేదు’ అన్నాడు.

‘అంతా హేపీగా ఉన్నారుకాబట్టి ఈ సందర్భంగా నా ప్రపోజల్ ఏమిటంటే ఈ పున్నమికి మనమంతా సినిమాకి వెళ్దాం-‘

అని చిన్న సస్పెన్స్ పెట్టినట్టు అరక్షణం ఆగి అప్పుడు ‘బస్సు మీద కాదు, రెండెడ్ల బండిమీద’ అన్నాడు రాజు.

‘ఎడ్లబండిమీదనా? ఎన్నిరోజులు ప్రయాణం ?’ అనడిగింది రోజా. ఆ బార్బీ ప్రశ్నలో వ్యంగ్యం లేదు, అమాయికత్వమే ఉంది.

‘ఎన్ని రోజులా? సాయంకాలం బయల్దేరతాం. రెండో ఆట చూస్తాం. సినిమా అయిపోగానే బయల్దేరతాం. తెల్లవారకుండా ఇంటికొచ్చేస్తాం. మీ ఇంట్లో నేనొచ్చి అడుగుతాలే పర్మిషను’ అన్నాడు రాజు.

పున్నమిరాత్రి రెండెడ్లబండిలో ప్రయాణం! నా మనసు అప్పటికే చాపరాయిమీంచి వెలగచెట్టు కూడా దాటేసింది!

25-4-2023

12 Replies to “ఆ వెన్నెల రాత్రులు-21”

  1. బాగా చదువుకుని ఊళ్ళేలగల intelligent woman character perspective లోంచీ ఆ అడివినీ, ఆ ఊరినీ, ఆ ఊళ్ళో మనుషుల్నీ, వాళ్ళ బాగోగుల్నీ, బాధల్నీ పరిచయం చేస్తూ కథని ముందుకి నడిపిస్తున్నారు. Eager to know what happens next in the story. 🙏🏽

  2. నాకు తెలిసి ప్రొఫెసర్ సేన్ గుప్తాకీ, డా.మిశ్రా కీ మధ్య బేసిగ్గా ఏమీ తేడా లేదు. ఒకవేళ తేడా ఉందని మనం అనుకుంటే అదంతా వాళ్ళ కాలమానంలో తేడా మటుకే. ప్రొఫెసర్ సేన్ గుప్తా జియొలాజికల్ టైమ్ లో జీవిస్తాడు. ఆయన దృష్టిలో ఒక చెట్టుకి, ఒక రాయికి, ఒక సాలీడుకి మధ్య తేడా లేదు. తన కళ్ళముందు ఒక పచ్చని చెట్టు కూలిపోయినా కూడా ఆయన శోకించడు.

    మిశ్రా గారు సోషియలాజికల్ టైమ్‌లో జీవిస్తాడు మాష్టారూ. సేన్ గుప్త చూస్తున్న స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టన్స్ నాచురల్ వరల్డ్ కి చెందింది. మిశ్రా కూడా అదే స్ట్రగుల్ చూస్తున్నాడు కాని హూమన్ సొసైటీలో చూస్తున్నాడు. అయితే, సేన్ గుప్త ఎవరి పక్షం తీసుకోడు, కాని డా.మిశ్రా గిరిజనుల పక్షాన నిలబడటం మన బాధ్యత అంటాడు. అది మనం అర్జెంటు గా చెయ్యవలసిన పని కూడా అంటాడు. అదొక్కటే తేడా.

    కాని ఒకటి మాత్రం చెప్పగలను. ఇద్దరూ కూడా మన కంటికి కనిపించేదే ట్రూత్ అనరు. ఇద్దరూ కూడా డ్రీమ్ టైమ్ లో జీవిస్తుంటారు. కాని ప్రొఫెసరు సేన్ గుప్త డ్రీమ్ లో సృష్టి, స్థితి, లయాలమధ్య తేడా లేదు. కాని అదే మిశ్రా అయితే మీరు దేన్ని అసత్యమన్నా ఒప్పుకుంటాడుగాని, ఇన్ జస్టిస్ ని అసత్యం అంటే మాత్రం ఒప్పుకోడు. దాంతో ఏదో ఒక రకంగా తలపడాలంటాడు. బట్, అలా తలపడటానికి కావలసిన ఎనర్జీ మాత్రం తనడ్రీమ్స్ నుంచే డ్రా చేసుకుంటాడు

    చినవీరభడ్రుడు గారు.. పైన మీరు జియోలాజికల్ ప్లేన్ కి సోషియోలాజికల్ ప్లేన్ కి మధ్య గల భేదాబేధాలని క్లుప్తీకరించిన తీరు అద్భుతం.. ఒక పాఠకుడు/రాలు దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో/కుందో వివరించి చెప్పగలిగితే అది ఒక గ్రంథమే అవుతుంది. నేను ఉదహరించిన చివరిభాగం మీ ఈ వెన్నెల రాత్రుల 21 వ భాగానికి మకుటాయమానంగా సూచించడం ఎంతో సముచితం.. మీ రచనాశైలి, మీ ఆలోచనా పటిమ, అవగాహనా సరళి, విషయ పరిజ్ఞానం, సామాజిక దృక్పథం అంతా మిశ్రా సేన్గుప్తా ల మిశ్రమ మానవీయ కోణం లో ప్రతిరోజూ ఈ వెన్నెల రాత్రుల ద్వారా అమృతం లా కురిపిస్తూ పాఠకుల్ని తడిపి ముద్ద చేసేస్తున్నారు.. ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత అందమైన రచన చదివే అదృష్టం లభిస్తుందో.. ఇప్పటివరకూ ఆస్వాదించిన గిరివెన్నెల అనుభవాల మెమొరీలని నెమరు వేస్తూ తరువాత భాగం కోసం ఎదురు చూస్తున్న సగటు పాఠకుడిని.. ఇంతకన్నా నా అలౌకిక అవ్యక్త ఆనందాన్ని వ్యక్త పరిచ లేకపోతున్నా

    1. మీ స్పందనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ వంటి సహృదయులు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వారు ఈ రచనను చదువుతున్నారన్నది రచయితకు ఎంతో నైతిక బలాన్ని సమకూరుస్తున్నది.

  3. మిశ్రా,సేన్ గుప్తా మా ఇంట్లో తాతగారు,మామయ్యలు,అమ్మా వేసవి సెలవుల్లో మాట్లాడుకున్న సంభాషణలను ఇలా పుస్తకీకరించినట్టుగా ఉందండి.మీకు జేజేలు.
    ఈ మాత్రం సీరియస్ విషయాలను లోతుగా చర్చించే వాతావరణాన్ని తూట్లు పొడిచిన దైనందిన జీవితపు ఉరుకులు,పరుగులు, సాంకేతికత, ఎంజాయ్ చేయడం అనే కాన్సెప్ట్ లకు నా బాధాపూర్వక నమస్సులు.
    మీ కలం మనుషులకు మళ్ళీ మాటలు నేర్పుతోందండి.

  4.  మీ రచనాశైలి పాఠకులను ఉత్కంఠతతో చదివిస్తుంది. మీ ఆలోచన లోతైనది,విస్తృతమైనది. అవగాహన అద్భుతం.విషయ పరిజ్ఞానం, సామాజిక దృక్పథం,ఎంతో కొంత సేవ చేయాలనే మీ జిజ్ఞాశ మమ్మల్ని కట్టి పడేస్తుంది ఆసాంతం చదివే వరకు.
    మీరు పని చేసిన దగ్గర మనుషులకు,మీ రచనలను చదివే పాఠకులకు మీరొక వరం.
    ఇది మీకు భగవత్ వరం.
    వయసుతో నిమిత్తం లేకుండా అవ్యక్తానుగత ఛైతన్యోత్సాహాన్ని కలిగిస్తున్న మీకు అభినందన ధన్యవాదాలు.

  5. ‘నాకు ఆయనతో మాట్లాడినప్పుడల్లా మన దేశంలోనే మనకు తెలియని భారతదేశం పరిచయమవుతూ ఉంటుంది’ అని అన్నాను. ఎంతసేపూ ఈ గిరిజనులకీ, ఈ గిరిజన ప్రాంతాలకీ, ఈ కుటుంబాలకీ ఏమి చెయ్యగలమా అనే ఆలోచిస్తుంటాడు. నేనొకసారి ఆయనతో భారతదేశం స్వతంత్రమయ్యాక గిరిజనుల జీవితాలు మెరుగవుతున్నాయి కదా అని అంటే, ఇప్పుడు ఈ ప్రాంతాలూ, ఈ సమాజాలూ సంధియుగంలో ప్రవేశించాయనీ, బ్రిటిష్ కాలంకన్నా కూడా ఇప్పుడే గిరిజనులు మరింత విషమపరిస్థితులు ఎదుర్కుంటున్నారనీ అన్నాడు’ అని అన్నాను.
    నిజమే నలభై ఏళ్లు గిరిజనుల జిల్లాలో పని చేసినా వారి గురించి నాకే ఏమీ తెలియని స్థితి ఉందంటే నగరాల్లో ఉండే వారి సంగతి ఏమి చెప్పగలం.
    ఇది మరో అమృత సంతానం వంటి నవల . వారి జీవితాలతో ఆత్మాలింగనంచేసుకున్న మీ వంటి సుమనస్కుల హృదయావిష్కరణం ఇది.
    విమల మిశ్రా , గుప్తాలను విశ్లేషించిన తీరును సూర్యనారాయణ మూర్తి ద్వారా స్పందన చెప్పడం చాలా బాగుంది.

Leave a Reply

%d bloggers like this: