ఆ వెన్నెల రాత్రులు-20

Image design: Mallika Pulagurtha

బడికి కొత్త గూడు రావడంతో రోజూ రామకోవెల్లో నడిచే పాఠాలు ఆగిపోయేయి. ఆ తర్వాత సెలవులు మొదలయ్యాయి కూడా. మా సర్వే వేగం పుంజుకుంది. ఆ చిన్న ఊళ్ళో ఎన్ని సముద్రాలున్నాయి అనిపించింది ముప్ఫై నలభై కుటుంబాల సర్వే పూర్తిచేసాక. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. కాని అన్ని ఇళ్లల్లోనూ సమానంగా ఉన్నది పేదరికమే. అప్పటికింకా కిలో రెండు రూపాయలబియ్యం పథకం మొదలుకాలేదు. ఐ ఆర్ డి పి పథకం అప్పుడప్పుడే మొదలవుతోంది. ఐ టి డి ఏ జిల్లా కేంద్రం నుంచి రంపచోడవరం మార్చేరుగాని ఏ పథకాలు గిరిజనులకి ఆర్థిక భద్రతా, ఆహార భద్రతా సమకూరుస్తాయో ప్రభుత్వంఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆ ఊళ్ళో గ్రామదేవత గుడి దాటి రోడ్డు మలుపు తిరిగే చోట కొన్నేళ్ళ కిందట ఒక పాలకేంద్రం నడించిందట. సి.వి.కృష్ణారావు అనే ప్రాజెక్టు అధికారి కొందరు గిరిజన మహిళల్ని సమీకరించి ఆ కేంద్రం తెరిపించాడట. దానికి ‘క్షీరాబ్ధి’ అని పేరుపెట్టాడట.

కొన్నిసార్లు మనం మొత్తం కల వినక్కర్లేదు. ఒక్క మాట వినబడితే చాలు, కల మొత్తం వర్ణచిత్రంలాగా కళ్ళముందు ప్రత్యక్షం కాగలదు. ‘క్షీరాబ్ధి’ అటువంటి మాట అనిపించింది. అటువంటి అధికారిని తానెప్పుడూ చూడలేదని రాజు చెప్పాడు. మామూలుగా ఆ ఊరికి అధికారులు రావడమే తక్కువ. ఎప్పుడేనా వచ్చే అధికారుల్లో అతి పెద్ద అధికారి అడ్డతీగల్లో ఉండే తహశీల్దారు మాత్రమే. అతను కూడా డిజిగ్నేషనుకి తహశీల్దారే కాని, సాధారణంగా డిప్యూటీ తహశీల్దారే అయి ఉండేవాడట. వాళ్ళు చాలా సార్లు దగ్గరగా చూసే అధికారి అంటూ ఉంటే అది ఆరై అని పిలిచే రెవెన్యూ ఇన్ స్పెక్టర్. ఏ అధికారి వచ్చినా విలేజి చావిడి దగ్గరే దిగుతాడట. ఆ వచ్చినాయన గంటో, రెండు గంటలో ఉండి వెళ్ళేదాకా ఊరంతా అరికాళ్లకింద మంటలు పుడుతూనే ఉండేవట.

అలాంటి ఊళ్ళోకి కృష్ణారావు గారు మలయమారుతంలాగా అడుగుపెట్టారని చెప్తాడు రాజు. ఆయన ఆ పొలంగట్లమీద కొండరెడ్డి మహిళల్తో కూచుని ఆ పాలకేంద్రం ఎలా పెట్టాలో, ఎలా నడపాలో మాట్లాడేవాడట. ‘సీతమ్మా బావున్నావా?’, ‘గంగమ్మా రా ఇలా వచ్చి కూచో’, ‘చిలకమ్మా నీ పిల్లలేం చేస్తున్నారు?’, ‘లక్ష్మమ్మా మీ ఆయనకి ఒంట్లో ఎలా ఉంది’- ప్రతి ఒక్కరి పేరూ ఆయనకి గుర్తేనట. ప్రతి ఒక్కర్నీ పేరుపేరునా పలకరించేవాడట.

మా సర్వేకోసం డా.మిశ్రా సేకరించిన హౌస్ హోల్డ్స్ డాటా దాదాపుగా నిర్దుష్టంగా ఉంది. అంతకు ముందు ఏడాదే పార్లమెంటు ఎలక్షన్లు జరిగి ఉండటంతో ఎలక్టొరల్ జాబితాలు సవరించారు కాబట్టి అక్కడక్కడా ఒకటి రెండు కుటుంబాలు తప్ప దాదాపుగా అన్నీ ఆ జాబితాలో ఉన్నాయి. పొద్దున్నే ఇంకా ఎండ ముదరకముందే ఇంటింటికీ వెళ్ళి ఆ కుటుంబాల్తో మాట్లాడటంతో అది సర్వే కన్నా కూడా వాళ్ళ కష్టసుఖాల పరామర్శగానే ఎక్కువ అనిపించేది.

నాకు ఆ ఊరు వెళ్లాక అప్పటికే రెండు లాండ్‌ స్కేప్‌ లు పరిచయమయ్యాయి. అడవి, కొండలు, ఆ నిర్జన పూర్వాహ్ణాలూ-అదొక లాండ్‌ స్కేప్‌. పూర్తి వైల్డర్‌ నెస్‌.  ప్రొఫెసర్‌ సేన్‌ గుప్త దాని తలుపులు బార్లా తెరిచి నన్ను ఆ అలౌకిక లోకంలోకి ఆహ్వానించేడు. మరొకవైపు ఊరూ, ఇళ్ళూ, వీథులూ, పొలాలూ, తోటలూ, మనుషులూ ఉండే మరొక లాండ్‌ స్కేప్‌. దీన్ని రాజు నెమ్మది నెమ్మదిగా నాకు పరిచయం చేస్తూ వచ్చాడు. మనుషుల్లేని భీకర సౌందర్యం ఒకవైపూ, మనుష్యసంచారంతో సంచలించే గ్రామజీవితం మరొకవైపూ- ఈ రెండూ నన్ను చెరొకపక్కకీ లాగుతుండేవని కూడా అర్థమయింది. అడవికి వెళ్ళినప్పుడు ఆ కొండల ముందు నిల్చున్నప్పుడు, సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ యుగాలుగా వాటితో మాటాడుతున్న సంభాషణల్ని ఆ శిలాక్షరాల్లో చదివి సేన్‌ గుప్త చెప్తూ ఉంటే రోజూ ఒక పొయెట్రీ క్లాస్‌ వింటున్నట్టు ఉండేది. మరొకవైపు ఆ సాయంకాలాల్లో ఆ పొలాలమ్మట, ఆ వీథుల్లో, ఆ ఏటి ఒడ్డున తిరుగుతుంటే పొద్దున్న విన్న కావ్యపాఠం మళ్ళా నలుగురు మిత్రుల్తో కూచుని చర్చించు కున్నట్టు ఉండేది. ఆ రెండూ వేరువేరు లాండ్‌ స్కేప్‌ లు కాదనీ, ఒకదానికొకటి పూరకాలనీ ఎందుకో నాకు నేను రోజూ బలంగా చెప్పుకుని నమ్మించుకునేదాన్ని.

ఇప్పుడు డా.మిశ్రా వల్ల నాకు మూడవ లాండ్ స్కేప్ పరిచయమైంది. ఇది చెట్లూ, చేమల్తోనూ, పొలాలూ, వెన్నెల్తోనూ నిండి ఉన్న ప్రకృతిదృశ్యం కాదు. సజీవులైన మనుషుల ప్రపంచం. రక్తమాసాలున్న మనుషుల ప్రపంచం. నవ్వులూ, కన్నీళ్ళు నిండి ఉన్న ప్రపంచం. మొదట్లో రెండు రోజులు ఆ ఇళ్ళచుట్టూ తిరిగి, ఆ పేదరికాన్నీ, ఆహారలేమినీ, ఆ మాల్ న్యూట్రిషన్ నీ అంత దగ్గరగా చూడగానే నాకు కళ్ళు తిరిగినంతపనైంది. అన్ని నెలలుగా నేనూ వాళ్ళూ ఒకే ఊళ్ళో ఉన్నా కూడా ఎప్పుడూ ఒక్కరి ఇంట్లో కూడా అడుగుపెట్టింది లేదు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు- అవి ఎంత సరళమైన సమస్యలు!- కాని వాటికి ఏ ఒక్క పరిష్కారం గురించి ఆలోచించినా ఆ చర్చ ఎంత సంక్లిష్టంగా మారిపోయేది! ఇంటి వెనక ఇల్లు తలుపు తడుతూ ఉన్నప్పుడు నాకు ఆ కొండలోయలో ఆ వెన్నెల రాత్రి వాళ్ళ నాట్యం చూడ్డానికి వచ్చిన దేవతలు వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా వస్తే ఎంత బాగుణ్ణు అనిపించేది. వాళ్ళ సంస్కృతి గురించి మాట్లాడటం కన్నా ముందు వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించడం అత్యవసరం అని డా.మిశ్రా ఎందుకు మొత్తుకుంటున్నాడో అర్థమయింది.

మేము సర్వే మొదలుపెట్టగానే చైత్రమాసం గడిచిపోయి వైశాఖం మొదలయ్యింది. ఒకప్పుడు చైత్రమాసమంతా కొండరెడ్లకు ఆటపాటల పండగ. ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టడం కూడా నిషిద్ధంగా గడిచేవట ఆ రోజులు. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి కొమ్ములొస్తాయని చెప్పుకునేవారట. ఆ నెలంతా ఆడవాళ్లదే రాజ్యం. ఆ నెల గడిచి వైశాఖం మొదలవుతూనే పొలం పనులు మొదలుపెట్టే రోజులు మొదలైనట్టు.

ఒక సాయంకాలం డా.మిశ్రా నాతో ‘చూడండి, గంగాలమ్మ పండగ మొదలవుతుంది. మీరు కొండరెడ్డి కల్చర్ గురించి తెలుసుకోవాలనుకున్నారు కదా. ఈ పండగ దగ్గరనుంచీ చూడండి. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు’ అన్నాడు.

ఆ పండగ నాలుగురోజులపండగ. రామనవమిని మించిన రంగుల పండగ. రామనవమి- కోవెలదగ్గర, పందిరికింద జరిగిన పండగ. గంగాలమ్మ పండగ ఆకాశం పందిరిగా భూదేవి వేదికగా ఊరంతా ప్రతి ఇంటా జరిగిన పండగ. అమావాస్య వెళ్లగానే ముహూర్తం పెట్టుకున్నారు. ఊరిమధ్య రోడ్డు పక్కనున్న చింతచెట్టు కింద గంగాలమ్మ దిగడానికి విడిది ఏర్పాటు చేసారు. ఈతాకులతో చిన్న పందిరి వేసారు. ఆ పందిరికి అలంకారంగా ఎర్రటిపూలతో ధగధగలాడుతున్న తురాయికొమ్మలు కట్టారు. పందిరిపైన కూడా తురాయిపూలు పరిచారు. ఆ పక్కనొక ఉయ్యాల కట్టారు. రెండు తాడిచెట్ల నిలువుండే రాటలు పాతి వాటికి మోకు కట్టారు. ఆ మోకుటుయ్యాలమీద కూచోడానికి మధ్యలో ఒక బల్లచెక్కకూడా అమర్చారు.

ఒక ఘటం తయారుచేసి అందులో పసుపు, కుంకుమ, బియ్యం, అరిసెలు ఇంకా ఏవేవో వేసి ఆ చెట్టు మొదట్లో అమ్మవారిని ప్రతిష్టించారు. ఎన్నో కొండరెడ్ల కుటుంబాలు తమ ఇళ్ళనుంచి ఐరేణి కడవలు తీసుకొచ్చారు.ఒక కన్నెపిల్లను అక్కడికి వేడుకతో ఆహ్వానించేరు. ఆమె కొత్త వస్త్రాలు ధరించింది. నుదుట కుంకుమ బొట్టు. జడలో పాలపూలు, తురాయిపూలు. ఆమె ఆ విడిది దగ్గరకు రాగానే బాజాలు మోగించారు. పిల్లంగోవి ఊదారు. కొండరెడ్ల పూజారి ఆమెకు నమస్కారం చేసాడు. మంత్రాలు చదివేడు. అప్పుడు ఆ ఘటాన్ని ఆమె నెత్తిన పెట్టాడు. బాజాలచప్పుడు మధ్య, పిల్లంగోవి రాగాల మధ్య ఆమెని ఉయ్యాల్లో కూచోబెట్టారు. మూడు సార్లు ఊయెలూపేరు. అప్పుడు ఆమె తన పుట్టింటికి బయల్దేరింది. ఆమె వెంట పూజారితో పాటు మొత్తం గ్రామస్థులంతా కదిలారు.

తన ఇంటికి వెళ్ళాక ఆమెకి స్నానం చేయించి మళ్లా కొత్త వస్త్రాలు కట్టారు. నెత్తిన ఘటం పెట్టారు. ఆమె తన ఇంటినుంచి ఒక్కొక్క ఇంటికీ బయల్దేరింది. ఆమె వెనక గోనెసంచులు, కుండలు, కడవలు పట్టుకుని పూజారి వర్గం బయల్దేరారు. మరికొందరు స్త్రీలు నెత్తిన ఐరేణి కడవల్తో ఆమెని అనుసరించారు. ఆమె నడిచినంతసేపూ బాజాలు మోగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద తాళాలు మోగిస్తూ ఉన్నారు. ఒకతను నెమలీకల కట్టతో ఆమెకి వింజామర వీస్తూ ఉన్నాడు. పిల్లంగోవి రాగాలతీగలు చుట్టచుడుతూనే ఉంది. ఆమె ఏ ఇంటిదగ్గర ఆగితే అక్కడ ఆ ఇంటివారు ఆమెకు నమస్కారంతో స్వాగతం పలికేరు. తమ ఇంట్లోంచి బియ్యమో, పప్పులో, బెల్లమో ఏవో ఒకటి ఆ సంచుల్లో పోస్తూ ఉన్నారు. అలా ఆమె ఆ మొదటిరోజు తిరగగలిగినన్ని ఇళ్ళు తిరుగుతూనే ఉంది.

ఈలోపు ఆమె ఊగి వెళ్ళిన ఊయెల మీద ఊగడానికి యువతీయువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. కొందరు బల్లమీద కూచుని ఊగేరు. కొందరు నిలబడి ఊగేరు. నిలబడి ఊగినప్పుడు ఒకరిద్దరు ఆ ఉయ్యెల లాగగలిగినంత వెనక్కి లాగి వదిలిపెట్టేవారు. ఆ ఉయ్యెలమీద నిలబడ్డవాళ్ళు ఆకాశాన్ని అంటుకుంటున్నారా అన్నంత పైకెగిరేవారు. చూసేవాళ్ళకే కళ్ళు తిరిగేటంత ఎత్తుకి ఎగిరేవారు. ఇక ఆ తరువాత మరింత ఆసక్తికరమైన దృశ్యం ప్రత్యక్షమయ్యేది. ఆ ఉయ్యెల మీద ఒకరికొకరు ఎదురెదురుగా ఇద్దరు నిల్చునేవారు. ఆ ఇద్దరూ కూడా అంత ఎత్తుకీ ఉయ్యెలలూగేవారు. కొన్నిసార్లు ఆ ఇద్దరూ మగవాళ్ళు, కొన్నిసార్లు ఆ ఇద్దరూ ఆడవాళ్ళు, ఒక్కొక్కసారి ఆ ఇద్దరూ, ఒక మగ, ఒక ఆడ పడుచుజంటలు. ఆ పండగ మూడురోజులూ ఆ ఉయ్యెల నింగినీ నేలనీ కలిపుతూనే ఉండింది. పండగ అయిపోయేక కూడా పున్నమి రాత్రి దాకా ఆ ఉయ్యెలని అలానే ఉంచేరు. ఆ వెన్నెల రాత్రుళ్ళలో వాళ్ళతో పాటు చంద్రుడు కూడా కిందకీ, మీదకీ ఊగేవాడు.

మూడో రోజు సాయంకాలానికి గంగాలమ్మకి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. ఆ విడిది ఖాలీ చేసారు. ఆ ఘటాన్ని పూజారి ఆ చెట్టుమొదటనుంచి తీసి శుభ్రం చేసి ఇంటికి పట్టుకువెళ్ళిపోయాడు. కాని ఊళ్ళో వీడ్కోలు విలాపమేమీ వినిపించలేదు. ఎందుకంటే  మూడు రోజుల గంగాలమ్మ పండగ అయిపోయిన మర్నాడే భూదేవి పండగ.

గంగాలమ్మ పండగలో బలిచ్చిన మేకపోతుల మాంసం, ఇంటింటా ఇచ్చిన బియ్యం, పప్పులు, దినుసులు అన్నిటితో ఆ రోజు పెద్ద వంట నడిచింది. ఆ చింతచెట్టుకిందనే ఒక పక్కగా గాడిపొయ్యి తవ్వేరు. ఘుమఘుమలాడే వంటలు వండుకున్నారు. ఊరంతటికీ పెద్ద విందు పెట్టారు. ఆ రోజు పొలాల్లోకి వెళ్ళి విత్తనాలు చల్లేరు. ఆ రోజునుంచీ పొలం పనులు మొదలుపెట్టుకోడానికి భూదేవి అనుమతి లభించింది. వానలు సమృద్ధిగా కురవడానికి గంగాలమ్మ అనుగ్రహం దొరికింది. ఆ రోజు కూడా ఇద్దరు ముగ్గురు నడివయసు కొండరెడ్లు ధనుర్బాణాలు ధరించి అడవికి వెళ్లడం కూడా నేను చూశాను.

ఆ ఊరు అటు విశాఖపట్టణం మన్యానికీ, ఇటు గోదావరిమన్యానికీ మధ్యలో ఉన్నందువల్ల ఎన్నో  తిథులు, ఆచారాలు, పండగలు, పాటలు కలిసిపోయాయని డా.మిశ్రా అన్నాడు. ఆయన చెప్తున్నది గిరిజనుల పండగల గురించి. అవి కాక ఆ తర్వాత పొరలు పొరలుగా ఎన్ని సంస్కృతులు ఆ ఊరిమీద తమ తమ వస్త్రాలు కప్పుతూ వచ్చాయి! రామనవమి ఉత్సవాలు, దగ్గరలో సినిమాహాలు, అయిదేళ్ళకొకసారి ఆ దారంతా మోతపెట్టే ఎన్నికల ప్రచారగీతాలు- కాని ఎన్ని సార్లు నరికినా, మోడుగా వదిలిపెట్టినా, మళ్ళా ఏదో ఒక వేపు చిగిరించకుండా ఉండలేని మద్దిచెట్టులాగా ఆ కొండరెడ్ల పండగ ఆ గ్రామాన్ని వెలిగిస్తూనే ఉంది.

ఆ కాలమంతా ఎటుచూసినా తెల్లటి కెరటాల్లాగా తలూపుతూ కనిపించే పాలపూలతో అడవి నిండిపోయింది. గంగాలమ్మ పండగ దాకా అ పూలమీద ఎవరూ చెయ్యి వేసేవారు కాదు. పండగ అయిపోగానే ఏ కొప్పులో చూసినా ఆ పూలే.

గంగాలమ్మ పండగ తర్వాత వసంతం వేసవిగా మారిపోయింది. ఆ వేసవి బహుశా నాలుగు వారాలు లేదా ఆరువారాలు. కాని అటువంటి కాలం నా జీవితంలో ఇప్పటిదాకా మరొకటి చూసి ఎరగను. బహుశా ఆరురుతువుల్లోనూ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజిలాగా ఉంటాయనుకుంటే వసంతానికి శరత్తు ప్రతిబింబం. హేమంతానికి వేసవి ప్రతిబింబం. హేమంతం పరిపక్వ కాలం. దేనికి? మనిషి ప్రయత్నాలకి, పంటలకి, పండ్లతోటలకి. కాని వేసవి ప్రకృతి పరిపక్వకాలం. దేనికి? సూర్యకాంతికి, చెట్లకి, పత్రహరితానికి, నీలాకాశానికి, మహారణ్యానికి. ఆ వేసవికాలపు తెల్లవారుజాముల్లో గాలుల్లో తెల్లదనం, చల్లదనం కలిసి ఉండేవి. ఆ అరుగుల మీద ఇంత చాపనో, బొంతనో పరుచుకుని పడుకున్న మా మీద రాత్రంతా రాలిన రాధామనోహరాల పూల గాలి పోగుపడి ఉండేది. తెల్లవారినా ఇంకా దుప్పటి ముసుగుదన్ని పడుకున్న మమ్మల్ని కోకిల లేపేసేది. మామీంచి దుప్పటి లాగేసేది.

ఆ రోజుల్లో సూర్యనారాయణమూర్తి గారి చిన్న తమ్ముడు కూడా వేసవి సెలవులకు వచ్చాడు. సుధీర్ అతనిపేరు. పాతికేళ్ళ యువకుడు. ఏలూరులో బాంకులో కాషియర్ గా పనిచేస్తుండేవాడు. ఆ ఏడాది చివర్లో అతనికి పెళ్ళి నిశ్చయమైంది. ఆ వేసవి అన్నగారి కుటుంబం దగ్గర గడుపుదామని వచ్చాడు. ఉన్న ఆ రెండుగదుల్లో నేనొక గదిలో ఉంటున్నాను కాబట్టి ఆ పిల్లవాణ్ణి ఆ వేసవికి రావొద్దని రాయడమా అని మాష్టారి దంపతులు ఒకరోజు మాట్లాడుకోవడం నా చెవిన పడింది కూడా. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. కాని ఆ వచ్చినపిల్లవాడు నన్నొక చెల్లెలిగా దగ్గరకు తీసుకోడంతో, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన అన్నయ్య దొరికినట్టు అయింది.

రోజూ సర్వే నుంచి రాగానే మధ్యాహ్నం అంతా కలిసి భోంచేసేవాళ్లం. అక్కడే ఆ అరుగుల మీదనే మధ్యాహ్నం చిన్న కునుకు తీసేవాళ్ళం. ఉష్ణమండల దేశాల వేసవి నిద్ర. ఆ తర్వాత టీ కాచుకునేవాళ్ళం. త్రీ రోజెస్ డస్ట్ టీ. అప్పటికి రాజూ, రోజా, మరికొంతమంది మిత్రులూ చేరేవారు. సాయంకాలాలు అటు చాపరాయి వైపో, ఇటు ఏటివైపో నడిచే వాళ్ళం. కొంతమంది కుర్రాళ్ళు బావి దగ్గర సాయంకాలం స్నానాలు చేసేవారు. కొందరు ఏటిలో గేదెల్ని కడుక్కునేవారు. కాని ఆ నడక రోజూ నడిచేది కాదు. ఆ ఊళ్ళో పొద్దుటిపూట మాత్రమే మనుషులది. మధ్యాహ్నాలు వేసవి వానలది.  పొద్దున్నే పెళపెళా ఎండకాయగానే ఇంతలోనే మబ్బు పట్టేసేది. పెద్ద వర్షం కురిసిపోయేది. ఆ వైశాఖ మాసపు ఆ కృష్ణమేఘాలు, ఆ నల్లమబ్బులకి అడ్డంగా ఎగిరే తెల్లటి కొంగల బారులు, ఇంతలోనే హడావిడిగా ఎక్కణ్ణుంచో వచ్చి అంతే హడావిడిగా కురిసి వెళ్ళిపోయే ఆ వేసవి వానలు- ఆ రోజుల్ని తలచుకుంటే నాకు ఇప్పటికీ కవి చెప్పినట్లుగా ‘ఆనందం లాంటి విచారం కలుగుతుంటుంది.’ బహుశా ఇప్పుడు ఆ ఊళ్ళో కూడా ఆ వేసవిలాంటి వేసవి మళ్ళా రాలేదేమో అనిపిస్తుంది.

వానలు పడే మధ్యాహ్నాల్లో మేము మా ఇంటిదగ్గరో, జోసెఫ్ గారి ఇంటిదగ్గరో కేరమ్స్ ఆడుకునేవాళ్ళం. సుధీర్ తనతో పాటు చిన్నది పేనాసోనిక్ కాసెట్ ప్లేయర్ తెచ్చుకున్నాడు. అతనిదగ్గర పాతహిందీ పాటలు, తెలుగు పాటలు కేసెట్లు కూడా ఉండేవి. మేము మాట్లాడుకుంటూ ఉన్నాకూడా మా వెనక బాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఆ పాటలు నడుస్తూనే ఉండేవి. అదొక కాలం, అదొక లోకం. స్మార్ట్ టీవీలూ, స్మార్ట్ ఫోన్లూ, వాట్సప్ లూ, ఇన్స్టాగ్రాములూ లేని కాలం. అనుభవం అనే ఒక సరసులో అడుగుపెట్టకముందే సెల్ఫీ తీసుకుని నలుగురికీ చూపించుకోవాలనే తాపత్రయం లేని కాలం. అసలు ఒక అనుభవం మమ్మల్ని ముంచెత్తుతోందనే స్పృహకూడా లేకుండానే ఆ వడిలో పడి కొట్టుకుపోయిన కాలం.

ఆ నాలుగైదు వారాలు నేనటువంటి నిష్కల్మష లోకంలో గడిపాను. అప్పుడు నేనొక కన్యని. యవ్వన ప్రాదుర్భావవేళ నా దేహం చిగురిస్తున్న యువతిని. కానీ ఆ రోజుల్లో ఒక్క క్షణం కూడా నాకు ఆ స్పృహ కలగలేదు. ఒక్క నేత్రద్వయం కూడా నన్నొక దేహంగా చూసిన జ్ఞాపకం లేదు. నిజానికి మేము ఎవరెవరిమో, ఎక్కణ్ణుంచో కొన్నాళ్ళు ఒక చెరువుదగ్గర చేరుకున్న పిట్టల్లాగా గడిపేం. అప్పుడు మాదంతా ఒకటే దేహం. ఒకటే మనస్సు. అప్పుడు మాలో ఏ ఒక్కరిని పలకరించినా మరొకరి గుండె జవాబిచ్చేది.

అలాంటి రోజుల్లో నాకు బాగా గుర్తు. మరవలేని సంఘటన అది. నేను కొండవార లొద్దు చూపించమని అడిగానని, ఒక మధ్యాహ్నం రాజు నన్ను కొండరెడ్ల వీథుల్లోంచి అడవైపు తీసుకువెళ్ళాడు. అక్కడ ఊరుదాటగానే పెద్ద చింతతోపు. వేలాది చిలకలు వాలినట్టు లేతాకుపచ్చ, ఎర్రటి చింతచిగురు గుబుర్లు. ఆ చింతతోపు కూడా దాటి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాడు. అక్కడ కొండవార పొలంలో నిండుగా విరబూసిన నూరువరహాల చెట్టు. ప్లుమేరియా. ఆ అపరాహ్ణాన్ని అది తన సుగంధంతో తడిపేస్తూ ఉంది. ఆ చెట్టుకింద కొంతసేపు నిల్చున్నాం. ఎన్నేళ్ళుగా అది అక్కడ పూలుపూస్తూ ఉన్నదో. ఎవరికోసం పూస్తూ ఉన్నదో. దాని గడిచిన జీవితమంతా వంకర్లుతిరిగిన దాని కాండంలో కనిపిస్తున్నది. ఆ చెట్టు కూడా దాటి కొండకిందలోయలోకి వెళ్ళాం. ఆ లోయమీంచి కొండ ఎక్కడం మొదలుపెట్టాం. ఆ లోయలో మొదలుపెట్టి కనిపించేకొండ పొడుగునా కొండమామిడి చెట్లు. ప్రతి చెట్టు నిండా కొమ్మకొమ్మకి గంపలకొద్దీ మామిడిపళ్ళు. పుష్కలత్వం అనే మాటకి అంతకన్నా బొమ్మకట్టి చూపించగల ఉదాహరణ మరొకటి ఉండదేమో. మేము ఆ లోయలో ఉండగానే ఆకాశంలో నల్లనిమబ్బులు పేరుకోవడం మొదలుపెట్టాయి. ‘అప్పుడే పడదులే వాన’ అన్నాడు రాజు. కాని ఇంతలోనే అనూహ్యంగా గాలిదుమారం చెలరేగింది. ఆ గాలికి చెట్టుమీదనే మిగలముగ్గుతున్న పండ్లు వడగళ్లలాగా కింద రాలిపడటం మొదలయ్యింది. ఆ పండ్లు ఏరి ఒక్కొక్కటే రాజు నాకు ఇస్తూ ఉన్నాడు. ఒక్కక్క పండూ ఇచ్చింది ఇచ్చినట్టుగా నేను రసం పీలుస్తూ ఉన్నాను. ప్రతి పండూ ఒక జ్యూస్ పేకెట్. ప్రతి పండూ ఒక రసపాత్ర. చూస్తూండగానే గాలివాన మహావర్షంగా మారిపోయింది. ఆ కొండలు నేలలోకి కుంగిపోతాయేమో అన్నట్టు, ఆ అడవి ఆ ధారల్లో కొట్టుకుపోతుందేమో అన్నట్టు, ఆకాశం కరిగిపోయి భూమిలో కలిసిపోతుందేమో అన్నట్టు వాన. ఆ మహారణ్యంలో, ఆ మహావర్షంలో మేమిద్దరమే. చెట్ల మీద కొండల మీద వాన చప్పుడు అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఆ కీకారణ్యం మధ్యలో అక్కడ చిల్లుల్లోంచి పడుతున్నట్టుగా వాన ధారలూ, తడిసిన సూర్యకాంతీను. మేమట్లానే ఒక బండమీద కూర్చుండిపోయాం. అక్కడ అలా ఎంతసేపు ఉండిపోయామో తెలియదు.

వాన వెలిసి, ఇంటికి తిరిగొస్తుండగా, ఏప్రిల్లోనే కదా, రాజు ఫైనల్ యియర్ పరీక్షలు అని గుర్తొచ్చింది.

‘రాజూ’ అని అరిచాను గట్టిగా.

ఏమిటన్నట్టు ఉలిక్కిపడి చూసాడు.

‘నీ పరీక్షలు. బి ఏ ఫైనల్ యియర్!’

‘అవా! అయిపోయింటాయి ఈ పాటికి ‘

షాక్ తిన్నట్టయ్యాను.

‘పరీక్షలు రాయలేదా? ఎందుకు?’

‘పరీక్షలు మొదలయ్యేటప్పుడే మనూళ్ళో కొత్త బడి కట్టడం మొదలుపెట్టాం. తీరా నేను కాకినాడ వెళ్ళిపోతే అంతా తలోదిక్కుకీ జారుకుంటారు. మిశ్రాగారికి ఒక్కడు కూడా పలకడు. అందుకని ఇక్కడే ఉండిపోయాను’ అన్నాడు..

పసిపిల్లలు ఎక్కడుంటే దేవుడక్కడ ఉంటాడన్నది అందరూ చెప్పేమాట. అక్కడ దేవుడి ఉనికి అమాయకంగా ఉంటుంది. పాపం, పుణ్యం తెలియని ప్రాయం అది. కాని పదహారేళ్ళనుంచి పాతికేళ్ళ మధ్య వయసు యువతీ యువకులున్నచోట కూడా దేవుడుంటాడు. అక్కడ ఆయన ఉత్సాహంగా తుళ్ళిపడుతూ ఉంటాడు. ఎనర్జిటిక్ గా ఉంటాడు. లాభం నష్టం చూసుకోని వయసు అది. తన, పర అనే మాటలు తెలియని మనసులవి. అటువంటి యువతీయువకులెవరేనా మీకెప్పుడేనా తారసపడితే వాళ్ళకి బుట్టెడు గులాబీ పూలు కానుకగా ఇవ్వండి. వాళ్ళున్నచోటికి వెళ్ళాలనుకుంటే మీ చెప్పులు బయట విడిచి, కాళ్లు కడుక్కుని లోపల అడుగుపెట్టండి. మీ  మతాలూ, నమ్మకాలూ, సిద్ధాంతాలూ, రాజకీయాలు ఆ గుమ్మంబయట చెప్పుల్తో పాటే పక్కన పెట్టేయండి.

23-4-2023

8 Replies to “ఆ వెన్నెల రాత్రులు-20”

 1. అలాంటి నిష్కల్మష స్నేహపు రోజులు మా జీవితాల్లో ఒకప్పుడు ఉండేవి అని తల్చుకోగలగడమే ఓ అదృష్టమేమో ! ఏమాత్రం భయపడని రోజులవి.

 2. “పదహారేళ్ళనుంచి పాతికేళ్ళ మధ్య వయసు యువతీ యువకులున్నచోట కూడా దేవుడుంటాడు. అక్కడ ఆయన ఉత్సాహంగా తుళ్ళిపడుతూ ఉంటాడు. ఎనర్జిటిక్ గా ఉంటాడు. లాభం నష్టం చూసుకోని వయసు అది. తన, పర అనే మాటలు తెలియని మనసులవి. అటువంటి యువతీ యువకులెవరేనా మీకెప్పుడేనా తారసపడితే వాళ్ళకి బుట్టెడు గులాబీ పూలు కానుకగా ఇవ్వండి.”
  అక్షరాలా.. ఇదే నా భావనాను. పిల్లలను చూస్తే దేవుడి సమక్షంలో ఉన్నట్లు ఉంటుంది.
  కొన్నేళ్లుగా పిల్లలంతా అమెరికా కి వలస పోవడంతో క్రమంగా వారి సంఖ్య గ్రామాల్లో సైతం తగ్గిపోయింది. కొన్ని ఇళ్ళు వృద్ధాశ్రమాల్లా తయారయ్యాయి. ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేస్తూ.. ఇదొక ‘క్విట్ ఇండియా ఉద్యమం’ అనేవారు మా ఛీఫ్ మానేజర్.

 3. ‘అప్పుడు మాదంతా ఒకటే దేహం. ఒకటే మనస్సు. అప్పుడు మాలో ఏ ఒక్కరిని పలకరించినా మరొకరి గుండె జవాబిచ్చేది.
  చెట్ల మీద కొండల మీద వాన చప్పుడు అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఆ కీకారణ్యం మధ్యలో అక్కడ చిల్లుల్లోంచి పడుతున్నట్టుగా వాన ధారలూ, తడిసిన సూర్యకాంతీను.’
  ఎంత హాయి,ప్రశాంతతో కూడిన క్షణాలో కదా.
  ‘పసిపిల్లలు ఎక్కడుంటే దేవుడక్కడ ఉంటాడన్నది అందరూ చెప్పేమాట.అక్కడ దేవుడి ఉనికి అమాయకంగా ఉంటుంది. పాపం, పుణ్యం తెలియని ప్రాయం అది. కాని పదహారేళ్ళనుంచి పాతికేళ్ళ మధ్య వయసు యువతీ యువకులున్నచోట కూడా దేవుడుంటాడు. అక్కడ ఆయన ఉత్సాహంగా తుళ్ళిపడుతూ ఉంటాడు. ఎనర్జిటిక్ గా ఉంటాడు. లాభం నష్టం చూసుకోని వయసు అది. తన, పర అనే మాటలు తెలియని మనసులవి.అటువంటి యువతీయువకులెవరేనా మీకెప్పుడేనా తారసపడితే వాళ్ళకి బుట్టెడు గులాబీ పూలు కానుకగా ఇవ్వండి.వాళ్ళున్నచోటికి వెళ్ళాలనుకుంటే మీ చెప్పులు బయట విడిచి, కాళ్లు కడుక్కుని లోపల అడుగుపెట్టండి.
  మీ మతాలూ, నమ్మకాలూ, సిద్ధాంతాలూ, రాజకీయాలు ఆ గుమ్మంబయట చెప్పుల్తో పాటే పక్కన పెట్టేయండి.’
  ఇవి సమాజానికి కావలసిన మాటలు,చైతన్య స్ఫూర్తిని నింపే సూర్యకిరణాలు

 4. మీరు ఈరోజు ప్రస్తావించిన పదహారేళ్ల పాతికేళ్ల మధ్య అనుభవాలే నా అరిపిరాల ముచ్చట్లు. ఎందరి ప్రేమానురాగాలనో చూరగొన్న ఒక బంగారు కాలం. పనికి వెనుకాడని రోజులు. పరిచయాలకు పపిమళాలద్దిన రోజులు. పసి పసిడి మనసుల పరువాల రోజులు. ఊరు పట్నంగా ముస్తాబవు తున్న తీరు తెన్నులు. ఏదైనా కొత్త యంత్రం జ్ఞాపకాలని బొమ్మలుగా చిత్రీకరించగలిగేది వస్తే నా దగ్గర తాజాగా అలాగే ఉన్నాయి ఐదారు దశాబ్దాల కిందటి దృశ్యాలు.
  మొదలు పెట్టిన క్షణం లోనే ఆ ఊరి దగ్గరికి లాక్కెళ్లి
  ప్రత్యక్షంగా చూసినట్లుంది మీ రచన. అభినందనలు.

 5. చదువరిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడమే రచన ప్రయోజనం అయితే అది సంపూర్ణంగా నెరవేరినట్లే

Leave a Reply

%d bloggers like this: